ప్రపంచంలో అనాది నుండి నేటివరకు ఒకే ఆదర్శం కోసం జీవిస్తున్న జాతులు తక్కువ. పూర్వయుగంలో కొన్ని దశాబ్దులు పేరు పొంది ఆ తరువాత కాల గోళంలో లీనమైపోయిన జాతులు న్నాయి. ఆనాటి నుంచి నేటివరకు ఒకే భూభాగంలో నివసిస్తున్న, అనేక కారణాలతో వచ్చి పడుతున్న విపరి ణామాలకు తట్టుకోలేక, ఆయా మార్పుల మూసలో అసలు రూపం చెడిన జాతులు కూడా కొన్ని ఉన్నాయి. నిన్న మొన్న గుడ్లు తెరచి నేటికీ ఒక నిశ్చితాదర్శాన్ని ఆకళించుకోలేక నిలకడలేక అలమటిస్తూ ఉన్న మానవ సమూహాలు కూడా ఉన్నాయి.
ఇందుకు కారణం ఆయా జాతులు ఆయా కాలాలలో అవలంబించిన ఆదర్శాల లోపమే కావచ్చు. లేదా దాని అనుచరుల లోపం కూడా కావచ్చు. కాని పూర్వ సంస్కృతులని పేరు పొందిన ఆయా ప్రాచీన వైభవాలన్నీ శతాబ్దాల బరువుతో కుదించుకుపోయి రూపురేఖలు కోల్పోయి చరిత్ర పుటల్లో, అక్షరాల్లో మాత్రమే కన్పిస్తున్నాయి. వాటి స్థానే ప్రపంచమంతటా కొత్త కొత్త నినాదాలూ` సాంఘికంగా, ఆర్థికంగా, ధార్మికంగా కొత్త కొత్త మార్పులూ రోజుకో రూపం ధరిస్తూ మానవ మేధస్సును చికాకుపరుస్తున్నాయి. ఈ భావ సంఘర్షలో పడి మానవుడు ఎటూ దారి కానక జీవితానికి ఒక లక్ష్యమేర్పరచుకోలేక తపిస్తున్నాడు.
కానీ భారతదేశంలో మాత్రం అనాదిగా ఉన్న ఒక ఆదర్శానికి నేడూ హారతులు పట్టేవారు కన్పిస్తు న్నారు. మన పూర్వ పురుషులు చేసిన ప్రయత్నం, పరిశ్రమ ఫలించి, వారి త్యాగం, విజయం పొంది హైందవ జాతికి నేటికీ ఒక ఆదర్శాన్ని చూపెడు తున్నది! భూమి పుట్టి సూర్యుని చుట్టూ నేటివరకు ఎన్నిసార్లు తిరిగిందో! ఎన్ని వసంతాలు ఈ లోపులో దొర్లిపోయాయో! అంతులేని ఈ పరిభ్రమణంలో ఎన్ని మార్పులు` ఎన్ని విప్లవాలు వచ్చాయో! నేటికీ ఏదో రూపంలో భారతీయులకు ఆదర్శం అంటూ ఉన్నది. భారతీయులకు స్థిరపడిన జీవితమూల్యాలు ఉన్నాయి.
ఈజిప్టు, బాబిలోనియా, పర్షియా, రోమ్, చైనాల సంస్కృతీ సభ్యతలు క్రీస్తుకుపూర్వం చాల పేరు పొందాయి. ఐరోపా దేశాలు ఆయా సంస్కృతులకు కొంత కాకున్నా కొంతైనా రుణపడి ఉన్నాయి. అయినా ఆ సంస్కృతులన్నీ ఇప్పుడు ‘పురాతనం’ అయినాయి. అలాంటప్పుడు ఆ సంస్కృతులన్నిటికన్నా ప్రాచీనమైన దనే కీర్తి పొందిన భారతీయ సంస్కృతి ఇంకా ఒక రూపంలో ఉండడానికి కారణం ఏమిటి? ఏ మార్గాన నడుస్తూ ఇన్ని అవాంతరాలనూ, ఇన్ని మిట్ట పల్లాలనూ అధిగమించి నేటికీ పయనిస్తున్నదీ భారతజాతి?
ఈ ప్రశ్నకు సమాధానమే మన జాతీయ మహోత్సవమైన విజయదశమి ప్రబోధిస్తున్నది. కల్పాంతర కాలం నుంచి నేటివరకు ప్రతి యేటా శరత్కాలం తెచ్చే మాధుర్యంతోపాటు విజయదశమి కూడా అదే సందేశాన్ని అందుకొమ్మని మనను ఆహ్వానిస్తున్నది. అందుకే విజయదశమి మన భారతీయ సంస్కృతికి సజీవసాక్షిగా మన జాతి జీవితాన్ని అచ్చంగా చూపే అద్దంగా మనలోని తామస భావాలనూ, ఆసుర భావాలనూ వ్రేళ్లతో పెకలించే శక్తిగా కన్పిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ దశమి చరిత్ర మన చరిత్ర` మన దైన భారతీయ చరిత్ర ` విజయదశమి ఇచ్చే సందేశం మన జాతికి చిరంతనమైన సందేశం.
చరిత్రలో ఎన్నిసార్లు ఈ విజయదశమి తన విజయకేతనాన్ని ఎగురవేసిందో` అజ్ఞాత వీరులెందరీ పర్వ సందేశాన్ని నేల నాలుగు చెరగులకూ వ్యాపింప చేయడానికి బలి అయ్యారో…
ఇంగ్లీషు వాళ్ల ఇనుప గొలుసుల బానిస బంధ నాల్ని సువర్ణ మాలలని భ్రమసిపోతున్న రోజులు. ఆంగ్లభాషకూ, ఆంగ్ల సంస్కృతికీ, ఆంగ్ల ప్రభువులకూ భారతీయులు మోకరిల్లుతున్న దుర్దినాలు.
మధుకైటభుల వ్యక్తివాదాన్నీ, మహిషాసురుల పశుబల ప్రాధాన్యమైన భౌతిక భక్తినీ, శుంభని శుంభుల వాంఛా పిశాచాన్నీ, రావణ రాక్షసుల అహంకార మదాంధతనూ, వికృతాచార విధానాలనూ ఎదిరించి గెలిచి సమాజ సమైక్యతనూ, సమష్టి శక్త్యారాధననూ, త్యాగాన్నీ, ప్రబోధించిన భారతజాతి ఇదేనా? ఈ కల్లోలంలోంచి జాతి నుద్ధరించాలి. కాని ఏదా ప్రయత్నం?
1925లో విజయదశమినాడే ఆ ప్రయత్నానికి అంకురార్పణ జరిగింది. అదే నేడు రాష్ట్రీయ స్వయంసేవక సంఘంగా ‘‘విశాల వటవృక్షంగా దేశాన్ని తన బాహువులలో పెనవేసుకుంటూ పెరుగు తున్నది. భగీరథుడు ఆకాశం నుంచి గంగను లాగి, హిమాలయ శృంగాలను ఖండిరచి ప్రవహింప చేసి, జమ్ముని తొడ చీల్చి భూమికి దించిన విధంగా పూజ్య కేశవ హెడ్గేవార్ సంఘ రూపంలో ఆనాటి భారతీయ ఆదర్శాన్ని జాతికి అందించారు. భారతీయ శక్తిని ` హైందవ సమష్టి శక్తిని` నేడు మేలుకొలుపు తున్న ఈ నూతన వ్యవస్థకు` ఈ సంఘ సంస్థను ప్రభవింపచేసిన విజయదశమి నమస్సులు.
భారత చరిత్ర ఇది. ఇది విజయదశమి చరిత్ర కల్పాంతంలో మధుకైటభులు ప్రతిపాదించిన వ్యక్తినాదాన్నుంచి నేటి పరకీయ సంస్కృతీ దాస్యం వరకూ ఇన్ని పెను గాడ్పులను భారతజాతి ఎదిరిం చింది. ఇదొక మహా సంగ్రామ చరిత్ర.
‘‘పూర్ణమదః పూర్ణమిదం…’’ అని ఉపనిషత్సూక్తి సృష్టి సమత్వానికి ప్రతిబింబం. సృష్టి సమగ్రం, సంపూర్ణం. భారతీయుడు ఆరాధించేదీ, సాధించేదీ ఈ ఆదర్శాన్నే. భారతీయుడు అల్పసంతోషి కాదు (సుసంతోషోవైకాపురుషః) అది కాపురుష లక్షణం. జిజ్ఞాసతో ` విజ్ఞానదాహంతో తన చుట్టూ క్షితిజం వరకు వ్యాపించియున్న ప్రకృతినీ, జడచైతన్య పదార్థాలనూ చూచి ఆలోచించి, ధ్యానించి, తరచి తెలుసుకొన్న విషయం ఇదే. ఇది తెలుసుకొన్న నాడే…
ఒరులేయని యొనరించిన
నరవర అప్రియము తనమనంబునకగుతా
వొరులకు నది సేయకునికి
పరాయణము పరమ ధర్మపదముల కెల్లన్ ॥
అని తన ఆదర్శం స్థిరపరచుకున్నాడు. ఈ నిష్కర్షకు వచ్చినపుడే ‘‘సర్వభూతేషు సమభావః’’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది.
‘‘ఈశావాస్యమిదం సర్వం,యత్కించ జగత్యాం జగత్!
తేనత్యక్తేన భుంజీత, మాగృధః కస్యస్విద్ధనమ్’’
సృజన, పోషణ, నిలయ శక్తులకు మూలరూపుడైన పరమేశ్వరుని కటాక్షం వల్లనే ఈ జగత్తంతా నిలచి ఉన్నది. నిత్యమూ పరివర్తన చెందే ఈ సంపదల్ని లోభంతో కూడబెట్టక, త్యాగభావంతో స్వీకరించు. ఈ సంపదలన్నీ ఎవరో ఒకరివి కాదునుమా అని హృదయాన్ని హెచ్చరించాడు.
ఇదీ భారత ఆదర్శం `ఇదీ మన జాతికి ప్రాణమైన సంస్కృతి విధానం`ఇదే శాశ్వతం`చిరంతనం` ఇదే మన విజయ సాధనకు స్ఫూర్తినొసగే దివ్య ఆదర్శం` ఈ ఆదర్శ సాధనకై నడచిన చరిత్రయే మన చరిత్ర, అదే విజయదశమి. ఇదే మనకు నిజమైన విజయోత్సవ దినం! స్వాతంత్య్రోత్సవ దినం` భారత జాతికి విమోచన దినం విజయదశమియే. జాతికి విమోచన దినం విజయదశమియే. దేశం ఈ విషయాన్ని గ్రహించిన నాడే తిరిగి అభ్యుదయ శిఖరాల నారోహించగలుగు తుంది.
– భండారు సదాశివరావు, (జాగృతి, 17.10.1953)