‘ఆంధ్ర భాషామతల్లికి మా శక్త్యానుసారము సేవ జేయుటయు అస్మన్ మనోభావ ప్రేరితములైన గీతములను మా సోదరీమణుల ఉపయోగార్థమిచ్చుటయు…
ఈ చిన్ని గ్రంథమును ప్రచురింప మమ్ము ప్రేరేపించినది?
– ఆ గ్రంథం ‘లక్ష్మీశారద గీతములు’. అంతటి సాహితీ సంగీత వేత్తలు శ్రీమతులు లక్ష్మీ, శారదలు. ఒకరు గిడుగు లక్ష్మీకాంతమ్మ, మరొకరు జొన్నలగడ్డ శారదాంబ. వారివి స్త్రీల పాటలు. పుస్తక ప్రచురణ ఇప్పటిది కాదు. రమారమి 95 ఏళ్ల నాటిది! అంటే స్వాతంత్య్రానికి ముందరి సంగతి. బువ్వంబంతి, మనోతత్వము గీతాంశాలు అందులోని అంతర్భాగాలు. అంతా కలిపి ఇటూ అటుగా వంద పుటలు!
అంతా గ్రాంథికమే కాదు, ఎంతగానో వ్యవహార అంశాలు కూడా. వీరివే శతకాలూ సుభాషితాలు కూడా. ఇద్దరూ బహుముఖ ప్రజ్ఞావంతులు. ఫిబ్రవరిలోనే భాషాదినోత్సవం. వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి బంధువు లక్ష్మీకాంతమ్మ. ఆడపడుచు శారదాంబ. ఉభయపడుతులవీ జంట రచనలు. రచనాశైలికి మెచ్చుతునకగా ఒకటి… బువ్వంబంతి గీతిక-
సీతారాములా బువ్వమూ! రమణులారా!
మనకెంత సంతసమాయెనే!
దండిగా హల్వాపురీ, మెండైన పిండివంటల్
లడ్డూ జిలేబి వడ్డనల్, చేడెలొడ్డించిరీ!
ఒప్పైన అప్పడముల్, ఒడియమూలావడల్
వింత వింతలే కూరలూ…. వనితరో చూడూ!
సన్నబియ్యపు పాయసం సరసాన్నమూలొడ్డించే
శారదాలక్ష్మీ నుతుడౌ… సీతాతో గూడి ఆరగించుమా బువ్వమూ!
అది 1903, ఆ తేదీ ఫిబ్రవరి 2. ఊరు రాజమహేంద్రి. అక్కడే వక్కలంక వారింట లక్ష్మీకాంతమ్మ జననం. భర్త అందించిన ఉత్సాహ ప్రోత్సాహాలతో భాషా సాహిత్య రంగాన ఎంతో ముందడుగు వేశారు. సంగీతపరంగానూ పేరు గడించారు.
సారస్వత రచనలు సాగించిన తొలి రోజుల్లోనే, శారదాంబతో కలం జోడీ ఏర్పడి ముమ్మరంగా కొనసాగింది.
శతక రామాయణం, రామచంద్ర శతకం, తిరుపతి వేంకటేశ్వర శతకం, మరెన్నో శతకాల పరంపర ఇద్దరి నుంచీ వెలువడటమే విశేషం.
ఆరోగ్య సామ్రాజ్యం, లేఖదూత, తదితరాలు కూడా.
ఇరువురి పద్యరత్నావళీ ఆనాడే ఎందరెందరినో ఆకట్టుకుంది. అయినా ఎంతగానో వినమ్రత. అది ఎలా ఉండేదంటే –
భాషా ప్రౌఢిమొకింతలేదు, ఘనమౌ భావంబులున్ లేవు, య
న్వేషింపన్ కడుప్రజ్ఞ లేదు, వినుమీ వేషంబు, నీ సౌరభో!
ధ్వానంబున్ కడు ప్రజ్వరిల్ల మది నావేశింప పద్యంబులన్!
భాషింపన్, మదినిచ్చగల్గి, లిఖియింపన్ జాలితిన్ భారతీ!
అనేంతగా, ఇద్దరూ చదువుల తల్లి అనుగ్రహప్రాప్తిని పొందినవారే.
జాతీయతను మిళితంచేసిన వేరొక రచనలో….
‘మాతా, భరతమాతా! గొనుమా జోహారూ!
శాంతిస్మితవదనోజ్వల విలసిత శశిర భూషితయా తల్లీ!
చారు శారదా చంద్రికా ద్యుతులతో
నీరద శ్యామాప్రభ రుచిర దీప్తులతో
రంగద భంగతరంగ సమన్విత
తరళ తరంగిణీయుతమౌ మాతా!….’ అంటూ కొనసాగుతుందా గీతిక.
ముద్దు పాట పేరిట ‘మాతృప్రేమ’ను ఆవిష్కరిస్తూ –
‘నీ ముఖమే నా కన్నుల విందు
సర్వచింతలకెల్ల అది మందు
సంతసములకెల్ల పసందు
సకల సౌఖ్యములెల్ల నేగందు!’ అనే చరణ విన్యాసం కనబరిచారు. చిట్టివేళ్లు, ముద్దుగోళ్లు, నా తల్లి కాళ్లు అంటూ అమ్మ వాత్సల్యాన్ని అక్షరాల్లో ఒదిగేలా చేశారు కవయిత్రి ద్వయం. వారే వర్ణించినట్లు – ఆ ప్రేమానుబంధం పనస తొనలకన్న, ద్రాక్షఫలముకన్న, ఇక్షురసము కన్న, జుంటి తేనెకన్న మిన్న. ప్రత్యక్షర సత్యం.
వీరి కవితకు అభివందనం 1931లో అందింది.
సరస కవిత్వ తత్వరస సాగర పారగ భవ్యభారతీ
గురుతర సత్కృపాకలిత కోమలభావ విశేష శేముషీ!
అంటూ ప్రశంసలంద చేశారు పెద్దలు.
అప్పట్లో ఆ గోదావరీ ప్రాంత విద్యాశాఖ అధికారి రామమూర్తి.
‘సరస గీతాది సాహితీ సహిత లార!
చిత్త సామ్రాజ్య వైభవ శ్రేయలార
లక్ష్మీ శారదలారా! శ్రీ లలితలార
నిత్య సౌభాగ్యమగు మీకు నెలతలార!’
అని ఉమ్మడిగా ఆశీర్వదించిన సందర్భమది.
రమాపతి, శారదాపతి శతక రచనలు కూడా ఆ ఇద్దరు మహిళలవే. ‘సోదరీమణులారా’ అని సంబోధించిన ఇరువురు కవయిత్రులూ తమ రచనల ను ప్రేమ ప్రసూనాలుగా వర్ణించుకున్నారు. శారదాపతీ! అని ప్రస్తుతించిన శారదాంబ తనదైన పద్యచాతురితో చదువరులను అలరించారు.
చాటు పద్యాలపరంగానూ ఆరితేరారిద్దరూ! అదేవిధంగా పుష్పలతా వన వర్ణనతో పాఠకులను మురిపించారు. అక్షరాలను కదం తొక్కించారనేందుకు వేరొక నిదర్శనం:
మంద మలయానిలానంద మందసంబు
సుందరోద్యాన వాటికా బంధురంబు
శాంతిరాగాది లక్షణ సంయుతంబు
మహిత వనరాజమిందిరా మందిరంబు!
ఇంతేకాక – చంద్ర, కాసార, వృక్ష, వాన వర్ణనలూ చేశారు వారు.
అలనాడు సమాజంలో వ్యాపించిన దురాచారాలపైనా కలం దూశారు. ‘లక్ష్మీ శారదా కుమారీ నీతి’ ద్వారా హితబోధలందించారు. నిత్య జీవితంలోని సమస్యల తీవ్రతనే రచనాంశాలుగా ఎంచుకున్నారు.
కీలక విషయం : లక్ష్మీకాంతమ్మ శైలిలో తేట తెలుగు, శారదాంబ రచనల్లో సంస్కృత పద సంపద అధికంగా ఉండటం. ‘లేఖదూత’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఉద్యోగరీత్యా దూరంగా ఉన్న భర్తకు, భార్యకు నడుమ సాగిన ఉత్తర రచనలే ఇతివృత్తం. లక్ష్మీకాంతమ్మ భర్త వెంకట రామమూర్తి. విద్యాశాఖాధికారి ఆయన. ‘భవ్యభారతీ, విశేష శేముషీ’ అని ఆమెను అక్షర పూర్వకంగా ప్రశంసించిందీ ఆయనే! పరస్పర ప్రోత్సాహమే కదా భర్తకైనా, భార్యకైనా శుభాశీస్సు!
కన్నీరు – పేరిట ఉన్నదే లక్ష్మీకాంతమ్మ అముద్రిత రచన.
శారదాంబది అనంత జాతీయతా భావన.
ఘనతరమైన ఈ భరతఖండమునన్ జననంబొసంగి నా
తనువు తరింప తీర్థ సముదాయములన్ భ్రమణం బొసంగి నీ
చనువు నొసంగి నన్ను సరసంబగు వాక్కుల ధన్యజేసితో
యనఘ! త్వదీయ దివ్య సదయాశ్రమ మిచ్చితి శారదాపతీ!
అంటూ స్తుతి చేశారు. భక్తి తత్పరతను అక్షరాక్షరానా కనబరిచారు.
భర్తను ఆమె త్యాగమూర్తి, సుశీలమూర్తి, స్థైర్యమూర్తి, శాంతమూర్తిగా కొనియాడి ‘సత్యనియమానువర్తి’గా శ్లాఘించారు. మహేశ్వరికి తరుణుల పాలవెల్లి, నిజదాసజనంబుల కల్పవల్లి, భాగ్యములిచ్చు కృపామతల్లి అంటూ కుసుమాంజలి సమర్పించారు. ‘నీ చరణము లెల్ల వేళల మనసారగ, కొల్తు, సుభాగ్యమిచ్చి మద్వరుని, గుణాల వాలుని శుభాంగుని గావుము’ అంటూ చేతులు జోడించి అభ్యర్థించారు. ఆ పద్యాలన్నీ పతిభక్తి శీర్షికన వెలువడటం ఆమె నిజ జీవిత ప్రాభవానికి సూచిక.
జొన్నలగడ్డ శారదాంబ భర్త సత్యనారాయణమూర్తి. రచయితగా, న్యాయవాదిగా సుప్రసిద్ధులు. పలు నవలలు, నాటకాల రచన ద్వారా చదువరుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. విహారి అనే కలంపేరుతో అనేకానేక సాహితీ పక్రియలను వెలువరించారు. శ్యామల, నూర్జహాన్ అనేవి తన విఖ్యాత రచనలు. యాత్రా సాహిత్యం మీద ఎక్కువ మక్కువ పెంచిందీ ఆయననే ఆమె పలు సందర్భాల్లో కృతజ్ఞతలందించారు.
శారదాంబ వచన రచనలోనూ మేటి. అనువాద రంగానికి సంబంధించి, భర్త నుంచి మెళకువలను పుణికిపుచ్చుకున్నారు. చేదోడువాదోడుగా నిలిచారు.
లలిత సంగీత ప్రాచుర్యానికి ఇద్దరు నారీమణులూ (లక్ష్మీకాంతమ్మ, శారదాంబ) తమ జీవితాలను అంకితం చేశారు.
అంబ మంగళహారతికి ఇలా సారస్వతాన్ని జోడించారు వారు.
మంగళంబులందుకొనుమూ సంగీతలోల ప్రియా!
సుందరాంగుల మందారామా అందరికీ ఆధారమా!
ఇందుధర సుందరీ, ఇదే అందుమా నా హారతీ!
నీరద శ్యామాంగీ! లక్ష్మీ శారదలను బ్రోవుమా
వారిజాక్షి వందనమిదె! అంది శుభము గూర్పుమా!
ఈ పదాబంధాలన్నింటినీ పరిశీలించినపుడు, ఉభయుల సారస్వత శక్తి, సంగీత అనురక్తి ప్రస్ఫుటమవుతుంది.
రాజరాజేశ్వరీ దండకానికి సంబంధించి:
‘మహామయీ! సౌభాగ్యముల్ గూర్చి, సత్యంబు చేకూర్చి, ధైర్యంబు మాకిచ్చి, శాంతితేజంబులున్ నిత్య సంతోషముల్ గూర్పుమో తల్లీ’ అంటూనే- దివ్య తేజోమణీ, కీర్తి విస్తారిణీ, జ్ఞాన సంధాయనీ అని పద్యకవి తాపుసూనాలతో అర్చించారు దేవిని.
తమ గీతములు స్వానుభవ మనోభావ జనకములని మొదట్లోనే ప్రకటించారీ జంట కవయిత్రులు. గీతాలను ఆలాపించేందుకు అనువైన వరసలనూ, చాలా భాగం స్వరాలనూ పుస్తకంలోనే సమకూర్చారు.
పద్మినీ ద్యుమణుల బాంధవ్య గరిమంబు
నిందుకైరవముల పొందు నెమ్మి
సురధునీ సుమనుల చోద్యంపు నెయ్యంబు
జ్ఞాన మానసిక ప్రశస్త మైత్రి
సుమ సౌరభంబుల సొంపైన మిత్రత
కుముదేశు కౌముదీ కూర్మిపేర్మి….
అన్నట్లు ఇద్దరు వనితా సాహితీ వేత్తల / సంగీత విద్వన్మణుల జంట కావ్యాలు ఆ రోజుల్లో పాఠక శ్రోతల మనోమందిరాలను దేదీప్యమానంగా తీర్చిదిద్దాయి. ఇరువురి కలాలూ గళాలూ కలగలిసి సమాజ జీవితంలో లలితత్వాన్ని పెంచి పోషించాయి. ఎంతైనా విశేషం!

జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్