తెలుగులో ప్రవీణ. కన్నడ, ఆంగ్ల పద నిపుణ. హిందీ భాషలో కోవిద. స్వర్ణకంకణం ఆమెకే. ‘సరస కవయిత్రి’ బిరుదం ఆమెదే.

86 సంవత్సరాల జీవితకాలం. చేసిన రచనలు కొన్నే అయినా, వాటి వల్ల పొందిన పేరు ప్రఖ్యాతులు మిన్న.

ఊరు రాయలసీమ ప్రాంతంలోని ప్రొద్దుటూరు.

కృష్ణవేణమ్మ ఆమె పేరు.

రాసిన వాటిల్లో అనేకం శతకాలే!

పద్య కావ్యాల్లో ఆనాడు మిన్న ఆమే.

శత జయంతి ఉత్సవం జరిగి ఇప్పటికి ఒకటిన్నర దశాబ్ది.

తొలి శతకం ప్రచురితమైనప్పుడు, కృష్ణవేణమ్మకు 20 ఏళ్లు.

అన్నట్లు, ఆమె పుట్టిన తేదీ సైతం అదే.

ఈ డిసెంబరు రెండో పక్షంలోనే ఆ కవయిత్రి పద్య సాహిత్య మహోత్సవాలు.

‘తల్లీ, యాశ్రిత కల్పవల్లీ, నిజభక్తా మౌషు విధ్వంసినీ!

ఫుల్లాంభోరుహ పత్రనేత్ర’ అని సంబోధన.

నినునే బూజింతునేవేళ, నా యుల్లంబందు వసించి

అంటూ ఆరాధన, అభ్యర్థన.

సల్లలితమౌ నుక్తుల్‌ ‌సుశబ్దాళితో సల్లాపింపగజేయు

అని తనదైన రీతిన అభివర్ణన.

నీ స్తవమున్‌ శ్రీ ‌జ్ఞాన ప్రసూనాంబికా!

అంటూనే ప్రతీ పద్యం చివరనా ప్రస్తావన.

ఇవన్నీ గంటి కృష్ణవేణమ్మ రచనల్లోని విశేషాంశాలు.

రాజరాజేశ్వరీ, కామాక్షీ శతకాల కర్త కూడా ఆమే! వాటికి భిన్నంగా రచించినదే జ్ఞాన ప్రసూనాంబిక శతకం.

శ్రీకాళహస్తి ఆలయ దేవత పేరు జ్ఞాన ప్రసూనాంబిక. అమ్మవారి రూపం విజ్ఞానప్రదాతగా గోచరిస్తుంటుంది.

శ్యామాం రాజనిభాననం రతిహితాం రాజీవ ప్రతీక్షణాం

రాజత్కాంచన రత్నభూషణయుతాం రాజ్యప్రదానేశ్వరీమ్‌

‌రక్షో గర్వనివారణాం త్రిజగతాం రక్షైక చింతామణీం

ధ్యాయేచేతసి కాళహస్తి నియాం

అంటుంది దేవీస్తోత్రం. ఈ పఠన అనుభవమే కవయిత్రి శతకానికి మూల ఆలంబన.

అది భారత స్వతంత్ర అనంతర కాలం. అప్పటికీ ఛందోబద్ధ రచనలు అనేకంగా వెలువడి ఉన్నా, ఇతర పక్రియలూ రూపును సంతరించుకుంటున్నాయి. తొలిగా వనితా మార్గదర్శిని మొల్ల. రామాయణ కథనే కావ్యవస్తువుగా ఎంచుకున్నారు. భక్తికీ, ముక్తికీ ఆధారప్రాయమని భావించుకున్నారు. తానొక స్ఫూర్తి ప్రదాయని.

ఆ కోవలోనే వెంగమాంబ. ఆత్మీయతా ప్రధానమైన శతకాన్ని రచనాక్రియగా చేపట్టారు. ఆత్మాశ్రయ సూచకంగా పలు కథనాంశాలకు రూపుదిద్దారు. భక్తి సాంద్రతకు తోడు లోకవృత్త పరిశీలననీ సాధనంగా మలుచుకున్నారు. సామాజిక ప్రయోజక నరసింహ శతకాన్ని వెలువరించారు. జిజ్ఞాసకు తత్త్వాన్ని జోడించి, విస్తారంగా సారస్వత సృజన చేశారు.

సమకాలీన స్థితిగతులను ప్రతిబింబించేలా కృతులను వెలయించిన అలనాటి కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క. అల్పాక్షరాల్లో అనల్ప అర్థాన్ని వెల్లడించే పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రాచీనులైన ఆ అందరినీ స్ఫూర్తిగా తీసుకున్నారు కృష్ణవేణమ్మ.  ఆనాటి ఆధునిక రీతులనూ ఆకళింపు చేసుకున్నారు. స్త్రీ హృదయాన్ని భక్తితత్వంతో మిళితం చేస్తూ ప్రసూనాంబికను కీర్తించారు. అక్షరాంజలి సమర్పించారు.

అదే కాలంలోని గృహలక్ష్మి పత్రిక నుంచి ఆమెకు ఎంతగానో సహకారం అందింది. శతక ఆవిష్కరణకు మార్గం సుగమమైంది. ఫలితంగా, రెండు పదుల వయసైనా నిండని కృష్ణవేణమ్మ విరచిత కావ్యం ముద్రణ భాగ్యాన్ని పొందగలిగింది. ఆ రోజుల్లో అది విశేషమే!

ఆమె తండ్రి ప్రభుత్వ అధికారి. తల్లి సుబ్బలక్ష్మమ్మ కవయిత్రి. ఎంతగానో పేరొందిన చంద్రకళా విలాస కర్త. ఆ ప్రబంధం ఎంత విస్తృతి పొందిందంటే విద్యార్థులకు అదే పాఠ్యగ్రంథం!

మాతృమూర్తికి తోడు కృష్ణవేణమ్మ భర్తది నిరంతర సహకారమనస్తత్వం. చెన్నకేశవ శతకాన్ని హృద్యంగా రచించి, ఖ్యాతి గడించినవారు.

ఇంతటి కుటుంబ నేపథ్యమే కృష్ణవేణమ్మ రచనా వ్యాసంగాన్ని విస్తృతపరచింది. మరిన్ని కావ్యాలకు ప్రధాన కారణంగా నిలచింది.

అప్పుడు అది 1947. స్వతంత్ర సాధన సంవత్సరం. అప్పుడే జనవరి నెలలోనే ఆమె పద్యకావ్యం ధారావాహికంగా పత్రికలో ముద్రితమైంది.

పాండవ కౌరవ యుద్ధం. స్వేచ్ఛకోసం ఉద్యమం. విముక్తి పొందేందుకు మహా ప్రయత్నం. భరతమాత దాస్యశృంఖలాల్ని ఛేదించేందుకు సాగిన పోరాట ఫలితం. వీటన్నింటినీ అంతర్గత ఇతివృత్తంగా ‘సైరంధ్రి’ కావ్యరచన చేశారు.

కురుసభలో అవమాన భారానికి ద్రౌపది పడిన పరివేదన. ఈ అంశాన్నీ గమనంలోకి స్వీకరించిన కవయిత్రి అపురూప భావప్రకటన చేశారు ఆ కాలంలోనే!

స్వాతంత్య్రం లభించింది. పరిస్థితి మారింది. ఆ సందర్భంలోనూ తన భావనలకు అక్షరరూపం కలిగించారు రచయిత్రి.

అంటే – స్వాతంత్య్రానికి ముందు ఉన్న స్థితిని, తదుపరి దశనీ పద్యరూపంలో అక్షరబద్ధం చేశారన్నమాట.

సంవేదన ప్రధానంగా మరికొన్ని ఖండికలనూ వ్యాప్తిలోకి తెచ్చారు. పేరుకు ‘నిర్వేదన’ అయినా ఒకచోట –

‘అందముగ రసిక హృదయానందంబుగ గవిత జెప్ప నాకలవియే?

అని తనను తనే ప్రశ్నించుకున్నారు.

‘బాలేందుదరు కూర్మినతి నాయందు నిలిచి బలుకుమన్న, యంత పలికెదన్‌’ అనీ మనోరథాన్ని ప్రకటించుకున్నారు.

ఆమెది ధారాపాత పద్యకవిత. అందులోని నిశితత్వం, సంస్పందనం చదువరులనెందరినో ముగ్ధుల్ని చేసింది.

తన రచనల పరంపరలో ఇంకా విలక్షణమైనవి రెండు. రెండూ సందేశ సమన్వితాలే! ఒకటి- గిరిజా కల్యాణం. వేరొకటి – పవన ద్యూతం.

పేరును అనుసరించి – గిరిజాకల్యాణ రచన సరసభావప్రపూర్ణం. సమరసనీయతకు ఆలవాలం. పురాణ కథనాన్ని అక్షరీకరించి, పాఠకుల ఎదుట దృశ్యరూపానికి తేవడంలో కృతకృత్యులయ్యారు.

రాధాదేవి, మాధవ దేవుడి అనుబంధ అక్షరీకరణం ‘పవన ద్యూతం’ గా ప్రశస్తిలోకి వచ్చింది. ప్రణయ గాథ అన్నమాట.

మాధవునికి పవనుడి ద్వారా రాధ పంపదలచిన రాయబార సారాంశాన్ని నేత్రపర్వంగా సమర్పించారు కృష్ణవేణమ్మ.

తెలుగు సాహిత్యం మీద తన అభిరుచీ, సదాను రక్తికి కారకులు తాతగారేనని పలు సభల్లో విపులీకరించేవారు. ఏ పద్యాన్ని ఎలా చదవాలో, ఏ విధంగా అర్థం చేసుకోవాలో, ధారణ చేసే పద్ధతి ఏమిటో, అన్వయించుకునే రీతి ఎంతవరకో అన్నది కుప్ప సామయ్య నుంచే నేర్చుకున్నానని గురుభక్తిని వ్యక్తీకరించారు.

‘విద్యారంగం…. అందునా పరీక్షల్లో మార్గనిర్దేశకులు వావిలికొలనువారే’ అనేవారామె. ధర్మసమాజ స్థాపకులుగా, ఆలయ పునరుద్ధరణ వ్యవస్థాపకులుగా ఆయన కృషిని సదా గుర్తుచేసుకునేవారు. వావిలికొలను సుబ్బారావు ప్రొద్దుటూరు. ప్రాంతీయులే. ఆంధ్రవాల్మీకి అయినా, వాసుదాసు అని పేరుపొందినా ఆయనే!  ఏ రచయిత/కవికైనా పాండిత్యంతోపాటు ఆధ్యాత్మిక చింతనా ఉండాలని అభిలషించిన వారు. అందుకే ‘వావిలికొలను గురువులను క్రాంతదర్శిగా సంభావిస్తా’నని ఒక కావ్యం ముందుమాటలో విశదీకరించారు.

తరించాలన్నా, తరింపచేయాలన్నా భాషతోనే సాధ్యమవుతుందని ఆమెకి గట్టి నమ్మిక. గురువుల నుంచి వెలువడిన సుభద్రావిజయం (నా•కం), ఆంధ్ర విజయం, రామాయణ పరిశోధన కావ్యం, శ్రీరామనుతి రచనలు కృష్ణవేణమ్మను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఈ అంశాన్ని ఆమె రచనల ఇతివృత్తాలే తేటతెల్లం చేస్తున్నాయి ఇప్పటికీ.

‘నిను బూజించుట హస్తభూషణములే నిత్యంబునిన్‌ ‌బారుటే

ఘన రత్నాంచిత తారహారములు నీ గాధాసమాకర్ణనం

బన, తాటంకమణిద్వయమ్ము భవదీయానంద దివ్యాలయాం

గణమున్మెట్టుటే పాద భూషలు గదా’

అనడం ఒక ఉదాహరణ. ఏ పదాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రయోగించాలన్నది ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. అక్షరాలు కదంతొక్కుతున్నట్లు అనిపిస్తుంది.

తన రచనాంశాలను లోతుగా పరిశీలిస్తే:

  1. అనాచారాల, దురాచారాల నిర్మూలన లక్ష్యం గోచరిస్తుంది.
  2. స్వదేశీ భావనలోని ప్రసిద్ధత, పవిత్రత అర్థమవుతుంది.
  3. ధార్మిక అంశాల అనువర్తనం ఎలాగో అవగతమవుతుంది.
  4. విదేశాలమీద ఆధారపడే స్వభావం తగదని ప్రస్ఫుటమవుతుంది.
  5. చదువుల అంతరార్థం సంస్కారమేనని తెలియవస్తుంది మరింతగా.
  6. దేశాభిమానం ప్రాణసమానం కావాలన్నది అభివ్యక్తమవుతుంది పూర్తిగా.
  7. భాషాభిమానం, పద పరిజ్ఞానం ఆవశ్యకత అనుభవానికొస్తుంది.
    1. వైవిధ్య రచనలు చేయడంలోని ఉత్సుకత వ్యాప్తి చెందుతుంది.

గంటి కృష్ణవేణమ్మ తనకు స్ఫూర్తి ప్రదాతగా పేర్కొన్న మహిళామణి చేబ్రోలు సరస్వతీదేవి. శతకానికి పరిచయవాక్యాలు రాసిన, ఉపోద్ఘాతాన్ని అందించిన వనితారత్నం. పంచకావ్యాలు, నాటక అలంకారాలను ఎంతగానో అధ్యయనం చేసిన ప్రజ్ఞానిధి. ఆమె కూడా ‘గృహలక్ష్మి’ స్వర్ణకంకణ స్వీకర్త. ప్రతీ రచనకీ పరమార్థం ఉండితీరాలన్నది తాత గారితో పాటు గురువుల నుంచే బాగా నేర్చుకున్నానని ఒక సత్కార సభలో వినమ్రతతో ప్రకటించారు గంటి.

‘స్వాతివర్షంబులో జినుకుల్‌ ‌ముత్తెపుచిప్పలంబడిన రంజిల్లుగదా ముత్తెమై’ అన్నట్లు సమరస కవనకారిణి కృష్ణవేణమ్మ తన కుటుంబ సభ్యుల నుంచి (పుట్టినిల్లు, మెట్టినిల్లు) ఎంతగానో నేర్చుకున్నారు. శిష్యులైన ఎందరెందరికో కావ్యరచన నిపుణతలను అలవడేట్లు చేశారు. ఇటువంటి ఆదానప్రదానాల పర్యవసానంగానే ఆమె పేరు చిరస్థాయిగా నిలిచే ఉంది. పండిత కుటుంబం నుంచి వచ్చి, మరింత ఖ్యాతి సంపాదించి, మేటి పడతిగా నిలిచిన ఆమె నాటికీ నేటికీ స్మరణీయురాలే! సమాదరణీయురాలే.

ఆమె రచనల్లో మరొకటి ‘తలపోత’ తన గురించిన చింతనతోనే అతివలకు ప్రశస్తి, సాహితీ విస్తృతి.

జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE