– దాట్ల దేవదానం రాజు
భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘‘మీ పిల్లలు వ్యసనపరులు. మీ చేయి దాటి పోయారు. మొక్కై వంగనిది మానై వంగుతుందా? అది మీ దురదృష్టం’’ అక్కడితో ఊరుకోలేదు మిత్రుడు రమణ, కొన సాగించాడు.
‘‘అందుకే మీరు అద్భుతమైన చిత్రకారులైనప్పటికీ రాణించలేక పోయారు. ఎప్పుడైతే వాళ్లు అలా తయారయ్యారో మీరు మానసికంగా బలహీను లైపోయారు. మీలోని కళ దెబ్బతింది’’ జేబురు మాలుతో ముఖం తుడుచుకుంటూ రమణ అన్నాడు. శంకరం దగ్గర నిర్మొహమాటంగా మాట్లాడే చనువు అతనికి ఉంది.
‘అవును…నిజమే… నాది దురదృష్టమే’ అనుకున్నాడు శంకరం. ఎన్నందాల ప్రయత్నించినా పిల్లల నడత తీరు మార్చలేకపోయాడు. బెంగతో నిద్రలేమి రాత్రులెన్నో గడిపారు శంకరం దంపతులు.
శంకరానికి ఇద్దరు కొడుకులు. పుత్రోత్సాహం లేదు. ఇద్దరూ సమాజానికి బరువే. పెద్డోడు రాజు దొంగతనాలకి అలవాటు పడ్డాడు. అవసరం లేకపోయినా చిత్రంగా దొంగతనం చేస్తుంటాడు. అన్నీ చిన్నవే. అవకాశం దొరికినపుడు కళ్లబడిన వస్తువును దక్కించుకోకపోతే వాడి మనసు ఊరుకోదు. ఇలాంటి వాళ్లకు అదొక రోగమని తెలీదు. మానసిక వైద్యం చేయించుకుంటే బావుండునేమో..!. తలవంపులు తెచ్చాడు.
ఊళ్లో జరిగిన ఒక పెద్ద దొంగతనం వాడి మీద మోపారు. చెట్టుకు కట్టారు. కొట్టారు, తిట్టారు. శంకరం తల ఎత్తుకోలేకపోయాడు. ఆ తర్వాత రాజు అదృశ్యమయ్యాడు. ఎక్కడకు వెళ్లాడో తెలీదు. గాలించినా దొరకలేదు. దంపతులు కుంగిపోయారు.
ఇక రెండోవాడు రాముడు. పక్కా తాగుబోత య్యాడు. పనీపాటూ లేదు. జులాయిగా తిరుగుతాడు. ఏ పనీ శ్రద్ధగా చేయడు. రోజూ గొడవలే. ఏ సమస్య తీసుకొస్తాడోనని నిత్యం శంకరం భయపడుతూ ఉంటాడు. స్థిమితం లేకుండా చేస్తున్నాడు.
రాముడు ప్రతిరోజు చేపల వేలం దగ్గరకు గోదావరి ఒడ్డుకు వెళతాడు. అక్కడ నాగమణి ఉంటుంది. నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. పెద్ద కళ్లు మెరుస్తుంటాయి. తెల్లని పలువరుస. నవ్వు తుంటాయి. మంచి మాటకారి. హుషారుగా ఉంటుంది. ధైర్యంగా హెచ్చు ధరకు చేపల్ని పాడు తుంది. లాభానికి అమ్మేస్తుంది కూడా.
నాగమణి దగ్గర సందువ, కొయ్యంగ, కానాకంతలు, పాలెపు సొర, మాగ, విలస, రొయ్యలు అమ్మ కానికి ఉంటాయి. సీరమేను, పులసల సీజన్లో ఫోన్ల ద్వారా కొంతమందికి సమాచారం అందించి భలే వ్యాపారం చేస్తుంటుంది. అందరితో చనువుగా మాటలతో ఒప్పించి వరసలతో పిలుస్తూ చేపల్ని అమ్ముతుంది. బాగానే సంపాదిస్తుంది. చేపలమ్మే మిగిలిన ఆడవాళ్లు నాగమణితో పోటీ పడలేరు. ఆమె పట్ల అసూయ పడతారు. నిల్వ చేపల్ని అంట గడుతుందని ప్రచారం చేస్తారు. ఆమె వ్యాపారాన్ని దెబ్బ తీయాలని చూస్తారు. లెక్కచేయదు.
‘‘ఈవేళ నీ దగ్గర పండుగప్ప లేదేంటి, నాగూ?’’ రాముడు అడిగాడు సిగరెట్టు అంటించుకుని పొగ వదులుతూ. నాగమణి జవాబు చెప్పలేదు. రాముడితో మాటలు అనవసరం. భరించడం కష్టం. చనువు ఇవ్వదు. ముక్తసరిగా మాట్లాడుతుంది. పైగా సొంత పెళ్లాన్ని పిలిచినట్టు ‘నాగూ’ అనడం అసలు నచ్చదు. పిలవొద్దని చెప్పినా వినడు. అందుకే ముఖం ముడుచుకుని గోదావరి కేసి చూస్తూ మౌనంగా ఉండి పోయింది. గోదావరి కలకనీరుతో వేగంగా పరుగెడుతూ ప్రవాహపు ఒయ్యారం ఒలకబోస్తోంది.
పాట జరిగే చోటుకు కింద పల్లంలో గోదారి పోటు సమయంలో అడుగు లోతులో నీరు పారుతుంటుంది. అందులోంచి టపటపా అడుగులేసు కుంటూ వేలం జరిగే చోటుకు రాముడు వెళ్లాడు.
మధ్యలో చేపల్ని గుట్టగా పోసి హెచ్చు మొత్తం నుండి ధర తగ్గించుకుంటూ వేలం మొదలెడతారు. ఎవరైతే గిట్టుబాటు ధర దగ్గర చేయి చాచో, గట్టిగా కేకపెట్టి అరిచో సొంతం చేసుకుంటారు. మత్స్యకార వర్గానికి చెందిన సభ్యత్వం గలవారికే పాటలో పాల్గొనే హక్కుంటుంది. ఆవేళ పెద్దగా చేపలు రాలేదు. అడపాదడపా వచ్చే చేపల్ని పాట పెడుతుంటారు. నాగమణి పాట దగ్గర్నుంచి అమ్మకం చోటుకు వచ్చేసింది.
సరిగ్గా అప్పుడే పండుగప్పను పాటలో పెట్టారు. ఒకామె దక్కించుకుంది. ఓ ఏభై అదనంగా ఇచ్చి రాముడు కొనుక్కున్నాడు. నోటి లోంచి గేలం తీగ వేలాడుతోంది. చేప బతికే ఉంది. గింజుకుంటోంది. ప్రాణంతో కదులుతున్న చేపను దభీమని నాగమణి ముందు పడేశాడు. పండుగప్ప కిందకీ పైకీ ఎగురు తోంది. దాంతో పాటే రాముడు గెంతు లేస్తున్నాడు. పక్కన రేవులో ఏదో విగ్రహం నిమజ్జనం చేయడానికి డప్పులు మోగిస్తున్నారు. డప్పుల మోత లయగా రాముడికి తోడైంది. హుషారుగా అడుగులేస్తున్నాడు.
‘‘పండుగప్పమ్మా… పండుగప్ప… నాలుక చవులూరుతుందే… అప్పో… కూర దాకలో పండు గప్ప ముక్కలే అప్పా… నోరూరుతుందే’… అప్పా… రంజుగా రుచిగా ఉంటాదే అప్పా’’ అంటూ సన్నగా పాట అందుకున్నాడు. కాసేపటికి ఆయాసంతో పాట ఆపేసాడు. గట్టెక్కి పొదలమాటుకు వెళ్లాడు. జేబులోంచి నిబ్బు మూతతీసి గడగడ తాగేశాడు.
పెదాల్ని భుజంతో తుడుచుకుంటూ తిరిగొచ్చాడు రాముడు. నాగమణి బేరం చూసుకుంటోంది. పండుగప్ప లేదు. ఏమైంది? ఎవరికీ అప్పగించలేదు.
ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయి. విసురుగా గాలి వీస్తోంది. ఒక్కసారిగా టెంటు పడి పోయింది. చేపల వేలం ఆగిపోయింది. ఎవరి మాటలు వారివే. గోలగా ఉంది. కాసేపటికి రాటను నిలబెట్టి తాడు కట్టి టెంటును మళ్లీ యథాప్రకారంగా బిగించారు.
‘‘ఏదీ… నా చేప? మోజుపడి కొనుక్కున్నానే. పండుగప్ప తిని చాన్నాళ్లయ్యిందే. చేప ఇచ్చెయ్యవే’’ అడిగాడు జీర గొంతుతో. నాగమణి వినపడనట్లుగా ఉండిపోయింది. రాముడికి కోపం వచ్చింది. దొంగ నా కొడుకు ఎవరో… బూతులు లంఘించుకున్నాడు. నాగమణి దగ్గరకు వచ్చి చాచి లెంపకాయ కొడుతున్న ట్టుగా నటించాడు. బొంగురు గొంతుతో ఏడుపు మొదలెట్టాడు. చేతులతో గుండెలు బాదుకున్నాడు.
‘‘పోరా…తాగుబోతు నాయాలా…నా యాపారం తగలెయ్యకు… దూరంగా పో… సచ్చినోడా… అడ్డు లెగు’’ విడిన జుట్టు ముడేసుకుంటూ నాగమణి ఈసడించుకుంది. తూలిపోతూ తనలో తాను మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ అటూ ఇటూ గుండ్రంగా తిరుగుతున్నాడు రాముడు. కాలు మెలితిరిగి నేలపై దబ్బుమని పడిపోయాడు. చేతులు ఆనించుకుని నెమ్మదిగా లేచాడు. బట్టలకు మట్టి అంటుకుంది. నాగమణి తల తిప్పుకుంది. వాడిని చూసి జాలి పడేవారే లేరు.
‘‘పండుగప్పను చూశారా? నన్న మూతుల నా పండుగప్ప కనపడిందా? వెండి జిలుగుల నా రుచుల బంగారాన్ని మీరెవ్వరైనా చూశారా?’’ అంటూ చేపలు అమ్ముకుంటున్న ఆడవాళ్లను అడిగాడు.
‘‘మా వద్ద లేదు… మా చెంత లేదు… మాకు తెలీదు. మేమెరుగం మేమెరుగం’’ ఒకే మాటగా చెప్పారు. కొంతమంది చేతితో సైగ చేశారు లేదని చెప్పడానికి. ఎవరి దగ్గర సమాధానం లేదు. పడుతూ లేస్తూ అర్థంకాని మాటలేవో మాట్లాడుతూ మరల నాగమణి దగ్గరకొచ్చాడు. బేలగా ఏడిచాడు. జుట్టు పీక్కున్నాడు.
‘‘గురువా… మనసున్న మారాజుల్లారా… దయచూపండి, నాయనలారా…పండుగప్ప ఏమిటో నాకు తెలుసు. దాని నడక తెలుసు. నడత తెలుసు. పొగరు తెలుసు. దాని రాజసం తెలుసు. పల్లోళ్ల ధర్మాల మావ పండుగప్ప గురించి కతలు కతలుగా చెప్పాడు. పండుగప్ప గుడ్లు పెట్టడానికి మరుగు కోసం నీటి లోపలకంటా పోతుందట. అక్కడైతే క్షేమం కదా! పిల్లల రక్షణ ముఖ్యం దానికి. అలా అనుకుంటామా…తన పిల్లల్ని తనే తినేయగలదు. ఇప్పుడు గోదారిలోకి దూకేసిందా?’’ అంటూ పండుగప్ప గురించి ఆరా మొదలెట్టాడు. తాగుడు మాటలు ముద్దగా వస్తున్నాయి. వాడి ధోరణిలో వాడు మాట్లాడేస్తున్నాడు. పట్టించుకునేవారు లేరు.
‘‘అన్ని చేపల చరిత్ర తెలుసు. పండుగప్పకు బతికున్న మేత కావాలి. చచ్చిందాన్ని ఆకలిగా ఉన్నా ముట్టుకోదు. జీవించి ఉన్న వాటినే తింటుందంటే చేపల్లో రారాజు కదా. అడివిలో పులి లాంటిది అన్నమాట. అందుకే బతికున్న చిన్ని చేపల్ని చిన్ని కన్నుల వలలతో పట్టి వేటకెళ్లేపుడు జాగ్రత్తగా తీసుకెళతారు. పండుగప్పను గేలంకు ఎర తగిలించి పడతారు. నీటి బయటకు తెచ్చిన వెంటనే పులసలా పండుగప్ప ఊపిరి ఆగిపోదు. కొట్టుకుంటూ ఉంటుంది. మటన్ షాపువాడు మేక తలను సాక్ష్యంగా పెట్టినట్టు నోటిలో గేలం వైరుతో పాటు అమ్మకానికి పెడతారు. వేటాడి పడవలో ఎత్తువలలో దాచేస్తారు. చేతితో పట్టుకుంటే ‘కోర’తో గుచ్చేస్తుంది. పండుగప్పకు వనామి రొయ్యలిష్టం. వాటిని ఎరగా గేలానికి తగిలిత్తారు’’ అక్కడున్న వారందరికీ తెలుసున్న సంగతులే ఇవి. పండుగప్ప జీవన చిత్రాన్ని చెప్పుకు పోతున్నాడు రాముడు.
సరిగ్గా అదే సమయానికి ధర్మాల మావ వచ్చాడు. ఇందాకట్నుంచీ దూరంగా ఉండి రాముడి మాటలు వింటున్నాడు. రాముడ్ని కట్టడి చేయగలిగేవాడు అతనొక్కడే. అతని మాటల్ని చక్కగా చేతుల్ని కట్టుకుని వింటాడు.
‘‘అన్నీ బాగానే చెప్పావు గానీ ఒరేయ్… రాముడూ …పండుగప్ప నీకులా ఒకడి మీద ఆధార పడి బతకదురా. దాని జాతి లక్షణం అది. అదీ గాక పండుగప్ప నిశ్శబ్దాన్ని పాటిస్తుందిరా. లొడలొడ శబ్దాల్ని ఇష్టపడదురా. హాయిగా నీటిలో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అదేమీ చెడు చేయదు. మనమే దాని పంచకు చేరి పట్టుకుంటాం. రుచిగా ఉంటుం దేమో మప్పిదంగా తింటాం. ఆకాశంలో ఒకే వరుసలో ఎగిరే పిట్టల్లా నీటిలో ఆ చేపలు గిరికీలు కొట్టుకుంటూ ఈదుతుంటాయి. నీకు మల్లే గోల చేయవు. ఎదవ సొద ఆపు…బతికితే పండుగప్పలా బతకాలి. ముందు అది తెలుసుకో’’ అనడంతో రాముడు కిమ్మనకుండా ఉండిపోయాడు.
పొద్దుపోయేదాక రాముడు తాగుతూనే ఉన్నాడు. గోదారి గట్టంటా తూలుకుంటూ నడిచాడు. ఏటిగట్టు మీద వెలగచెట్టు మీద వాలిన పిట్టల్ని రాయి విసిరి కొట్టాడు. పిట్టలు ఎగిరాయి. వెలక్కాయ నేల రాలింది. తీసుకున్నాడు. మైలురాయి మీద పెట్టి చితక్కొట్టాడు. చిన్న ముక్కను నోటిలో పెట్టుకుని తిన్నాడు. వగరుగా ఉంది. అయినా బావుంది.
రాముడి బుర్రలో పండుగప్ప ఆలోచనలే. ఎవరు తీశారు? నాగమణి తీసిందా? ‘నన్నేడిపించాలని తనే తీసుంటుందేమో’ అనుకున్నాడు. నాగమణి పేరు మనసులో రావడంతో ఇక నిలబడలేక పోయాడు. నాగమణి ఇంటికేసి నడక ప్రారంభించాడు.
ఏటిగట్టు దిగువన నాగమణి ఇల్లుంది. సిమ్మెంటు గోడలే గానీ తాటాకు అల్లికల ఇల్లు. ఇంటి ముంగిట అరుగును చక్కగా పేడతో మెత్తి ముగ్గులేసి ఉంది.
గుమ్మంలో నాగమణి మొగుడు నరసింహం నిలబడి ఉన్నాడు.
‘‘మీ ఇంటిలో ఈవేళ ఏం కూర వండారు? బ్రదరూ…’’ సూటిగా అడిగాడు రాముడు.
‘‘పండుగప్ప… చేపలకూర.ఏం? ఎందుకు అడుగుతున్నావు?’’ జవాబు విన్న వెంటనే రాముడికి విపరీతమైన కోపం వచ్చేసింది. కళ్లు ఎర్రబడ్డాయి. తీక్షణంగా చూశాడు. గోడ ఆసరాతో నిలబడ్డాడు. ఒంట్లోని రక్తం సలసల కాగింది.
‘‘ముందు నీ పెళ్లాన్ని పిలు, బ్రదరూ’’ గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టడానికి ప్రయత్నించాడు.
బాగా తాగాడని అతని వాలకం చూడగానే అర్థమైంది నరసింహానికి. అడ్డగించాడు. రాముడు తోసుకుని ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాడు. సాగలేదు. గెంటడంతో వెనక్కి పడిపోయాడు.
నాగమణి వచ్చింది చీరకొంగుతో ముఖం తుడుచుకుంటూ. ఆమెని చూసి నెమ్మదిగా రాముడు పైకి లేచాడు. చేతులు జోడించాడు. వంకరగా నవ్వాడు. పెదాలు చప్పరించాడు. జుట్టు నుదుటి మీంచి వెనక్కి లాక్కున్నాడు. అడుగు ముందుకేసాడు.
‘‘అమ్మా… మహాతల్లీ… నాగమణీ… చేపల పాట దగ్గర నేను కొనుక్కున్న పండుగప్పను నువ్వే తీసావు కదూ. చెప్పు… పర్వాలేదు… చెప్పు… పుస్తెలమ్మైనా పులస తినాలన్నారు గానీ పండుగప్పను కాదు కదా. తాత ఇచ్చిన ఉంగరం దొరికింది. అమ్మి పండుగప్ప కొనుక్కున్నాను. పర్వాలేదు… ఏం అనుకోను… నువ్వు తింటే ఆనందమే నాకు. నువ్వే వండుకుని తిన్నావ్ అంతే కదా. ఒక్క ముక్క పెట్టు తినేసి పోతాను’’ నరసింహం ముందుకు వచ్చాడు.
‘‘ఏంట్రా… లోపలికి వచ్చావ్. మీ అన్నదమ్ముల్ని కన్న మీ బాబు పెంపకాన్ని అనాలి. ఆయనెంత నెమ్మదో… మంచివారో మీరెలా దాపరించార్రా ఆయనకు… బయటకు నడు… తాగుబోతు ఎదవా’’ అన్నాడు. మాటామాటా పెరిగింది. తిట్టుకున్నారు. ఒకళ్లనొకళ్లు తోసుకున్నారు. విసురుగా రాముడి చెంప మీద గట్టిగా కొట్టాడు. దిమ్మ తిరిగింది. గోడకు గుద్దుకున్నాడు. కింద పడిపోయాడు. పక్కనే ఉన్న రుబ్బురోలు అంచుకు తల తగిలింది. ఫట్‌మని శబ్దం. చొక్కా పట్టుకుని గుమ్మం దగ్గరకు లాక్కొచ్చాడు నరసింహం. స్పృహ తప్పినట్టుగా వాలిపోయాడు. తీరా చూస్తే రాముడిలో కదలిక లేదు. శంకరం జుట్టు, గెడ్డం పెంచుకున్నాడు. ఆకట్టుకునే రూపు కడకు బికారిని తలపిస్తోంది.
జిహ్వా చాపల్యం కొడుకు ప్రాణాల మీదకు తెచ్చింది.
శంకరం ఏ చిత్రం గీయాలన్నా వంకరటింకరగా మరొక రూపంలోకి మారిపోతోంది. రాయి లోంచి అనవసర పదార్థాల్ని తీసేసి విగ్రహాన్ని వెలికి తీస్తాడు శిల్పి. కుంచె పట్టుకుని ఊహ లోంచి చేతివేళ్ల కదలికతో చిత్రం గీస్తాడు చిత్రకారుడు. కళ అందరికీ సొంతం కాదు.
శంకరం మనసు లగ్నం కావడం లేదు. అతని కళాదృష్టి వెలవెలబోతోంది. మెదడు, చేతివేళ్లకు మధ్య సమన్వయం కుదరడం లేదు.
‘‘సమూహంలో జీవిస్తున్నపుడు అందరి హక్కుల్ని గౌరవించాలి. భంగం కలిగించకూడదు’’ రమణ అన్న మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి.