నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని తట్టుకోలేమని నిర్ణయానికి వచ్చిన వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ 2024 ‌సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీతో విభేదించే ఇతర ప్రతిపక్షాలతో కలిసి ఆర్భాటంగా ప్రారంభించిన ‘ఇండియన్‌ ‌నేషనల్‌ ‌డెవలప్‌మెంట్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్’ (‘ఇం‌డి’ కూటమి) ఉనికి కోల్పోయే స్థితికి చేరుకుంది. 2014, 2019లో వరుసగా రెండు సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ‘కాంగ్రెస్‌ ‌ముక్త్ ‌భారత్‌’ ‌దిశగా పరిస్థితులు ఏర్పడడంతో ఆ పార్టీ 35కు పైగా పార్టీలతో జతకట్టి జులై, 2023లో ‘ఇండి’ కూటమిని ఏర్పాటు చేసింది.

దేశంలో రోజురోజుకు ప్రజాదరణ కోల్పోతూ ఎన్నికల్లో ఓడిపోతున్న కాంగ్రెస్‌ ‌తనతో పాటు మిత్రపక్షాలను కూడా నిండా ముంచుతోంది. లోక్‌ ‌సభ ఎన్నికలు మొదలుకొని హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ, బిహార్‌ ‌శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ ‌పార్టీతో తమకు కూడా నష్టం జరుగుతుందనే నిశ్చయానికి వచ్చిన కూటమిలోని ఇతర పార్టీలు ‘ఇండి’ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాయి. ప్రధానంగా ఓట్‌ ‌చోరీ, ఈవీఎంలపై కాంగ్రెస్‌ ‌చేస్తున్న విమర్శలపై మిత్రపక్షాలు ఆచితూచి వ్యవహ రిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే తమ విజయంగా చెప్పుకునే కాంగ్రెస్‌ ఓటమి చెందితే మాత్రం ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించడం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనం.
కాంగ్రెస్‌ ‌పార్టీ నేత రాహుల్‌ ‌గాంధీ ‘ఓట్‌ ‌చోరీ’ పేరుతో చేస్తున్న హడావిడిపై ‘ఇండి’ గ్రూపులోని ఇతర పార్టీలు పెదవి విరుస్తున్నాయి. ఓట్‌ ‌చోరీ కాంగ్రెస్‌కు సంబంధించిన కార్యక్రమంగానే భావిస్తున్నాయి. ఓటర్ల జాబితాలో ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్‌’ ‌పక్రియపై కాంగ్రెస్‌ ‌మిత్రపక్షాలు ఆ పార్టీతో పార్లమెంట్‌లో గొంతు కలుపుతున్నా బయట విమర్శలు గుప్పిస్తున్నాయి. బిహార్‌ ‌రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు రాహుల్‌ ‌గాంధీ ఆ రాష్ట్రంలో 16 రోజుల పాటు చేపట్టిన ‘ఓట్‌ అధికార్‌ ‌యాత్ర’ విజయవంతం అయిందని కాంగ్రెస్‌ ‌పార్టీ చెబుతున్నా ఎన్నికల్లో మాత్రం మహాఘట్‌ ‌బంధన్‌ ‌గా పిలవబడే ‘ఇండి’ కూటమికి పరాజయమే ఎదురైంది. దీంతో తమ ఓటమికి కాంగ్రెస్‌ ‌పార్టీ విధానమే కారణమని మిత్రపక్షం ఆర్జేడీ విమర్శించింది. కాంగ్రెస్‌ ‌పార్టీ లేవనెత్తిన ఓట్‌ ‌చోరీ అంశంతో ‘ఇండి’ కూటమికి ఎలాంటి సంబంధం లేదని జమ్ము కాశ్మీర్‌ ‌ముఖ్యమంత్రి, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌పార్టీ అధినేత ఒమర్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. అది కూడా కాంగ్రెస్‌ ‌పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ఓట్‌ ‌చోరీ బహిరంగ సభ మరునాడే ప్రకటించడం విశేషం. దీన్నిబట్టి కాంగ్రెస్‌ ‌పార్టీ చేపట్టిన ఓట్‌ ‌చోరీ నినాదం పట్ల ఎంత విశ్వసనీయత ఉన్నదీ అర్థం చేసుకోవచ్చు. ఈయన అంతకుముందు మరో సందర్భంలో మాట్లాడుతూ ‘ఇండి’ కూటమి పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు.
వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్న కాంగ్రెస్‌ ‌పార్టీ ఓట్‌ ‌చోరీ కంటే ముందు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ ‌యంత్రాల (ఈవీఎం)పై, వీవీప్యాట్‌లపై విమర్శించి నవ్వులపాలైంది. మహారాష్ట్రలో వారి మిత్రపక్షం ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఈవీఎంలు, వీవీప్యాట్‌లను అనుమానించలేమని అన్నారు. ఆ రాష్ట్రంలోని బారమతి నియోజకవర్గం ఎంపీగా తాను అదే ఈవీఎంపై నాలుగుసార్లు గెలిచానని సూలే స్పష్టంగా వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్‌ ‌చేస్తున్న ఆరోపణలు ఎంత ఆధారరహితమో అర్థమవుతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరగడంతోనే తాము ఓడిపోయామని, అక్కడి ఎన్నికలపై ఎన్నో అనుమానాలున్నాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో వారి మిత్రపక్షమైన ఎన్సీపీ కీలక నేత సుప్రియా సూలే అందుకు వ్యతిరేకంగా మాట్లాడటం గమనార్హం.
కాంగ్రెస్‌ ‌పార్టీ వరుస ఓటములపై ఆత్మవిమర్శ చేసుకోకుండా నిరాధారమైన సాకులు వెతుకుతోందని ఒమర్‌ అబ్దుల్లా, సుప్రియా సూలే వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. అసత్యాలనే సత్యమనేలా భ్రమలు కల్పిస్తూ, పలుమార్లు వ్యాఖ్యానిస్తూ కాంగ్రెస్‌ ‌పార్టీ గోబెల్‌ ‌ప్రచారంపైనే పూర్తిగా ఆధారపడిదని చెప్పడానికి ఆ పార్టీ మిత్రపక్షాల ప్రకటనలే తార్కాణం.
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఇండి’ కూటమి ఓటమి ప్రభావం మరో పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌పైన కూడా పడింది. కూటమిలో కీలకమైన సమాజ్‌వాద్‌ ‌పార్టీ (ఎస్పీ) కాంగ్రెస్‌ ‌పార్టీ పెత్తనానికి చెక్‌ ‌పెట్టేందుకు సిద్ధమవుతోంది. యూపీలో ఈ రెండు పార్టీల మధ్య పొసగక ఒకరిపై ఒకరు అహంకారం అంటూ ఆరోపణలు చేసుకుంటూ ఈ మిత్రపక్షాలు రాబోయే పంచాయతీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విడివిడిగా బరిలోకి దిగాలని నిర్ణయించు కుంటూనే, 2027 శాసనసభ ఎన్నికల్లో పొత్తు కొనసాగుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఈ పార్టీలు అహంకారం అంటూ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలకు రెండు పక్షాల మధ్య సీట్ల పంపకంలో ఏర్పడ్డ సంక్షోభమే ప్రధాన కారణం. మహారాష్ట్ర, బిహార్‌లో కాంగ్రెస్‌ ఒత్తిడికి లొంగి ఆ రాష్ట్రాల్లో ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ), ఆర్జేడీ పార్టీలు నష్టపోయిన తీరును చూసిన ఎస్పీ ముందు జాగ్రత్తపడుతూ కాంగ్రెస్‌ని దారిలో పెట్టాలని చూస్తోంది. అంతకుముందు బిహార్‌ ఎన్నికల్లో ఎస్పీ అధినేత అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌కాంగ్రెస్‌ ‌కంటే ఆర్జేడీ తరఫునే అధికంగా ప్రచారం చేసి కాంగ్రెస్‌ ‌పార్టీపై తమ వైఖరిని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్‌పైనే కాకుండా జార్ఖండ్‌పైనా బిహార్‌ ‌ప్రభావం పడింది. ఈ ఎన్నికల్లో తమకు ప్రాధాన్య తివ్వలేదని, సీట్ల కేటాయింపులో వివక్ష చూపించా రంటూ జార్ఖండ్‌ ‌ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ ‘ఇండి’ కూటమికి దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఇండి’ గ్రూపు చేతిలో ఉన్న జార్ఖండ్‌ ‌రాష్ట్రం చేజారిపోయే అవకాశాలున్నట్టు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కూటమిలో మరో భాగస్వామి ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ‌కూడా బిహార్‌లో ఒంటరిగా పోటీ చేసి తనకు ఎవరితో సంబంధాలు లేవని తేటతెల్లం చేసింది. బిహార్‌ అసెంబ్లీ ఫలితాలు కూటమికి కనువిప్పు కావాలని శివసేన (యూబీటీ) పేర్కొంది. నిత్యం ఎన్నికల సంఘం యంత్రాంగాన్ని విమర్శించడం కన్నా ‘ఇండి’ కూటమిలో అంతర్గత సమన్వయాన్ని ఈ పార్టీ ప్రశ్నించడంతో కూటమిలోని పక్షాల మధ్య ఉన్న సత్సంబంధాల వైఫల్యం బహిర్గతమవుతోంది. పెద్ద పార్టీగా కాంగ్రెస్‌ ‌పెద్దన్న పాత్ర పోషిస్తూ మిత్రపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకపోతే కూటమి ఆశించిన రీతిలో ఎన్నటికీ విజయవంతం కాలేదని శివసేన (యూబీటీ) అభిప్రాయపడిదంటే కాంగ్రెస్‌పై వారికున్న అసంతృప్తి స్పష్టమవుతోంది. ఇటీవల మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమి ఘన విజయం సాధించగా ఇక్కడ కాంగ్రెస్‌, ఎన్సీపీ (ఎస్‌), ‌శివసేన (యూటీ) పార్టీల మధ్య పొత్తు కుదిరినా వారి ‘మహా వికాస్‌ అఘాఢీ’ ఘోర పరాజయం పొందింది. ఈ పార్టీల మధ్య పేరుకు పొత్తు కుదిరినా సయోధ్య లేకపోవడంతో ఘోర పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చిందని మూడు పార్టీల నేతలు ఒకరినొకరు విమర్శించు కోవడంతో మహారాష్ట్రలో ‘ఇండీ’ కూటమికి బీటలు పడ్డాయి.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్‌ ‌కాంగ్రెస్‌ (‌టీఎంసీ) కూడా ‘ఇండి’ కూటమికి ప్రాధాన్యతివ్వడం లేదు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన టీఎంఎసీ, కాంగ్రెస్‌, ‌వామపక్షాల కూటమి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పంథాను కొనసాగించ నున్నాయి. మేము ప్రాంతీయ అంశాలకే మొదటి ప్రాధాన్యతిస్తామని టీఎంసీ కుండబద్దలు కొడుతూ కాంగ్రెస్‌ ‌పార్టీతో కలిసే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. కూటమిలో కాంగ్రెస్‌ ‌తర్వాత రెండో అతి పెద్ద పార్టీగా ఉన్న డీఎంకే ఆచితూచి వ్యవహరిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పరాజయాలను పరిగణలోకి తీసుకొని దక్షిణాదిన ఆ పార్టీని కీలుబొమ్మగా మార్చాలనే యత్నంలో డీఎంకే ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా పాతిక సీట్లలోపే కేటాయించి చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని చూస్తోంది. మరోవైపు సీట్ల బేరసారాల్లో డీఎంకేను దారిలోకి తెచ్చుకునేందుకు సినీ నటుడు విజయ్‌ ‌ప్రారంభించిన టీవీకే పార్టీకి స్నేహ హస్తం అందించాలని కాంగ్రెస్‌ ‌యోచిస్తోంది. పాత మిత్రులు డీఎంకే, కొత్త పార్టీ టీవీకే మధ్య దోబూచులాడాలని చూస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీకి రెండు వైపులా భంగపాటు తప్పదని స్థానిక రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పంజాబ్‌ ‌రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్‌ ‌పార్టీ తీరు కూటమిలో ప్రత్యేకతను సంతరించుకుంది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీతో ఆప్‌కు నిత్యం కయ్యాలే. పంజాబ్‌, ‌ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం విడివిడిగా పోటీ చేసిన ఈ రెండు పార్టీలు జాతీయ అంశాలపై స్నేహంగా ఉండటం విచిత్రం. హరియాణాలో లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఈ పార్టీలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పోటీ చేయడం వీరి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం.
సైద్ధాంతికంగా బీజేపీతో ఏమాత్రం పొసగని వామపక్షాల తీరు మరింత విచిత్రం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీతో పూసుకొని తిరిగే వామపక్షాలు కేరళ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీతో కయ్యానికి కాలు దువ్వుతుంటాయి. రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం కత్తులు దూసుకుంటున్న ఈ జాతీయ మిత్రులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నారు. కేరళలో కొట్టుకునే వీరు పశ్చిమ బెంగాల్‌లో మాత్రం పూసుకొని తిరుగుతారు. అక్కడ వీరికి కూటమిలో మరో పార్టీ అయిన టీఎంసీతో పడదు. అంటే పశ్చిమ బెంగాల్‌లో కూటమిలో రెండు పక్షాలు ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. అవకాశవాదంతో చేతులు కలిపిన ఇండి కూటమిలోని పార్టీల అనైక్యత ఇప్పటికిప్పుడు ఏర్పడింది కాదు. 2019 ఓటమి తర్వాత ఇక మోదీని ఓడిచలేమనే స్థిరమైన నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ మోసపూరిత రాజకీయాలను పసిగట్టిన ఇతర పార్టీలు, నేతలు ఎవరిదారి వారు చూసు కుంటున్నారు. అందుకే ఒమర్‌ అబ్దుల్లా ‘ఇండి’ కూటమిపై వ్యాఖ్యానిస్తూ అది క్షేత్రస్థాయిలో కలిసికట్టుగా ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు, వ్యూహాలు రూపొందించకుండా కేవలం కాగితాలపైనే కనిపిస్తోందని అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. తమ ఎజెండా ప్రకారం కూటమిలోని పార్టీలు నడవాలనే భావించింది. అందులో భాగంగా ‘ఓట్‌ ‌చోరీ’ అంశాన్ని బల వంతంగా కూటిమిలో పార్టీలపై కూడా రుద్దాలని చూసి భంగపడిం ది. లోక్‌సభ ఎన్నికల్లో 2019తో పోలిస్తే 2024లో కాంగ్రెస్‌ ‌కొన్ని స్థానాలు అధికంగా పొందడంతో ‘ఇండి’ గ్రూపులో ఆ పార్టీ ఆధిపత్యానికి ప్రయత్నించడంతో ఇతర పార్టీలు విసిగిపోయాయి. అనంతరం జరిగిన హరియాణా, జమ్మూ కశ్మీర్‌, ‌మహారాష్ట్ర, జార్ఖండ్‌, ‌ఢిల్లీ, బిహార్‌ ‌రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌సాధించిన పరాజయాలతో మిత్రపక్షాలకు ఆ పార్టీపై భ్రమలు తొలగిపోవడంతో వారు ‘ఇండి’ కూటమితో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ‘ఓట్‌ ‌చోరీ’ పై కూటమిలోని పార్టీలే కాంగ్రెస్‌ ‌పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం చూస్తుంటే రాహుల్‌గాంధీ అసత్య ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది.
కాంగ్రెస్‌ ‌పార్టీ నేతృత్వంలో పనిచేస్తే ప్రయోజనం కన్నా నష్టమే అధికమని గుర్తించి ఇతర పార్టీలు కూటమికి దూరంగా ఉంటున్నాయి. దీంతో ‘ఇండి’ కూటమి కథ ముగిసినట్టే అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ‘ఓట్‌ ‌చోరీ’ వంటి అంశాలతో పెద్దన్న పాత్ర పోషిస్తూ కూటమిలో పెత్తనం చెలాయించాలని చూస్తున్న కాంగ్రెస్‌ ‌వ్యూహాలను పసిగట్టిన ఇతర పార్టీలు కాంగ్రెస్‌ ‌విసురుతున్న వలలో పడకుండా తగినంత దూరాన్ని పాటిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్‌ ‌చేస్తున్న రాజకీయాలతో స్థానికంగా దెబ్బతింటున్నామని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న ప్రాంతీయ పార్టీలు రాహుల్‌ ‌గాంధీ చేపడుతున్న ఒంటెత్తుపోకడల కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే లోక్‌సభ ఎన్నికల ముందు అధికారమే పరమావధిగా 2023లో ఏర్పడిన ‘ఇండి’ కూటమి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోపు విచ్చిన్నమయ్యే దిశగా పయనిస్తోంది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

– శ్రీపాద

About Author

By editor

Twitter
YOUTUBE