‘‘‌లంకాయాం శాంకరీ దేవీ….. ’’ ఆదిశంకరులు చెప్పిన అష్టాదశ శక్తిపీఠాలను స్మరించే శ్లోకంలో మొదటగా చదువుకునేది శాంకరీదేవి శక్తిపీఠం గురించే. ఈ అమ్మవారు శ్రీలంకలో కొలువై ఉంది. ఈ శక్తిపీఠాన్ని దర్శించడంతోపాటు, శ్రీలంకలోని రామాయణంతో సంబంధం ఉన్న  అనేక ప్రాంతాలను దర్శించేందుకు ఇటీవలే (అక్టోబర్‌ 27-‌నవంబర్‌ 2) ‌వరకు ఏడురోజులు ‘రామాయణ యాత్ర’ పేరుతో 45 మంది ఒక యాత్ర జరిపాం. గొప్ప అనుభూతికి లోనయ్యాం.

హైదరాబాదు నుండి నేరుగా 2 గంటలు విమానంలో ప్రయాణించి కొలంబో చేరుకున్నాం. ఇక్కడి భాష సింహళం. కొద్దిగా హిందీ, ఆంగ్లం కొన్ని ప్రదేశాల్లో తమిళం మాట్లాడేవాళ్లున్నారు. ఇక్కడి రూపాయి మన 32 పైసలకు సమానం. అంటే మన రూపాయికి 3.20 లంక కరెన్సీ పొందవచ్చు. మేం విమానం దిగగానే ఎటువంటి ఇబ్బందీ లేకుండా కరెన్సీ మార్చుకున్నాం, ఫోన్‌ ‌సిమ్‌ ‌కూడా తీసుకున్నాం. విమానాశ్రయం నుంచి… తిరిగి విమానాశ్రయం వచ్చేవరకు మా ప్రయాణం ఒక బస్సులో సాగింది.

శ్రీలంక (అధికారికంగా డెమోక్రటిక్‌ ‌సోషలిష్టు రిపబ్లిక్‌ ఆఫ్‌ శ్రీ‌లంక)ను 1972కు పూర్వం సిలోను అనేవారు. దక్షిణ ఆసియాలో చిన్న ద్వీపం. జనాభా సుమారుగా 2.6 కోట్లు. తమిళులు మైనారిటీలో అధిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌పై దాడిచేసేందుకు సంకీర్ణ దళాలకు శ్రీలంక ప్రధాన స్థావరంగా ఉపయోగ పడింది. జాతీయ రాజకీయ ఉద్యమం మూలంగా 20వ శతాబ్దం మొదటి భాగంలో 1948లో స్వాతంత్య్రం సిద్ధించింది. అప్పటి నుంచి గణతంత్ర రాజ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.

మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీలంకలో ముందుగా ‘మనవరీ’ శివాలయం దర్శించాం. ఇది కొలంబోకు 90 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడని ‘రామలింగేశ్వర’ ఆలయంగా పిలుస్తారు. తరువాత గమ్యం ‘మున్నేశ్వర’ ఆలయం, వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇక్కడి ఈశ్వరుడిని ‘మున్నైనాథర్‌’ (‌పురాతనకాలం నాటి ప్రభువు) అని పిలుస్తారు. అమ్మవారిని ‘అంబాల్‌’ (‌వాటివాంపికా దేవి) అని కొలుస్తారు. దీనిని విదేశీయులు పలుమార్లు ధ్వంసం చేశారు. 1581 ప్రాంతంలో ‘రాజాసింగ్‌’ అనే రాజు దీన్ని పునర్నిర్మించాడు. తరువాత 1750 ప్రాంతంలో కీర్తిశ్రీరాజసింహ రాజు పూనుకుని కుంభాభిషేకం, ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆలయం భారతీయ ద్రావిడ వాస్తుశిల్పానికి దగ్గరగా ఉంటుంది. ఆలయంలో ప్రధాన దేవత శివుడు. గర్భగుడి చుట్టూతా కాళి, గణేశుడు, అమ్మన్‌, ‌శైవనాయన్మార్‌ ‌సాధువులు, నవగ్రహాలు మొదలగు దేవతలకు కూడా మందిరాలు ఉన్నాయి.

రెండవ రోజు ఉదయం 8.00 గంటలకు ‘ట్రింకోమలీ’ (త్రికోణమలై) బయలుదేరాం. ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి – కోనేశ్వర ఆలయం, శాంకరీదేవి శక్తిపీఠం. ఇవి ఒక కొండపై ఉన్నాయి. చుట్టూ హిందూ మహాసముద్రం, కొండపై నుండి దృశ్యం రమణీయంగా ఉంటుంది.

రావణుడి భక్తికి మెచ్చిన శివుడి సూచనలమేరకు అగస్త్య మహర్షి ఈ ‘కోనేశ్వర’ ఆలయాన్ని నిర్మించా డట. సరిగ్గా కైలాస పర్వతం ఉన్న రేఖాంశంలోనే ఉండడం వల్ల దీనిని ‘దక్షిణకైలాశ్‌’ అని అంటారు. ప్రపంచంలోని శివుడు నివసించే మూడు ప్రధాన ప్రాంతాల్లో కైలాసపర్వతం, చిదంబరం తరువాత ఈ ఆలయాన్ని చెబుతారు. ఆలయ శాసనాల ప్రకారం ఇది 1580 బీసీఇగా నమోదై ఉంది. యోగ సూత్రాలను సంకలనం చేసిన ‘పతంజలి’ (క్రీ.పూ. 200-150) జన్మస్థలం ఇదేనట. ఈ ఆలయాన్ని కూడా పోర్చుగీసువారు 1622 ప్రాంతంలో ధ్వంసం చేశారు. తిరిగి 1952 ప్రాంతంలో ‘ట్రింకోమలీ, కోనేశ్వరం సొసైటీ’ పునరుద్ధరించింది.

శాంకరీదేవి – శక్తిపీఠం

రావణ స్తుతి సంతుష్టా కృతాలంకాధివాసినీ ।

సీతాపహరణరోషేణ త్యక్తలంకామహేశ్వరీ ।

సజ్జన స్తితి సంతుష్టా కదంబవన వాసినీ।

లంకాయం శాంకరీదేవి రక్షేత్‌ ‌ధర్మపరాయణా ।।

హిందువులంతా జీవితకాలంలో తప్పక దర్శించాలని కోరుకునే అష్టాదశ శక్తిపీఠాలలో మొదటిది శాంకరీదేవి. ఇక్కడ సతీదేవి కాలి పట్టీలు పడ్డాయని నమ్ముతారు. కోనేశ్వర ఆలయ ప్రాంగణం లోనే ఈ ఆలయం ఉంది.

రావణుడు ఇక్కడ శాంకరీ దేవికి సంక్లిష్టమైన శిల్ప శైలితో ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం అపార మైనది. లంకలోని అత్యంత అందమైన తోటను ఆలయంలో ఏర్పాటు చేశాడు. రావణుడు సీతను అపహరించి ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు, శాంకరీ దేవి కోపంగా ఉండి, సీతను రాముడికి తిరిగి ఇవ్వమని రావణుడిని కోరింది. రావణుడు అంగీక రించలేదు. ఫలితంగా, శాంకరీదేవి నిరాశ చెంది ద్వీపం వదిలి వెళ్లిపోయిందని స్థానికులు చెబుతారు. తరువాత, రాముడు రావణు డిని ఓడించినప్పుడు, విభీష ణుడు లంకకు పాలకుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. అతను శాంకరీదేవి రాజ్యానికి తిరిగి రావాలని తిరిగి వైభవం తీసు కురావాలని ప్రార్థించాడట.

శాంకరీదేవి ఆలయాన్ని కూడా పోర్చుగీసు వలస వాదులు క్రీ.శ.1500 ప్రాంతంలో ధ్వంసం చేసారు. ఆలయ సంపదనంతా దోచు కున్నారు. ప్రధానాలయంలో ఒక స్తంభం మాత్రమే మిగిలింది. స్థానికులు ఇక్కడి దేవతా విగ్రహాలను ఒక బావిలో దాచి రక్షించారట. తరువాత 1952 ప్రాంతంలో శివాలయం ప్రక్కనే స్థానిక హిందూ భక్తులు ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం అనేకమంది భక్తులు ముఖ్యంగా దక్షిణ భారతం నుండి ఎక్కువ భక్తులు వస్తున్నారు. మేం వెళ్లినరోజు మన తెలుగు రాష్ట్రాలవారు ‘చండీయాగం’ కూడా నిర్వహించారు.

తరువాత సమీపంలోనే ఉన్న ‘వేడి నీటి బావుల’ ను దర్శించాం. ఇవి ఏడు వేర్వేరు ఉష్టోగ్రతలు గల నీటితో ఉన్న బావులు. ఈ నీటితో స్నానం చేస్తే చర్మవ్యాధులు నశిస్తాయని, ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు.

మూడోరోజు ఉదయం దంబుల్లా నుండి బయలుదేరి… మేం ‘సిగిరియా’ కోట ఉన్న పర్వతాన్ని చూసాం. ఇది ఒక రాతి పర్వతంపై ఉంది. దీనినే ‘సింహగిరి’, ‘లయన్‌రాక్‌’ అని కూడా పిలుస్తారు. దీన్ని ప్రపంచపు ఎనిమిదవ అద్భుతంగా చెబుతారు. ఇది దాదాపు 660 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కోట రావణుడి రాజభవనం అని స్థానికులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులవల్ల మేం ఆ కొండపైకి వెళ్లలేదు. ఈ కోట రామాయణంలో చెప్పిన కుబేరుడి అలకాపురి కావచ్చని కూడా కొందరి అభిప్రాయం. సా.శ.477-495 కాలంలో కశ్య పుడనే రాజు దీన్ని నిర్మించాడని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. తరువాత 14వ శతాబ్ది వరకూ దీన్ని బౌద్ధారామంగా ఉపయోగించారు. ప్రస్తుతం ఈ కట్టడం యునెస్కో వారి వారసత్వ ప్రదేశంగా ఉంది.

ఇక్కడి నుండి మేం ‘హెర్బల్‌’ ‌గార్డెన్స్ ‌చూడడానికి బయలుదేరాం. సుగంధ ద్రవ్యాలు, మూలికల తోటలు ఈ ప్రాంతంలో విరివిగా ఉన్నాయి. ఇక్కడ ఆయుర్వేద వైద్యం వాడుకలో ఉంది. సాయంత్రానికి మేం ‘కాండీ’ కి చేరుకున్నాం. ఇక్కడ స్థానిక ఆడిటోరియంలో ఒక ‘సాంస్కృతిక ప్రదర్శన’ తిలకిం చాం. సుమారు గంటపాటు అద్భుతంగా సాగిన ఈ ప్రదర్శన మనసులను తేలిక చేసింది. సాధారణ నృత్యాలతో పాటు, ఒళ్లు గగుర్పొడిచే విధంగా సాగిన ‘అగ్నికీలల విన్యాసం’ ఆకట్టుకుంది.

నాలుగవరోజు ‘కాండీ’ నుండి బయలుదేరి బుద్ధుడి పవిత్ర దంత అవశేషాల ఆలయం – చేరుకున్నాం. దీనిని ‘టెంపుల్‌ ఆఫ్‌ ‌ద సేక్రెటట్‌ ‌టూత్‌ ‌రెలిక్‌’ అనీ, ‘శ్రీదళద మాళిగవా’ అనీ పిలుస్తారు. ఈ ఆలయం 15వ శతాబ్దంలో నిర్మించారట. బుద్ధుడి పవిత్ర దంతాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారు. ఈ దంత అవశిష్టం భారత్‌ ‌నుండి తీసుకువచ్చారట. ఈ దంతం ఉన్న రాజ్యం సుభిక్షంగా ఉంటుందని రాజులు నమ్మేవారట. ప్రపంచంలోని ప్రముఖ బౌద్ధక్షేత్రాలలో ప్రముఖమైనది. ఇది సుమారు 6 మీటర్ల ఎత్తులో రెండు అంతస్తులుగా ఉంటుంది. మొదటి అంతస్తులో బంగారు కుర్చీలో కూర్చున్న బుద్ధుని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం శిల్పకళ, భవనసౌందర్యం చాలా విశేషంగా, గొప్పగా ఉన్నాయి. బౌద్ధులు శ్వేతవర్ణానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పూలు తీసుకుని దర్శనానికి వస్తారు. వందల సంఖ్యలో భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ ఉన్నా మనస్సుకు చక్కటి పవిత్ర భావన కలుగుతుంది. ప్రతి సంవత్సరం జులై చివరి నుండి ఆగస్టు మధ్య వరకు, కాండీ బుద్ధ టూత్‌ ‌ఫెస్టివల్‌ను (క్యాండీ ఎసల పెరహెరా) జరుపుకుంటారు, వేడుక సందర్భంగా, వీధుల్లో అందమైన ఏనుగుల ఊరేగింపు, అలాగే వివిధ జాతి నృత్యాలు, ప్రదర్శనలు ఉంటాయి.

మా తరువాతి గమ్యం – ‘రంబోడా’ హనుమాన్‌ ఆలయం. సీతను వెదుకుతూ లంకకు వచ్చిన హనుమ పప్రథమంగా లంకలో ఈ ప్రదేశంలోనే కాలుమో పాడని చరిత్ర. ఒక అందమైన కొండపై ఈ ఆలయాన్ని ‘చిన్మయ మిషన్‌’ ‌వారు 1981లో నిర్మించారు. ఈ ఆలయంలో తమిళనాడులోని మహాబలిపురంలో చెక్కిన 18 అడుగుల హనుమ విగ్రహం ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడ మేం హనుమాన్‌ ‌చాలీసా, హనుమంతుడి స్తోత్రాలు పఠించాం. ఆహ్లాదకరమైన వాతావరణం, పరిసరాలు మమ్మల్ని భక్తి పారవశ్యంలో ముంచేశాయి. ఇక్కడే చిన్మయ మిషన్‌ ‌వారు ‘అన్నపూర్ణ’ పేరుతో ఆహారశాల నిర్వహిస్తున్నారు. రాత్రికి ‘నువారా ఎలియా’ చేరుకున్నాం. శ్రీలంకలో అత్యంత సుందరమైన ప్రదేశం, పర్యాటకులు విశేషంగా చేరుకునే స్థలం – నువారా ఎలియా. ఇది సముద్ర మట్టానికి 1868 మీటర్ల ఎత్తులో ఉంది. అందమైన ప్రకృతి దృశ్యాలు, టీ తోటలు, చల్లటి వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. దీనిని ‘లిటిల్‌ ఇం‌గ్లండ్‌’ అని పిలుస్తారు. శ్రీలంకలో ఈ ప్రదేశం మన ‘కశ్మీర్‌’ ‌వంటిది.

మా అయిదవరోజు ప్రయాణం – అశోక వాటికకు. ఇది నువారా ఎలియాలో ఉన్న ఒక తోట. రావణుడు సీతమ్మను బంధించి ఇక్కడే ఉంచాడని రామాయణం చెబుతున్నది. ప్రస్తుతం ఇక్కడ సుందర ఆలయం ఉంది. ఈ ప్రాంగణంలో సీతమ్మ, సీతారామలక్ష్మణుల ఆలయాలు ఉన్నాయి. పక్కనే సీతమ్మ స్నానం చేసిందని చెప్పుకునే ఒక నీటిప్రవాహం ఉంది. ఆ ప్రక్కనే సీతమ్మ కూచుని ఉండేదని, హనుమ ఇక్కడే అమ్మను దర్శించాడని తెలుస్తున్నది. ఇక్కడ హనుమ మోకాలి గురుతులు ఒక బండ రాయిపై ఉన్నాయి. భక్తులు ఈ ప్రదేశాన్ని దర్శించి, సాష్టాంగ ప్రణామాలు చేస్తారు. ఈ ఆలయం కూడా పూర్తిగా మన దక్షిణభారత సంప్రదాయంలో భారతీయ తమిళులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మాకంటే ముందుగా వచ్చిన మరో తెలుగువారి సమూహం సీతారామ కల్యాణం వైభవంగా జరిపించింది. 100-150 మంది భక్తులు పాల్గొన్నారు. రామాయణ ఘట్టాలను నెమరేసుకుంటూ, ‘సీతమ్మ’ తల్లిని తలచు కుంటూ కొద్దిసేపు అక్కడ ప్రార్థనలు చేసాం.

ఇక్కడికి సమీపంలో ఉన్న ‘గ్రెగరీ లేక్‌’‌లో కొద్దిసేపు నౌకావిహారం చేసాం. చల్లటినీళ్లు, మరింత చల్లటి వాతావరణం… ఎంతో ఆహ్లాదంగా ఉంది.

ఆరో రోజు ఉదయమే బయలు దేరి.. దాదాపు 7 గంటలు ప్రయాణం చేసి, సాయంత్రానికి కొలంబో చేరాలి. కొలంబో సమీపంలోనే విభీషణుడి ఆలయం దర్శించాం. రావణుడి సోదరుడిగా రాక్షసుడిగా జన్మించినప్పటికీ విభీషణుడు ధర్మవంతుడు, నీతి మంతుడు. సీతాపహరణానికి, రాముడితో యుద్ధానికి వ్యతిరేకి. యుద్ధంలో రాముడికి సహకరించాడు. శ్రీరాముడు విభీషణుడిని స్నేహితుడిగా, సలహా దారుగా స్వీకరించి గౌరవించాడు. తరువాత లంకకు పట్టాభిషిక్తుడయ్యాడు. విభీషణున్ని లంకను సంరక్షించే దేవతగా ఇక్కడ కొలుస్తారు. తరువాత ‘లోటస్‌ ‌టవర్‌’ ‌చూసాం. 351.5 (1153 అడుగులు) మీటర్ల ఎత్తులో ఇది దక్షిణాసియాలోనే ఎత్తయినది. ఆసియాలో 11వ, ప్రపంచంలో 19వ ఎత్తయిన నిర్మాణం. దాదాపు 3 లక్షల చదరపు అడుగులకు పైగా వైశాల్యంతో శ్రీలంకలో ఇది పెద్ద పర్యాటక ఆకర్షణగా ఉంది. ప్రవేశ రుసుము 20 అమెరికన్‌ ‌డాలర్లు. ఇందులో పెద్ద మాల్స్, ‌రివాల్వింగ్‌ ‌రెస్టారెంట్‌ ఉన్నాయి. లిఫ్టులద్వారా పై అంతస్థు వరకు చేరుకోవచ్చు. తరువాత పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించాం. శ్రీలంకలో ఇదే మొట్టమొదటి హనుమంతుడి గుడి అని చెబుతున్నారు. హనుమతో పాటు గణపతి, శివుడు, రామపరివారం మొదలగు దేవతలు కూడా ఈ ఆలయంలో కొలువైయున్నారు.

ఏడోరోజు ఉదయం 11 గంటలకు మా తిరుగు ప్రయాణం. ఉదయమే కొలంబోలో మరో ప్రముఖ మైన ఆలయం ‘పొన్నంబలవనేశ్వర’ శివాలయం. ఇది నల్ల గ్రానైట్‌ ‌రాతితో, పూర్తిగా భారతీయ సాంప్ర దాయంలో ఉంది. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే కాళహస్తీశ్వరుడి ఆలయంలా అనిపిస్తుంది. శివుడితోపాటు, అమ్మవారు, గణపతి, నవగ్రహాలు ఇతర దేవతలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయంలో ఎక్కువమంది భారతీయ హిందూ భక్తులు కనిపించారు. దాదాపు ఏడురోజులు సాగిన మా యాత్ర ముగిసింది. మధుర స్మృతులతో, భక్తిపార వశ్యంతో గుండె నిండుగా తృప్తితో సాయంత్రానికల్లా ఇంటికి చేరుకున్నాం. 45 మందితో సాగిన యాత్ర ప్రతిరోజు ‘భారత్‌మాతాకీ జై’ నినాదంతో ప్రారంభ మయ్యేది. బస్సులో ఏకాత్మతస్తోత్రంతో పాటు భజనలు, స్తోత్రాలు పఠిస్తూ 45 మందినీ ఒకే కుటుంబ సభ్యులుగా, భారతీయ ఏకాత్మ భావనను పండించింది.

 – మామిళ్లపల్లి రామ్మూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE