ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వశ్చేతి త్రేతయః /అర్ధశాస్త్రం చతుర్ధంతు విద్యా హ్యష్టాదశస్మృతాః
మన దేశంలో 1938లో స్మరణీయ సంఘటన జరిగింది. అది ‘జాతీయ ఆరోగ్యయాత్ర’. ‘గ్రామీణ అభ్యున్నతి’ కోసం 100 మంది వైద్యులు కాలినడకన చేసిన అపురూప యాత్ర ఇది. గాంధీజీ ప్రేరణతో డాక్టర్ ఆచంట లక్ష్మీపతి తన 58వ ఏట ప్రారంభించిన యాత్ర. ఆరోగ్య పరిరక్షణ కోసం గ్రామాలలో సాధారణ సూత్రాలు బోధిస్తూ, ఆహారం, వ్యాయామం, మూలికా తోటల ప్రాముఖ్యత, యోగాసనాల ద్వారా వ్యాయామం, పంచకర్మల ద్వారా (నూనె మసాజ్) ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యకరమైన వంటకాలు, వినియోగంపై మార్గదర్శకాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించడం ఆ యాత్ర ఉద్దేశం.
వైద్యులు స్వచ్ఛంద సేవకులకు ఆయా అంశాల మీద శిక్షణ ఇచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్లేటట్టు చేశారు. పంచశుద్ధి ప్రణాళికను పాటించడం దేహ (శరీరం) ఆహార (ఆహారం) దేశ (పర్యావరణం) మనః (మనసు) ఆశుచి (అపరిశుభ్రత)లను జాగ్రత్తగా కాపాడుకోవడమే ఆ శిక్షణ. 1939లో గాంధీజీ ఆహ్వానంపై సేవాగ్రాంకు వెళ్లారు లక్ష్మీపతి. బొమ్మల ద్వారా ఆరోగ్య ప్రదర్శన, ఆరోగ్యం గురించి గేయాలు, కాపీ, టీలకు బదులు పాలు త్రాగటం వంటి వాటిని ప్రోత్సహించారు. వేర్లు, ఆకులు, దుంపలను మెడికల్ విద్యార్ధులకు సిలబస్‌లో చేర్పించారు. లక్ష్మీపతి కన్యాకుమారి నుండి పెషావర్ వరకు అనేకసార్లు ఆరోగ్య యాత్రను నిర్వహించారు. నాటి భారత రాష్ట్రపతి బాబూరాజేంద్ర ప్రసాద్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ వి.వి.గిరి, మద్దతు నిచ్చారు. ‘శ్రీ లక్ష్మీపతి కృషి వలననే ఆయుర్వేద శాస్త్రమునకు ఇదివరకెన్నడూలేని ఔన్నత్యము కలిగి, ప్రజలకు నికరమైన ఆయుర్వేద ఔషదములు లభించే అవకాశము కలిగినది. జనులను ఎక్కువగా పీడిరచే రుగ్మతలకు అతిసులభమైన వైద్యమును శ్రీలక్ష్మీపతి చేసి చూపించగలిగినారు.’ భిషగ్రత్న డాక్టర్ ఆచంట లక్ష్మీపతి స్వీయ చరిత్రకు (యాన్ ఆటోబయోగ్రఫీ) వీవీ గిరి రాసిన ముందుమాటలో ఈ వాక్యాలు కనిపిస్తాయి. నిజంగానే ఆయుర్వేద ప్రాచుర్యానికి డాక్టర్ లక్ష్మీపతి చేసిన సేవ చరిత్రాత్మకమైనది. వైద్యరంగంలో భారతీయ వారసత్వాన్ని నిలపడానికి జరిగిన కృషి అది.
ఆయుర్వేదం అష్టాదశ విద్యలలో ఒకటి. అతి ప్రాచీనమైనది. అశ్వనీ దేవతలు దేశ వైద్యులని, ఇంద్రాదులకు చికిత్సలు చేశారనీ పురాణాలు చెబుతున్నాయి. చంద్రుడికి ఓషధీశుడని పేరు. వెన్నెల చేత అనేకములైన ఓషధులు వికసించి ప్రజోపయోగ మవుతున్నాయి. సంజీవని అనే ఓషధిని తెచ్చి మూర్చితులైన వానరులకు హనుమ ప్రాణదానం చేశాడు. ఈనాడు కూడా ఆకు పసరుతో విరిగిన ఎముకలను సరిచేసి మహోపకారం చేయడం జగద్విదితమే. ఎందరో రససిద్ధులు ఈ శాస్త్రాభివృద్ధికి కృషి చేశారు. ఆదిముడు, చంద్రసేనుడు, లంకేస్తుడు, విశారదుడు, కపాలి, మత్తుడు మాండవ్యుడు, భాస్కరుడు, శూరసేనుడు, రత్న ఘోషుడు, శంభువు, సాత్వికుడు, నరవాహనుడు, ఇంద్రదుడు, గోముఖుడు, కలంబి, వ్యాడి, నాగార్జునుడు, సురానంద, నాగబోధి, యశోధనుడు, ఖండుడు, కాపాలికుడు, బ్రహ్మ, గోవిందుడు, లంపకుడు, హరి వంటివారు వారిలో ముఖ్యలు.
‘యాన్ ఆటోబయోగ్రఫీ’కి వి.వి. గిరి రాసిన ప్రవేశికలో పైన చెప్పిన మాటలతో పాటు ఇంకా, ‘మన దేశంలో వైద్య వృత్తిని అవలంబింప కోరేవారు దేశంలో వైద్యశాస్త్రం ఏ రీతిని ఉన్నత స్థితిలోనున్నది అనే విషయాన్ని, వైద్యశాస్త్ర చరిత్రను బాగుగా తెలిసికొనుట అత్యవసరము. కొందరు ఆధునిక వైద్యవేత్తల మనస్సులలో దేశీయవైద్య పద్ధతుల యెడలగల కొన్ని అపోహలు పోగొట్టుటకు మార్గము వారీ శాస్త్రమును గూర్చి మిక్కిలి శ్రద్దతో తెలిసి కొనుటయే. మనదేశంలో లక్షలాది జనులకు తగిన వైద్య సౌకర్యము చేకూర్చుటకు వైద్యశాస్త్ర నిపుణులు పాశ్చాత్య వైద్య పద్ధతులను మన ప్రాచీన పద్ధతులనూ సమన్వయ పరిచి ప్రజలకు అనుకూల మైన విధానములను అమలు పరుచుట అత్యవసరము. ఇటువంటి సమన్వయము సిద్ధించుటకు శ్రీ ఆచంట లక్ష్మీపతి స్వీయచరిత్ర మిక్కిలి ఉపయోగపడగలదని నా విశ్వాసము’ అన్నారు. లక్ష్మీపతి అనుభవాలు గొప్పవే. 3.3.1880 నుంచి దాదాపు 4.6.1960 వరకు నాటి పరిస్థితులు ఇందులో ఉన్నాయి.
1903-04 నాటికి ఎమ్.బి.బి.ఎస్.ను ఎల్.ఎమ్.డబ్ల్యు.యస్. (లైసెన్సిసియేట్ ఆఫ్ మెడిసిన్ అండ్ సర్జరీ, యమ్.బి. అండ్ సి.యమ్. అనగా బాచిలర్ ఆఫ్ మెడిసిన్, సి.యమ్. అనగా చిరూజియా మాజిష్టర్ (మాస్టర్ ఆఫ్ సర్జరీ) అని అర్ధము) అనేవారు. అప్పుడు సర్జరీలో అంతకంటే పై చదువు లేదు. ఇప్పుడు యమ్.బి.బి.ఎస్., యమ్.ఎస్. అని విడదీశారు. యమ్.డి.అనగా డాక్టర్ ఆఫ్ మెడిసిన్. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజధానిలో తొమ్మిది లేక పదిమంది మాత్రమే యమ్.డి. పరీక్ష పాసైనవారు ఉండేవారు. పదిమంది వరకు యమ్.బి. అండ్ సి.యమ్‌లు ఉండేవారు. యమ్.బి.సి.యమ్. చదివిన మొదటి ఆంధ్రుడు డా॥ భోగరాజు పట్టాభి సీతా రామయ్య. ఆచంట లక్ష్మీపతి గారు యల్.ఎమ్. సి.యస్. పూర్తిచేసి దివి గోపాలచార్యులు దగ్గర ఆయుర్వేదం నేర్చుకున్నారు. కొడికడుతున్న ఒక మహోన్నత భారతీయ వైద్య శాస్త్రానికి తిరిగి జీవం పోశారు డా॥ లక్ష్మీపతి.
లక్ష్మీపతి మాధవరం, నిడదవోలు దరి, (ప॥గో॥ జిల్లా)లో మార్చి 3, 1880లో జన్మించారు. ఆయుర్వేదానికి చేసిన సేవలకు గుర్తుగా ఆచంట లక్ష్మీపతి యూనిట్ పర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసన్, వాలంటరీ హెల్త్ సర్వీసెస్, చెన్నై. ఆచంట లక్ష్మీపతి న్యూరోసర్జికల్ సెంటర్, వి.హెచ్చ్.ఎస్, చెన్నై వంటి సంస్థలకు వారి పేరు పెట్టారు. ఇంకొన్ని అనుభవాలు తప్పక పరిశీలించాలి.
లక్ష్మీపతి తిరువణ్ణామలై అనుభవం ఇది: రమణ మహర్షికి అనారోగ్యంగా ఉందని తెలిసి లక్ష్మీపతి వైద్యం చేయడానికి వెళ్లారు. అంత జ్వరంలోను గజేంద్ర మోక్షంలోని ‘‘కలడందురు దీనుల యెడ, కలడందురు పరమయోగి గణములపాలన్, కలడందురన్నిదిశలను’’ పద్యం వల్లిస్తున్నారు. ‘ఎందుకయ్యా! అంత కష్టపడుతూ ఆ వచ్చిన పద్యమునే చదువుకుంటారు. మీకు శ్రమ అవుతూ ఉన్నది కొంచెము సేపు ఊరకే ఉండండి’ అన్నాను. అనగానే వారు ‘‘పిల్లవాళ్లు, మీకు ఏమి తెలుసును? నేను ఎట్లాగూ బ్రతకను, అది నాకు బాగా తెలుసును. శ్రవణము, మననము, ధ్యానము అన్నారు. అందుకోసం భగవన్నామమును వినవలెను, విన్నది మననము చేయవలెను. మననము చేసిన దాని గూర్చి ధ్యానించవలెను అన్నారు. మరణ భయమనేది అటువంటి జ్ఞానవంతుల కుండదు. అప్పటికి స్వామి వారికి 85 సంవత్సరాలు దాటినవి.’ ఆ అనుభవంలో ఇంకా ఈ ఘట్టం ఉంది. ‘రమణ మహర్షికి అసాధ్యమగు వ్రణము ఎడమ చేతిపై పుట్టింది. నన్ను సలహా నిమిత్తము పిలిచినారు. శ్రీ మహర్షి గారిని పరీక్షించే సమయములో ఆయన నాతో ఈ క్రింది మాటలు చెప్పినారు. ఆయన ఎప్పుడు తన శరీరాన్ని వాడు`వీడు అని చెప్పుటయే. నా శరీరము అనడు. ‘‘వీడికింకా చికిత్స ఎందుకు? ఈ శరీరముతో కావలసిన పని అంతా అయిపోయినది. పాము కుబుసము విడిచినట్లు దీనితో పని తీరిపోగానే విడిచిపోవలసినదే గాని దానికంత ప్రయత్న మెందుకు?’ అన్నారు. ‘ఉన్నన్నాళ్లు బాధ పడాలి కదా?’ అన్నాను. ఇతరుల తృప్తి కొరకు వైద్యం చేయించుకోవడమే గాని శ్రీ రమణ మహర్షి గారికి యే వైద్యమునందునా ఇష్టము లేదు’’ అని రాశారు లక్ష్మీపతి.
ఈ అనుభవం గమనించండి! ‘చెన్నపట్నంలో చేతినిండా పనియుండి, ఆదాయము కూడా బాగానే వుండేది. చింతాద్రిపేటలో స్వామి నాయకవీధిలో 58వ నెంబర్ ఇంట్లో ఆపరేషన్ ధియేటర్ తయారుచేసి రోజూ మూడు, నాలుగు ఆపరేషన్‌లు చేసేవారము. బోద కాళ్ళు, బుడ్డలు, కడుపు కోసే ఆంధ్రవృద్ధి వగైరా, క్యాన్సర్ ఆపరేషన్ కూడా ఇక్కడే చేసేవారు. ఒకరోజు అయ్యదేవర కాళేశ్వర్రావు గారి మేనల్లుడు తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు పేరు లక్ష్మణరావు, ఇతర పిల్లలు గూటీబిళ్ల ఆడుతూ వుంటే ఆ బిళ్ల వచ్చి కంటిలో గుచ్చుకొని కన్నుచితికి పోయింది. ఆ పిల్లవాణ్ణి తిన్నగా మా ఇంటికి తీసుకువచ్చారు. నాకు అదే మొదటి కంటి ఆపరేషన్. కన్ను ఆసుపత్రికి పంపితే కన్ను తీసేస్తారు. నేను వైద్యం చేసి క్లోరోపారమ్ ఇచ్చి కన్ను తీసివేయకుండా కన్ను శుభ్రం చేసి కడిగి దూదివేసి మూసి కట్టు వేశాను, నా అదృష్టం బాగున్నది. కట్టు విప్పి చూడగా కన్ను చక్కగా అతుక్కుని వున్నది. ఆ పిల్లవాని తల్లి సంతోషంతో ‘‘మీకు నేను ఏమీ ఇయ్యలేను. మా పిల్లవాడు పెద్దయి ఉద్యోగం చేసినప్పుడు మొదటి నెల జీతం నీకే ఇస్తానన్నది’’ ఆ పిల్లవాడే ఇప్పుడు డా॥కె.ఎల్. రావు. నేటి కేంద్ర ఇరిగేషన్ మంత్రి ‘న వైద్య: ప్రభురాయుషు:’ వైద్యుడు రోగములు కుదుర్చుట రోగుల బాధలను తొలగించుటకే అధికారం కలదు కాని, ఆయుసుకు అధికారి కాదని స్పష్టము చేస్తున్నది.’
ఇదొక మంచి అనుభవం: డాక్టర్ లక్ష్మీపతి మద్రాసు వైద్య కళాశాలలో వుండగా డా॥ ఎల్లా ప్రగడ సుబ్బారావు అనారోగ్యానికి గురయ్యారు. ఆకలి లేదు, పేలవంగా జీర్ణ సామర్ధ్యం, ఉదరంలో మంట, విరోచనాలు, డా॥గురుస్వామి మొదలియార్ పేరు మోసిన వైద్యుడు. ఆయన వైద్యం చేశారు. కానీ గుణం కనిపించలేదు. ఆపై లక్ష్మీపతి ఆయుర్వేద వైద్యం చేశారు. ముఖ్యంగా వెన్నతో పాలు, కొన్ని ఆయుర్వేద ఔషదములు ఉపయోగించారు. గుణం కన్పించింది. కామెర్లు తగ్గించడానికి వెన్నపాలు, మిరియాలు, కొన్ని ఆయుర్వేద మూలికలు వాడి తగ్గించగలిగారు. తరువాత సుబ్బారావు గారు యు.ఎస్.ఎ. వెళ్లి గొప్ప పరిశోధనా శాస్త్రవేత్త అయ్యారు.
లక్ష్మీపతి నాయకత్వ లక్షణాలు అనేక విజయాలను తెచ్చిపెట్టాయి. ఆల్ ఇండియా ఆయుర్వేద వైద్య సంఘం అధ్యక్షులుగా రెండుసార్లు, ఆల్ ఇండియా ఆయుర్వేద మహా సమ్మేళన్‌కు రెండుసార్లు అధ్యక్షులుగా (బికనీర్ 1933, కాన్పూర్ 1947) పనిచేశారు. ఉస్మాన్ కమిటీ మెంబరుగా (1920-1924) ఉన్నారు. తన గురువు దివి గోపాలాచార్యులచే ప్రారంభించిన ధన్వంతరీ పత్రికకు సంపాదకులుగా గురువుగారి మరణానంతరం కొనసాగారు. ఆయుర్వేద కళాశాలకు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు తీసుకున్నారు. సుమారు 64 పుస్తకాలు రాశారు. వీరి ‘చలిజ్వరం’ బాగా ప్రాచుర్యం పొందిన గ్రంథం. ప్రఖ్యాత వైద్యునిగానే గాక సంఘసేవకునిగా, జాతీయవాదిగా, సేవలందించిన డా॥ ఆచంట లక్ష్మీపతిగారు ఆగస్టు 6, 1962 న పరమపదించారు.
భారతదేశ మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు ఆచంట లక్ష్మీపతిని ఆయుర్వేదానికి మారుపేరుగా ‘‘అల్లోపతి, హోమియోపతి, లక్ష్మీపతి’’ అని ప్రియంగా సంబోధించేవారు.
మూలం:
- రసౌషద విజ్ఞానము బై డా॥ ఆచంట లక్ష్మీపతి పేజీ`3,2 (ముందు మాట)
- సంచిక (తెలుగు సాహిత్యవేదిక) ఉప్పు సత్యాగ్రహంలో అరెస్టయిన తొలి మహిళ శ్రీమతి తిరుమల రుక్మిణీలక్ష్మీపతి బై పుటి నాగలక్ష్మి తేది.6.12.2020.
- Journal of Ayurveda and intergrative Medicine Vol. 3 No. 3 July, 2012. Satya N. Dornala, Snehalatha. S.N. Dornala.
- మిసిమి సెప్టెంబర్ 2013, ఆయుర్వేదం – ఆత్మకధ బై డా॥ ఆచంట లక్ష్మీపతి పేజీ.31-39.
– డా. కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు