తెలంగాణలో భూముల పంచాయితీ నడుస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్‌గా పరిస్థితి తయారయ్యింది. నువ్వెందుకు అమ్ము కుంటున్నావ్? అంటే.. అప్పుడు నువ్వెందుకు అమ్ముకున్నావ్? అన్న రీతిలో ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం సాగుతోంది. ‘మేము మళ్లీ అధికారంలోకి వస్తే.. అమ్ముకోవడానికి భూములు వద్దా?’ అన్నట్టుంది.. బీఆర్‌ఎస్ తీరు. ఇటు.. ‘అప్పుడు మీరు చేయగా లేనిది.. ఇప్పుడు మేం చేస్తేనే ఎత్తి చూపుతారా చేస్తారా? అన్నట్లు కనిపిస్తోంది ప్రస్తుత అధికార పక్షం తీరు. ‘మీరు చేస్తూంటే మేము చూస్తూ ఊరుకోబోం’ అన్న బీఆర్‌ఎస్ హెచ్చరికలను, ఆరోపణలకు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండిస్తూ, వివరణ ఇచ్చుకోవడాన్ని బట్టి ఈ అంశం ఎంత ప్రాధాన్యమైనదో అర్థమవుతోంది.
రాష్ట్రంలో భూదందా వ్యవహారం రెండు రకాలుగా సాగుతోంది. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ మొదలు పెట్టిన దానిని కాంగ్రెస్ ప్రభుత్వం మరోరకంగా అనుసరిస్తోంది. ఒకటి`ప్రభుత్వ భూముల వేలం కాగా, మరోటి, కంపెనీలకు తక్కువ ధరలకు సర్కారు భూములను కేటాయించడం. అయితే భూముల వేలం విషయంలో పెద్దగా విభేదాలు, వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు లేకపోయినప్పటికీ.. ప్రైవేటు, కార్పొరేట్, అంతర్జాతీయ కంపెనీలకు వాటిని అతి తక్కువ ధరలకు కేటాయించే అంశమే ఇప్పుడు వివాదాస్పదంగా తయారయ్యింది.
కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకాలు, లెక్కలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్‌ది ల్యాండ్ లూటింగ్ పాలసీ అని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక భూములను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రెవేటు వ్యక్తులకు తెగనమ్ముతున్నారని, ముఖ్యమంత్రి పేరు ‘అనుముల రేవంత్ రెడ్డి’ కాదని, ‘అమ్మకాల’ రేవంత్‌రెడ్డి అని వ్యక్తిగత విమర్శలు చేశారు. రూ. 5 లక్షల కోట్ల విలువైన భూములను కేవలం రూ.5 వేల కోట్లకే ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. ‘ఇది మీ అయ్య జాగీర్ కాదు.. బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదు’ అనీ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ పాలసీ కాదని.. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ‘లూటింగ్’ పాలసీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నమ్మకాన్ని పెంచితే, కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకాన్ని పెంచిందని వ్యాఖ్యానించారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 9వేల 292 ఎకరాల పారిశ్రామిక పార్కుల భూముల విలువ రూ. 5 లక్షల కోట్లు కాగా, వాటిని రూ. 5 వేల కోట్లకే ఎందుకు? ఎలా? కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటని నిలదీశారు. ఈ అక్రమం రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ కంటే రెండు రెట్లు అధికమని తెలిపారు.
టీజీఐఐసీ రేటును పక్కనబెట్టి, భూమి ఎస్‌ఆర్‌వో రేటులో 30 శాతం కడితే చాలని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌వో ధరలు తక్కువగా ఉన్నాయని. త్వరలో పెంచుతామని ప్రకటనలు చేసిన రేవంత్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు పెంచలేదు. పారిశ్రామిక వేత్తలకు ఒక విధానం, పేదలకు ఒక విధానమా? సవరించిన భూముల రేట్లు కేవలం పేదలకేనా? పేదవాడు కొన్న భూమికి ఎస్‌ఆర్‌వోపై 60 – 80 శాతం ఎల్‌ఆర్‌ఎస్ వసూలు చేసి, ఇప్పుడు పారిశ్రామిక భూములను 30 శాతానికే మల్టీపుల్ జోన్‌గా మారుస్తున్నారు.
పేదవాడికి ఒక న్యాయం.. పెద్దోడికి ఒక న్యాయం ఉంటుందా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దేశంలో ఇంత పెద్ద అవినీతి వ్యవహారం మరొకటి లేదని, దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇక, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు.. మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పదేపదే చెబుతున్నవి కాకి లెక్కలే అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు ధ్వజమెత్తారు. ఈ డొల్లతనం సాక్షాత్తూ కంప్రోల్టర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) అక్టోబరు నివేదికలో బట్టబయలైందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అప్పులతో ఆస్తులు సృష్టిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు అప్పుల సునామీతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తోందని అన్నారు. ‘బీఆర్‌ఎస్ సర్కారు పదేళ్ల రూ. 2లక్షల 80 వేల కోట్ల అప్పులతో కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ఉత్పాదక ఆస్తులు సృష్టించిందని పార్లమెంటు వెల్లడిరచిన లెక్కలు చెతుతున్నాయి.
కాంగ్రెస్ 23 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టు నిర్మించకుండా, మౌలిక వసతులకు ఒక ఇటుక కూడా పేర్చకుండానే రూ. 2 లక్షల 30 వేల కోట్ల అప్పు చేశారు. వీటిని ఢల్లీికి మూటలు మోయడానికే వీటిని ఉపయోగిస్తున్నారు ’అని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రాష్ట్రాన్ని ‘స్కాంగ్రెస్ ఏటీఎం’గా మార్చారని మండిపడ్డారు. ప్రతి నెలా రూ. 6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లు అప్పులపై వడ్డీలు కడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ పదే పదే చెబుతున్నారని, కాగ్ నివేదిక ప్రకారం చూస్తే ఈ ఏడాది ఏప్రిల్- అక్టోబరు మధ్య అప్పులపై రూ.16వేల 529 కోట్ల పైచిలుకు వడ్డీ చెల్లించిందని, అంటే నెలకు సగటున 2వేల 361 రూ. కోట్ల పైచిలుకు మాత్రమే వడ్డీ చెల్లింపులకు వినియోగిస్తు న్నారని అర్థమవుతోందన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా 7 నెలల్లో తెచ్చిన అప్పుల వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. వడ్డీల పేరుతో పదేపదే అబద్ధాలు చెబుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఈ అప్పులన్నింటినీ తమ అనుచరులు, మధ్యవర్తులు, ఢల్లీికి మూటలను పంపడానికే ఉపయోగిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
బీఆర్‌ఎస్ నేతల మాటల దాడికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పందిస్తూ, అదంతా బీఆర్‌ఎస్ కుట్రలు అని మీడియాకు వివరించారు. దమ్ముంటే ఆ ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. అంతేకాదు.. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఫ్రీహోల్డ్ జీవోల వెనుక ఉన్న రూ. లక్షల కోట్ల మతలబేంటి? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ పాలసీపై బీఆర్‌ఎస్ నేతలు చేసిన విమర్శలను మంత్రి తిప్పికొడుతూ, అబద్ధాలు ప్రచారం చేయడం కేటీఆర్, హరీశ్‌రావుకు వెన్నతో పెట్టిన విద్య అని,తిమ్మిని బమ్మిని చేయడంలో వారిని మించినవారు మరొకరు లేరని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. వాళ్లు పదేపదే చేస్తున్న రూ. 5 లక్షల కోట్ల దుర్వినియోగం ఆరోపణలు పూర్తిగా నిరాధారం, అవాస్తవమని అన్నారు. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టి మాట్లాడాలని, లేదంటే ఈ ప్రచారం పచ్చి అబద్ధం, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నదని ఒప్పుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 2023 ఆగస్టులో బీఆర్‌ఎస్ తెచ్చిన ఫ్రీహోల్డ్ జీవోలు 19, 20, 21 వెనుక ఉన్న రూ. లక్షల కోట్లు మతులబు గురించి ముందు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అజమాబాద్, బాలానగర్, హాఫీజ్‌పెట్ ఇండస్ట్రీయల్ లీజ్ ల్యాండ్స్‌ను ఫ్రీ హోల్డ్ చేయాలని చూశారని శ్రీధర్ బాబు ఆరోపించారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు.. ప్రభుత్వం నుంచి తీసుకున్న లీజు భూములకు ఫ్రీ హోల్డ్ హక్కులు ఇచ్చి 100 – 200 శాతం ఛార్జీలు విధించి వాళ్లు వసూలు చేద్దామను కున్న రూ. లక్షల కోట్ల సంగతేంటని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు దక్కకుండా బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వం 9వేల 292 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిందని తమపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ భూముల్లో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసిన ప్రాంతం ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ 4వేల 740 ఎకరాలేనని, ఇవి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములని స్పష్టం చేశారు. మిగిలిన భూములు రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించామని తెలిపారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నేతలు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
రాష్ట్ర ఖజానాకు రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని సమకూర్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలు అవినీతి వ్యవహారాలు అలవాటైన బీఆర్‌ఎస్ నేతలకు మింగుడు పడటం లేదని శ్రీధర్ బాబు విమర్శించారు. గత ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిరదని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని వెల్లడిరచారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చూస్తూ పని చేస్తున్నామని అన్నారు. గ్లోబల్ సిటీ చేయాలని చేస్తున్న ఆలోచనలను బీఆర్‌ఎస్ అడ్డుకోవాలని చూస్తుందని అన్నారు.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ ఫార్మేషన్ పాలసీ వెనుక రూ. ఐదు లక్షల కోట్ల భూ అవినీతి జరిగిందని, ఈ వ్యవహారంలో రూ. 50 వేల కోట్లు ముఖ్యమంత్రి జేబులో వేసుకోవాలని చూస్తున్నారని తారక రామారావు ఆరోపించారు. దీనిపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోనే తాము అనుసరిస్తున్నామని, తాము ఇంకా అలాంటి జీవోనే ఇవ్వలేదని స్పష్టత నిచ్చారు. మీరు జీవో ఇవ్వకుండానే బీఆర్‌ఎస్‌కు ఎలా వెళ్లిందని మీడియా ప్రశ్నించగా దాట వేశారు.
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఓవైపు బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలను తిప్పికొడుతూనే.. మరోవైపు.. అట్నుంచి కూడా నరుక్కొస్తోంది. ప్రభుత్వం నిర్ణయాలపై బీఆర్‌ఎస్‌కు సమాచారం ఇస్తున్న వాళ్లెవరు? సచివాలయంలో ఆర్డర్లు మాయం వెనుక ఉన్నవాళ్లెవరు? అనే అంశాలపై ఆరా తీయిస్తోంది. ఇంటెలిజెన్స్ అధికారులు ఈ అంశాలను నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారని చెబుతున్నారు. సచివాల యంలో డ్రాఫ్ట్ దశలో ఉన్న ఆర్డర్లు మాయమవు తుండటం, అవి కాస్తా బీఆర్‌ఎస్ ఆఫీసుకు చేరుతుండ టాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసు కుంటోంది. ఈ క్రమంలో సమగ్ర విచారణ ప్రారంభమైంది.
– సుజాత గోపగోని, సీనియర్ జర్నలిస్ట్, 6302164068