భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన
అల్లూరి గౌరిలక్ష్మీ
నేను ఈ సంక్రాంతికి ఇక్కడ ఉండను,తాతమ్మ ఊరికి అదే ‘ఉండి’ వెళతాను తాతయ్యా!’’ అంటూ బాంబు పేల్చింది ఎంబీబీఎస్ చదివి హౌస్ సర్జన్ చేస్తున్న మైత్రి. తమ్ముడు హరితో కలిసి హైదరాబాద్ నుంచి నిన్ననే విజయవాడ వచ్చింది. భర్తకీ, మనవడికీ, మనవరాలికీ వడ్డన చేస్తున్న నానమ్మ సరస్వతి అవాక్కయింది. ఆమె భర్త శేషగిరి కూడా భోజనం చేయడం ఆపి నీళ్లు తాగాడు.
‘‘ఏమిటే! నీకు మాకన్నా మా అమ్మ ఎక్కువ యిందా? పండక్కి వెళ్తానంటున్నావ్ ?’’అన్నాడు నవ్వుతూ.
‘‘ఏం లేదు తాతయ్యా! హైదరాబాదులో మోడరన్ జనాన్ని చూసి మొహం మొత్తి ఆ పల్లెటూరికి వెళ్లాలనుకుంటోంది.ఈమధ్య తెలుగు సినిమాల్లో పల్లెటూరిలో ఉండే తోటలు, చేలు, చెరువులు, బాతులు ఉండే కలర్ ఫుల్ సినిమాలు వస్తున్నాయి. వాటిల్లో చాలా అమాయకంగా ఉండే హీరో ఒకడుంటున్నాడు. కాలేజీలో అబ్బాయిల్ని బాగా ఏడిపించి, ఏడిపించి బోర్ కొట్టి ఫర్ ఎ చేంజ్ విలేజ్‌లో కుర్రాల్లు ఎలా ఉన్నారో చూద్దామని బయలు దేరు తోందనుకుంటా !’’ అన్నాడు బీటెక్ చదువుతున్న మనవడు హరి.
‘‘నా గురించి కామెంట్స్ చేశావంటే పీక పిసుకుతా!’’ అంది మైత్రి.
‘‘ఏమిటే ఆ మాటలు! తమ్ముణ్ణి అలా అనొచ్చా!’’ అని సరస్వతి నొచ్చుకుంటూ.
‘‘అక్కని వాడు అలా వెక్కిరించొచ్చా’’ అంటూ నానమ్మ గొంతుని అనుకరిం చింది మైత్రి.
శేషగిరికి ఆపుకోలేని నవ్వొచ్చింది.‘‘నన్నెవరైనా వెక్కిరిస్తే ఎంతానందమో!’’అంది సరస్వతి కోపం నటిస్తూ. ‘‘అది సరేగానీ.. మా అమ్మ నీ మనసు ఎప్పుడు దోచిందోయ్?’’ అన్నాడు శేషగిరి.
‘‘చిన్నతాతయ్య గారి ఇంట్లో పెళ్లి జరిగింది కదా! అప్పుడు తాతమ్మ, తన దగ్గరికి వస్తానని నాతో చేతిలో చెయ్యి వేయించుకుని మాట తీసుకుంది.ఇప్పుడు సెలవులు ఉన్నాయి కాబట్టి వెళ్తున్నా!’’
‘‘సరే! అలాగే వెళ్లిరా! అన్నాడు శేషగిరి మనస్ఫూర్తిగా.
‘‘మనవడు,మనవరాలు పండక్కొస్తున్నారని వారం రోజుల నుంచీ తాడిగడపలోని తమ సొంత ఇంటిని చక్కగా అలంకరించి, ఇంటి నిండా పిండి వంటలు చేసి ఎదురుచూస్తున్న సరస్వతికి చాలా ఆశాభంగం అయింది. అయినా ‘పెద్దావిడ సంతోషపడుతుందిలే!’ అని సరిపెట్టుకుంది. మర్నాడు తను చేసిన పిండి• వంటలన్నీ ప్యాక్ చేసి కార్లో పెట్టింది.
‘‘నువ్వు లేకపోతే నేనిక్కడ హాయిగా ఉంటాను వెళ్లిరా!’’ అంటూ హరి ‘బై’ చెప్పాడు అక్కకి. తల్లికి ఫోన్ చేసి మైత్రి వస్తున్న విషయం చెప్పాడు శేషగిరి. డ్రైవర్‌కి అలవాటే గనక మైత్రిని భీమవరం దగ్గర ఉన్న ‘ఉండి’ గ్రామంలో దింపడానికి బయలు దేరాడు.
-2-
శేషగిరి, సరస్వతిల కొడుకు రామకృష్ణ హైదరా బాద్‌లో, ఓ కాలేజీలో, లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. కోడలు కూడా తెలుగు లెక్చరర్. మైత్రి, హరి వాళ్ల పిల్లలు. శేషగిరి తండ్రి రామారావు స్వగ్రామం ‘ఉండి.’ ఆయన కాలం చేసి పదేళ్లయింది. తల్లి నారాయణమ్మకి ఎనభైఐదు పైనే ఉంటుంది వయస్సు. పొలం కౌలుకిచ్చి ‘ఉండి’లో ఒక్కతే ఉంటోంది. ఏకైక సంతానం కొడుకు శేషగిరి దగ్గరికి వెళ్లినా ఒకటి రెండు రోజులే. సరిపడా, ఎత్తూ, లావుతో, పచ్చని శరీరంతో, నుదుట విభూతితో నిండుగా ఉంటుంది నారాయణమ్మ. నీలంరంగు జరీ అంచున్న తెల్లని చీరా, జాకెట్టూ కట్టుకుంటుంది. మెడలో చంద్ర హారం, రెండు చేతులకీ చెరో నాలుగు బంగారు గాజులూ వేసుకుంటుంది.
ఆమెకు వంటచేసి పెట్టి ఇల్లుసర్దడానికి వంటావిడ, గిన్నెలు తోమి, ఇల్లు తడిబట్టవెయ్యడానికి పనమ్మాయి, ఇంటిచుట్టూ వాకిలి తుడిచి శుభ్రం చేస్తూ అవసరమైన బయట చెయ్యడానికి ఒక మగమనిషి ఉంటారు.చుట్టూ ఎతైన ప్రహరీగోడ ఉన్న పెద్ద ఇల్లు. ఆవిడ ఓ నాలుగు గదులు ఉంచుకొని మిగిలిన వాటికి తాళాలు పడేసింది. ఆవిడకి ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. సహాయకుల ప్రాణం తీసి తన శుభ్రతని కొనసాగిస్తుంది. వాకిలి నిండా పూల మొక్కలుంటాయి.ఆమెకి ప్రతిరోజూ పూజకి పూలుండాలి.
రాత్రి ఏడుగంటలకి కారులో తాతమ్మ ఇంటికి చేరిన మైత్రిని వంటమ్మాయి హారతితో ఎదురొచ్చి దిష్టితీసి లోపలికి తీసుకెళ్లింది. గడపలోపల నారాయ ణమ్మ నవ్వుతూ వళ్లంతా కళ్లు చేసుకుని చూస్తోంది. మునిమనవరాలిని దగ్గరికి తీసుకుని ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యిందామె. కుశల ప్రశ్నలయ్యాక ఇద్దరికీ భోజనం వడ్డించింది వంటామె. మైత్రి టీవీ చూస్తుంటే తాను కూడా కొంతసేపు చూసి ‘‘పడుకుందామా!’’ అంటూ పడకగదిలోకి దారితీసింది నారాయణమ్మ. ఆమె పట్టెమంచం వి•ద పడుకుంది. పక్కనే తెల్లని దుప్పటిపరిచిన డబుల్ కాట్ వి•ద మైత్రి కూడా పడుకుంది, ‘ఈ పరుపు ఎంత మెత్తగాఉందో’ అను కుంటూ. ‘‘రేపు భోగి పిల్లా ! పెద్దపెద్ద చలిమంటలు వేస్తారు. తెల్లవారుజామున నాలుక్కే లేవాలి’’ అంది పెద్దావిడ. ఆ మాట విని ‘ఓ మై గాడ్!’ అనుకుని, విననట్టూరుకుంది మైత్రి.
ఇల్లంతా ఆడపిల్లల నవ్వులతో మార్మోగుతుండగా మెలుకువొచ్చింది మైత్రికి. డిజిటల్ వాచ్ టె•మ్ నాలుగున్నర చూపించింది. ఓ ఐదుగురమ్మాయిలు తొంగి తొంగి చూస్తూ గుసగుసలాడుకుంటున్నారు. ‘‘వెళ్లండి! వెళ్లండి! లోపలికెళ్లి లేపండి. అదేవి• పెద్దపులి కాదు నా బంగారు తల్లి’’ అంటోంది నారాయణమ్మ. దుప్పటి పూర్తిగా తీసేసి లేచి కూర్చునే సరికి, నలుగురమ్మాయిలు చొరవగా లోపలి కొచ్చేసి లైట్ వేసేసారు. అంతా పట్టులంగా ఓణీలు వేసుకున్నారు. తలలోని పూమాలలు భుజాల వి•దకు వాలుతున్నాయి.నడుంకి చిన్న వడ్డాణాలు. మెడలో చిన్న చైన్లూ, నెక్లెస్లు వేసుకున్నారు. ఇలాంటి అలంకరణలో అమ్మాయిల్ని చూసినప్పుడు నవ్వుకునేది మైత్రి. అయితే ఇవాళ ‘ఈ వేషంలో అమ్మాయిలు అందంగా, ఆకర్షణీయంగా భలే ఉన్నారే!’ అనిపించి ముచ్చట పడింది.
అందరికీ ‘‘గుడ్ మార్నింగ్’’ చెప్పి పలక రించడంతో వాళ్లు సంతోషపడిపోయారు. వెంటనే ‘‘లే..లే.. మైత్రీ ! త్వరగా స్నానం చెయ్యి. వి• తాతమ్మగారు నీక్కూడా మాలాంటి లంగా,ఓణీ, గొలు సులు రెడీ పెట్టారు’’ అంది ఓ అమ్మాయి. ‘‘వి•రేం చదువుతున్నారు?’’ అనడిగింది మైత్రి నవ్వుతూ. ‘‘మేమిద్దరం ఇంటర్, వీళ్లిరూ బీకాం సెకండ్ ఇయర్!’’ అని చెప్పిందో అమ్మాయి.
-3-
‘‘అయితే వి•రంతా టీనేజ్ గర్లస్’’ అంది వాళ్ల వైపు టీజింగ్‌గా చూస్తూ! వాళ్లు పకపకా నవ్వేశారు. మైత్రి వాళ్లలాగే తయారయ్యి అద్దంలో చూసుకుని ‘హరిలేడులే’ అనుకుని నవ్వుకుంది.అంతా కలిసి ఇంటిముందున్న పెద్ద భోగిమంట దగ్గరికి దారి తీశారు.ఆ చలిగాలిలో వెచ్చని భోగిమంటకి మైత్రికి హాయిగా అనిపించింది.కొందరు భోగి పిడకల దండలు ఆ మంటల్లో వేసి, మైత్రి చేత కూడా ఒక దండ వేయించారు.ఆ మంటల వెలుగులో అందరికీ మైత్రి ఫోటోలు తీస్తుంటే ‘‘మైత్రి పక్కన నువ్వు,ఈ సారి నేను’’అంటూ అంతా కిలకిలా నవ్వుతూ పూర్తిగా తెల్లారేదాకా బాగా అల్లరి చేసి అమ్మాయిలంతా వెళ్లిపోయారు. ‘‘అమ్మగారూ ! కాఫీ ‘‘అంటూ ఇద్దరికీ చిక్కని వేడి కాఫీ ఇచ్చింది వంటావిడ.
కొందరికి హ్యాపీ పొంగల్ కార్డస్ పెట్టి, ఇంకొందరితో నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతున్న మైత్రిని చూస్తూ మురిసిపోయింది పెద్దావిడ. ఇంతలో వంటావిడ వేడిగా చక్కెర పొంగలి, గారెలు, కొబ్బరి పచ్చడి ఇద్దరికీ ఇచ్చింది. ‘‘భలే బావున్నాయి తాతమ్మా!’’ అంటూ మైత్రి తింటుంటే పెద్దావిడ తృప్తిగా చూసి, తను కూడా తినడం మొదలు పెట్టింది. వంటావిడా, పనమ్మాయీ ఓ గంటలో వస్తామని ఇళ్లకు వెళ్లారు. మైత్రిని పిలిచి మంచంపై దగ్గరగా కూర్చోబెట్టుకుంది నారాయణమ్మ,
‘‘నీ వి•ద నాకు మరీ ప్రేమగా ఉంటుంది బంగారం! వి• తమ్ముడి వి•ద నాకాట్టే లేదు. మగవాడు ! ఎలాగోలా బతికేస్తాడు. ఆడపిల్లవి, డాక్టరీ చదివావు. ఆస్పత్రికి ఎప్పుడైనా ఒకసారి వెళ్తేనే బాధగా, బెంగగా ఉంటుంది రోజూ వెళ్లాలంటే? ఎంత కష్టం!’’ అందావిడ దిగులుగా మైత్రిని చూస్తూ.
‘‘ఐదేళ్లు కష్టపడి చదివింది రోగులకు వచ్చిన బాధలు తగ్గించాలనే కదా!’’ నవ్వింది మైత్రి.
‘‘వి• తాతయ్య చెప్పేవారు.చాలా కష్టమంటకదా ఆ చదువు! అలాగే చదివావులే తల్లీ! ఆ రాముడు నిన్ను సదా కాపాడుతుంటాడు. మా మంచి మొగుడొ స్తాడు. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. నీలాంటి పెళ్లాం రావాలని ఏ బంగారు పూలతో పూజ చేస్తున్నాడో ఆ పెళ్లికొడుకు!’’ అంటుంటే ఆవిడ మొహంలో మునిమనవరాలికి రాబోయే భర్త పట్ల గౌరవాభిమానాలు దోబూచు లాడాయి.
‘‘పువ్వుల్లో కూర్చుంటే ఎట్లా? నేను రోజంతా హాస్పిటల్‌లో ఉండాలిగా !‘‘
‘‘నీ మొహం! పువ్వులంటే ప్రేమ పువ్వులు అని అర్థం!’’ అంటూ నవ్వేసిం దావిడ. ‘మూడు తరాల వెనక వాళ్లకి కూడా ఇంతటి సున్నిత భావాలుంటాయా!’ ఆశ్చర్యపడింది తనలో తానే మైత్రి.వడిలిపోయిన తన రెండు చేతులతో మైత్రి బుగ్గలు ఆప్యాయంగా నిమిరింది నారాయణమ్మ. వెంటనే మైత్రి ఆవిడ రెండు చేతుల్ని పట్టుకొని వాటిల్లో ముద్దు పెట్టింది. కళ్లనీళ్లు తిరగ్గా,దగ్గరకు తీసుకుందామె మునిమనవరాలిని.ఆమె దగ్గర వస్తున్న అగరవత్తుల పరిమళం, విభూతి సువాసన సుకుమా రంగా తాకాయి మైత్రి నాసికకి. తాతమ్మ నుంచి కురుస్తున్న ప్రేమ వర్షానికి తొలిసారి మైత్రి మనసు ఆనందంతో తడిసింది.
ఆ రాత్రి పడుకున్న తర్వాత మెల్లగా హనుమాన్ చాలీసాతో మొదలుపెట్టి నారాయణమ్మ, ‘అందాల రాముడూ,ఇందీవర శ్యాముడూ’, ‘సందేహించకు మమ్మా!’ అంటూ సినిమాపాటలు కూడా పాడుతూ పాడుతూ ఆపేసి పాపాయిలా నిద్రపోయింది. అది గమనించిన మైత్రి ‘బేబీ తాతమ్మ’ అనుకుంటూ నవ్వుకుంది.
-4-
మకర సంక్రాంతి రోజు పూరీ కూరతో టిఫిన్ పెట్టాక మైత్రిని స్నానంచేసి రమ్మని, బంగారు రంగు బోర్డర్ ఉన్న కుంకుమరంగు కంచి పట్టుచీరకి, మాచింగ్ జాకెట్టు,లంగా బీరువాలోంచి తీయించి పెట్టింది పెద్దావిడ. ‘‘తాతమ్మా ! నీకు నా జాకెట్ సైజు ఎలా తెలుసూ!’’ వేసుకున్నాక సంభ్రమంగా అరిచింది మైత్రి.‘‘నువ్వు నాకళ్లెదురుగా పుట్టావ్! నాకు ఆ మాత్రం తెలీదా!’’ అని ఆవిడ అంటుంటే మైత్రితో సహా వంటావిడా,పనమ్మాయీ హాయిగా నవ్వారు. ముని మనవరాలు తయారయ్యాక వంటావిడని పిలిచి దిష్టి తియ్యమని చెప్పడం, ఆవిడ ఉప్పు దిష్టి తీసెయ్యడం కన్నుమూసి తెరిచేలోగా జరిగాయి.‘‘నేను డాక్టర్‌ని ఇవన్నీ నమ్మను’’ అంది మైత్రి బుంగ మూతితో.‘‘నమ్మకు’’ అందావిడ నవ్వేస్తూ !
‘‘ఊరంతా తిప్పి చూపించవే! మన డాక్టర్ గారికి’’అని పనమ్మాయిని మైత్రికి తోడిచ్చి పంపింది నారాయణమ్మ. ఊరంతా ఆకుపచ్చని చెట్లు, పెద్దపెద్ద పూలమొక్కలు, పాదులు, కొబ్బరి చెట్లు, పళ్ల చెట్లు ఎటు చూసినా ‘పచ్చందనమే పచ్చదనమే!’ అన్నట్టు న్నాయి. పాతకాలంనాటి ఇళ్లు, మధ్యమధ్యలో కొత్త ఇళ్లు కనబడ్డాయి. ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో, రోడ్లకిరుపక్కలా, ఇళ్లవాకిళ్లలో, గోడలవి•ద మొక్కల్ని చూసి, ‘జనానికి ఈ మాత్రం ఆక్సిజన్ అందుతోందంటే ఈ పల్లెటూర్లే కారణమేమో!’ అనిపించింది మైత్రికి. ఆ పక్కనే పెద్ద చెరువు,చుట్టూ దానివైపు వాలిన పెద్దా చిన్నా మొక్కలు, నాలుగు సిమెంట్ రేవులూ ఉన్నాయి. అవి చూసి సరదా పడుతూ, ఒకరేవు మెట్లవి•ద కూర్చుంది కాళ్లు నీళ్లలో పెడుతూ. చిన్నప్పుడు రెండు మూడుసార్లు వచ్చినట్టు గుర్తొచ్చి, నేనెప్పుడూ అమ్మమ్మ ఇంటికి వైజాగ్, నానమ్మ ఇంటికి విజయవాడ వెళ్లడమే కానీ ఇక్కడికి ఎక్కువగా వచ్చినట్లు లేదు’ అనుకుంది మైత్రి.
అలా ఇద్దరూ ఊరిలో తిరుగుతూ ఉంటే కనబడ్డ ప్రతివాళ్లూ ‘‘ఎవరీ అమ్మాయి?’’ అనడిగారు పనమ్మా యిని. ‘‘నారాయణమ్మగారి, అబ్బాయిగారి మనవ రాలు అని చెప్పగానే, ‘‘డాక్టర్ చదివే పిల్లకదా!’’ అంటూ అందరూ అపురూపంగా, గౌరవంగా చూడటం మైత్రికి కాస్త గర్వంగానూ, ఆశ్చర్యంగానూ అనిపించింది. ‘విజయవాడలో,హైదరాబాదులో అయితే ఒక్కరయినా కొత్తవాళ్లని చూసి ఎవరు అనడగరు. పల్లెల్లో మానవ సంబంధాలుంటాయంటే ఇవేనేమో!’ అనుకుంది మైత్రి.
-5-
శేషగిరి తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా ! ఎలా ఉన్నారు తాతమ్మా, మునిమనవరాలూ?’’ అన్నాడు. ‘మాకేం బ్రహ్మాండంగా ఉన్నాం’ అందామె నవ్వుతూ. ‘‘మైత్రిని పంపెయ్యమ్మా! అది హైదరాబాద్ వెళ్లాలి’’ అన్నాడు. ‘‘ముక్కనుమ వెళ్లిన మర్నాడు పంపుతానులే!’’ అంటూ ఫోన్ పెట్టేసిందామె.
మధ్యాహ్నం భోజనంలోకి పప్పు, పులుసు, బొబ్బట్లు, మూడు రకాల కూరలు చేయించింది. ప్రతిపూటా తనతో కలిసి భోజనం చేస్తూ తాతమ్మ అనిర్వచనీయమైన ఆనందం పొందడం మైత్రికి ఆహ్లాదంగా అనిపించింది. ఆవిడ కాస్త కటువుగా, సీరియస్‌గా బయటి వాళ్లతో మాట్లాడటం చూసిన మైత్రికి ఆమెలో ఇప్పుడు కొత్త కోణం కనబడింది.
నారాయణమ్మ చిన్న ప్లేట్ తీసుకొని ప్రసాదం పెట్టుకున్నట్టు అన్ని కొంచెం కొంచెం పెట్టుకుని తింటోంది. ఆ రోజు అన్ని గిన్నెలూ మూతలు తీసి చూసి ‘ఇద్దరికీ ఇన్ని చేయించావా?’ అని మైతిప్రశ్నకి జవాబుగా ‘‘వి•రున్నన్ని రోజులూ మా ముగ్గురికీ, మా ఇంట్లో వాళ్లకీ, ఇక్కడే వంట చేసుకోమన్నారు పెద్దమ్మగారు’’ అంది నవ్వుతూ వంటామె. ‘ఒక మనిషి రాకను పండగ చెయ్యడం అంటే ఇదే కదా!’ తాతమ్మ వైపు గౌరవంగా, అభిమానంగా చూసింది మైత్రి.
కనుమ రోజు మళ్లీ రెండు కూరలు, ఆవడలు, జంతికలు, అరిసెలు చేయించింది. ప్రతిరోజూ రాత్రి పెద్దావిడ పట్టెమంచం పక్కనే ఉన్న డబుల్ కాట్ వి•ద పడుకోవడం, తాతమ్మ చెప్పే కబుర్లు వినడం మైత్రికి ఎంతో బావుంది. ఆమె ఆ చీకట్లో తన వీపుపై జోకొడుతూ సన్నగా, ‘లాలీ లాలీ జో!’ అంటూ పాడుతుంటే ఏదో తెలియని వైబ్రేషన్ ఆ చేతి ద్వారా మైత్రికంది ఎన్నడూ ఎరగని ఒక తృప్తి కలిగింది. ‘వారసత్వ సంపద అంటుంటారు ఇదేనేమో! తాత ముత్తాతలు అందరికీ ఉంటారు అదేం గొప్ప సంగతి? అనుకుందిన్నాళ్లూ! అదిప్పుడు తెలిసింది’ అనుకుంది. ఆ పారంపర్య అనుబంధం తాలూకు పారవశ్యం మైత్రి గుండెను సూటిగా తాకింది.
పెద్దావిడ ముక్కనుమ నాడు వెజిటబుల్ బిర్యాని, వడలు, రెండువేపుళ్లు, రసం చేయించింది. ఆ రోజు వేసిన రథం ముగ్గును ‘‘ఉత్తరదిక్కుగా సాగనంపాలి’’ అంటూ మైత్రి చేతి ముగ్గుతో పక్కింటి రథానికి కలిపించింది.
నారాయణమ్మ తమ ఊర్లో ఉండే ఒక మాస్టర్ గారిని పట్టుకుని విజయవాడకి టాక్సీ బుక్ చేయించింది. ఆ టాక్సీ వంటావిడ చేసిన స్వీట్లతోనూ, పండ్లతోనూ నిండిపోయింది. ఎప్పుడో ఒకసారి తాతమ్మకిచ్చిన మాట, తప్పకూడదని క్యాజువల్‌గా వచ్చి నాలుగు రోజులుండి తిరిగి వెళుతుంటే, మైత్రికి కూడా చాలా బాధ కలిగింది. భూతద్దాల కళ్లజోడు లోంచి తనపై అనురాగవర్షం కురిపిస్తూన్న తాతమ్మని చూస్తుంటే ఇన్నాళ్లూ అమ్మ వెనక, నాన్న వెనక, దాక్కుంటూ సరిగా తాతమ్మ దగ్గరికి రాకుండా దూరంగా తిరిగిన సంగతి గుర్తుచేసుకుని సిగ్గుపడింది.
-6-
మైత్రి బయలుదేరుతుండగా పెద్దామె కళ్లలోనుండి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి, అది చూసి మైత్రికి కూడా దుఃఖం వచ్చింది. ఆపుకుని ‘‘నువ్వు ఏడవడం ఏంటి తాతమ్మా! నువ్వు రాజమాతవి! గంభీరంగా ఉండాలి’’ అంది మైత్రి తాతమ్మను దగ్గరకు తీసుకుంటూ. ఆ మాటలకి బోసి నోరు తెరిచి పసిపాపలా నవ్వేసింది నారాయణమ్మ. తాతమ్మతో కొన్నిసెల్ఫీలు తీసుకుని టాక్సీ ఎక్కింది మైత్రి.
ళి ళి ళి
మైత్రిని శేషగిరీ, సరస్వతీ, తమ్ముడు హరి చిరునవ్వుతో గేట్ దగ్గరికి ఎదురెళ్లి స్వాగతించారు. టాక్సీ వాడికి డబ్బు కట్టి పంపించేసాడు శేషగిరి. అతను గుమ్మంలో పెట్టిన బ్యాగులన్నీ గెస్ట్ రూమ్‌లో సర్ది సరస్వతి బయటికి వచ్చింది. అప్పటికి సోఫా మధ్యలో కూర్చొని ఉంది మైత్రి.‘‘ఎలా ఉంది మా అమ్మ ?’’ అడిగాడు శేషగిరి పక్కనే కూర్చుంటూ. ‘‘మా అత్తగారు ఏమన్నారు నాన్నా!’’ అంది సరస్వతి కూడా నవ్వుతూ వచ్చి మరోపక్క కూర్చుంటూ. మైత్రి ఏవి• మాట్లాడకుండా ఎదురుగా ఉన్న టీపాయ్ వి•దకి కాళ్లు చాపుకుంది. హరి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని. ‘‘మళ్లీ ఇంకోసారి వెళ్తావా ఉండి? జన్మలో వెళ్లవులే! ఆవిడ చాదస్తంతో నిన్ను నాలుగు రోజులు చావగొట్టి ఉంటుంది. చచ్చుంటావ్! పారిపోయి వచ్చుంటావ్!వెనక్కిచూడకుండా!’’అన్నాడు హరి నవ్వాపుకుంటూ.
‘‘ఏడిసావులే !అంత మంచి తాతమ్మ మనకి ఉండడం, మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంరా!’’ అంది తాదాత్మ్యంతో కళ్లు మూసుకుంటూ మైత్రి. శేషగిరి గుండె గర్వంతో పొంగింది వెంటనే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. సరస్వతి సంతృప్తిగా తల ఊపింది,‘పిల్ల అక్కడి పరిస్థితులు, ఆవిడ హడావిడి చూసి విసుక్కోలేదు నయమే!’ అనుకుంటూ. హరి మాత్రం బిత్తర పోయాడు అక్క రియాక్షన్‌కి. తేరు కుంటూ ‘‘డేటింగ్‌కి వెళ్లి పెళ్లికి ఒప్పేసుకున్నావన్న మాట’’ అన్నాడు తిరిగి టీజింగ్ కి తయారవుతూ.
‘‘అవును! తాతమ్మ నా పెళ్లి వరకూ ఉండి, తర్వాత పైకి వెళ్లిపోయి నాకు పాపగా పుడతానంది’’ అంది గర్వంగా అందరి వైపు చూస్తూ. శేషగిరి, సరస్వతి గబుక్కున మైత్రిని దగ్గరకి తీసుకున్నారు నోటమాట రాక, ఆనందంతో తబ్బిబ్బవుతూ! తమ్ముడు వెనకనుంచి వచ్చి నానమ్మా తాతయ్యల వి•ద చేతులువేసి అక్క తలపై తలానించాడు అసంకల్పి తంగా!