భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

అరవై మూడేళ్ల వెంకా యమ్మకు హఠాత్తుగా మెలుకువ వచ్చింది
అది హఠాత్‌ ‌పరిణామం కాదని, స్మార్ట్‌ఫోన్‌ ‌తాలూకు వైబ్రేషన్‌ అని ఆలస్యంగా గుర్తించింది.. బద్దకంగా కళ్లు తెరచి, కోపంగా ఫోన్‌లో ఉన్న డిస్‌ ‌ప్లే వైపు చూసింది.
వెంకాయమ్మ ఫోన్‌ని పొదుపుగా వాడుతుంది. అలా అని ఫోన్‌ ‌పొదుపు చేయడమేంటని లాజిక్కులు లాగొద్దు.
అనవసరంగా ముఖ పుస్తకాన్ని… అదే ఫేస్‌ ‌బుక్‌ను వాడటం, వాట్సాప్‌ ‌లాంటి యాప్‌లు ఎడాపెడా వాడకుండా, చాటింగులు ఎడాపెడా చేయ కుండా, అవసరం ఉన్నంతవరకే వాడుకోవడమే పొదుపుగా భావించాలి,
అంచేత తొమ్మిది దాటిందంటే అత్యవసరం అయితే తప్ప టింగుటింగుమని ఫోన్‌ ‌చేయొద్దు అంటుంది.
తన ఒరిజినల్‌ ‌ఫొటోనే డీపీగా పెట్టుకుంటుంది.
భర్త మిలిటరీ లో పనిచేసి, దేశం కోసం యుద్ధం చేసిన జవాన్‌. ‌భర్త కాలం చేశాక కొడుకులు కోడళ్లు గట్రా విదేశాలకు రమ్మన్నా ‘‘ససేమిరా’’ అని మేరా భారత్‌ ‌మహాన్‌ అం‌టూ హైదరాబాద్‌లో ఉన్న చిన్న లంకంత ఇంట్లో ఒంటరిగా ఉంటోంది.
చుట్టుపక్కల ఎవరికి ఏ సహాయం అవసరమైనా చేసేస్తుంది.
పత్రికా పరిజ్ఞానానికి, లోకజ్ఞానం జీఎస్టీలా తోడైంది. దానికి ధైర్యం ప్లస్సయింది.
ఇక విషయానికి వస్తే.. అర్ధరాత్రి వెంకాయమ్మకు ఫోన్‌ ‌రావడం ‘‘లోక కల్యాణార్థమే’’ అనుకోవాలి.
కథలోకి వెళ్తే మ్యాటర్‌ ‌మీకే అర్థమవుతుంది.
* * *
వెంకాయమ్మకు బీపీ లేదుగాని,వేళకాని వేళ తెలియని నంబర్‌ ‌నుండి ఫోన్‌ ‌రావడంతో బీపీ సర్రుమంటూ పైకి లేచింది.
స్మార్ట్ ‌ఫోన్‌లో ఉన్న గ్రీన్‌బటన్‌ ‌మీద చూపుడు వేలును కోపంగా పైకి లాగి ‘‘హలో’’ అంది చిరాకును క్యారీ చేస్తూ…
అవతలి వైపు నుంచి ఇంగ్లీష్‌లో కీచుమని కంఠం స్టీరియో ఫోనిక్‌లా వినిపించింది.
‘‘తెలుగులో ఏడవండి.అదే స్పీకండి’’ సీరియస్‌గా అంది వెంకాయమ్మ
అవతలి వైపు నుంచి అమ్రిషిపురిలా గొంతు
‘‘మీరు వెంకాయమ్మ కదూ’’
‘‘వెంకాయమ్మ కదూ’’ కాదు వెంకాయమ్మ దమ్ము… దమ్ము ఇంటిపేరు…’’ రిటార్ట్ ఇచ్చింది వెంకాయమ్మ.
‘‘మేము ఎస్బీఐ అధికారులం…’ సాయికుమార్‌ ‌పోలీస్‌ ‌లెవల్లో కంఠం వినిపించింది’’
వెంకాయమ్మ అలర్ట్ ఆసనం వేసింది.
‘‘మీ పేరుతో కొరియర్‌ ‌వచ్చింది?’’ అవతలి వైపు నుంచి పూర్తిగా వినకుండానే..
‘‘ఓహో నువ్వు కొరియర్‌ అబ్బాయివా.. ఇంత అర్ధరాత్రి ఫోన్‌ ‌చేసావేంట్రా? గ•ట్టిగా కసిరింది వెంకాయమ్మ
‘‘చుప్‌.. ‌మేము పోలీసులం.. చెబితే అర్థం కావడం లేదా?/ క్రైమ్‌ ‌బ్రాంచ్‌ ‘‘అవతలి వైపు నుంచి అసహనం.
‘‘మరి కొరియర్‌ ‌వచ్చిందని చెబుతావేంట్రా దొంగ సచ్చినోడా…’’ వెంకాయమ్మ తక్కువ తిన లేదన్నట్టు అంది.
‘‘ఆ కొరియర్‌లో కొకైన్‌ ఉం‌ది..’’
‘‘అంటే కోకా కోలా.. తాగు మరి. అయితే నా పేరు చెప్పుకుని తాగి తగలడు .. ఎక్కువగా తాగకు.. మంచిది కాదు.. అయినా కోకాకోలా కొరియర్‌లో పంపడమేంట్రా పిచ్చి సచ్చినోడా ?’’
ఫోన్‌లోనే తలంటింది వెంకాయమ్మ.
‘‘..కొకైన్‌ అం‌టే డ్రగ్స్ ‌గంజాయి, నల్లమందు బ్రౌన్‌ ‌షుగర్‌’’ అవతలి వైపు కోపంగా చెబుతున్నాడు.
‘‘బ్రౌన్‌ ‌షుగర్‌ అం‌టే.. షుగర్‌ ‌పేషంట్స్‌కు వాడు తారా?’’ అ…మాయకంగా అడిగింది వెంకాయమ్మ.
‘‘మత్తు మందు.. అవి ఉంటే అరెస్ట్ ‌చేస్తారు., నేరం.సంఝే’’ ఇరిటేటింగ్‌గా ఉంది అవతలి గొంతు.
‘‘అవునా! తప్పు కదరా.. అలాంటి వెధవ పనులు చేయకు..అవును గానీ సంఝే అంటే ఏంట్రా?’’
అవతలి వైపు నుంచి మరో గొంతు తెలుగులో గులకరాళ్లేసినట్టు వినిపించింది.
‘‘చూడండి వెంకాయమ్మ. మేము స్పెషల్‌ ‌బ్రాంచ్‌ ‌పోలీసులం. మీ పేరుతో డ్రగ్స్ ఉన్న కొరియర్‌ ‌వచ్చింది. మీరు వెంటనే మా ఆఫీసర్‌తో మాట్లాడండి. మీ పేరు మీద డిజిటల్‌ అరెస్ట్ ‌వారెంట్‌ ఉం‌ది. ఒకసారి వీడియో కాల్‌లోకి రండి.. లేదంటే.. వెంటనే అరెస్ట్ ‌చేస్తాం. అమెరికాలో మీ పిల్లలను కూడా అరెస్ట్ ‌చేస్తాం’’ బెదిరింపు గొంతు వినిపించింది.
‘‘అయ్యో రామ, కృష్ణ, వెంకటేష్‌ ‌చిరంజీవి, పవన్‌ ‌కళ్యాణ్‌ ‌మహేష్‌ .. ఇం‌త మాత్రానికే అరెస్టా.. ఒక నిమిషం .. నిద్ర మొహంతో వీడియో కాల్‌లోకి ఏం వస్తా! కాస్త పాండ్స్ ‌పౌడర్‌ ‌వేసుకొని వస్తా అగు.. లైన్‌లోనే ఉండి చావు? అంది
అప్పటికే ఆ ఫోన్‌ ‌కట్‌ అయి.. వెంకాయమ్మకు వాట్సప్‌ ‌వీడియో కాల్‌ ‌వచ్చింది.. పోలీస్‌ ‌యూని ఫామ్‌లో ఒకతను.. వెనుక క్రైమ్‌ ‌బ్రాంచ్‌ ‌లోగో… పక్కనే ఇద్దరు పోలీస్‌ అధికారులు…
‘‘చూడండి వెంకాయమ్మ మీకు మ్యాటర్‌లోని సీరియస్‌ ‌నెస్‌ అర్థం కావడం లేదు. మీకు వచ్చిన కొరియర్‌లో ఉన్న డ్రగ్స్ ‌గురించి మీ మీద కేసు ఫైల్‌ అయింది.మిమ్మల్నే కాదు విదేశాల్లో ఉన్న మీ పిల్లలను అరెస్ట్ ‌చేస్తాం.. మీరు ఏ తప్పూ చేయలేదని నమ్మాలంటే ముందు మీరు మా ఆఫీసర్‌తో మాట్లాడండి.. వీడియో కాల్‌లోకి మరొకడు వచ్చి జాయిన్‌ అయ్యాడు…
వెంకాయమ్మ అలాగే చూస్తోంది.
‘‘మీరు మాతో మాట్లాడుతూనే ఉండాలి.ఈ విషయాన్ని ఎవరితో చర్చించకూడదు. లైన్‌ ‌కట్‌ ‌చేయకండి. మీరు ఈ కేసు నుంచి బయట పడాలంటే కొంత డబ్బు డిపాజిట్‌ ‌చేయాలి.. లేదంటే మీ ఆస్తి మొత్తం సీజ్‌ ‌చేస్తాం’’ అవతలి వైపు బెదిరింపు క్వింటాళ్లలో కనిపించి వినిపించింది.
‘‘ఆస్తి అంటే అర్థమైందర్రా ..మరి సీజ్‌ అం‌టే ఏమిట్రా? ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. ఇంట్లో అసలే ఒంటరిగా ఉంటున్న ముసలి బామ్మ వెంకాయమ్మను…’’ చాలా అమాయకంగా అంది.
‘‘సీజ్‌ అం‌టే… ఓ క్షణం ఓ ఆఫీసర్‌ ‌బుర్ర గోక్కున్నాడు.సరైన తెలుగు అర్థం స్ఫురించక..’’
‘‘ఈ కేసు మీ మీదికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఇంకో ఆఫీసర్‌ ‌చెబుతాడు.. ఆయనతో మాట్లాడండి’’ అంటూ మరొకరిని వీడియో కాల్‌కి యాడ్‌ ‌చేశారు.
‘‘చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే వెంటనే పది లక్షలు డిపాజిట్‌ ‌చేయండి. ఎంక్వయిరీ పూర్తయ్యాక మీ తప్పేమీ లేదని తేలితే మీ డబ్బు వెనక్కి పంపిస్తాం. మీ అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుంది’’ కొత్తగా వీడియో కాల్‌లో యాడ్‌ అయిన వ్యక్తి చెప్పాడు.
‘‘పది లక్షలే.. ఆ డబ్బుకు వడ్డీ నీ ‘‘అబ్బ’’ ఇస్తాడా?’’ అడిగింది వెంకాయమ్మ.
‘‘ఇదిగో ఇలాంటి బూతులు మాట్లాడితే వెంటనే అరెస్ట్ ‌చేస్తాం. మీ అరెస్ట్ ‌వారెంట్‌ ‌చూడండి’’
డిజిటల్‌ అరెస్ట్ ‌వారెంట్‌ ‌జూమ్‌ ‌చేసి చూపిం చారు.
కళ్లు చిట్లించి చూసింది.
‘‘అక్షరాలేంట్రా.. ముగ్గులేసి అలికినట్టున్నాయి.. అసలే కంటి చూపు ఆని చావడం లేదు..’’అంటూ లేచింది.
‘‘ఎక్కడికి కదలొద్దని చెప్పాంగా’’ ఓ ఆఫీసర్‌ ‌గద్దించాడు.
‘‘అరెస్ట్ ‌వారెంట్‌ ‌పూర్తిగా చదవాలిగా.. కళ్లజోడు తెచ్చుకోవద్దా’’ కసిరింది వెంకాయమ్మ.
తలలు పట్టుకున్నారు ఆఫీసర్లు.
రెండే రెండు నిమిషాల్లో కళ్ల జోడుతో తిరిగొచ్చింది.
‘‘ఇప్పుడు చూపించండర్రా ..’’ అంది.
మళ్లీ అరెస్ట్ ‌వారెంట్‌ ‌జూమ్‌ ‌చేశారు.
కళ్లజోడులో నుంచి కళ్లు చిట్లించి మరీ చూసింది.
‘‘అదేంట్రా నా పేరు వెంకాయమ్మ పక్కన దమ్ము లేదు… నేనొప్పుకోను..’’ బుంగమూతి పెట్టి అంది.
ఆమె మాట్లాడుతున్నప్పుడు క్లిక్‌మనే చిన్న సౌండ్‌ ‌వచ్చింది.
‘‘ఇదిగో మీరిలా ఆలస్యం చేస్తోన్న కొద్దీ మీకే ప్రమాదం.. పోలీసులు హెచ్చరించారు.
‘‘ఇప్పుడేం చేయాలో చెప్పి చావండి.మీరు సరిగ్గా కనపడి చావడం లేదు. దగ్గరికి వచ్చి చావండి.’’ వెంకాయమ్మ గట్టిగా గొణిగింది.
ఆ ఆఫీసర్లు ముందుకు వచ్చారు.
‘‘దివ్యంగా కనపడుతున్నార్రా… సంక్రాంతికి వచ్చిన గంగిరెద్దులను ఎత్తుకెళ్లిన మొహాలు’’ అంది వెంకాయమ్మ,
ఒక్కక్షణం వాళ్లు బిత్తరపోయారు.. తత్తర పడ్డారు.
‘‘ముందు మీ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మేము చెప్పిన అకౌంట్‌కు ట్రాన్స్ఫర్‌ ‌చేయండి. ఆలస్యమయ్యే కొద్దీ మీకు ప్రమాదం’’ గంభీరంగా చెప్పాడు వీడియో కాల్‌లో ఒక ఆఫీసర్‌
‘‘అవును నా అకౌంట్‌ ‌లో డబ్బులు లేకున్నా మీ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్‌ ‌చేయొచ్చా?’’
అమాయకంగా అడిగినట్టు అడిగింది
‘‘ ఏయ్‌ అప్పటి నుంచి చూస్తున్నాం. క్రైమ్‌ ‌బ్రాంచ్‌ ‌పోలీసులు అంటే ఆటలుగా ఉందా..ఈ కేసు సీబీఐ కి వెళ్తుంది తెలుసా?’’
‘‘సీబీఐ నే… మరి నా డబ్బుకు పూచీకత్తు ఎవరు?’’ అడిగింది వెంకాయమ్మ.
‘‘ఇలాగే ఆలస్యం చేస్తే మీ ఇంటి బయట ఉన్న పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారు’’ బెదిరించారు వీడియో కాల్‌లో..
‘‘అయ్యో కంస అల్లుళ్లు. మీ కోసం బోల్డు మంది కృష్ణమామలు వచ్చారు…అన్నట్టు ఓ సారి మీ వెనుక టీవీలు గట్రా ఉంటే చూసుకోండి’’ అంది వెంకా యమ్మ,
అప్పటికే వెంకాయమ్మ ఇంట్లోకి పోలీసులు వచ్చేసారు.
వీడియో కాల్‌లో ఉన్న వాళ్లు బిత్తరపోయారు.
‘‘హలో మై డియర్‌ ఎనిమీస్‌.. ‌కాల్‌ ‌కట్‌ ‌చేసిన లాభం లేదు..ఈ వీడియో కాల్‌లైవ్‌లో వస్తుంది. ఈ పాటికి ముంబై పోలీసులు మీ డెన్‌ను చుట్టుముట్టే ఉంటారు…సైబర్‌ ‌నేరాలను ఇన్వెస్టిగేట్‌ ‌చేస్తున్న డీసీపీ కార్తికేయ చెప్పాడు.
అప్పటికే ముంబైలో డిజిటల్‌ అరెస్ట్ ‌పేరుతో కాల్స్ ‌చేస్తున్న వాళ్లను ట్రేస్‌ ‌చేసి.. వాళ్ల స్థావరాన్ని చుట్టుముట్టారు..
వెంకాయమ్మ ఇంటి ముందు ఓబీ వ్యాన్లు.. మీడియా పోలీసులు..
డిజిటల్‌ అరెస్ట్‌ల పేరుతో సైబర్‌ ‌నేరాలు చేస్తున్న కీలకమైన ముఠాను పట్టించిన వెంకాయమ్మ నేషనల్‌ ‌వైడ్‌గా పాపులర్‌ అయ్యింది.
* * *
ఇంట్లో నుంచి వెంకాయమ్మ బయటకు రాగానే మీడియా ధృతరాష్ట్ర కౌగిలిలా పట్టేసింది.
పక్కనే పోలీసులు.. చిరునవ్వులు చిందిస్తూ సైబర్‌ ‌నేరాల పని పట్టే సిట్‌ ఆఫీసర్‌ ‌కార్తికేయ,
కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడిలా కనిపించి, అనిపిం చింది తన విశ్వరూపం చూపిస్తూ వెంకాయమ్మ
‘‘అందరికీ నమస్కారం.. నా పేరు వెంకాయమ్మ. నేనొక సాధారణ మహిళను. సీనియర్‌ ‌సిటిజెన్‌ను.. నా భర్త దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీర జవాన్‌.
‌యుద్ధం సరిహద్దుల్లోనే కాదు. దేశం లోపల కూడా చేయాలి. శత్రువులు మన పక్కనే ఉన్నారు. మనం ఉపయోగించే స్మార్ట్ ‌ఫోన్లు, అంత కన్నా స్మార్ట్ ‌టెక్నాలజీని మనం కాలక్షేపం కోసమే వాడుతున్నాం. ఒక్కసారి సైబర్‌ ‌నేరాలను అణిచివేసే పోలీసులకు సహాయంగా వాడితే.. ఆ ఆలోచనే ఈ ఆపరేషన్‌ ‌డిజిటల్‌ అరెస్ట్. ‌రోజూ సైబర్‌ ‌నేరాల గురించి ప్రభుత్వం, పోలీసులు చెబుతూనే ఉన్నారు. ఫోన్లు చేయడం, బెదిరించడం.. మనం బెదిరి పోవడం. చదువుకున్న వాళ్లు కూడా భయపడి పోతున్నారు. మోసపోతున్నారు. హత్య చేసినా వెంటనే ఉరి శిక్ష వేయరు. అలాంటిది ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎఫ్‌ఐఆర్‌ ‌లేకుండా, వీడియోలో డిజిటల్‌ అరెస్ట్ ‌వారెంట్‌ ఇచ్చి అరెస్ట్ ‌చేస్తారా? ఈ చిన్న లాజిక్‌ ‌తెలియకుండా మోసపోతూనే ఉన్నారు.
ఒక మేజర్‌ ‌భార్యగా, ఒక మహిళగా,ఒక బాధ్యత కలిగిన సిటిజెన్‌గా ఏదైనా చేయాలనుకున్నాను.సైబర్‌ ‌నేరగాళ్లు డబ్బున్న వాళ్లను, ఒంటరిగా ఉన్నవాళ్లను టార్గెట్‌ ‌చేస్తారు. ఆ రోజు కోసం ఎదురు చూశాను. ముందు జాగ్రత్తగా డీసీపీ కార్తికేయ గారికి విషయం చెప్పాను.
అనుకున్నట్టుగానే సైబర్‌ ‌నేరగాళ్లు ఫోన్‌ ‌చేశారు. వాళ్లను మాటల్లో పెడుతూనే, డీసీపీ గారికి మెసేజ్‌ ‌పెట్టాను.కావాలనే వాళ్లను మాటల్లో పెట్టాను. ఈలోగా నేరగాళ్ల ఆచూకీ ట్రేస్‌ అవ్వొచ్చు. స్మార్ట్ ‌ఫోన్‌ను ఎలా స్మార్ట్‌గా వాడాలో నేర్చుకున్నాను.చాలా ఫాస్ట్‌గా వాట్సాప్‌లో టైప్‌ ‌చేయడం తెలుసు కున్నాను..’’ వెంకాయమ్మ ఆగి మీడియా వైపు చూసింది.
‘‘మీలో ఎవరికో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి బెదిరింపు ఫోన్‌ ‌రావొచ్చు. భయపడకండి, వాళ్లను మాటల్లో పెట్టండి. అవసరమైతే..‘‘ఏం చేసుకుంటారో చేసుకోమనండి’’ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎలాంటి నేరం చేసినా, ఫోన్‌ ‌కాల్స్‌తో ఏ దర్యాప్తు, పోలీస్‌ ‌సంస్థ బెదిరించదు’’ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత మేర అవసరమైతే బూతులు తిట్టినా తప్పులేదు. సెన్సార్‌ ‌వరకు వెళ్లని బూతులే సుమా.., నవ్వుతూ అంది వెంకాయమ్మ.
‘‘అది సరే..ఈ లైవ్‌ ఎలా సాధ్యమైంది?’’ మీడియా ప్రశ్నించింది.
నవ్వి తన కళ్లజోడు సవరించుకుంటూ వాళ్లను చూస్తూ చెప్పింది వెంకాయమ్మ.
‘‘ఎందుకైనా మంచిదని కళ్లజోడులో కెమెరా పెట్టాను స్మార్ట్ ‌ఫోన్‌కు కనెక్ట్ ‌చేశాను. వాళ్ల కదలిక, మాటలు, నాతో సంభాషణ లైవ్‌లో అందరూ చూస్తున్నారన్న విషయం సైబర్‌ ‌నేరగాళ్లు గమనించే లోగా మన పోలీస్‌ అధికారులు తమ సామర్థ్యాన్ని చూపించారు. సైబర్‌ ‌నేరగాళ్ల ఆట కట్టించారు’’.
డీసీపీ కార్తికేయ మీడియా ముందుకు వచ్చి చెప్పాడు.
‘‘వెంకాయమ్మ గారికి పోలీస్‌ ‌డిపార్ట్మెంట్‌ ‌రుణపడి ఉంది. ఒక సిటిజెన్‌గా తను చూపించిన చొరవ, స్మార్ట్ ‌ఫోన్‌ను, టెక్నాలజీని మంచికి ఉపయోగిస్తూ చేసిన ఈ ఆపరేషన్‌ ‌పేరు ‘‘డిటెక్టివ్‌ ‌వెంకాయమ్మ ఏ డిజిటల్‌ అరెస్ట్’’
ఒక డిటెక్టివ్‌ను మించిన పరిశోధన, అడ్వెం చర్‌… ‌ప్రతి వ్యక్తి ఇలా రియాక్ట్ అయితే సైబర్‌ ‌నేరాలు తగ్గుతాయి. సైబర్‌ ‌నేరగాళ్ల వెన్నులో చలి పుడుతుంది.’’
చప్పట్లతో మార్మోగిపోయింది.
దేశమంతా ఈ లైవ్‌ ‌చూస్తూ చప్పట్లతో డిటెక్టివ్‌ ‌వెంకాయమ్మను అభినందించింది.
మీడియాలో ట్రేండింగ్‌లో ఉన్న ఒకే ఒక హెడ్డింగ్‌.
‘‘‌డిటెక్టివ్‌ ‌వెంకాయమ్మఏ డిజిటల్‌ అరెస్ట్’’
* * *
(సైబర్‌ ‌నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ, స్మార్ట్ ‌ఫోన్‌ను స్మార్ట్‌గా వాడుతూ, సైబర్‌ ‌నేరాలను ఎదుర్కోవడానికి అంతకన్నా స్మార్ట్‌గా టెక్నాలజీని ఉపయోగించే వారికి..ఈ కథ అంకితం)

About Author

By editor

Twitter
YOUTUBE