‘శ్రీమహావిష్ణువు క్షీరసాగర మథనంలో ధన్వంతరిగా అమృతకలశంతో ఉద్భవించాడు. విషమనే వ్యాధులకు అమృతమనే ఆరోగ్యంతో సమస్త లోకాలను సంరక్షిస్తూ ఆయుర్వేద ఆది దైవంగా పూజలందుకొంటున్నాడు’ అంటుంది శ్రీమద్భాగవతం.
ఆయుర్వేదం గురించి చరక సంహిత రమణీయ పౌరాణిక గాథ చెబుతుంది. ప్రాచీన కాలంలో అప్పుడప్పుడే ప్రారంభమౌతున్న వ్యాధుల వలన నిత్యనైమిత్తికాది ధర్మకార్యాలు నిర్వర్తించలేక కొంతమంది వ్యథ చెందుతున్నారు (అప్పటి వరకు వ్యాధులు లేవు, వైద్యులూ లేరు). వాటిని నివారించ డానికి అంగీరస, జమదగ్ని, వశిష్ఠ, కాశ్యప, భృగు, ఆత్రేయ, భరద్వాజ వంటి 53 మందికి పైగా మహర్షులు హిమవత్ పర్వతం దగ్గర సమావేశమై నారు. వ్యాధుల నివారణ ఆయుర్వేదంతో సాధ్యమని జ్ఞానదృష్టితో గ్రహించారు. అలాంటి ఆయుర్వేదం బ్రహ్మదేవుని ద్వారా దక్షప్రజాపతికి, వారి నుండి అశ్వనీ దేవతలకు, అక్కడ నుండి ఇంద్రుని దగ్గరకు చేరినట్టు తెలుసుకొన్నారు. వారిలో ఉత్కృష్ట తపఃశక్తి కల్గిన భరద్వాజ మహర్షి సశరీరంతో ఇంద్రుని వద్దకు వెళ్లి ఆయుర్వేదం గ్రహించి వచ్చి, మహర్షులందరికి యథాతథంగా అందించాడు. వెనువెంటనే రుషు లందరు శిష్యులతో ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేం దుకు జనపదాలలో సంచారం ప్రారంభించారు.
ఆత్రేయ మహర్షి కూడా అగ్నివేశాది ఆరుగురు శిష్యులతో వైద్యసేవ చేస్తూ శిష్యులకు శిక్షణనిస్తూ సంచారం చేస్తున్నాడు. సునిశిత బుద్ది కుశలత కల్గిన అగ్నివేశుడు గురువు బోధనలు, సంభాషణలు, నిర్వ హించిన సభలు, చర్చలు యథాతథంగా గ్రంథస్థం చేశాడు. అదే ‘అగ్నివేశ తంత్రం’. తరువాతి కాలంలో చరక మహర్షి దీనిని సంస్కరించినందున ‘‘చరక సంహిత’’గ జగత్ ప్రసిద్ధిపొంది ప్రామాణిక గ్రంథంగా అవతరించింది. వేయి సంవత్సరాల క్రిందటే, గ్రీసు, టిబెట్, అరబ్బి, పార్శి భాషలలోకి ఈ గ్రంథం అనువదించుకున్నారు. దేశభాషలన్నిటితో పాటు లాటిన్, ఆంగ్లం, జర్మన్, చైనీస్ భాషలలోకి తర్జుమా అయింది.
తరువాత కాలంలో అపర ధన్వంతరిగా కాశీ పట్టణంలో అవతరించిన వాడే దివోదాసు. ఆయన శస్త్ర వైధ్య పారంగతుడు. అతని కడపటి శిష్యుడు సుశ్రుతుడు. ‘సుశ్రుత సంహిత’ రచించాడు. ఇది శస్త్ర చికిత్సలో మొదటి ప్రామాణిక గ్రంథం. తదుపరి సిద్ధ నాగార్జనుడు ‘ఉత్తర తంత్రం’ రచించి సుశ్రుత సంహితను సంపూర్ణ గ్రంథంగా సంస్కరించాడు. చైనా, అరబిక్, లాటిన్, జపాన్, ఆంగ్ల భాషలలోకి దీనిని అనువదించుకున్నారు.
తరువాత వాగ్భటుడు అనే కవి, వైయాకరణుడు, వైద్యుడు, చరక సుశ్రుతాది గ్రంథాలలోని విషయా లను క్రమబద్ధం చేసి, క్రొత్తవి జోడిరచి ‘అష్టాంగ హృదయం’ రచించాడు. వివిధ వృత్తాలతో, మనోహర శైలిలో, సుబోధకంగా, ధారణాయోగ్యంగా, కంఠస్థం చేయదగు సూత్రాలతో ఇది ప్రమాణ గ్రంథమై అంతట ఖ్యాతి పొందింది.
చరక సంహిత (8 స్థానాలు 120 అధ్యాయాలు), సుశ్రుత సంహిత (6 స్థానాలు 186 అధ్యాయాలు) అష్టాంగ హృదయం (6 స్థానాలు 120 అధ్యాయాలు) ఈ మూడు ‘వృద్ధత్రయం’ పేరుతో పిలుచుకునే మొదటి ప్రమాణ గ్రంథాలు. కాలక్రమేణ దేశమంతట వైద్యులు, పండితులు, యోగులు, సిద్ధులు క్రొత్త ఆవిష్కరణలతో వందలాది గ్రంథాల రచన కొనసాగించారు. వాటిలో మాధవకరుని ‘మాధవ నిదానం’, ‘శారంగధర సంహిత’, భావమిశ్రుని ‘భావ ప్రకాశ్’ లఘుత్రయం పేరుతో ఉన్న ప్రమాణ గ్రంథాలు.
వేలాది సంవత్సరాల పూర్వమే నలంద, తక్షశిల, విదర్భ, కాశి మొదలైన పట్టణాలు గొప్ప విద్యాకేంద్రా లలో అనేక శాస్త్రాలతోపాటు ఆయుర్వేద (చికిత్సా శాస్త్ర) బోధన ఉండేది. తక్షశిల విశ్వవిద్యాలయం అష్టాంగ (కాయ, బాల, గ్రహ, ఊర్ద్వాంగ, శల్య, దంష్ట్ర, జర, వృష) చికిత్సా శాస్త్ర బోధనకు పేరుపొం దింది. అష్టాంగ ఆయుర్వేదాచార్యుడిగా ఖండాంతర ఖ్యాతి నార్జించిన జీవకుడు ప్రధానాచార్యుడుగా ఉంటూ బుద్ధభగవానునికి రాజవైద్యుడిగా నియమితు డైనాడు.
మౌర్యచంద్రగుప్తుడు, అశోకుడు, కనిష్కుడి నుండి విజయనగర ప్రభువుల వరకు అన్ని జనపదాల (నగరాలు, పట్టణాల)తో వైద్య పాఠశాలలు, చికిత్సా కేంద్రాలు, ప్రసూతి గృహాలు, జ్యోతిషం, సంగీతం, కథలు, పురాణాలు, మనోధైర్యం కలిగించు నేర్పరితనం కలిగిన వైద్యులు, పరిచారకు లను నియమించి ఉచిత వైద్యం అందరికి అందుబాటులో ఉంచి ఆరోగ్యదానం పుణ్యకార్యంగా భావించేవారు.
యావద్దేశంలో వేలాది తెలుగునాట వందలాది శిలా, తామ్ర శాసనముల ద్వారా 11వ శతాబ్దము నుండి 16వ శతాబ్దము వరకు వైద్యులు, వైద్య శాలలు, ఔషధాలు ప్రజారోగ్య రక్షణలో అత్యున్నత స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది.
క్రీ.శ 1,2 శతాబ్దాలలో ఈజిప్ట్, గ్రీసు, బాగ్దాద్‌ల వరకు ఆయుర్వేదం విస్తరించింది. ముఖ్యంగా బాగ్దాదు నగరంలో ఖలీఫాలు భారతదేశం నుండి వైద్యులు, పండితులను రప్పించి అంతర్జాతీయ వైజ్ఞానిక కేంద్రాలు, చికిత్సాకేంద్రాలు నడిపించారు. 10వ శతాబ్దములో మంగోలుల దండయాత్రలతో ఆ సంస్కృతి, అరేబియా విజ్ఞానం ధ్వంసమైనాయి.
క్రీ.శ. 12వ శతాబ్దం నుండి భారతదేశంపై విదేశీ దురాక్రమణదారుల దండయాత్రలతో ధర్మ సంస్కృతుల విధ్వంసాల పరంపర ప్రారంభమై మొగలుల ఆక్రమణలతో తీవ్రమైంది. ఆయుర్వేద వైద్యులను కొంత ఆదరించినప్పటికి ఔరంగజేబు లాంటి పరమత ద్వేషులు హైందవధర్మం, ఆయు ర్వేదం నాశనం చేయడమే ధ్యేయంగా పరిపాలన సాగించారు. యునాని వైద్యానికి ప్రాధాన్యతనిచ్చి పోషించారు.
తరువాత కాలంలో వచ్చిన ఆంగ్లేయులు అవసర నిమిత్తం కొద్దిమంది ఆయుర్వేద వైద్యులకు బిరుదు లిచ్చినప్పటికి ఆంగ్ల వైద్య కళాశాలలు, వైద్యశాలలు రాజాదరణతో నిర్వహించి ఆయుర్వేదానికి గుర్తింపు లేకుండా చేశారు. పైగా ఆయుర్వేదం పట్ల దురభిప్రాయం, ఆంగ్ల వైద్యం మీద ఆకర్షణ పెంచే రీతిలో ప్రచారం చేసారు. అలా వందల సంవత్స రాలుగా ఆయుర్వేద ప్రాభవం మసకబారిపోయింది.
దేశంలో జాతీయవైద్యశాస్త్ర (ఆయుర్వేద) పునర్వైభవ యజ్ఞంలో ఎందరో పరంపరాగత వైద్యులు, పండితులు, వైజ్ఞానికులు ఆ జీవనపర్యంతం కఠోరమైన కృషి చేసారు. వారిలో కొందరు: కవిరాజ్ గంగాధరరాయ్(1798`1885 తూర్పు బెంగాల్), పండిత్ శంకర్ దాజి పడే శాస్త్రి (1867`1909 నాశిక్), వైద్యరత్న పండిత్ దివి గోపాలాచార్యులు (1872`1920 చెన్నపట్నం), కవిరాజ్ గణనాథ్ సేన్ సరస్వతి (1877`1945 కలకత్తా), డా॥ ఆచంట లక్ష్మీపతి (అగ్నివైద్యులు/ 1880 ` 1962 చెన్నపట్నం), వైద్య యాదవ్‌జి త్రికంజి ఆచార్య (1881`1956 బొంబాయి), వైద్యరత్న కెప్టెన్ జి. శ్రీనివాసమూర్తి (1887`1945 చెన్నపట్నం), (పండిత్ శివశర్మ (1906`1980 లాహోర్`ఢల్లీి).
వీరి కృషితో 1907 సం. అఖిల భారత ఆయుర్వేద విద్యాపీఠం చెన్నపట్నంలో ప్రారంభమై ఢల్లీి వరకు విస్తరించింది. ఆనువంశిక ఆయుర్వేదం చేసే వారికి, ఆయుర్వేదం చదువుకొన్నవారికి ఆయుర్వేదాచార్య, ఆయుర్వేద విశారద లాంటి పరీక్షలు దేశమంతట నిర్వహించి ప్రమాణ పత్రాలు ఇచ్చి వారందరు గుర్తింపు పొందిన వైద్యులుగా అవకాశం పొందారు.
తెలుగునాటి ప్రసిద్ధి చెందిన కవులు కళాకారులు పద్య, గద్య, సామెతల రూపంలో ఆయుర్వేద సూత్రాలు ప్రజల మనసులలో నిరంతరం నిలిచి ఉండేటట్లు చేశారు. 1918 సం॥ నుండి ‘ధన్వంతరి’ ‘ఆయుర్వేద సమ్మేళనం’ లాంటి పదుల సంఖ్యలో పత్రికలు ప్రారంభమయినాయి.
1901లో చెన్నపట్నం, 1908లో మైసూరు, 1922లో విజయవాడ, 1927 లో బెనారస్, 1935లో హైదరాబాద్, 1946లో జామ్‌నగర్‌లలో ఆయుర్వేద కళాశాలలు ప్రారంభించారు. నేడు దేశంలో వందలాది కళాశాలలతో శిక్షణ (బి.ఎ. ఎమ్.ఎస్, ఎమ్.డి, ఎమ్.ఎస్., సూపర్ స్పెషాలిటి) పూర్తి చేసుకొన్నవారు వేలాది మంది వైద్య వృత్తిలోకి వస్తున్నారు.
1988 సం॥లో ఢల్లీిలో రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం ఏర్పడి అనాదిగా ఉన్న గురు శిష్య పరంపరను తిరిగి కొనసాగిస్తూ అనేక కార్యక్రమాల ద్వారా యువవైద్యులలో ప్రామాణికతను సమర్థతను పెంచడంలో విజయం సాధిస్తున్నది. కేరళ జగత్ ప్రసిద్ధి పొందిన ఆయుర్వేద వైద్యశాలలు, ఔషధ నిర్మాణశాలలు కలిగి అనుభవ పరంపరను ప్రామాణికతతో కొనసాగిస్తూ నూతన ఆవిష్కృతులతో ప్రత్యేకత చాటుకొంటున్నది.
ఆలిండియా ఇనిష్టిట్యూట్ ఆప్ ఆయుర్వేద ఏ.ఐ.ఐ.ఏ ఢల్లీిలో 2017 సం॥ ప్రారంభమై అనేక శాస్త్రీయ పరిశోధనలు సేవలతో పురోగమిస్తున్నది. కొవిడ్ లాంటి మహమ్మారి నుండి ప్రజారోగ్యం కాపాడడంలో ఆయుర్వేదమే కీలక పాత్ర పోషించినది.
గ్లోబల్ ఆయుష్ ఇన్వెష్టమెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను గుజరాత్‌లోని గాంధీóనగర్‌లో ప్రధాని నరేంద్రమోదీ 2022 సం॥లో ప్రారంభించారు. అర్జంటనా, బ్రెజిల్, కెనడా, మెక్సికో, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలనుండి వచ్చిన ప్రముఖులతో చర్చలు, సంభాషణలు సమావేశాలు, ప్రదర్శనలు జరిపారు. ఉన్నత స్థాయి పరిశోధనలు పరిశ్రమలు, సేవలు ప్రారంభిస్తూ ఈ కార్యము యోజనా బద్ధంగా ప్రపంచవ్యాప్త విస్తరణ, వికాసదిశగా సాగుతున్నది.
ధన్వంతరి జయంతి (దీపావళికి ముందువచ్చు ధన త్రయోదశి) ని 2016 సం॥ నుండి ఆయుర్వేద దినోత్సవంగా భారత ప్రభుత్వం వివిధ కార్యక్రమము లతో నిర్వహిస్తున్నది. 2024లో 9వ ఆయుర్వేద దినోత్సవంలో ప్రధాని నరేంద్రమోదీ ఢల్లీిలో ఏ.ఐ.ఐ.ఏ (ఆల్ ఇండియ ఇనిష్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద) నాలుగు ఎక్స్‌లెన్స్ సెంటర్స్‌ని ప్రారంభిం చారు దాదాపు 150 దేశాలలో కార్యక్రమాలు జరిగాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 23వ తేదీ ఆయుర్వేద దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించుట ద్వారా భారతదేశం ఆయుర్వే దానికి ప్రపంచ క్యాలండర్ గుర్తింపునిచ్చింది.
2025 ఆయుర్వేద దినోత్సవాన్ని ఉత్సవకార్యక్ర మంగా కాకుండా పర్యావరణ సమతుల్యత, జీవనశైలి, రుగ్మతలు, వాతావరణ సంబంధిత వ్యాధులు, మానసిక వత్తిడి నిర్వహణ వంటి సమకాలీన సవాళ్లపై ప్రపంచ వ్యాప్తంగా దృష్టి సారించనుంది. ఈ విధంగా నిత్య నూతనమైన ఆయుర్వేదం ‘‘సర్వేసంతు నిరామయాః’’ సాధనకు విశ్వవ్యాప్త దిశగ కదులుతున్నది.
‘‘సో-య మాయుర్వేద శ్శాశ్వతో నిర్దిశ్యతే అనాదిత్వాత్
స్వభావ సంసిద్ధలక్షణత్వాత్ భావస్వభావ నిత్యత్వా చ్చ’’
అనే చరకుని వచనానుసారం ఆయుర్వేదం నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది.
సర్వే జనాః సుఖినోభవంతు
– వైద్య గంజాం కృష్ణప్రసాద్
చరక ఆయుర్వేద ఆశ్రమం సికింద్రాబాద్ నిర్వాహకులు