‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
ఆ అడిగినవారు బయ్యమాంబ. అతని కన్నతల్లి.
నవమాసాలు కడుపున మోసి కని అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లి మాత్రమే గణపతి లోలోన సతమతమౌతున్న భావనల వొత్తిడిని గుర్తించింది.
మరునాడు పెద్ద తల్లి, పెంచుకున్న తల్లి దన్నాలదేవి గణపతిని చాలా సేపు రెప్పవెయ్యకుండా చూసింది. అతన్ని దగ్గరకు తీసుకుంది. గుండెకు హత్తుకుంది. అప్పుడు ఏడ్చింది ఆమె. ప్రక్కన తల్లి చిన్నగా మౌనంగా రోదిస్తుండగా పెద్దమ్మ పెద్ద పెట్టున రోదించడం.. తల్లి పెద్దమ్మతో తను చెప్పింది పంచుకున్నదని గ్రహించాడు గణపతి.
వారిద్దరి మధ్య ఉన్న అపూర్వ అనుబంధం గణపతికి తెలుసు. అన్నదమ్ముల మధ్య కూడా లేనంతటి అన్యోన్యత ఆ తోడికోడళ్ల మధ్య ఉండటం అంతఃపురంలో అందరూ చెప్పుకునేవారు. ఆ సంగతి గుర్తొచ్చిన గణపతి ఆమె ఒడిలో కాస్త సేదదీరాడు. ముగ్గురూ ఒకరినొకరు గట్టిగా హత్తుకుని చాలాసేపు ఉండిపోయారు.
తల్లులిద్దరూ ప్రాథమికంగా కొడుకు దుఖాన్ని గుర్తించారు. కారణం తెలియక ఇద్దరూ దిగులుతో గందరగోళమైపోతున్నారని గుర్తించాడు గణపతి. అప్పుడు కవ్వల సంగతి చెప్పాడు. వివరంగా పూసగుచ్చినట్లు చెప్పాడు.
ముగ్గురూ ఒకరి కన్నీటిని మరొకరు తుడిచారు.
అక్కడ ఓ ఆడపిల్లతో స్నేహం కుదిరింది. ఇద్దరూ దగ్గరయ్యారు. ఒకరికొకరు నచ్చారు. సరే.. పరిస్థితులు దగ్గరకు చేర్చాయి. ఇవన్నీ సహజమే. కానీ కాని ఆమెను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు??
ఆ రాత్రి కాకతీయయోధులు మెరుపుదాడి నిర్వహించడం ఆ తోడికోడళ్లకు తెలియదు.
ఇప్పుడు ఎవ్వరినీ అడగకూడదు కూడా. కారణం అది సైనికచర్య. అన్నిదారులు మూసుకుపోయినప్పుడు జరిపే అత్యంత సాహసోపేతమైన మెరుపుదాడి అది. కావచ్చు. వాళ్లు ఆ దుందుడుకు చర్యకు పాల్పడింది గణపతిని రక్షించడానికే కదా..
గణపతిని వదలి ప్రక్కనున్న అమ్మాయిని చంపాల్సిన పరిస్థితి ఏమొచ్చింది??
పోనీ.. దేవగిరి సైన్యమే ఇద్దరిని చూశారని అనుకున్నా.. వాళ్లకు కూడా ఆమెను చంపాల్సిన బలీయమైన కారణం ఏముంది.. ఉంది పో.. ఉంటే ఆమెను చంపవచ్చుననుకుందాం. కాని గణపతిని వదిలేయడం ఏవిటి?
గణపతిని కూడా చంపవచ్చు.. లేదా పట్టి బంధించవచ్చు. ఇతన్ని వదిలేసి ఆమెనే చంపడం ఏవిటి?
ఎవ్వరికి తెలియకుండా ముగ్గురూ తీవ్రంగా చర్చించు కున్నారు.
సోమలదేవిని అడిగితేనో???
ఓయమ్మో, అసలుకే మోసం వస్తుంది. అత్తలకు ఆమెపై సదభిప్రాయమే కాని అది సంపూర్ణం కాదు. ఆమె మాటలు.. రాజసం.. అధిక్య భావనలు వాళ్లకు ఆమెపై ఉన్న సదభిప్రాయంలో కొంత అసహనాన్ని ఉంచాయి.
ఆమెను అడిగినా.. ఆమెకు తెలిసినా.. కథ మరో రూపం తీసుకుంటుంది.
‘‘కోడలు కొత్తపిల్ల. ఆమెపట్ల అసహనం వద్దు. కోపం ద్వేషం అసలే వద్దు. హాయిగా ఆమెను స్వీకరించు తండ్రి. నువ్వు కాకతీయ రారాజువి. నీపై పెద్ద బాధ్యతలున్నాయని మర్చిపోకు..’’ అన్నారు.
నిత్యమూ కొడుకును సాంత్వన పరుస్తూ గణపతి మళ్లీ మామూలు మనిషయ్యేలా తీవ్రంగా ప్రయత్నిస్త్తున్నారు. మాతృత్వ మమకారం వల్ల గణపతి కొంత సాంత్వన చెందాడు. సంధ్యవేళ కొత్త జంటతో రాజమందిరం లో రాజకుటుంబ సభ్యులతో, గణపతి మిత్రులతో.. వారి కుటుంబాలతో సమావేశాలు ఏర్పరుస్తూ అతనిలో ఏర్పడిన భీతిని కొద్ది కొద్దిగా తొలగించసాగారు అమ్మలిద్దరూ..
అదే సమయంలో అమ్మలిద్దరూ గణపతికి తెలియకుండా రేచర్ల రుద్రయ, గంగాధరమంత్రితో సమావేశమయ్యారు. కవ్వల సంగతి విని వాళ్లిద్దరూ నోరు వెళ్లబెట్టారు.
అయితే ఆ రాత్రి.. మెరుపుదాడి జరిపిన రాత్రి గణపతి కనిపించకుండా పోవడం.. మందడి కాటయ బృందం కళ్లలో వత్తులు వేసుకుని దేవగిరి రాజ ప్రాసాదం అంతా అణువణువూ వెదికినా దొరకక పోవడానికి కారణం ఇప్పుడు తెలిసింది అనుకున్నారు.
ఆ ఆడపిల్లను మన సైనికులే చంపినా చంపి ఉండవచ్చు. యువరాజును రక్షించి తరలించేలోగా శత్రుసైన్యం దాడి చేసి ఉండవచ్చు. యుద్ధవీరులైన వాళ్లిద్దరికీ ఓ ఆడపిల్ల ఆ మెరుపుదాడిలో మరణించడం పెద్ద విషయం కాదు.
‘‘మీరు కూడా ఆ విషయాన్ని మర్చిపోండి మహారాణి. పట్టాభిషిక్తుడయిన కాకతీయ మహారాజుపై గురుతర బాధ్యతలున్నాయి. అతని దృష్టి పరిపాలన పైకి మళ్లించాలి. అది మీరు ప్రముఖంగా స్వీకరించాలి..’’ అన్నారు.
తల్లులిద్దరూ అయోమయంగా ఏమి చేయాలో పాలుపోక తలలు ఆడించారు.
* * *
కళింగ సామ్రాజ్యం.. రాజధాని కటకం.
రాజనగరి.. చక్రవర్తి మంత్రాంగ మందిరం.
మహా ప్రధాని కరినాగుడు, మరికొందరు రాచ ప్రముఖుల మధ్య కళింగ మహారాజు రాజరాజ దేవుడు కొలువై ఉన్నాడు. మధ్య వయస్కుడు.. ఆలస్యంగా రాజ సింహాసనం ఎక్కినట్లు న్నాడు. రాజాభరణాలతో అలంకృతుడై ఉన్నా ఏదో సమస్యతో కొట్టుమిట్టాడు తున్నట్లు అసహనంగా ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న రాచ ప్రముఖులు ఆయన చిరాకులో భాగం పంచుకుంటున్నట్లు హడావిడిగా చేతులు పిసుక్కుంటూ కనబడుతున్నారు.
అందరూ ఎవరి రాకకోసమో అన్నట్లు సింహ ద్వారం వైపు చూస్తున్నారు.
ఈశాన్య భారతంలో దక్షిణావర్తానికి చెంది నట్లున్న రాజ్యం కళింగ సామ్రాజ్యం. ఉత్తరపు అంచు గంగానది, వంగ రాజ్యాలు, పడమర మౌర్య సామ్రాజ్యం, దక్షిణాన గోదావరి సరిహద్దులుగా కలిగి గొప్ప ప్రాచీన చరిత్ర మాత్రమే కాక అపూర్వమైన పరిపూర్ణ సహజవనరులున్న సామ్రాజ్యం కళింగ. ఆది నుండి మౌర్యసామ్రాజ్యానికి పక్కలో బల్లెంలా ఉండేది. ఆదిమకాలం నుండి విదేశీ వర్తకంలో రాటుతేలిన సాహసోపేతులైన మహా వణిజుల వర్తకక్షేత్రం కళింగ. కొదమసింహాల్లాంటి వీర విక్రమ పరాక్రమ శూరులయిన మహారాజుల అద్భుత పాలనలో బహుముఖ సౌభాగ్యాలతో తులతూగుతున్న రాజ్యం.
కళింగ రాజ్యాన్ని నిజానికి మూడు భాగాలుగా చెప్పుకోవాలి. దక్షిణభాగం కళింగం అయితే ఉత్తర భాగం ఉత్కళ మధ్య భాగం కోసల..
ప్రధాన భాష ఓడ్రం అయినా ఉత్తర భాగం వంగ దేశ సంస్కృతితో మిళితమై ఉంటుంది. మధ్య భాగం మౌర్య సామ్రాజ్య సంస్కృతితో ఉంటే దక్షిణ భాగం తెలుగు సంస్కృతితో మమేకమై ఉంటుంది. మూడు ప్రక్కలా పొంచి ఉన్న మహాశత్రువులను విజయవంతంగా ఎదుర్కొంటూ తమ సంస్కృతిని కాపాడుకుంటూ శత్రు దుర్భేద్యంగా తమ స్థానాన్ని కొనసాగించడం కళింగ పాలకుల ప్రత్యేకత. గొప్ప భాష, విద్యావసతులు, సాహిత్యం, కళలు, ఉత్కృష్టమైన దేవాలయాలు కళింగరాజ్యమంతటా అడుగడునా కనిపిస్తాయి. ఒకనాడు బౌద్ధం, అంతకు మించి జైనం.. సమాజాన్ని ప్రభావితం చేయగా ప్రస్తుతం శైవం, వైష్ణవం ఓడ్ర ప్రజలను పరివేష్టించి ఉన్నాయి.
అందరూ ఎదురుచూస్తున్న ఆ ముఖ్యవ్యక్తి పరిమయభట్టు, కళింగరాజ్య ప్రధాన సంధివిగ్రహి.. లోపలికి వచ్చాడు. అందరూ తన కోసమే ఎదురు చూస్తున్నట్లు తెలిసినట్లు అతడు ముందు మహారాజుకు, అనంతరం మహాప్రధాని తదితరులకు వందనం చేశాడు.
పరిచారిక మంచితీర్ధపు చెంబుతో వచ్చి ఆయనకు అందించగా గటగటా తాగాడు. ఉత్తరీయంతో మూతి తుడు చుకుని గొంతు సవరించుకుని ఏదో చప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు.
అప్పుడే ద్వారం వద్ద వినిపించింది. ‘‘జయము జయము.. మహాప్రభు..’’ అని.
అందరూ తలత్రిప్పి చూశారు. ఆ వ్యక్తి రాజ్య గూఢచారి నియోగం ప్రధాన నియోగి భజేంద్ర సాహు.
అతన్ని చూడగానే మహారాజు ముఖంలో ఉత్సుకత కనిపించడం మాత్రమే కాదు ఆయన సింహాసనం నుండి లేచాడు కూడా. ‘‘భజేంద్రా.. చెప్పు. వెళ్లిన కార్యం ఏమైంది?’’
వంగి నమస్కరిస్తూ ఆయన సింహాసనం వరకు వెళ్లి చెప్పాడు.
‘‘మనం ఊహించిందే జరిగింది ప్రభు! ఆ గణపతిదేవుడు సింహాసనం అధిరోహించడం లేదు. అతడేమీ శత్రుభీకరుడు కాడు. పిల్లి.. మ్యావ్..’’
అందరూ పిక్కటిల్లి నవ్వారు. మహారాజు రాజరాజదేవుడు మరింత విశాలంగా.. అప్పటివరకు ఉన్న ఆందోళన ఏదో తొలగిపోయినట్లు.. అందరూ నవ్వడం ఆపినా ఆయన నవ్వుతూనే ఉన్నాడు. రాజుగారి ఆనందం చూసి అంతా సహజంగా సంతోషంగా మరీ మరీ నవ్వారు. సంధి విగ్రహి పరిమయ భట్టు చెప్పాల్సింది వినే వాళ్లెవ్వరూ లేరన్నట్లు మారిపోయింది అక్కడి వాతావరణం. ఆయన మౌనంగా ఓ ప్రక్కగా ఉండిపోయాడు.
కళింగ రాజ్యానికి దక్షిణం నుండి వచ్చి యుద్ధం చేయడం ఎవరికైనా బహుకష్టం. కారణం విశాలమైన గోదావరి మహానది. అది పెట్టని కోటగా కళింగను రక్షిస్తోంది. పైగా కళింగ సేనలే నది దాటి వెళ్లి ద్రాక్షారామం, వేంగిసీమ తదితర చిన్న చిన్న రాజ్యాలను దోచుకుంటూ ఉంటాయి. కళింగకు పెద్ద శత్రువు అయితే గియితే కాకతీయ రాజ్యం కావాలి. కాకతీయ రాజధాని అనుమకొండ కళింగకు చాలా దూరం. కళింగను గెలవాలంటే పెద్ద సైన్యంతో రావాలి. పెద్ద సైన్యం గోదావరిని దాటడం చాలా పెద్ద పని. గోదావరి దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లి కత్తి గిత్తి సర్దుకుని యుద్ధానికి సిద్దపడేలోపు కళింగ సేనలు వాళ్లపై బడి ఖండఖండాలుగా నరికేస్తాయి. అశోకుని మారణహోమం తర్వాత కళింగ సేనాల్లో శక్తిసామ ర్ధ్యాలు తీవ్రమయ్యాయి. ఎవడైనా యుద్ధభేరి మ్రోగిస్తే వాడిపైకురికి జాలి దయ లేకుండా విచక్షాణా రహితంగా చంపేస్తారనే గుర్తింపు తెచ్చుకున్నారు.
కాకతీయరాజ్యం దాని పాలకులైన మహారాజులు అరివీరి భయంకరులు, గొప్ప యోధానుయోధులుగా చుట్టుప్రక్కల రాజ్యాలలో భయం ఉంది. అందువల్ల రుద్రదేవుడి మరణం తర్వాత సమకాలిన రాజ్యాలన్నీ ఆయన తరవాత ఎవరు రాజ్యానికి వస్తారు అని చూశారు. రుద్రదేవుడి తమ్ముడు మహాదేవుడంటే ఎవ్వరికి భయం లేదు. ఆయన స్త్రీ లోలుడు. బాధ్యతా రాహిత్యం ఎక్కువ. కొద్దికాలానికే ఆయన మరణం, యువరాజు గణపతిదేవుడు యుద్ధబందీగా దేవగిరికి పోవడంతో శత్రురాజ్యాలన్ని ఆనందంతో పరవశిం చాయి. చివరికి ఊహాతీతంగా గణపతిదేవునికి పిల్లనిచ్చి జైత్రపాలుడు గౌరవంగా సాగనంపడంతో మళ్లీ అందరూ గణపతిదేవుని తీరును పరిశీలిస్తు న్నారు.
పరిస్థితి తెలుసుకుని రమ్మని కళింగ రాజరాజ దేవుడు గూఢచారులను పంపాడు.
‘‘గణపతిదేవుడు పెళ్లాంతో అనుమకొండ తిరిగి వచ్చాక ఏదో ఉత్సవం లాంటిది చేసి సింహాసనంపై కూర్చోబెట్టారు. కానీ అతడు పరిపాలన వదిలేసి పెళ్లాం కొంగు పట్టుకుని అంతఃపురం వదలి రావడంలేదు.’’
ఈ సమాచారం రాజరాజదేవుని ఆనంద పరచింది. కాని ఆయన పరిమయభట్టు తెచ్చిన సమాచారాన్ని కూడా విని ఉంటే ఆ రాత్రి భోజనం కూడా చేసేవాడు కాదేమో!!
* * *
చోళ రాజప్రాసాదం, తంజావూరు..
‘‘కాకతీయరాజ్యానికి కొత్తగా మహారాజు అయిన గణపతిదేవుడు అమాయకుడు, పసివాడు, చేతకానివాడు.’’
కళింగ రాజప్రాసాదంలో కనిపించిన ఆనందమే దక్షిణావర్తంలోని తంజావూరు చోళ రాజప్రాసాదంలో కూడా వెల్లి విరిసింది.
మహారాజు మూడవ కులోత్తుంగుడు ముఖంలో దాచుకుందామన్నా దాగని ఆనందం కనిపిస్తోంది. ఏ రాజ్యం లోనయినా ఎంతటి మహారాజుకయినా నమ్మిన బంట్లు అనే వర్గం ఒకటి ఉంటుంది. ఈ బృందం ఎప్పుడూ ఆయన్ను పరివేష్టించి ఉంటుంది. వాళ్లు చెప్పినవి మహారాజు గుడ్డిగా నమ్మేస్తాడు. తొలి రోజుల్లో వాస్తవాలు చెబుతారు కానీ, పోను పోనూ రాజుగారి ముఖంలో ఆనందం కోసం ఆయనకు నచ్చినవే చెబుతుంటారు. అక్కడి నుండే ఆయన పతనం ప్రారంభం అవుతుంది.
కాకతీయరాజ్య సింహాసనాన్ని అధిష్టించిన గణపతిదేవుడు పాలనపై ఆసక్తి లేనివాడు అని తెలుసుకున్నట్లు చెప్పుకుని పరిహాసాలతో చోళ కులోత్తుంగుని మిత్రబృందం పరవశిస్తోంది.
పగలబడి నవ్వుతున్న మహారాజు కులోత్తుంగ చోళుడు అడిగాడు గూఢచారిని.
‘‘ఏవిటేవిటి.. మళ్లీ చెప్పు! ఆ కుర్రకుంక సింహా సనం అంటేనే భయపడుతున్నాడా.. అంతఃపురం నుండి బయటకు రావడం లేదా.. వచ్చినా సమావేశ మందిరానికి వెళ్లడం లేదా..? పాపం.. ఆ ముసిలి రుద్రసేనాని, ఆ వృద్ధ ప్రధాని ఎంతకాలమని రాజ్య పాలన చేస్తారూ..! చూద్దాం మనం కూడా. ఇకపై మన సామంతులంతా కప్పాలు కట్టడం మానివేస్తే తగ్గేది లేదని.. దండోపాయమేనని దండోరా వేసి మరీ చెప్పండి.’’ అన్నాడు ఆనందంగా.. కటువుగా. ఆయన ఆనందపు వాక్కులతో ఆ భజన బృందమంతా చేస్తున్న వికటాట్టహాసాలతో ఆ భవనమంతా మారుమ్రోగిపోతోంది.
* * *
పాండ్య రాజ్య ప్రాసాదం, మదురై.
అదే సమయంలో మదురై లోని పాండ్య కోట కూడా ఇలాంటి సంతోష సంబరాలలో తేలియాడు తోంది.
పాండ్య నృపతి జటావర్మన్ కులశేఖర గట్టివాడు. ఘటనాఘటన సమర్ధుడు. విక్రమసింహపురిని సాధించాలని ఆయన కూడా పట్టుదలగానే ఉన్నాడు. సువర్ణాక్షరాలతో చరిత్ర లిఖించుకున్న చోళ వంశం అవసాన దశలో ఉంది. ఆదిమకాలం నుండి దిగువ దక్షిణావర్తంలో చోళులు, పాండ్యుల మధ్యనే ఎప్పుడూ పోరాటం. మరో రాజ్యవంశం అక్కడ ఎదగలేదు. చోళులు బలహీనంగా ఉన్నప్పుడు పాండ్యులు తప్పక బలపడతారు. ప్రస్తుత పరిస్థితి కూడా అదే. నిన్నటి వరకు దుర్నిరీక్షలయిన చోళులు అన్ని విధాలా బలహీనపడుతుంటే నిన్నటి వరకు మూలమూలల నక్కిన పాండ్యులు రానురానూ అన్ని రకాలుగా బలపడుతున్నారు.
పాండ్య కులశేఖరుని కూడా గణపతిదేవుని పట్ల కుతూహలం ఉంది. అతన్ని మిత్రుడిని చేసుకోవాలో శత్రువుగా ప్రకటించుకోవాలో నిర్ణయించుకునే ప్రయత్నంలో ఉన్నాడాయన. చోళ కులోత్తుంగుడు ఏమి చేయబోతున్నాడో పాండ్య రాజు ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాడు.
తెలుగు చోడరాజులు కులోత్తుంగునికి కప్పాలు కట్టడం ఆపివేశారని విని పులకించాడు. కాకతీయ గణపతిదేవునికి, తమకు మధ్య విక్రమ సింహపురి రాజ్యమున్నదని.. మనుమసిద్ధిని కాదని గణపతిదేవుడు తమతో మంతనాలు జరపడని ఆయన గుర్తించాడు. కాబట్టి ముందు సంధి విగ్రహిని నెల్లూరు పంపి స్నేహం ప్రకటించాడు. జవాబు కోసం ఎదురు చూస్తున్నాడు.
స్నేహహస్తం చాపిన పాండ్యుడు తమిళంలోని తెలుగు భాషా ప్రాంతాలను మనుమసిద్ధి కోరితే ఇవ్వడానికి సిద్ధమా అంటే.. సూది మోపినంత స్థలం కూడా ఇవ్వను అనే అంటాడు కదా!!
* * *
ధనదుపురం, వెలనాడు రాజ్యం.
కాకతీయ రాచరికం వారి కదలికలు కనిపెట్టు కుని ఉండే శత్రురాజ్యాలు నాలుగు. దేవగిరి రాజ్యం, కళింగ రాజ్యం, చోళ రాజ్యం, పాండ్య రాజ్యం. ఇవి సరిహద్దులలోనున్న బలిష్టమైన రాజ్యాలు.. సామ్రాజ్యాలు. అయితే తెలుగు భాషా ప్రాంతాలలో నున్న చిన్న రాజ్యాలలో బలిష్టమైన శత్రు రాజ్యం.. వెలనాడు!!
ప్రస్తుత మహారాజు పృథ్వీశ్వరుడు. శత్రు భయం కరుడు. ప్రజాకంటకుడు కాడేమో కానీ నిరంకుశుడు. రాజ్యం ధనధాన్య రాశులతో మూలుగు తుంటుంది. అంతులేని విదేశీ వాణిజ్యంతో బంగారు నాణేలు ఇంట్లో పురులు కట్టి.. ఇత్తడి బానలలో నింపి.. నివాసం నిండా కోష్టాలు కలిగిన నౌకా నిర్మాతలు, ఎగుమతి దిగుమతి వణిజులు వందల్లో ఉన్న రాజ్యం. అందుచేత ఎవ్వరిని లెక్కచేయడు. ఎన్నెన్నో దేవాల యాలు, అగ్రహారాలు, ఘటికలు నిర్మించిన ఘనమైన చోడవంశ చరిత్ర కలిగినవాడు.
కాని అతనికి ఎక్కడో గుండెలోతుల్లో కాకతీయ రాజులంటే కించిత్ భయం. అందుచేత కాకతీయ రాజ్యం పై దేవగిరి విజయన్ని పృథ్వీశ్వరుడు స్వాగ తించాడు. గణపతిదేవుని బంధించడాన్ని తెలివైన నిర్ణయంగా వర్ణిస్తూ జైత్రపాలునికి అభినందన సందేశాలు పంపించాడు. తర్వాత గణపతిదేవుని ఆయన అల్లుడిగా చేసుకోవడం అన్నది తెలిసి ఆశ్చర్యపోయాడు. మళ్లీ గణపతిదేవుని పట్టాభిషేకం.. కాకతీయ కేతనం తిరిగి రెపరెపలాడటం.. అన్నీ తెలిసి చిరాకుపడిపోయాడు.
మళ్లీ గణపతిదేవుడు పాలన పట్ల ఆసక్తి చూపడం లేదని వేగులు చెబితే కొంత కుదుటపడ్డాడు.
‘‘మన జాగ్రత్తలో మనముండాలి ప్రభూ! ఎంతైనా కాకతీయుని నమ్మకూడదు. అతడు పాలన పట్ల దృష్టి పెట్టాడంటే..’’ ఓ మహామంత్రి చెబుతుండగానే చివ్వున లేచి ఆ మహామంత్రి వైపు ఉరిమి చూశాడు. తన అహంభావం అంతా ప్రదర్శించాడు.
‘‘వాడి ముత్తాతను మన సామంతుడు చంపి పారేశాడు. వీడి తాత ఓ.. రెచ్చిపోయి తీరాస్త రాజ్యాల్లో వ్రేలు పెడదామని ఎంతో ప్రయత్నించాడు. ఏమీ చేయలేక కత్తి ముడిచి అనుమకొండ వెళ్లి పోయాడు. వీడు భయపెడితే వెలనాడు రాజ్యం భయపడిపోతుందా? చెత్త వాగుడు వాగకు..’’
త్వరలోనే గణపతిదేవుడు తొలియుద్ధం వెలనాడు మీదనే చేస్తాడని పృథ్వీశ్వరునికి, గణపతిదేవునికి కూడా ఇప్పటికి తెలియదు.
* * *
రాజప్రాసాదం, అనుమకొండ పట్టభిషక్తుడైనా గణపతి పరిపాలనపై ఏమాత్రం ఆసక్తిని చూపడం లేదు.
ఏదో నడుస్తోంది అంటే నడుస్తోంది.
ఇది కాకతీయ సమాజం కంటే కాకతీయ శత్రురాజ్యాలే ముందు గుర్తించాయి.
మహాప్రధాని గంగాధరమంత్రి తన మంత్రివర్గ సహచరులతో పాలనావ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాడు. సైనిక వ్యవహారాలన్నీ రుద్ర సేనాని చూసు కుంటున్నాడు. తిరిగి కాకతీయ కేతనం రెపరెప లాడటంతో సామాజికం ఒడుదొడుకులు లేకుండా సాగిపోతోంది. సామాన్యులు ఎప్పటిలా తన దైనందినం నిర్వహించుకుంటున్నారు.
ఇద్దరమ్మల జాగరూకతతో గణపతి కేవలం అంతఃపురంలోనో లేదా రాజప్రాసాదంలోనో గడుపుతున్నాడు.
వివాహ సంబరాలు, పట్టాభిషేక మహోత్సవాలు పూర్తయ్యి, బంధు గణమంతా వారివారి రాజ్యాలకు ఊర్లకు వెళ్లిపోయినా అక్క మైలమాంబ ఇంకా అంతఃపురంలోనే ఉండటం.. బావగారు నతవాడి రుద్రయ రాజప్రాసాదంలో మంత్రిత్వ నియోగాల వద్ద కనపడటం.. అతన్ని ఆశ్చర్యపరచింది.
అక్కను అడిగాడు, ‘‘పెద్దక్కా.. ఏవిటి బావగారు రాజ్యాన్ని విడిచి ఇన్నిరోజులు ఇక్కడే ఉన్నారు? రాజ్య పాలన ఎవరు చూస్తారు మరి?’’
తమ్ముని ప్రశ్న ఊహించలేదనుకుంటా.. పెద్దక్క మైలాంబ నివ్వెరపోయింది. ఏమీ చెప్పకుండా నీళ్లు నములుతోంది. ఎప్పుడూ గలగలా నవ్వుతూ గంతులు వేస్తూ తనను ఆట పట్టిస్తూ ఉండే పెద్దక్క అంత అన్యమనస్కంగా ఉండటంతో దగ్గరకు వెళ్లి చుబుకం పట్టి అడిగాడు. ఆమె కన్నుల్లో లీలగా నీళ్లు..
మరింత కంగారు పడిపోయాడు. ‘‘అక్కా.. అయ్యయ్యో.. ఏమైంది చెప్పక్కా..!’’
‘‘నేను చెబుతాను గణా..!’’
తలతిప్పి చూస్తే బావగారు రుద్రుడు.. నతవాడి రుద్రుడుగా గొప్ప యోధుడు కావడంతో ఒక్కడిమల్ల రుద్రుడు అన్న బిరుదు పొందిన వీరుడు. అలాంటివాడు బేలగా కనిపిస్తూ చేతులు పిసుక్కుంటూ అత్తవారింట ఉండటం నిజానికి ఆత్మహత్యాసదృశం.
దగ్గరున్న ఊయల తల్పంపై ముగ్గురూ కూర్చున్నాక చెప్పాడు రుద్రుడు.
‘‘నువ్వు చిన్నవాడివే అయినా నువ్విప్పుడు కాకతీయ మహారాజువి. ఇవ్వాళ కాకపోయినా రేపైనా నీకు తెలియాలి. మా రాజ్యం ఆర్ధిక పరిస్థితి ఏమీ బావుండలేదు గణా. వర్షాలు లేక పంటలు పండ లేదు. రైతు ఏడ్చిన రాజ్యం శ్మశానం లెక్క. వృత్తి దారులు కూడా పనులు లేక చేతులు పిసుక్కుంటూ కూర్చున్నారు. మా రాజ్యంలో ఉత్పత్తి కర్మాగారాలు లేవు. వణిజులు, సెట్టిలు ఉన్నారు కాని కొనేవాడు లేడని వాళ్లూ తరాజు ముడిచి చూరులో గుచ్చి చేతులు ముడుచుకున్నారు. దరిమిలా పన్నులు, కప్పాల వసూళ్లు తగ్గిపోయాయి. కాని ఖర్చులు మాత్రం తగ్గవు కదా..’’
‘‘అదేవిటి.. రాజులకు డబ్బులకు కొదవా..?’’ నిజంగానే ఆశ్చర్యపోయి నిజాయితీగా అనేశాడు.
రాచకార్యాలలో డబ్బుల ప్రసక్తి గణపతి చెవిన ఎప్పుడూ పడలేదు. పెదనాన్న, నాన్న, మహాప్రధాని, ప్రధానులు, మంత్రులు, సైన్యాధ్యక్షులు, ఎందరెందరో నియోగప్రభువులు, అధికార లేఖకులు, కరణాలు.. మహామేధావులైన వారందరిని చూశాడు.. వాళ్ల మాటలు విన్నాడు.
‘‘ఆ ఖర్చు ఎందుకయ్యింది.. సొమ్మంతా దుబారా చేస్తున్నారు.’’
‘‘ఇకపై పొదుపు పాటిస్తాం ప్రభూ..’’
‘‘గుర్రాల అవదేసీకి సొమ్ము ఎందుకు చెల్లించ లేదు? చెల్లించకుంటే వాడు కావాలంటే గుర్రాలు ఇస్తాడా. కనీసం కన్నెత్తి చూడడు. తాంబూలం నమిలి మన ముఖాన ఉయ్యడు కూడా..’’
ఇలాంటి సొమ్ముతో ముడిపడిన సంభాషణలు, అధికార ప్రశ్నలు జవాబులు విన్నాడు కాని రాజుగారి దిన వెచ్చానికే సొమ్ము తక్కువ పడింది ఎలా అన్నమాట వినలేదు. జీతాలకు, దినసరి ఖర్చులకు కూడా సొమ్ము లేదని ఓ రాజు రాజ్యాన్ని వదలి.. అప్పు కోసం చేతులు నలుపుకుంటూ అత్తవారింట కూర్చోవడం..
భలే.. పైకం లేకుంటే!? అవును. పైకం లేకుంటే కావలసిన సరుకులు ఎవడు ఇస్తాడు? పరిచారికలు, భటులు, వంటవాళ్లు, సేవలుచేసే ప్రతివారికి నెలవారీగా జీతం బత్తెం అందుతుంటేనే కదా వాళ్లు పనిచేయగలుగుతారు.
‘‘ఆ వజ్రాల వ్యాపారి ఏమన్నాడు?’’ అక్క బావగారిని అడుగుతోంది.
ఆయన మౌనంగా ఉన్నాడు. రెట్టించి అడుగు తోంది అక్క. అప్పుడు చూశాడు అక్కను నఖశిఖ పర్యంతం. బోసి మెడ. కాళ్లకు పట్టీలు, నడుముకు వడ్డాణం, చేతులకు కడియాలు, మెడలో హారాలు, గైవేయకాలు ఏమీలేవు. కేవలం నుదిటన బొట్టుతో కట్టుగుడ్డలతో ఓ మహారాణి.. కాకతీయ ఆడపడచు.. అవాక్కయ్యాడు.
‘‘ఈ రోజు కాకపోతే రేపయినా పని సానుకూలం అవుతుందని చెప్పాడా..??’’
వాళ్లున్న నిరాశ నిస్పృహల్లో భర్త ఏదైనా ఆశ చిగురించే మాట చెబుతాడేమోనన్న ఆదుర్దా ఆమె మాటల్లో గణపతి గుర్తించాడు. విభ్రమంగా అక్కను చూశాడు.
అక్క మైలాంబిక.. తొలిచూలు ఆడపిల్ల అయితే ఎంత ప్రాణప్రదంగా.. అల్లారుముద్దుగా పెంచు కుంటారో అలా పెరిగింది అక్క. బంగారు ఊయల.. ఒడలంతా బంగారం.. వజ్రవైఢూర్యాలు.. ప్రత్యేక నిపుణులైన కుట్టు పనివాళ్లతో రాజప్రాసాదంలోనే పట్టు పీతాంబరాలతో కుట్టించిన ప్రత్యేక దుస్తులలో మెరిసిపోయే అక్క.. బంగారు అచ్చులపై నడిచి పెరిగిన అక్క.. ఇప్పుడు అదే బంగారు వజ్రాభర ణాలను కుదవ పెట్టాడానికి భర్తను పురమాయించి ఆయన వచ్చాక ఆ అంశం ఏమైంది అని ఆత్రుతగా ఆడగడం.. గణపతిని విచలితుడ్ని చేసింది.
ఇప్పుడు సొమ్ములేనిదే నతవాడి వెళ్లలేరు. వెళితే కనీసం ద్వారపాలకుడు కూడా తలవంచి నమస్క రించడు.
వాడికి జీతం ఇచ్చి ఎన్నిమాసాలు అయ్యిందో.. వాడి పెళ్లాంబిడ్డలు ఏమి తింటున్నారో.. ఇలా ఎందరు.. ఎంద రెందరో ఉద్యోగులు.. సైనికులు..
పరిస్థితి అర్ధమయింది. అపారమేధావి అయిన గణపతి రెప్పపాటులోనే పరిస్థితికి ముందు వెనుకలు ఊహించడం ఎలాగో పెద్ద తండ్రి వద్ద నుండి చిన్ననాడే వంటపట్టించుకున్నాడు.
ఊహాతీతమైన అక్కాబావల పరిస్థితి గుర్తించిన గణపతి హఠాత్తుగా చురుకయ్యాడు.
ఒక్కపెట్టున కవ్వల మరణం తర్వాత ఏర్పడిన నిర్వేదం, నిర్లిప్తత ఎగిరిపోయాయి. అప్పటివరకు మన్ను తిన్న పాములా మునగదీసుకుని పడుకున్న మేధ అనే వేయి పడగల నాగశేషుడు చివ్వున కదిలి వేయిపడగలు ఒక్కసారిగా విదిలించి అంతా చూశాడు. చప్పట్లు చరచి భటుని పిలిచాడు. వాడు వచ్చేలోగా ఒక్కమల్ల రుద్రయను అడిగాడు.
‘‘బావగారూ మీరు అక్క నగలు కుదువ.. అమ్మడానికి ఎవరికి ఇచ్చారు.. ఏ మంత్రి మీకు సహాయపడుతున్నాడు?’’
‘‘అదే. భండాగార నియోగి సంకరయ ద్వారా బలిజశెట్టి అల్లంశెట్టిని కలిశాను. అయన ఇంకా ఏమీ చెప్పలేదు.’’
గణపతి ముఖంలో కాస్త వెలుగు ఎదిగింది. అల్లంశెట్టి కొడుకు అంకాలశెట్టి గణపతి స్నేహితుడు.
‘‘సరే సరే.. నేను చూస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. పని పూర్తి చేసి తగిన సొమ్ముతో మిమ్మల్ని నతవాడి పంపిస్తాను.’’
అక్కబావలిద్దరూ మెరిసే కళ్లతో గణపతిని చూశారు. గణపతి ఎప్పుడూ భరోసాగానే మాట్లాడ తాడు. మాట ఇచ్చాడంటే నెరవేర్చి తీరతాడు. వీళ్లిద్దరికీ ఆవలగా మరో ఇద్దరు చాటుగా జరుగు తున్నది చూస్తూ వింటూ సంతృప్తి చెందారు. వాళ్లు గణపతిదేవుని పెద్దమ్మ, కన్నమ్మ. వాళ్లకు ఆవలగా మరోవైపు మరొకరు చిరాగ్గా చూస్తున్నారు. ఆమె సోమలదేవి. గణపతిదేవుని పట్టపురాణి.