ఈశాన్య భారత రాష్ట్రం అస్సాం ప్రభుత్వం ఇటీవల చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ఎవరైనా ఒకటికన్నా ఎక్కువ వివాహాలు చేసుకోకూడదు. ఇలాంటి వివాహాలకు చట్టబద్దత ఉండదు. ఇటీవలే మంత్రి మండలి ఆమోదం పొందిన అసోం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమీ బిల్లు-2025 (అస్సాం బహు భార్యత్వ నిషేధ బిల్లు -2025)ను ఆ రాష్ట శాసనసభ శీతాకాల సమావేశాల తొలిరోజు నవంబర్ 27న ప్రవేశ పెట్టారు. సభ ఆమోదంతో అది చట్టరూపాన్ని సంతరించుకుంది. ఈ బిల్లును ఆమోదించడానికి ముందు అసెంబ్లీలో చర్చ జరిగింది.
ఈ కొత్త చట్టం ప్రకారం.. ఎవరైనా బహు భార్యత్వానికి పాల్పడితే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. మొదటి వివాహం చెల్లుబాటులో ఉన్నప్పుడు లేదా విడాకుల ద్వారా రద్దు కానప్పుడు మరొకరిని వివాహం చేసుకోవడాన్ని ఈ చట్టం బహుభార్యత్వంగా నిర్వచించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అసెంబ్లీలో జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. ఈ చట్టాన్ని తీసుకురావడానికి కారణాలకు వివరించారు.
మహిళలకు న్యాయం చేసే చట్టం
బహు భార్యత్వ నిషేధ చట్టం ఇస్లాం సహా ఏ మతానికి వ్యతిరేకం కాదని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ముస్లింలకు ఉద్దేశించే ఈ బిల్లును తెచ్చారనే ఆరోపణను తోసిపుచ్చారు ‘‘ఇస్లాం బహుభార్యత్వాన్ని ప్రోత్సహించదు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. మీరు నిజమైన ముస్లింగా ఉండటానికి అవకాశం లభిస్తుంది. నిజమైన ముస్లింలు ఈ చట్టాన్ని స్వాగతిస్తారు. టర్కీ వంటి దేశాలు కూడా బహుభార్యత్వాన్ని నిషేధించాయి. పాకిస్తాన్‌లో కూడా ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఉంది’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కొత్త జీవిత భాగస్వామి దగ్గర మునుపటి వివాహాన్ని దాచడం నేరం. ఇందుకు పదేళ్ల దాకా జైలు శిక్ష పొడిగించవచ్చు. ఈ చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తి రాష్ట్రం నిధులు సమకూర్చే ప్రభుత్వ ఉద్యోగానికి, అస్సాంలో జరిగే ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడు. పురుషులు చేసుకున్నా ఒకటికి మించి వివాహాల మహిళలు ఎదుర్కొంటున్న బాధను దృష్ట్యా సమాజాన్ని శాస్త్రీయంగా నియంత్రించడమే ఈ చట్టం లక్ష్యం. బాధిత మహిళలకు పరిహారం అందించే నిబంధనను కూడా ఉంది. ఇందు కోసం కొత్తగా నిధిని ఏర్పాటు చేసి బాధిత మహిళలకు పరిహారం అందజేస్తారు.
షెడ్యూల్డ్ తెగలకు వర్తించదు
భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో పేర్కొన్న గిరిజన ప్రాంతాలకు, షెడ్యూల్డ్ తెగలకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే వారి సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు భంగం కలగకుండా చూశారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద ఉన్న బోడోలాండ్ టెరిటోరియల్ ప్రాంతం దిమా హసావో, కర్బి అంగ్లాంగ్, పశ్చిమ కర్బి అంగ్లాంగ్ వంటి కొండ జిల్లాలకు ఈ చట్టం వర్తించదు.
ఉమ్మడి పౌరస్మృతి దిశగా..
వచ్చే ఎన్నికల్లో మరోసారి తమ పార్టీ మరోసారి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశాక అసెంబ్లీ సమావేశాల మొదటి సెషన్‌లోనే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తీసుకొస్తానని హిమంత బిశ్వ శర్మ ప్రతిజ్ఞ చేశారు. బహుభార్యత్వ నిషేధ చట్టం అస్సాంలో యూసీసీ వైపు వేసిన మొదటి అడుగు అని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోకూడదని, ఇది సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. కొన్ని మతాలు రెండో పెళ్లికి అనుమతి ఇస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని వివరించారు. మోసపూరిత, బలవంతపు మత మార్పిళ్ల ద్వారా జరిగే వివాహాలను అడ్డుకునేందుకు చట్టాలు అవసరమని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరులోగా ఈ బిల్లును అమలులోకి తీసుకువస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం లవ్ జిహాద్‌ను నిషేధిస్తుందని ఇటీవలే హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. ఇంతకుముందు బాల్య వివాహాలు చేసుకున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంది అసోం ప్రభుత్వం. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దాదాపు 3వేల మందికి పైగా అరెస్టు చేసింది.
ప్రోత్సహించినా శిక్ష తప్పదు
విడాకులు ఇవ్వకుండా మరో వివాహం జరిపిస్తే… దీన్ని నిర్వహించిన పూజారి లేదా ఖాజీకి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 1.5 లక్షల వరకు జరిమానా విధించవచ్చని బిల్లు పేర్కొంది. గ్రామ పెద్దలు, ఆయా సమాజ నాయకులకు బహుభార్యాత్వ వివాహాలను ఉద్దేశపూర్వకంగా సమర్ధించినా శిక్షలు తప్పవు. గత వివాహ చరిత్రలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టే తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కాగా ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెట్టేందుకే బహుభార్యత్వ నిషేధ బిల్లును తీసుకొచ్చారని ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే మజీబుర్ రెహ్మాన్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి రెండు లేదా మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకునేందుకు మినహాయింపులు ఇచ్చినప్పుడు ముస్లింలు ఎందుకు రెండు సార్లు పెళ్లి చేసుకోరాదు? అని ప్రశ్నించారు.
ఉమ్మడి పౌరస్మృతి అవసరం
దేశంమొత్తానికి వర్తించే ఉమ్మడి పౌరస్మృతి లేనందున, వివాహం, విడాకులు, వారసత్వ విషయాలు మతపరమైన గుర్తింపు ఆధారంగా వ్యక్తిగత చట్టాలే అమలవుతున్నాయి. మన దేశంలో ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలు ఉండటం చట్టరీత్యా నేరం. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం ఇందుకు అనుమతి లేదు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద దీన్ని నేరంగానే పరిగణిస్తారు. హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా హిందూ వివాహ చట్టం పరిధిలోకే వస్తారు. పార్సీ వివాహం విడాకుల చట్టం 1936 ద్విభార్యత్వాన్ని స్పష్టంగా నిషేధిస్తుంది. భారతీయ క్రైస్తవ వివాహ చట్టం 1872 ఎవరైనా ఇప్పటికే వేరొకరిని వివాహం చేసుకున్నట్లయితే వారి వివాహాల ధ్రువీకరణను నిషేధిస్తుంది.
ముస్లిం పురుషులు నలుగురు భార్యలను కలిగి ఉండటానికి చట్టబద్ధంగా అనుమతిస్తారు. బహు భార్యాత్వానికి సంబంధించి బీఎన్‌ఎస్ శిక్షా నిబంధనలు ముస్లిం పురుషులకు వర్తించవు. ఒక హిందువుకు జైలు శిక్ష విధించదగిన చర్య ముస్లింకు చట్టబద్ధమైన హక్కు. ఈ ద్వంద్వ విధాన చట్టాల కారణంగానే దేశవ్యాప్తంగా ఉమ్మడి చుట్టూ జరుగుతున్న చర్చ కేంద్ర బిందువుగా మారింది. మరో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పటికే బహుభార్యాత్వాన్ని నిషేధించారు. గోవాలో ఒక శతాబ్దానికి పైగా అంటే భారతదేశంతో విలీనం కావడానికి చాలా కాలం ముందు నుండి ఏకరూప పౌరచట్టం. 1961లో విముక్తి పొందిన తర్వాత కూడా, పోర్చుగీస్ సివిల్ కోడ్, 1867ను రాష్ట్రం నిలుపుకుంది. గోవాలో వివాహం అనేది వేర్వేరు లింగాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం. వివాహానికి నమోదు తప్పనిసరి. ఇది ఏకపత్నీ వ్రత్యాన్ని తప్పనిసరి చేస్తుంది కాబట్టి, గోవాలోని ముస్లిం పురుషుడు చట్టబద్ధంగా రెండవ భార్యను కలిగి ఉండకూడదు.
కాగా గోవా సివిల్ కోడ్ హిందువులకు ప్రత్యేకమైన, పురాతనమైన నిబంధనను ఉంది. హిందూ పురుషుడు నిర్దిష్ట పరిస్థితులలో రెండవసారి వివాహం చేసుకోవడానికి అనుమతిస్తుంది: అతని భార్య 25 ఏళ్లలోపు గర్భం దాల్చకపోతే లేదా 30 ఏళ్లకు మగబిడ్డను ప్రసవించకపోతే అనుమతిస్తారు. ఈ నిబంధన చట్టంలో ఉన్నప్పటికీ 1910 నుండి ఎవరికీ దీనివల్ల ప్రయోజనం కల్పించలేదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. 2015లో సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం బహు భార్యత్వం ఇస్లాంలో అంతర్భాగం కాదు. అటువంటి ఆచారాలను సంస్కరించే అధికారం రాష్ట్రానికి ఉందని చెప్పింది. బహుభార్యత్వాన్ని నిషేధించే తదుపరి రాష్ట్రం గుజరాత్ కావచ్చు. ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని అంచనా వేయడానికి, ముసాయిదా సిద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ముస్లింలలో బహుభార్యత్వాన్ని రద్దు చేయాలని 2015లోనే గుజరాత్ హైకోర్టు పిలుపు నిచ్చింది.
బహుభార్యాత్వంపై ఇస్లాం ఏమంటోంది?
అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చిన బహుభార్యత్వం చట్టం ముస్లింలను వేధించేందుకే అని ఒక వాదన. కానీ అన్ని మతాలకూ ఈ చట్టాన్ని వర్తింపచేశారు. ఇస్లాం ఏకపత్నీవ్రతానికి వ్యతిరేకమంటారు. కానీ అది నిజం కాదు. అయితే బహుభార్యాత్వానికి అంగీకరించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏ సందర్భలో ఇస్లాం బహుభార్యత్వాన్ని అంగీకరిస్తుందో పరిశీలించాలి.
ఒకటి కంటే ఎక్కవ పెళ్లిళ్లకు వెసులు బాటు కల్పించినా ఎవరి ఇష్టమొచ్చినట్లు పెళ్లిళ్లు చేసుకోమని కాదు. జనాభాలో ఆడవాళ్ల శాతం ఎక్కవగా ఉండి..మగవాళ్ల శాతం తక్కవగా ఉన్న పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఈ వెసలుబాటు కల్పించారు. ఆ పరిస్థితిలో మాత్రమే బహుభార్యాత్వానికి ఇస్లాం అంగీకరిస్తుంది. ఒకవేళ ఒకరికి ఒకే పెళ్లి అన్న కఠిన నింబంధన పెడితే.. మిగిలిన వారు వ్యభిచారి ణులుగా మారే అవకాశం ఉందని ఆనాటి పరిస్థి తులకు అన్వయించారు. ఈ సూక్ష్మదృష్టితో ఆలోచించే బహుభార్యాత్వానికి ఇస్లాం ఆమోదించిందని చెబుతారు. ఈ నింబంధనను అడ్డుపెట్టుకొని ఇష్టమెచ్చినట్లు ప్రవర్తిస్తానంటే ఇస్లాం ఒప్పుకోదు. ముస్లిం భార్య ఉండగానే మరో మహిళను పెళ్లి చేసుకోవాలంటే, ఆ ప్రాంతంలో ఆడవాళ్ల జనన శాతం మగవాళ్ల కంటే 25 శాతం ఎక్కువగా ఉండాలి. మగవాడికి పోషించే స్తోమత తప్పనిసరి. అలాగే చేసుకున్న వారందరినీ సమానంగా చూసుకోవాలి. వారి ద్వారా పుట్టే పిల్లలనూ సమానంగా చూడాలి. ఏ విషయంలో పొరపొటు దొర్లినా ఇస్లాం అంగీకరించదు.
బిచ్చమెత్తుకుంటున్నా వరస పెళ్లిళ్లా?
భార్యలను పోషించే ఆర్థిక స్తోమత లేని ముస్లిం పురుషుడు బహుభార్యాత్వం పాటించకూడదని కేరళ హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. బహుభార్యాత్వం ఇస్లాంలో ఒక హక్కు కాదని, మినహాయింపు మాత్రమేనని న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలోనే జస్టిస్ పి.వి. కున్హికృష్ణన్ ఈ తీర్పు ఇచ్చారు.
ఒక ముస్లిం భిక్షాటన చేస్తూ వరుసగా వివాహాలు చేసుకోవడాన్ని ఆమోదించలేమని అన్నారు. పెరింతల్మన్నకు చెందిన 39 ఏళ్ల మహిళ తన భర్త నుంచి నెలకు రూ.10,000 భరణం కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె భర్త 46 ఏళ్ల అంధుడు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. గతంలో ఆమె ఇదే పిటిషన్‌ను కుటుంబ కోర్టులో దాఖలు చేయగా.. అడుక్కుని జీవించే వ్యక్తిభరణం చెల్లించమని ఆదేశించలేమని కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. ‘‘ఒక భిక్షగాడి పాత్రలో చేయి పెట్టొద్దు’’ అని మలయాళీ సామెతను వ్యంగ్యంగా ప్రస్తావించింది. అయితే తన భర్త అంధుడైనప్పటికీ హింసిస్తున్నాడని, మూడో వివాహం చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆ మహిళ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై న్యాయస్థానం స్పందించింది. భార్యను పోషించే స్తోమత లేని వ్యక్తి ఎక్కువ వివాహాలు చేసుకోవడం ఇస్లాం ప్రకారం కూడా సమ్మతం కాదు అని స్పష్టం చేసింది. అవిద్య వల్లనే ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయని, భిక్షాటన చేస్తూ వరుసగా వివాహాలు చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘‘ఒక ముస్లిం పురుషుడు భార్యలందరికీ న్యాయం చేయగలిగితే మాత్రమే ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడం ఆమోదయోగ్యం’’ అని ధర్మాసనం వివరించింది. అనేకమంది ముస్లింలు ఏకపత్నీ వ్రతాన్ని పాటిస్తున్నారని.. ఇది ఖురాన్ నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని కోర్టు పేర్కొంది.

క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్