సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి వచ్చిన సెంట్రల్‌ జీఎస్టీ (సీజీఎస్టీ) రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌జీఎస్టీ రేట్లను నోటిఫై చేయాల్సి ఉంది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. సెప్టెంబర్‌ 3వ తేదీన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జీఎస్టీ పన్ను రేట్ల సవరణలపై కొన్ని కీలక సిఫారసులు చేసింది. ముఖ్యంగా సామాన్యులు, మధ్యతరగతి వారికి వెసులుబాటు కలిగించే రీతిలో, మరింత సులువుగా వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు వీలుగా ఈ మార్పులు అవసరమని పేర్కొంది. దీంతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం మనదేశ దిగుమతులపై 50శాతం సుంకాలు విధించడానికి నిర్ణయించడం కూడా ఈ జీఎస్టీ పన్ను తగ్గింపునకు మరో కారణం. కాగా నోటిఫికేషన్‌ జారీచేయడం ద్వారా కేంద్రం వివిధ ఉత్పత్తులకు వర్తించే రేట్లపై ఒక స్పష్టత ఇచ్చినట్లయింది.

ప్రస్తుతం నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లు 22వ తేదీ నుంచి రెండు శ్లాబులుగా ఉన్నాయి. నిత్యావసర వస్తువులు, సేవలకు 5%, ప్రామాణిక రేటు 18%తో పాటు విలాసవంత మైన వస్తువులపై 40% వరకు జీఎస్టీ విధిస్తారు. అంటే ఇప్పటివరకు అమల్లో ఉన్న జీఎస్టీ పన్నులో 12%, 18% స్లాబులను కేంద్రం తొలగించింది. నోటిఫి కేషన్‌లో చాలా మటుకు ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గుతున్నందువల్ల ఈ ప్రయోజనాలను ఉత్పత్తిదారులు వినియోగదార్లకు బదలాయించాల్సి ఉంది.

వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం

దాదాపు 90శాతం ఉత్పత్తులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించడం వల్ల వినియోగదారులకు ధరల పరంగా ప్రత్యక్ష ప్రయోజనం కలుగనుంది.దాదాపు అన్ని ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడంతో, సామాన్యు లకు కొంత ఊరట లభించనుంది. ధరలు తగ్గడంవల్ల ఆహార ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగి ఈ రంగంలో పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశముందని అంచనా. ఫలితంగా ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయి. దేశీయ ఉత్పత్తులకు మరింత విలువ చేకూరి, ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుంది. తయారీరంగానికి ప్రధానంగా జరిగే మేలు ఇది. ధరలు అన్ని వర్గాలకు ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులోకి రావడంవల్ల ఆదాయం పెరుగు తుంది. ఒకేరకమైన వస్తువులను ఒకే స్లాబు పరిధిలోకి తీసుకురావడంవల్ల వివాదాలు, లిటిగేషన్ల సమస్యలు ఉత్పన్నం కావు. తేలిగ్గా అమలుపరచడానికి, లిటిగేషన్లకు తక్కువ ఆస్కారం, ఈజ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఈ సంస్కరణలు వీలుగా ఉండటంవల్ల మరింత సమర్థవంతమైన రీతిలో మైత్రీపూర్వక పన్ను వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వ అంచనా. ముఖ్యంగా డిమాండ్‌ పరంగా ఉన్న సవాళ్లను పరిష్కరించడంలో ఈ పన్ను సంస్కరణలు దోహద పడతాయని ఆర్థిక నిపుణుల అభిప్రాయం. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడంవల్ల, సామాన్యుల ఖర్చు తగ్గి, వినియోగపరంగా మరింత ఖర్చుచేసే సామర్థ్యం పెరుగుతుంది. ఇది ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే ప్రక్రియ. ముఖ్యంగా ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన వస్తువుల ధరలు తగ్గడం వల్ల దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు కొనుగోళ్ల విషయంలో మరింత వెసులుబాటు కలుగుతుంది. ఇది ఈ వర్గం ప్రజల్లో వినియోగం పెరగడానికి దోహదం చేస్తుంది. అదీకాకుండా ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో, ఈ విధంగా వినియోగం పెరగడం దేశానికి ఆర్థిక దన్నుగా నిలవగలదు. ముఖ్యంగా అమెరికా మన ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌ల కారణంగా కలిగే ఆర్థిక లోటును ఇది భర్తీ చేస్తుంది కూడా! అంతేకాదు దీర్ఘకాలంలో ఆర్థిక సామర్థ్య నిర్మాణానికి, స్వయంసమృద్ధికి దోహదం చేయగలదు. మరో 12-15 నెలల కాలంలో వినియోగ మార్కెట్‌ తేరుకుంటుందని కూడా ఆర్థిక నిపుణుల అంచనా. జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో వినియోగం 40-50 బేస్‌ పాయింట్లు పెరిగి, విదేశాలనుంచి ముఖ్యంగా అమెరికా నుంచి ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిళ్లనుంచి ఉపశమనం కలిగే అవకాశముందని కూడా భావిస్తున్నారు. ఇక వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి తమ లాభాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. ఈవిధంగా వినియోగం పెరగడం కార్పొరేట్‌ రంగానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాల కంటే 1%-1.5% వరకు వృద్ధి నమోదు చేసే అవకాశముందని కొందరు ఆర్థిక నిపుణుల విశ్లేషణ. అంతేకాదు ఇటువంటి ప్రోత్సా హకర వాతావరణంలో ప్రైవేటు సంస్థలు మరింత అధికంగా మూలధన పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశాలు మెరుగు పడతాయి. ఇదే సమయంలో ఎగుమతుల విషయంలో భయాందో ళనలు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఇక జీఎస్టీ తగ్గింపు వల్ల వచ్చే 4-6 త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధికి అదనంగా 100-120 బేసిక్‌ పాయింట్లు కలిసే అవకాశముందన్న అంచనాలున్నాయి. దీనివల్ల యు.ఎస్‌. విధిస్తున్న టారిఫ్‌ల వల్ల కలిగే ప్రతికూల ప్రభావం నుంచి చాలావరకు బయటపడవచ్చు.

విత్తలోటుపై ప్రభావం

ఆహారం, కూరగాయల విషయానికి వస్తే వీటి ద్రవ్యోల్బణ వృద్ధి రేటు మందగించే అవకాశా లున్నాయి. 2025`26 వినియోగ ద్రవ్యోల్బణం 30 బేసిక్‌ పాయింట్ల వరకు వెసులుబాటు కలగవొచ్చు. ఫలితంగా సంవత్సరం మొత్తం మీద సగటు వినియోగదారు ధరల సూచీ` సీపీఐ 22.7% నమోదయ్యే అవకాశముంది. జీఎస్టీ తగ్గింపువల్ల రూ.48వేల కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఇది విత్తలోటుపై ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట! ముఖ్యంగా ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల 2025-26 ఆర్థిక సంవత్సరంలో విత్తలోటు లక్ష్యం 4.4శాతాన్ని మించిపోవచ్చని అంచనా. అయితే అధిక ఆర్బీఐ డివిడెండ్‌, చమురు మార్కెటింగ్‌ కంపెనీలపై ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించే ఆదాయం వంటివి జీఎస్టీ ఆదాయ నష్టాన్ని పూడ్చడానికి దోహద పడగలవు.

Government launches GST reward scheme in 6 states, UTs; Rs 30 crore corpus  for prize money - Times of India

జీఎస్టీ తగ్గే రంగాలు

జీఎస్టీ తగ్గే రంగాలీవిధంగా ఉన్నాయి. ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌పై 18% నుంచి 5 శాతానికి, రూమ్‌ ఎయిర్‌ కండిషనర్లు, 32 అంగుళాల కంటే ఎక్కువ సైజు టీవీలు, డిష్‌వాషర్స్‌ వంటి దీర్ఘకాలం మన్నే వినియోగ వస్తువులకు 28% నుంచి 18శాతానికి, ఆటోమోబైల్స్‌ ముఖ్యంగా వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాలు (350సిసి సామర్థ్యం కంటే తక్కువ), త్రిచక్ర వాహనాలపై 28% నుంచి 18శాతానికి, ట్రాక్టర్లపై 12% నుంచి 5శాతానికి, చిన్నకార్లపై 28-31% నుంచి 18 శాతానికి, సిమెంట్‌పై 28% నుంచి 18శాతానికి, పునరుత్పాదక పరికరాలు (సౌర, పవన ఇంధన సెల్స్‌)పై 12% నుంచి 5శాతానికి జీఎస్టీని కేంద్రం తగ్గించింది. బీమారంగం (జీవిత, రిటైల్‌)పై 18% నుంచి 0శాతానికి, ఫ్యాబ్రిక్స్‌, హోమ్‌ టెక్స్‌టైల్స్‌, చేతితో తయారీ దారంపై 12% నుంచి 5 శాతానికి తగ్గించగా, రూ.2500 కంటే ఎక్కువ ధర గల రెడిమేడ్‌ దుస్తులు, క్లాతింగ్‌ యాక్సిసరీస్‌లపై 12% నుంచి 18శాతానికి, చమురు అన్వేషణ (ఆఫ్‌ షోర్‌ అన్వేషణ)పై 12% నుంచి 18శాతానికి జీఎస్టీని ప్రభుత్వం పెంచింది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని 18% నుంచి 40%కు కేంద్రం పెంచింది.

ఆహారశుద్ధి రంగానికి ప్రయోజనం

జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రధానంగా లాభపడేది ఆహార శుద్ధి (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) రంగం. ఎందుకంటే ఈ రంగంలోని దాదాపు 90శాతం ఉత్పత్తుల జీఎస్టీ పన్ను 5శాతానికి తగ్గించడమే. ముఖ్యంగా ఎఫ్‌ఎం సీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాల అమ్మకాలు జోరందుకుంటాయని అంచనా. ఈ రంగంలో అంత్య ఉత్పత్తులకంటే, ఉత్పాదకాలపై ఎక్కువ పన్ను విధింపువల్ల విలువల శృంఖలాలు (వ్యాల్యూ ఛైన్‌) మరింత బలోపేతం కాగలవు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు)లకు లిక్విడిటీ పెరగడం వల్ల, నిర్వహణ మూలధన (వర్కింగ్‌ కేపిటల్‌) సమస్యల నుంచి బయటపడడమే కాదు, దేశీయ విలువ జోడిరపు (డీఏవీ`ఒక ఉత్పత్తి సేవయొక్క తుది ధరలో భాగం)ను ప్రోత్సహిస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదం చేస్తుంది. పన్ను రేటు కోతతో పాటు, విధానపరమైన సంస్కరణలకు కూడా జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం తెలపడంతో రిజిస్ట్రేషన్‌, రిటర్న్‌ల పైలింగ్‌, తిరిగి చెల్లింపు యంత్రాంగం వంటివి లిటిగేషన్లను చాలావరకు నిరోధిస్తాయి. మొత్తంమీద చెప్పాలంటే తయారీ రంగానికి ఈ జీఎస్టీ రేట్ల సవరణ అత్యధిక ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది.

జీఎస్టీ కథా కమామీషూ…

వస్తు సేవల పన్ను (గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌`జీఎస్టీ) అనేది పరోక్ష పన్ను. 2017 జూలై 1కి ముందు దేశంలో అమల్లో ఉన్న వ్యాట్‌, సేవల పన్ను, సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్‌ వంటి వివిధ రకాల పరోక్ష పన్నుల స్థానంలో కేంద్రం దీన్ని అమల్లోకి తెచ్చింది. కొన్ని రాష్ట్ర పన్నులను మినహాయిస్తే దాదాపు అన్ని పన్నులు ఇందులో సమ్మిళితమై ఉన్నాయి. వివిధ ఉత్పత్తి దశల్లో దీన్ని విధించినప్పటికీ, అన్ని దశల్లో వివిధ పార్టీలకు తిరిగి చెల్లించే విధానం ఇందులో అమల్లో ఉంది. ఉత్పత్తి దశలో కాకుండా, వినియోగ స్థాయిలో విధించడం ఈ పన్ను ప్రత్యేకత. అంతకుముందు పన్నుల విధింపు ఉత్పత్తి దశలో కొనసాగేది. ఇప్పటివరకు జీఎస్టీని ఐదు స్లాబుల్లో అంటే 0%, 5%, 12%, 18%, 40% ప్రభుత్వం వసూలు చేస్తోంది. అయితే పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కాహాలిక్‌ బేవరేజెస్‌, విద్యుత్‌ వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రాలేదు. వీటిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా పన్నులు విధిస్తున్నాయి. అదేవిధంగా ముడి విలువ రాళ్లు, పాక్షిక విలువైన రాళ్లపై 0.25%, బంగారంపై 3% పన్ను విడిగా రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. ఇవి కాకుండా సోడాజలం, విలాసవంతమైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై 22 శాతం అదనపు సెస్‌ లేదా 28% జీఎస్టీ విధింపు అమల్లో ఉంది. జీఎస్టీకి ముందు చాలా వస్తువులపై సగటున 26.5% పన్ను విధింపు ఉండగా, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత చాలా వస్తువులు 18% పన్ను పరిధిలోకి వచ్చినట్లు అంచనా. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీ పన్ను విధింపు అమల్లోకి వచ్చింది. 2017 జూలై 1న ఈ పన్ను అమల్లోకి రావడంతో, ఏటా జూలై 1వ తేదీని ‘‘జీఎస్టీ డే’’గా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ విధంగా కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వేర్వేరు రకాల పన్నుల స్థానంలో జీఎస్టీ రూపంలో ఒకే పన్ను విధానం అమల్లోకి వచ్చింది. దేశంలో జీఎస్టీ బిల్లింగ్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం, “ఇన్‌వాయిస్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’’ (మేరా బిల్‌ మేరా అధికార్‌)ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమల్లోకి తెచ్చింది. వినియోగదార్లు తాము కొనుగోలు చేసిన వస్తువులపై బిల్లును అడిగే హక్కును ఈ పథకం ప్రోత్సహించింది. జీఎస్టీ రేట్లు, విధివిధానాలను జీఎస్టీ కౌన్సిల్‌ నియంత్రిస్తుంది. ఈ కౌన్సిల్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి, వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. దేశ ఆర్థిక ప్రగతిని మరింత వేగవంతం చేసి 3.8 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంగా ఈ జీఎస్టీని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అయితే దీని అమలులో కొన్ని సానుకూలతలతో పాటు మరికొన్ని విమర్శలు కూడా ఎదుర్కొనాల్సి వచ్చింది. సానుకూల పరిణామాల్లో ప్రధానంగా చెప్పుకో వాల్సింది, అంతర్‌ రాష్ట్ర ప్రయాణం కాలం 20% వరకు పడిపోవడం. వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌ల వద్ద పడిగాపులు పడే అవసరం లేకపోవడంతో వాణిజ్య వాహనాల ప్రయాణకాలం తగ్గి జీడీపీ వృద్ధికి ఎంతో దోహదం చేసింది.

పన్ను సంస్కరణలు ప్రారంభం

1986లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన వి.పి.సింగ్‌ మొట్టమొదటిసారి మాడిఫైడ్‌ వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ (ఎంఓవీడీఏటీ) ప్రవేశపెట్టడంతో దేశంలో పన్ను సంస్కరణల శకం ప్రారంభమైంది. తర్వాత పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో, ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌తో కలిసి రాష్ట్ర స్థాయిలో వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ (వీఏటీ) అమలు విషయంలో వివిధ రాష్ట్రాలతో చర్చలు మొదలుపెట్టారు. ఆ తర్వాత 1999లో ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి తన ఆర్థిక సలహా సంఘ సభ్యులతో (ఈ ఆర్థిక సలహాసంఘంలో ముగ్గురు మాజీ ఆర్బీఐ గవర్నర్లు ఐ.జి. పటేల్‌, బిమల్‌ జలాన్‌, సి. రంగరాజన్‌ సభ్యులు) చర్చలు జరిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లో ఉండాలన్న లక్ష్యంతో ‘‘వస్తు సేవల పన్ను’’ (గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌) విధింపునకు ఆమోదించారు. ఇందులో భాగంగా ఆయన పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి అసీమ్‌ దాస్‌గుప్తా నేతృత్వంలో ఒక కమిటీని నియమించి జీఎస్‌టీ నమూనాకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. తర్వాత ఈ కమిటీ దేశవ్యాప్తంగా పన్ను విధింపు నమూనాకు సంబంధించి నివేదికను సమర్పించింది. 2002లో అప్పటి ప్రధాని వాజపేయి పన్నుల సంస్కరణల కోసం విజయ్‌ కేల్కర్‌ నేతృత్వంలో ఒక కమిటీని నియ మించారు. 2005లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. 12వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు జీఎస్టీని దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చునని సిఫారసు చేసింది. 2004 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఓటమి పాలై, యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇందులో ఆర్థిక మంత్రిగా పనిచేసిన పి.చిదంబరం 2006 ఫిబ్రవరి నుంచి జీఎస్టీపై ముందుకెళ్లడానికి నిర్ణయించి, 2010, ఏప్రిల్‌ నాటికి అమల్లోకి తేవాలని ప్రతిపాదించారు. 2011లో పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం ఓటమిపాలై, మమతా బెనర్జీ నాయకత్వం లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో, అప్పటి వరకు జీఎస్టీ కమిటీకి నాయకత్వం వహిస్తున్న అసీమ్‌ దాస్‌గుప్తా రాజీనామా చేశారు. అప్పటికి జీఎస్టీకి సంబంధించి 80% పని పూర్తయిందని ఆయన ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వెల్లడిరచారు. 2011 మార్చి 11న యూపీఏ ప్రభుత్వం జీఎస్టీకి సంబంధించి 115వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తీవ్ర వాగ్వాదాల మధ్య ఈ బిల్లును యశ్వంత్‌ సిన్హా నేతృత్వంలోని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు. 2013 ఆగస్టులో ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. అయితే అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ బిల్లు ప్రతిపాదన నిరవధికంగా వాయిదాపడిరది. కేవలం నరేంద్రమోడీ కారణంగానే ఈ బిల్లు అమల్లోకి రాకుండా పోయిందని అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్‌ రమేష్‌ విమర్శించారు.

ఎట్టకేలకు పార్లమెంట్‌ ఆమోదం

2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 15వ లోక్‌సభ రద్దు కావడంతో, ఈ బిల్లును తిరిగి ప్రవేశ పెట్టాలని స్టాండిరగ్‌ కమిటీ చేసిన సిపారసు కూడా రద్దయింది. నరేంద్రమోదీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ జీఎస్టీ బిల్లును మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2017 ఏప్రిల్‌ 1 నాటికి జీఎస్టీని అమల్లోకి తేవాలని ఆయన మరో గడువును ప్రతిపాదించారు. 2016 మే నెలలో జీఎస్టీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. అయితే బిల్లులో పేర్కొన్న కొన్ని అంశాలపై విభేదించిన కాంగ్రెస్‌ ఈ బిల్లును రాజ్యసభ సెలక్ట్‌ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్‌ చేసింది. ఎట్టకేలకు 2016 ఆగస్టులో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంతో ‘‘101 రాజ్యాంగ సవరణ చట్టం`2016′ పేరుతో అమల్లోకి వచ్చింది. తర్వాత 15 నుంచి 20 రోజుల్లోగా 18 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించడంతో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ బిల్లుపై సంతకం చేశారు.

తర్వాత ప్రతిపాదిత జీఎస్టీ చట్టాలను పరిశీ లించేందుకు 21 మంది సభ్యులతో కూడిన ఒక సెలక్ట్‌ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ జీఎస్టీ కౌన్సిల్‌ ‘‘కేంద్ర వస్తుసేవల పన్ను చట్టం`2017’కు (సీజీఎస్టీ బిల్లు) ఆమోదం తెలిపిన తర్వాత ‘‘ఇంటి గ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ బిల్‌`2017′ (ఐజీఎస్టీ బిల్లు), ది యూనియన్‌ టెరిటరీ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ బిల్‌`2017 (యూటీజీఎస్టీ` 2017), గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (కాంపెన్సేషన్‌ టు ది స్టేట్స్‌) బిల్లు`2017లను 2017 మార్చి 29న లోక్‌సభ ఆమోదించింది. 2017, ఏప్రిల్‌ 6న ఈ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాయి. 2017 ఏప్రిల్‌ 12న చట్టరూపం దాల్చాయి. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలు, వాటికి సంబంధించిన స్టేట్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ బిల్లులను (సీజీఎస్టీ)లను ఆమోదిం చాయి. ఈ విధివిధానాలన్నీ పూర్తయ్యాక ఎట్టకేలకు 2017, జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఇక జమ్ము`కశ్మీర్‌కు సంబంధించిన జీఎస్టీ బిల్లు 2017, జూలై 7న ఆమోదం పొందింది. దీంతో దేశవ్యాప్తంగా ఒకే రకమైన పరోక్ష పన్ను చట్టం జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అయితే సెక్యూరిటీల కొనుగోళ్లు, అమ్మకాలపై జీఎస్టీని విధించలేదు. వీటిపై ‘‘సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ)’’ కొనసాగుతోంది.

సీజీఎస్టీ కేంద్ర ప్రభుత్వ పన్నును ఒక రాష్ట్రంలో జరిపే అమ్మకాలు, కొనుగోళ్లపై వసూలు చేస్తారు. ఎస్‌జీఎస్టీ దీన్ని రాష్ట్ర ప్రభుత్వాల పన్ను. ఒక రాష్ట్రంలో జరిగే అమ్మకాలు, కొనుగోళ్లపై వసూలు చేస్తారు. ఐజీఎస్‌టీని ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువు మరొక రాష్ట్రం వారు కొనుగోలు చేసినప్పుడు విధిస్తారు. దీని చెల్లింపు ద్వారా ఆయా రాష్ట్రాల సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. యూజీఎస్టీ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించింది. ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిపే అమ్మకాలు, కొనుగోళ్లపై విధించే పరోక్ష పన్ను ఇది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత  కేంద్రం చాలాసార్లు ఇందులో సవరణలు చేసింది. 2023, మే 10న చేసిన సవరణ ప్రకారం ప్రస్తుతం జీఎస్టీ అమలు చేస్తున్నారు.

హెచ్‌ఎన్‌ఎస్‌ కోడ్‌

హార్మొనైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ నామిన్‌క్లేచర్‌ (హెచ్‌ఎన్‌ఎస్‌) కోడ్‌ను మనదేశంలో జీఎస్టీ కింద వస్తువులను వర్గీకరించడానికి ఉపయోగిస్తారు. వరల్డ్‌ కస్టమ్స్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యుసీఓ)లో భారత్‌ 1971 నుంచి సభ్యురాలిగా కొనసాగుతోంది. కస్టమ్స్‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌ కోసం వస్తువుల వర్గీకరణ నిమిత్తం ఆరు అంకెలతో కూడిన హెచ్‌ఎన్‌ఎస్‌ కోడ్‌ను ఉపయోగిస్తారు. తర్వాత సెంట్రల్‌ ఎక్సైజ్‌ దీనికి మరో రెండు అంకెలు కలిపి మొతం ఎనిమిది అంకెలతో కూడిన వర్గీకరణగా మార్చింది. జీఎస్టీని క్రమబద్ధీకరించడం, ప్రపంచవ్యాప్తంగా ఆమో దించేందుకు ఈ చర్య తీసుకున్నారు.

విమర్శలు

అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, పరిశ్రమలు, మీడియాలోని ఒక వర్గం, విపక్షపార్టీలు జీఎస్టీని విమర్శించాయి. ముఖ్యంగా జీఎస్టీ అత్యంత సంక్లిష్టం గా ఉన్నదని, ఇతరదేశాల్లో అమల్లో ఉన్న జీఎస్టీతో పోలిస్తే ఇది లోపభూయిష్టంగా ఉన్నదనేది వీరి విమర్శల్లో ప్రధానాంశం. ముఖ్యంగా 115 దేశాలతో పోల్చినప్పుడు 28% పన్ను రెండో అత్యధిక స్థానంలో ఉండటం గమనార్హం. ట్యాక్స్‌ రిఫండ్‌లో కొనసాగు తున్న విపరీత జాప్యం, డాక్యుమెంటేషన్‌లో నెలకొన్న సంక్లిష్టతపై వాణిజ్యవర్గాలు విమర్శిస్తున్నాయి. ఇక విపక్ష కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అయితే దీన్ని ‘‘గబ్బర్‌సింగ్‌’’ చట్టం అంటూ ఎద్దేవా చేయడం గమనార్హం. జీఎస్టీలో నెలకొన్న సంక్లిష్టతల కారణంగా దేశంలో 2,30,000 చిన్న వ్యాపారాలు మూతపడ్డా యన్నది ఒక అంచనా! ‘‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’’ సంస్థ, సర్క్యులర్‌ ఎకానమీ కంటే వినియోగాన్ని ప్రోత్సహించేదిగా ఉన్నదంటూ జీఎస్టీని విమర్శించింది. ముఖ్యంగా ఈ వ్యవస్థలో ఉన్న సంక్లిష్టత వ్యాపారాభివృద్ధికి, సర్క్యులారిటీకి దోహదం చేసేదిగా లేదన్నది ఈ సంస్థ చేస్తున్న ప్రధాన విమర్శ!

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE