‘‌మెల్లగా సాగు ఎత్తైన వరిగడ్డి బండిపై పండుకొని గొంతులిచ్చెడి యువకుడు, చెరువు నీటనీదు బఱ్ఱెపై సవారు చేయు గోపబాలుడు, గుడ్డ యూయల కట్టి బిడ్డ నూపు తల్లి, కపిలపై నధిష్టించి వాలు వెంబడి దిగు తోటమాలి, ఏకాకిగా నేతాము దొక్కు రైతు, అల్ల గల పాటలు తొలిసారికే పరిణతములుగా రాజాలవు. ఎన్నిమారులో తిరిగి తిరిగి రూపు దిద్దుకున్న పాట మాత్రమే సహజముగా జానపదులలో ప్రవేశింపగలదు.’ ‘యానాదీస్‌’ అన్న తన గ్రంథంలో వెన్నెలకంటి రాఘవయ్య రాసిన మాటలివి. తెలుగు వారైన యానాదుల గురించీ, వారి వాఙ్మయ సారస్వతాలను గురించీ ఆయన చేసిన అందమైన వ్యాఖ్యానిమిది (పేజీ 418-420). పతంగి భైరయ్య అనే యానాది పాడిన చెంచులక్ష్మి నాటకంలోని చెంచిత-నరసింహస్వామి సంవాదం కూడా అందులో పొందుపరిచారు.

ఆదిమ మానవుడు ప్రకృతిలోని లయాన్వితమైన శబ్దానికి అనుకరణగా తన గొంతు విప్పి రాగ మాలపించినప్పుడు.. ఆ రాగంలో ఇమిడే పదాలను పొదగ నేర్చినప్పుడు.. ఆనందం పొందినా, ఆవేదన చెందినా ఆ ఆదేశాన్ని తనకు తెలిసిన భాషలో భావయుక్తంగా పాడ నేర్చినప్పుడు జానపద కవిత ఆవిర్భవించింది. ప్రతీ జాతి కవితా సంపదకు జానపద కవిత మూలకందం. అందుకే ‘జానపద గీతిక జాతి జీవనాళిక’ అన్నారు పెద్దలు. మహనీయ చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి పండితులు కూడా చేతులెత్తి నమస్కరించిన ఆ వాఙ్మయం శిష్ట వాఙ్మయ భిన్నమని కూడా చెప్ప వచ్చును.
అపారమైన కవితా సంపద కలిగిన తెలుగుజాతికి అతి ప్రాచీనమూ అజ్ఞాత కర్తృత్వమూ ఐన జానపద కవితా ఖనులు అనేకం. విద్వాంసులైన కొందరు ఈ గనులను తొలిచి బంగారు కణికల వంటి జానపద గేయాలను సాహితీ లోకానికి అందించారు. పండిత పామర జనరంజకమైన జానపదుల పాటలను ఏర్చి అక్షరాకృతిలో కూర్చిపెట్టారు. జానపద సాహిత్యం గురించి కృషి చేసిన పండితులు చైల్డ్, ‌హెండర్‌సన్‌, ‌సీగర్‌, ‌లామ్సన్‌, ‌గమ్మేర్‌, ‌మిల్లర్‌, ‌గ్రిమ్‌ ‌వంటివారు, మన దేశం కృషి చేసిన టెంపుల్‌, ‌గోవర్‌, ఎల్విన్‌కూల్డ్రే, బోయల్‌, ‌హెమెండార్ప్, ‌మున్నగు పాశ్చాత్యులు, దేవేంద్ర సత్యార్థి వంటి భారతీయులు ఫోక్‌లోర్‌, ‌పోక్‌సాంగ్‌ ‌శబ్దాలనే వాడారు.
జీవితం, ప్రధానంగా గ్రామీణ జీవితం జానపద గేయాల పంక్తులలో నదీమతల్లిలా సాగిపోతూ ఉంటుంది. అదికూడా సంప్రదాయాలను, సంస్కృతిని ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఈ పాట చూడండి!
బాలికలు పువ్వులు ఏరడం, మాలలు గుచ్చడం, వంటి దైవభక్తి పరాయణత ఈ గేయంలో ద్యోతకమవుతాయి.
‘‘ప్రొద్దున్నె ప్రొద్దున్నె లేద్దామా!
అందుగల పువ్వులు కోద్దామా!
కోసినవి రాశులుగా పోద్దామా!
సాలింటి కాడ సన్నదారము తెద్దామా!
దాసరింటి కాడ సన్నసూది కొందామా!
అన్నిటిని దండలుగ గుచ్చుదామా!
దేవుడి గుళ్లోకి పోదామా!
కిరకిర తలుపులు తీద్దామా!
దేవుడు మెడలో వేద్దామా!’’
కవిత్వం రెండు ప్రధాన స్రవంతులుగా విడదీయ వచ్చును. మొదటిది చేతనాకృతము. రెండవది అందుకు భిన్నమైనది. మొదటిది భావకుడైన కళాకారుని ప్రయత్నంతో తీర్చదిద్దినది. రెండవది పామరుడైన జానపదుని సృష్టి. అప్రయత్నంగా గొంతు నుండి ఉరికి తనకు తానే రూపుదిద్దుకొనేది. ఒక్కమాటలో – జానపదులు పాడుకొనేవి జానపద గేయాలు. జానపదులంటే పల్లెపట్టున ప్రశాంత జీవనం సాగించేవారు. ఈ పల్లెటూరి పాటలలో ఏముందని పెదవి విరిస్తే మన బాల్యం మనం మరచినట్లే. ఈ గేయాల మాధుర్యం అనుభవించి తీరాలి. అది ఎలాంటిదంటేనట- చెట్టు మీదనే మాగబండిన సీతాఫలము రుచినీ, గ్రీష్మతాపంతో ఎండి బీటలు వారిన పుడమితల్లి తొలకరి నాడు జలదరించునప్పటి సువాసననూ, కొండ కోనలందుపుట్టి ఎత్తులెక్కి పల్లాల వెంట పారి పల్లెటూళ్ల ప్రక్క ప్రక్కగా గలగల పరుగులెత్తే సెయేటి నాదం, నడి యెడారిలో వలవలమని విరిసెడి పండు వెన్నెల సలువ- ఇన్నిటిని ఒకచోట కుప్పపోస్తే జానపద గేయమవు తుందంటారు. ఒక్కొక్క జానపద గేయం ఒక్కొక్క రసగుళిక. ఈ రసాస్వాదనకు సహృదయముతో పాటు సానుభూతి కూడా మిక్కిలి అవసరం.
ఇప్పుడొక గేయం చూద్దాం! ఇది దశావతారాలు క్రమాన్ని వర్ణించింది.
మరు జనమక మమ్మేలు మత్స్యావతార
గురుతుగా కృపజూడు కూర్మావతార
వరదుడవు కావయ్య వరాహావతార
సిరులు కరుణించు నరసింహావతార
వక్షమున సిరిగల్గు వామనావతార
రక్షించు మము పరశురామావతార
రాక్షసాంతక రఘరామావతార
పక్షి వాహన బలభద్రావతార
బ్రోవ నేర్చిన యట్టి బుద్ధావతారా
కావవే మము వేడ్క కలికావతారా
భాషావతి స్తోత్ర భానుప్రకాశా
శేషాచలాధీశ శ్రీవేంకటేశా!
ఏ తల్లీ తన కుమారుని కంట నీరును సహించ లేదు. ‘ఏడవకు ఏడవకు వెఱ్ఱి అబ్బాయి- ఏడిస్తే నీ కండ్లు నీలాలు గారు’ అని హృదయ తాపాన్ని వెలార్చు తుందామె. ‘తన పాపకు అంగరక్ష. ఆది రక్ష, దివ్య రక్ష, దీపరక్ష. చిన్ని నా అబ్బాయికి శ్రీరామరక్ష’ అని వేడుకొంటుంది. ఇతర బాలురకన్న తన కుమారుడే గొప్పవాడని, మంచివాడని తల్లి గాఢ నమ్మకం.
బాలికల ఆటలలో వినపడే జానపద గేయాల పాదులు ఎన్నో! ‘చెమ్మ చెక్క’ అంత ప్రసిద్ధిగన్నది, ‘ఒప్పుల కుప్పా, ఒయ్యారి భామా’, ‘కాళ్లా గజ్జ కంకాలమ్మ’, ‘చేతి వెన్నముద్ద’, ‘తారంగం, తారంగం’, ‘చందమామ రావే’, ‘తప్పట్లోయ్‌, ‌తాళాలోయ్‌’.. ‌చెప్పుకుంటూపోతే ఎన్నో.
పంక్తులలో కొంచెం పల్లెల వాసన కొట్టినంత మాత్రం అది జానపద గేయం అనిపించుకోదు. ఆ సాహిత్యానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. 1. అజ్ఞాత కర్తృత్వము 2. స్థిరరూప రాహిత్యము 3. రచనా కాలం తెలియదు 4. మౌఖిక ప్రచారం 5. ఆకృతక శైలి 6.గేయత్వం 7. ఆశురచన 8. పునరావృత్తి (పల్లవి వంటిది) 9. జనసామాన్య పరిచిత వస్తువు. ప్రతీ జానపద గేయానికీ ఈ లక్షణాలన్నీ ఉండాల్సిన అవసరం లేదు. కానీ సార్వజనీనతలుంటే చాలు.
శిష్ట,, జానపద సాహిత్యాల లక్షణాలు వేరైనా, ప్రయోజనం ఒక్కటే. శిష్టుల రచనలు చదువరులైన కొద్దిమందికి మాత్రం పరిమితం. జానపద సాహిత్యం నూటికి తొంబదియైదు మందిని కదిలిస్తుంది. ఉపకరిస్తుంది. జానపద గేయాల విశిష్టత- వీటికి మన నిత్య జీవితాన్ని అల్లుకునే శక్తి ఎక్కువ. వెక్కిరించే పాటలు, ఆరోగ్యం గురించి హెచ్చరించేవి, పండుగ లను వర్ణించేవి, అలంకరణ ఇంకా ఎన్నో.. కాదేదీ వీటి ఇతివృత్తానికి అనర్హం.
తిండిపోతుల గురించి ఓ పాట ఉంది. అదే- తంజావూరు సత్రము బాపతు. కోస్తాలో సుమారుగా ఇలాంటి పాటే ఉంది, ‘నీళ్లు తోడర శివ – ఒళ్లు వంగదు అవ్వ’. కన్నడంలోనూ వినిపిస్తుంది, ‘నీరు తారో మల్ల బావి గెబిద్దే నల్ల… ఊటకే బారో మల్లి- తయారిద్దే నల్లి’ అనే పాట అది. ‘నీళ్లుకు బోర తిమ్మ / నిద్దరొస్తాదమ్మ/ కట్టెలు తేరా తిమ్మ / కడుపు నస్తాదమ్మ / నట్టుకు (గడ్డి పీకడానికి) బోర తిమ్మా / నడుము నస్తాదమ్మ / పిన్నె (గిన్నె) తీసుకోరా తిమ్మ /ఇంతే చాలు మాయమ్మ / చేనికి బోర తిమ్మ /చినుకులాస్తాయమ్మ / ఇంట్లో పండుకోర తిమ్మ / ఇంతే చాలు మాయమ్మ.’ ఎంత హాస్యం, ఎంత వెక్కిరింత!
ఆడదానికి అయిదొవతనం ముఖ్యం. దానికి గుర్తే పసుపు కుంకుమలు, వాటి గొప్పదనం తెలిపే పాట-
‘నీలమ్మ నీ మగడు నిన్నేలడమ్మ / ఏలకుంటే మానె ఎదురుంటె చాలు / సాకకుంటె మానె సల్లగుంటె చాలు / కంసాలి వారి మట్టెలు కాలి నుంటె చాలు/ సెట్టి గారి గాజులు సేత నున్న చాలు/ పరమేశుడిచ్చిన పసుపు కుంకుమలు నొష్ట కుంకుమలంటె యిష్టాలు దీరు / పసుపు ఒంటీ నుంటె భయమేమి నాకు!’
జానపద గేయాల మీద చరిత్ర ముద్ర కూడా స్పష్టం. శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన ఒక గేయం ఉంది. అందులో రెండు చరణాలు మాత్రమే మనకు పరిచయం. వీటిని ప్రతాపరెడ్డి వెలుగులోకి తెచ్చారు.
‘‘కొండవీడు మనదేరా కొండపల్లి మనదేరా
కాదని వాదుకు (ఎవడైనా) వస్తే కటకం దాక మనదేరా!’’
పూర్వం రాజులు జైత్రయాత్రకు బయలుదేరే టప్పుడు ‘ఉపశ్రుతి’ శకునం చూసుకొనేవారు. దేవరాయలు కటకంపై దండెత్తడానికి పూర్వం తిమ్మరుసు ఒక• చాకివాని ఇంటి పైనించి పొంచి చూస్తున్నాడట. ఆ ఇంట ఆ రజకుడు తన కొడుకును వారించేందుకు ఈ వీర గీతం ఆలపించాడట. అది శుభశకునంగా భావించి తిమ్మరుసు రాయలకు చెప్పాడట. ఆపై జైత్రయాత్రకు సేన బయలుదేరిందని కథ. ఇది రాయలసీమలో పుట్టిన గేయం.
18వ శతాబ్ది ప్రారంభంలో అటు ఓరుగల్లు నుండి ఇటు గోల్కొండ వరకున్న భాగమంతా వినిపించిన ఒక పాలెగాని చారిత్రక గాథ ‘సర్వాయి పాపని కథ’. ఆంధ్ర జానపద గేయాలను సేకరించ డానికి పూనుకున్న జె.ఎ. బోయలే సేకరించిన ప్రథమ గేయమిదే.
వస్తాడె తాను సర్వాయి పాపడు / తల్లి కొలువుకు వడిగా వెళ్లేను / తల్లికి దండముగా నిలిచేను / యేరకట్టి వ్యవసాయము అమ్మ / ఎంగిలి ముంత ఎత్తలేను / కొట్టుదును గోల్కొండ పట్టణము / డిల్లీకి మోజురు నేదును / మూడు గడియల బందరు కొట్టుదును / మూల కోట కందనూరు సూచి / బంగారు కడియాలు పెట్టుదును / మనకంతా బంట్రోతు తన మేలు మన కులకాయి మానవద్దురా సర్వాయి పాప… ఇలా నడుస్తుంది.
భాగవత సంబంధ గాథలలో శ్రీకృష్ణుని పేరుతో శృంగార సాహిత్యం వృద్ధి చెందింది. దాని చుట్టూ సున్నిత హాస్యం ఉంది. రుక్మిణీ దేవి సీమంతం అనే పాటలో, శ్రీకృష్ణుడు సత్యభామతో తాను అక్రూరుని ఇంటికి భోజనానికి వెళుతున్నానని బొంకి రుక్మిణి ఇంటికి వెళ్లాడు. ఇది తెలిసిన సత్యభామ కృష్ణుని ఎగతాళి చేస్తుంది.
‘‘ఈశ్వర భృంగి సంవాదము’’ పాటలలో శివుని తలపైనున్న పడతిని జూచి పార్వతి ఆరా తీస్తుంది. అంత శివుడు, ‘నిండు వేసవి కాలమున జల ముండునో లేకుండునోయని దండిగా నది దెచ్చి జడలో దాచియుంచినాను గాని ఎరుగనే పార్వతి యెరుగనె’’ అని అంటాడు.
మృదువైన, సభ్యమైన హాస్యమే స్త్రీల పాటలలో ఉంటుంది. ఇట్టి హాస్యం జానపదుల నిత్య జీవితాన్ని సుఖమయం చేయడానికి దోహదపడుతుంది. జీవితంలోని స్తబ్దతను పోగొట్టి ఉల్లాసం చేకూర్చ గలుగుతుంది. ఈ జానపద సాహిత్యంపై ఎంతో పరిశోధన జరిగింది. ఇంకా జరగాలి.
మూలం:
బిరుదురాజు రామరాజు : (1) త్రివేణి పేజి.3,31 సంపాదకీయం, (2) తెలుగుజానపద గేయ సాహిత్యం / బిరుదురాజు రామరాజు

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE