అస్థిరతకు మారుపేరైన బాంగ్లాదేశ్ తన అంతర్గత రాజకీయాలతో భారతదేశంపై తోక జాడించాలని చూస్తోంది. భారతదేశం భిక్షతో ఆవిర్భావించిన ఆ దేశం గతాన్ని మర్చిపోయి ఘర్షణ వైఖరి పంథాలో నడుస్తోంది. భారత్ పై కుట్రలు పన్నుతోంది. ఒకసారి మతం కోణంలో, మరోసారి మన వైరి దేశాలకు స్నేహం అందిస్తూ కాలుదువ్వుతోంది. ఈ సందర్భంగా ‘‘మిత్రులను మార్చుకోవచ్చు, కానీ పొరుగువారిని మార్చలేరు…’’ అని మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితుకు సరిగ్గా సరిపోతాయి. తమ దేశ అంతర్గత రాజకీయ పరిణామాల్లో భాగంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భారతదేశంలో శరణార్థిగా ఉంటున్న ఉద్వాసనకు గురైన ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా లక్ష్యంగా భారత్‌తో కయ్యానికి దిగాలని యత్నించడం ఆ దేశ పాలకుల మూర్ఖత్వానికి నిదర్శనం. భారతదేశంలో ఉంటున్న 78 ఏళ్ల షేక్ హసీనాకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించడంతో ఆ సాకుతో భారత్‌పై ఘర్షణ వైఖరి అవలంబిస్తున్నది.
బాంగ్లాదేశ్‌లో సైనిక ఆధిపత్యం, మతోన్మాదం సర్వసాధారణం. ఆ దేశంలో ఎవరు అధికారంలో ఉన్నా భారత్‌కు ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదు. ఆ దేశ పాలకులు ఎవరైనా వారి స్వప్రయోజ నాల కోసం మన దేశంతో ఇష్టం లేకపోయినా స్నేహం నటిస్తారు. 1971లో బాంగ్లాదేశ్ ఆవిర్భావం అనంతరం ఆ దేశ తొలి ప్రధాని ముజిబుర్ రహ్మన్ మొదలుకొని ఇప్పటి ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం సలహాదారుడు మహ్మద్ యూనస్ వరకు ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. మిగతా పాలకులతో పోలిస్తే 1996లో పగ్గాలు చేపట్టిన షేక్ హసీనా భారత్‌తో ఘర్షణ వైఖరికి కొంత దూరంగా ఉన్నారు. దీంతో ఆ దేశ మతోన్మాద శక్తులకు ఆమె లక్ష్యంగా మారారు. హసీనా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఆక్రోశంతో పాకిస్తాన్ అక్కడి మతోన్మాద శక్తులను ప్రోత్సాహించేది. మరోవైపు చైనా కూడా మనకు వ్యతిరేకంగా ఆ దేశాన్ని ఎగదోసేందుకు ప్రయత్నిస్తోంది.
షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఆ దేశంలో జరిగిన హింసాత్మక ఉద్యమంలో సుమారు 1400 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఆమెను హత్య చేసేందుకు ముష్కరులు ఆమె నివాసంపై దాడి చేస్తున్న సమయంలో ఆమె త్రుటిలో తప్పించుకొని భారత్‌లో శరణు పొందారు. ఆగస్టు 5, 2024న పదవి నుండి వైదొలగిన నాటి నుండి మనదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. 2006లో నోబెల్ బహుమతి పొందిన ఆ దేశ ఆర్థికవేత్త మహ్మద్ యూనస్ సలహాదారుడిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. హసీనాను పదవి నుంచి తప్పించడంలో ఆ దేశ సైనిక అధికారులతో పాటు మతోన్మాదుల హస్తం ఉంది. ఈ శక్తులను పాకిస్తాన్ ప్రోత్సా హించింది. తెరవెనుక వీరందరికీ యూనస్ సంధానకర్తగా వ్యవహరించారు. త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రజాపాలన అందిస్తానని చెప్పిన యూనస్‌పై ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశంలో ఒత్తిడి పెరగడంతో ఫిబ్రవరి, 2026లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలని చూస్తున్న బాంగ్లా పాలకులు భవిష్యత్‌లో ఆమె నుండి ఎలాంటి రాజకీయ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మరణశిక్ష విధించారనే ప్రచారం ఉంది. మానవాళిపై హింసకు పాల్పడ్డారనే కారణంగా బాంగ్లాదేశ్‌లోని ‘అంతర్జా తీయ నేరాల ట్రిబ్యునల్’ హసీనాకు నవంబర్ 17వ తేదీన మరణ శిక్ష విధించింది. ఆమెతోపాటు అప్పటి హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు కూడా ఇదే తరహా శిక్షపడింది. దీంతో శిక్ష అమలుకు ఆమెను తమకు అప్పగించాలని అక్కడ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరడంతో ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.
అధికారంలో కొనసాగాలన్నా ఏకైక లక్ష్యంతో హసీనా అనేక అవినీతి అవకతవకలకు పాల్పడడం, తమ వ్యతిరేకుల్ని జైలుపాలు చేయడం, ఉద్యమాలను అణిచివేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఆమెను తప్పించి అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వం కూడా ఇదే బాటలో సాగుతోంది. ప్రభుత్వ సలహాదారుడిగా పగ్గాలన్నీ యూనస్ చేతిలో ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా తెరవెనుక నిర్ణయాలన్నీ సైనికుల, మతతత్వవాదుల చేతిలోనే ఉన్నాయి. తాత్కాలిక ప్రభుత్వంలో హసీనాకు వ్యతిరేకంగా కఠినమైన తీర్పు వస్తుందనే ఊహాగానాలు జరిగాయి. ఆమె గైర్హాజరీలో చట్టాలను మార్చి హడావిడిగా ఐదు నెలల్లోనే కేసు విచారించి శిక్ష విధించారనే ఆరోపణలున్నాయి. పార్లమెంట్ ఆమోదం లేకుండా చట్టాలను సవరించారు. చివరికి ఆమె తరఫున వాదించేందుకు న్యాయవాదులను కూడా అనుమతించలేదు. రాజకీయ సంబంధాలున్న వారిని న్యాయమూర్తులుగా నియమిం చారు. ప్రజా పాలన కోసం ఎన్నికలు నిర్వహించాలని దేశ వ్యాప్తంగా ఒత్తిడి పెరగడంతో ఇన్ని లోపా భూయుష్టమైన విధానాలతో వెలువరించిన ఈ తీర్పును కక్షసాధింపుతో కూడుకున్న రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆరోపిస్తూ ఆ దేశంలో అవామీ లీగ్ నేతృత్వంలో నిరసనలు కూడా భారీగానే జరిగాయి. ఈ మరణ శిక్షపై ఆమ్నెస్టీ వంటి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు నిరసనలు తెలియజేశాయి.
హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించిందనే అక్కసుతో బాంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువుల లక్ష్యంగా దాడులు జరిగినా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు హిందువులపై దాడులు జరుగుతున్నాయని, రక్షణ కల్పించాలని కోరినా ప్రభుత్వం స్పందించ లేదు. ఇదే సమయంలో యూనస్ ప్రభుత్వం చైనా సహకారంతో రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది. పాకిస్తాన్‌తో సంబం ధాలు మెరుగుపర్చుకుంటూ ఆ దేశ సైనిక అధికారు లతో సంప్రదింపులు జరిపి ఆ రెండు దేశాల మధ్య గూఢచర్య సమాచారాన్ని అందిపుచ్చుకుంటోంది. బాంగ్లాదేశ్ పాకిస్తాన్, చైనాలతో జతకట్టడం కచ్చితంగా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రణాళికలు రూపొందించడమే. హసీనాకు భారత్ ఆశ్రయం కల్పిస్తుందని ఆగ్రహంగా ఉన్న ఆ దేశం ఇప్పుడు హసీనాను మరణ శిక్ష కోసం అప్పగించాలని పట్టుబడడంతో రెండు దేశాల మధ్య అంతరం మరింత పెరిగింది.
బాంగ్లాదేశ్ హసీనా అప్పగింత కోసం రాసిన ఇంటర్ పోల్ సాయాన్ని అభ్యర్థించాలని నిర్ణయిం చింది. రాజకీయ కోణంలోనే ఆమెపై చర్యలు తీసుకుంటున్నారనే ప్రచారం నేపథ్యంలో భారత్ ఆచితూచి అడుగులేస్తోంది. ఇరు దేశాల మధ్య ఖైదీల అప్పగింత ఒప్పందం ఉన్నా ఇవి రాజకీయ అభియో గాలు కాబట్టి మన దేశం పట్టించుకునే అవకాశాలు లేవు. ఆమెను అప్పగించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఆ దేశంలో శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం, సుస్థిరత ఆశిస్తున్నట్టు తెలిపింది. అందుకోసం నిర్మాణాత్మక సంబంధాలు కొనసాగిస్తా మని చెప్పింది. అయితే యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారతదేశంపై అంతర్జాతీ యంగా ఒత్తిడి తేచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ‘‘దేశం విడిచి పారిపోయి మరణశిక్ష ఎదుర్కొంటున్న హసీనాకు ఆశ్రయం కల్పించిన వారు ఆమె చేసిన నేరాలను సమర్థించినట్టే…’’ అని వాదిస్తోంది. అయితే దీనిపై దీటుగా స్పందిస్తూ ‘‘హసీనా పదవీచ్యుతురాలైన ప్పుడు ఆమె ప్రధానమంత్రి బాధ్యతల్లో ఉన్నారు. ఆమె స్థానంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారిని మాత్రమే భారత్ గుర్తిస్తుంది..’’ అని కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరిగితే అంతవరకు వేచి చూసే ధోరణిలో ఉంది. మరోవైపు దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను అప్పగించాలని మన దేశం కోరుతున్నా ఇంటర్‌పోల్ సహా అంత ర్జాతీయ సంస్థల నుండి స్పందన అంతంత మాత్రం గానే ఉంది. ఇప్పుడు హసీనా విషయంలో కూడా అదే తరహాలో స్పందన వచ్చే అవకాశం ఉంది.
ఆగస్టు, 2024లో మహ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ చైనా, పాకిస్తాన్ దేశాలకు స్నేహ హస్తం అందించారు. ఇప్పుడు మరోసారి అదే పంథాలో హసీనా మరణశిక్షపై తీర్పును మనదేశానికి వ్యతిరేకంగా మార్చేందుకు ఆయన పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. తమ దేశంలో విద్యార్థుల ఉద్యమానికి భారత్ వ్యతిరేకమని ప్రకటించారు. మైనార్టీలైన హిందువులపై దాడులను తప్పుడు ప్రచారం అంటూ సమర్థించుకున్నారు. చైనా ఎకనామిక్ కారిడార్ గురించి మాట్లాడుతూ ఈశాన్య భారత్ ప్రాంతాలను ఉద్దేశపూర్వకంగా ప్రస్తావిం చారు. ఆర్థిక రంగంలో నోబెల్ అవార్డు పొందిన విద్యావేత్తగా ప్రచారం చేసుకునే యూనస్ మతో న్మాదంతో పాకిస్తాన్‌తో చేతులు కలపడమే కాకుండా భారత్ వ్యతిరేక శక్తులతో జట్టు కట్టారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో దశాబ్దకాలంగా మన దేశం ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాతో పాటు అన్నింట్లో పురోగతి సాధించి అగ్రదేశాలకు ధీటుగా మారుతోంది. దీంతో తమ ఆధిపత్యానికి భారత్ అడ్డువస్తుందనే అక్కసుతో అంతర్జాతీయ కుట్రలు ప్రారంభమయ్యాయి. సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలతో ఉండే పాకిస్తాన్‌కు సమయం వచ్చిన ప్పుడల్లా బుద్ది చెబుతున్న దశలో ఇతర చికాకులు కలిగించేందుకు బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వంటి దేశాలను మనదేశంపై ఎగదోసేందుకు చైనా, అమెరికా దేశాలు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా హసీనా అప్పగింతపై కూడ ఒత్తిడి తేవచ్చు. అయితే రాజకీయ కుట్రలున్న ఈ కేసులో ప్రజా ప్రభుత్వం కాకుండా తాత్కాలిక ప్రభుత్వంతో ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని అమలు చేసేందుకు భారత్ ముందుకు రాకపోవచ్చు. అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పడే వరకు వేచి చూసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈలోగా యూనిస్ నేతృత్వంలో ప్రభుత్వం అతిగా వ్యవహరిస్తే తగిన బుద్ది చెప్పడానికి కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడదు.
– శ్రీపాద