– హైదరాబాద్‌లో డాక్టర్ మోహన్ భాగవత్

దేశ నిర్మాణం కోసం తలపెట్టిన పంచపరివర్తన్ కార్యక్రమంలో పౌరులంతా భాగస్వాములు కావాలని, హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం, సంస్థ నిర్దేశించుకున్న మార్గంలో వ్యక్తులను నిర్మాణం చేయడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆరఎసఎస్ ప్రధాన కార్యక్రమమని, వ్యక్తి మార్పు ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచఐసీసీ)లో జరిగిన విశేష సమావేశంలో ఆరఎసఎస్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.

వచ్చే 15 సంవత్సరాలలో భారత్ ప్రపంచ దేశాలకు కరదీపిక కాగలదని, ఆరఎసఎస్‌ని అర్థం చేసుకోవాలంటే సంఘ్‌లో భాగం కావడం ద్వారానే సాధ్యమని సర్‌సంఘ్‌చాలక్ అన్నారు. వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏ సంస్థ అయినా ఉత్సవాలు చేసుకుంటుందని, కానీ స్వయంసేవకులు అలా ఆలోచించక, వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం అనే ఆరఎసఎస్ కార్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకుని పలు కార్యక్రమాల యోజన చేశారని తెలిపారు. ఆరఎసఎస్ శతాబ్ది సందర్భంగా ‘100 ఏళ్ల సంఘ్ యాత్ర-కొత్త ఆశయాలు’ (100 years of Sangha Journey – New Horizons) పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 1000 మంది వరకూ పాల్గొన్న  వివిధ రంగాల మేధావులను ఉద్దేశించి డాక్టర్ భాగవత్ ప్రసంగించారు. అంతకు ముందు హైదరాబాదులోనే ఐఏఎస్, ఐపీఎస్, సీనియర్ బ్యూరోక్రాట్స్, సినీరంగ ప్రముఖులతో సమావేశమై ఆరఎసఎస్ వందేళ్ల ప్రస్తానం, లక్ష్యం, ఆశయాలు వంటి పలు అంశాలను తెలియజేశారు.

గత పది, ఇరవై ఏళ్లలో ఆరఎసఎస్ కార్యం ఎంతో విస్తరించిందని తెలియజేస్తూ ఆరఎసఎస్‌ను అర్థం చేసుకోవడం చాలా కష్టమని, ఆరఎసఎస్ చేస్తున్న లాంటి పని సమాజంలో మరొకటి లేదని ఒకవేళ పైపైన అర్థం చేసుకుంటే తప్పుగా కూడ అర్థం కావొచ్చని అప్రమత్తం చేశారు. అందుకే, ఆరఎసఎస్‌లో భాగం కావడం ద్వారానే ఆరఎసఎస్ కార్యాన్ని అర్థం చేసుకుని అనుభవాన్ని పొందాలని అన్నారు. “సంఘ్ మొదటి సిద్ధాంతం ఉత్తమ దేశ నిర్మాణం లక్ష్యంగా వ్యక్తి నిర్మాణం చేయడం. ఇదే ముఖ్యమైన పని. దీని మీదే ధ్యాసను సంఘ్ ఉంచు తుంది. ఏ వ్యక్తినైతే నిర్మాణం చేస్తామో, ఆ వ్యక్తి అలాగే ఉండాలి కూడా. ఈ కార్యం ఎక్కువ సమయం తీసుకునేది, అలాగే కేంద్రీకృతంగా జరిగే పని. అందుకే వ్యక్తి నిర్మాణం అన్న ఒకే ఒక విషయంపై కేంద్రీకృతమై, సంఘ్ పనిచేస్తోంది. ఈ పని తప్ప, మరో పని చేయాల్సిన అవసరం సంఘ్‌కి లేదు” అని స్పష్టం చేశారు.

ఆరఎసఎస్ స్వయంసేవకులు దేశవ్యాప్తంగా  లక్షా ముప్పై వేలకు పైగా చిన్నా పెద్ద సేవా కేంద్రాలను నిర్వహిస్తున్నారని, సమాజం నుంచి కూడా సహాయాన్ని తీసుకోగా మిగిలిన కార్యం కోసం అవసరమైనవి వారే భరిస్తూ పని కూడా పూర్తి చేస్తారని ఆరఎసఎస్ కార్యశైలిపై అవగాహన కల్పించారు. “సంఘ్ సేవా సంస్థ కాదు. సంఘ్ స్వయంసేవకులు పథ సంచలన్ చేస్తారు. అచ్చు మిలటరీ తరహాలోనే క్రమశిక్షణగా చేస్తారు. కానీ సంఘ్ పారా మిలటరీ ఆర్గనైజేషన్ కాదు. నిత్య శాఖలో లాఠీ శిక్షణలాంటివి ఇస్తారు. కానీ ఇదేమీ శారీరిక్ అఖాడా కాదు. అలాగే సాంఘీక్ గీత్, వ్యక్తిగత గీత్‌తో పాటు బ్యాండ్ కూడా ఉంటుంది. కానీ సంఘ్ సంగీత సంస్థ కాదు. పైపై మాటలను చూసి, సంఘ్‌ను అర్థం చేసుకుంటే తప్పుగా అర్థమవుతుంది” అని ఆరఎసఎస్ కార్యాచరణను మోహన్ భాగవత్ పరిచయం చేశారు.

స్వయంసేవకులు చాలా పనులు చేస్తున్నారని తెలియజేస్తూ..  కళారంగం మొదలు రాజకీయ క్షేత్రం వరకూ అన్ని రంగాల్లోనూ స్వయంసేవకులు ఉన్నారని, కొందరు స్వయంసేవకులు స్వయంగా ఆ రంగాలను నడుపుతుంటే, మరికొందరు ఎప్పటి నుంచో ఉన్న రంగాల్లో భాగస్వాములై నేడు అగ్రభాగంలో ఉన్నారని ఆరఎసఎస్ సర్‌సంఘ్‌చాలక్  వెల్లడించారు. వీరిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంఘ్ నియంత్రించదని, పూర్తి స్వయంప్రతిపత్తితో వారు పనిచేస్తుంటారని వివరించారు. సంఘ్ భావజాలంతో, సంఘ్ ఇచ్చిన సంస్కారాల ఆధారంగా ఆ పనులన్నీ చేసేది స్వయంసేవకులే అయినప్పటికీ ఈ పనులన్నింటినీ చూడటం ద్వారా ఎవరూ సంఘ్‌ని అర్థం చేసుకోలేరన్నారు. స్నేహం, ప్రేమ ఆధారంగానే ఆరఎసఎస్ కార్యం నడుస్తుందని, ఇచ్ఛాపూర్వకంగా, వివేకంతో స్వయంసేవకులు సేవలందిస్తారన్నారు.

దేశాన్ని అభివృద్ధి చేయడం అనేది ప్రజల కోసం పనిచేసే కొన్నిసంస్థలు లేదా కొందరి పని మాత్రమే అని అనుకుంటారని, అయితే ఈ స్వభావాన్ని మార్చి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని ఉద్బోధించ డమే సంఘ్ పని అని ఆరఎసఎస్ దృష్టికోణాన్ని డాక్టర్ మోహన్ భాగవత్ వివరించారు. పార్టీలు, ప్రభుత్వాలు, నేతలు, మహా పురుషులు పోషించేది సహాయక పాత్ర మాత్రమేనని, సమాజమే యజమాని అని తేల్చి చెప్పారు. సమాజంలో ఏకత, గుణాత్మకత వచ్చేవరకూ దేశ భవితవ్యం మారదని, మారకుంటే మనం ప్రమాదంలో పడినట్లేనని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యక్తి నుంచి వ్యవస్థ వరకూ దేశ సమగ్ర ఉన్నతి లక్ష్యంగా ఆరఎసఎస్ ఆశిస్తున్న పంచ పరివర్తన్ గురించి వివరించారు. ఇందులో భాగాలైన 1.కుటుంబ ప్రబోధన్ 2.పర్యావరణ పరిరక్షణ 3.సామాజిక సమరసత 4.స్వదేశీ 5. పౌరవిధుల గురించి పరిచయం చేశారు.

నేడు హిందూ సమాజంలో తాము హిందువుల మని గర్వించేవారు, హిందువులమని వ్యక్తిగతంగా మాత్రమే అంగీకరించేవారు, హిందువుగా జీవిస్తున్న ప్పటికీ బయటకు వ్యక్తం చేయనివారు, అసలు హిందువులమన్న మూలాలనే మరచిన వారు… ఇలా భిన్న వర్గాలున్నాయని డాక్టర్ మోహన్ భాగవత్  తెలియజేశారు. అందరమూ ఒకే సంస్కృతికి చెందిన వారం కాగా, అందరిలోనూ ఉమ్మడిగా ఈ చైతన్యం మేల్కొనేలా చేయడం నేడు సమాజం ముందున్న బాధ్యత అన్నారు.

ఆరఎసఎస్ కార్యం గురించి వివరించిన ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మోహన్ భాగవత్ సభికుల ప్రశ్నలకు బదులిచ్చారు. ఆరఎసఎస్ గురించి, ఆరఎసఎస్ ప్రేరిత సంస్థలు, సంఘ్‌లో మహిళల పాత్ర, హిందుత్వం, మతం, ధర్మం, సంస్కృతి, అంతర్గత సమస్యలు, కులవ్యవస్థ, సామాజిక సమరసత, యువతరం పాత్ర, స్వదేశీ, విద్య, కుటుంబం, దేశ భద్రత, జనాభా మార్పులు, భారత్‌తో ముడిపడిన అంతర్జాతీయ అంశాలు, దేశ నిర్మాణం, సమాజ సంబంధంగా పలువురు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ మోహన్ భాగవత్ జవాబులిచ్చారు.

సంఘ్ కార్యంలో భాగస్వాములు కావడమెలా అన్న ప్రశ్నకు బదులిస్తూ సమీపంలోని ఆరఎసఎస్ శాఖ లేదా ఆరఎసఎస్ ప్రేరిత సంస్థల ద్వారా నేరుగా ఆ పని చేయవచ్చని, అయితే సంఘ్ చేసే పనిని వ్యక్తిగతంగా చేస్తున్నవారు కూడా అంతే గౌరవనీయు లంటూ తనను సంఘ్ ప్రేరితునిగా పేర్కొన్న భూదానోద్యమ మూలపురుషులు వినోభా భావేని డాక్టర్ మోహన్ భాగవత్ ప్రస్తావించారు.

భారత్ – అంతర్జాతీయ సంబంధాల గురించి అడిగిన ఒక ప్రశ్నకు డాక్టర్ మోహన్ భాగవత్ స్పందిస్తూ ఏ దేశమైనా తమ జాతీయ ప్రయోజనాల మేరకే అంతర్జాతీయ వ్యవహారాలను నిర్వహిస్తుంటుం దని, భారత్ కూడా ఈ విషయంలో రాజీలేని ధోరణినే అవలంబించాలని అన్నారు. అంతర్జాతీయ పరిణా మాలతో వ్యవహరించాలంటే ఏ దేశమైనా ఆర్ధికంగా, సామాజికంగా శక్తిమంతమై ఉండాలన్నారు. ప్రపం చంలో ఎంత అలజడి ఉన్నప్పటికీ మన దేశంలో సామాజిక బాధ్యతతో కూడిన బలమైన కుటుంబ వ్యవస్థ కారణంగా వాటి ప్రభావం మనపై అత్యల్పమన్నారు.

అంతర్గత భద్రతకు సవాల్ విసురుతూ భారత్‌లోకి జరుగుతున్న బాంగ్లాదేశీయులు, రోహింగ్యా చొరబాట్ల గురించి అడిగిన ప్రశ్నకు  సమాధానమిస్తూ అక్రమంగా వచ్చినవారిని గుర్తించడం, నిర్బంధించడం, తిప్పిపంపడం ప్రభుత్వ విధులే అయినప్పటికీ, పౌరులు సైతం బాధ్యతతో వ్యవహరించాలని, ఇలాంటివాటిని అధికారులు, భద్రతా వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆరఎసఎస్ గురించి బయట జరిగే ప్రచారాన్ని నమ్మడం సరికాదని ఆయన పదే పదే కోరారు.

దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు సమాజ పరివర్తన జరగాలని, ఇందుకు అందరి సహాయ సహకారాలు కావాలని హైదరాబాద్ కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ మోహన్ భాగవత్‌ను కలుసుకున్న వివిధ రంగాల ప్రముఖులు, మేధావులను ఆయన కోరారు. సమాజాన్ని ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్న ప్రముఖులు, ఆదర్శ వ్యక్తులు స్వయంఉదాహరణగా నిలిచి తద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఇటువంటివారిని చూసి సమాజం మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హెచఐసీసీలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర బ్యూరోక్రాట్ల కోసం జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి 150 మంది హాజరయ్యారు. దాదాపు 90 నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరిగింది.  ప్రముఖ నటుడు వెంకటేశ్ ఇంటిలో దాదాపు 140 మంది సినీరంగ ప్రముఖుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్రప్రసాద్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

ముందే ఆహ్వానించిన కొన్ని ప్రశ్నలకు డాక్టర్ భాగవత్ సభా ముఖంగా సమాధానాలు ఇచ్చారు.

* హిందూదేశం అన్న భావన పురాతనమైనదని ఆయన చెప్పారు. ఎన్ని ప్రభుత్వాలు, ఎందరు రాజులు మారినా, బ్రిటిష్ పాలన వచ్చినా హిందూ సమాజం ధర్మానికి సంబంధించి మౌలిక విలువలను ఏనాడూ విడనాడలేదు. హిందూ అన్న భావన ఆవిర్భవించిన క్రమాన్ని డాక్టర్ భాగవత్ వివరిం చారు. హిందూదేశం భావన ఇక్కడి నేలలోనే ఉందని చెప్పారు. గురునానక్ దేవ్ హిందూధర్మం గురించి చిన్న పదాలతో ఇచ్చిన అర్థాన్ని అంతా స్మరించుకో వాలని ఆయన కోరారు.

* పాడుబడిన దేవాలయాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, వాటి బాధ్యతను విశ్వహిందూ పరిషత్, సాధుసంతులు స్వీకరించాలని అన్నారు. ఆలయం అంటే దేవుడు, పూజలకు కేంద్రం మాత్రమే కాదని, అది విద్యార్జన కేంద్రమని, ఆర్థిక వద్ధికి, సంస్కారాన్ని ఇచ్చేందుకు పాటు పడిందని చెప్పారు. దేవాలయాల మీద ప్రభుత్వ అజమాయిషీ గురించి ప్రస్తావిస్తూ, వాటిని విముక్తం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మూడేళ్లలో కొన్ని మార్పులు వస్తాయని ఆయన తెలియచేశారు.

* రిజర్వేషన్ సౌకర్యం గురించి మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం వచ్చే వరకు, ఉపేక్షకు గురైన వర్గాలు ఉన్నంత వరకు అవి కొనసాగాలని అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటయిన దళిత చాంబర్ ఆఫ్ కామర్స్ గురించి తెలియచేస్తే, తాము లబ్ధి పొందిన తరువాత ఇతరు లకు మేలు చేయాలని పని చేస్తున్నారని అన్నారు.

* సంఘ్‌లో మహిళలకు స్థానం అనే అంశం మీద వివరణ ఇస్తూ రాష్ట్ర సేవికా సమితి సేవలను, మహిళలు ఎదగడానికి ఆ సంస్థ చేస్తున్న సహాయం గురించి తెలియచేశారు.

* జనాభా సమీకరణలలో వస్తున్న మార్పుల గురించి డాక్టర్ భాగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. మతాంతరీకరణలు ఆపాలంటే హిందువులలో చైతన్యం పెరగాలని జవాబు ఇచ్చారు. ఘర్‌వాపసి విస్తరించాలని, ప్రభుత్వం చొరబాటు దారుల విషయంలో అనుసరిస్తున్న డిటెక్ట్, డెలీట్, డిపోర్ట్ విధానాన్ని ఆయన సమర్ధించారు.

* సెల్‌ఫోన్ వాడకం విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సర్‌సంఘ్‌చాలక్ సూచించారు. పిల్లలు దీనికి బానిసలైపోతున్నారని బాధపడే పెద్దలు మొదట తాము ఆ అలవాటును ఎంత అదుపులో ఉంచుకు న్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE