సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు ఆశ్వీయుజ శుద్ధ సప్తమి – 29 సెప్టెంబర్‌ 2025, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఈ తరం భారతీయులకి విశ్వావసు విజయదశమి ఓ అపురూప జ్ఞాపకం. మిగిలిన మన జీవితకాలాన్ని మాత్రమే కాదు, జాతి భవిష్యత్తును సైతం ప్రభావితం చేయగల చారిత్రక సందర్భం కూడా. విజయం అంటే హిందువుల దృష్టిలో ఏమిటో, అందులోని సానుకూల దృక్పథాన్ని వారు ఏ విధంగా దర్శిస్తారో చెబుతుంది ఈ పండుగ. ఇంత తాత్త్వికత కలిగిన విజయదశమి అనే పండుగను ఏటా జరుపుకునే భారతజాతి వేయేళ్లు అపజయం అనే తిమిరంతో రాజీపడి, దానికే అలవాటు పడి జీవించడమే చరిత్రలో పెద్ద వైచిత్రి. పెను విషాదం. అది గుర్తించేటట్టు చేసిన సంస్థ, తిమిరంతో సమరం చేయడం నేర్పి, విజయం సాధించేటట్టు చేసిన సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌). ఆ మహోన్నత సంస్థ శతాబ్ది పండుగను ఈ విజయదశమి తనతో తెచ్చింది. అందుకే ఈ విజయదశమి సాధారణ పండుగ కాదు. జాతిని రోమాంచితం చేసే, ప్రతి భారతీయుడి గుండెను జ్వలింపచేసే సందర్భం.

 విజయదశమి కావచ్చు, మరొక హిందూ పండుగ కావచ్చు. చెడు మీద మంచి సాధించిన విజయాన్ని సూచిస్తాయి. కానీ చెడు ప్రభావం ఎంతవరకు తగ్గింది? భారతీయ సమాజం మొత్తంగా చరిత్ర నుంచి ఏం నేర్చుకున్నది? ఈ ప్రశ్నల ఆధారంగానే ఆత్మవిస్మృతి నుంచి భారతీయుడిని విముక్తం చేసే గొప్ప ప్రయత్నం చేపట్టిన ఏకైక సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. సంఘసేవ, దేశం పట్ల అచంచలమైన భక్తి ఆ సంస్థకు అనితర సాధ్యమైన స్థానాన్ని సంతరించిపెట్టాయి. ఇది కొన్ని లక్షల మంది త్యాగం, కొన్ని కోట్ల మంది మరొకసారి ఐక్యతా మంత్రాన్ని నమ్మిన ఫలితం.

పశుత్వంపై మానవత్వం, అసురత్వంపై దైవత్వం, చెడు మీద మంచి సాధించిన విజయ సందేశమే విజయదశమి. ప్రతియుగంలో ప్రత్యేకతను సంతరించుకున్న పుణ్యదినం. ఆధునిక భారతదేశంలో హిందూధర్మ పరిరక్షణ కోసం, జాతిని జాగృత పరచేందుకు సరిగ్గా నూరేళ్ల క్రితం విజయదశమి నాడు ఆవిర్భవించిన ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖోపశాఖలుగా పరిఢవిల్లుతూ లక్ష్యసాధనలో అప్రతిహతంగా సాగుతోంది. హిందూ సమాజ పునరుజ్జీవానికి, హిందూధర్మ పరిరక్షణకు మూలస్కంధంగా నిలిచింది. శ్రీమహాకాళి స్వస్వరూపంగా అహరహం కృషిచేస్తోంది. ఆ ప్రస్థానంలో సమాజంతో కలసి ఎన్నో విజయాలు లిఖించుకొంది. ‘అయోధ్య’ భవ్యమందిరం నిర్మాణం మూడేళ్ల క్రితం సాకారం కావడం అందుకు తిరుగులేని నిదర్శనం.

మరోవంక వర్తమాన సమాజంలోనూ ‘మానవ’ అసురగణం పేట్రేగి పోతోంది. సృష్టిలోని దానవత్వమంతా తమలోనే మూర్తీభవింప చేసుకొన్నట్లు మహిషుని వారసులు పుట్టుకొస్తున్నారు. వారిలోని రాక్షస లక్షణాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి, చూపుతున్నాయి. విధాన నిర్ణేతలు భారీ అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకు పోతున్నారు. కటకటాల వెనుక నుంచే ఏలాలనుకుంటున్నారు. వాక్‌ స్వాతంత్య్రం దుర్వినియోగం తారస్థాయిలో ఉంది. వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడి, ముఖ్యంగా రాజకీయంగా ఏ మాత్రం ప్రమేయం లేనివారిని కించపరచిన రచ్చకీడ్చడం హక్కుగా చలామణి అవుతోంది. అలాంటి వారి దృష్టిలో దేశ ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులైనా, వీధి బిచ్చగాడైనా ఒక్కటే. చట్టసభల్లో అభ్యంతకర వ్యాఖ్యలు, చేష్టలు విస్తుగొలిపే పరిణామాలు.

మనిషి ఒకవంక భూమ్యాకాశాలను ఏకం చేసేలా అనన్య విజయాలు సాధిస్తున్నా, మరోపక్క అనుచిత చర్యలు నిరాటంకంగా సాగుతూనే ఉన్నాయి. ప్రకృతి వనరులను చెరబడుతున్నాడు. చెరువులు మాయమవుతున్నాయి. ఫలితంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. కాలుష్యం కాటేస్తోంది. స్వయం కృతా పరాధాలు, మానవ తప్పిదాలతో నగరాలు, పుణ్యక్షేత్రాలూ చిన్నపాటి వానకే నీటిపై తేలుతున్నాయి. ప్రకృతిలో తానూ ఒక భాగమని, శరీరంలోని ఒక అవయవా నికి కలిగే హాని ప్రభావం ఇతర ఈ అవయవాల మీద పడుతుందనే స్పృహ కోల్పోతున్నాడు. కన్నవారే కాదు, వావివరుసలు పట్టడంలేదు. శిక్షల నుంచి తప్పించుకునేందుకు చట్టాలలోని లొసుగులు, లోపాలు, వెసులుబాట్లు చుట్టాలవు తున్నాయి. కరోనా మహమ్మారి లోకాన్ని మోకాళ్లపై కూర్చోపెట్టినా,ప్రకృతి వైపరీత్యాలు అతలాకుతలం చేస్తున్నా మనిషి తీరు మారడం లేదు.

ఒకనాడు జాతీయ జీవనంలో శ్రద్ధా కేంద్రాలుగా విలసిల్లిన గుడి,బడి భజన మండపాలు, ప్రార్థనా మందిరాల లక్ష్యం దెబ్బతింటోది. అవి వ్యాపార వనరులై విలువలు కరిగి పోతున్నాయి. నాగరికత పేరుతో ఆహార విహారాదుల్లో ఎంతో మార్పు. వృద్ధాశ్రమాల ఉనికి పెరిగిపోతోంది. ‘జననీ జన్మభూమిశ్చ….’ అనే శ్రీరామ ప్రబోధం మసకబారుతోంది. స్వదేశీయులుగా చెప్పుకుంటున్న వారే విదేశీగడ్డపై మాతృభూమిని, భారతమాతను చులకన చేస్తున్నారు. ఏ కొద్ది శాతమో ఉన్న దైవీయ గుణసంపన్నులు, సాధుజీవులు కూడా దానవ గుంపుల మధ్య సహజీవనం చేయవలసిన దుస్థితి.

 పంచభూతాలు, చెట్లు, పశుపక్ష్యాదుల్లోనూ దైవత్వాన్ని దర్శించడం హిందూ జీవన విధానం. సృష్టి (ప్రకృతి) నుంచి ఏదైనా ప్రతిఫలం పొంది నప్పుడు కృతజ్ఞతగా పూజలు నిర్వహించడం మన మౌలిక దృష్టికోణం. ప్రకృతి అస్థిత్వమే ప్రశ్నార్థక మవుతున్న వేళ పూజాదికాలకు ఆస్కారం ఎక్కడ? సమాజాన్ని నిలబెట్టేది ధర్మం. దానికి హాని ప్రయత్నాలూ సత్యం. పరులకు హాని కలిగించ యినా పబ్బం గడుపుకోవాలనుకోవడం పాపకార్యమనే హితవు మసకబారింది. తమ రాజ్యాన్ని తాను ఏలుకోవాలనే స్పృహ మొద్దుబారి సర్వం సహా చక్ర వర్తులుగా మెలగాలన్న దుర్యోధనాది ఏలికల దుగ్ధ ఈ యుగంలోని నేటి అగ్రరాజ్యాలకు సోకుతోంది. దేవయుగంలో విజృంభించిన మహిషాసుర, శుంభనిశుంభుల మనస్తత్వాలను మించినవారు, ధార్తరాష్ట్రులను మించిన దౌర్జన్య పథగాములు స్వైరవిహారం చేస్తున్నారు. వీరిని జయించగల అనుపమశక్తి, శ్రీరాముని మించిన పరాక్రమం, విజయుడిని మించిన వీరత్వం, చారిత్రక పురుషులను మించిన శౌర్య సాహసాలు అత్యంత అవసరం అనిపిస్తోంది. ధర్మానికి హాని కలిగినప్పుడు ధర్మరక్షణకు తనను తానే సృష్టించుకుంటానని శ్రీకృష్ణభగవానుడు (భగవద్గీత 4:7), దానవజాతి విజృంభణతో వివిధ అవతారాలతో తుదముట్టిస్తానని దేవీభగవతి (దుర్గాసప్తశతి-11:55) అభయ మిచ్చారు. అన్నట్లే చేశారు. ఈ ఆధునిక భారతంలో అసుర మనస్తత్వాల అణచివేతకు వారు ఏయే రూపాలలో ఉదయించారో.! ఉదయిస్తారో..! అంతకు ముందుగా, నాడు మహిషాసుర మర్దన కోసం దేవీయ శక్తులన్నీ మహాకాళిగా ఏకరూపం దాల్చినట్లు నేటి దానవగుణ నిర్మూలనకు సమాజ హితైషులు ఒక్కటి కావలసిన తరుణమిది.

అందుకోసమే దేశం ఆర్‌ఎస్‌ఎస్‌ వైపు చూస్తున్నది. స్వయంసేవకులూ అకుంఠిత దీక్షతో సాగడానికి సిద్ధంగానూ ఉన్నారు. జాతీయ స్పృహ, స్వదేశీ, పంచ పరివర్త నలతో ఇక ముందూ సంఘం ముందుకు సాగుతూనే ఉండాలని జాతి ఆకాంక్షిస్తు న్నది. వాటిలోనే చరిత్ర ఇచ్చి వెళ్లిన సమస్యలకు పరిష్కారాలనే కాదు, భవిష్యత్తును భవ్యంగా నిర్మించే మార్గదర్శకత్వాన్ని కూడా జాతి వీక్షిస్తున్నది. విజయదశమి వంటి పండుగలోని పరమార్థమే ఆర్‌ఎస్‌ఎస్‌ స్ఫూర్తి. మన చరిత్ర పాఠాలే చోదకశక్తి. భారత్‌ను విశ్వగురు స్థానంలో నిలబెట్టాలన్నదే భవిష్యత్తుకు ఆదర్శం. యావన్మందికి సంఘ శతాబ్ది శుభాకాంక్షలు.

భారత్‌ మాతాజీ జై!

About Author

By editor

Twitter
YOUTUBE