“Maharaja Prithu: The Unsung warrior King who annihilated Bakhtiyar Khalji” (Raktim Patar and Ranjit Hazarika), » The Safron Soulsµ (Mansosis Sinha) అనే వారు గ్రంథాలు రాశారు. ఈ గ్రంథాలు చరిత్రలోని ఒక ప్రత్యేక కోణాన్ని బహిర్గతం చేస్తాయి. జ్ఞానం మీద పగబట్టిన మతోన్మాదుల గురించి చెబుతాయి. పుస్తక భాండాగారాలకు నిప్పు పెట్టిన అనాగరిక మూకల గురించి వెల్లడిస్తాయి. అలాంటి వారిని ఎదిరించిన వాడే పృథు మహారాజు.కానీ ఆయన వీరత్వం గురించి చరిత్రపుస్తకాలు స్మరించుకోలేదు.

పుస్తకం మంచి మిత్రుడు, జీవిత మార్గదర్శి. పుస్తక పఠనంలో విజ్ఞానం, వెలకట్టలేని మానసిక ఆనందం సొంతం అవుతాయి. గ్రంథాలయం జీవిత పయనంలో ప్రతీ అడుగులోను తోడ్పడుతుంది. కలాలతో కాలాన్ని వెలిగించిన కవుల కావ్యాలను అధ్యాయనం చేస్తుంటే కలిగే ఆనందానుభూతి పరమాద్భుతమైనది. అక్షరం అంటే గుండె గుడిలోని దీపానికి ఇంధనం. మనస్సు ఎదుగుదలకు ఎనలేని సాధనం. కానీ ఇలాంటి జ్ఞానజ్యోతులను ఆర్పివేసిన దౌర్భాగ్యులు చరిత్రలో కొన్నిచోట్ల కనిపిస్తారు. వారిని ఎదిరించి, మట్టుపెట్టిన పృథు భారతీయుడు.

అక్షరం మీద ద్వేషం గురించి చెప్పే ఉదాహర ణలు ప్రతిదేశంలోను ఉన్నాయి. చైనాలో క్విన్‌ ‌రాజ వంశ మొదటి చక్రవర్తి క్విన్‌షి హుయాంగ్‌ ‌కీ।।పూ।। 213లో ‘పుస్తకాలను కాల్చండి, పండితులను పూడ్చి పెట్టండి’ (burning of books and burying of scholars) అంటూ ఆజ్ఞను జారీ చేశాడు. వీరు ఉంటే, వీరి ద్వారా జనం చైతన్యవంతులైతే తిరగబడ తారని భయం.

బాబిలోనియాలో హమ్మురబీ కీ।।పూ।। 1761లో మారి రాజ్యాన్ని ఆక్రమించి అక్కడి జిమ్రిలిమ్‌ ‌లైబ్రరీని ధ్వంసం చేశాడు. 1258లో మంగోలులు బాగ్దాద్‌ ‌ముట్టడి సమయంలో హౌస్‌ ఆఫ్‌ ‌విజ్‌డం సహా నగరంలోని గ్రంథాలయాలన్నింటిని తగుల బెట్టాడు. కాలిపోయిన పుస్తకాల బూడిదను టైగ్రిస్‌ ‌నదిలోకి తోసివేశాడు. కాబట్టే టైగ్రిస్‌ ‌నీళ్లు నల్లబడ్డాయంటారు. 16వ శతాబ్దంలో డియోగోలాండా మాయా నాగరిక ప్రజలకు చెందిన విలువైన (కొడెక్స్‌లు) పురాతన పుస్తకాలు- మాన్యుస్క్రిప్టులు తగులబెట్టాడు. అవి అన్యమత విశ్వాసాలకు సంబంధించినవని కారణం కూడా ప్రకటించాడు.

ఈజిప్టులోని కైరో చారిత్రక విశ్వవిద్యాలయాన్ని 12వ శతాబ్దంలో సలావుద్దీన్‌ అయ్యూబీ ఫాతిమిద్‌ ‌ఖిలాపత్‌ను పడగొట్టి, సున్నీ విద్యాకేంద్రంగా మార్చాడు. అయితే ఈ పక్రియలో విశ్వవిద్యాల యానికి చెందిన గ్రంథాలయంలో లక్షలాది పుస్తకా లను ధ్వంసం చేయించాడు. అలెగ్జాండ్రియా లైబ్రరీని కీ।।పూ।। 48లో సీజర్‌ ‌కొంతవరకు నష్ట పరిచాడు. తరువాత క్రీ।।శ।। 391లో అలెగ్జాండ్రియాలోని క్రైస్తవులు సెరాపియంలోని ఒక గ్రంథాలయాన్ని ధ్వంసం చేశారు. కీ।।శ।। 642లో ఆరబ్‌ ‌జనరల్‌ అమర్‌ ఇబీ-అల్‌-అస్‌ ‌ఖలీపా ఒమర్‌ ఆ ‌దేశంలోని అన్ని పుస్తకాలను నగరంలోని స్నానపు గదులకు ఇంధనంగా వాడారు. కాని ఆధునిక చరిత్రకారులు దీనిని అంగీకరించడం లేదు. అయినా ఆ లైబ్రరీ కాలక్రమేణ పతనమైంది.

ఇలాంటి చరిత్రహీనులు భారతదేశ మధ్య యుగాల చరిత్రలోను ఉన్నారు. శాంతి కాముకత్వం, అహింస, సంఘ అభ్యుదయం, అభివృద్ధిని కాంక్షిస్తూ ఆచార్యులు నలందా విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పిన కాలంలోనే ముస్లిం మతోన్మాదులు జ్ఞానం మీద దాడి చేశారు. బిహార్‌ ‌రాష్ట్రంలో ఉన్న ప్రాచీన నలందా విశ్వవిద్యాలయాన్నీ కుమారగుప్తుడు 5వ శతాబ్దంలో (క్రీ.శ.427) ప్రారంభించినట్లు చెపు తారు. కాని బౌద్ధుల వాదన వేరు. ఏ వాదనలున్నా ప్రాచీన మగధ రాజ్యంలో సుమారు 700 సంవత్స రాలు (సుమారు 5వ శతాబ్ది నుండి 12 శతాబ్దం వరకు) వర్ధిల్లిన విద్యాకేంద్రమది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆవాస విశ్వకళా పరిషత్‌. ‌విద్యార్థులకు వసతి గృహాలుండేవి. సుమారు 10,000 మంది విద్యార్థులు, 2000 మంది ఆచార్యులతో ఎనిమిది ప్రత్యేక ఆవరణలతో, పది దేవాలయాలతో, అనేక ధ్యానమందిరాలతో, ఎన్నో తరగతి గదులతో, ఉద్యాన వనాలతో, కొలనులతో, ఎంతో ఆహ్లాదకర వాతా వరణం ఉండేదని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి.

నలంద విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రం, వేదాలు, అనేక విజ్ఞాన శాఖలు బోధించేవారు. ఇక్కడి గ్రంథాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. తొమ్మిది అంతస్తుల భవనంలో, మూడు విభాగాలతో ఏర్పాటు చేసిన గ్రంథాలయమది. ఆ విభాగాల పేర్లు-రత్నరంజక, రత్నోదధి, రత్నసాగర. వీటిలో లక్షలాది తాళపత్ర గ్రంథాలు భద్రంగా ఉండేవి. వాటిలో సుమారు 400,000 సంస్క ృత గ్రంథాలున్నా యని ఒక అంచనా. ఇక్కడ పని చేసిన అధ్యాపకులలో ధర్మపాల, నాగార్జున, ధర్మకీర్తి, అసంగా, వసుబంధు చంద్రకీర్తి, జువాన్జాంగ్‌, ‌శీలభద్ర, వజ్రబోధ, ఆర్యభట్ట కూడా ఉండి ఉండవచ్చునని చరిత్రకారుల అభి ప్రాయం. వీరుగాక అభయంకర గుప్తా (వజ్రాయాన బౌద్ధసన్యాసి) విక్రయశిల విశ్వవిద్యాలయంలో కూడా పనిచేసి ఉండవచ్చును. అరియా బల్మ (కొరియా బౌద్ధ సన్యాసి) ఆర్యదేవుడు నాగార్జునుని విద్యార్థి, అతిషా బుద్ధ, గుహ్య (వజ్రాయన బౌద్ధ పండితులు), చంద్రగోమిన్‌ ‌మహాయాన బౌద్ధ పండితుడు, ధర్మ స్వామి (టిబెటన్‌ ‌సన్యాసి), ప్రభాకర మిత్ర, శాంతిదేవ, ప్రజ్ఞా (ఆఫ్గనిస్తాన్‌లోని కపిసా), వుంకాంగో జువాన్జాంగ్‌, ‌యిజింగ్‌ (‌చైనా) మరెందరో పండితులు ఇక్కడ పనిచేశారు.

హ్యువాన్‌త్సాంగ్‌ అనే ప్రసిద్ద చైనా యాత్రికుడు కీ।।శ।। 637-642 మధ్య నలందా విశ్వవిద్యాల యాన్ని దర్శించి అక్కడ విద్యార్థిగా చేరి, చదువు పూర్తి అయ్యాక ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఈ విషయాన్ని ఆయన ది గ్రేట్‌ ‌టాంగ్‌ ‌రికార్డ్సు ఆన్‌ ‌ది వెస్ట్రన్‌ ‌రీజియన్స్‌లో ప్రకటించాడు. నలంద విశ్వవిద్యాలయ గొప్పతనాన్ని, దాని అద్భుతమైన నిర్మాణాన్ని, బోధనా పద్ధతులను, అక్కడ చేరిన పండితులను గురించి ఆయన వర్ణించాడు. హ్యువాన్‌త్సాంగ్‌ ఇక్కడ బౌద్ధతత్వం, వ్యాకరణం, తర్కం, సంస్కృత భాషలను విశ్వవిద్యాలయాధిపతి శీలభద్ర పర్యవేక్షణలో నేర్చుకున్నాడు.

భారతదేశం నుండి తిరిగి వెళ్లేటప్పుడు హ్యువాన్‌ ‌త్సాంగ్‌ 657 ‌సంస్క ృత గ్రంథాలను 20 గుర్రాలపై వేసుకొని వెళ్లాడు. ఆయన జ్ఞాపకార్థం నలందాలో యువాన్‌త్సాంగ్‌ ‌మెమోరియల్‌ ‌హాలును నిర్మించారు.

భారత్‌కు వచ్చిన మరో చైనా యాత్రీకుడు ఇత్సింగ్‌. ఇతడు బీజింగ్‌ ‌దగ్గర చోచౌలో కీ।।శ 635లో జన్మించాడు. తన 19వ ఏట (654లో) తాను చదివిన బౌద్ధ గ్రంథం ‘వినయ పిటక’ బాగా నచ్చింది. దానిని చైనా భాషలోనికి తర్జుమా చేయాలనే కోరిక కలిగింది. చాంగన్‌ ‌నగరంలో హ్యువాన్‌త్సాంగ్‌ను కలిశాడు. కొన్నాళ్లకే హ్యువాన్‌త్సాంగ్‌ 664‌లో మరణించాడు. ఇత్సింగ్‌ ఆయన అంత్యక్రియలు పూర్తిచేసి భారత్‌కు బయలు దేరాడు. 671లో కాంటన్‌ ‌నుండి సముద్రయానం ద్వారా భారత్‌కు 673లో చేరాడు. మగధ చేరాడు. నలందా విశ్వవిద్యాలయంలో 676-685 వరకూ ఉన్నాడు. అక్కడ నుండి సుమిత్రాలోని పాలెం బంగ్‌కు 689లో చేరి 692లో తిరిగి చైనాకు వచ్చాడు. అప్పటికి వూజితెయిన్‌ ‌చైనా దేశపు రాణి. ఆమె ప్రోత్సాహంతో అనేక సంస్కృత గ్రంథాలను చైనా భాషలోనికి తర్జుమా చేశాడు. ఆమె తరువాత వచ్చిన రాజు జోంగ్‌ ‌జంగ్‌ ‌కూడా ఇత్సింగ్‌కు మంచి ప్రోత్సాహాన్నిచ్చాడు. తద్వారా తన తర్జుమా పనిని పూర్తిచేసి 713లో తన 79వ ఏట మరణించాడు.

హ్యువాన్‌త్సాంగ్‌ ‌తన రచనలో విక్రమశిల, ఓదంతపురి, తెల్‌హర (నలందాకు 33 కిలో మీటర్ల దూరంలో) విశ్వవిద్యాలయాలను గురించి రాశాడు. తిలాస్‌-అకియా లేక తిలదక్‌గా హ్యువాన్‌త్సాంగ్‌ ‌వివరించాడు.

ఇప్పుడు తలుచుకోవలసిన జ్ఞానద్వేషి భక్తియార్‌ ‌ఖిల్జీ. 12-13 శతాబ్దాలలో ఉత్తర, తూర్పు భారత దేశంపై దాడిచేసిన ఆఫ్ఘన్‌ ‌సైనికాధిపతి ఇతడే. నలందా, విక్రమశిల, ఓదంతపురి వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసినందుకు చరిత్రలో గుర్తుండిపోయాడు. అతని దండయాత్రలు బిహార్‌-‌బెంగాల్‌లో విధ్వంసం సృష్టించాయి.

1197-1206 మధ్య భారత ఉపఖండంపై ఖిల్జీ దండయాత్రలు సామూహిక వలసలకు, సన్యాసుల ఊచకోతకు దారితీశాయి. ఉత్తర భారతంలోని సాంప్రదాయ బౌద్ధ ఉన్నత విద్యా సంస్థలను సమూలంగా నాశనం చేశాడు. మహాయాన బౌద్ధానికి ప్రధాన కేంద్రమైన నలందాలో రక్తపాతం, మానవ హననం ఊహకు అందనంతగా జరిగింది. కుతుబుద్దీన్‌ ఐబక్‌ ‌కూడా భక్తియార్‌ను సత్కరించాడు. తారానాథ్‌ అనే చరిత్రకారుని ప్రకారం ఆక్రమణదారులు ఓడంతపురిలో అనేకమంది సన్యాసులను ఊచకోత కోసి విక్రమశిలను కూడా నాశనం చేశారు.

1202లో జరిగిన దండయాత్రలో అతను బౌద్ధ సన్యాసులను చంపి, అక్కడి భారీ గ్రంథాలయాలకు ఖిల్జీ నిప్పు పెట్టాడు. ఈ గ్రంథాలు దగ్ధమవ్వడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టిందని చెబుతారు. 1204లో బెంగాల్‌పై దాడికి వెళ్లి నదియా ప్రాంతాన్ని ఆక్రమించాడు. మ్లేచ్చి అనే హిందువును ఆలీగా మతం మార్చి తన సైనికాధికారిగా నియమిం చాడు. పాలకులు ఎప్పుడూ చరిత్రను తమకు అనుకూలంగా, తమకు కావలసిన మేరకే రాస్తారు. ఈ విషయం మనందరకు తెలుసు. అసలు కథ ఆ తరువాత ప్రారంభమయ్యింది.

పృథు మహారాజు (ఈయనకే విశ్వసుందర దేవుడు అనే పేరుంది) కామరూపా (అస్సామ్‌) ‌పాలకుడు. ఆ సమయంలోనే భక్తియార్‌ఖిల్జీ నలందా, విక్రమశిల, ఓదంతపురి, తలికిమ్‌ ‌విశ్వవిద్యాల యాలను నాశనం చేసి నలందాలోని గ్రంథాలయాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మహారాజ పృథు ఆటవిక జాతులైన బోడో, దిమాసాలను, కోచ్‌ ‌రాజవంశీయులను స్థానికుల సహాయంతో సైన్యంతో ఖిల్జీకి గుణపాఠం చెప్పడానికి మహారాజ పృథు సిద్ధమయ్యాడు. భక్తియార్‌ ‌సైన్యం కామరూపకు వచ్చే మార్గంలో (Scorched Earth Policy) సైన్యానికి మంచినీరు ఆహారం దొరకకుండా గ్రామాలలోని బావులను పూడ్చడం, ఆహారాన్ని తగలబెట్టించాడు పృథు. దానితో భక్తియార్‌ ‌సైన్యం ఆకలి దప్పికలతో అల్లాడిపోయింది. అతి కష్టం మీద ఉత్తర గౌహతికి చేరుకుంది ఆ సైన్యం. అక్కడ యుద్ధం జరిగింది. దానిలో భక్తియార్‌ ‌మరణించాడు. అలీమ్లేచ్‌తో సహ తిరిగి వార్త చేరవేయడానికి కూడా మిగలకుండా సైన్యాన్ని చంపేసింది పృథు సేన. ఇది 1206వ సంవత్సరంలో జరిగింది. ఈ ఘటన చరిత్రపుటలకు ఎక్కలేదు. అయితే ఉత్తర గౌహతిలో ఒక శిలపై ఇలా రాసి ఉంది.

‘‘సాకే తురగ యుగ్మే సమధు మాస త్రయోదసే

కామ రూపం సమాగత్య తురుష్కః క్షయ మాయమ్‌’’

‌సాకేతు సంవత్సరంలో కామరూపదేశానికి వచ్చిన తురుష్క సైన్యాన్ని సమూలంగా నాశనం చేశామని దీని అర్ధం. దీనిని లెక్క కడితే సుమారు 1206కి వస్తుంది.

ఈ శిలను స్థానికులు ‘‘కానాయి బరోకి దువా కిరాలేక్‌’’ అం‌టారు. కృష్ణుడు ఆ రాతిపై కూర్చుండి చేపలు పట్టాడని చెపుతారు. ఈ రాయి పవిత్రతను కాపాడటానికి అలా వార్త ప్రాచుర్యంలోనికి తీసుకు వచ్చి ఉండవచ్చును.

ఈ పై సంఘటన గురించి అస్సామ్‌ ‌ముఖ్య మంత్రి హిమంత బిశ్వశర్మ ఇలా అభిప్రాయపడ్డారు”A timeless reminder that Assam has always stood as the defender of Bharat’s Soul”

డా. కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE