అక్టోబర్ 2 విజయ దశమి
ఇతర పండుగలు సాధారణంగా ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటాయి. విజయదశమి వాటికి భిన్నంగా మనలో బహుముఖంగా ప్రేరణ కలిగించేలా ఉంటుంది.మన పురాణాలలోనూ, చరిత్రలోనూ ఈ పర్వదినం నాడు సంభవించిన ఘట్టాలే అందుకు కారణంగా పెద్దలు చెబుతారు. దశ శిరస్సులు గల రావణుడిని రాముడు సంహరించినందున ‘దశహరా’ (‘దశ(కంఠ)హార’), ‘దసరా’ అని పేర్లు వచ్చాయని చెబుతారు. ‘దశ(కంఠ)హార’ అనే పేరే దసరాగా పరిణమించిందని కొందరి భావన.. నిత్యం విజయాలు కలగాలని ఆకాంక్షించే వారికి ‘విజయదశమి’ వేగుచుక్క లాంటిది.
విజయదశమి అనగానే అనేక కథలు,గాథలు తవ్వుకొని వస్తాయి. అర్థవంతం,స్ఫూర్తిమంతమైన విశేషాలు సాక్షాత్కరిస్తాయి. విజయదశమి ప్రధానంగా రాక్షస (మహిషాసురుడు) సంహారానికి సంబంధించి నదే అయినా, దశమి పండుగ కథలు, గాథలు ఎన్నో దివ్య సందేశాలను అందిస్తాయి.
మహిషాసురుడు అమరత్వం కోసం బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. అమరత్వం తప్ప మరేదైనా కోరుకొమ్మని బ్రహ్మఅన్నప్పుడు మహిళ చేతిలో మరణాన్ని కాంక్షిం చాడు. అబల వల్ల తనకేమీ ముప్పులేదన్న ధీమాతో ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టసాగాడు. దేవేంద్రు డిని ఓడిరచి దేవలోకాధిపతి అయ్యాడు. దేవతా గణం ఆదిశక్తిని ఆశ్రయించింది. త్రిమూర్తులు, సకల దేవతల తేజస్సు నుంచి ‘దశభుజ సహస్రేణ సమన్తా ద్యాప్య సంస్థితాం’ అన్నట్లు వేయి చేతులతో దిగంతా లకు వ్యాపించి సింహవాహిని అవతరించింది. కామరూపధారి మహిషుడితో తొమ్మిదినాళ్లు పోరాడి అంతంచేసింది.
అందుకే ఉపాసకులు, భక్తులు తొమ్మిది రోజులు శ్రద్ధాసక్తులతో అమ్మవారిని ఆరాధిస్తారు. ‘కుమారీ పూజ’ పేరుతో 2-10 సంవత్సరాల మధ్యవయస్సు గల బాలికలను ‘అమ్మ’కు ప్రతిరూపంగా పూజించి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. రెండేళ్ల వయసు గల శిశువును కుమారిఅని, మూడేళ్ల చిన్నారిని త్రిమూర్తి, నాలుగేళ్ల పాపను కల్యాణి, అయిదేళ్ల బాలికను రోహిణి, అరేళ్ల బాలికను కాళిక, ఏడేళ్ల బాలికను చండిక, ఎనిమిదేళ్ల బాలికను శాంభవి, తొమ్మిదేళ్ల బాలికను దుర్గ, పదేళ్ల బాలికను సుభద్ర అని వ్యవహరిస్తారు.
మహర్నమి పూజ తరువాత సాయంత్రం దశమి తిథి ఉన్నప్పుడు విజయదశమిని ఆచరిస్తారు. ఆ రోజు నక్షత్రోదయ వేళను ‘విజయ ముహూర్తం’గా వ్యవహరి స్తారు. ఆ సమయాన్ని ‘సర్వకామార్థ సాధకం’అని చింతామణికారుడు వ్యాఖ్యానించాడు. ఆ సమయంలో ప్రారంభించే పనులు జయప్రదమవుతాయని విశ్వాసం. విజయదశమి వీరుల పండుగ కూడా. ఆనాడు ఆయుధాలను పూజిస్తారు. వర్తమానంలో ఆయుధాలు అంటే కేవలం అస్త్రశస్త్రాలే కాదు. ఆయా వృత్తుల వారి పరికరాలు కూడా. (అప్పట్లో చక్ర వర్తులు, రాజులు ఆయుధ పూజ చేసి జ్తైత్రయాత్రలు ఆరంభించేవారు కనుక ఆ పేరు ప్రధానంగా స్థిర పడిరది) జైత్రయాత్రలకు విజయదశమి సుమూ హుర్తంగా ఉండేదట. వేదపండితులతో వేదపారా యణం చేయించేవారు. దీనినే ‘వేదసభ’ అంటారు.
క్షీరసాగర మథóనంలో ఉద్భవించిన శమీ (జమ్మి) వృక్షంలో అపరాజితదేవి కొలువై ఉంటుందని, దశమి నాడు ఆ చెట్టును పూజించడం వల్ల లక్మ్షీదేవి ప్రసన్న మవుతుందంటారు. రావణవధకు ముందు, వధానం తరం అయోధ్యకు వెళ్లబోయే ముందు శ్రీరాముడు శమీ వృక్షాన్ని, అపరాజిత దేవిని అర్చించాడని పురాణగాథ. పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను ఈ వృక్షంపై భద్రపరిచారని భారతం చెబుతోంది. అపరాజితా దేవిని అర్చించి ‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ/అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ’ అని ప్రదక్షిణలు చేస్తే శనిదోషాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ చెట్టు ఆకులను ‘బంగారం‘గా వ్యవహారిస్తారు. పూర్వం రఘుమహారాజు కోసం కుబేరుడు జమ్మి చెట్టుపై బంగారు వాన కురిపించాడట. అందుకే జమ్మి పూజానంతరం దాని ఆకులు సేకరించి బంగారంగా బంధుమిత్రులకు పంచుతూ పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు.
దసరా వేడుకలకు ఘన చరిత్ర ఉంది. విజయ నగరం రాజులు హంపీలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారట. ఆ సామ్రాజ్య పతనం తరువాత మైసూర్ మహారాజాలు (వడయార్ రాజవంశీయులు) వీటిని అందిపుచ్చుకున్నారు. వారు 17వ శతాబ్ది తొలినాళ్లలో ఈ ఉత్సవాలను శ్రీరంగపట్టణంలో నిర్వహించేవారని, మూడవ కృష్ణరాజ వడయార్ హయాంలో(1805నుంచి)ఇవి మైసూరుకు మారాయి.
దేవరగట్టు ఉత్సవం
విజయదశమి నాడు వివిధ ప్రాంతాలలో జరుపుకునే ఉత్సవాలలో విలక్షణమైనది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ‘దేవరగట్టు కర్రల సమరం’ (దేవరగట్టు ఉత్సవం) ఆ రోజు రాత్రి కాగడాల వెలుగులో జరుపుకునే దీనిని ‘బన్నిఉత్సవం’ అనీ అంటారు. ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం, ‘త్రేతా యుగంలో మణి, మల్లాసురులనే రాక్షసుల బాధలు భరించలేని మునులు పార్వతీ పరమేశ్వరులను శరణువేడగా, రాక్షస సంహారానికి ఆదిదంపతులు మాల, మల్లేశ్వరులుగా అవతరించారు. అయితే దేవమానవుల వల్ల పొంచిఉన్న ముప్పు నుంచి తమను కాపాడాలంటూ రాక్షసులు అప్పటికే శివుడిని ఆశ్రయించి వరం పొందారు. దీనితో శివపార్వతులు దేవమానవులుగా కాకుండా భైరవరూపంలో తొమ్మిది రోజులు పోరాడి దానవులను సంహరించారు. భైరవమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా గుర్తించిన రాక్షసులు, తమకు ముక్తిని ప్రసాదించాలని, విజయ దశమి నాడు పిడికెడు మానవ రక్తమైనా సమర్పించేలా చూడాలని వేడుకున్నారట. అప్పటినుంచి ఈ ‘సమరం’ సాగుతూ వస్తోందని కథనం. ఆ ప్రాంత చుట్టుపక్కల గ్రామాల వారు ఇనుప వృత్తాలు తొడిగిన కర్రలు చేతబూని ‘స్వామి ఉత్సవం తమదంటే తమది’ అంటూ పరస్పరం అడ్డుకుంటారు. ఈ క్రమంలో తలలు పగిలినా వెనుకంజవేయరు. ఉత్సవ విగ్రహా లను ఊరేగించిన తరువాత ఒక భక్తుడు తొడకోసి పిడికెడు రక్తాన్ని ధారపోసి, అనంతరం ఆలయానికి చేరి భవిష్యవాణి వినిపిస్తారు. వర్తమానంలో ఇది వింతగా అనిపించినా, ‘ఇది ఆచారంగా వస్తున్న ఆరా ధనే కానీ ఆటవికం కాదు’ అని స్థానికులు చెబుతారు.
– డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్