భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
-పుట్టగంటి గోపీకృష్ణ
వారు ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న యువకులు. ఆర్థ్ధికంగా ఏ సమస్యా లేని వాళ్లు. ఉరకలెత్తు తున్న ఉత్సాహంతో ఉప్పొంగుతున్న వాళ్లు. కిక్ కోసం వెతుకుతున్న వాళ్లు. సిగరెట్లు, బీర్లు, డ్రింక్‌లు అన్నీ ప్రయత్నించి చూశారు. దేనిలోనూ వాళ్లకు కోరుకున్న కిక్ దొరక లేదు. బైక్ రేసింగ్, కార్ రేసింగ్ చేసి పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్న వాళ్లు. అది కూడా వాళ్లకు తృప్తిని ఇవ్వలేదు. దగ్గర్లో ఒక పర్వతం ఉందనీ అది ఎక్కటం చాలా కిక్ ఇస్తుందనీ ఎవరో చెప్పారు. వచ్చే ఆదివారం అది కూడా చేసి చూద్దా మనుకున్నారు వాళ్లు.
* * *
ఆ అమ్మాయి వయసు రెండేళ్లకు కొద్దిగా ఉండవచ్చు. కానీ ఆ వయసు పిల్లలతో పోలిస్తే బలహీనంగా ఉంది. శరీరం మీద ఒక పొట్టి గౌను తప్ప ఇంకేమీ లేదు. కాళ్లు, చేతులు ఎండుకు పోయిన సన్నటి పుల్లల్లాగా కనిపిస్తు న్నాయి. వాటి మీద మట్టిమరకలు ఉన్నాయి. జుట్టు తైల సంస్కారం లేక రేగి పోయి ఉంది. ముక్కు నుంచి కారిన చీమిడి చార అలానే ఉంది.
అయినా ఆ అమ్మాయిలో ఎక్కడో ఆకర్షించే గుణం ఉంది. అది ఆ పిల్ల కళ్ల వలన. ఆ కళ్లు చురుకు తనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తనకు ఏదీ ఇవ్వని లోకానికి కూడా ఆనందాన్ని పంచటానికి వచ్చినట్లు ఆహ్లాదంగా ఉన్నాయి.
తన గుడిసె నుండి బయటకు వచ్చిన ఆ అమ్మాయిని ఆకర్షిస్తూ రంగు రంగుల ప్లాస్టిక్ కాగితం ఒకటి ఎగురుతూ వచ్చి అక్కడ పడింది. దాన్ని అందుకోవటానికి ముందుకు నడిచింది తను. అయితే ఆ కాగితం ఈ పిల్లను ఊరిస్తూ ఇంకొంత దూరం గాలికి కొట్టుకు పోయి ఆగింది. అలా ఆ కాగితపు ఆకర్షణలో పడిన అమ్మాయి కింద ఏముందో చూసుకోవటం లేదు. అడుగు తీసి అడుగు వేస్తూనే ఉంది.
హఠాత్తుగా ఆ అమ్మాయి కాలు కింద భూమి తగలలేదు. ఏమయిందో అర్థ్ధమయ్యేలోపు ఒక సన్నటి సొరంగం నుండి భూమిలోకి జారిపోయింది.
‘‘అమ్మా…’’ అని ఆ పసిప్రాణం పెట్టిన కేక గాలిలో కలిసి పోయింది.
* * *
ఆ నలుగురు యువకులు పరవళ్లు తొక్కే వరద ప్రవాహంలా ఉరకలు వేస్తున్నారు.
అప్పటివరకు నడుపుకు వచ్చిన తమ బైకులు దిగి ఎదురుగా ఎత్తుగా కనిపిస్తున్న పర్వతం వైపు చూశారు. మబ్బులను తాకుతున్నట్లు ఉంది పర్వత శిఖరం. కొండ ఎక్కటానికి అనువయిన ట్రెక్కింగ్ దుస్తులు, షూస్ ధరించారు. బైకులు పక్కన పెట్టి ఆలస్యం చేయకుండా కొండ ఎక్కటం మొదలు పెట్టారు.
వారి పేర్లు రాజేష్, మురారి, మహేష్, రాము. తాము చదువుతున్న కాలేజీకి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో, అడవి మధ్యలో ఉంది ఈ ఎత్తయిన పర్వతం. దాన్ని ఎక్కటానికని బయలుదేరి, అనుకున్న సమయానికంటే ఆలస్యంగా అక్కడకు చేరుకున్నారు.
ఆ కొండదాకా చేరుకోవటానికి కాలినడక దారి మాత్రమే ఉంది. దాని మీదే తమ బైకులను అతి కష్టం మీద నడుపుకుంటూ వచ్చారు. నాగరికతకి దూరంగా ఉన్న ఆ ప్రాంతం, కాలుష్యం లేని వాతా వరణంతో, చుట్టూ పచ్చటి ప్రకృతితో ఆహ్లాదంగా ఉంది.
ప్రస్తుతం వారు వంద మీటర్ల ఎత్తు ఎక్కి ఉంటారేమో. కొద్దిగా రెస్ట్ తీసుకోవటానికి ఆగారు. అందరి భుజాలకు బ్యాక్ పాక్‌లు ఉన్నాయి. వాటిలో బిస్కెట్లు, కూల్ డ్రింకులు ఉన్నాయి. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి నోట్లో వేసుకున్నాడు మహేష్?.
ఒక సిగరెట్? వెలిగించాడు మురారి.
ఇంతలో దూరంగా ఏదో కలకలం వినిపిం చింది. మనుషుల అరుపులు గాలివాలున లీలగా వినిపిస్తున్నాయి. అందరూ అటు చూశారు.
కొండకి ఒక పక్కన చిన్న ఊరు ఉంది. ఊరంటే మరీ పెద్దదేమీ కాదు. వంద గుడిసెలు, ఇరవై పెంకు•ళ్లు, రెండు మూడు డాబాలు న్నాయి.
అక్కడి జనం అంతా పెద్దపెద్దగా అరుస్తూ ఆందోళన పడుతున్నారు. కొంత మంది ఏడుస్తున్నారు. అందరు ఒక చోట గుమికూడి దేన్నో ఆత్రుతగా చూస్తున్నారు.
‘‘వాళ్లు ఏదో ఆపదలో ఉన్నట్లున్నారు.’’ అన్నాడు రాము. అతను తక్కువ మాట్లాడతాడు. కానీ, ఒక నిర్ణయం తీసుకుంటే… దానిని ఆచరించే వరకు వెను తిరిగి చూడడు. రాను రాను ఏడుపులు ఎక్కువవు తుంటే, ‘‘పదండి అదేమిటో చూద్దాం…’’ అన్నాడు అతను.
‘‘అక్కడకు వెళ్లి మనం చేయగలిగింది ఏముం టుంది? అసలే ఆలస్యం అయిందని బాధపడు తుంటే…’’ అన్నాడు రాజేష్?.
‘‘ఈ కొండ ఇప్పుడు ఎక్కక పోయినా కొంప మునగదు. అక్కడ వారు ఎంత అపాయంలో లేకపోతే ఇక్కడకు వినపడే అంత ఆక్రందనలు చేస్తారు? తోటిమనిషి బాధలో ఉంటే ఏమీ పట్టనట్లు ఎలా ఉండిపోతాం…?’’ అంటూ వేగంగా కిందకి దిగటం మొదలు పెట్టాడు రాము.
ఇక అతను ఎవరు చెప్పినా వినడు అని మిగిలిన ముగ్గురికి తెలుసు. ఇష్టం లేకపోయినా వారు కూడా అతన్ని అనుసరించారు.
వారు గూడెం చేరుకుని గుమికూడిన జనాల మధ్యకు వెళ్లి చూసేసరికి ఎవరూ చెప్పకుండానే అక్కడ జరిగిందేమిటో అర్థ్ధమయింది. ఏవరో పిల్ల బోరు బావిలో పడింది. ఆరంగుళాల వెడల్పు ఉన్న బోరు అది. అంత చిన్న రంధ్రంలో పిల్లలయినా ఎలా పడతారో నలుగురు స్నేహితులకు అర్థం కాలేదు.
‘‘పిల్లకి రెండేళ్లు కూడా లేవు బాబూ. ఏమీ తినేది కాదు. బక్కగా ఉంటుంది. అందుకే ఇందులో పడి పోయింది…’’ పిల్ల తల్లి ఏడుపుల మధ్యే వారి అనుమానం తీర్చింది.
‘‘మీరంతా ఇలా ఏడుస్తుంటే లోపల పిల్ల ఎంత భయపడి పోతుందో ఆలోచించారా? అందరూ ఏడుపులు ఆపండి…’’ కమాండింగ్‌గా అన్నాడు రాము. అతని మాటలను వెంటనే పాటించారు వారు. అందరూ నిశ్శబ్దం పాటించటంతో, బోరుబావిలోని పిల్ల ఏడుపు వినిపిస్తోంది.
‘‘పోలీసులకి, ఫైర్ డిపార్ట్‌మెంటు వాళ్లకి ఫోన్ చేశారా?’’ అడిగాడు రాము.
అడ్డంగా తల ఊపారు వాళ్లు.
‘‘వాళ్ల ఫోన్ నంబర్ తెలుసా?’’
దానికీ మౌనమే వారి నుండి సమాధానం.
‘‘రాజేష్?! ఆ నంబర్లు కనుక్కుని వారికి ఇన్ఫార్మ్ చెయ్యి…’’ అని అతనికి చెప్పి తన బ్యాక్ ప్యాక్ నుండి టార్చ్ లైటు తీసి బోరుబావిలోకి వేసి చూశాడు. ఎక్కడో లోపల పిల్ల తల కనిపించీ కనిపించనట్లు కనిపిస్తోంది.
‘అమ్మయ్య! పిల్ల నిలువుగానే ఉంది…’ అనుకున్నాడు రాము. ఊపిరి తీసుకోవటానికి ప్రస్తుతానికి పిల్ల ఇబ్బంది పడుతున్నట్లు లేదు. కానీ… కాసేపటి తరువాత అంత లోతులో ఆక్సిజన్ అయిపోవచ్చు.
వారి దగ్గర ఒక తాడు తీసుకుని దాని చివర ఒక రాతిని కట్టి బోరు బావిలోకి దించాడు రాము. దాదాపు అది లోపల ఉన్న అమ్మాయి తలకి తగిలిందని నిశ్చయించుకున్న తరువాత పైకి లాగి తాడు పొడవు కొలిస్తే.. ఆ అమ్మాయి పాతిక అడుగుల లోతున ఉందని తేలింది.
‘‘ఒక రకంగా అదృష్టమే. మరీ ఎక్కువ లోతులో పడలేదు. ఆక్సిజన్ అందిస్తుంటే ఇప్పటికిప్పుడు ప్రాణానికి ప్రమాదం ఉండదు…’’ అనుకున్న రాము, ‘‘దగ్గర్లో ఎవరయినా డాక్టరు కానీ హాస్పిటల్? కానీ ఉన్నారా? ఆక్సిజన్ సిలిండర్? కావాలి…’’ అడిగాడు ఊర్లో వారితో.
‘‘దగ్గర్లో అంటే… రాఘవపురంలో ఉంటాడు’’ చెప్పాడు ఒకడు.
‘‘మహేష్! నువు బైకు మీద వీరిలో ఒకరిని ఎక్కించుకుని వెళ్లు. అర్జంటుగా ఒక ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని రా… బోరు బావిలోకి ఆక్సిజన్ పంపటానికి వీలుగా ముప్పై అడుగుల ట్యూబ్ కూడా కావాలి…’’ అన్నాడు రాము.
మహేష్! ఊరిలో ఒక వ్యక్తిని వెనుక కూర్చో పెట్టుకుని తన బైకును రాఘవపురం వైపు దూకించాడు.
ఇంతలో రాజేష్ వచ్చి, ‘‘అందరికీ ఫోన్ చేసి చెప్పాను. ఇక్కడికి రావటానికి రోడ్డు మార్గం లేదు కాబట్టి, వారు వచ్చేటప్పటికి ఏ సమయం అవుతుందో ఎవరూ చెప్పలేమంటున్నారు…’’ అన్నాడు.
అప్పటిదాకా ఫోన్ చూస్తూ కూర్చున్న మురారి, ‘‘ఇలా బోరుబావిలో పడిన పిల్లలను బయటకు తీయాలంటే… ఆ బావికి సమాంతరంగా మరో బావి తవ్వి, రెండు బావుల మధ్య సొరంగం ఏర్పాటు చేస్తే పిల్లను బయటకు తీసుకు రావచ్చు…’’ నెట్‌లో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని చెప్పాడు.
‘‘అవును. అదొక్కటే మార్గం. కానీ ఈ దుర్గమ మైన ప్రదేశానికి ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికి చేరుకుంటుందో? అప్పటిదాకా మనం ఖాళీగా ఎందుకు కూర్చోవాలి? మనమే మరో బావిని సమాంతరంగా తవ్వుదాం…’’ అన్నాడు రాము.
‘‘చేతుల్తో తవ్వాలంటే రోజులు పడుతుంది. జేసీబీ ఉంటే పని సులువుగా అవుతుంది అన్నాడు మురారి. తరువాత ఊర్లో వాళ్లని చూస్తూ, ‘‘ఇక్కడ దగ్గర్లో ఎక్కడయినా జేసీబీ ఉందా?’’ అని అడిగి అదేమిటో కూడా వారికి తనే వివరిం చాడు.
‘‘కొండ కాడ బోలెడు ఉన్నాయి సార్? వానాకాలం నదిలో నీళ్లు పారుతున్నపుడు పడవల మీద తెచ్చి అక్కడ పెట్టాడు కాంట్రాక్టర్ ఏదో డ్యామ్ కట్టటానికి చెట్లు కొట్టి నేల చదును చేస్తున్నారు…’’ చెప్పాడు ఒకతను ఉత్సాహంగా.
‘‘అయితే ఒకటి తెద్దాం పదండి…’’
‘‘కానీ ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు సారూ. వాళ్లని అన్నలు తన్ని తరిమి కొట్టారు…’’
‘‘జేసీబీ అయితే ఉంటుంది కదా…’’ అంటూ మురారి ముందుకు దారి తీశాడు.
మరోగంట తరువాత మహేష్ బైకు మీద ఒక ఆక్సిజన్ సిలెండర్ తీసుకు వచ్చాడు. దానికి గొట్టాన్ని బిగించి బోరు రంధ్రం నుండి లోపలకు వేలాడ తీశారు. అది దాదాపు లోపల ఉన్న పిల్ల దగ్గరకు వెళ్లింది అనుకున్న తరువాత నాబ్ తిప్పి ఆక్సిజన్ లోపలకు వదలటం మొదలు పెట్టారు.
‘‘ఇంకో రెండు మూడు సిలిండర్లు వెనుక వస్తున్నాయి…’’ చెప్పాడు మహేష్?.
ఇంతలో దుమ్ము రేపుతూ జేసీబీ వచ్చింది. బోరుబావి దాకా నడుపుకుంటూ వచ్చిన మురారి ఎగిరి కిందకు దూకాడు. ‘‘అక్కడ సైటు దగ్గర ఒక గదిలో డీజిల్ డబ్బాలు ఉన్నాయి. తాళం పగులగొట్టి అవి కూడా తెచ్చాం…’’ గర్వంగా డీజిల్ డబ్బాలు చూపిస్తూ చెప్పాడు.
నిజమే డీజిల్ లేకపోతే జేసీబీ ఉన్నా ఉపయోగం ఏమి ఉంది?
ఇక మిగిలింది సమాంతరంగా తవ్వాల్సిన బోరుబావి పని. నాలుగు రకాల ఇంజినీరింగ్ చదివుతున్న నలుగురు స్నేహితులు కలిసి బోరుబావికి అయిదు అడుగుల దూరంలో మరో బావిని తవ్వటానికి మార్క్ చేశారు.
మురారి ఉత్సాహంగా మరోసారి జేసీబీ ఎక్కాడు. ఒక అరగంటలో అతను ఎక్సపర్ట్ అయి పోయాడు. ఇప్పుడు అతని చేతిలో ఆ యంత్రం చకచకా కదులు తోంది. భూమిని తవ్వి మట్టిని పక్కన పోస్తోంది.
బావిలో పడిన పిల్ల ఏడుపులు ఇప్పుడు ఆగిపో యాయి. బహుశా నీరసం వచ్చి ఉంటుంది. తల్లి తండ్రులు అప్పుడప్పుడూ, ‘‘లచ్చీ! వినిపిస్తుందా?’’ అంటుంటే, ‘‘ఊ…’’ అని సమాధానం మాత్రం ఇస్తోంది.
ఇంతలో పొద్దుపోతుండటం గమనించిన రాము, ‘‘రాజేష్! చీకట్లో పని సాగదు. ఫ్లడ్ లైట్లు కావాలి…’’ అన్నాడు.
‘‘సైటు దగ్గర లైట్లు ఉన్నాయని మురారి చెప్పాడు. వాటిని ఇక్కడకు తెచ్చి ఊరిలోని కరంటు తీగలకు కనెక్ట్ చేస్తాను…’’ అంటూ బయలుదేరాడు రాజేష్.
‘‘జాగ్రత్తగా చేయగలవు కదా…’’ అంటున్న రాముకు బొటన వేలు ఎత్తి చూపించి వెళ్ళిపోయాడు రాజేష్.
గంట మీద గంట గడుస్తోంది. మురారి చేతిలో ఎక్సవేటర్ పెంపుడు కుక్కలా మాట వింటోంది. పక్కన కుప్పలా పడుతున్న మట్టికొండ గుట్టలా తయారవుతోంది.
ఇంతలో మళ్లీ పిల్ల తల్లితండ్రులు ఘొల్లుమన్నారు.
‘‘ఏమయింది?’’ అని అడిగిన మహేష్‌తో, ‘‘లోపల పిల్ల పలకటం లేదు బాబూ…’’ అంటూ మరింత పెద్దగా ఏడవటం మొదలు పెట్టారు.
‘‘ఆ అమ్మాయి నిద్రపోయి ఉండవచ్చు. మీరు ఏడవకండి…’’ అని చెప్పినా వారు వినటం లేదు.
ఇదంతా చూసిన మహేష్‌కి ఒక ఆలోచన వచ్చింది. తమ దగ్గర ఉన్న ఒక మొబైల్‌తో ఇంకో మొబైల్‌కి కాల్‌చేసి, కనెక్ట్ అయిన తరువాత ఒక మొబైల్‌ని తాడుకట్టి బోరుబావిలోకి దింపాడు. అది పిల్ల దగ్గగా వెళ్లడంతో పిల్ల తీస్తున్న ఊపిరి ఇప్పుడు ఇంకొక మొబైల్‌లో స్పష్టంగా వినిపిస్తోంది.
‘‘ఇదిగో! ఏడవకండి. ఇది వింటూ ఉండండి. మీ పిల్ల ఊపిరి తీస్తూనే ఉంది…’’ అంటూ రెండో మొబైల్ వారికి ఇచ్చాడు.
ఇంతలో పొద్దు పోయింది.
ఈలోపు రాజేష్ ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు చీకటిని ఆ దరిదాపుల్లోకి రాకుండా పారదోలాయి.
మరి కొంతసేపటికి ఆక్సిజన్ సిలెండర్ అయి పోవటంతో మరో సిలెండర్ బిగించారు.
బావికి సమాంతరంగా దాదాపు ఇరవై అడుగుల తవ్విన తరువాత మొదటి అవాంతరం ఏర్పడింది. ‘‘ఇక జేసీబీ ఇంత కంటే లోతు తవ్వ లేదు…’’ అంటూ చెప్పాడు మురారి.
ఈలోపు మహేష్ జరుగుతున్న తతంగాన్నంతా ఫే•స్‌బుక్‌లోకి అప్‌లోడ్? చేసి లైవ్ ఇస్తున్న సంగతి ఎవరూ గమనించలేదు.
ఒక పసిపిల్ల కోసం నలుగురు యువకులు పోరాడుతుంటే, ప్రభుత్వ యంత్రాంగం నిద్ర పోతుందా? అన్న విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. దానితో ప్రభుత్వ అధికారులు కూడా సంఘటనా స్థలానికి బయలుదేరక తప్పలేదు.
‘‘ఆ అమ్మాయి ఇంకా అయిదడుగుల లోతులో ఉంది. మనం కనీసం ఏడెనిమిది అడుగులు ఇంకా తవ్వాలి. అందరం కలిస్తే అది పెద్ద పని కాదు…’’ అన్నాడు రాము.
‘‘మీరు మాకోసం ఇంత చేస్తున్నారు. ఈ పని మేము చెయ్యలేమా?’’ అంటూ ఊర్లో అందరూ పలుగూ, పారా తీసుకుని ముందుకు వచ్చారు. కొంత మంది తవ్వుతుంటే, కొంత మంది మట్టి ఎత్తి పోస్తుంటే అర్ధరాత్రికి అనుకున్న లోతుకు చేరుకున్నారు.
ఒక సీసాలో పాలు పోసి తాడు సాయంతో దానిని సొరంగంలోకి పంపారు. కానీ అది పసిపాప వరకు చేరిందో, చేరినా ఆ పాప తాగగలిగిందో లేదో తెలిసే అవకాశం లేదు.
నలుగురు స్నేహితులు పూర్తిగా అలసి పోయారు. అయినా ఎవరూ పని ఆపలేదు. పసిపిల్లని ప్రాణాలతో బయటకు తీసుకు వచ్చేవరకు విశ్రమించ కూడదని తమకు తాము శపథ•ం చేసుకున్నారు.
రాత్రి ఎంత సమయం అయిందో ఎవరూ చూసుకోవటం లేదు. ఊరిలో ఒక్కరు కూడా నిద్ర పోలేదు. అందరి లక్ష్యం ఒక్కటే… పసిదాన్ని బయటకు తియ్యాలి.
‘‘ఇప్పుడు అసలు పరీక్ష. ఈ బావి నుండి ఆ బావికి అడ్డుగా అయిదు అడుగుల దూరం సొరంగం తవ్వాలి. జాగ్రత్తగా తవ్వాలి. మట్టిపెళ్లలు విరిగి పడే అవకాశం ఉంటుంది…’’ అంటూ తను ముందుకు వచ్చాడు రాము. తన నడుముకు ఒక తాడు కట్టుకుని దానిని రాజేష్‌కి ఇచ్చాడు. చిన్న పారతో రెండు బోరుబావులను కలుపుతూ సొరంగం తవ్వటం మొదలు పెట్టాడు. కొద్దిగా దూరం తవ్వాడో లేదో మట్టి పెళ్లలు విరిగి అతని మీద పడ్డాయి. అతను నడుముకు తాడు కట్టుకుని ఉండటంతో రాజేష్ మట్టి కింద నుండి రామును వెనక్కి లాగాడు.
‘‘ఇక్కడ మట్టి మెత్తగా ఉంది. సొరంగం నిలబడటం కష్టం…’’ అన్నాడు మురారి అందరూ తేరుకున్న తరువాత.
ఇంతలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడకు వచ్చారు. నలుగురు యువకులు ఏ సహాయం లేకుండా ఎంత పని చేశారో చూసి నోరు వెళ్లబెట్టారు.
అప్పుడు మహేష్ మరో ఆలోచనతో ముందుకు వచ్చాడు. ‘‘మట్టి పెళ్లలు విరిగి పడకుండా ఉండాలంటే, సీలింగ్ సపోర్ట్ ఉండాలి. కానీ మనకు ఉన్న అతి తక్కువ సమయంలో అది వీలుకాదు. మన దగ్గర ఖాళీ అయిన డీజిల్ పీపాలు ఉన్నాయి. సొరంగాన్ని డీజిల్ పీపా సైజులో తవ్వాలి. ఏర్పడిన రంధ్రంలో పీపా పెట్టాలి. అప్పుడు పైనుంచి మట్టిపెళ్లలు కింద పడవు. మనిషి పీపాలో నుండి దూరి మరింత సొరంగం తవ్వాలి. ఒక దాని వెనుక ఒకటిగా మూడు పీపాలు పెడితే అయిదడుగుల దూరం కవరవుతుంది…’’ అని చెప్పాడు.
అతను చెప్పిన విధంగా తవ్వుతూ పోయాడు రాము. మొదటి పీపా వరకు పెద్ద కష్టం కాలేదు. కానీ, తరువాత పీపాలో దూరి తవ్వాలంటే నరకం కనిపించింది. నడుము పట్టుకు పోతోంది. అతను ఒక అరగంట తవ్విన తరువాత మురారి బలవంతంగా రామును బయటకు లాగి తను తవ్వే పనిలో పడ్డాడు.
బోరులో ఉన్న పసిపాప ఊపిరి తీస్తుందో, లేదో తెలియటానికి లోపలకు పంపిన మొబైల్ చార్జ్ అయిపోవటంతో పనిచేయటం మానివేసింది. ఈలోపు ప్రభుత్వ అధికారులతో అక్కడకు చేరుకున్న డాక్టర్ ఎలక్ట్రానిక్ స్టెతస్కోప్ తెచ్చాడు. దాని సాయంతో దాదాపు ముఫ్ఫై అడుగుల దూరంలో ఉన్న శబ్దాలను కూడా వినవచ్చు. దానిని బోరు బావిలోకి పంపి పసిపాప ఇంకా బతికే ఉందని నిర్ధారణ చేసుకున్నారు.
ఆ మాట ఇచ్చిన ఉత్సాహం వారిలో ఆవిరయిన శక్తిని మళ్లీ సమకూర్చింది.
మరో రెండు గంటలు అందరు వంతులు వారీగా కష్టపడ్డ తరువాత వారు తవ్వుతున్న మార్గాన్ని బోరుబావికి కనక్ట్ చేయగలిగారు. ఇక మిగిలిన ఆఖరి అంకం పూర్తి చేయటానికి రాము సొరంగంలోకి వెళ్లాడు. బోరుబావి రంధ్రం నుండి జాగ్రత్తగా చెయ్యి పైకిపెట్టి పసిపిల్ల కోసం తడిమాడు. చేతి చివర్లకు మెత్తగా తగిలింది. అది కాలు అని అర్థమైంది. దాన్ని పట్టుకుని కొద్దిగా కిందకు లాగాడు. పసిపిల్ల రాలేదు. గట్టిగా లాగుదామంటే పాపకు ఎక్కడ గాయాలు అవుతాయో అన్న భయం.
పై నుండి ‘ఏమయింది, ఏమయింది?’ అన్న అరుపులు వినిపిస్తున్నాయి.
వారికి సమాధానం చెప్పకుండా కొద్దిగా అటుఇటూ కదిలించాడు. ఒక కోణంలో కదిలినపుడు పసిపిల్ల ఒక్కసారిగా కిందకు జారి అతని చేతుల్లో పడింది.
వెంటనే ఆమెను వెనక్కి తీసుకు వచ్చాడు. పాతిక అడుగుల గోతిలో నుంచి ఆ పాపను ప్లాస్టిక్ బకెట్‌లో కూర్చోపెట్టి పైకి లాక్కున్నారు.
పైన ఉన్న డాక్టర్ ఆ పాపను పరీక్షించి, ‘‘బ్రతికే ఉంది…’’ అన్నాడు. ఆ అమ్మాయిని అప్పటికప్పుడు రాఘవపురం తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాము గోతి నుండి బయటకు వచ్చేటప్పటికి దాదాపు స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు. అతన్ని ఏదో ఒక గుడిసెలోకి తీసుకు వెళ్లారు. అతని ముగ్గురు మిత్రులు కూడా పూర్తిగా అలసిపోయి ఉన్నారు. ఊరి జనాలు చూపించిన స్థలంలో పడుకున్నారు. ఇలా పడుకున్నారో లేదో అలా నిద్రపోయారు. ఎన్ని గంటల తరువాత మెలకువ వచ్చిందో తెలియదు.
‘‘అయ్యా! మీ వలన నా కూతురు బ్రతికిందయ్యా…’’ అంటున్నారు పసిపిల్ల తల్లి, తండ్రి.
ఆ వార్త విన్న వారి అలసట ఉఫ్ఫున ఊదినట్లు ఎగిరి పోయింది.
‘‘ఇప్పటివరకు నిజమయిన కిక్ కోసం ఎదురు చూశాం. మరో ప్రాణిని కాపాడటంలో ఉన్న ఆనందం ముందు ఏ కిక్ అయినా బలాదూరే…’’ అనుకున్నారు వారు ఒకరితో ఒకరు.