చంద్రశేఖర్‌ ఆజాద్‌ ‌వర్ధంతి ఫిబ్రవరి 27

1921 ‌సంవత్సరంలో గాంధీజీ పర్యవేక్షణలో జరుగుతున్న సహాయ నిరాకరణోద్యమంలో దేశంలోని పెద్దలు, స్త్రీలు, పిల్లలూ అందరూ పాల్గొంటున్నారు. ఆ తరుణంలో చంద్రశేఖర్‌ ఆజాద్‌ ‌గూడ పాల్గొన్నాడు. అప్పుడు ఆయన వయసు 14 సం.లు. ఉద్యమంలో పాల్గొన్నందుకు పోలీసులు ఆజాద్‌ను అరెస్టు చేశారు. మెజిస్ట్రేటు ముందు హాజరుపర్చారు.

మెజిస్ట్రేటు చంద్రశేఖర్‌ను ‘నీ పేరు ఏమిటి?’ అని అడిగాడు.
చంద్రశేఖర్‌ – ‘ఆజాద్‌’ అని సమాధానం చెప్పాడు.
మరల మెజిస్ట్రేటు – ‘మీ తండ్రి పేరు ఏమిటి?’ అని అడిగాడు కోపంగా.
చంద్రశేఖర్‌ ‌చిరునవ్వుతో – ‘స్వతంత్ర’ అని జవాబిచ్చాడు.
మెజిస్ట్రేటు చివరిసారిగా – ‘మీదేవూరు?’ అని అడిగాడు రౌద్రంతో.
చంద్రశేఖర్‌ ‌నిర్భయంగా – ‘జైలు’ అని అన్నాడు.
చంద్రశేఖర్‌ ‌మాటలను మెజిస్ట్రేటు కోపంతో రెచ్చిపోయి, శేఖర్‌ ‌చిన్నవాడనీ జాలిదలచకుండా 15 హంటరు దెబ్బలను శిక్షగా విధించాడు. ఆ ప్రాంతంలో శిక్ష అమలుచేస్తే అల్లరి జరుగుతుందని ఆ బ్రిటిష్‌దాసుడైన మెజిస్ట్రేటు కాశీ సెంట్రలు జైలుకు ఆజాద్‌ను పంపాడు. ఆజాద్‌ ‌హంటరు దెబ్బలను ఎంతటి నిర్లిప్తంగా భరించాడో చూసి కాశీ జైలు అధికారి ఆశ్చర్యపోయాడు. ఆ దెబ్బలు చిన్నారి ఆజాద్‌ ‌హృదయంలో దావాగ్నిని పుట్టించాయి. బ్రతికున్నా బ్రిటిష్‌వారికి చిక్కనని ప్రతిజ్ఞ చేశాడు. ఇది మహావీర చంద్రశేఖర్‌ ఆజాద్‌ ‌జీవిత చరిత్రలో ప్రధాన ఘట్టం.
ఆజాద్‌ ఒక పేద కుటుంబంలో జన్మించాడు. అతడు కాశీలో చదువుకుంటున్న రోజుల్లో ఒక సత్రంలో మధ్యాహ్నం భోజనం మాత్రం చేసేవాడు. ఇతడు ఆజాద్‌గా పేరుగడించిన తర్వాత శివరామ ప్రసాద్‌ ‌గుప్త అనే కాంగ్రెసు భక్తుడు ఆజాద్‌ ‌చదువు సంధ్యలకు సహాయం చేస్తానన్నాడు. కాని ఆత్మాభిమానం గల ఆజాద్‌ అం‌దుకు అంగీకరించలేదు.
1923 నుండి 1930 వరకు యువకులు విప్లవ పంథాను అనుసరించారు. యువకులందరూ గెరిల్లా పద్ధతిలో విప్లవం నడపటానికి నిర్ణయించుకున్నారు. ఈ విప్లవాన్ని రహస్యంగా నడపటానికి హిందూస్థాన్‌ ‌సోషలిస్టు రిపబ్లికన్‌ అసోసియేషన్‌ ‌సంస్థను స్థాపించారు. ఈ రహస్య విప్లవంలో పోలీసులను మూడు చెరువుల నీళ్లు త్రాగించి, వారికి చిక్కకుండా తిరిగిన ఖ్యాతి ఒక్క ఆజాద్‌కే దక్కింది. ఈ రహస్య విప్లవం లాహోరు విభాగానికి భగత్‌సింగ్‌ ‌నిర్వాహకుడు.
1928 పంజాబ్‌ ‌కేసరి లాలా లాజపతిరాయ్‌పై లాఠీఛార్జీ చేసి ఆయన మృతికి కారణభూతుడైన సాండర్స్‌ను ఒక్క పిస్టల్‌ ‌దెబ్బతో నరకానికి పంపడానికి వేసిన పథకంలో, అమలులో ఎనలేని ఖ్యాతి ఒక్క ఆజాద్‌కే దక్కింది. బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఏడేంళ్లు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఆజాద్‌ ‌కోసం వెదికించి, కాని అతడు చిక్కలేదు. అప్పుడు అతని శిరస్సు ఖరీదు లక్షరూపాయలుగా బ్రిటిష్‌ ‌ప్రభుత్వం నిర్ణయించింది.
ఒకరోజు (27.2.1931) ఆజాద్‌ అల్హాబాద్‌లో ఒక పార్కులో తన స్నేహితునితో మాట్లాడుతుండగా, అతని స్నేహితుడు మరొకడు డబ్బుకు కక్కుర్తి పడి పోలీసు దళాలకు ఆజాద్‌ ఉనికి చెప్పాడు. నాద్‌వార్‌ అనే పోలీసు ఆఫీసరు పోరుకు సంసిద్ధంగా లేని ఆజాద్‌ ‌తొడపై పిస్తోలు పేల్చాడు. అంతే ఆజాద్‌ ‌పిస్తోలు నుండి గుండు దూసుకొనివెళ్లి ఆ పోలీసు ఆఫీసరు చేయిని ఎగురగొట్టింది. అప్పుడు ఆజాద్‌ ఒక చెట్టుచాటుకు వెళ్లి రక్షణ పొందాడు. కాని ఎంతసేపు ఆ చెట్టు అతనిని రక్షిస్తుంది!! గుళ్ల దెబ్బలతో అశక్తుడై నేలకొరిగిపోయాడు. ఆ సమయంలో విశ్వేశ్వరసింగ్‌ అనే పోలీసు ఆజాద్‌ ‌దగ్గరకు వెళ్లాడు. అంతే ఆజాద్‌ ‌పిస్తోలు నుండి గుండు దూసుకువెళ్లి ఆ పోలీసు దవడలో గుచ్చుకొని, అతని పళ్లను నేలరాల్చి, అతని ప్రాణాలను అనంత వాయువుల్లోకి పంపింది.
పోలీసులు ఆజాద్‌ ‌దగ్గరగా వెళ్లకుండా అతనిపై గుళ్లవర్షం కురిపించారు. ఆజాద్‌ ‌చనిపోయినా అతని దగ్గరకు వెళ్లడానికి భయపడి, అతని శవంమీదే వారి దగ్గరనున్న గుళ్లు అయిపోయేవరకూ కాల్పులు జరిపి, చివరికి ధైర్యం చేసి ‘‘ఆజాద్‌’’ ‌శవాన్ని బంధించారు. అంతేగాని సజీవంగా వారికి చిక్కలేదు.
– 29.2.1972, జాగృతి

About Author

By editor

Twitter
YOUTUBE