భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో  తృతీయ బహుమతి పొందిన రచన

రచయిత్రి పరిచయం

వాడపల్లి పూర్ణ కామేశ్వరి

స్వస్థలం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం. రైల్వేలో ఉద్యోగ రీత్యా  చెన్నైలో స్థిరపడ్డారు. జాగృతి సహా వివిధ పత్రికలలో ఇప్పటికి నూరుకు పైగా కథలు ప్రచురితమయ్యాయి. హిందీ భాషా  రచనలు, పుస్తక సమీక్ష పోటీలలో పురస్కారాలు అందుకున్నారు.


‘‌కాలం బలీయమైనది. అనుక్షణం మారిపోతూ, తన వేగంతో పోటీ పడమని ప్రపంచాన్నంతా ప్రేరేపిస్తుంది. దాని వెంటే పరుగెడుతున్న మనిషికదెపుడూ ప్రశ్నార్థకమే. గడచిన కాలాన్ని మధుర స్మృతులుగా, రానున్న కాలాన్ని అనూహ్యంగా భావించినా, మనిషి ఎప్పుడూ కాలానికనుగుణంగా సాగిపోవలసిందేగా!’ తాత్వికత్వం చుట్టూ తిరుగాడుతున్న నా ఆలోచనలన్నీ కట్టిపెట్టి కాలాన్ని గడియారం కొలిచి చూపిస్తుంటే, పనిలోకి వేగంగా దిగాను.

‘‘ఏవండోయ్‌, ‌మేజాపై తేనీరుంచి ఐదు నిమిషా లైయ్యింది. ఈ పాటికి చల్లారిపోయుంటుంది కూడా. పరీక్షలకు చదువుకుంటున్న విద్యార్థిలా ఆ వార్తాపత్రిక లోంచి మొహం బయటకు తీస్తేకానీ దాన్ని తాగాలన్న ధ్యాస కూడా ఉండదు’’ విసుగుని దాచుకుంటూ అన్నాను.

చెవిన పడ్డ మాటలకు ఎలాంటి సమాధానమూ రాలేదు. ఔషధం పుచ్చుకున్నట్టుగా యాత్రికంగా దాన్ని తాగి అయ్యిందనిపించారు శ్రీవారు. మా ఇద్దరి పేర్లూ కలిపి ‘భావనానంద’ నిలయమని ఇంటికైతే పేరు పెట్టుకున్నామే కానీ, ఇప్పుడు జీవితాల్లో మధుర భావనలూ, ఆనందాలూ దూరమైయ్యాయి. సమాజంలో చెప్పుకునేందుకు ఇంటికి కావలసిన గోడలూ, పిల్లలూ, అచర వస్తువులూ, బ్యాంకు ఖాతాలైతే కనిపిస్తున్నాయి కానీ మనుషులతో కబుర్లు కరవై యంత్రాలతోనే కాలాయపన షరా మామూలై పోయింది. సరే, జీవితపు పరుగుల్లో ఈ ఆలోచనలకు సైతం గండివేస్తూ…

‘‘రుషీ, ఇవాళ కాలేజీకి కొంచం త్వరగా వెళ్లాల న్నావు. ఇంకా తెమల్లేదేం..పలహారం సిద్ధమై య్యింది, త్వరగా రా..’’ అంటూ హడావిడి పెట్టాను. రుషి రాకపోగా ‘‘వస్తూన్నా’’నన్న సమాధానం కూడా రాలేదు.

ఈ కుటుంబంలో ఇంకా మాట్లాడడం చేతనైన వ్యక్తిగా నేనొక్కత్తినే మిగిలిపోయానేమో అనిపిస్తుంది. ఉన్న నలుగురమూ ఎవరికి వారన్నట్టు యంత్రాలకే వశమైపోయాము. కాదు.. కాదు… బానిసలై పోయామనే చెప్పాలి! యంత్రాలనేవి మానవ సౌక ర్యార్థం తయారైనా ఇప్పుడవే మనిషిని శాసిస్తున్నాయి.

‘‘పూజితా, ఇంకా లేవలేదేంటే?’’

‘‘ఇవాళ బడికి సెలవు కదమ్మా!’’ కప్పుకున్న దుప్పటి ముసుగులోంచే బదులిచ్చింది. అలా సమాధానమొచ్చిందంటే నిద్ర బద్ధకం కాదు చరవాణి సౌజన్యమని అనుకోక తప్పలేదు.

‘‘రుషీ! నీ ఉరోపరి (ల్యాప్టాప్‌) ఇస్తే, కాసేపు ఆడుకుని ఇచ్చేస్తాను’’ అంటూ రాత్రి బతిమాలిందిగా, దాని ప్రభావమే ఇలా దారి తీసిందని ఇప్పుడర్థ మైయ్యింది.

ఎప్పుడూ యంత్రాలతోనే కాలం గడిపే రుషి, పూజితలకు మా చిన్ననాటి కబుర్లు చెపితే నవ్వుతో పాటు విసుగుకూడా వస్తుంది.

‘మా చిన్నప్పటి సంగతులే వేరు!! బడి నుంచి ఇంటికొచ్చి ఉన్నదేదో తిని ఆటలకంటూ వీధిలోకి వెళితే మళ్లీ చీకటి పడేవరకూ ఇంటి దారే తెలిసేది కాదు. ఎన్ని రకాల ఆటలు ఆడేవాళ్లమో! కాలానికి తగ్గట్టు ఆటలూ మారిపోతూ ఉండేవి. బాగా ఆడుకుని అలసి ఇళ్లకు చేరి, కాసేపు ఆవేల్టి పాఠాలు మననం చేసుకుని, ఆఫీసు నుంచి వచ్చి స్నానపానా దులు ముగించిన నాన్నగారితో ఆవేల్టి కబుర్లన్నీ చెప్పేసరికి అమ్మ అన్నం సిద్ధం చేసేది. అందరమూ కలిసి తినేసి, ఆ తరువాత పడుకోవడమే. ఇదే నాటి తరానికి తెలిసిన రోజువారీ జీవితం. ఈ తరానికి మాత్రం ఆటలూ యంత్రాల్లోనేనాయె! అలా అని, ఆ రోజుల గురించి గొప్పగా చెపితే ఇంకేమైనా ఉందా! మీకున్న జ్ఞానమంతేనని తీసిపారేస్తారు. అప్పటివన్నీ వెర్రాటలని కొట్టిపారేస్తారు’ స్వగతంలోనే అనుకుని నిట్టూర్చాను.

పోనీ, ఉన్నత చదువుల్లోనైనా యంత్రాల ధ్యాస వదిలి ఏ సాంఘికమో, భాషా ప్రావీణ్యతకు సంబంధించిన అంశాలను ఎంచుకుంటారా? అంటే అదీ లేదు. ఉచిత సలహాపడేస్తే అదీ ఫెళుసే కొట్టింది.

మొన్నటికి మొన్ననే ఆ విషయంలో పూజిత నాతో వాదించింది కూడాను.

‘‘కృత్రిమ మేధస్సుపై భారత్‌ ‌విశ్వవిద్యాలయంలో కొత్తగా ప్రవేశపెట్టిన విద్యావిధానాన్నే ఎంచుకుంటా నమ్మా’’ అని కచ్చితంగా చెప్పేసింది. ఆ కృత్రిమమేధ సహాయంతోనేగా వాడి కంప్యూటరుకు రుషిపెట్టిన తాళం కూడా సేసింది! తాళం అంటే భౌతికంగా కనిపించే మన తాళం కప్ప కాదండోయ్‌. ‌నీ చరవాణిలో ఆడుతున్నది చాలక నాది కూడా కావాలా అంటూ వాడి కంప్యూటరుకు అంకెలతోనో బొమ్మతోనో తాళం పెడతాడుట. కనిపించని తాళాలూ, వినిపించని రాగాలతోనే సాగిపోతాయి వీళ్ల ఆటలూ..పాటలూ…

                                                                                                  *      *       *

పెట్టిన ప•లహారాన్ని కూడా మరచి కాలేజీకి పరుగు తీశాడు రుషి. అందుకూ వాళ్లకో కారణముందం డోయ్‌. అమ్మచేసే పాతకాలపు పలహారాలు చేతులకు అంటకుండా గబగబా తినేందుకు వీలుగా ఉండవని వాళ్ల బాధ! అంత సమయాభావం అట.

‘‘అమ్మా, నాకస్సలు సమయం లేదు. పన్నెండో తరగతంటే ఏంటనుకున్నావు కత్తి మీద సామే. పరీక్షలు రాయడం ఒకెత్తైతే ప్రవేశ పరీక్షలకు తయారవ్వడం మరో ఎత్తు. ఇవన్నీ చేస్తే కానీ లక్ష్యాన్ని చేరుకోలేను’’ అంటూ బోధించే మేధస్సున్న పూజితకు ఇన్ని పనులు చేసుకుందుకు కావలసిన మానసిక శారీరిక బలానికి మంచి ఆహారం కూడా ఉండాలని తెలియదేంటో! చేసిన నాలుగు ఇడ్లీలూ నోట్లో వేసుకుని వెళ్లకుండా ఇన్ని మాటలు.

సరే ఏది ఏమైనా, కుటుంబాన్నంతా ఏదో వంకన ఒక్కరోజైనా కలిసి గడిపేలా చేయాలన్నదే నా తాపత్రయం. నాకున్న ఒకే ఆయుధం ఇలవేల్పు కోవెలకు అంతా వెళ్లాలని పట్టుపట్టడం. అందరినీ బయల్దేరతీయాలని గట్టిగానే నిశ్చయించుకున్నాను.

‘‘ఎప్పుడనగానో పెట్టుకున్న మొక్కు ఇంకా తీర్చలేదు. దైవకటాక్షం ఉంటేకానీ ఇంట్లో మంచి జరగదంటారు. ఏమైనాసరే ఈ వారం ఇలవేల్పు దర్శనానికి వెళ్లి తీరాల్సిందే’’నంటూభక్తి పేరిట కట్టేయలేని శ్రీవారిని కట్టేయడానికి పాతమార్గాన్నే ఎంచుకుని, భయంతో కట్టేసి ఒప్పించి సాధించాను. ఒప్పుకోవడమే కాక పిల్లల్ని కూడా బయల్దేర తీసారు ఆనంద్‌.

‘‘ఏం‌టమ్మా ఇదీ! నీక్కావాలంటే మీరిద్దరూ వెళ్లాలికానీ, గుళ్లకూ గోపురాలకూ మమ్మల్ని రమ్మని బలవంతమేంటీ’’ విసుక్కుంది పూజిత.

వాడిదీ ఇంచుమించు అదే ఉద్దేశ్యమైనా, అప్పటికే చిన్నబోయిన నా మొహాన్నిచూసి మాట్లాడక ఊరుకున్నాడు రుషి. ఎట్టకేలకు అందరినీ తెవిల్చేసరికి తలప్రాణం తోకకొచ్చినా, ఆదివారం తెల్లవారుతూనే ప్రయాణానికి సిద్ధమైయ్యాము.

                                                                                                  *      *       *

ఉదయాన్నే లేచి పలహారాలూ, పళ్లూ , తేనీటికి కావలసినవన్నీ సిద్ధం చేశాను. కుటుంబమంతా కలసి గడపబోయే చక్కని రోజని లోలోపల ఆనందంగా ఉంది.

‘‘భావనా, నా చరవాణినింట్లోనే ఉంచేస్తున్నాను. గుళ్లోకి ఎలాగూ తీసుకెళ్లనివ్వరన్నావుగా!’’సెలవిచ్చిన శ్రీవారి మాటలకు సంతోషం కలిగింది. అందరూ నాలుగు చక్రాల వాహనంలో ప్రయాణమైయ్యాము. చరవాణి కానీ, మరే ఇతర సాంకేతిక యంత్రాలతో కానీ తీసుకు రాకూడదని ఈ ప్రయాణానికి నేను పెట్టిన నిబంధనను అందరూ పాటించారు. ప్రత్యామ్నా యంగా వారికిష్టమైన వస్తువులు తెచ్చుకున్నారు పిల్లలిద్దరూ.

కొన్న డిజిటల్‌ ‌కెమెరాను చేతపట్టి ప్రకృతిని ఆస్వాదించడం మొదలుపెట్టింది పూజిత. వినడానికి తనకిష్టమైన కిషోర్‌ ‌కుమార్‌ ‌పాటలను తెచ్చుకున్నాడు రుషి. యంత్రాలతోనే జీవితం గడిపే వారికి తమకంటూ కొన్నిష్టాలున్నాయని అప్పుడే గ్రహించారు. భార్య పక్కనుండగా ఆమెతో గడిపే ఆ క్షణాలను, ఆ నిశ్శబ్దంలో వారు పంచుకునే మధురాను భూతులనుచాలా కాలం తరువాత పొందుతున్నాడు ఆనంద్‌. ‌వాళ్ల ఇష్టాలకోసం అలాకొంత సమయాన్ని వెచ్చించి అందులో లభించే ఆనందాన్ని చవి చూస్తున్నది ఆ కుటుంబం.

డెభ్భైలనాటి కిషోర్‌ ‌కుమార్‌ ‌పాటల హుషారుతో ఉత్సాహంగా సాగిపోతోందా ప్రయాణం. దైవ దర్శనం మాటటుంచి, నలుగురమూ సంతోషంగా గడపడానికి కావలసిన సమయమే సుఖజీవనానికి ఇంధనమైతే, దాని ఖర్చు వాహనానికి ఖర్చయ్యే ఇంధనం కంటే ఎంతో తక్కువే కదా అనిపించింది.

శ్రీవారిని అలా ఆనందంగా చూస్తున్నప్పుడు నా ఆలోచనలన్నీ సాగిపోతున్న వాహన వేగంతో పోటీపడుతూ కాలగమనంలో గతంగా మిగిలిపోయిన పాతరోజుల్లోకి వెళ్లాయి.

‘‘నా భవితవు నీవు, నా మధుర భావనవు భావనల కొలను నీవు’’ అంటూ ఇప్పుడు మాటలే రానట్టున్న శ్రీవారి అప్పటి మాటలు గుర్తుకు రావడమే కాక, చీరచెంగుని ఆసరాగా చేసుకుని చిట్టడుగులు వేస్తూ నడకలు నేర్చిన చిన్నారుల తొలి అడుగులూ కళ్లల్లో మెదిలాయి. ప్రతీ ఏడూ ఊళ్లో గడిపిన సంక్రాంతి పండుగ సంబరాలు, గొబ్బెమ్మలూ, గంగిరెద్దులూ, పిండివంటలూ, భోగిమంటలూ, తలంట్లూ, కొత్త బట్టలూ కళ్లల్లో నిలిచాయి. ఒకటేంటి ఎన్నెన్నో మధురానుభూతులతో ఊర్నుంచి మూటకట్టు కొచ్చి మనసులో పదిలంగా దాచుకున్న సంతోషాల ఊహలలో మునిగి తేల్తుండగా అల్పాహారానికి వాహనాన్ని ఆపారు శ్రీవారు.

జంబుఖానా పరిచి, చేసుకొచ్చినవన్నీ అందరికీ పళ్లాల్లో సర్ది ఇవ్వసాగాను.

‘‘అమ్మా, ఇదేంటి ఇవాళ కూడా ఇడ్లీనా?’’ పూజిత మొహం చిన్నబోయింది.

‘‘నిన్ననే తాజాగా వేయించి చేసిన కారప్పొడిలో నెయ్యి వేసి తెచ్చాను పూజితా. కారప్పొడితో నీకిష్టమేగా. ఎంత బాగుందో చూడు’’ ఒక ఇడ్లీ ముక్కను నోట్లో వేసుకుని ఉత్సాహాన్ని పెంచుతూ అన్నాను.

‘‘వేరేదేమీ లేదా?’’ అసంతృప్తిగా అంటున్న పూజిత మాటకి ‘‘అన్నయ్యకిష్టమని నిమ్మకాయ పులిహార చేసాను పోనీ అది తింటావా?’’ అన్నాను.

‘‘ఇప్పుడు అవేవీ తినాలని లేదు’’ అన్నాడు రుషి.

‘ఏ బర్గరో, పీజ్జానో అయితే ఈ పాటికి గెంతులేసు కుంటూ తినేసేవారు! ఉదయం నాలుగు గంటలకు లేచి చేసాను. మనిషి శ్రమకు విలువలేదు, కష్టపడి సంపాదించిన భోజనానికీ విలువలేదు. చేసుకొచ్చిన వన్నీ నేను మాత్రం తృప్తిగా తింటాను’ అనుకుంటూ పళ్లెంలో పెట్టుకున్నాను. ఇన్నేళ్ల అనుబంధంలో నన్ను చదివిన శ్రీవారికి నా మొహం చూసి అర్థమైయ్యో, లేక ఆకలేసో కానీ ఆయన మాత్రం ఏమీ మాట్లాడ కుండా కావలసినది తినేసారు. మళ్లీ ప్రయాణం కొనసాగింది.

ఆ త్రోవ పొడవునా చిట్టడవులు, చిన్న చిన్న సెలయేళ్లతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ‘‘నాన్నా, ఇక్కడ ఏదో పెద్ద చెరువుంది. దూరంగా కొండలనుండి వస్తున్న సెలయేళ్ల గలగలలు, పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి. ఈ ప్రదేశం ఎంతో బాగుంది. కాసేపు ఆగుదాము’’ అన్నాడు రుషి.

అందరమూ దిగి తలో వైపూ నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాము. తెచ్చిన కెమెరాలో కళ్లకు కనిపించిన ప్రతీ అందాన్నీ బంధిస్తోంది పూజిత. శ్రీవారితో నేను పాతజ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఒక వైపు నడుస్తుండగా, పక్షుల కువకువల రవములను వింటూ గుబుర్లలోకి సాగిపోతూ మరో వైపుకు నడువ సాగింది పూజిత.

కొంత దూరంలో పూజితకు అక్కడే నివసిస్తున్న ఒక అవ్వ కనిపించింది.

‘‘అవ్వా, నీ ఫోటో తీసుకోనా?’’ఉత్సాహంగా అడిగింది పూజిత. ఒళ్లంతా ముడతలు పడి, ఐదడు గల పొడుగుండే అవ్వ ఒంగి మూడడుగులే కనిపి స్తోంది. చేతి కర్ర ఆసరాతోనడుస్తోంది.

‘‘ఇదామ్మా.. చింతపండు పులుసు పెడుతున్నా తల్లీ, కాసేపట్లో అయి పోతుంది. తిందువులే!’’ ఫొటో అంటే అర్థం కాని అవ్వ ఆదరంగా అంది.

ఆ ప్రాంతంలో అవ్వ ఎన్నేళ్ళనుండో ఉంటున్న ట్టుగా అక్కడి ఆనవాళ్లు చెపుతున్నాయి. పాతబడ్డ నలిగిన చీరను చుట్టుకుని, అటూఇటూ నడుస్తూ పనులు చేసుకుంటోంది అవ్వ. కట్టెల పొయ్యిపైన ఒక మట్టిపాత్రలో ఏదో ఉడుకుతోంది. ఘుమఘుమ లాడుతున్న వాసన కడుపులో ఆకలిని పెంచుతోంది. నిర్మలంగా చిరునవ్వు చిందుతూ ఉంది అవ్వ ముఖం.

‘‘అవ్వా, ఇక్కడింకెవ్వరూ ఉన్నట్టులేదే! నీకెవ్వరూ లేరా?ఈ చెట్ల మధ్యలో నువ్వు ఒక్కత్తివే ఉంటావా? భయమెయ్యదా?’’ ప్రకృతినంతా ఆస్వాదిస్తూ తన కెమెరాలో బంధించాలన్న ఉత్సాహం తగ్గి, అవ్వను ఆసక్తితో ప్రశ్నల వర్షం కురిపించింది పూజిత.

‘‘ఈ అమ్మ నీడనుంటున్న నాకు బయమెందు కమ్మా’’ అంటూ చింతచెట్టుని చూపింది. తను నిలబడి ఉన్నది ఆ చెట్టు ఛాయలో అని అంత వరకూ తెలియ లేదు పూజితకి.

‘‘ఈ తల్లి నీడనే బతుకుతున్నాను. ఇదిచల్లని నీడనిస్తుంది. చిగురించినపుడు ఇంత పచ్చడి నూరుకుంటే సరిపోతుంది. కాలం సాగిపోయి ఈ తల్లి కొమ్మలన్నీ కాయలతో నిండిపోతాయి. ఎండకి ఎండుతూ కిందగిరాలగా దోరగా పండిన ఆ కాయలతో కూసంత పులుసు పెట్టుకుంటే నా జానెడు పొట్టి నిండిపోతుంది. ఏ కాలానికా కాయలు కాస్తాయి ఈ చుట్టుపక్కల. ఈ నేలతల్లి ఇచ్చే దుంపలు, ఆకుకూరలూ ఒకటేంటమ్మా, ఇక్కడేం కావాలంటే అవే ఉంటాయి. బతకడానికి ఇంతకంటే కావలసిందే ముందమ్మా?’’ అంది అవ్వ.

అవ్వ మాటల్లోని అల్ప సంతోషాన్నీ, సంతృప్తినీ చూసి ఆశ్చర్యం కలిగింది పూజితకు.‘‘అక్కడ తనకెలాంటి లోటూ లేదని నమ్ముతూ, ఒటరినన్న భయమే లేకుండా ఎలా ఉంటారో. ఎవరూ లేరని కానీ, ఏదో లోటుందని కానీ అనిపిం చదా అవ్వా?’’ అడిగింది.

‘‘నాకేటి లోటున్నాది తల్లీ. తలదాచుకుందుకు నీడ ఉంది. కడుపు నింపే తల్లీ ఉంది. కాలం తీరితే ఈ చెట్టుతల్లి ఒడిలోనే ఊపిరి వదిలేస్తాను. అయినా అందరమూ ఒంటరిగానే వస్తాము, ఒంటరిగానే పోతాము. ఈ మధ్యలో మాత్రం ఒంటరితనమంటే భయమెందుకమ్మా!’’ అంటూ నవ్వేసింది. అవ్వతో కబుర్లు ముగించి వాహనం వైపు తిరుగు ప్రయాణమైన పూజిత మనసు ఇప్పుడు అనేక ఆలోచనలతో నిండిపోయింది. ఆలోచనల్లో మునిగితేల్తూ వాహనం దగ్గరకు చేరుకుంది.

‘‘అమ్మా, ఆకలేస్తోంది, ఇడ్లీ, పులిహోర పెడతావా?’’ అప్రయత్నంగా అడిగింది. పూజితను చూస్తున్న ఆనంద్‌కు ఆశ్చర్యం కలగగా, భావనకు ఆనందం కలిగింది. అవ్వ కబుర్లు చెపుతూ కడుపు నింపుకుంది పూజిత.

నా పొదరింట చింతచెట్టుతెచ్చిన మార్పును చూసి ఆశ్చర్యం కలిగింది. అటుపై చేసుకున్న దైవదర్శనంతో మొక్కు తీరి, ఇది దైవకృప అని సంతృప్తి పడుతూ ఇల్లు చేరాం.

రెండేళ్లు ఇట్టే గడిచిపోయాయి.

                                                                                                  *      *       *

అషాఢ మాసం వచ్చింది. మావయ్యగారికి సుస్తీ చేసి కొన్ని రోజులకే కాలం చేసారు. ఆయనతో గడిపిన అనుభూతులే పిల్లకు ఆస్తులైయ్యాయి. ఎందుకంటే, మావయ్యగారు పోయిన సంవత్సరమే ఎన్నేళ్ల తరువాతో మేమంతా కలసి ఊరు వెళ్లాం కనుక.

‘‘నాన్నా ఈ ఏడు పండక్కెళదామా!’’ఎప్పటికప్పుడు పండక్కి రామంటూ భీష్మించుకునే పిల్లలు ఆ మాట అనడమే తడవుగా ప్రయాణమైయ్యాము. ఇది చింతచెట్టు మహిమే అనుకున్నాను. సంక్రాంతి పండుగకు వారం రోజులు ముందుగానే వెళ్లి ముక్కనుమ నాడు తిరిగు ప్రయాణమైయ్యాము. అన్నాళ్లూ ఊళ్లోనే గడిపాము.

‘‘తాతయ్యా, కనకాంబరం మడిపక్కనే ఆ మల్లెతీగ మొదలు ఉందిగా, ఎరువేసి దాని చూట్టూ పాదుకట్టి నీరు పెడతాను’’ అంటూ, తాతగారితో సమానంగా ఇంటి చుట్టూ వేసిన మొక్కలతోనే కాలక్షేపం చేసేది పూజిత. మంకెన పువ్వుని ఎరగని పూజిత మొదటి సారి దాన్ని చూసి మురిసిపోవడం నాకింకా కళ్లల్లో తాజాగా ఉంది.

‘‘ఇవాళ ఆకుపచ్చ సంపెగ పువ్వు పూసుంటుంది, ఇక్కడిదాకా సువాస నొస్తోంది’’ అంటూ నిమ్మకు నీరు పెడుతూ మామయ్యగారు అన్నారు. వెంటనే పరుగున వెళ్లి చెట్టంతా గాలిస్తే గుప్పుమనొస్తున్న వాసనే కానీ పువ్వు కనిపించక సతమతమయ్యింది పూజిత. ఆకుల చాటుగా దాగిన పువ్వును కనుగొన్నాక దాని కళ్లల్లో కనిపించే కాంతులకు వెల ఉంటుందా అనిపించింది నాకు. అలా జరుపుకున్న పండుగ తరువాత మరో సంక్రాంతికి మావయ్యగారు లేరు.

మనసుకంటే వేగంగా ప్రయాణించే సాధనం ఏదీ లేదంటారే కానీ, కాలం అంతకంటే వేగంగా ప్రయాణిస్తోందని నమ్మక తప్పట్లేదు. అలా గిర్రున తిరిపోతున్న కాలచక్రంతోనే సాగిపోతోంది మానవాళి. అలాంటి చక్రవ్యూహంలో చిక్కుకున్నా, కొన్ని మార్పులు అభిలషనీయం. అదే ఇకిగాయ్‌ అనిపించింది.

జపాన్‌ ‌దేశం ప్రబోధించిన శతాబ్దం నాటి తత్వం ఇకిగాయ్‌. ‌జీవితాన్ని మెరుగు పరచుకోవాలని ఎందరో మహనీయులు ఆ తత్వాన్ని వెలుగులోకి తెస్తూ ప్రపంచానికి పంచుతున్నారు. తానెంచుకున్న వాటికి దూరమవ్వకుండా ప్రపంచంతో మమేకమవుతూ స్వయంగా ఆనందాన్ని పొందుతూ మనిషి ముందుకి సాగిపోవడానికి సహాయపడే తత్వాన్నే ఇకిగాయ్‌గా అభివర్ణించవచ్చు. ‘జీవించడానికి ఒక కారణం’అనే కొన్ని అంశాల అతివ్యాప్తిని సూచిస్తుంది ఇకిగాయ్‌. ‌మనిషి తన అభిరుచిని వీడక, వృత్తితో పాటూ దాన్నీ లక్ష్యంగా చేసుకుని, రెంటినీ సాధిస్తూ సాగిపోతే అర్థవంతమైన జీవితానికి దారి తీస్తుందని ఇకిగాయ్‌ ‌చెపుతుంది.

ఇకిగాయ్‌ ‌సూత్రాన్ని అనాయాసంగా అవలం బిస్తూ, ఆ అవ్వ చింతచెట్టు నీడనే జీవనపథంగా చేసుకుని సంతృప్తితో బతుకుని అర్థవంతం చేసుకుంది. ఆ చింతచెట్టు ప్రభావం మా ఇంటా లేకపోలేదు.

పెరట్లో పిల్లలు నాటిన మొక్కలు పూస్తున్నాయి. ప్రహరీ గోడ పక్కగా పెట్టిన చింతచెట్టుకి చిగుర్లు వేస్తోంది. ఉదయాన్నే లేచి సూర్యోదయాన్ని చూడడమే రుషి నిత్యకృత్యమైంది. పూజిత ప్రకృతితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. ‘భావనానంద నిలయం’ ఇంటికి సార్థక నామధేయమైయ్యింది.

About Author

By editor

Twitter
YOUTUBE