చరిత్ర గురించి తెలియకుండా ఉండటం అంటే ఎప్పటికి పిల్లవాడిగా ఉండటమే – మార్కస్ తుల్లియస్ సిసిరో. మన అయోధ్య, కొరియా దేశాల నడుమ శతాబ్దాలుగా విడదీయరాని బంధం ఉంది. అది కూడా రక్తసంబంధం. ఇవాళ్టికీ కొనసాగుతున్నది కూడా. హన్యాంగ్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు ప్రొఫెసర్ బూయంగ్ మాకిమ్ (2010లో) ఒక సందర్భంలో అన్నమాటలు పరిశీలించండి! ‘భారత్-కొరియాలు సరుకులనే కాదు, జన్యువులను కూడా పంచుకునేవి. కారా వంశానికి తల్లి అయోధ్య (భారత్) నుంచి సముద్రమార్గంలో వచ్చింది. అందుకే అయోధ్య అంటే మా అమ్మగారి పుట్టిల్లు. ఉత్తరప్రదేశ్‌లో ప్రాచుర్యంలో ఉండే రెండు చేపల ముద్ర ఉమ్మడి కొరియాలో అధికంగా కన్పించేది. తరతరాలుగా కొరియన్లు రాముడిని కొలుస్తున్నారు కూడా!’ కాబట్టి పురాతన భారత నాగరికత సుదూర దేశ సంస్కృతిని ఏ విధంగా ప్రభావితం చేసిందో ఈ ఉదంతం చెబుతున్నది. అందుకు మాధ్యమం చరిత్ర.
అయోధ్య-కొరియాల ఆ విడదీయరాని బంధం ఎలా మొదలయింది? క్రీ।।శ।। 48లో అయోధ్య యువరాణి ‘సూరిరత్న’ సముద్రమార్గంలో కొరియా చేరుకుంది (కొన్ని రచనలు ఆమె పాండ్య రాజ్యం నుంచి వెళ్లిందని అంటున్నాయి). రెండు చేపలు ముద్దాడుతున్నట్టు ఉండే ఓ శిల్పాన్ని వెంట తీసుకెళ్లిం దామె. ఆ రాతిశిల్పం ఉంటే సముద్రం ఆటుపోట్లను తగ్గిస్తుందని నమ్మకం. ఆ శిల్పం కూడా కొరియా సంస్కృతీ చిహ్నంగా మారిపోవడం మరొక విశేషం. కొరియా చేరుకున్న సూరిరత్న తన పేరును హోహింగ్ ఓక్ అని మార్చుకుంది. కారా వంశానికి చెందిన తొలి రాజు కిమ్‌ను వివాహం చేసుకుంది. వీరికి పదిమంది పిల్లలు. వారి సంతానమే కిమ్ హే కిమ్ పరంపర. రెండు కొరియాల్లోనూ కిమ్ వంశీకులే ఎక్కువ. సూరిరత్న తీసుకువెళ్లిన శిల్పం తరువాత కిమ్‌హే అనే పురావస్తు శాస్త్రవేత్తకు దొరికింది. ఆ గుర్తు, అలాంటి శిల్పం కొరియాలో ఉండే అవకాశం లేదు. అదే ఆయనను పరిశోధనకు ప్రేరేపించింది. అలా కొరియాను పాలించిన కారా రాజులకూ, అయోధ్య మిశ్రా రాజులకూ వియ్యం ఉందని కనుగొన్నాడు.
కొరియా తూర్పు ఆసియాలోని ఒక ద్వీపకల్పం. కొరియా అనే పదం గొరియో అనే పదం నుండి వచ్చింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం తరువాత రెండు దేశాలుగా (ఉత్తర కొరియా, దక్షిణ కొరియా) విడిపోయింది.కొరియా భాషను దక్షిణ కొరియాలో ‘హంగూ జియో’ అనీ, ఉత్తర కొరియాలో ‘చోసోనో’ అంటారు. భారత్‌తో తమ బంధం గురించి బీజమాత్రంగా తెలిసిన పాత కొరియా వాసులకు దక్షిణ కొరియా టీవీలో 2010లో వెలువడిన ఒక ధారావాహిక కార్యక్రమం ఆ బంధంలోని గాఢతను వెల్లడించింది. నిజానికి 2001లోనే వందమంది కొరియన్ల ప్రతినిధి బృందం అయోధ్యకు వచ్చింది. తమ రాణి పేరిట సరయూ తీరంలో ఓ స్మారకాన్ని నిర్మించింది. దక్షిణ కొరియా మాజీ ప్రధాని కిమ్ జాంగ్‌పిల్ 2001లోనే అయోధ్య రాజ వంశీకుడు బిమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రాకు ఓ లేఖ రాశారు. అది ధన్యవాదాల లేఖ. ఆ మార్చిలో తాము చేసిన భారత్ పర్యటన ప్రత్యేకమని, అయోధ్యలో పర్యటించాలన్న తన ఆకాంక్ష నెరవేరిందని కిమ్ తెలిపారు. సూరిరత్న- రాజు సురో వారసుల్లో తాను 72వ తరానికి చెందినవాడినని తెలియచేశారు కూడా. అయోధ్యను తమ పుట్టిల్లుగా భావిస్తామని వెల్లడించారు. అయోధ్య (సాకేత)ను సూర్యవంశ రాజులు పాలించారు. ప్రస్తుతం ఆ వంశానికి చెందినవారున్నారు. వీరిలో భీమేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా ముఖ్యులు. తమ మూలాలను తలుచుకుంటూ ఏటా వందలాది మంది కొరియన్లు నేటికీ అయోధ్యను సందర్శిస్తారు. దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంగ్ కిల్ కూడా ఇదే గుర్తు చేసుకున్నారు. కొరియా పురాతన చరిత్ర పుస్తకంలో అయోధ్యకు చెందిన యువరాణి రాజు కిమ్ సురోను వివాహం చేసుకున్నట్లు రాశారని ఆయన చెప్పారు. రాజు సమాధి వద్ద జరిపిన పురావస్తు తవ్వకాలలో అయోధ్యకు చెందిన కళాఖండాలు బయటపడిన సంగతి చెప్పారు.
చారిత్రక గాథల ప్రకారం సూరిరత్న పేరు ఉన్న అయోధ్య యువరాణి హియో క్రీ।।శ।। 48లో సముద్రమార్గం ద్వారా కొరియాకు ప్రయాణించి, గయా రాజ్యస్థాపకుడైన రాజు కిమ్ సురోను వివాహం చేసుకున్నారు.ఈ రాణి పేరిట హియో మెమోరియల్ పార్క్ (రాణి హో మెమోరియల్) హియో హ్వింగ్ ఓక్ స్మారకం అయోధ్యలో సరయూ తీరాన ఉంది. గతంలో ఇదే రామకథా పార్క్. భారత్‌లో డిసెంబర్ 25, 2025న 12 అడుగుల హియో రాణి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొరియా నుండి తెచ్చిన భారీ శిలా ఫలకం, రాణి సముద్ర ప్రయాణాన్ని సూచించేలా నిర్మించిన ఒక చెరువు, పుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ ఉన్నాయి. దక్షిణ కొరియాలోని కారక్ (కారా వంశానికే భారత్‌లో పేరు) వంశీకులు సుమారు 60 లక్షల మంది ఈమెను మూల రాణిగా భావిస్తారు. వారు కూడా రావణుడు సీతాపహరణం చేసి చావు కొనితెచ్చుకున్నాడని నమ్ముతారు. సెంట్రల్ కరాక్‌క్లాన్ సొసైటీ సెక్రటరియేట్ జనరల్ కిమ్ చిల్ రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుక జనవరి 22, 2024)న హాజరయ్యారు.‘అయోధ్యను మా అమ్మమ్మ ఇల్లుగా చూస్తాము’ అని చెప్పారు. దక్షిణ కొరియాలో భారత రాయబారిగా పనిచేసిన ఎన్.పార్థసారథి సూరిరత్న జీవితం ఆధారంగా ‘ది లెజెండ్ ఆఫ్ అయోధ్య ప్రిన్సెస్ ఇన్ కొరియా’ నవల రాశారు. దీనిని కొరియన్ భాషలో ‘బి డాన్ హ్యాంగ్ హలా’ (సిల్క్ ప్రిన్సెస్) పేరుతో అనువదించి సియోల్‌లో ప్రచురించారు. నేషనల్ బుక్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఈ నవల ఆధారంగా పిల్లల పుస్తకాన్ని ప్రచురిం చింది.
కొరియన్ యువరాణి చేపబొమ్మ కథ కారక్ రాజ్యంలో చారిత్రక, పురాణగాథగా ప్రసిద్ధ మయింది. అవి చెప్పేది కూడా సుమారు 2000 సంవత్సరాల క్రితం సూరిరత్న భారతదేశం వచ్చి సురోను వివాహం చేసుకున్నది అనే. ఇక్కడ కొంత భిన్నమైన కథనం వినిపిస్తుంది. ఆమె అయోధ్య నుండి కాక దక్షిణ భారత్‌లోని పాండ్యరాజ్యం నుండి వెళ్లిందని ఎ.జె.ఓవియా తన సిద్ధాంత వ్యాసంలో వాదించారు. పాండ్య రాజ్యానికి చెందిన యువరాణి సూరిరత్న ఒక పడవలో ప్రయాణించి కారక్ రాజ్యా నికి చేరుకుంది. కారక్ రాజు ఆమెను ఆహ్వానించి, గౌరవించి వివాహం చేసుకున్నాడు. ఇది రెండు రాజ్యాల మధ్య సంబంధాలకు నాంది పలికింది. ఇక్కడ పాండ్య రాజ్యానికి చేప బొమ్మే చిహ్నం. కొరియన్లు ఆమె రాకను, ఆమె వెంట వచ్చిన సంస్కృతిని గౌరవిస్తూ చేప బొమ్మనే రాజచిహ్నంగా స్వీకరించారు. 13వ శతాబ్దానికి చెందిన ఒక కొరియా గ్రంథంలో ఒక రాణి ‘అయుత’ నుంచి వచ్చిందని కనిపిస్తుంది. బహుశ ఇది అయోధ్యకు భ్రష్టరూపమని చరిత్రకారుల భావన. పురాతన తమిళులు సముద్ర వాణిజ్యం, మృదువైన దౌత్యంతో ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ‘యూదుం ఊరే యావరుమ్ కేలిర్’ (మనకు అన్ని పట్టణాలు ఒకటే, అందరు మనుషులు ఒకటే. మనది ప్రపంచ రాజ్యం) అనే ప్రసిద్ధ తమిళ ఉల్లేఖన ఇలా వచ్చినదే కావచ్చు. దీనినే ఐక్యరాజ్యసమితి నినాదంగా స్వీకరించింది కూడా.
ఆరు మిలియన్ల కొరియన్‌లు లేదా కొరియా జనాభాలో 10% మంది తమ పూర్వులు ఒక భారతీయ యువరాణి సంతానమంటే నమ్ము తున్నారా? అన్నది ప్రశ్న. కానీ ఇదే నిజమని 13వ శతాబ్దం నాటి బౌద్ధ సన్యాసి కొరియన్ రచన ‘సంగుక్ యుసా’లో పేర్కొన్నారు. దీని అర్థం మూడు రాజ్యాల కథ.16 ఏళ్ల భారతీయ యువరాణి ‘సెంబావలం’ గురించి ఆ రచయిత ప్రస్తావించారు. ఆమె ‘హియో- హ్వింగ్ ఓక్’ అని, ఆమె కిమ్ సురోను వివాహం చేసుకుని ‘గెమ్గ్యాన్ గయ’ రాజ్యానికి మొదటి రాణ• అయిందని ఆ రచన కూడా చెబుతున్నది. ఆమె తన సేవకులతో ఇక్కడకు చేరింది. ఆ పరివారం అక్కడే స్థిరపడిపోయింది. దీనితో తమిళ సంస్కృతి వ్యాప్తికి దోహదపడింది. హియో, లీ, కిమ్ వంశాలు తాము ఆ రాణి వారసులమేనని అభిప్రాయ పడుతున్నారు. హియో వంశీకులు భారతదేశ దక్షిణ భాగంలోని అయుత రాజ్యాన్ని అయోధ్యతో తప్పుగా పోలుస్తున్నారన్న వాదన ఉంది. ఇది నిజం. ఎందుకంటే ఆ సమయంలో అయోధ్యను ‘సాకేత’ మనేవారు. సంగుక్ యుసా గ్రంథం 13వ శతాబ్దం నాటి రచన. కాబట్టి అది అయోధ్యను సూచించలేదు. ఇక్కడ అయుత రాజ్యం పురాతన పాండ్యన్ రాజవంశానికి చెందిన ‘ఆయ్ రాజ్యం’ను సూచిస్తుంది. యువరాణి తనతో త్రిశూలంలో జంట చేపలు చిహ్నాన్ని తీసుకువెళ్లింది. పాండ్యన్ రాజ్య పతాకాలు, నాణేలపై ఉన్నదీ రెండు చేపల గుర్తే. యువరాణి హియోను తమిళంలో సంబావలం (ఎర్ర పగడం’) పేరుతోనూ పిలుస్తారు. అలానే కొరియా భాషలో హియో హ్యింగ్-ఓక్ అంటే అర్ధం కూడా ఎర్ర పగడమే.
చిత్రంగా తమిళ-కొరియన్ సంస్కృతుల మధ్య సారూప్యతలున్నాయి. ప్రాచీన తమిళులు ఆగ్నేయాసియా దేశాలు సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలతో నౌకా వ్యాపారం చేశారని చెప్పే చారిత్రకాధారాలున్నాయి. పాండ్య రాజ్యం కూడా 2000 సంవత్సరాల క్రితం కొరియాతో సముద్ర వాణిజ్య సంబంధం కలిగి ఉంది. భాష, సాంస్కృతిక వ్యక్తీకరణలు, ఆహారం, ఆటల విషయంలో ఆ ప్రజల నడుమ సారూప్యత ఉంది. భవిష్యత్తును అంచనా వేయడానికి గతాన్ని అర్థం చేసుకోవాలి. ఇనుపయుగం నుండి భారతదేశం, కొరియా వాణిజ్య భాగ స్వాములు. ఇది చాలామందికి తెలియదు. అలాగే కొరియాలో అత్యధికంగా ఆరాధించే రాణి భారతీయురాలేనని కూడా మనకు తెలియదు.
కొరియన్ల ‘గోంగి’ ఆట, తమిళుల ‘అన్నంగల్’ ఆట ఒకటే. వాటి నియమాలు ఒకటే. గులకరాళ్లతో కొరియా పిల్లలు, మహిళలు ఆడేదే గోంగి. ఇది తమిళనాడు, కేరళలోను ప్రసిద్ధి. కొరియన్లు వరి అన్నంతో పచ్చళ్లతో కూడిన భోజనం ఇష్టపడతారు. తమిళులూ అంతే. కొరియన్ల ఆహారం వరి. వరి సాగును తమిళులే నేర్పారు. తమిళుల మాదిరిగానే బిడ్డ పుట్టినా, గృహప్రవేశం చేసినా కొరియన్లు బియ్యంతో చేసిన మిఠాయిలను తప్పక పంచుతారు. ఉరుగై (కిమ్చి), కోజు కట్టై (సాంగ్‌ప్యోన్) నువ్వుల కేకు (యోటిగాంగ్ జియోంగ్) అపైదోసై (కిమ్చి-జియోన్) స్వీట్ పొంగల్ (యాక్సిక్) వంటి వంటకాలు కొరియా, తమిళ ప్రాంతంలో సారూప్య తను కలిగి ఉంటాయి. తమిళనాట ‘సుందకంజి’, కొరియా వారి ‘మక్గోల్లి’ (పులియబెట్టిన బియ్యంతో చేసే మద్యం) ఒకే విధంగా ఉంటాయి. కుమ్మీ తమిళ నాడు, కేరళలో ప్రసిద్ధిచెందిన నృత్యం. ఇది మహిళలు చప్పట్లు కొడుతూ లయబద్ధమైన సంగీతానికి వృత్తాకారంలో చేసే నృత్యం. దీనిని పంటల పండుగ పొంగల్ సందర్భంలో చేస్తారు. ‘గంగ్ గాంగ్ సూల్లె’ అనేది కూడా సమృద్ధిగా పంట పండాక కొరియా ప్రజలు చేసే నృత్యం. భాషా పరంగానూ సారూప్య తలు ఉన్నాయి. కొరియా, తమిళ భాషలలో ఒకే అర్థాన్నిచ్చే 500 పదాలను పరిశోధకులు కనుగొ న్నారు. మోర్గాన్ ఇ.క్లిప్పింగర్ పరిశోధన ప్రకారం కొరియా, ద్రావిడ భాషల మధ్య ఎల్లప్పుడు లెక్సికల్ సంబంధం ఉంది. సంప్రదాయా నికి వస్తే తమిళులు అనుసరించే నడుక్కల్ సాంప్రదాయాన్ని క్వీన్ హియోహింగ్ – ఓక్ సమాధిలో చూడవచ్చు. హియోను కొరియాలో దేవతగా పూజిస్తారు. ఈ రెండు ప్రాంతాల మధ్య మరొక ప్రత్యేక సారూప్యత ‘ముత్యాల వేట’. పగడాల కోసం జరిపే ముత్యాల వేట తమిళనాడులో 2000 సంవత్సరాల క్రితం ఉంది. ఇది యువరాణి హియో సురోను వివాహం చేసుకున్న తరువాత కొరియాలో ప్రారంభమైంది. ముత్యాల కోసం లోతైన సముద్రంలో కొరియన్లు డైవింగ్ చేస్తారు.
ఆ యువరాణి అయోధ్య లేదా తమిళ వనిత అయినా భారతీయ వనిత అన్నది నిజం. మన పూర్వులు నెలకొల్పిన దౌత్య సంబంధాన్ని కొనసాగించి కొరియా-భారత్ మధ్య భాషా సాంస్కృతి వాణిజ్య, ఆర్ధిక సంబంధాలు పెంపొందించుకోవడం ఉభయులకు ఎంతో మేలు.
మూలం:
1. ది ఆర్మ్ చైర్ జర్నల్ (అక్టోబరు 29, 2021)
2. కొరియా యువరాణి సెంబావలం గురించి చెప్పని కథ- ఎ.జె.ఓవియా
3. సంగుక్ యూసా-ఇలియాన్ (ఎ మెమోరబులియా ఆఫ్ త్రీ కింగ్‌డమ్స్).
