తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారక్కల ద్వైవార్షిక జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా వినుతికెక్కింది. ఈ జాతర నిర్వహణ నేపథ్యంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాకతీయ పాలకులు విధించే అన్యాయపు పన్నులకు వ్యతిరేకంగా, తమకు మద్దతుగా ప్రాణాలర్పించిన ఆ తల్లీ కూతురిని స్మరించుకుంటూ అడవి పుత్రులు ఈ జాతర ప్రారంభించారని ఒక వాదన కాగా, తనవల్ల సమ్మక్క కుటుంబం బలైపోయిందన్న పశ్చాత్తాపంతో కాకతీయ చక్రవర్తి ప్రతాప రుద్రుడు ఈ జాతరకు శ్రీకారం చుట్టారని చెబుతారు. ఈసారి ఈ నెల (జనవరి) 28వ తేదీ నుంచి నాలుగురోజుల పాటు ఈ మహోత్సవం జరుగుతుంది.

ఈ ‌నెల (జనవరి) 28 నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర నిర్వహిస్తారు. మొదటిరోజు సారలమ్మకు ప్రతి రూపంగా భావించే పసుపు భరిణను కన్నెపల్లి నుంచి తీసుకువస్తారు. ఆమెతో పాటు భర్త గోవింద రాజులు గద్దెపైకి చేరుకుంటారు. మరునాడు సమ్మక్కకు ప్రతిరూపంగా తలచే కుంకమ భరిణిని చిలకలగట్టు నుంచి తీసుకువస్తారు. వనదేవతలను గద్దె మీదకు చేర్చే సమయంలో పోలీసులు గౌరవ సూచకంగా గాలిలో కాల్పులు జరుపుతారు.. మూడవ నాడు ప్రధాన ఉత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఆ మరునాడు తల్లీకూతుళ్లు (సమ్మక్క, సారలమ్మ) వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ నాలుగు రోజు అంబరాన్ని అంటే సంబరంతో ఆ ప్రాంతం జనసంద్రమే అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్‌గడ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, ఒడిషా తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇప్పటికే ముందస్తు మొక్కులు చెల్లించుకొంటున్నారు. ఈ మహాజాతర తరువాత వారం పాటు నిర్వహించే వేడుకలను ‘తిరుగువారం’ వేడుక అంటారు. మహా జాతరలో తెలిసో, తెలియకో అపరాధం, అపచారం చోటు చేసుకుంటే ‘అమ్మల’ మన్నింపును కోరుతూ ఈ వేడుక నిర్వహిస్తారు. వంశపారపర్యంగా గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు. కోయ తెగకు చెందిన 12 రకాల వారిలో రాచ కోయలు ఈ జాతర నిర్వహిస్తారు. ఈ పూజారులను ‘వడ్డెలు’ అంటారు.
కుంభ మేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది.
సమ్మక్క వృత్తాంతం
సమ్మక్క జననానికి సంబంధించి కొద్దిపాటి మార్పులతో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె భూమిలో ఒక పెట్టెలో లభ్యమైనట్లు ఒక కథ ప్రచారంలో ఉండగా, వేటకోసం వెళ్లిన కోయ దొరలకు, అడవిలో పెద్దపులుల కాపలా మధ్య దేదీప్య మానంగా వెలిగిపోతున్న పసిపాప దొరికినట్లు మరో కథనం. జనులను ఉద్ధరించేందుకు ఆదిశక్తి అవతారా లలో ఒక్కటైన వనదుర్గే సమ్మక్క రూపంలో కోయవారి ఇంటచేరిందనీ విశ్వసిస్తారు. సమ్మక్క పెద్దవుతున్న కొద్దీ మేడారంలో అనేక శుభపరిణామాలు చోటు చేసుకోవడం, ప్రజలు కోరినవి నెరవేరడంతో ఆమెను దేవతగా పూజించసాగారు. సంతానంలేని మేడ రాజుకు చిన్నారి అడవిలో దొరకగా, ఆమెను దైవప్రసా దంగా భావించి సమ్మక్క అనే పేరుతో గారాబంగా పెంచారు. సమ్మక్కను తన మేనల్లుడు పడిగిద్దరాజుతో వివాహం జరిపించగా, ఆ దంపతులకు కూతుళ్లు (సారలమ్మ, నాగులమ్మ) కుమారుడు జంపన కలిగారు. మేడారం ప్రాంతంలో మూడు నాలుగేళ్లు అనావృష్టి పరిస్థితి నెలకొని, ప్రజలు పన్నులు చెల్లించలేని దయనీయత. పగిడిద్దరాజు కూడా పన్నులు చెల్లించలేక అశక్తత వ్యక్తంచేశారు. సామంతు లను కట్టడి చేయడంతో సామ్రాజ్య విస్తరణ లక్ష్యంతో ప్రతామరుద్రుడు వారిపై యుద్ధం ప్రకటించాడు. ఆయన సైన్యాన్ని పగిడిద్దరాజు, కుటుంబసభ్యులు మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువ రించారు. పగిడిద్దరాజు, ఒక కూతురు నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు మరణించారు. పరాజయాన్ని జీర్ణించుకోలేని జంపన్న ఆ వాగులో పడి ప్రాణ త్యాగం చేశారు. (నాటి నుంచి ఆ జలవనరు ‘జంపన్న వాగు’గా ప్రాచుర్యంలోకి వచ్చింది). అయిన వారి అస్తమయ సమాచారం తెలిసి సమ్మక్క అపరకాళికే అయ్యింది. కూతురు సారలమ్మతో కలసి పోరుకు దిగింది. కాకతీయ సేనలకు ముచ్చెమటలు పట్టిం చింది. ఆ వీరవనిత చేతిలో ఓటమి తప్పదని భీతిల్లిన కాకతీయ సైనికుడు ఒకరు బల్లెంతో ఆమెను దొంగ దెబ్బ తీశాడు. రక్తసిక్తమైన దేహంతో ఆమె మేడారానికి ఈశాన్య దిశగా చిలకలగుట్టవైపు గల గుహలోకి వెళ్లి అదృశ్యమైంది. ఆమెను వెదకుతూ వెళ్లిన అనుచరు లకు ఒక నాగవృక్షం సమీపంలోని పుట్ట వద్ద పసుపు – కుంకుమలతో భరిణెగా కనిపించగా దానిని సమ్మక్కకు ప్రతిరూపంగా భావించారు. నాటి నుంచి ఆ భరిణతో ఏటా జాతర జరుపుకుంటున్నారు. మేడారానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని బయ్యక్కపేట గ్రామానికి చెందిన గిరిజనుడి ఆధ్వర్యంలో మొదటి జాతర జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు, ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు.
అశేష జనవాహినికి సమ్మక్కపై, ఆమె కుటుంబంపై గల ఆరాధనను, వారికి తన వల్ల కలిగిన ఆపరాధానికి చింతించిన ప్రతాపరుద్రుడు మేడారం చేరి, జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని మేడారంను కోయదొరల స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తాడు. సమ్మక్క పేరున ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నాడు ముత్తయిదువుల పండుగగా, రెండేళ్లకు ఒకసారి జాతరను వైభవంగా జరుపుకునేలా ఆదేశం ఇచ్చి, అందుకు అవసరమైన నిధులు కేటాయించి, తాను కూడా భక్తుడయ్యాడని చారిత్రక కథనం.
మొక్కుబడులు-ప్రసాదం
భక్తులు, బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని కానుక/ముడుపుగా చెల్లిస్తారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు బెల్లంను తులాభారంగా సమర్పించుకుంటారు. అలా నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని భక్తులందరికి పంచుతారు. వడిబాలు, బియ్యం, కొబ్బరికాయలు, పసుపు-కుంకుమలు, వస్త్రాలు, బోనాలు తదితరాలనూ సమర్పించుకుంటారు. కోడెలను కానుకగా సమర్పించడం ఈ జాతరలో మరో ప్రత్యేకత. గద్దెమీది బెల్లం స్వీకరిస్తే దీర్ఘకాల వ్యాధులు నయమవుతా యని, అక్కడి కుంకుమను పొందితే సంతానప్రాప్తి, మోక్షం కలుగుతాయని భక్తుల నమ్మకం. అమ్మవార్లు గద్దెలపైకి వస్తున్న సమయంలో మొక్కితే సంతానయోగం ఉంటుందని కూడా భావిస్తారు. సమ్మక్కను తీసుకువస్తున్న వారికి అడ్డంగా పడుకొని, పూజారులు తమ మీదుగా నడచివెళితే జన్మ తరించినట్లుగా విశ్వసిస్తారు. ఈ జాతరలో ‘శివసత్తుల’ పూనకాలు ఉత్కంఠ కలిగిస్తాయి. జాతర సమయంలో సారా తాగడాన్ని గిరిజనులు పవిత్ర కార్యంగా భావిస్తారు. మద్యపానం, మాంస భక్షణలకు మొక్కుబడులు చెల్లించేంత ప్రాధాన్యం ఉందని వారి వాదన.
శివశక్తులు-పూనకాలు
మేడారం జాతరలో శివశక్తులు (పూనకాలు) ప్రధాన ఆకర్షణగా ఉత్కంఠ కలిగిస్తారు. జంపన్న వాగులో స్నానం చేస్తుంటేనే వారికి పూనకం వస్తుంటుంది. కొత్తచీర, రెండు రవికలు ధరించి, చేతుల నిండా గాజులు, బొట్టు (మగవారు కూడా), ఒడి బియ్యంతో, తల వెంట్రుకలు విరబూసు కుని శివాలెత్తే దృశ్యం ఉత్కంఠ కలిగిస్తుంది. పూనకంతో ఊగే మహిళలు భవిష్యత్‌ ‌గురించి, ప్రకృతి వైపరీత్యాల గురించి చెబుతుంటారు. భక్తులు ఆ పలుకులను సాక్షాత్తు సమ్మక్కవిగానే విశ్వసిస్తారు. వారిని తృప్తిపరచేందుకు పెద్ద సంఖ్యలో మేకలు, కోళ్లను బలి ఇస్తారు.
మేడారానికి మహర్దశ
ఈ జాతరను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది రూ.251 కోట్లతో మేడారం సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. గద్దెల విస్తరణకే రూ 101 కోట్లు కేటాయించింది. గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్ఠంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. 4 వేల టన్నుల గ్రానైట్‌తో గద్దెల ప్రాంగణ నిర్మాణ పనులు చేపట్టారు. 46 స్తంభాలతో 271 చ.మీ విస్తీర్ణంలో ప్రాకారం. 8 స్తంభాలతో వృత్తాకార గద్దె నిర్మాణం చేపట్టారు. 40 అడుగుల వెడల్పుతో 3 స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న చెట్లను తొలగించకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బండారి, మర్రి, వెదురు, వేప, ఇప్ప తదితర 12 రకాల పవిత్ర వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. 46 స్తంభాలతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండ నుంది. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో మూడు, 30 అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలుం టాయి. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం నిర్మిస్తున్నారు.
శిలలపై ‘తల్లుల’ చరిత్ర

సమ్మక్క-సారక్క తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా శిలలపై చెక్కించారు. కోయల వద్ద దొరికిన 930 ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెక్కించిన శిల్పాలు, చిహ్నాలు. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క, సారక్క పగిడిద్దరాజు, గోవిందరాజు, కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్ష్యాదులతోపాటు కోయల జీవనశైలికి, ఆచార సంప్రదాయాలకు, గొట్టు గోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది.
కాకతీయుల కాలం నుంచి కొనసాగుతూ వస్తోన్న ఈ జాతర నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతను ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం 1961లో చేపట్టింది. 1996లో ‘రాష్ట్ర ఉత్సవం’ (స్టేట్‌ ‌ఫెస్టివల్‌)’‌గా ప్రకటించింది. దీనిని జాతీయ ఉత్సవంగా గుర్తించా లని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE