‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
మతి భానుమూర్తి
నతవాడి రాజధాని మడపల్లె.
కోట సింహద్వారం దాటి రాజప్రాసాదం వద్ద ఆగింది రెండు గుర్రాలు పూన్చిన రథం. అందులో నతవాడి మహారాజు ఒక్కమల్ల రుద్రుడు ఆయన సతీమణి పట్టమహిషి మైలాంబిక, వారి బావమరిది గణపతిదేవుడు ఉన్నారు.
అల్లంశెట్టితో మాట్లాడి ఇచ్చిన నగలు కుదువ పెట్టుకుని కావాల్సిన సొమ్ము వెనువెంటనే స్వయంగా తానే తీసుకొచ్చి బావగారి చేతిలో పెట్టాడు. ఈ సంఘటన అతనిలో కొత్త కుతూహలాన్ని రేకెత్తిం చింది.
బిలబిలమంటూ భటులు, పరిచారికలు పరిగెత్తుకు వచ్చారు. రథం నుంచి ముగ్గురూ దిగారు. భటులు రథంలోని నాణేల మూటలను లోపలికి తరలిస్తుండగా గణపతి భవన పరిసరాలను పరికించి చూస్తున్నాడు.
కోట నిర్మానుష్యంగా లేదు కాని నిరాడంబరంగా ఉంది.రాజభవనం రంగు వెలసిపోయి ఉంది.
భటులు, గుర్రాలు, రథాలు..ఏవీ హడావిడిగా తిరగడం లేదు. ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్లు కదలాడుతున్నారు భటులు. వారి దుస్తులు, ఆయుధాలు.. కూడా ఏమంత నాణ్యమైనవిగా లేవు.
‘‘లోపలికిరా తమ్ముడూ..’’ అక్క పిలుపుతో పరిశీలన ఆపి లోపలికి నడిచాడు. లోపలికి బయటకు పెద్ద తేడా లేదు. నిస్తేజంగా పాడుపడిన భవంతిలా ఉంది. రకరకాల ఉద్యోగులు హడావిడిగా తిరుగు తుంటే ఆ చైతన్యం వేరు.. నలుగురైదుగురు మెల్లగా నడుస్తుంటే.. ఛ..ఛ.. చాలా చిరాకు పడిపోయాడు గణపతి.
తమ అంతఃపురం అక్కలు, చెల్లెళ్లు, వాళ్ల స్నేహితురాళ్లు, ఇతర బంధుమిత్రులు, పిల్లలు చక్కగా అలంకరించుకొని ఎప్పుడూ ఉత్సాహంగా, ఉద్వేగంగా జింక పిల్లల్లా తిరుగుతుంటే రాజభవనం స్వర్గంలా వెలుగుతుండేది. అలాంటి వాతావరణం నుంచి ఇక్కడికి వచ్చిన అక్క ఇక్కడి పరిస్థితులకు అనుగు ణంగా అత్తవారి ఆర్థిక కష్టాలకు కూడా స్పందిస్తూ వారికి తన స్థాయిలో సహాయ పడటానికి అహ రహమూ తపించిపోవడం ఆ తమ్ముని ఉద్వేగపర చింది. ఆమెనే చూస్తున్నాడు. అక్కను చుట్టుముట్టిన దారిద్య్రపు కరాళదంష్ట్రాలు ఆ తమ్ముని బాధపెడుతు న్నాయి.
‘‘కూర్చో తమ్ముడూ.. కాస్త ఆ పల్యంకంపై విశ్రమించు..’’ అన్నది.
తమ్ముని పరిశీలన ఆమెను ఇబ్బందిపెడుతోంది. దేనినయినా దాచుకోవచ్చు కాని దారిద్య్రాన్ని దాచడం అదొక దారిద్య్రం! దారిద్య్రం ఒక్కచోటే ఉండదు. నవ్వులోనూ మాటలోనూ, కదలికల్లోనూ..అన్నింటా చుట్టేసి గజ్జెకట్టి నాట్యమాడుతుంది. అందరూ గుర్తిం చేలా నగ్నంగా నిలబెట్టి పరిహాసాల పాలుచేస్తుంది.
‘‘ఎవరు వంటశాలలో?’’ అంటూ లోపలికి వెళ్లింది.
ఒక్కమల్ల రుద్రయ ఎవరికో పురమాయించాడు కాబోలు కొందరు నియోగులు వేగంగా వచ్చారు. అందరి చూపు ఆయన తెచ్చిన డబ్బు మూటలపై ఉంది. వాటిని చూశాక వాళ్ల ముఖాల్లో కుబేరుడు కనిపించాడు. ‘‘తీసుకువెళ్లి లెక్క కట్టండి. ముందు అందరికి తగిన జీతభత్యాలు అందించండి. తర్వాత అప్పులు, వడ్డీలు.. వగైరా..’’
‘‘చిత్తం చిత్తం ప్రభూ..’’
బరువైన నాణేల సంచులను అలవోకగాఎత్తి నెత్తిన పెట్టుకుని తూనీగల్లా తేలిపోతూ పరుగులు పెట్టారు. అవి పైకం సంచులని గుర్తించిన అంతఃపుర పరిచారి కలు, భటులు కూడా కనుసైగలతో చెప్పుకోవడం.. వారి కన్నుల్లో కనిపిస్తున్న సంతోషపు మెరపు, కదలికల్లో పెరిగిన చురుకు గణపతి గుర్తిస్తున్నాడు. రుద్రుడు కూడా లోపలికి వెళ్లి సమావేశ దుస్తులతో వచ్చాడు. అప్పటికే ఆయన ఆంతరంగిక సిబ్బంది, ముఖ్య అధికారులు, మంత్రులు, సేనానులు వచ్చారు.
‘‘గణా..!నేను కొలువుకు వెళ్లి వస్తాను. కాస్త విశ్రమించు. కలసి భోజనం చేద్దాం..’’ అన్నారాయన కదులుతూ.
‘‘అలాగే బావగారు..’’ వినయంగా వంగి నమస్కరించాడు. ఆయన బృందంతో వెళ్లిపోయాడు.
వంటశాల నుంచి వెలువడుతున్న పదార్ధాల వాసనలు ముక్కుపుటాలకు చేరుతున్నాయి.
చటుక్కున లేచాడు గణపతి.
ఆవలగా వెళుతున్నభటుడ్ని పిలిచి, ‘‘నీ పేరేవిటి?’’ అంటూ అతని భుజంపై చేయివేసి బయటకు కదిలాడు.
మరోగంట తర్వాత భటుడు ఇచ్చిన సాధారణ పంచె, భుజాన కండువా.. ధరించి వీధుల్లో తిరుగాడు తున్నాడు గణపతి. రాజభవనానికి వీధులకు పెద్దగా తేడా లేదు. వీధులన్నీ అపరిశుభ్రంగానూ.. కదలాడే ప్రజలు నీరసంగానూ.. మఠీయలు నిరాశాగానూ..
‘ప్చ్.. ఈ రాజ్యంలో తిరిగితే కుబేరుడు కూడా ముష్టివాడుగా మారిపోతాడు’ అనుకుంటూ వీధులు దాటి సందులు, గొందులకి వెళ్లాడు. ఆ ఇళ్లు దుమ్ము కొట్టుకుని ఉన్నాయి. ఆ వాకిళ్ల ముందు ముగ్గుముచ్చట ఏమీ లేదు. గొడ్ల చావిళ్ల వద్ద గుంజలకు కట్టేసిన గేదెలు, ఆవులు బక్కచిక్కి ఊగిసలాడుతున్నాయి. దగ్గరలో ఏవో నాలుగైదు పరకలు తప్ప ఎక్కడా గడ్డివామి లేదు. తల్లిపాలు లేని దూడలు మట్టి నాకుతున్నాయి. ఏ ఇంటిముందూ ధాన్యపు పురి లేదా రెండు పెరిక సంచులు కూడా కనపడలేదు. వాడలలోనూ..వీధులలోనూ ఇళ్ల ముందు, వెనుకా ఎటు చూసినా అంతా దారిద్య్ర దేవత వికటాట్ట హాసం.
కాస్త ముందుకెళ్లి కనిపించిన చిన్న దేవాలయం ముందున్న అరుగుపై కూలబడ్డాడు. ఆలయం కూడా భక్తులు లేక బావురుమంటోంది. గుడి ముందు ఓ కుంటి యాచకుడు నేలపై పడి ఉన్నాడు. గబగబా వాడి వద్దకు వెళ్లాడు. దగ్గరకు ఎవరో రావడం చూసి వాడు భారంగా లేచి చేయి ఎత్తి, ‘‘అయ్యా.. ధర్మం చేయండి బాబూ! రెండు మెతుకులు చూసి రెండు నెలలయ్యింది బాబూ..’’ అన్నాడు నీరసంగా. మాటలు కూడా తడబడుతున్నాయి. అతని వాలకం చూస్తే శవం నయమనిపించింది..
అప్పుడే గుడిలో నుంచి పూజారి ఓ చెంబుతో బయటకు వచ్చి అందులోని నీటిని ఆ బిచ్చగాడి ముందు మట్టిపై ఒంపాడు. ఆ యాచకుడు ఆ నీరు, మట్టి కలిపి ముద్ద చేసి అన్నం ముద్దలా ఆబగా నోట్లో వేసుకున్నాడు.
కడుపులో తిప్పినట్లయ్యింది గణపతికి.
చివ్వున పూజారిని చూసి, ‘‘అదేవిటి.. నీళ్లు పోశావ్.. దధ్యోజనమో.. పులిహోరో ఇంత పెట్టవచ్చు కదా?’’ అన్నాడు కోపంగా.
నవ్వాడో ఏడ్చాడో అర్థ్ధం కానిదేదో చేశాడా పూజారి.
‘‘దధ్యోజనమా.. పులిహోరా..! అవి చూసి రెండేళ్లయ్యింది మహానుభావా! ఆ భగవంతుడికి కూడా ఈ తీర్థ్ధమే. నాకూ నా పెళ్లాం పిల్లలకు ఈ తీర్థమే. బయటకి ఎక్కడికి వెళ్లలేక ఇక్కడే మిగిలి పోయిన వీడికి ఈ తీర్థ్ధమే. వీడింకా నయం. మట్టి మింగుతూ కడుపు నింపుకుంటున్నాడు. లోపల ఆ దేవుడికి, నాకు ఆ మట్టి కూడా లేదు.’’
నాలుగు వాక్యాలు మాట్లాడి, ఇక శక్తి లేక పూజారి రొప్పుతున్నాడు. చర్మం లోపలి ఎముకల కదలిక తెలుస్తోంది.
ముఖమంతా పాలిపోయి కళ్లు తెల్లగా.. రక్తం లేనట్లు.. అరుగు మీద కూలబడ్డాడు.
..‘అయ్యయ్యో..ఇక లోపల ఆతని భార్య పిల్లలు ఎలా ఉన్నారో..’అనుకుంటూండగా…
అప్పుడే కాస్త అవతలగా కలకలం వినిపించింది. పూజారి, ముష్టివాడు, గణపతి కూడా తలతిప్పి చూశారు. ఓ గుంపులోని వారు గోలగోలగా సణుక్కుంటూ ఉద్రేకంగా పోతున్నారు. వారి ముందొక యువకుడు ఏదో గట్టిగా అరుస్తున్నా డు. అందరూ అవునన్నట్లు పిడికిలి బిగించి అతన్ని అనుసరిస్తున్నారు. వాళ్ల చేతుల్లో కర్రలో, బరిసెలో…
ఇనుప గొడ్డళ్లో.. ఏదో ఒక ఆయుధం ఉంది.
పూజారి అరిచాడు. ‘‘అదుగో వీరుడు డిండిమ..’’
అంటూనే ఉత్తరీయం నడుముకు కట్టి అటే పరుగు లంకించుకున్నాడు. మట్టి తింటున్న కుంటి బిచ్చగాడు కూడా తినడం వదిలేసి డేకుతూ అటే పోసా గాడు. గణపతికి కుతూహలం హెచ్చింది. ఆ డిండిమ ఎవరు? ఆ గుంపు ఆయుధాలతో ఎక్కడికి పోతు న్నట్లు..? ఈ పూజారి, చివరికి బిచ్చగాడు కూడా అతని వెంట వెళ్లడం ఏవిటి!?.
‘‘డిండిమ ఎవరు?’’ డేకుతూ పోతున్న బిచ్చగాడిని అడిగాడు.
‘‘ఆయనా?! దొంగవీరుడు. ఎక్కడో దొంగతనానికి పోతన్నాడు. ఆయనతో పొతే మనకూ ఎవన్నా దక్కుద్ది.. నువ్వూ పరిగెత్తు. నేను ఇట్టాగే దేకుతా వత్తా..’’ చెప్పాడు దేకడం ఆపకుండానే.
దొంగవీరుడు?? దొంగ.. వీరుడు?! దొంగ వీరుడు ఏవిటి?! భలే..
కుతూహలంతో ఆ గుంపు వెళ్లినవైపు వడివడిగా వెళ్లసాగాడు గణపతి. పోయి పోయి రెండు మలుపులు తిరిగాక పోతున్న గుంపు కనబడింది. కాస్త వేగం తగ్గించి వాళ్ల వెనుక వెళ్ల సాగాడు. మరో రెండు మలుపులు తిరిగి గుంపు ఓ భవనం వద్ద ఆగింది.
‘‘ఇదే అప్పరసు గాడి కొట్టం.. బద్దలు కొట్టండి..’’ అరిచాడు ఆ డిండిమ.
అంతే…అందరూ తీవ్రమైన క్రోధంతో అరుస్తూ, ఆ భవనం తలుపులను, గోడలను చేతిలోఉన్న వస్తువులతో కొట్ట సాగారు. శారీరక బలం కంటే తీవ్రమైన ఆకలి ఇచ్చిన పిచ్చి బలంతో కొట్టడంతో ఆ భవనపు తలుపులు ఊడిపో యాయి. గోడలు పడిపోయాయి. అందరూ లోపలికి చొచ్చుకుపోయి లోపలున్న పెరిక సంచులను, బుట్టలను, తట్టలను భేదించి వాటిలోని వస్తువులు, తిను బండారాలు, దుస్తులు తదితరాలను లాక్కుని, పీక్కుని తింటూ.. గంతులు వేస్తూ.. అందినవి అందినట్లు పట్టుకుని పరిగెత్త సాగారు.
మహారాజులైన అక్కను బావను, పూజారిని, ముష్టివాడిని.. అందరి ఆకలి కేకలను చూసిన గణపతికి ఆ పౌరులు ఆ భవనాన్ని పగలగొట్టి అందున్న వస్తువులను దోచుకోవడం తప్పు కాదనిపించింది.
‘ఆకలి గుంపునకు అది సహజం’ అక్కడ ఉండటం అనవసరం అనిపించి వెనుదిరిగాడు గణపతి. పోతుండగా ఎదురుగా మరి కొందరు పరుగులు పెడుతూ పోతున్నారు. మరో మలుపు తిరిగాక ఓ అశ్వ రాజవాహనం కనిపించింది. అది బహుశా తన కోసమేనని గుర్తించి చేయి ఊపాడు.
***
చాగి రాజ్యం.. రాజధాని బృహత్కాంచి (పెదకంచికచర్ల) పురం.కాస్త ఆవలగా నిర్మానుష్యమైన ప్రదేశంలో రథ•ం ఆగింది. తనతో వచ్చిన సైనిక సహాయ బృందాన్ని అక్కడే ఉండమని చెప్పి సాధారణ దుస్తులతో పురంలో ప్రవేశించాడు.
పేరుకే రాజధాని కాని గ్రామానికి ఎక్కువ పురానికి తక్కువ. ప్రధానవీధిలోకి వచ్చిన గణపతి ఆశ్చర్యపోయాడు. వీధి చాలా సందడిగా ఉంది. అచ్చం అనుమకొండ వీధుల్లా. ప్రజలంతా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా, కిలకిల నవ్వుతూ హడా విడిగా ఏవేవో కొనుగోలు చేస్తూ తిరుగాడుతున్నారు. గుర్రాలు తక్కువగా ఉన్నాయి కానీ ఎడ్లబళ్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మఠీయలు కూడా వ్యాపార లావాదేవీలతో చాలా రద్దీగా ఉన్నాయి. పౌరులంతా బుట్టలలో సంచులలో ఏవేవో కొనుక్కుని తలపై మూటలా పెట్టుకుని తల కదలికలతో మూట పడిపోకుండా చూసుకుంటూ చేతిలో ఏదో తినుబండారం తింటూ ప్రక్కనున్న వారితో ముచ్చట్లుచెబుతూ పోతున్నారు.
ఇక్కడి వీధి దృశ్యం మడపల్లెలో కనిపించిన వీధి దృశ్యానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. అక్కడ దరిద్రం తాండవిస్తుంటే ఇక్కడ లక్ష్మి గజ్జె కట్టి ఆడుతోంది.
అలాంటి వీధులే.. అదిగో అవతల గుడి.. అక్కడ కొందరు పౌరులు గుమిగూడి ముచ్చట్లు.. ఆవల అదిగో అది మఠీయ. అమ్మకదారు హడావిడి పడిపోతున్నాడు. వీధి వీధంతా సందడి సందడి.. అందరూ నిండుగా.. బిర్రుగా తిని తిరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
మడపల్లె దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందే… సమాజమంతా ‘అమ్మా మాదా కబళం తల్లి’ అని ఆకలి కేకలు వేస్తోంది. నిర్దిష్టమైన హద్దులు కూడా లేని పక్క పక్క రాజ్యాలలో.. ఎంత తేడా! పక్కగా ఓ కుర్రబృందం పెళ్లున నవ్వుతూ వెళుతుండటంతో ఆలోచనల్లో నుంచి బయటపడి వాళ్లను చూశాడు. వాళ్లు తన ఈడు వాళ్లు. ఆసక్తిగా వాళ్ల వాళ్ల వెంట నడిచాడు. అందరూ రైతు యువకులే. పంటలు బాగా పండి ఉండాలి. ధాన్యాన్ని ఇళ్లకు చేర్చుకుని పురిలలో, గాదేలలో నిలవ చేసుకుని ఉండాలి.
అలాంటి వాళ్లే ఇలా నిర్భీతిగా ఘల్లుగల్లున నవ్వుతూ తిరగగలరు.
వాళ్లను అనుసరించాడు.
ఆ కుర్రబృందం ఓ భవంతి లోపలికి వెళుతోంది. ఆ భవంతిని చూసి ఆగిపోయాడు. అది అచ్చం గా మడపల్లె లో అన్నార్తులు బద్దలుకొట్టిన భవంతిలాగే ఉంది. అంటే ఇది కూడా ఓ కోష్టాగారం కావచ్చు. కానీ పౌరులు గణపతికి ముందు వెనుకగా తాకుతూ,తోసుకుంటూ ఆ భవంతిలోకి పోతున్నారు, వస్తున్నారు. ఆశ్చర్యం మరింత పెరిగింది. అప్పుడే అక్కడున్న కాపలాదారు కాబోలు పలకరింపుగా నవ్వాడు. నవ్వక తప్ప లేదు గణపతికి. అతడు లోపలికి రమ్మన్నట్లుగా ఆహ్వాన పూర్వకంగా చేయి చాపాడు. రాజవంశజుడైన గణపతి కి తలవాల్చి పూర్తిగా వంగిన ఆహ్వానాలు తెలుసు. ఇది అలా లేదు కాని కొంత పర్వాలేదు. సరిపెట్టుకోవచ్చు.
లోపలికి కదిలాడు. లోపల విశాలమైన మందిరం కిటకిటలాడుతోంది. అప్పుడు గుర్తించాడు, అదొక వర్తక కేంద్రం. దుకాణాల సముదాయం. బియ్యం, బెల్లం, తమలపాకులు, వక్కలు, నూలు బట్టలు, పట్టుబట్టలు, కర్ర సామాగ్రి, కత్తులు, ఏవేవో హస్తకళాకృతులు, తెలియని మరెన్నో వస్తువులు. గుట్టలుగా పోసి ఉండగా వాటి వెనుక అమ్మకం దారులు చేతితో తరాజు పట్టుకుని కూర్చుని ఉన్నారు. కొనుగోలుదారులు ఏరుకుని ఆ తరాజుల్లో పెడుతుంటే వాళ్లు తూచి లెక్క చెబుతుంటే అంగీకారంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒప్పదం కుదిరాక తమ జోలెల్లో వేయించుకుంటున్నారు. కంచుకంలో దాచుడు అరలో ఉన్న నాణేలు తీసి ఇస్తున్నారు. కొందరు ఇవ్వకుండా ఏదో చెబితే దుకాణుదారు అంగీక రించాక కొన్న వస్తువులు తీసుకుని మరో దుకాణం వైపు జరుగుతున్నారు ఆడవాళ్లు తక్కువే.. ఒకరిద్దరు కనిపించారు.
అయితే అతన్ని ఆశ్చర్యపరచింది..ఆవలగా కాస్త ఎత్తైన వేదిక లాంటి దానిపై కూర్చున్న వ్యక్తి. ఆయన దర్పంగా, హుందాగా అందరితో కలుపుగోలుగా మాట్లాడుతున్నాడు. లోపలికి చేయి చూపుతున్నాడు. కొనుగోలుదారులు, కొనకుండా కబుర్లు చెబుతున్నవాళ్లు కూడా లోపలికి పోతున్నారు. దుకాణాలను చూశాక లోపల ఏమి జరుగుతుందో చూడాలనిపించింది గణపతికి.
అటు వెళ్లాడు. ఆ వేదికను దాటి లోపలికి వెళ్లబోయాడు. దానిపైనున్న పెద్దమనిషి గణపతిని చూసి పలకరింపుగా నవ్వాడు. అతని నవ్వులో తమరు ఎవరు? అనే ప్రశ్నార్ధకం ఉంది. అయినా చెప్పకుండా తలవాల్చి అడుగు ముందుకు వేశాడు. సదరు పెద్దమనిషి సహాయకుడు ఆపాడు.
‘‘స్వామీ! తమరు ఎవరో తెలుసుకోవచ్చా?’’
‘‘పరాయిరాజ్యం నుంచి వచ్చాలే..’’ ఏదో చెప్పి లోపలికి వెళ్లి పోయాడు.
లోపల అంతా భోజనాలు. వెళ్లిన వాళ్లు వెళ్లినట్లు వరుసలో కూర్చుంటున్నారు. కొందరు ఆవలగా ఉన్న నీటి తొట్టెల వద్దకు వెళ్లి చేతులు ముఖాలు కడుక్కుని తర్వాతే వరుసలో కూర్చుంటున్నారు. గణపతి నిలబడి ఆ భోజనాల పద్ధ్దతి, ఆహార పదార్ధాలను వివరంగా చూస్తున్నాడు.
అతనికి ఆకలి కాదు.. పరిశీలన. ఆర్థిక స్థాయి పరిశీలన!
భోజన పదార్థాలన్నీ చూపులకు భేషుగ్గా కనిపిస్తు న్నాయి. అయిదారేడురకాల కూరలు, సజ్జాన్నం, వరిఅన్నం, మట్టిచిప్పలనిండా పెరుగు, పేరుడు నెయ్యి.. ఘుమఘుమలు అతని ముక్కుపుటాలకు సోకి నాలుకపై లాలా జలం ఊరుతోంది.
‘మృష్టాన్న భోజనమే పెడుతున్నారు’ అనుకుంటూ వెనుదిరిగి చూశాడు. చూసి గతుక్కుమన్నాడు.
ఆ పెద్దమనిషి సహాయకుడు దూరం నుండే అటూ ఇటూ తిరుగుతున్న మనుషుల మధ్య నుండి గణపతిని చూస్తున్నాడు. ఇద్దరి చూపులు కలుసు కున్నాయి. ఇద్దరూ మామూలుగా ఉండలేకపోయారు. సహాయకుడు మనుషులను తప్పుకుని భోజన వరుసలను దాటుకుని గణపతి వద్దకు వచ్చాడు. చిరునవ్వు ప్రకటిస్తూనే, ‘‘అన్నీ పరిశీలిస్తున్నారు. భోజనం చేయకుండా..’’ అన్నాడు ప్రశ్నార్థ్ధకంగా. ‘‘చెప్పానుగా.. పరాయి రాజ్యం.. నతవాడి..’’ చటుక్కున ఆపి అతని ముఖంలోకి చూశాడు.
ఊహించినట్లే అతని ముఖంలో అసహ్యం కనిపించింది.
అతిథిని ఆహ్వానించి పెడతారు. అదే ముష్టి వాడుగా అనిపిస్తే పో పొమ్మని అసహ్యించుకుంటారు.
ఎవరు అతిథి.. ఎవరు ముష్టివాడు..
నతవాడి వాడిగా చెప్పుకున్న గణపతిని కూడా ఆ సహాయకుడు రోతగా ముష్టివాడిగానే చూశాడు. గణపతి ముందే ఊహించాడు కాబట్టి అతన్ని దాటి ఆ వేదిక పెద్ద వద్దకు పోబోయాడు. ఆ సహాయకుడు చటుక్కున అడ్డు పడ్డాడు. ‘‘నతవాడి ముష్టివాళ్లకు ఇక్కడ ప్రవేశమే లేదు. నీ పేరు చెప్పు?’’ అన్నాడు.
పేరు నచ్చితేనే శెట్టితో మాట్లాడవచ్చు అన్నట్లుంది అతగాడి ప్రశ్న.
చెప్పబోయి తమాయించుకుని ‘‘గణప్ప’’ అన్నాడు.
వాడి ముఖంలో రంగులు మారాయి.
‘‘అంటే.. నువ్వు కన్నడిగుడివా..?’’
ఇప్పుడా ప్రశ్నకు గణపతి ముఖం రంగు మారింది.
‘‘అంటే.. నా పేరు అది. కన్నడ ఏవిటి.. నేను తెలుగువాడిని. నా భాష తెలుగు. నాకు కన్నడ అస్సలు రాదు.’’ అనేశాడు గబగబా.
అంతే. వాడు కొట్టినంత పని చేశాడు. తోసేశాడు.
‘‘పో..పో… నతవాడివాడివి. పైగా తెలుగువాడి నని బోర విరుచుకు చెబుతున్నావ్. నీకు శెట్టిగారితో మాటలా.. నడువ్ నడువ్..’’
వస్తూ పోతున్నవాళ్లకు తగిలి తూలి గింగరాలు తిరిగాడు. చటుక్కున ఓ వ్యక్తి అతన్ని పట్టుకున్నాడు.
‘‘అరె.. పడేవు బాబూ.. జాగ్రత్త..’’
గణపతికి పిచ్చికోపం వచ్చింది. చివ్వున తిరిగి వాడివైపు పోబోయాడు. పట్టుకున్న వ్యక్తి కదలనివ్వక మరింత బిగించి పట్టుకున్నాడు.
‘‘వద్దు వద్దు. చూస్తే బలిష్టుడివే. వాడ్ని కొట్టగలవ్. కానీ ప్రయోజనం ఏముంది?. పద పద.. పద పోదాం..’’
బయటకు లాక్కుపోయాడు. వదలకుండా పట్టుకుని ఓ మలుపు తిరిగి ఓ ఇంటి అరుగుపై కూర్చోబెట్టాడు.
అప్పుడు చూశాడు గణపతి ఆ కొత్త వ్యక్తిని. పండితుడు. విద్యావేత్త కావచ్చు.. కాస్త కురచగా బొద్దుగా చామన చాయ. ముఖంలో విద్వత్తు కనిపిస్తోంది. భృకుటి మధ్య చిన్న చుక్కంత ఎర్రబొట్టు..
‘‘ఆ సమయశెట్టికి ఈమధ్య కుటిలత్వం పెరిగి పోయింది. భాష పిచ్చి ఎక్కువయ్యింది.’’ అన్నాడా పండితుడు.
గణపతికి అంతా గందరగోళంగా ఉంది.అసలు తనేవ్వడు.. ఇక్కడికి ఎందుకు వచ్చాడు?ఆ లోపలికి ఎందుకు వెళ్లాడు? వాడెందుకు తోసేశాడు? నతవాడి వాడ్ని అనగానే అంత అసహ్యం ఎందుకు కలిగింది? ప్చ్!!
చాలా చిరాగ్గా ఉంది గణపతికి.
పండితుడు మళ్లీ అడిగాడు, ‘‘ఆకలిగా ఉందా.. ఏమైనా తింటావా? ఏమైనా నాణేలు ఉన్నాయా?’’ అన్నాడు.
‘‘అవన్నీ అలా ఉంచండి. అసలు వాడి ప్రవర్తన అలా ఉందేవిటి?’’ అడిగాడు విభ్రమంగా.
‘‘అది చాగి సమయశెట్టి కొట్టారం.అంటే తెలుసా? ఆయన వ్యాపార కేంద్రం. ఇక్కడే సరుకు లన్నీ జమ చేసుకుని పరీక్షలన్నీ అయ్యాక వర్తక బిడారు బయలు దేరుతుంది. బిడారు వస్తువులను కూడా ఇక్కడ అమ్మకానికి పెడతారు. ఎవరైనా కొనుక్కోవచ్చు. వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేస్తాడు. అంతవరకు బావుంది. కాని అతనికిప్పుడు ప్రాంతీయ భావనలు, భాషాపేక్ష ఎక్కువయ్యాయి.’’
గణపతికి ఏమీ అర్థ్ధం కాలేదు. ‘‘అంటే??’’
‘‘అతని పేరు తిమ్మరుసు.’’ చెప్పి ఆపాడు ఆ పండితుడు.
‘‘తిమ్మరుసా.. అయితే??’’ గణపతి మరో ప్రశ్న.
‘‘అంటే అతడు కన్నడిగుడు.’’
‘‘అయితే ఏవిటండి?’’ అసహనంతో అన్నాడు.
‘‘అదే చెప్తున్నాను. ఇంతవరకు మన తెలుగునేలపై ఇక్కడ ఈ పీఠభూమి రాజ్యాల్లో తెలుగు, కన్నడ భాషలు పెనవేసుకునిపోయి ఉన్నాయి. మన చుట్టు ప్రక్కల రాజ్యాల్లో తెలుగు, మరాఠం.. దిగువ రాజ్యాల్లో తెలుగు, తమిళం.. అంతా రెండూ కలిపి మాట్లాడటడంతో అందరికి అర్థం అవుతోంది. కానీ రానురానూ రెండు విడిపడ్డాయి. వేరువేరై పోయాయి. అప్పటినుండి మనుష్యులలోకూడా తేడా వచ్చేసింది. ఊళ్లో బలమైనవ్యక్తి తెలుగువాడైతే తెలుగువాళ్లను. కన్నడవాడితే కన్నడవాళ్లను అభిమానించడం.. వాళ్లకు మాత్రమే సహకరించడం జరుగుతోంది. ఈ సమయశెట్టి కన్నడిగ. లోపల అమ్మకం దారులంతా కన్నడవాళ్లే. వాళ్లనే ఈ తిమ్మ రుసు ప్రోత్సహిస్తాడు.. సహకరిస్తాడు.’’
గణపతికి కొత్త విషయాలను వింటున్నట్లు.. ఈ నేలపై కొత్త విభజనను చూస్తున్నట్లుంది.
‘‘అందుకే చోళరాజులు, చాళుక్యరాజులు మన నేలను వదిలిపోవాలి. ఇంతకాలం మేము తెలుగు వాళ్లమే… ఇక్కడే పుట్టాం. ఇక్కడే ఉంటాం. ఈ నేలను మేమే పాలిస్తాం’ అంటున్నవాళ్లు ఇప్పుడు మా భాష కన్నడం అంటున్నా రు. ఇప్పుడు వాళ్ల బండారం బయటపడ్డది. భాషలు స్పష్టమయ్యాక మనం మన తెలుగుభాషను ప్రోత్సహించుకోవాలి. అంతేకాదు రక్షించుకోవాలి.’’ అన్నాడా పండితుడు చాలా ఆవేశంగా. గణపతికి ఆయన చెప్పిన అంశాలు ఆయన వ్యక్తిగతం అనిపించలేదు. అవి సామాజికాం శాలుగా తోచాయి.
అతన్ని మరిన్ని ప్రశ్నలు వేద్దామని భావించాడు కాని అప్పటికే అతన్ని మరి కొందరు చుట్టు ముట్టడంతో చేసేదిలేక ముందుకు కదిలాడు.
అతని ఆలోచనలన్నీ రెండు రాజ్యాల ప్రజలు అంటే రెండు వేరువేరు జాతులా.. రెండు వేరువేరు ప్రాంతాలా.. కాదు కదా. మరి నతవాడిరాజ్యం ఎందుకు అలా ఉంది.. చాగిరాజ్యం ఇలా ఎందుకు ఉంది??
***
ధాన్యకటకం రాజప్రాసాదం, కోట రాజ్యం.
చాగిరాజ్యం, నతవాడి రాజ్యం చూశాక.. మేనత్త గారి రాజ్యమైన కోట రాజ్యన్ని చూద్దామన్న ఆలోచన రాగానే వేగంగా వచ్చేశాడు. వరుసకు మేనత్త అయిన నాగమాంబ, మామ బేతరాజు..చెప్పకుండా వచ్చేసిన కాకతీయ ప్రభువైన మేనల్లుడు గణపతిదేవుని చూసి ఆనందంతో తలమునకలయ్యారు. దినమూ గొప్ప ఆతిథ్యం ఇస్తున్నారు.
‘సందేహం లేదు. ఇది మహా సౌభాగ్యవంతుల రాజ్యం’ అనుకున్నాడు తొలి చూపులోనే. ఆ వీధులు, భవనాలు, మనుషులు.. వారి నిబ్బరం, ఆత్మ విశ్వాసపు కదలికలు.. కబుర్లు చెప్పుకుంటున్న బృందాలు, సైనికుల కదలికలు, పట్టణ వేగుల పరిశీలనలు.. ఒకటేమిటి.. అన్ని అతన్ని అబ్బుర• పరచాయి.
గణపతి అన్నిటిని పోల్చి చూస్తోంది నతవాడి ప్రజలతో..
అతను ఎప్పుడూ వీధులలో తిరుగుతూ అనుమకొండ ప్రజలను కూడా చూడలేదు. కాని అదే పురంలో పుట్టి పెరిగినవాడు కాబట్టి ఓ అంచనా ఉంది. కాని అతడు విస్తుపోయి చూసింది ఆకలిదప్పు లతో నకనకలాడుతున్న నతవాడి ప్రజలను. ఆ దృశ్యమే అతన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. వెనువెంటనే చూసిన చాగిరాజ్య ప్రజలు అందుకు భిన్నంగా.. ఉండవలసిన సాధారణ స్థితిగతులతో ఉన్నారు.
కాని ఈ ధరణికోట సమాజం మరికొంత ఉన్నతంగా.. ధనధాన్య భోగ భాగ్యాలతో తులతూగు తున్నదని గుర్తించాడు. మామ బేతరాజును అడుగగా ధాన్యకటకం చూడానికి అనుజ్ఞ ఇస్తూ ఓ ఉన్నతాధి కారిని వెంటనిచ్చి పంపాడు.
వీధులన్నీ తిరిగాడు. సాధారణ పౌరులతో మాట్లాడాడు. వాణిజ్య ప్రముఖులతో మంతనాలు జరిపాడు. వేరువేరు నియోగాలను పరిశీలించాడు. ప్రధానులనూ, ఆమాత్యులను పలకరించి తన సందేహాలను నివృత్తి చేసుకు న్నాడు. ఆఖరుగా అర్థ్ధమైంది ఏవిటంటే ఈ రాజ్యం గొప్ప ధాన్యాగారం. ఇప్పుడే కాదు, ధాన్యం అనేది పుట్టిన నాటి నుండి.. అందుకే ఇది ధాన్యకటకం!