ఏదైనా బొమ్మల దుకాణంలోకి అడుగు పెట్టండి లేదా ఆన్‌లైన్‌లో చిన్నారుల కోసం అమ్ముతున్న బొమ్మలను ఒకసారి పరిశీలించండి. రంగులు, శబ్దాలు, హామీలతో కూడిన ఒక వర్ణవిలాస ప్రపంచం మన ముందుకు వస్తుంది. లాలిపాటలు పాడే మృదువైన బొమ్మల నుంచి, శిశువు చేసే చిన్న శబ్దాలకు స్పందించే ఇంటరాక్టివ్ రోబోల వరకు, అన్నీ అక్కడే ఉంటాయి. ఇవన్నీ ‘‘వికాసానికి అవసరం’’, ‘‘ఉత్తేజకరం’’, ‘‘బుద్ధి వికాసానికి అత్యంత కీలకం’’ అని ప్రచారం చేస్తారు. కానీ కాస్త ఆగి ఒక ప్రశ్న వేసుకుందామా! నిజానికి ఈ బొమ్మలు ఎవరి కోసం?
నిజం చెప్పాలంటే, ఆరు నెలల బిడ్డకు టెడ్డీ బేర్ రూ.200 ఖర్చయిందా? లేక రూ.2,000 ఖర్చయిందా? అన్నది ఏ మాత్రం పట్టదు. రెండేళ్ల చిన్నారిని టచ్ స్క్రీన్ లెర్నింగ్ టాబ్లెట్, స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలలో ఏదీ కావాలో చెప్పమంటే, టంబ్లర్ లాంటి స్టీలు పాత్రల వైపే చేతులు చాస్తుంది. ఇదీ అసలు సంగతి.
ఈ బొమ్మలు పిల్లల కోసమా మరి పెద్దల కోసమా?
ఆధునిక బొమ్మల మార్కెటింగ్ చాలా అరుదుగా పిల్లలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్లు. ఆ ప్రకటనలను అర్థం చేసుకునే వయసు, జ్ఞానం వారికి ఉండదు. మరి అసలు లక్ష్యంగా పెట్టుకునేది ఎవరిని? తల్లిదండ్రులు, తాతమ్మలు, మేనమామలు, అత్తలు, స్నేహితులు. వీరందరూ సున్నిత మనస్కులు. పర్సుల నిండా డబ్బులు కలిగిన పెద్దలు.
మన పిల్లలకు ‘‘అత్యుత్తమమైనది ఇవ్వాలి’’ అనే భావోద్వేగ తపన ఈ పరిశ్రమకు సారవంత మైన నేలగా మారుతుంది. తయారీదారులకు ఇది బాగా తెలుసు. వారు అపరాధభావాన్ని రేకెత్తిస్తారు, వారు పెట్టే క్యాప్షన్లు ‘‘మీ బిడ్డ వెనుకబడిపోవాలని మీరు కోరుకుంటున్నారా?’’, ‘‘మీ బిడ్డకు ముందస్తు ఆధిక్యం ఇవ్వండి!’’, ప్రతిష్ఠను చూపిస్తారు ‘‘మన చిన్న రాజు/రాణికి ఉత్తమమైనదే కావాలి’’ అని ఉంటాయి. వీటన్నింటికి ప్రకాశవంతమైన రంగుల్లో ముసుగువేసి, అర్ధశాస్త్రీయ పదజాలంతో అలంకరిస్తారు. దాంతో ఒక సాధారణమైన బొమ్మ కూడా నోబెల్ బహుమతికి అర్హమైన ఆవిష్కరణలా అనిపిస్తుంది.
ముందర తరానికి చెందిన మనమంతా, నిజానికి ఇంకా మన మధ్య ఉన్న ఎందరో మేధావులు ఈనాటి ఆధునిక బొమ్మలతో ఆడుకున్న తరం మాత్రం కాదు. అలాగని మనం మన రంగాలలో రాణించ లేదా?! ఎంతో ప్రతిష్టాత్మక పదవుల్లోనూ, ఇంటిని చక్కగా తీర్చిదిద్దినవారమే కదా!! కాస్త ఆలోచిద్దామా?
బొమ్మల సంస్కృతిలో మార్పు
1990ల చివరి వరకు బొమ్మల ఎంపికలు చాలా సాదాసీదాగా ఉండేవి. చెక్కతో చేసిన సంప్రదాయ బొమ్మలు, ఆంధప్రదేశ్‌కు చెందిన కొండపల్లి బొమ్మలు, లోహం లేదా మట్టితో చేసిన బొమ్మల వంటగది సెట్లు, ప్లాస్టిక్ వినియోగం కూడా చాలా పరిమితంగా ఉండేది. కానీ గత మూడు దశాబ్దాల్లో ప్లాస్టిక్‌తో తయారైన బొమ్మలు విపరీతంగా పెరిగాయి. వీటితో పాటు తక్కువ నాణ్యత గల గుడ్డతో నింపిన సాఫ్ట్ టాయ్స్, రోడ్డు పక్కన దొరికే ఆటవస్తువులు కూడా పెరిగాయి. ఇవి చిన్న పిల్లల ఆరోగ్యానికి, పరిశుభ్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయి. పరిమాణం పెరిగింది, కానీ నాణ్యత మాత్రం పెరగలేదు.
బొమ్మల తయారీదారులు
అసలు విషయం మర్చిపోతున్నారా?
బొమ్మల తయారీదారులు నిజంగా పిల్లల అభివృద్ధి, వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడంపై కంటే మార్కెటింగ్ మానసిక శాస్త్రం, ఉత్పత్తి ఆకర్షణలపై ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. కొత్తదనం చూపించాలనే పోటీలో, దుకాణాలపై ఆధిపత్యం సాధించాలనే తపనలో, పిల్లలు నిజంగా ఇష్టపడేది సాదాసీదా వస్తువులేనన్న సత్యాన్ని మరిచిపోతున్నారా?
అమ్ముడయ్యేది ఏమిటో రూపకల్పన చేయడంలోనే సమయం, డబ్బు, సృజనాత్మకత ఖర్చవుతుందేమో గానీ, నిజంగా పిల్లలకు ఉపయోగపడేది ఏమిటో ఆలోచించడం తగ్గిందా? ఇవి ఆలోచనలకు దారితీసే ప్రశ్నలు. పిల్లల మనసును గౌరవించే పరిశోధన, పిల్లల కేంద్రిత దృక్పథం బొమ్మల రూపకల్పనలో అత్యవసరం.
సరళతలోనే దాగిన ఆనందం
చిన్న పిల్లలు ఉన్న ఏ తల్లిదండ్రులను అడిగినా ఒక విషయం చెబుతారు, ఖరీదైన సంగీత బొమ్మ మూలలో పడిపోతే, వంటగదిలోని చెక్క గరిటెతో పాత్రలను మోగిస్తూ లేదా ప్లాస్టిక్ గిన్నెలను ఒకదానిలో ఒకటి పెట్టుకుంటూ పిల్లలు గంటల తరబడి ఆడతారనే చెబుతారు. ఎందుకు? ఆ వయసులో ప్రపంచమే ఒక ఆటస్థలం. సాధారణమైనదే వారికి మాయాజాలం. మెరిసే గరిటె వెలుగును ప్రతిబింబిస్తుంది. ఒక కప్పు మరో కప్పులోకి సరిపోతుంది. ఒక అట్టపెట్టె లోపల కూర్చోవడానికి సరిపోతుంది. ఇవి యాదృచ్ఛికమైన ఆసక్తి కాదు, సృజనాత్మక అన్వేషణకు స్వచ్ఛమైన రూపాలు.
పిల్లలు బొమ్మను ధర చూసి గానీ, ప్యాకింగ్ చూసి గానీ తీర్పు ఇవ్వరు. స్పర్శ, శబ్దం, తమ చేతులతో మార్చగలగడం, ఇవే వారికి ముఖ్యమైనవి. వారికి వినోదం కాదు, పాల్గొనడం కావాలి. వారి అవసరాలు సులభమైనవే. మన పెద్దల ఆలోచనలే వాటిని క్లిష్టం చేస్తున్నాయి.
పిల్లలకు స్వేచ్ఛను ఇద్దాం
బహుశా విద్యాత్మక బొమ్మలు పిల్లలకంటే పెద్దలకే అవసరమేమో. పిల్లలకు ‘‘అన్నీ’’ ఇవ్వాలనే తొందరలో, వారికి నిజంగా అవసరమైనదాన్ని మరిచిపోతున్నామేమో. పిల్లలకు అన్వేషించే స్వేచ్ఛ, ఊహించే స్వేచ్ఛ, ముఖ్యంగా మన అంచనాల నుండి స్వేచ్ఛ కావాలి. అధికంగా, అతిగా ఉత్తేజపరిచే బొమ్మలతో వారి ప్రపంచాన్ని నింపితే, మన ఉద్దేశానికి విరుద్ధమైన ఫలితాలు రావచ్చు. దృష్టి, సృజనాత్మకత పెరగాల్సిన చోటును ప్లాస్టిక్, బ్యాటరీల దృష్టిభ్రమ లతో ముంచేస్తున్నాం. మనమే పిల్లల నుంచే నేర్చు కోవాల్సిన సమయం వచ్చింది. ఒక చెంచాను డ్రమ్‌స్టిక్‌లా మార్చడం, అట్టపెట్టెను కారు చేయడం, గుడ్డ ముక్కను టోపీలా కట్టుకోవడంలో వారికి కలిగే ఆనందం గమనించండి. వారు మనకు ఒక చెబుతున్నారు. ఆటకు బొమ్మతో పనిలేదు.. ఊహాశక్తి ఉంటే చాలు అనే గొప్ప సత్యాన్ని పిల్లలకు మనకు చెబుతున్నారు. దుకాణంలో మెరిసిపోతున్న కొత్త బొమ్మ మనల్ని ఆకర్షించినప్పుడు ఒక్క క్షణం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ బొమ్మను మన పిల్లల కోసం కొంటున్నామా? లేక పదిమంది ఎదుట మన హంగూ, ఆర్భాటాలను ప్రదర్శించుకుంటు న్నామా? అని. మళ్లీ అప్పటి సాదాసీదాతనానికి మనం తిరిగి రాగలమా? కొన్నిసార్లు పిల్లలకు నచ్చే ఆట వస్తువు రంగు రంగుల బొమ్మ పెట్టెలో ఉండదు, వంటగదిలో ఉంటుంది. ఆ వైపుగా ఆలోచిద్దామా?!
