సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి – 22 సెప్టెంబర్ 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
చరిత్ర పునరావృత్తమవుతుందన్నది నిత్యసత్యం. చరిత్ర ప్రతీకారం కూడా తీర్చుకో గలదన్నది నవీన సత్యం కాబోలు. ముస్లిం వలసలతో చాప కింద నీరులా, పచ్చగడ్డిలో పాముల్లా పాశ్చాత్య ప్రపంచంలో సాగిపోతున్న పరిణామాల సారం ఇంతేననిపిస్తున్నది. సెప్టెంబర్ 13వ తేదీన లండన్ వీధులలో మార్మోగిన నినాదం అంతరార్థం అదే కూడా. ఇప్పుడు బలంగా వినిపించిన ‘మా దేశాన్ని మాకు ఇవ్వండి!’ అన్న నినాదం ఒక దశాబ్దకాలంగా ఇంగ్లండ్‌లో రూపుదిద్దుకుంటున్నది. దేశాన్ని ఎవరి నుంచి ఇవ్వాలి? ముస్లింల నుంచి. వలసదారుల పేరుతో దేశంలోకి చొరబడి తమ ఆచార వ్యవహారాలను ధ్వంసం చేస్తున్నవారి నుంచి. ఇది ఆందోళనకారుల డిమాండ్.
యునైటెడ్ కింగ్‌డమ్‌ను ఏకం చేయండి, మా దేశాన్ని మాకు ఇవ్వండి అంటూ లండన్‌లో లక్ష గళార్చన జరిగింది. వ్యాపారం పేరిట, పడవల మీద దేశానికి వచ్చి తిష్ట వేస్తూ, దేశీయుల అవకాశాలను, ఆర్థిక వనరులను దోచు కుంటున్న వారిని ఆపండి అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఉద్యమకారులు. చరిత్ర విని నవ్విపోయే నినాదమిది. ఈస్టిండియా కంపెనీల పేరుతో ఫ్రాన్స్, పోర్చుగీస్, ఇంగ్లండ్ అలా ప్రపంచం మీద పడి దోచుకున్నవే. తురుష్కులు కానిస్టాంట్‌నోపెల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత సముద్రమార్గాలు కనుగొని, తూర్పు దేశాలకు వచ్చారు. వాళ్లు సాగిన మార్గమంతా విధ్వంసమే. వారు వ్యాపారం పేరుతో అడుగుపెట్టిన దేశాలు తమదైన ఆత్మ తమ ముందే క్షీణించి పోతుంటే ప్రేక్షక పాత్ర వహించవలసి వచ్చింది. ఎన్ని జాతులు, ఎన్ని సంస్కృతులు, ఎన్ని భాషలు, ఎన్ని కళలు, ఎన్ని విలువలు, ఎంత విజ్ఞానశాస్త్రం ఆ కంపెనీల పదఘట్టనల కింద నిస్సహాయంగా కన్నుమూశాయో చరిత్రకు తెలుసు. ఇప్పుడు ఈ చేదు అనుభవం బ్రిటన్ అనే ఆ వలసవాద దేశానికే ఎదురైంది. నిజానికి చరిత్ర ఆ దేశానికి మేలే చేసింది. ఆ కంపెనీల ఆధునిక దృక్పథంలోని కుట్రను అర్థ్ధం చేసుకోవడానికి నాడు మనకు శతాబ్దాలు పట్టింది. కానీ కొన్ని దశాబ్దాలలోనే ఇంగ్లండ్ ముస్లిం వలసదారులతో ప్రమాదాన్ని పసిగట్టగలింది. 17,18,19 శతాబ్దాలలో వారు ఏం చేశారో, అదే ఇప్పుడు ముస్లిం వలస రూపంలో పునరావృత్తమైంది. వెంటనే తలకెక్కింది. ఇంగ్లండ్‌కు ఇలాంటి గుణ పాఠం అవసరమేనని చాలామంది భావిస్తున్నప్పటికీ, పక్క ఇల్లు కాలుతుంటే కర్తవ్యాన్ని గ్రహించడంలో విజ్ఞత, విచక్షణ అనివార్యమన్న వాస్తవిక దృష్టి ఇప్పుడు తప్పదు.
సెప్టెంబర్ 13 నాటి ఆ భారీ నిరసన ప్రదర్శన అక్షరాలా ఇస్లామీకరణకు వ్యతిరేకంగా జరిగినదే. దీనికి నాయకత్వం వహించినవారు టామీ రాబిన్సన్. అసలు పేరు స్టీఫెన్ యాక్లిస్ లెన్నాన్, పత్రికా రచయిత. లక్ష మంది నుంచి లక్షన్నర వరకు హాజరైనట్టు లెక్కలు ఉన్న ఈ ప్రదర్శన బ్రిటన్ చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు కూడా అంగీకరించారని వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రపంచ కోటీశ్వరుడు ఎలాన్ మస్క్, ఫ్రాన్స్‌కు చెందిన ఎరిక్ జెమ్మర్, వలస చట్టాలకు వ్యతిరేకంగా జర్మనీలో పోరాడు తున్న పీటర్ బైస్ట్రోన్ కూడా ఉద్రేక పూరిత ప్రసంగాలే చేశారు. గడచిన దశాబ్దకాలంగా ఇంగ్లండ్ ఇస్లామిక్ వలసదారులతో పడుతున్న అవస్థలు, అవమానాలు ఇక చాలునని, స్టార్మర్ ప్రభుత్వం మీద తిరగబడండి అన్న స్థాయిలోనే ప్రసంగించారు. బ్రిటిష్ పౌరునిగా ఉండడం తనకు గర్వకారణమేనని, కానీ దేశం తమ కళ్ల ముందే నాశనమవుతున్నదని మస్క్ నిష్కర్షగా ప్రకటించారు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టు చిన్న కోతతో మొదలయిన ఈ వలసలు ఇప్పుడు భారీ స్థాయిలో, అక్రమ మార్గాలలో దేశాన్ని కమ్మేస్తున్నాయని మస్క్ చెప్పారు. ఈ వలసలు ఇలాగే కొనసాగితే మీరు హింస కోరుకోకపోయినా దానికి బలికాక తప్పదనే ఆయన శషభిషలు లేకుండా చెప్పారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నవి రెండే మార్గాలు. ఒకటి పోరాడడం. రెండు చనిపోవడమే అని కూడా తేల్చేశారు. అసలు ఐరోపా దేశాలను ఇప్పుడు వలసదారులు భర్తీ చేస్తున్న వాస్తవాన్ని అంతా గుర్తించాలని వక్తలు కరాఖండీగా పేర్కొనడం విశేషం. వాళ్లని వెనక్కి పంపండి, మా దేశాన్ని మాకు ఇవ్వండి అంటూ వక్తలు, ప్రదర్శకులు నినదించడం తీవ్రమైన అంశమే. ఈ ప్రదర్శనకు వ్యతిరేకంగా ఉదారవాదుల ప్రదర్శనను కూడా పోలీసులు అనుమతించారు. అంటే విభజించి పాలించు లక్షణం వాళ్ల రక్తం నుంచి పోలేదు. జాత్యహంకార వ్యతిరేక పోరాటం పేరుతో ఉదారవాదులు పోటీ ప్రదర్శన నిర్వహించారు. వలసలను ఆపడం అమానుషమని వీరి అభిప్రాయం. దీనితో గొడవలు, అరెస్టులు తప్పలేదు.
కొన్ని గణాంకాలు చూస్తే టామీ రాబిన్సన్ ఆందోళనలోని వాస్తవాలను గుర్తించక తప్పదు. ఆ దేశ అధికారిక లెక్క ప్రకారమే 2024 చివరికి 5,15,697 మంది శరణార్థులు ఉన్నారు. వీరు అధికారికంగా వచ్చినవారు. అక్రమంగా వచ్చి, తరువాత దరఖాస్తు చేసుకుని, శరణార్థి హోదా కోసం తిష్ట వేసినవాళ్లు మరొక 1,24,841 మంది. కానీ అటు ఇటుగా వీళ్ల సంఖ్య 10-15 లక్షలన్నదే ఎక్కువ మంది అభిప్రాయం. కొన్నిచోట్ల స్థానికులకంటే, వలసదారులే ఎక్కువయ్యా రన్నది ఆందోళనకారుల ఆరోపణ. ఆఫ్రికా, పాకిస్తాన్ ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చినవాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. స్థానికులనే చులకనగా చూస్తున్నారు. వలసదారులకు రెడ్ కార్పెట్ పరిచి, హోటళ్లలో ఆశ్రయం కల్పిస్తూ, ఆర్థిక వనరులను వృథా చేయడం ఎందుకన్నదే తీవ్ర జాతీయవాదుల ప్రశ్న. పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్‌ల పేరుతో వలసవచ్చిన వాళ్లే దాదాపు రెండున్నర లక్షల మంది ఇంగ్లిష్ బాలికల మీద వివిధ నేరాలకు పాల్పడ్డారు. ఈ వలసలు, ఈ రెడ్ కార్పెట్ ఆతిథ్యాలు ఇలాగే కొనసాగితే, ముస్లింలకో దేశం అన్న నినాదం వినిపించి తీరుతుంది. ఇదే ప్రదర్శకుల అసలు గుబులు కావచ్చు.