ఆయుర్వేదమంటే ఆనందభైరవి, శితాంకు రసం, చ్యవనప్రాశ, మకరధ్వజం మొదలయిన ఔషధాలూ, కొన్ని వ్యాధుల పేర్లూÑ ఆవ, బచ్చలి, గుమ్మడి, వంటివాటిని తినరాదని చెప్పే పథ్యాలు – ఇంత మాత్రమేనన్న స్థూల స్వరూపజ్ఞానం (Superficial view) జన సామాన్యంలో ఉంది. ఇది సముద్రంలో కలిసే ఉప్పుటేరు స్వరూపాన్ని బట్టి అదే సముద్రమనుకొన్నట్లు ఆయుర్వేదం ప్రాదేశిక స్థూల స్వరూపం మాత్రమే. ఆయుర్వేదమంటే మానవుడికి సుఖాన్ని ఇచ్చే ఉపాయాలు, సాధనాలు చెప్పే శాస్త్ర విశేషం. ప్రతి మనిషి సుఖమే కోరతాడు. సుఖం కోసమే మానవులందరి తాపత్రయం. ఆధునిక శాస్త్రాలు (Modern Science) కూడా మానవుడి సుఖం కోసమే కృషి చేస్తున్నట్టు చెబుతాయి. కానీ అవి మానవుని సమగ్ర స్వరూపాన్ని (Man as a whole) తెలుసుకొన లేక, పాక్షికం (Partial) గానే తెలుసుకొంటున్నాయి.
మానవుడంటే చర్మం, రక్తమాంసాలు, ఎముకలు మొదలయినవి కూడిన శరీరం. ఇది యంత్రం వంటిది. ఈ యంత్రంలో ఆహారమనే బొగ్గు (లేక పెట్రోలు) నింపితే పని చేస్తుంది. ఈ యంత్ర భాగాలు ఆయా ధాతువుల (Tissues) చేత నిర్మితమైనవి. ఈ ధాతువులు చిన్న చిన్న కణముల (Cells) సముదాయాలు. ఈ కణాలు ఉదజని (Hydrogen) నత్రజని (Nitrogen) మొదలయిన మూల తత్వములతో నిర్మితమైనవి – ఇదీ అల్లోపతి అనే ఆధునిక వైద్యశాస్త్రం చేసే ప్రచారం. ఇంకా ఆయా సూక్ష్మజీవుల సంపర్కం వంటి కారణాలతో ఆయా వ్యాధులు వస్తున్నాయి. ఈ కారణాలను బట్టి తక్కిన ఔషధాలను, నివారణో పాయాలను కనిపెట్టడమే పనిగా సాగుతున్న ఆ ఆధునిక వైద్యశాస్త్రమే (Modern Medicine) మానవకోటికి సుఖానికి ఎప్పటికైనా దారి చూపు తుందని కూడా అల్లోపతి విశ్వసిస్తున్నది.
కానీ ఆధునిక వైద్యశాస్త్రానికి ఉన్న పునాదులలో కొన్ని పరిమితులు (Limitations) ఉన్నాయనీ, వాటిని ఆధారం చేసికొని ఇతర యంత్రాల (Machinery) లోతుపాతులు తెలుసుకొన్నట్టు మానవుడిని (Man) తెలుసుకోవడం అసాధ్యమని వైద్యశాస్త్రంలో ‘నోబెల్’ బహుమతి పొందిన ఎలెక్సిస్ కారెన్ (ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు) తన గ్రంథంలో (Man the unkown) అంగీకరించాడు.
మానవుడిని సంపూర్ణంగా తెలుసుకోవడానికి మన పూర్వులు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే వారిలో కొద్దిమంది భగవద్గీత, ఉపనిషత్తులు మొదలయిన వాటిలో చెప్పిన యోగసాధనను అనుష్ఠించి, ముందుగా తమ మనసులను స్వాధీనం చేసికొని (ఇదే యోగసిద్ధి) ఆ దృష్టితో మానవుల దుఃఖం, వారి వ్యాధులు, ఔషధాలు మొదలయిన నివారణోపాయాలు వంటి వాటిని తెలుసుకొని వ్యాఖ్యానించారు. ఆ తరువాత కాలంవారు కూడా ఆ సిద్ధాంతాలను విమర్శించి తిరిగి అనుష్ఠించి, ఆ మార్గాలను స్థిరపరిచి నూతనౌషధాలను జత చేస్తూ వచ్చారు. ఈ గ్రంథ సముదాయమే ఆయుర్వేదం. అయితే ఈ మార్గాలను, సత్యాలను చెప్పే పారిభాషిక పదాలు (Terminology) ఆధునిక వైద్యశాస్త్రం ఉపయోగించిన పదాల కంటె భిన్నంగా ఉన్నాయి. ఆయుర్వేదంలోని పారిభాషిక పదాలు భగవద్గీత, ఉపనిషత్తులు, వాటి భాష్యాలు వంటి భారతీయ దర్శనాలు (Pholosophies)లోని పారిభాషిక పదాలు. అందుకే ఆ పదాలు కేవలం ఆధునిక శాస్త్రాలను (Modern Medicine) మాత్రం చదివినవారికి చప్పున అర్థం కావు.
మానవుడంటే సుఖదుఃఖాలను అనుభవించే జీవాత్మ. పంచ మహా భూతాలనే అత్యంత సూక్ష్మము లైన పరమాణువులతో నిర్మితమైన ధాతువుల (రక్తము మాంసము మొదలయినవి) కూడిక అయిన శరీరంతో ఉన్నాడు. వ్యాధి ఒక విధమైన దుఃఖం:. ఆయుర్వే దంలో చెప్పిన సాధనాలను విశ్వాసంతో ఆచరించి, వాటిని సరిగా అర్థం చేసుకుంటే ఆ తరువాత సుఖాన్వేషణకు ప్రయత్నించినపుడు సుఖమేకాని దుఃఖం రాదన్నదే ఆయుర్వేద తత్త్వం.
అందుకే భగవద్గీత చెప్పిన మూలసూత్రాలే ఆయుర్వేద మూలసూత్రాలై నాయి. భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగమనే పదమూడవ అధ్యాయం చూడండి! వ్యాధి వచ్చిన తరువాత నయం చేసుకునే కంటే వ్యాధి రాకుండా చూసుకోవడం మంచిది కాదా? అందు కోసం మానవుడు తన శరీరమనే యంత్రాన్ని (భూమిని) ధర్మమనే (Duties) సాధనాలతో సుఖం కోసం ఫలవంతంగా చేసుకోవాలి. ఇందుకోసమే మానవుడు ఆహార, విహారాలలో (Food and Other Habits) సరియైన పద్ధతులను అవలంబించాలి. వ్యాధి వచ్చిన తరువాత దానిని పోగొట్టుకోవడానికి కూడా ఇవే సాధనాలు. అయితే వ్యాధి వచ్చినపుడు ఔషధాలను అదనంగా వాడవలసివస్తుంది. ఈ విధంగా ఆయుర్వేదంలోని వాస్తవికతను వైద్యులేగాక సమస్త జనులు తెలుసుకోవాలి.
కాలం గడిచిఏ కొద్దీ వ్యాధుల (Dieseases) లక్షణాలు మారతాయి. వ్యాధి అంటే శరీరంలో కలిగే కార్య విశేష (Effect) రూపమైన ఒక మార్పు. ఈ కార్య విశేషం (Effect), కారణాలు (Causes) లేకుండా పుట్టదు. ఒకచోట మొక్క మొలచిందంటే, అక్కడ ఆ మొక్కకు సంబంధించిన గింజను ఎవరో (లేక పక్షులు లేక గాలి) పడేశారనే కదా! ఆ గింజ అక్కడి భూసారం, నీటి చెమ్మ మొదలయిన కారణా లన్నిటితో మొక్క అనే కార్యాన్ని ఉత్పత్తి చేసిందని అర్ధం చేసుకుంటాం. అదే విధంగా ఒకనికి వ్యాధి వచ్చిందంటే అతడు చేసిన ఆహార విహారాలలోని తప్పులు, లోటుపాట్లు కారణాలవుతాయి. ఈ లోట్ల చేతనే శరీరమనే యంత్రం (పొలం) పాడైన తరువాత సూక్ష్మజీవులు (Bacteria) ఆ శరీరాన్ని ఎదిరించి వ్యాధిని కలుగ చేస్తున్నాయి. ఇక్కడ ఈ మానవుని వ్యాధికి అతడు చేసిన తప్పులు, లోట్లు, సూక్ష్మజీవులు కూడా కారణాలవుతున్నాయి. ఈ సూక్ష్మజీవులను నశింపజేసే ప్రయత్నాల కంటేె శరీరమనే క్షేత్రాన్ని సరి చేసుకొనే ఉపాయాలే ఆయుర్వేదం ప్రధానంగా బోధిస్తుంది. శరీరమనే క్షేత్రం చక్కగా ఉన్నప్పుడు ఏ సూక్ష్మజీవీ ఏవీ చేయజాలదు. ఏ వ్యాధీ రాదు. ఈ వ్యాధులను శరీర పరిస్థితిని తెలిసికొనే విజ్ఞానమంతా ఆయుర్వేదంలో త్రిదోష విజ్ఞానం మీద ఆధారపడి ఉంది. సరియైన ఆయుర్వేదశాస్త్రó వృద్ధికి, అది ఇచ్చే మానవ సుఖానికి మార్గం, సూక్ష్మబుద్ధులైన వారు ఆయుర్వేద విజ్ఞానాన్ని సరిగా బోధపరుచుకొనడమే. కాని కేవలం ఆధునికశాస్త్రాలు పఠించిన జాతికి ఈ శాస్త్రంలోని పారిభాషిక పదాలలో గూఢమై ఉండే సత్యం తెలియచెప్పేందుకు జాగ్రత్తగా వివరించే నూతన గ్రంథాలు రాయవలసి ఉంటుంది. ఇందుకు విద్వాంసులు కృషి చేయాలి.
పైన పేర్కొన్నట్టు కాలం గడిచే కొద్దీ వ్యాధుల స్వరూపాలు మారుతుంటాయి. వాటికి తగిన నూతన ఔషధాలను, వ్యాధి విజ్ఞాన పద్ధతులను, నివారణో పాయాలను చేర్చుకోవడం అవసరం. అయితే ఈ పద్ధతులు ఆయుర్వేద మూలసూత్రాలకు భిన్నంగా కాకుండా అనుగుణంగా ఉండేటట్లు చేర్చాలి. ఈ పని చేసేందుకు ఆయుర్వేదం క్షుణ్ణంగా తెలిసినవారికే గాని ఇతరులకు అధికారంలేదు. ఆయుర్వేదంలో పరిశోధన (Research) కూడా ఈ మార్గాల మీదనే జరగాలి. పరిశోధకులు (Research Workers) ముందుగా ఆయుర్వేదం చదివి బాగా అవగాహన చేసికొని ఆ తరువాత ఆ పునాదుల మీద పాశ్చాత్య వైద్య విజ్ఞానంలోని ఉపయుక్తాంశాలను ప్రతిష్ఠించుకోవాలి. ఇది మిక్కిలి సూక్ష్మబుద్ధులైనవారు ఓపికతో కొనసాగించవలసిన కృషి.
ఇటు జనసామాన్యానికి కావలసిన సులభ చికిత్సలు, ఔషధాలు, వ్యాధుల విజ్ఞానం, నివారణో పాయాలు, ఔషధ తయారీ కోసం సరియైన మూలికలు మొదలయిన వానిని అందించే సంస్థలను నెలకొల్ప వలసి ఉంది. ఇందులో స్వార్థరహితులు, సత్యా న్వేషణపరులు అయిన పరిశోధకులు పనిచేయవలసి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దానిని ప్రోత్స హించి, ఒక ఉత్తమ పరిశోధన సంస్థను వెంటనే స్థాపించాలి.
– ఆయుర్వేదాచార్య, తేజోమూర్తుల గురునాథం, జాగృతి, 30.12.1955