ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవాఖ్యాతి
నూటఐదు వసంతాల చరిత్రాత్మక ఆశాజ్యోతి
ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏ ఆపద ఎదురైనా
అప్పటికప్పుడు నేనున్నానని దరిచేరి ఆదుకునే రీతి.
తినడానికి తిండి, తాగేందుకు నీరు, ఉండేందుకు గూడు
ఈ మూడూ ఉంటేనే కదా మనుగడ, ఏడుగడ!
తుపానులు, వరదలు, వ్యాధులూ బాధలూ, ప్రమాదాల
బారినపడినా ఒడ్డుకు చేరితేనేగా తీరుతుంది దడదడ!
బాధితుల గుండె ఘోష ఆలకించి, సకాలంలో స్పందించి,
ఉన్నవనరులన్నింటినీ సమీకరించి, సమర్థంగా వ్యవహరించి
ముందుకు సాగుమంటుంది భారతీయ సేవావాహినీ సేన
వెల్లివిరిసే మానవతకు ఖజానా, జన సంరక్షణ నజరానా!
నవంబరు నెల తొలి పక్షంలో మనందరి మనోమందిరంలో ప్రకాశించే పేరు ‘రెడ్‌క్రాస్’. ఇదొక ప్రజాఉద్యమం. పలురంగాల నుంచి సమీకృతమైన కార్యకర్తలంతా ఒక్కటై నిలిచి వెలిగిస్తూ వస్తున్న బాధ్యతాయుత తత్పరతా దీపం. ఈ సొసైటీలో ఆరోగ్య సంరక్షణ, సామాజిక పరిరక్షణ విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తున్న మహిళా మూర్తుల గురించి…
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) 1920లో రూపొందిన వ్యవస్థ. దేశ స్వాతంత్య్రానంతరం విస్తృత రూపును సంతరించుకుంది. సేవా నిరతిని వారసత్వంగా కొనసాగించడమే ప్రధాన ధ్యేయం, ధర్మం. దీనికి జాతీయస్థాయిన ఎన్నిక/ఎంపిక అయిన ప్రత్యేక బృందమంటూ ఉంది. మరీ ముఖ్యంగా మూడు దశాబ్దాలనుంచి పరిపూర్ణ స్థాయిన విధులు నిర్వహిస్తోంది.
దేశంలోని అనేకానేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపరంగా సొసైటీ శాఖలున్నాయి. వందలాది జిల్లాలకు ఇవన్నీ విస్తరించి, ఇప్పుడు సహస్రాధికంగా వ్యవస్థీకృతమై స్వచ్ఛంద సేవ, సహాయాలను సర్వత్రా అందిస్తున్నాయి.
ఎటువంటి రాజకీయ భావాలతోనూ సంబంధంలేని సొసైటీ ఇది. స్వతంత్ర స్థాయిన తన కర్తవ్యాలను తాను నిరంతరంగా నిర్వహిస్తూంటుంది. మానవత్వం, నిష్పక్షపాతం, తటస్థతత్వం, స్వేచ్ఛాయుత అనుసరణం, స్వచ్ఛంద సేవకు అంకితమైన వైనం, ఐక్యతాయుత వర్తనం, సార్వత్రిక ఆదర్శ భావనం – ఇవన్నీ సంస్థ ప్రథమ ఆదర్శాలు.
అత్యవసర సమయాల్లో సంస్థాగతంగా ఒక్కటవడం సొసైటీ కీలక లక్షణం. ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్, రెడ్‌క్రెసెంట్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్‌ది రెడ్‌క్రాస్, ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ – ఇలా ఎన్ని ఏ స్థాయుల్లో ఉన్నా, జనబాహుళ్యానికి బాగా దగ్గరైనది ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీయే.
ఇందులోని ఎరుపురంగు క్రాస్ త్యాగచింతనకు ప్రతీక. చుట్టూ ఉన్న తెల్లదనం స్వచ్ఛతకు సూచిక. ఇన్నేళ్ల ప్రస్థానంలో కార్యకర్తలు ఎన్నెన్నో ప్రాణాలను కాపాడారు. మరెన్నో ఆలోచనా విధానాలను సమర్థంగా తీర్చిదిద్దారు. విశేషించి వనితలెందరో శిక్షణ ఇస్తూ, పొందుతూ, ఆరోగ్య భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు తమదైన ప్రభావాన్ని కనబరుస్తూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. రక్తదాన శిబిరాల పనులు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో స్వస్థ సమాజాన్ని నిర్మిస్తూ వస్తున్నారు.
యుద్ధంలో గాయపడిన సైనికులకు ఉపకరించేలా శతాబ్దాల క్రితమే అంతర్జాతీయ సంఘాన్ని నిర్మించారు డ్యూనాంట్. కాలక్రమంలో ఆ లక్ష్యాలు ఇంకెంతో విస్తృతమయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలకు గురైన వారికి సాయపడేందుకు సేవలు వినియోగమయ్యాయి. దాదాపు రెండొందల దేశాల సభ్యులున్నారు. వైద్య సేవా సహాయాలు, ప్రథమ చికిత్స కార్యకలాపాలు బృహత్తర దశకు చేరేలా చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ సొసైటీ పనులు విస్తారమవుతున్నాయి.
అందిస్తున్న సేవల పరంపర అసంఖ్యాకం. బ్లడ్ బ్యాంకులు, అవసరమైన రోగులకోసం రక్తమార్పిడి కేంద్రాలు, హోమ్‌నర్సు సర్వీసులు, ప్రత్యేకించిన డే కేర్ సెంటర్లు, ఆయుష్ క్లినిక్‌లు, జీవంధార జన ఔషధశాలలు, యోగా-ప్రకృతి వైద్య సహాయాలు, సీనియర్ సిటిజన్లకు ఆదరణలు, ఇంకెన్నెన్నో.
జీవితంలో విషాదాలు కొందరికి ఎక్కువ. ఆదరించి అక్కున చేర్చుకునే చేతులకోసం ఆ కళ్లు ఎదురుచూస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో రెడ్‌క్రాస్ వనితా కార్యకర్తలు మానవతా భావంతో స్పందించి పిన్నలను, వయోవృద్ధులను పరిరక్షించిన సంఘటనలు చాలా ఉన్నాయి, ఉంటున్నాయి.
విపత్తుల నుంచి బయటపడే సురక్షిత విధానాల గురించి స్త్రీలకు, పిల్లలకు ముందుగానే సంసిద్ధ శిక్షణనిస్తారు. మహిళా కార్యకర్తలు. పరిస్థితుల ప్రాబల్యంతో నిరాశ్రయులైన స్త్రీలకు పునరావాసం కల్పించడంలో ముందుంటారు. నిరుపేదలకు అండగా నిలిచి, నిత్యావసరాలు సమకూరుస్తుంటారు. వృద్ధులను ఎంతగా ఆదరించాలో అంతగానూ ఆదరించి, ఆశాజ్యోతిని వెలిగిస్తుంటారు.
‘దారిపక్క చెట్టుకింద ఆరిన కుంపటి నిధాన
కూర్చున్నది ముదుసలి మూలుగుతూ
ముసురుతున్న ఈగలతో వేగలేక!
ముగ్గుబుట్ట వంటి తల, ముడతలు దేరిన దేహం
కాంతిలేని గాజుకళ్లు… తనకన్నా శవం నయం!
పడిపోయెను జబ్బుచేసి; అడుక్కునే శక్తిలేదు
రానున్నది చలికాలం; దిక్కులేని దీనురాలు
ఏళ్లు ముదిరి, కీళ్లుకదిలి, బతుకంటే కోర్కెసడలి
పక్కనున్న బండరాతి పగిదిన పడి ఉన్నది!’
అలా కవితలోని దృశ్యమే కళ్లముందు కనిపించినపుడు సేవా మహిళ ఊరుకోదు. సహకార్యకర్తలతో కలిసి వెళ్లి ఆదరించి ఆదుకుంటుంది. ఎన్నివిధాల సాయాన్నయినా అందించడానికి సిద్ధమవుతుంది. మాటలకన్నా చేతలు మిన్న అని నిరూపించి తీరుతుంది. ఎందుకంటే – అభాగ్యులను ఆదరించడంలోని తత్వం అటువంటిది. స్పందించకుండా ఉండదు. సహాయం అందించకుండా వెనుతిరగదు. ఇంతటి నిబద్ధత, సేవానిరతికి మూలం రెడ్‌క్రాస్ ఆశయమే!
అంటువ్యాధులు ప్రబలినపుడు, ఆ తర్వాత మరేమైనా సమస్యలు తలెత్తినపుడు ఆ ఆర్తులకు అండగా నిలిచేదీ వనితా కార్యకర్తలే. చికిత్స కేంద్రాల్లో వెంట ఉండి సపర్యలు చేస్తుంటారు. సమస్యలు అధిగమించేలా చూస్తారు.
నగరాలు/పట్టణాల్లోని ఇతర సంస్థలు/శాఖలు/సంఘాల సహకారంతో రక్తదాన శిబిరాల నిర్వహణ.. ప్రత్యేకించి స్త్రీ కార్యకర్తలతోనే పరిపూర్తి అవుతోంది. అనేక యూనిట్ల రక్తం సమీకరణ, అవసరార్థులకు అది వినియోగించడం అంటే ప్రాణ సంరక్షణ చేయడమే! నిండు ప్రాణాన్ని కాపాడటమే.
ప్రకృతి వైపరీత్యాల వేళలు, అనంతర కాలంలో వివిధ అంశాలమీద ప్రజల్లో సదవగాహన కలిగించడమన్నది మహిళా కార్యకర్తల వల్లనే ఫలప్రదమవుతోంది. ఆత్మరక్షణ, ఆరోగ్య పరిరక్షణ, గుండెనొప్పి వంటివి సంభవించినపుడు ఆ తీవ్రతను తగ్గించేలా ముందు జాగ్రత్తలు వంటివన్నీ కార్యకర్తలు నేర్పుతున్నారు. ఇందుకోసం కళాశాలలు, పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు.
రెడ్‌క్రాస్ యువసభ్యులు, జాతీయ సేవా పథకంవారి సౌజన్యంతో విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల ఆవరణల్లోనూ అవగాహన సభలను మహిళా కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకీ తమ సేవలను విస్తరించి, సేవారంగంలో ముందంజగా ఉంటున్నారు ఎప్పుడూ!
జాతినేతల జయంతులు, స్మృతిరోజులు, తదితర ప్రత్యేక సందర్భాలనూ సేవల విస్తరణ కోసమే వినియోగించుకుంటోంది రెడ్‌క్రాస్ మహిళ! విద్య, ఆరోగ్యం, సమాజసేవ ఆవశ్యకతలను సోదాహరణంగా విశదీకరిస్తున్నారు వారంతా. ఈ సమావేశాలు సహజంగానే స్ఫూర్తిమంతంగా ఉంటున్నాయి.
పోషకాహార లోపంతో బాధపడేవారికి, ముఖ్యంగా పిల్లలకు ఆశాకిరణంగా మారింది రెడ్‌క్రాస్ స్త్రీశక్తి. సహాయ సహకారాలను ముమ్మరంగా అందిస్తూ వృత్తి/ప్రవృత్తి గత సేవా సంతృప్తిని సొంతం చేసుకుంటోంది.
యువజన, మహిళా సంఘాల తోడ్పాటుతో రెడ్‌క్రాస్ మహిళల సేవలు ఊరూవాడా లెక్కకు మిక్కిలిగా జరుగుతున్నాయి. సరైన సమయంలో, తగిన వ్యక్తులకు సేవ/సహాయం చేయడంలోని ఆనందాన్ని వారంతా పొందగలుగు తున్నారు. రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక సేవ చేయాలన్న ఆశయంతో, ఆశావాదంతో పథంలో కొనసాగుతున్నారు. వందనీయం.
మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణం, శుచీశుభ్రతల ఆవశ్యకత తెలియచేయడం, బాల్యదశనుంచే మంచి అలవాట్లు అలవడేలా చేయడం ఈ సొసైటీ వనితలతోనే సుసాధ్యం, సులభసాధ్యమూ అవుతున్నాయి.
నేత్రదానం గురించిన అవగాహన పెంచడం, అవయవదాన ప్రాముఖ్యతను విశదీకరించడం, ఇంకెన్నో పనులు రెడ్‌క్రాస్ మహిళలే విరివిగా చేస్తున్నారు.
ఉచితంగా వైద్యశిబిరాల నిర్వహణ, నడక కార్యక్రమాల ద్వారా యువ ఆరోగ్య ప్రాచుర్యాన్ని వేగవంతం చేయడం సైతం ఆదర్శనీయాలు. ఇలా అనేకానేక పనుల నిర్మాణం, నిర్వహణం, పర్యవేక్షణం మహిళా కార్యకర్తల దీక్షాదక్షతలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నాయకత్వపటిమను నిరూపిస్తున్నాయి.
‘పసిబిడ్డ కాలేయ మార్పిడికి చికిత్సపరంగా సాయం అందించండి’. ఇది ఏడునెలల వయసున్న చిన్నారికి సంబంధించి, కన్నవారి వేడుకోలు.
వ్యాధి తీవ్రతతో తల్లడిల్లుతూ – చికిత్సమాట అటుంచి, కనీసం నిత్యావసర వస్తువులూ లేని స్థితిలో ఉన్న వ్యక్తి చేతులు జ్యోడించి ప్రార్థన. ‘నాకు బతకాలని ఉంది. బతికేలా చేయండి’ అని అభ్యర్థన.
ఇటువంటి సందర్భాల్లో, సమయాల్లో ‘నేనున్నా’ అని ముందుకొచ్చి, తాను సాయంచేసి, ఇతరులతోతూ చేయించి ‘ఇదే నా లక్ష్యం’ అని చాటి చెప్పే యువ సేవా తత్పరుడికి స్ఫూర్తిప్రదాత మహిళా శక్తే!
ఇవన్నీ శ్రీకాకుళంలోని రెడ్‌క్రాస్ సేవావ్యవస్థకు సంబంధించిన తాజా ఉదాహరణలు. ఇటువంటివే ఆంధప్రదేశ్, తెలంగాణల్లోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీల నిరంతర సేవల్లోనూ అంతర్భా గాలు. కార్యాచరణలో ముందు వరసన నిలవాలన్నా, అలా మరెవరైనా నిలిచేందుకూ స్ఫూర్తిగా ఉండాలన్నా ఆ శక్తి సంపన్న మహిళే. సేవానిరతికి చిరునామా ఎప్పటికీ ఆమే!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్