రాజకీయ, ఆర్థిక, సామాజిక, పరిపాలనా శాస్త్రానికి సంబంధించి సిద్ధాంతాలు జనించడం ఇప్పటిది కాదు. కౌటిల్యుడు, అరిస్టాటిల్, ప్లేటో, మెకెయవెల్లి, మార్క్స్, హెగెల్, సెయింట్ సైమన్, రాబర్ట్ ఓవెన్, రూసో, ఓల్టేర్, మాంటెస్క్యూ, జీపాల్ సార్త్ వంటి వారంతా రాజకీయ సిద్ధాంతాలు, పరిపాలనా వ్యవస్థల గురించి సూత్రీకరణలు ప్రతిపాదించారు. ఇందులో మార్క్సిజం ప్రపంచాన్ని కబళించింది. కానీ వాటిలో చాలా వరకు ఒక వ్యవస్థ జాడ్యాన్ని నిర్మూలించడానికే పరిమితమయ్యాయి. ఒక ఉద్యమానికో, విప్లవానికో పరిమితమయ్యాయి. తరువాత అంతర్ధానమైనాయి. ఇవన్నీ కూడా ఏదో ఒక వర్గం వైపు మొగ్గి ఉన్నట్టే కనిపిస్తాయి. కానీ పారిశ్రామికీకరణ ముద్దుబిడ్డ పెట్టుబడిదారీ విధానం ఒక రాజ్యవ్యవస్థగా బలపడి వీటన్నిటినీ పక్కకు తోసేయగలిగింది. దానిని సవాలు చేసినది మార్క్సిజం. కానీ ఇవాళ ఆ రెండు సిద్ధాంతాల పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం. ఆ రెండు సిద్ధాంతాలలోను సామ్రాజ్యవాదం నిజం. ఆ రెండు వాదాలు ప్రపంచాన్ని ఒక సందిగ్ధ సంధ్యలో నిలబెట్టిన కాలంలో వచ్చినదే ఏకాత్మ మానవ దర్శనం. కానీ దాదాపు నాలుగున్నర దశాబ్దాలు మరుగున ఉన్న ఆ సిద్ధాంతం రాజ్యంలో మనిషిని మనిషిగా చూడమని చెప్పింది. మనిషిని యాంత్రికం చేయవద్దని, వారి ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించాలని చాటింది. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు దాదాపు 18 ఏళ్లుగా ఆచరిస్తున్నాయి. ప్రధానులు ఇద్దరే కావచ్చు. భారత్ రూపురేఖలను వారు మార్చగలిగారు. ఏకాత్మ మానవ దర్శనం ఆచరణ ద్వారా సాధించిన ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆ ఫలితాలను సమీక్షించడానికి ఏకాత్మ మానవ దర్శనం పుట్టి 60 ఏళ్లు గడచిన సందర్భంగా విజయవాడలో ఏర్పాటయిన రెండు రోజుల సమావేశాలు విశేష సమయం కేటాయించాయి.
ఏకాత్మ మానవ దర్శనం రావడానికి ముందు, తరువాత దేశం పరిస్థితి ఏమిటి? అన్న అంశాల మీద మొత్తం ఆరు సదస్సులు జరిగాయి. వందల ఏళ్ల విదేశీ పాలనలోను, నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ ఏలుబడిలోను వలసవాద బుద్ధికే పరిమితమైన భారత్ ఏకాత్మ మానవ దర్శనాన్ని ఆశ్రయించిన బీజేపీ హయాంలలో జూలు విదిల్చింది. ఆ ప్రభుత్వాలు చెప్పినవి శుష్కవాదాలు కాదని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. అధికార వికేంద్రీకరణ ద్వారా సాధ్యమైన అద్భుతాలను వక్తలు వెల్లడించారు.

మొదటి సదస్సు
ఏకాత్మ మానవ దర్శనం – నేటి ఆవశ్యకత అన్న అంశం మీద బీజేపీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ప్రసంగించారు. ఏకాత్మ మానవ దర్శనం దృక్కోణం నుంచి భారత రక్షణ వ్యవస్థలు అన్న అంశం మీద అంతరిక్ష పరిశోధక శాస్త్రవేత్త, డీఆర్‌డీవో విశ్రాంత అధికారి డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
దీనదయాళ్ ప్రతిపాదించిన ఏకాత్మ మానవ దర్శనం కేవలం ఒక పుస్తకం లేదా పత్రం కాదని, భారతీయ సమాజం యుగయుగాలుగా అనుసరిస్తున్న జీవన విధానమని, సనాతన సత్యాన్ని యుగానుకూలంగా ప్రదర్శించడమేనని, భగవద్గీతకు వివిధ భాష్యాల మాదిరి, దానిని దీనదయాళ్ ప్రస్తుత కాలానికి అనుగుణంగా అందించారని బీఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతి నిరంతర మైనదని, ఆలోచన వేల సంవత్సరాలు ఆచరణలో ఉంటేనే నిలబడుతుందని అన్నారు. ఏకాత్మ మానవ దర్శనం సిద్ధాంతాన్ని బీజేపీ స్వీకరించిందని, ప్రధాని, 18 మంది ముఖ్యమంత్రులు దీనికి కట్టుబడి ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. 1992లో బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రచురించిన ‘హిస్టో-మ్యాప’ ప్రకారం ప్రపంచంలో అంతరించిపోకుండా కొనసాగుతున్న రెండే రెండు నాగరికతలలో ఒకటి చైనా కాగా, రెండవది భారతీయ హిందూ సంస్కృతి అని గుర్తుచేశారు. మనది ‘సనాతన’ సంస్కృతి అని, దీనికి ఆద్యంతాలు లేవని తెలిపారు. ప్రధాని మోదీ చెప్పినట్లు ‘బానిస మనస్తత్వం’ నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు. పాశ్చాత్య విజ్ఞానశాస్త్రాన్ని స్వీకరించవచ్చు కానీ, పాశ్చాత్య జీవనశైలిని గుడ్డిగా అనుసరించకూడదని సంతోష్ హితవు పలికారు. జనవరి 1న నూతన సంవత్సరం జరుపుకోవడం వంటి ఆచారాలు మన ప్రకృతికి, సంస్కృతికి సంబంధం లేనివని, మన పండుగలు (సంక్రాంతి, దీపావళి) ప్రకృతితో ముడిపడి ఉంటాయని వివరించారు. భారతదేశం రాజులు, రాజ్యాలు లేనప్పుడు కూడా ‘ధర్మం’ ఆధారంగా నడిచిందని తెలిపారు. గుజరాత్‌లోని ఒక గ్రామంలో గత 137 ఏళ్లుగా ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదని, అక్కడ ధర్మమే రక్షణగా నిలిచిందని ఉదహరించారు. ‘ఏకాత్మ మానవ దర్శనం ఇప్పటికీ సందర్భోచితం. భారతదేశ అతిపెద్ద పార్టీ దీన్ని సిద్ధాంతంగా స్వీకరించింది. ప్రపంచ సుస్థిరతకు సనాతన ధర్మం అవసరం. వ్యక్తి, సమష్టి (సమాజం), సృష్టి (ప్రకృతి), పరమేష్టి (పరమాత్మ) అనే నాలుగు అంశాల అనుసంధానమే ఏకాత్మ మానవ దర్శన సారం’ అని వివరించారు. ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు సరిపడా ఉన్నాయి కానీ, దురాశకు సరిపోవని మహాత్మా గాంధీ మాటలను గుర్తు చేశారు. పాశ్చాత్య దేశాలు ఆధిపత్యం కోసం చూస్తుంటే, భారతీయ సంస్కృతి అధికారాన్ని బాధ్యతతో కూడినదిగా చూస్తుందని తెలిపారు. మన ప్రార్థనలు కేవలం మనుషులకే కాకుండా, రెండు కాళ్ల జీవులకు, నాలుగు కాళ్ల జంతువులకు కూడా మేలు జరగాలని కోరుకుంటాయని, ఇదే నిజమైన భారతీయ జీవన విధానమని అన్నారు. 1964లో మొదటిసారి ఈ సిద్ధాంతం గురించి ఒక శిక్షావర్గలో దీనదయాళ్ చర్చించారని సంతోష్ చెప్పారు. ఇంకా 1965లో బొంబాయిలోని ఒక కళాశాలలో ఆ సిద్ధాంతం గురించి చర్చ జరిగిందని, ప్రశ్నలూ జవాబులూ కార్యక్రమం కూడా నిర్వహించారని గుర్తు చేశారు. తరువాత విజయవాడలో జరిగిన జనసంఘ్ 12వ వార్షిక సభలలో ప్రతిపాదించారని చెప్పారు. ఈ సిద్ధాంతం వేయేళ్ల తరువాత కూడా సమకాలీన సమస్యల పరిష్కారానికి ఉపకరిస్తుందని అన్నారు. ఇది నాగరికతకు మార్గదర్శి అని వాఖ్యానించారు. అయితే దీనదయాళ్ తన సిద్ధాంతంలో కొత్తగా ఏదీ ప్రతిపాదించలేదని, అదంతా భారతీయమైన చింతన నుంచి స్వీకరించినదేనని సంతోష్ వెల్లడించారు.
ఏకాత్మ మానవ దర్శనం భారత భద్రత, రక్షణ ఉత్పత్తులపై కొత్త వెలుగును ప్రసరించిందని డాక్టర్ సతీశ్‌రెడ్డి తెలియచేశారు. స్వదేశీ పద్ధతులలో రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోని దేశం, ముప్పును ఎదుర్కొనక తప్పదని అన్నారు. ఆ సిద్ధాంతంలో స్వదేశీ, వికేంద్రీకరణ కీలక అంశాలు కావడం వల్లనే ఎన్నో ప్రత్యేకతలు వచ్చాయని, భారత్‌కు అవి ఎంతో ఉపకరించాయని చెప్పారు. ఆయన చెప్పిన ఇంకొన్ని అంశాలు: పారిశ్రామికీకరణ అంతా కేంద్రీకృతం కాకుండా పెద్ద, మధ్య, చిన్న తరహా పరిశ్రమలుగా ఆ రంగం ఉండాలి.
ఏ దేశమైనా సొంత ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తుంది. దేశంలోనే అన్నీ ఉత్పత్తి చేసుకోవాలని 1941లో అమెరికా కూడా నిర్ణయించింది. దీని మీద కాంగ్రెస్‌లో పెద్ద చర్చ జరిగింది. కానీ కొంతకాలం విదేశాల నుంచి దిగుమతులు చేసుకున్నా మళ్లీ సొంత దేశంలోనే ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చింది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి రక్షణ రంగంలో చెప్పుకోవడానికి మనదంటూ ఏం లేదు. 1750 వరకు ప్రపంచంలోని పారిశ్రామిక ఉత్పత్తులలో 24 శాతం ఉన్న మన ఉత్పత్తులు 1947 నాటికి కేవలం 4 శాతం మాత్రమే. రక్షణ రంగమైతే పూర్తిగా దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. మన దేశంలో రక్షణ ఉత్పత్తులు చేయాలన్న ఆలోచన కూడా లేదు. డీఆర్‌డీవోను స్థాపించారు, నిజమే. కానీ ఆ సంస్థ అసలు ఉద్దేశం – బయట నుంచి దిగుమతి చేసుకో దలిచిన ఉత్పత్తుల ప్రమాణాలను పరీక్షించడమే. 1965 నాటికి దేశంలో కొన్ని రక్షణ ఉత్పత్తులు చేసుకోవాలని ఆలోచన వచ్చింది. హొమీ జె బాబా వంటివారు అందుకు పూనుకున్నారు. క్షిపణులు, యుద్ధ ట్యాంకులు వంటివి చేసి విజయం సాధించ గలిగారు. అయినా కూడా 2014 వరకు విదేశాల నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకొనే దేశాలలో మనదే అగ్రస్థానం. అలాంటి సమయంలోనే నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టి శంఖారావం పూరించారు. ఇలాంటి భారతావనికి తాను ప్రధానిఉండాలని అనుకోవడం లేదని అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా ’ పిలుపునిచ్చారు. దీనితో ఏజెంట్లు ముందుకు వచ్చారు. తరువాత బయట దేశాల వారు వచ్చారు. తరువాత దశలో మన శాస్త్రవేత్తలు కూడా తగిన పరిజ్ఞానాన్ని పొంది మనమే అన్నీ ఉత్పత్తి చేసుకోవాలని మోదీ కల్పన చేశారు. 2016లో ఆయన మమ్మల్నందరినీ పిలిచారు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి పరచే ప్రయోగం ఒకటి చేయాలన్నారు. పక్కనే అజిత్ ధోవల్ కూడా ఉన్నారు. నిర్దేశించుకున్న ఉపగ్రహాన్ని నిర్దేశించుకున్న ప్రదేశంలో కొట్టగలగాలి. అందులో విజయం సాధించాs. సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ప్రపంచంలోనే నాల్గవ స్థానంలోకి వచ్చింది. ఆ తరువాత మరొక మహోన్నత పిలుపు వచ్చింది` ఆత్మ నిర్భర భారత’.
అప్పటి వరకు భారత్ సొంతంగా నిర్మించుకున్న తుపాకులు లేవు. ఆ లోటు తీర్చుకోవాలన్నారు మోదీ. అది కూడా సాధ్యమై, గణతంత్ర వేడుకలో ప్రత్యక్ష మయింది. బ్రహ్మోస్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారయింది. ఆ సూపర్ సోనిక్ క్షిపణినే ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించారు. ఒక ఇంటిలో ఉగ్రవాదులు దాగుంటే, దాని పక్క ఇంటికి కూడా హాని చేయకుండా సరిగ్గా లక్ష్యాన్ని తాకగల సామర్థ్యం దానికి ఉంది. తేజస్ విమానం, విమానాలను నిలిపే ఓడ కూడా తయారు చేసుకున్నాs. న్యూక్లియర్ సబ్‌మెరీన్‌లు కూడా నిర్మించుకున్నాం. ఇతర దేశాల క్షిపణలు మన దేశం మీదకు దాడికి వస్తుంటే ఆకాశంలోనే నిలిపే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం.
మోదీ వికేంద్రీకరణకు కూడా పిలుపునిచ్చారు. చాలాకాలం దేశంలో రక్షణ రంగ ఉత్పత్తులు కొద్ది పరిశ్రమల ద్వారానే జరిగేవి. అవైనా చిన్నచిన్న పరికరాలు. దీనిని విస్తరించాలన్నారు ప్రధాని. ఈ రోజు మొత్తం పది సంస్థలు ఉత్పత్తులు చేపట్టాయి. క్షిపణులు, ట్యాంకులు కూడా ఉత్పత్తి చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, తమిళనాడులలో డిఫెన్స్ కారిడార్‌లు వచ్చాయి. రక్షణ ఉత్పత్తులు చేసే 20,000 పరిశ్రమలు వచ్చాయి. 2014లో దేశంలో రక్షణ ఉత్పత్తులు 23 శాతం. ఇప్పుడు 65 శాతం. దేశంలోనే ఉండి పనిచేయాలన్న తత్త్వం ప్రజలలో వచ్చింది. గతంలో 75 శాతం భారతీయ నిపుణులు విదేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు 75 శాతం ఇక్కడే ఉండి పనిచేస్తున్నారు. దేశంలో ఈ రంగంలో పనిచేసే రెండు లక్షల స్టార్టప్‌లు వచ్చాయి. ఇందులో యువతదే ఎక్కువ భాగం.
తరువాత మోదీ మరొక పిలుపునిచ్చారు. అది-మన రక్షణ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌లో విక్రయించాలి. అది మొదలయింది. ప్రస్తుతం రూ. 23,666 కోట్ల విలువైన ఎగుమతులు జరుగు తున్నాయి. అవి రెట్టింపు కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆశిస్తున్నారు.

రెండవ చర్చా కార్యక్రమం
‘భౌగోళిక రాజకీయాలు – ఏకాత్మ మానవ దర్శనం’ అన్న అంశంతో మొదలయింది. ఈ అంశాన్ని బీజేపీ నాయకుడు వారణాసి రామ్‌మాధవ్ తీసుకున్నారు. రెండో భాగం భాష`సంస్కృతి ఏకాత్మ మానవ దర్శనం. ఈ అంశం మీద ప్రాంత ప్రచారక్ విజయాదిత్య ప్రసంగించారు. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
‘భారతదేశం 1947లోనే ఆవిర్భవించిందని భావించరాదు. భారత్ అంటే కొన్ని వందల ఏళ్ల నాగరికత కలిగిన దేశం. ఆ నాగరికత ప్రభావం చాలా దేశాల మీద, ప్రాంతాల మీద కూడా ఉంది. దీనినే ఉపఖండం, దక్షిణ ఆసియా అని పిలుస్తున్నారు. వీరంతా కలసి ఉండాలని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆకాంక్షించారు’ అని గుర్తు చేశారు రామ్‌మాధవ్. భారత్ అంటే భౌగోళికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న కేంద్రంలో ఉన్నదని చెప్పారాయన. ఇంకా: పాకిస్తాన్ ఏర్పాటు అసహజమైనది. అంటే దీని అర్థం ఆ దేశాన్ని రూపుమాపాలని కాదు. హిందువులు, ముస్లింలు కలసి జీవించలేరన్న ఒక దృష్టితో పాకిస్తాన్‌ను ఏర్పాటు చేశారు. అది తప్పు అన్నారు దీనదయాళ్. అవిభాజ్య భారతదేశంలో అనేక వర్గాలు, తెగలు, జాతులు ఉన్నాయి. వారంతా కలసి ఉండడమే సబబు అని దీనదయాళ్ భావన. భారత దేశ అభివృద్ధి అంటే పొరుగు దేశాల ఆభివృద్ధి కూడా. ఇంగ్లిష్‌లో రెండు ప్రయోగాలు ఉన్నాయి. ఒకటి ఎల్డర్ బ్రదర్. రెండు బిగ్ బ్రదర్. మనం ఉండాల్సింది ఎల్డర్ బ్రదర్ తీరులోనే. అందుకే నరేంద్ర మోదీ పొరుగుకు మొదటి ప్రాధాన్యం అన్నారు.
చైనా సంబంధాల విషయంలో నెహ్రూ తప్పు చేశారన్నదే దీనదయాళ్ నిశ్చితాభిప్రాయం. చైనాతో వ్యవహారం అంటే కేవలం మాటలతో కూడిన దౌత్యమే సరిపోదు. ఆ దేశంతో సమానమైన సైనిక పాటవం ఉంటేనే సాధ్యం. ఇవి కూడా దీనదయాళ్ అభిప్రా యాలే. చైనా విషయంలో ఆయన దృక్పథం కాలపరీక్షకు నిలిచింది. మనం కూడా సైనిక పాటవం సాధించిన తరువాత మాత్రమే చైనా వెనక్కి తగ్గింది.
అలీన విధానం గురించి దీనదయాళ్ దృక్పథం చాలా నిర్మాణాత్మకమైనది. 1965 ప్రాంతంలో ప్రచ్ఛన్న యుద్ధం పరాకాష్టకు చేరిన కాలంలో భారత్ అలీన ఉద్యమాన్ని ఆశ్రయించింది. ఏ రాజ్యకూటమి లోనూ (అటు అమెరికా, ఇటు సోవియెట్ రష్యా) చేరరాదన్నది విధానంగా ఎంచుకున్నది. ఏ కూటమి లోను చేరరాదన్నది తప్పు పట్టవలసినది కాదన్నది నిజమే. అలా అని నిష్క్రియాపరత్వం సరికాదన్నదే దీనదయాళ్ వాదన. ఇది ఏకాత్మ మానవ దర్శన సూత్రమే. కానీ ఈనాడు భారత్ ప్రపంచంలోని చాలా దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉంది. అంతర్జా తీయ సమస్యల మీద మోదీతో చర్చించే ఒక వాతావరణం ప్రపంచంలో ఏర్పడింది. నిజానికి ఇవాళ ప్రపంచ దేశాలు, చాలా వ్యవస్థలు మారుతు న్నాయి. అయినా భారత్ తనదైన ఉనికిని చాటుకో గలుగుతున్నది. దీనికి స్ఫూర్తి ఏకాత్మ మానవ దర్శనం. వికసిత భారత్ అనే గొప్ప మార్గాన్ని దీనదయాళ్ మన తరం కోసం సిద్ధం చేసి పెట్టారు.
17వ శతాబ్దం ఆరంభం వరకు కూడా భారత్ విశ్వగురు స్థానంలోనే ఉన్నది. అదొక ఆర్థిక శక్తి. అయితే ఆనాడు ఏకాత్మ మానవ దర్శనం లేదు. తరువాత ఎప్పుడో దీనదయాళ్ ఒక ధార్మిక, సామాజిక జీవన సారాన్ని ఏకాత్మ మానవ దర్శనంగా పరిచయం చేశారు’ అన్నారు.
రెండో కాలాంశాన్ని తీసుకున్న ప్రాంత ప్రచారక్ ఆదిత్య. ఆనాడు ఏ తత్త్వం భారత జన మానసాలలో ఉన్నదో అది ప్రపంచాన్ని ఏలిందని చెప్పారు. దానినే దీనదయాళ్ ఒక రాజకీయ సామాజిక సిద్ధాంతంగా మలిచారని తెలిపారు. ఆదిత్య తన ప్రసంగంలో ఇంకా ఈ విషయాలు వెల్లడించారు…భారతీయుల మానసాలలో ఎలాంటి చింతన ఉన్నదో, శాంతి సౌభాగ్యాలను నిలిపిందో దానినే దీనదయాళ్ కాలానుగుణమైన ఒక రాజకీయ తాత్త్వికతగా మలిచి అందించారు. ఒకనాడు ఇక్కడ ఉన్న సిద్ధాంతానికే ఆధునిక దృష్టిని రంగరించారు, వ్యాఖ్యానించారు. ఇది సామాన్య జనం ఆచరణ నుంచి ఆవిర్భ వించింది. ఇది ఇవాళ్టి ప్రాపంచిక సమస్యలన్నింటికీ పరిష్కారం చూపగలదు. కలసి సాధించడం, నడవడం అనే ధోరణి ఎంతోకాలంగా ఇక్కడ ఉంది. ఇందుకు ఉదాహరణ ఇంత క్రితం వక్తలు చెప్పిన మాటలలో ఉంది. గుజరాత్‌లోని ఒక గ్రామంలో 137 ఏళ్ల నుంచి ఒక్క పోలీసు ఫిర్యాదు కూడా లేదు. ఇది అంతా కలసి సాధించినది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్రకృతిలోని చాలా విషయాలను గమనించి విస్తుపోతున్నారు. అవన్నీ ఒకనాడు మన దేశంలోని సాధారణ కుటుంబికులకు కూడా తెలిసినవే. మొక్కలకు ప్రాణం ఉందన్నారు జగదీశ్ చంద్రబోస్. ఇది విని మీరు విస్తుపోతున్నారు కానీ, మొక్కలు నిద్రిస్తాయన్న సంగతి మా అమ్మకు, అమ్మమ్మకు కూడా తెలుసు అన్నారాయన. జేసీ బోస్ చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది. ఆయన రాత్రివేళ బంతితో ఆడుతున్నారు. అది వెళ్లి మొక్కల మధ్య పడింది. ఆ బంతిని తెచ్చుకోవడానికి జేసీ బోస్ వెళుతుంటే, ఆయన మాతృమూర్తి వారించారు. రాత్రి మొక్కలు నిద్ర పోతాయి. నిద్రాభంగం చేయడం తప్పు అని చెప్పారు. మొత్తం సృష్టిలో వైవిధ్యం ఉంది. ఒకరి కష్టం అంటే భూమండం మొత్తానికి వచ్చిన కష్టంగా చూడాలి. ఏకాత్మ మానవ దర్శనం మాతృ భాషలను మన్నించమని చెబుతుంది. కేంద్రం తీసుకు వచ్చిన కొత్త విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు విలువ ఇవ్వాలని భావించారంటే అందుకు ఏకాత్మ మానవ దర్శనం ఇచ్చిన ప్రేరణే కారణం.

మూడో కాలాంశం
ఆత్మ నిర్భర భారత్` ఏకాత్మ మానవ దర్శనం. ప్రముఖ బీజేపీ నాయకుడు మురళీధరరావు ఈ అంశం మీద చక్కని సమాచారం అందించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ అధ్యక్షత వహించారు.
ఏకాత్మ మానవ దర్శనం అనే గొప్ప చింతనను ఒక్క భారత్ మాత్రమే కాదు, యావత్ప్రంచం స్మరించుకోవలసిన సందర్భంలో మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం అంటూ మురళీధరరావు ఉపన్యాసం ప్రారంభించారు. బీజేపీ అంటే సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. అధికారంలో లేకున్నా సిద్ధాంతంతోనే ఉంటుంది. కానీ ఇలాంటి సిద్ధాంతంతో ముందుకు వెళ్లాలంటే సాధ్యం కాదు, ప్రభుత్వంలోకి రావడం కల్ల అన్న అభిప్రాయాలూ అనుమానాలూ గట్టిగా వినిపించిన కాలం ఉంది. అలాంటి నేపథ్యంలో బీజేపీలో పనిచేయడం ఎంత కష్టమో ఆలోచించాలి అన్నారాయన. ఇలా సాగింది ఆయన ఉపన్యాసం:
1965లో దీనదయాళ్ ఏకాత్మ మానవ దర్శనాన్ని ప్రతిపాదించిన సమయంలో వాదాలు ఒకదానితో ఒకటి సంఘర్షించుకుంటున్నాయి. కమ్యూనిజమే శాశ్వత సిద్ధాంతమని కొందరు నమ్మారు. చాలా దేశాలలో, మన దేశంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో, శ్రీకాకుళంలో ఆ పేరు గట్టిగానే వినిపించింది. కానీ ఇవాళ ఆ పేరే అంతర్థానమై పోయింది. సోవియెట్ రష్యా పతనం సమీపంలోనే ఉందని 1986లో దత్తోపంత్ ఠేంగ్డీ అంచనా వేశారు. ఆయన మాటలకు అంతా విస్తుపోయారు. చైనాలో అమలులో ఉన్నది పేరుకు కమ్యూనిజం. ఈ పరిణామాలన్నిటి కంటే చాలా ముందే అసలు కమ్యూనిజమే కాదు, సామ్యవాదం, పెట్టుబడిదారీ విధానం కూడా కాలగర్భంలో కలసి పోవడం తథ్యమని చెప్పారు దీనదయాళ్. వాటికి ప్రత్యామ్నా యంగా భారతీయ సిద్ధాంత పరంపర ఆధారంగా, మన సంప్రదాయం సంస్కతి పునాదిగా ఏకాత్మ మానవ దర్శనం ప్రతిపాదించారు. నెహ్రూ, రామమనోహర్ లోహియా వంటి ఉద్దండులు తమ తమ రాజకీయ సిద్ధాంతాలను బలంగా నమ్ముతున్న సమయంలోనే ఏకాత్మ మానవ దర్శనం వెలువడింది. వాస్తవంగా మన పూర్వికులు ప్రవచించిన విశ్వాసా లనే ఆయన రాజకీయ సిద్ధాంతంగా మలిచారు. ప్రపంచీకరణ, డబ్ల్యుటీవో అనివార్యమని అంతా చెబుతున్న సమయంలోను ఠేంగ్డీ ఆ మాటను నిరాకరించారు. స్వాతంత్య్రం వచ్చిన 1947లో, జనసంఘ్ స్థాపించిన 1951లో ఒకటే చెప్పాం. ఆత్మనిర్భరత మనకి ముఖ్యం. స్వావలంబన ప్రధానం. నాలుగైదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే చెబుతున్నారు. దేశీయమైన రక్షణ ఉత్పత్తులు విశేషంగా పెరిగాయి. సార్వభౌమాధి కారాన్ని స్వదేశీ రక్షణ పాటవంతోనే రక్షించుకోగలం. రక్షణరంగ ఉత్పత్తుల సంగతి అటుంచి, 1965లో యుద్ధం వస్తే ఆహార పదార్థాలే లేవు. దేశ ప్రజలు ఉపవాసాలు చేయాలంటూ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చారు. కానీ ఈ రోజు దేశంలో ఆహార ధాన్యాలు మిగులులో ఉన్నాయి. ఆత్మ నిర్భరత వల్ల ఇది సాధ్యమైంది. అసలు మన ఆత్మ నిర్భరత, మన స్వావలంబన ప్రపంచానికి మేలు చేస్తాయి. 140 కోట్ల ప్రజలు ఉన్న మన దేశమే ఆహార ధాన్యాల దిగుమతి మొదలు పెడితే మిగిలిన దేశాల పరిస్థితి ఏమిటి? ఆత్మ నిర్భరత ట్రంప్ వంటి వాళ్ల వ్యూహాలకు కూడా సమాధానం చెప్పగలదు. మన సమాజంలో శాంతికి, సుస్థిరతకి, సౌభాగ్యానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకి, నాటి స్వాతంత్య్ర పోరాట ఫలితాన్ని రక్షించుకోవడానికి ఆత్మ నిర్భరత అత్యవసరం. ఇప్పుడు ప్రపంచం భారత నమూనాను ఆసక్తిగా పరిశీలిస్తున్నది. కొనసాగగల లేదా నిలకడైన పురోగతికి మూలం ఆత్మనిర్భరత. దోపిడీ లేని దేశం కావాలంటే, సజీవమైన దేశం మనం చూడాలంటే ఆత్మనిర్భతతో సాధ్యం.

నాలుగో చర్చ
ఆర్థిక సమృద్ధి – వికేంద్రీకరణ. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఈ చర్చా కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇద్దరు ప్రముఖులు ప్రొఫెసర్ కనగ సభాపతి, కస్తూరి రాకా సుధాకరరావు వక్తలుగా పాల్గొన్నారు. జనవరి 24వ తేదీన జరిగిన కార్యక్రమా లలో ఇది మొదటిది.
ఏకాత్మ మానవ దర్శనం ప్రపంచ శ్రేయస్సును కోరే సిద్ధాంతంగా ఆవిర్భవిస్తుందని నమ్ముతూ, అందుకు కనిపిస్తున్న రుజువులను సమీక్షించుకుంటూ బీజేపీ అభిమానులు విజయవాడలో సమావేశాలు జరుపుకుంటున్న సమయంలోనే దావోస్‌లో ఎకనమిక్ ఫోరమ్ సభలు కూడా జరిగాయి. కమ్యూనిజం, సోషలిజం, పెట్టుబడిదారీ విధానం వంటి ఇజాలన్నీ చతికిల పడ్డాయని మనం చెప్పుకుంటున్న సమయం లోనే దావోస్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి ఒక మాట వినిపించింది. 1990 దశకంలో ప్రపంచాన్ని కలవర పెట్టిన ప్రపంచీకరణ సిద్ధాంతం డొల్ల మాత్రమేనని, అది విఫలమైందని అమెరికా వాణిజ్య మంత్రి ీVAవర్డ్ లుట్నిక్ ప్రకటించారు. అప్పుడు వాటిని రుద్దడానికి ప్రయత్నించిన దేశాల ఏలికలే ఆ మాట బాహాటంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని విజయ వాడ సభల దృష్టికి తెస్తూ కనగ సభాపతి తన ప్రసంగం ఆరంభించారు. ఆయన ప్రసంగంలోని కొన్ని అంశాలు :
దీనదయాళ్ తన సిద్ధాంతాన్ని ఆవిష్కరించి నప్పుడు మూడో సిద్ధాంతానికి చోటు లేదనే అంతా భావించారు. అవి కమ్యూనిజం లేదా కేపిటలిజం. నెహ్రూ సోషలిజం వైపు మొగ్గారు. అది పాశ్చాత్య దేశానిది. ఏకాత్మ మానవ దర్శనం అంటే మనదైన నాగరికత, మనదైన ఆర్థిక చరిత్ర సారం కలిపి రూపొందించినది. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత జీడీపీ 32.9 శాతం. స్వతంత్ర భారతదేశం తొలి రోజులలో ఆ జీడీపీ కేవలం 4 శాతం. 1765`1900 మధ్య భారతదేశం నుంచి రూ 6.84 లక్షల కోట్ల సంపద తరలిపోయింది. ఇంత సంపదను సృష్టించుకోవడానికి కారణం వికేంద్రీకరణ. మన పూర్వులు మనకు పొదుపును వరంగా ఇచ్చారు. 1947 నాటికి దేశంలో సగం దారిద్య్ర రేఖ దగ్గరే ఉన్నారు. అయినా ఆనాడు ఉన్న పొదుపు 9 శాతం. అంటే తరువాతి తరం కోసం వారు పడిన తపన ఇది తెలియచేస్తుంది. ఆ పొదుపు మొత్తం 30 ఏళ్లలో (స్వాతంత్య్రం వచ్చాక) 15 శాతానికి పెరిగింది. కాబట్టే దీనదయాళ్ మన దేశ అభివద్ధికి మనదైన పంథానే అనుసరించాలని గాఢంగా ఆకాంక్షించారు. ఎలాంటి చదువు లేకుండానే, చిన్న చిన్న పెట్టుబడులతో అంతర్జాతీయ మార్కెట్ స్థాయికి చేరిన సాధారణ ప్రజల గురించి కనగసభాపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఆర్థిక అంశాలను వికేంద్రీకరించాలన్నదే దీనదయాళ్ ఏకాత్మ మానవ దర్శనం ప్రధాన సూత్రమని, విదేశీ పెట్టుబడులపై నియంత్రణ ఉండాలని ఆయన చెప్పారని, ప్రభుత్వ పెట్టుబడిదారి విధానాన్ని పూర్తిగా నిరాకరించారని కస్తూరి రాకా సుధాకరరావు చెప్పారు. ఉద్యోగాలను తొలగించే పారిశ్రామికీకరణకు దీన దయాళ్ వ్యతిరేకి, సగటు ప్రజలు, వారి దక్షత, సృజన ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన తమ సిద్ధాంతంలో పేర్కొన్నారని తెలియచేశారు. పలు గ్రంథాలు రచించిన దీనదయాళ్ ‘టు ప్లాన్స’ (రెండు ప్రణాళికలు) అన్న పుస్తకం రాశారని, అంతా చదవదగిన పుస్తకమని రాకా చెప్పారు. సోవియెట్ నమూనా ప్రణాళికా వ్యవస్థను భారతదేశంలో అమలు చేయదలచిన నెహ్రూ ఏ విధంగా విఫలమైనది అందులో విశ్లేషించారని తెలియచేశారు. నిరక్షరాస్యులు, సర్వసాధారణమైన ప్రజలలో ఎంత గొప్ప వ్యాపార దక్షత ఉంటుందో తెలియచేసే పలు ఉదాహరణతో రాకా ఉపన్య సించారు. కొన్ని అంశాలు:
సగటు మనిషి లేదా సమాజంలోని చిట్టచివరి వ్యక్తి అభివద్ధే దీనదయాళ్ ఆలోచన అంతటికీ కేంద్ర బిందువు. వికేంద్రీకరణతోనే అందరి శ్రేయస్సు సాధ్యమవుతుంది. తూర్పు గోదావరి జిల్లా కడియం, దాని పరిసరాలలోని మరొక 11 గ్రామాల ప్రజలు మొక్కల పెంపకం, అమ్మకం (నర్సరీ) వ్యాపకంగా చేసుకున్నారు. వాళ్లు చదువుకున్నవారు కాదు. కానీ 3500 ఎకరాలలో నర్సరీలు పెంచుతున్నారు. వాళ్ల దగ్గర నుంచి మొక్కలు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతాయి. 20,000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చారు.వాళ్ల దగ్గర ఎంబీఏలు కూడా పనిచేస్తున్నారు. వారి కుటుంబాలలోని కుర్రాడు పాఠశాల నుంచి సాయంత్రం వచ్చి, జాతీయ రహదారి పక్కన నిలబడి పూలు అమ్ముతాడు. తన చదువుకు తానే డబ్బు సంపాదించుకుంటున్నాడు. ఈ నర్సరీల మీద నివేదికలు వచ్చాయి. కానీ అవి కీలకమైన అంశాలేవీ ఇవ్వకుండా వాళ్ల కష్టాలను ఏకరువు పెట్టాయి. అక్కడ ఎకరాకు రూ. 8 లక్షలు పెట్టుబడి పెడితే రూ 20 లక్షలు లాభం వస్తుంది.
మహారాష్ట్రలోని సాంగ్లీకి సమీపంలో ఇచ్చాల్ కరంజీ అనే ఊరు ఉంది. అక్కడి జనాభా 3 లక్షల 30 వేలు. ఆ ఊరు 9 గజాల చీరలకు ప్రసిద్ధి. దానికి మాంచెస్టర్ ఆఫ్ మహారాష్ట్ర అన్న పేరు. ఇక్కడి చీరల వ్యాపారంలో సంవత్సరానికి జరిగే లావాదేవీలు రూ.150 కోట్లు. ఇందోర్ రాణి అహల్యాబాయి హోల్కార్ మహేశ్వరి చీరల పరిశ్రమను ప్రోత్సహించారు.
1980 రాజస్తాన్‌లో నాటి ముఖ్యమంత్రి భైరాన్‌సింగ్ షెకావత్ మొదటిసారి అంత్యోదయ పథకం ప్రవేశపెట్టారు. అది మంచి ఫలితాలను ఇచ్చింది. దానికి ప్రేరణ దీనదయాళ్ సిద్ధాంతమే.
ధర్మార్థకామమోక్షాల మధ్య ఉండే మనిషి జీవితానికి కేవలం ఆర్థిక అవసరాలే ఉండవని, బుద్ధికి, శరీరానికి బలం చేకూర్చాలని ఈ చర్చకు అధ్యక్షత వహించిన పురందేశ్వరి అన్నారు. దేశ అభివద్ధి అరువు తెచ్చుకున్న సిద్ధాంతాలతో సాధ్యం కాదని మన పరంపర నుంచి వచ్చిన విధానాలతోనే సాధ్యమని దీనదయాళ్ భావించారని ఆమె అన్నారు.

ఐదో చర్చా
‘కొనసాగగల అభివృద్ధి లక్ష్యాలు`ఏకాత్మ మానవ దర్శనం’ అనే అంశం మీద జరిగింది. దీనదయాళ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ సంచాలకుడు అతుల్ జైన్, రాఘవకృష్ణ వక్తలుగా పాల్గొన్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అధ్యక్షత వహించారు.
నరేంద్ర మోదీ తీసుకున్న కొన్ని ప్రధాన పథకాలకు మూలం దీనదయాళ్ సిద్ధాంతమేనని అతుల్‌జైన్ పేర్కొన్నారు. స్వచ్ఛభారత్, అంత్యోదయ ఆ సిద్ధాం తంలో భాగమేనని గుర్తుచేశారు. పోషణ్ అభియాన్ కూడా ఆ సిద్ధాంతం ప్రేరణతో తీసుకున్నదే నని తెలియచేశారు.
ఏదైనా కొనసాగగలిగితేనే వికాసానికి అవకాశం ఉంటుందని రాఘవకృష్ణ అన్నారు. ఏకాత్మ మానవ దర్శనం అర్థÁ్ధం కావాలంటే మనిషికీ ప్రకృతికీ మధ్య ఉన్న బంధం అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

ఆరో చర్చా
‘ఏకాత్మ మానవ దర్శనంలో రాజకీయ సాంస్కృతిక కోణాలు’ పై ఆచార్య బి. సారంగపాణి, వినయ్ సహస్రబుద్ధె మాట్లాడారు. సోము వీర్రాజు అధ్యక్షత వహించారు. ఇది చివరి కాలాంశం. అయినా సభా ప్రాంగణమంతా నిండుగానే ఉంది. జరిగినవన్నీ గహనమైన అంశాలపై ప్రసంగాలు. అయినా ప్రతినిధులలో ఉత్సాహం తగ్గలేదు. భారత్‌మాతాకీ జై అంటూ, వందేమాతరం అంటే నినాదాలు చేస్తూనే ఉన్నారు. సరిగ్గా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రతినిధుల నిబద్ధతను శ్లాఘిస్తూ రచయిత, మేధావి వినయ్ సహస్రబుద్ధె ప్రసంగం ఆరంభించారు. అందులో కొన్ని అంశాలు:
భారతదేశంలో దాదాపు 3000 రాజకీయ పక్షాలు ఉన్నాయి. వాటిలో బీజేపీ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇందులో మన మట్టి వాసనలు ఉన్నాయి. ఈ పార్టీ విచారధార ఏమిటి? ఎలాంటిది? దానికి చాలా కోణాలు ఉన్నాయి. బీజేపీకి పునాది జనసంఘ్. జనసంఘ్ ద్వారా బీజేపీకి లభించినదే ఏకాత్మ మానవ దర్శనం. ఇందులో నాలుగు మౌలికాంశాలు ఉంటాయని ఇంతవరకు అంతా చెప్పారు. అవి ధర్మార్థకామమోక్షాలు. ఇంకా స్వదేశీ ఉంది స్వధర్మం, స్వభాష, స్వభోజనం, ఇంకా స్వభూష ఉన్నాయి. భారత్ అంటే భారత్. అలాగే ధర్మం అంటే బాధ్యత. మోక్షం అంటే ఆధ్యాత్మిక స్పృహ. మన జీవితాలు సులభంగా సాగడానికి ఉపకరించేవే పంచభూతాలు. మన సమాజంలోనే కాదు, దేశదేశాలతో మనం నెరిపే సంబంధాలను ఇవి నిర్దేశించాలని ఏకాత్మ మానవ దర్శనం చెబుతుంది. మనం మానవ సంబంధాల యుగంలో ఉన్నాం. వ్యక్తి, సమాజం, దేశం ఒకే వ్యవస్థలో భాగమన్నారు దీనదయాళ్. ఈశాన్య భారత రాష్ట్రాలను చిరకాలం పరాయిగానే నాటి ప్రభుత్వాలు భావించాయి. కానీ వాజపేయి తొలిసారి ఈశాన్య భారత రాష్ట్రాల అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. అందరినీ కలుపుకొని వెళ్లాలన్న ఏకాత్మతకు ఇది ప్రతిబింబిం. నరేంద్ర మోదీ సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అన్న నినాదం వెనుక ఉన్నది కూడా ఏకాత్మ మానవ దర్శనమే. తరువాత సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్.. సబ్‌కా ప్రయాస్ అంటూ తన ఆశయాన్ని విస్తరించారాయన. రాజకీయ సిద్ధాంతాల విషయంలో దీనదయాళ్ పాశ్చాత్య పోకడలకు సవాలు విసిరారని ఆచార్య బి. సారంగపాణి అన్నారు. స్వతంత్ర భారత దేశంలో రెండు పంచవర్ష ప్రణాళికలు విఫలమై నాయని రూఢి అయిన తరువాత, చైనా యుద్ధంలో అపజయం తరువాత దీనదయాళ్ ఏకాత్మ మానవ దర్శనం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని ఆయన చెప్పారు. ఆయన ఇంకా ఇలా అన్నారు:
గణితం దీనదయాళ్ అభిమానాంశం. తరువాత సంస్కృతం అంటే అపారమైన గౌరవం ఉంది. అలాగే ఆర్థికశాస్త్రం విశేషంగా అధ్యయనం చేశారు. అందుకే పాశ్చాత్య రాజకీయ సిద్ధాంతాలను సవాలు చేస్తూ ఏకాత్మ మానవ దర్శనాన్ని ప్రతిపాదించారు. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో నెహ్రూ విధానాలు, కమ్యూనిస్టుల నినాదాలు దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న కాలంలో దీనదయాళ్ ఈ సిద్ధాంతాన్ని ప్రవచించారు. వికేంద్రీకరణలో భాగంగా స్థానిక సంస్థలకు అధికా రాలు అప్పగించాలని గాంధీజీ గట్టిగా కోరేవారు. అలాంటి వాస్తవికమైన ప్రతిపాదనను గాంధీజీ తరువాత బలంగా వినిపించినవారు దీనదయాళ్. కేంద్రీకరణ భారతీయ విచార ధారకు వ్యతిరేకమైనది కాబట్టి, అధికారం, ఆర్థిక వ్యవహారాల కేంద్రీకరణ ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆరు దశాబ్దాల నాడే దీనదయాళ్ చెప్పారని గుర్తించాలి. ఏకాత్మ మానవ దర్శనంలో మరొక కీలక అంశం అంత్యోదయ. సమాజంలోని అట్టడుగు వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలితాలు అందాలంటుంది అంత్యోదయ.
ప్రజల సామూహిక చైతన్యాన్ని నాశనం చేయడం తగదని దీనదయాళ్ చెప్పారు. కాబట్టి రాజ్యం ప్రజా వ్యవహారాలలో ఎంత తక్కువ జోక్యం ఉంటే అంతమంచిది అన్నదే దీని అర్థం. పెట్టుబడిదారీ విధానంలో పరాయీకరణ జరుగుతుంది. ఆ పరాయీకరణ దేశం నుంచి, ప్రకృతి నుంచి కూడా జరుగు తుంది. కానీ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలకు మించి కమ్యూనిస్టు వ్యవస్థలలో పరాయీకరణ జరుగుతుంది. ఇది సరికాదు. వ్యక్తి, సమష్టి, సృష్టిల మధ్య సమన్వయం ఉండాలి. ‘స్వ’ భావన పట్ల చైతన్యం తేవడానికి పాటు పడాలి. భారతీయ ఆత్మను దర్శించాలనుకున్నా, అభివృద్ధి అనే అంశంలో మనదైన దృక్పథాన్ని వీక్షించాలన్నా ఏకాత్మ మానవ దర్శనం అధ్యయనం చేయాలి. ఏకాత్మ మానవ దర్శనం మనలో గొప్ప చైతన్యానికి అవసరమైన భూమికను నిరంతరం నిర్మిస్తూనే ఉంటుంది.
వక్తలను, చర్చ ఉద్దేశాన్ని వివరిస్తూ మొదట సోము వీర్రాజు గంభీరోపన్యాసం చేశారు. ధర్మం, సంస్కృతి పునాదిగా ఉండే ఒక రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేసుకుని మనం నడుస్తున్నాం. ఆ ఆశయాలను నాడు అటల్ బిహారీ వాజపేయి, నేడు నరేంద్ర మోదీ ముందుకు తీసుకునే బాధ్యత స్వీకరించారని ఆయన చెప్పారు.
ఈ సభల వైశిష్ట్యం గురించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు మనోభావాలను వెల్లడిం చారు. సభా నిర్వహణలో పాటించిన మర్యాదలను, అతిథుల పట్ల చూపిన మన్ననను, సభా స్థలి అలంకరణలో పాటించిన సంప్రదాయ పద్ధతులను వారు వివరించారు. ఏకాత్మ మానవ దర్శనాన్ని పునర్దర్శనం చేసుకున్న తరువాత తమ ఆలోచన మరింత విశాలమైందని ముక్తకంఠంతో తెలియ చేశారు. వక్తలంతా వారికి కేటాయించిన వ్యవధికి పరిమితం కావడం విశేషం.
23వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వందేమాతరం ఆధారంగా రూపొందించిన నృత్య రూపకం, భారతీయుడు అనే నాటిక, వాయులీన సంగీత కార్యక్రమం అందరినీ అలరించాయి.
మేనమామకో ఉత్తరం
అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చారు దీనదయాళ్ ఉపాధ్యాయ. ఆయన జీవితాన్ని ఆరఎసఎస్‌కు అంకితం చేసిన సమయంలో తన మేనమామకు ఒక లేఖ రాశారు. అందులో ఆయన రాసిన ఒక అంశం చిరస్మరణీయమైనది. మునిగిపోవడమే తరువాయి అన్న తీరులో అస్తవ్యస్థంగా ఉన్న సమాజంలో పునరుత్తేజం తేవడానికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణ వారు చేశారు. అదొక చిన్న కథ వంటిదే. డాక్టర్ వడ్డి విజయసారథి ముగింపు కార్యక్రమానికి ముందు దీనదయాళ్ గురించి నాలుగు మాటలు చెప్పారు. అందులో ఇది ఒకటి.
గొప్ప నిధిని పట్టుకుని ఒక వ్యక్తి పడవ ఎక్కాడు. కొంతదూరం ప్రయాణించిన తరువాత పడవలోకి హఠాత్తుగా నీరు రావడం మొదలయింది. రాను రాను పడవకు ప్రమాదం పెరుగుతున్నది. అప్పుడు ఆ గొప్ప నిధిని ఎక్కడ దాచగలడు? ఎలా రక్షించగలడు? భుజం మీద పెట్టుకుంటాడా? నెత్తి మీద ఉంచుకుంటాడా? లేదంటే అంగీ వెనుక దాస్తాడా? నిజానికి ఆ ఆలోచనలేవీ ఆ సమయంలో ఆ నిధిని రక్షించగలిగేందుకు ఉపకరించేవి కావు. నిధిని తప్పక రక్షించుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. పడవలోకి నీరు రాకుండా ఆపడమే. అందుకు తగ్గ చర్యలకు ఉపక్రమించడమే. ఇప్పుడు దేశంలో జరగవలసినది కూడా అదే అని ఈ కథ ద్వారా పండిత్ దీనదయాళ్ తన మేనమామకు తెలియచేశారు.
ఆత్మ.. ఏకాత్మ.. భారతీయ మానసం…
ఏకాత్మ భారతదేశంలోనే సహజంగా ఉందని రాఘవకృష్ణ తెలియచేశారు. కొన్ని కొన్ని సంప్రదాయాలు దేశమంతటా ఒకే విధంగా కనిపిస్తాయి. సాటి మనుషుల పట్ల చూపవలసిన గౌరవంలో కూడా ఆ ఏకాత్మత కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఆ మధ్య ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తరువాత దృగ్గోచరమైంది. ఎందరో అభాగ్యులు కన్నుమూశారు. అంత్యేష్టి జరగపోతే సద్గతులకు ఆత్మ సాగించవలసిన ప్రయాణం ఆగిపోతుందని భారతీ యుల ప్రగాఢ విశ్వాసం. ఇది భారతీయ మానసం. అందుకే ఆ ప్రమాదం జరిగిన 11వ రోజున చుట్టుపక్కల గ్రామాల వారంతా అక్కడకు వచ్చారు. మరణించిన వారందరికీ యథావిధిగా, శాస్త్రోక్తంగా శ్రాద్ధకర్మలను సామూహికంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా శ్రాద్ధకర్మ చేయడానికి నిష్ట, నియమం అవసరం. ఉపవాసం ఉండాలి. శిరోముండనం చేయించుకోవాలి. ఆ ప్రమాదంలో మరణించినవారి కులాల గురించి తెలియదు. గోత్రాలు అసలే తెలియదు. ఇతర మతాలు వారూ ఉన్నారు. అయినా చుట్టుపక్కల గ్రామాల వారంతా వచ్చి ఆ నియమాలను పాటించి శ్రద్ధగా అంత్యేష్టి నిర్వహించారు. అలాంటి ఒక కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించలేదు. లేదంటే ఏదో సంఘం వచ్చి ప్రేరేపించలేదు. ఏ పీఠాధిపతి ఆదేశించలేదు. స్వచ్ఛందంగా వారే కూడబలుక్కుని వచ్చారు. అందుకే ఈ చర్యలో చాలామంది భారతీయ మానసాన్ని దర్శించారు.
మన రక్తసంబంధీకులు మరణిస్తే ఎలాంటి గౌరవ ప్రతిపత్తులతో వారిని సాగనంపుతామో, సద్గతులు కలగాలని కోరుకుంటామో, అదే గౌరవం ఇతరులకూ దక్కాలన్న గొప్ప దృష్టి ఆ గ్రామీణుల హృదయాలలో ఉంది. ఏకాత్మత అంటే ఇదే కదా!



విజయవాడ సభలలో మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. 1965 నాటి జాగృతి వారపత్రిక నుంచి తీసుకున్న క్లిప్పింగ్స్‌తో వెలువరించిన పుస్తకం, ఆనాటి సభల తరువాత ముద్రించిన స్మరణికను మరొకసారి ముద్రించి, వెలువరించారు. వజ్రోత్సవం సందర్భంగా జాగృతి వెలువరించిన ప్రత్యేక సంచికను (19-25 జనవరి 2026) కూడా ఆవిష్కరించారు.
సముచితం కదా!
1965 నాటి జనసంఘ్ 12వ వార్షిక సభలు చరిత్రాత్మకమైనవి. ఒక కొత్త రాజకీయ శక్తి పురుటి నొప్పులు అక్కడ వినిపించాయి. అదే భారతీయ జనతా పార్టీ. ఆ సభల దృశ్యాలను తలపునకు తెస్తూ, సభాస్థలిని అలంకరించారు. అలాగే నాడు పాల్గొన్నవారు అదృష్టవశాత్తు కొందరు మన మధ్య ఉన్నారు. వారిని ఆహ్వానించారు. ఆచార్య ముదిగొండ శివప్రసాద్, జూపూడి హైమవతి అలాంటి పెద్దలు. అలాగే ఆ సభలలో పాల్గొని నాడు జనసంఘ్ నిర్మాణం కోసం చెమటోడ్చిన వారి సంతానాన్ని ఈ సభలకు ఆహ్వానించడం ముదావహం. కొల్లిపర వెంకటేశ్వర్లు గారి కుమార్తెలు ఈ సభలకు హాజరయ్యారు. వారితో పాటు అలాంటి మరికొందరిని, విశాఖ నుంచి వచ్చిన సత్యారావు మాస్టారిని వేదిక మీదకు ఆహ్వానించి సన్మానించారు.


కథనాలు : జాగృతి డెస్క్