ఒకవైపు నిరసనకారులు అంటించిన మంటల నుంచి తేరుకున్న సుప్రీంకోర్టు పొగచూరి ఉండగా.. మరోవైపు వేల సంఖ్యలో పారిపోయిన ఖైదీల్లో కొందరు సరిహద్దులు దాటి బిహార్‌లో పట్టుబడగా.. కేవలం 27 గంటల్లో నాయకత్వ మార్పునకు నాంది పలికారంటూ హడావిడిగా రాత్రి 9.30 గంటలకు అర్ధ గంట ఆలస్యంగా రాష్ట్రపతి భవన్‌లో నేపాల్‌ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సుశీల కర్కీ అక్కడి జన్‌`జడ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అధికారాన్ని అంటిపెట్టుకొని కూర్చునేది లేదని తేల్చి చెప్పారు. ఆరునెలల్లో ఎన్నికలు నిర్వహించి, అధికార దండాన్ని కొత్తగా కొలువుదీరే పార్లమెంట్‌కు అప్పగిస్తామని ప్రకటించారు. ఈలోగా దేశంలో ఆత్యయిక పరిస్థితిని విధించాలనే ఆలోచన పూర్వ చీఫ్‌ జస్టిస్‌కు వచ్చినప్పటికీ అలా చేస్తే జన్‌`జడ్‌ మరోసారి వీధులకు ఎక్కుతారనే అనుమానంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. నిరసనకారుల ఆగ్రహానికి దెబ్బతిన్న రాష్ట్రపతి భవన్‌ శకలాల మీద తన మంత్రివర్గ సహచరులతో రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. నిరసనాగ్నిలో చనిపోయినవారిని అమరవీరులుగా ప్రకటించారు. మృతుల ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల నేపాల్‌ రూపాయలు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. హింస వెనుక కుట్రకోణం ఉందన్నారు. దర్యాప్తు జరిపిస్తామన్నారు. దోషులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

ప్రపంచ దేశాలన్నీ నేపాల్‌లో అధికార మార్పును స్వాగతించాయి. అందుకు కారణమైన అక్కడి యువతను అభినందనలతో ముంచెత్తాయి. సోషల్‌ మీడియా సాకుగా, సాక్షిగా కదం తొక్కిన జన్‌`జడ్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కుతుందో లేదో తెలియదు కానీ ఒక గేమింగ్‌ యాప్‌లో వచ్చిన మెజార్టీ అభిప్రాయంతోనే సుశీల కర్కీకి అధికార పీఠం దక్కిందన్న వాస్తవం ప్రజాసామ్యంతో యువత పాచికలాట ఆడుతున్న వైనాన్ని స్పష్టం చేస్తోంది.

నేపాల్‌కు రాజకీయ సంక్షోభాలు కొత్తేమీ కాదు. అక్కడ రెండు దశాబ్దాల కంటే తక్కువ కాలంలోనే గణతంత్ర ప్రజాస్వామ్యంలో, దేశంలో ఒక డజను ప్రభుత్వాలు కూలిపోవడం, సంకీర్ణ పొత్తులు రాత్రికి రాత్రే ఏర్పడి విచ్ఛిన్నం కావడం, వర్గ ప్రయోజనా లకు మించి ఆలోచించలేని నాయకులతో పౌరులు విసిగిపోవడం వంటివి సర్వసాధారణమైపోయింది.

నేపాల్‌ యువతకు ప్రభుత్వ అవినీతిపై అసంతృప్తి పెరిగిపోయిన నేపథ్యంలో, “ప్రజా క్రమం’’`పబ్లిక్‌ ఆర్డర్‌ పేరుతో సెప్టెంబర్‌ ప్రారం భంలో ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి టిక్‌టాక్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ వరకు 26 సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పూర్తి నిషేధాన్ని ప్రకటించడంతో తాజా సంక్షోభం ప్రారంభమైంది. ఈ చర్య అసమ్మతిని శాంతింపజేయడానికి బదులుగా నేపాల్‌ ఇటీవలి జ్ఞాపకాలలో అతిపెద్ద యువత నేతృత్వంలోని తిరుగుబాట్లలో ఒకదానికి దారితీసింది.

కఠ్మాండు ఇతర నగరాల్లో రహదారులు రోజుల తరబడి, నిరసనకారులతో అత్యధికంగా విద్యార్థులు, గిగ్‌ వర్కర్లు, యువ ఐటీ నిపుణులతో నిండి పోయాయి. వారంతా ప్లకార్డులు ఊపుతూ నిషేధాన్ని వ్యతిరేకించారు. వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ` వీపీఎన్‌లో నిరసనలు తెలియజేశారు. వైరల్‌ మీమ్‌లతో నిషేధాన్ని అపహాస్యం చేశారు. త్వరలో ప్రదర్శనలు ఊపందుకున్నాయి. వీధులకెక్కిన జనాగ్రహం పతాకస్థాయికి చేరుకోవడంతో ఓలి ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

భారత ఉపఖండంలో తరచుగా జరిగే విధంగా నేపాల్‌లో కూడా ఈ ఘటనలపై భిన్నాభిప్రాయాలు పుట్టుకొచ్చాయి. వ్యాఖ్యాతలు దీనిని దేశాన్ని అస్థిర పరిచేందుకు బయటి నుంచి ‘‘డీప్‌ స్టేట్‌ ప్రాయోజిత వర్ణ విప్లవం’’ అని పిలిచారు. ఈ పదబంధం సుపరిచితమైన అర్థాలంకారాలతో అంటే అరబ్‌ వసంతంలో పశ్చిమ దేశాల హస్తం లేదా హాంకాంగ్‌ ప్రజాస్వామ్య ఉద్యమంపట్ల బీజింగ్‌ చిత్తచాంచల్యాన్ని ప్రతిధ్వనిస్తుంది.

అయినప్పటికీ, నేపాల్‌ తిరుగుబాటును విదేశీ కుట్ర స్థాయికి తగ్గించడం అంటే తిరుగుబాటు వెనుక మూలాలకు దూరం జరగడమే అవుతుంది. కఠ్మాండులో జరిగినది కుట్ర కంటే ప్రజాస్వామ్య దిద్దుబాటు, పాతుకుపోయిన అవినీతి, చెవిటి పాలనకు తరతరాల మందలింపు.

ఉద్యమానికి నాంది ఏమిటి?

తిరుగుబాటుకు మూలాలు నేపాల్‌ దీర్ఘకాలికంగా పాలనాపరంగా ఉన్న లోటులో ఉన్నాయి. అవినీతి, బంధుప్రీతి గణతంత్రం విశ్వసనీయతను దెబ్బ తీశాయి. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ యాజమాన్యం లోని సంస్థలు రాజకీయ నాయకుల బంధువులతో నిండిపోయాయి. పార్టీ స్నేహితులకు కాంట్రాక్టులు దక్కుతాయి. అవినీతి నిరోధక దర్యాప్తులు అరుదుగా అధికార ఉన్నత స్థాయిని తాకుతాయి.

సగటు నేపాలీ యువతకు సంబంధించినంత వరకు రాజకీయాలు అనేవి కొన్ని రాజకీయ కుటుంబ పార్టీలకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక హక్కు.

ఆర్థిక స్తబ్దత ఈ ఆగ్రహాన్ని మరింత పెంచు తుంది. యువత నిరుద్యోగం 20 శాతం వరకు ఉంది. వలసలు ఒక తప్పించుకునే మార్గంగా మారాయి. ప్రతిరోజూ దాదాపు 1,700 మంది నేపాలీలు గల్ఫ్‌, మలేషియా లేదా భారతదేశంలో పని కోసం బయలుదేరుతున్నారు.

‘‘మనం నరకంలో బతుకులీడుస్తుండగా వాళ్ల పిల్లలు విదేశాల్లో పార్టీలు చేసుకుంటున్నారు’’ అని ఒక యువ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిషేధానికి ముందు టిక్‌టాక్‌లో ప్రకటించాడు. ఉన్నత వర్గాల జీవనశైలి యువతరం చేస్తున్న త్యాగాలను వెక్కిరిస్తుండటం పట్ల యువతరం మానసిక స్థితిని సంగ్రహంగా చెప్పాడు.

సంస్థాగత వైఫల్యాలు మరింతగా పాతుకు పోయాయి. చిందిన రక్తంతో, ఆదర్శవాదంతో ప్రజా స్వామ్యం గెలిచింది. కానీ ఆచరణలో అది రాజకీయ బేరసారాలు`హార్స్‌ ట్రేడిరగ్‌, అవినీతి, అంతులేని అస్థిరతకు పర్యాయపదంగా మారింది. సంకీర్ణ ప్రభుత్వాలు ఏ వాగ్దానాన్ని నెరవేర్చకముందే కూలి పోతుంటాయి. ప్రజా సేవలు క్షీణిస్తుంటాయి. రాచరికం తర్వాత జన్మించి, రిపబ్లికన్‌ సమానత్వం వాక్చాతుర్యంలో పెరిగిన జన్‌`జడ్‌కు, వాగ్దానానికి, ఆచరణ మధ్య వ్యత్యాసం దారుణమనిపిస్తోంది.

ఈ ఆగ్రహం ఒక ఉద్యమంగా మారడానికి సోషల్‌ మీడియా వేదికగా మారింది. విదేశాల్లో సంపదను చాటుకుంటున్న రాజకీయ నాయకుల కుమారులు, కుమార్తెలను ‘‘నెపో బేబీస్‌’’, “నెపో కిడ్స్‌’’ అని విమర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, టిక్‌టాక్‌ వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఉన్నత వర్గాల కపటత్వాన్ని ఎగతాళి చేసే హ్యాష్‌ట్యాగ్‌లు మిలియన్ల వీక్షణలను పొందాయి, ద్వేషాన్ని సామూహిక కోపంగా మార్చాయి.

దీనికి ప్రభుత్వ స్పందన కఠినంగానూ, రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యంగానూ ఉంది. ఓలి ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవడానికి బదులుగా 26 సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను పూర్తిగా నిషేధించింది. యువ నేపాలీలు తమ నిరాశను వెళ్లగక్కుతున్న సాధనాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఈ నిషేధం అసమ్మతి అగ్గిని చల్లార్చడానికి బదులుగా మరింతగా ఎగదోసింది. ఎన్‌క్రిప్టెడ్‌ గ్రూపులు కొన్ని గంటల్లోనే నిరసన పిలుపులను విస్తరింపచేశాయి. వేలాది మంది కఠ్మాండు వీధుల్లోకి వచ్చారు. చెల్లాచెదురుగా ఉన్న అసంతృప్తిని దేశవ్యాప్త తిరుగుబాటుగా మార్చారు.

గళమెత్తిన జన్‌-జెడ్‌

నేపాల్‌ రాజకీయ సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించింది జుట్టు నెరిసిన పార్టీల అధినేతలు లేదా హోటళ్లలో గుమిగూడిన సంకీర్ణ సంధానకర్తలు కాదు. వివిధ రంగాలకు చెందిన వేలాది మంది యువకులు ప్లకార్డులు, వీపీఎన్‌ ఆధారిత ఫోన్లు, తాము కోల్పోయేది ఏమీ లేదనే దృఢ నిశ్చయంతో కఠ్మాండు వీధుల్లోకి వచ్చారు. తరతరాల అల్లిక మార్పులతో కూడుకున్న నేపాల్‌ సుదీర్ఘ పాలనా చరిత్ర నుండి ఈ క్షణాన్ని వేరు చేసింది.

2008లో రాచరికం పడిపోయింది. కానీ నిరసనకారులలో ఎక్కువ మంది అప్పటికి పిల్లలే, లేదా అప్పటికి పుట్టి ఉండరు. వారు మావోయిస్టు తిరుగుబాటు సైద్ధాంతిక సామాగ్రిని మోసుకుంటూ ముందుకు నడవరు. ముసలి కంపు కొట్టే పార్టీల వారసత్వాలకు విధేయులుగా వంగివంగి దండాలు పెట్టరు. వారు ప్రజాస్వామ్య యుగంలో పుట్టారు. ఆన్‌లైన్‌లో పెరిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వారిది అధికారానికి వ్యతిరేకంగా నిర్మొహమాటంగా మాట్లాడటానికి భయపడని మొదటి నిజమైన రిపబ్లికన్‌ తరం.

పుల్చౌక్‌ క్యాంపస్‌లో 20 ఏళ్ల ఇంజనీరింగ్‌ విద్యార్థి ప్లాస్టిక్‌ స్టూల్‌పై నిలబడి నినాదాలు చేస్తున్నాడు. ‘‘యాప్‌లను నిషేధించే నాయకులు మనకు అవసరం లేదు. భవిష్యత్తును నిర్మించే నాయకులు మనకు అవసరం.’’ అని రెండు ముక్కల్లో తేల్చి చెప్పాడు. అతని మాటలను స్నేహితులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. అవి కొన్ని గంటల్లోనే ఎన్‌క్రిప్ట్‌ చేసిన టెలిగ్రామ్‌ ఛానెల్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌ కథనాల్లో ప్రతిధ్వనించాయి. జన్‌`జడ్‌ నిషేధంలో కూడా తమ నిరసన గళాన్ని ప్రపంచానికి వినిపించ డానికి ఒక మార్గాన్ని కనుగొన్నాయి.

‘‘టిక్‌టాక్‌ను నిషేధించాను, కానీ అవినీతిని నిషేధించలేను’’ అనే క్యాప్షన్‌తో ఓలిని సన్‌ గ్లాసెస్‌ ధరించి చూపిస్తున్న మీమ్స్‌ సర్క్యులేట్‌ అయ్యాయి. మరికొందరు పార్లమెంటేరియన్ల విదేశీ విద్యనభ్యసించిన పిల్లలను ఎగతాళి చేశారు. ఇది నెపోకిడ్స్‌, నెపోబేబీస్‌ వంటి హ్యాష్‌ట్యాగ్‌ల కింద ట్రెండ్‌ అయిన రీల్స్‌గా మారింది

ఈ ట్యాగ్‌లు ఎందుకు ప్రతిధ్వనిస్తున్నాయో ఒక యువ నిరసనకారుడు వివరిస్తూ ‘‘ఇది వారి పిల్లలు విదేశాలలో చదువుకోవడం గురించి మాత్రమే కాదు. ఒకవైపు మాకు బతుకుదెరువు కోసం మా తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ మమ్మల్ని మలేషియా లేదా గల్ఫ్‌కు పంపిస్తుంటే మరోవైపు వారు తమ సంపదను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రదర్శిస్తుంటారు. ఈ నయవంచనే మమ్మల్నినాశనం చేస్తోంది’’ అని వాపోయాడు.

నిన్న మొన్నటి దాకా నేపాల్‌లో వీధి రాజకీయా లను కార్మిక సంఘాల నాయకులు లేదా మావోయిస్టు కార్యకర్తలు నడిపించేవారు. నేడు టిక్‌టాకర్లు, ఇన్‌స్టాగ్రామర్లు ఆ బాధ్యతను తమదిగా చేసుకున్నారు.

రెండు లక్షల కంటే ఎక్కువ మంది అనుచరులు ఉన్న ఒక యువ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిషేధానికి కొన్ని రోజుల ముందు రీల్‌ రూపంలో ఒక వీడియో క్లిప్‌ను పోస్ట్‌ చేసింది. అందులో నేపాలీ వలస కార్మికులు విమానాశ్రయ క్యూలలో వేచి ఉన్న ఫుటేజీలతో, మంత్రుల పిల్లలు ఐరోపాలో సెలవులు గడుపుతున్న దృశ్యాలను జోడిరచింది. రీల్‌కు ‘‘వారి పిల్లలు విదేశాలలో పార్టీ చేసుకుంటుండగా మేము నరకంలో బతుకుతున్నాం’’ అనే క్యాప్షన్‌ను జోడిరచింది.

ఆ రీల్‌ 48 గంటల్లోపే 10 లక్షల వ్యూస్‌ సాధిం చింది. ప్రభుత్వం టిక్‌టాక్‌ తదితర 25 ప్లాట్‌ఫామ్‌ లపై నిషేధానికి రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఆమె రీల్‌ అణచివేతకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై ఆగ్రహానికి ప్రతీకగా మారింది.

నిరసనలకు ఇది అంతం కాదు ఆరంభం అని ఐటీ గ్రాడ్యుయేట్‌, పార్ట్‌-టైమ్‌ కోడర్‌ యుసాన్‌ మైనాలి తెలిపారు. ‘‘ఈ నిరసన మూడురోజుల్లో ముగియ వచ్చు, కానీ ఈ సమూహ శక్తి మున్ముందు మహాశక్తిగా అవతరిస్తుంది. మహాశక్తి తోడుగా వచ్చే ఎన్నికలలో సమర్థులైన నాయకులను ఎన్నుకుంటాము. నిరసన నిజమైన ఫలితం అప్పుడే కనిపిస్తుంది’’ అనే ఆశాభావాన్ని మైనాలి వ్యక్తం చేశారు.

కొన్ని స్వరాలు రాజీపడనివిగా ఉన్నాయి. మొదటిసారి ఓటు వేసిన పద్దెనిమిదేళ్ల సౌరవ్‌ నిరసనలను కవర్‌ చేస్తున్న ఒక బ్రిటిష్‌ విలేకరితో మాట్లాడుతూ ‘‘ఇది మా విప్లవం. ఇప్పుడు మా వంతు వచ్చింది. వారు (అధికారంలో ఉన్నవారు) మా తల్లిదండ్రుల సుస్థిరతను దోచుకున్నారు, కానీ మా భవిష్యత్తును దోచుకోలేరు’’ అని అన్నాడు.

అతని వెనుక, చేతితో గీసిన బోర్డు మీద ‘‘మీరు టిక్‌టాక్‌ను నిషేధించారు. కానీ మా ఆగ్రహాన్ని నిషేధించలేరు’’ అని రాసి ఉంది.

చాలామంది యువ నేపాలీలు ఈ నిరసనలను సోషల్‌ మీడియాను కాపాడుకోవడం గురించి కాకుండా తమ గౌరవాన్ని తిరిగి పొందడానికి ఉపయోగపడేవిగా భావించారు. వారి దృష్టిలో సోషల్‌ మీడియా వేదికలు గౌరవాన్ని తిరిగి పొందడంలో వినియోగించే ఉపకరణాలు మాత్రమే. వారి దృష్టిలో పాత తరం నాయకులు గణతంత్రాన్ని సొంత ప్రైవేట్‌ క్లబ్‌గా భావించేవారు. అలాంటి నాయకులు తమను విస్మరించడం యువనేపాలీల ఆగ్రహానికి దారి తీసింది.

జర్నలిజం విద్యార్థిని ఆయుషా థాపా మాటల్లో ఆశ, నిరాశ రెండూ వినిపించాయి. ‘‘మా ప్రధాన అజెండా అవినీతికి వ్యతిరేకంగా ఉంది. కానీ మా అజెండాను ఆషామాషీగా తీసుకున్న కొన్ని సమూహాలు మమ్మల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ రోజు అంచనాలకు, వాస్తవికతకు మధ్య పెనుగులాట జరుగుతున్నట్టు నాకు అనిపించింది. ఒక స్పష్టమైన నాయకత్వం ఉన్న పక్షంలో(నిరసనలకు) అది మరింత బలంగా ఉండేది. అయినప్పటికీ, మా శక్తిని ఎవరూ కొనలేరు.. నియంత్రించలేరు’’ అని తెలిపింది.

ఆమె వ్యాఖ్యలు ఒక వైరుధ్యాన్ని నొక్కి చెబుతున్నాయి. ఎలాంటి నాయకత్వం లేకుండా సహజసిద్ధంగా పుట్టుకొచ్చిన ఈ ఉద్యమాన్ని మరొకరు(ముఖ్యంగా రాజకీయనాయకులు) వారి చేతుల్లోకి తీసుకోవడం, తమదిగా చెప్పుకోవడం చాలా కష్టమైన పని. అదే సమయంలో ఈ ఉద్యమం తీరుతెన్నులు చూస్తుంటే దీన్ని తునాతునకలు చేయడం చాలా సులభం అనిపిస్తుంది. అందుకనే ఏ రాజకీయ పార్టీ కూడా జన్‌`జడ్‌ ఆగ్రహాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు కనిపించలేదు.

 నిరసనలు రాజధానికే పరిమితం కాలేదు. పోఖారాలో, యువకులు ‘‘మీపై విశ్వాసం వీగిపోక మునుపే అవినీతిని అంతం చేయండి’’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. ధరణ్‌లో ప్రదర్శనకారులు నిషేధం గాలిసోకని పెద్ద పేరు లేని యాప్‌లలో తమ నిరసనల కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రభుత్వ సెన్సార్‌షిప్‌ను అపహాస్యం చేశారు.

వీపీఎన్‌ డౌన్‌లోడ్‌లు రాత్రికి రాత్రే పెరిగాయి. గ్రూపులు టెలిగ్రామ్‌, సిగ్నల్‌, డిస్కార్డ్‌ వంటి గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు కూడా మారాయి. వాటి ద్వారానే దేశానికి తదుపరి తాత్కాలిక ప్రధానమంత్రి ఎంపిక కావడం గమనార్హం. ఒక విద్యార్థి లైవ్‌ స్ట్రీమ్‌లో మాట్లాడుతూ ‘‘వారు(ప్రభుత్వం) మా యాప్‌లను నిషేధించారు, కానీ మేము వీపీఎన్‌లతో పుట్టి పెరిగామనే విషయాన్ని వారు మర్చిపోయారు. మేము వారి కంటే తెలివైనవాళ్లం’’ అని అన్నాడు.

డిజిటల్‌ మీడియాతో పాటుగా ఉద్భవించిన జన్‌`జడ్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం వారి దృఢ సంకల్పాన్ని మరింత కఠినతరం చేసింది. వారి నిరసన నిశ్శబ్దంలోకి అదృశ్యమయ్యే బదులు, హ్యాష్‌ట్యాగ్‌లు గ్రాఫిటీ, పోస్టర్లు, వీధి నినాదాల రూపం దాల్చింది. ఈ యువ గళాల స్వరాల నుంచి పుట్టుకొచ్చేది ఒకే మ్యానిఫెస్టో కాదు, కొత్త రాజకీయ వ్యాకరణం. ఇది మీమ్‌ సంస్కృతిని వీధి నిరసనతో, వ్యంగ్యంతో, ఆవేశంతో, ఆకాంక్షను ద్వేషంతో కలుపుతుంది. ఇది గత సిద్ధాంతాల పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తుంది. అయినప్పటికీ జవాబుదారీ తనం కోసం గట్టిగా పట్టుబడుతోంది.

ఈ యువ నేపాలీలు తమను తాము పెద్ద భౌగోళిక రాజకీయ క్రీడలో పావులుగా లేదా పాత పార్టీల సైనికులుగా భావించరు. వారు తమను తాము మోసం చేసిన ప్రజాస్వామ్యానికి నిజమైన వారసులుగా భావిస్తారు. దానిని తిరిగి పొందాలని వారు దృఢంగా నిశ్చయించుకున్నారు.

ఆ కోణంలో, ఓలి పతనం కేవలం పాలన మార్పు కాదు. 21వ శతాబ్దంలో, యువ పౌరులను పట్టించుకోని ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని ఇది గుర్తు చేస్తుంది.

జన సమీకరణలో సరికొత్త ధోరణి

ప్రభుత్వం 26 సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన రెండు లేదా మూడు రోజుల్లోనే, కఠ్మాండు, పోఖారా, ధరణ్‌, బిరాట్‌నగర్‌ లలో ప్రదర్శనలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.

నోటి మాట, వీపీఎన్‌-ఆధారిత సందేశాలు, ప్రభుత్వాన్ని ఎగతాళి చేసే వైరల్‌ రీళ్ల ద్వారా జన సమూహం ఏర్పడిరది. నిరసనలకు దారితీసిన ఫిర్యాదులు స్థానికంగానే ఉన్నాయనడంలో సందేహం లేదు. అవినీతి కుంభకోణాలు, నియామకాల్లో బంధుప్రీతి, అవకాశాల కొరత, ఆర్థిక అసమానత, దీర్ఘకాలిక నిరుద్యోగం నేపాల్‌ను సంవత్సరాలుగా వెంటాడుతున్నాయి.

కఠ్మాండులోని ఒక యువ నిరసనకారుడు ది కఠ్మాండు పోస్ట్‌తో మాట్లాడుతూ ‘‘మేము అమెరికా లేదా చైనా కోసం వీధుల్లోకి రాలేదు. ప్రతీ రాజకీయ నాయకుడు తన మేనల్లుడిని నియమించుకుంటాడు కాబట్టి, మాకు ఉద్యోగాలు దొరకవు కాబట్టి, మా గొంతును ఎవరూ వినరు కాబట్టి మేము వీధుల్లోకి వచ్చాము’’అని అన్నాడు.

నేపాల్‌ నిరసనలు ఎన్నికల దొంగతనం లేదా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనే ఆరోపణల చుట్టూ రూపొందించుకోలేదు. దొంగిలించిన బ్యాలెట్‌ నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం డిమాండ్‌ కాదు, కానీ ఇప్పటికే ఉనికిలో ఉన్నప్పటికీ దానిని అందించ డంలో విఫలమైన ప్రజాస్వామ్యం నుండి జవాబు దారీతనం కోరడం నుంచి పుట్టుకొచ్చాయి.

ఈ ఉద్యమానికి మూలం సోషల్‌ మీడియాపై పూర్తి నిషేధం. అది ఒక్క అగ్గిపుల్లలా పనిచేసింది. సంవత్సరాల తరబడి అసమానత, నిరుద్యోగం, రాజకీయ స్తబ్ధతపై జన్‌`జడ్‌లో పేరుకుపోయిన అసంతృప్తిని, ఆగ్రహాన్ని నిరసనల రూపంలో రగిలించింది.

నిరసనకారులు పాత రాజకీయ పార్టీలను లేదా తెలిసిన అధికార దళారులను అదేపనిగా తిరస్కరిం చారు. ది కఠ్మాండు పోస్ట్‌లో వచ్చిన నివేదిక ప్రకారం, యువ ప్రదర్శనకారులు ప్రతిపక్ష నాయకులు తమ ర్యాలీలకు సహకరించడానికి చేసిన ప్రయత్నాలను తోసిరాజన్నారు. వారి నినాదాలు ఒక వర్గానికి వ్యతిరేకంగా కాకుండా, మొత్తం రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నాయి.

టిక్‌టాక్‌ లైవ్‌లో 21 ఏళ్ల ఇంజనీరింగ్‌ విద్యార్థి మాట్లాడుతూ ‘‘మాకు కాంగ్రెస్‌ లేదా యుఎంఎల్‌ లేదా మావోయిస్టులు అవసరం లేదు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్నవారు పూర్తిగా విఫలమయ్యారు. మేము వారి కాపలా సైనికులుగా ఉండము’’ అని అన్నాడు.

అన్ని పాలన మార్పులు కుట్రలు కావు. నాయ కులు తమ పౌరుల నిరాశలను పట్టించుకోనప్పుడు కొన్ని సహజంగా పరిణామం చెందుతాయి. నేపాల్‌ జన్‌`జడ్‌ పూర్తిగా తరువాతి వర్గానికి చెందినవి.

లలిత్‌పూర్‌లోని ఒక విద్యార్థి నిరసనకారుడు స్థానిక విలేకరితో మాట్లాడుతూ, “మేం మా భవిష్యత్తు కోసం రోడ్ల మీదకు వచ్చామే తప్ప అమెరికా లేదా చైనా కోసం రాలేదు. మా దేశం విచ్ఛిన్నమైందని మాకు మరెవరూ చెప్పాల్సిన అవసరం లేదు’’ అని నిర్మొహమాటంగా చెప్పాడు.

ఇతర చోట్ల అశాంతి సృష్టించిన తీరులా కాకుండా నేపాల్‌ నిరసన పదజాలం స్పష్టంగా దేశీ యంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో బంధు ప్రీతి, అంతులేని విద్యుత్‌ కోతలు, రోడ్డు కాంట్రాక్టులు సంవత్సరాల తరబడి ఆలస్యం కావడం, రాజకీయ నాయకులు పార్లమెంటును ప్రైవేట్‌ క్లబ్‌ లాగా చూడటం వంటి ఫిర్యాదులకు అది వేదికగా మారింది.

నాయకుడు లేని ఉద్యమం నిజంగా అస్పష్టంగా మారవచ్చు. కానీ నేపాల్‌ విషయంలో నాయకత్వం లేకపోవడం కచ్చితంగా ముఖ్య విషయం. ఇది 1990ల నుండి తమలో తాము అధికారాన్ని తిరిగి పొందుతున్న కాంగ్రెస్‌, యుఎంఎల్‌ , మావోయిస్టుల వంటి పాత ముఖాలపై తరతరాలుగా జరుగుతున్న తిరుగుబాటును ప్రతిబింబిస్తుంది. నిరసనకారులు కొత్త నాయకులు ఉద్భవించే వరకు వేచి ఉండటం లేదు. తమ ముందు ఉన్న సమస్య రాజకీయ వర్గమే అని స్పష్టం చేశారు.

50,000 మంది టిక్‌టాక్‌ అనుచరులతో ఉన్న 19 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఒక వైరల్‌ క్లిప్‌లో మాట్లాడుతూ ‘‘మీ నాయకుడు ఎవరు?అని అందరూ మమ్మల్ని అడుగుతున్నారు. మా నాయకుడు ఎవరో కాదు మా నాయకుడు నిరాశ. మా నాయకుడు నిరుద్యోగం. మా నాయకుడు మేమందరం అనుభవిస్తున్న నమ్మక ద్రోహం అని చెబుతున్నాను’’ అని అన్నాడు.

నేపాల్‌ నిరసనలు తొలి రోజుల్లో శాంతియుతంగా జరిగాయి. పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జి చేసి వందలాది మందిని అదుపులోకి తీసుకోవడంతో నిరసనలు తీవ్రతరం అయ్యాయి. హింస చెలరేగింది.

అయితే చాలా మంది నిరసనకారులు హింసాత్మక మలుపును తిరస్కరించారు. స్థానిక టిక్‌టాకర్లు, విద్యార్థి నిర్వాహకులు సంయమనం పాటించాలని కోరారు. యువజనం సమష్టిగా చేసిన ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో, “మనం మన పొరుగువారి ఇంటిని తగలబెడితే, మన ఆగ్రహాన్ని మనమే తగల బెట్టుకున్నవుతుంది. మనల్ని నేరస్థులుగా పిలవడానికి వారికి (ప్రభుత్వానికి) అవకాశం ఇవ్వకండి’’ అని ఉంది. విదేశీ శక్తులు అస్థిరతను ఉపయోగించు కోవడానికి ప్రయత్నించవచ్చు. హింస ఉద్యమం నైతిక స్పష్టతను క్లిష్టతరం చేస్తుంది. అవినీతి, అసమానత, తరతరాల నమ్మకద్రోహంతో అలసి పోయిన సమా జపు మండుతున్న మానసిక స్థితిని ఒకే ఒక విధానం (సోషల్‌ మీడియా నిషేధం) మరింత ఎగదోసింది.

నేపాల్‌లో నిరసన విచ్ఛిన్నమైన రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక తరం తిరుగుబాటు. కఠ్మాండు వీధుల్లో వెల్లువెత్తిన ఆగ్రహం అవినీతి, అసమానతల మధ్య ప్రజాస్వామ్యాన్ని వాగ్దానం చేసి మాట మరిచిన నాయకుల ద్రోహ భావనలో పాతుకుపోయింది.

నేపాల్‌ నేడు సంకేత్మాక పునర్వ్యవస్థీకరణ, నిజమైన సంస్కరణలకు మధ్య ఒక కూడలిలో ఉంది. కొత్తగా అధికార దండం చేపట్టిన నాయకులు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది దేశ సుస్థిరతను, ప్రజాస్వామ్య విశ్వసనీయతను నిర్ణయిస్తుంది.

– జాగృతి డెస్క్‌


రాజీవ్‌ అహానికి నేపాల్‌ నాశనం

అది 1988 డిసెంబర్‌ నెల. అప్పటి భారత ప్రధాని రాజీవ్‌ గాంధీ భార్య సోనియాగాంధీతో కలిసి అధికార పర్యటనలో నేపాల్‌ వెళ్లారు. అక్కడ కఠ్మాండు లోని పశుపతినాథ మందిర దర్శనానికి వెళ్లాలనే కోరికను వెలిబుచ్చారు. ‘‘హిందువైన మీరు నిరభ్యంతరంగా దర్శనం చేసుకోవచ్చు. కానీ క్రైస్తవురాలైన మీ భార్యకు ఆలయ ప్రవేశం కుదరదు’’ అని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.రాజీవ్‌ అప్పటి నేపాల్‌ రాజు బీరేంద్రను అడిగారు. రాజు బీరేంద్ర ఆలయ నియమాలను తాను కూడా అతిక్రమించ లేనని తనను క్షమించమని అన్నారు. భారత్‌ ప్రధాని నేపాల్‌ మీద పగబట్టారు. సర్వనాశనం చెయ్యాలని నిర్ణయించు కున్నారు. రాజీవ్‌ ఢల్లీికి వచ్చిన వెంటనే మన గూఢచారి సంస్థ రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌`ఆర్‌ఏడబ్ల్యూ ద్వారా నేపాల్‌లో రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1989లో జన ఆందోళన్‌ జరిగేట్లు చేశారు. కోల్‌కతా ద్వారా నేపాల్‌కు సరకుల రవాణాను ఆపేశారు. అక్కడి ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీశారు. దేశ రాచరికాన్ని కూల్చేందుకు మావోయిస్టు నాయకుడు ప్రచండకు (అసలు పేరు పుష్ప కమల్‌ దహల్‌) మద్దతు ఇచ్చారు. 1991లో దుర్మరణం చెందారు.సోనియా గాంధీ తన ఇటలీ మాఫియా పద్ధతిలో ఆట మొదలు పెట్టారు. ఆర్‌ఏడబ్ల్యూ ద్వారా ప్రచండకు సహాయం చేశారు. ప్రచండను ఢల్లీిలో తమ రక్షణలో ఉంచుకున్నారు. ఆయన దేశ రాజధానిలో జరిగే సమావేశాలకు మారువేషంలో సైకిల్‌ మీద వచ్చేవారు.

జూన్‌ 1, 2001న యావత్‌ రాజ కుటుంబం అనుమానాస్పదంగా దుర్మరణం చెందింది. యువ రాజు దీపేంద్ర రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య, ఇంకా ఏడు మంది రాజ కుటుంబీకులను కాల్చి చంపి తాను కూడా కాల్చుకొని మరణించారనే కథనం విశ్వవ్యాప్తమైంది. స్కాట్లండ్‌ యార్డు విచారణలో ఆ హత్యలను చూసిన ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆరోజున కొంత మంది ముసుగు వ్యక్తులు రాజ ప్రాసాదంలో కాల్పులు జరిపారు. రాజకుటుంబీకు లతో పాటు వందలాదిగా సిబ్బంది కూడా దుర్మరణం చెందారు. మృతదేహాలను తరలించేందుకు వీలుగా మరుసటి రోజు కర్ఫ్యూ విధించారు.

రాజీవ్‌ గాంధీ, సోనియాల అహంకారానికి ఒక రాజ్యం పతనమైంది. కమ్యూనిస్టుల వశమై అధికారం చైనా తొత్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. నేపాల్‌ చైనాకు బానిసగా మిగిలిపోయింది.

ఇప్పుడు నేపాల్‌ ప్రజలు తమ దేశం మళ్లీ హిందూ రాజ్యం కావాలని ఉద్యమం చేస్తున్నారు. దాని ఫలితమే ఇటీవలి విధ్వంసం. కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం..


చైనా చేతి నుంచి అమెరికా చేతికి…!

జన్‌`జడ్‌ తరహాలో యువతరం చెలరేగి భారతదేశంలో ఓట్‌ చోరీని అరికడతారని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు ప్రకటించడం అంటే అరాచక త్వానికి స్వాగతం పలకడమే. ఈ పరిణామాన్ని రాహుల్‌ గాంధీ ఆశిస్తున్నారు. ఈయనకి తోడు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ కూడా అలాంటి అరాచకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదో యుగళగీతం. పెట్టుబడిదారీ ఆర్థిక విధానానికి ప్రతిక్రియగా సామ్యవాదం వచ్చింది. ఈ రెండు ఇజాలు ప్రజాస్వామ్యాన్ని కాకుండా అంతర్జాతీయ వలసవాదాన్ని నమ్ముకున్నాయి. జీహాదీల వలెనే ఆయుధ విజయాన్ని నమ్ముకున్నాయి. ఇందుకు ఇటీవలి ఉదాహరణలు చైనా, టిబెట్‌, ఉక్రెయిన్‌, బాంగ్లాదేశ్‌లు. ఆసియాలో సీఐఏ తన ఆధిపత్యాన్ని చాటుకుంటు న్నది. మొన్న కొలంబో, నిన్న బాంగ్లా, ఇవ్వాళ నేపాల్‌, రేపు ఇండియా… ఇదీ అమెరికా ప్రణాళిక. ఈ భయంకర వ్యూహంలో భారత ప్రతిపక్ష నాయకుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా వంటి దక్షిణ భారత రాష్ట్రాలను అమెరికా కబళించింది. ఏపీలో ఎవాంజలిజం తీవ్రస్థాయికి చేరింది.

 నేపాల్‌ మొన్నటి వరకూ హిందూదేశం. ప్రచండ, ఓలీ వంటి చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇక భవిష్యత్తు ఏమిటి? చట్టబద్ధంగా ఎన్నికైన నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని రాహుల్‌ గాంధీ రాత్రింబవళ్లు ప్రయత్నిస్తున్నారు. దేశభక్తులలో నైరాశ్యం, నిర్లిప్తత పెరిగేటట్టు చేయడానికి ఇవి చాలు.

సమాజవాద పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఓట్‌ చోరీ కొనసాగిన పక్షంలో నేపాల్‌ అల్లర్లు భారత్‌లో పునరావృత్తం కావాలి అని ఒక ఉన్మాదిలా మాట్లాడారు. అంటే ఏమిటి? అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ సంకల్పం భారత దేశానికి కూడా నిప్పు పెట్టడం. అల్లర్లలో నేపాల్‌ మాజీ ప్రధాని దేవబా భార్య రాజ్యలక్ష్మికి, పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు నిప్పు పెట్టారు. ఈ పనిచేసింది విద్యార్థులేనా? బాలేందుషా అనే 34 సంవత్సరాల యువకుడు చేయించాడు. ఇతడు అర్బన్‌ టెర్రరిస్టు. ‘ఓట్‌ చోర్‌’ పేరుతో భారత ప్రధానిని అక్రమ మార్గాల్లో పదవి నుంచి తొలగించాలనే కుట్ర మొదలయింది. కాబట్టి రాహుల్‌, అఖిలేశ్‌ ఇలాంటి అరాచకత్వాన్ని ఆహ్వానిస్తున్నారా?

ఇక్కడ ఒక తర్కం ఉంది. 15 సంవత్సరాల క్రితం చైనా ప్రచండ అలియాస్‌ భట్టారాయ్‌ అనే పేరు గల ఒక ఉగ్రవాదిని కీలుబొమ్మగా వాడుకొని నేపాల్‌లోని రాజరికాన్ని కూలదోసింది. ఆనాటి నుంచి నేటి ఓలీ శర్మ వరకు వీరంతా చైనా తొత్తులే. ఇప్పుడు అమెరికా చైనా మీద ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నది. ‘మాకీ బూటకపు ప్రజాస్వామ్యం వద్దు. రాజరికం ముద్దు’ అంటున్నారు రాజా జ్ఞానేంద్ర. అమెరికా ఆసియాకు, మధ్య ప్రాచ్యానికి నిప్పు పెట్టి చోద్యం చూస్తున్నది. ఇక డొనాల్డ్‌ ట్రంపు కంపు రాజకీయాలను ఎదిరించే వీరుడే ప్రపంచంలో లేడా? ఇరాక్‌, హైతీ, ఖతార్‌, ఇరాన్‌ పాలకులు హతమై పోయారు. ఉక్రెయిన్‌ను రావణకాష్టంగా మార్చారు. ఇంత జరిగినా కూడా ఇంకా మేం సమ్మాలా విశ్వశాంతి వస్తుందని?

అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ పన్నిన వ్యూహాల ముందు ప్రపంచం చిత్తు అవుతున్నది. రష్యాకు కెేజీబీ అనే సంస్థ ఉంది. మరి భారత్‌ ‘రా’ మాటేమిటి? పాకిస్తాన్‌, నేపాల్‌, బాంగ్లాదేశ్‌, కొలంబో, మణిపూర్‌-ఇట్లా పంచాగ్నిమధ్యంలో భారత్‌ను పడవేసింది సీఐఏ. ఇండియాలో షహీన్‌ బాగ్‌, విద్యార్థులు, ఓట్‌ చోర్‌ ఆందోళనలను సృష్టిం చింది. సంజయ్‌ ఝ, మణిశంకర్‌ అయ్యర్‌, కపిల్‌ సిబాల్‌, డిఎంకె స్టాలిన్‌ వంటి వారిని పావులుగా వాడుకుంటున్నది.

నేపాల్‌లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మాదక ద్రవ్యాల విక్రయం వాడకం, చైనా జోక్యం పెరిగిన మాట వాస్తవమే. సీఐఏ విద్యార్థులను ఇంధనంగా తాజా మారణహోమంలో వాడుకుంది. బాంగ్లా దేశ్‌లో యూనస్‌ పాత్రను నేపాల్‌లో బాలేందు పోషిస్తున్నాడు. అమెరికా, చైనా ప్రపంచ ఆధిపత్యం కోసం సాగిస్తున్న విషక్రీడలో నేపాల్‌, ఖతార్‌, బాంగ్లా, బెలూచీ, సింహళం వంటివి ఇప్పటికే నలిగిపోయాయి. ఇప్పుడు మోడీ, అమిత్‌ షా ఏం చేయనున్నారు?

ఇక్కడ ప్రపంచం గుర్తించని మరొక ముఖ్యమైన అంశం ఉంది. చైనా నేపాల్‌ మాజీ ప్రధాని శర్మను కీలుబొమ్మగా వాడుకుంది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చ గొట్టింది. కరోనా సృష్టించింది చైనా. కాని ఓలీ మాత్రం ‘భారత్‌ నేపాల్‌లోకి కరోనాను తెచ్చి పెట్టింది’ అని ప్రచారం చేశారు. అలాగే చైనా ‘రిజర్వేషన్ల’ పేరుతో బాంగ్లాదేశ్‌లో అల్లర్లు రేపి హసీనాను గద్దె దించింది. నేటి బాంగ్లాదేశ్‌ ఉగ్రవాద ప్రభుత్వం మొత్తం భారత ఈశాన్య రాష్ట్రాలను పేల్చి వేస్తామని బహిరంగంగానే ప్రకటించింది. ఓలీ పతనానికి ఎవరూ కంటతడి పెట్టనక్కరలేదు. కాని పెనం నుండి పొయ్యిలోకి అన్న సామెత చందంగా నేపాల్‌ చైనా గుప్పిట్లో నుండి అమెరికా ఒడిలోకి చేరుతున్నది. పాక్‌, మయన్మార్‌, నేపాల్‌ దేశాల్లో సైనికదళాలదే ఇష్టారాజ్యం.

‘అడవిని నరుకును గొడ్డలి అడవి కొమ్మతోనే దేశమును జయింపవచ్చు దేశీయులతోనే’

జెన్‌ జెడ్‌ ఘంటాఘర్‌ చౌరస్తా వద్ద ‘‘ఓలీ చోర్‌.. గద్దీ ఛోడ్‌’ అంటూ చేసిన నినాదాలు ఆ ప్రాంత మంతటా ప్రతిధ్వనించాయి. వీరు 1998-2012 మధ్య జన్మించినవారు. ‘ప్రచండ జీవితాన్ని అనుభ విస్తుంటే మేము వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నాం’ అని ఆక్రోశించారు. అంటే కమ్యూనిస్టుల నిజస్వరూపం అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడిరది. ఓలీ చైనా ఏజెంటు, భారత్‌ వ్యతిరేకి. డొనాల్డ్‌ ట్రంప్‌ దీనిని వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు.

జెన్‌ జెడ్‌ వెనుక సీిఐఏ ఉంది. వీరి డిమాండ్‌ నేపాల్‌ రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగం రాయడం. కమ్యూనిస్టు పాలనలోని అవినీతిని బహిర్గతం చేయడం. జైళ్ల తలుపులు బద్దలు కొట్టి 1300 మంది కరుడుకట్టిన నేరగాళ్లను విడిపించడం మామూలు విద్యార్థి యువత చేసే పని అని భావించలేం. నిస్సందేహంగా ఇది అమెరికా ఆడిస్తున్న నాటకం. రాజా జ్ఞానేంద్ర నేతృత్వంలో కొంతకాలం క్రితం ‘మాకు ప్రజాస్వామ్యం వద్దు, రాజరికం ముద్దు’ అంటూ ఉద్యమం నడిచిన విషయం జ్ఞాపకం ఉందా?

– ప్రొ. ముదిగొండ శివప్రసాద్‌, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE