డిసెంబర్ 5 ప్రపంచ భూసార దినోత్సవం
మహావాది రామకృష్ణ
మనం నివసిస్తున్న ఈ భూగోళం ముఖ్యంగా రెండు పదార్థాలను కలిగి ఉండి, వాటి ద్వారా ఏర్పడింది. ఒకటి నీరు, రెండు భూమి (నేల). ఈ నేలమీద నివసిస్తూ, నేలనుండి ఉద్భవించిన, పండిన ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, మసాలా దినుసులు మొదలగు వాటిని ఆహారంగా స్వీకరిస్తూ మనం ఆరోగ్యంగా జీవిస్తున్నాం. అంటే నేల మన జీవనధారం. అలాంటి నేల గురించి ఆలోచించడం, ఈ నేలను మన మనుగడకై సంరక్షించుకోవడం, భావితరాలకు నాణ్యతతో మిగిల్చి అప్పచెప్పడం మన ప్రథమ కర్తవ్యం. ఈ మానవ జీవనధార మైన నేలను గౌరవిస్తూ డిసెంబర్ 5ను ‘‘ప్రపంచ నేల దినం’’ (వరల్డ్ సాయిల్ డే)గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని మొదటగా డిసెంబర్ 5, 2014న ప్రపంచ దేశాలు జరుపుకున్నాయి. ఇదేరోజు దివంగత థాయిలాండ్ రాజు భూమిబోల్ ఎడుల్యాడేజ్ జన్మదినం. ఆయన జన్మదిన గౌరవ సూచకంగా ఈ రోజుని వరల్డ్ సాయిల్ డేగా ప్రకటించారు. కారణం ఆయన వరల్డ్ సాయిల్ డే జరపాలని చాలా సంవత్సరాల క్రితమే అభిలాషించిన మహనీయుడు కావడం.
ఆరోగ్యకరమైన నేలలు- ఆరోగ్యకరమైన నగరాలు అన్నది 2025 వరల్డ్ సొయిల్ డే ముఖ్య నినాదం. ఈ నినాదం ముఖ్య ఉద్దేశ్యం మనందరికీ నగరాలలోని నేల ప్రాకృతిక, సేంద్రియ స్వభావాలను కాపాడు కోమని హితవు పలకడం, అలాగే హెచ్చరించడం కూడా. నగర ప్రజల, స్వచ్ఛమైన నగరాల మనుగడకు, అలాగే నగరాలలో స్వచ్ఛమైన భూగర్భ జలాలు, భూగర్భ ఉష్ణోగ్రతల సమతుల్యత లకు, నగర నేలలోని జీవనాధారమైన ఖనిజ లవణాల లభ్యతకు, జీవ వైవిధ్య మనుగడకు స్వచ్ఛమైన నేలలు ఎంత అవసరమో నొక్కి వక్కాణించి చెప్పడం. అలాగే ఈ నినాదం ప్రభుత్వాలలోని విధి, విధాన రూపకర్తలు, శాస్త్రజ్ఞులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా కృషి చేసి, నగర నిర్మాణ ప్రణాళికలలో హరిత వృద్ధి, కాలుష్య నియంత్రణతో, స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి ఒక మేలుకొలుపుగా భావించాలి. భారతదేశానికి భూ పరిరక్షణ విధానం కొత్త విషయం కాదు. మన సనాతన చరిత్ర పరిశీలిస్తే రుగ్వేదంలో, అధర్వవేదంలో ఉన్న శ్లోకాలలో నేల సంరక్షణ తద్వారా ప్రకృతిలోని పర్యావరణ సమతుల్యత గురించిన ప్రస్తావన ఉంది. ముఖ్యంగా అధర్వవేదంలో సేంద్రియ ఎరువులు, మొక్కల మృత్తికలను, పశువుల ఎరువును వాడి భూసారం పెంచి, భూమిని వ్యవసాయ యోగ్యంగా చేసుకోవాలని ఉంది. క్రీ.పూ. 268-232లో అశోకుడు చెట్లు నాటించడం, ఔషధ/సుగంధ ద్రవ్య మొక్కలను సాగుచేయించడం భూసార పరిరక్షణను ఉద్దేశించి కూడా చేసినవని చరిత్రకారుల అభిప్రాయం. అలాగే కౌటిల్యుని అర్ధ శాస్త్రంలో (క్రీస్తు పూర్వము 4వ శతాబ్దం లోనే) వ్యవసాయానికి సేంద్రియ ఆధారిత భూసార పరిరక్షణ, వ్యవస్థీకృత నీటి నిల్వలు, నీటి పారుదల ఆవశ్యకతలు పేర్కొనడం జరిగిందని గ్రంథాలు చెపుతున్నాయి. పరాశరుని ‘‘కృషి పరాశర’’ లో (క్రీ. పూ.400 లో) దీర్ఘ కాలిక నేల సేంద్రియ స్వభావ పరిరక్షణ కోసం సంప్రదాయ పద్ధతులు పాటించాలని ఉంది. వరాహమిహిరుని బృహత్ సంహిత అనే గ్రంథంలో (క్రీ.శ.6వ శతాబ్దంలో) సేంద్రియ ఎరువుల వాడకం, నీటి పొదుపు, పంట మార్పిడి మొదలగు పద్ధతులు భూసార పరిరక్షణకు చాలా అవసరమని ఉంది.
ఆధునిక శకం- క్రీస్తు శకము 1000లో వృక్ష ఆయుర్వేద శాస్త్రం (సు రపాల)లో, వృక్ష విజ్ఞానశాస్త్రం అనే అంశంలో జీవ ఆధారిత ఎరువులను (బయో ఫర్టిలైజర్స్) వాడి నేలను ఎలా సారవంతం చేసుకోవాలి అనే విషయాలున్నాయి.. కుంజాఫల (పశువుల పేడ, మూత్రంతో చేసిన ద్రవరూపంలోని ఎరువు) అలాగే పంచగవ్య (అవుపేడ, ఆవు మూత్రం, పాలు, పెరుగు, నెయ్యిల మిశ్రమం) కలిపి తయారు చేసిన ఎరువులు వాడాలని పేర్కొన్నట్లు సమాచారం. ఆధునిక పరిణామాల విషయానికొస్తే జేడబ్ల్యూ లీథెర్ అనే శాస్త్రవేత్తను భారత్‌లో మృత్తికా శాస్త్ర, వ్యవసాయ రసాయన శాస్త్రాలకు పితా మహుడు అని చెప్పవచ్చు. ఆయనను భూసార పరిశోధనకు శ్రీకారం చుట్టిన మహానుభావుడని అంటారు. భూసార పరిశోధనా కేంద్రమైన పూసా పరిశోధన సంస్థ ఉద్భవించడానికి శ్రమించిన వ్యక్త్తి. అలాగే భారతదేశ హరిత విప్లవ పితామహుడు, రెండవ హరిత విప్లవానికి పునాది వేసిన మహా మనీషి, వ్యవసాయ విజ్ఞానవేత్త దివంగత డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్. ఈయన కూడా భూసార పరిరక్షణకు విశేషమైన కృషి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎంతో ఉంది.
అందుకే ప్రతియేటా డిసెంబర్ 5ను ప్రపంచ నేల దినోత్సవంగా జరుపుకోవడంలో మన మందరమూ ముందుండడం ఎంతో అవసరం. ఎందుకంటే సారవంతమైన నేలనుండి పండే ఆహార పదార్థాలు తినే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాము. అందుకే మనం భూమాతకు అత్యంత రుణపడి ఉన్నాం. అయితే అధిక దిగుబడులకోసం రసాయన ఎరువులు, అధిక మొత్తంలో విషపూరిత కీటక నాశినులను వాడుతూ సారవంతమైన నేలలను మనం పాడుచేసుకుంటున్న వైనం గమనార్హం, గర్హించదగ్గ విషయం. అందుకే ప్రపంచ నేల దినోత్సవాన మనమందరం సేంద్రియ పద్ధతులను పాటిస్తూ మన భూములను పరిరక్షించుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం. అప్పుడే మనము నేల, మొక్కలు, భూగర్భ జలాలు, జీవకోటి ఆరోగ్య సమతుల్యత లను సాధించగలం. ఒక వైపు పంట పొలాల భూసారమెంత ముఖ్యమో అలాగే రెండోవైపు పట్టణాలు/నగరాలలో నేల పరిరక్షణ కూడా అంతే ముఖ్యమన్నది నిర్వివాదాంశం.
ప్రస్తుత పరిస్థితులలో ఈ సమస్య గంభీరమై మానవ మనుగడకే పెను ముప్పుగా మారుతోంది. విపరీతంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, వాణిజ్య కార్యకలాపాలు, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న /విస్తరిస్తున్న కాలుష్య కారక పరిశ్రమల వలన, గ్రామాలనుంచి పట్టణాలకు, నగరాలకు వలసలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా నగరాలు, వాటి చుట్టుప్రక్కల ప్రాంతాలు అత్యధిక చెత్త, చెదారం, వాణిజ్య పరిశ్రమల వ్యర్థ్యాలతో నిండి కాలుష్య కాసారాలవుతున్నాయి. ఫలితంగా ఈ హానికారక వ్యర్ధాలు భూమి మీద పేరుకొని పోయి, భూమి పొరల్లోకి హానికారక ఖనిజాలు, లవణాలు, బాక్టీరియా, వైరస్‌లు ప్రవేశిస్తున్నాయి. భూమిని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. వాననీటి కుంటలు, చెరువులు, చివరకు పట్టణ ప్రాంతంలో ప్రవహించే నాలాలు, నదులు (ఉదాహరణకు హైదరాబాదులో మూసీ, ఢిల్లీలో యమున, కాన్పూర్‌లో గంగ, చెన్నైలో కూవం లాంటి నదులు) కూడా కలుషితమవుతున్నాయి. ప్రజా ఆరోగ్యం ప్రశ్నార్థకంగా నిలిచింది. ఇక మున్సిపల్ ఘన వ్యర్ధాల విషయానికి వస్తే నగరాల్లో ఎక్కడ చూసినా కుప్పలే. ఫలితంగా నగరాల్లో నేల విపరీతంగా కలుషితమవు తోందనడంలో సందేహం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని మున్సిపాలిటీకి, వ్యర్థాలను తగ్గించాలని పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి సూచిస్తుంటే, నెపాన్ని మున్సిపాలిటీ ప్రజల మీదకు, ప్రజలు మున్సిపాలిటీ, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల మీదకు నెట్టడంతో సరిపోతోంది. ఇది చాలదన్నట్టుగా జీవ వ్యర్థాలు, రసాయన వ్యర్థాలు, తోళ్ల పరిశ్రమ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, పెయింట్ వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలు, ఇనుప వ్యర్థాలు, ఎలక్ట్రికల్ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, మానవ విసర్జితాలు, చమురు వ్యర్థాలు లాంటి వాటిని ఎక్కడికక్కడ అనధికారి కంగా వదిలిపెట్టడం జరుగుతోంది.
ఈ సందర్భంగా రైతుగా రాణించాలనుకునేవారికి మొదటగా నేల స్వభావం తెలిసి ఉండాలి. పౌరుందరూ జీవనశైలిని మార్చుకొని వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన పౌరులుగా మనుగడ సాగించవచ్చు అని మన పెద్దలు చెప్పిన మాట ఇక్కడ ప్రస్తావనకు అర్హమైనది. అప్పుడే మనం మన పూర్వికులు మనకు జాగ్రత్తగా నిర్వహించి అప్పచెప్పిన నేలను మనం మన భావితరాలకు స్వచ్ఛతతో అప్పచెప్పగలం. తద్వారా ప్రపంచ నేల దినోత్సవాన్ని జరుపుకోవడంలో నిజమైన ఆనందం, అర్థం ఉంటుంది.