ఆయుర్వేదమే తాను, తానే ఆయుర్వేదంగా మొక్కవోని దీక్షతో కృషి చేసి యావద్భారతంలో ఆయుర్వేద వ్యాప్తికి, దీప్తికి పాటుబడి, ఆయుర్వేద ప్రశస్తిని పాశ్చాత్యుల చేత కూడా ప్రస్తుతింపజేసిన మహోన్నతుడు డాక్టర్ దివి గోపాలాచార్యులు. స్వయంకృషితో సర్వతోముఖ ప్రతిభనార్జించిన మనీషి. ఆయుర్వేద వైద్యాన్ని అపహాస్యం జేసి అలక్ష్యంతో చూసే పర పాలకుల మౌఢ్యాన్ని తన ఉపన్యాసాల ద్వారా, గ్రంథ రచనతో, తన చికిత్సా కౌశలంతో నేలరాసి, ఆయుర్వేదం సర్వ వైద్య విధానాల మాతృక అని నిరూపించారు. 1913లో బ్రిటిష్ ప్రభుత్వం వీరికి ‘వైద్యరత్న’ బిరుదును గవర్నరు జనరల్ ద్వారా ఇచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ‘వైద్యరత్న’ బిరుదు పొందిన తొలి భారతీయ వైద్యుడు గోపాలాచార్యులు. ఆచార్యుల వారి ‘ప్లేగు’ వ్యాధి చికిత్సా నైపుణ్యాన్ని ప్రశంసించి గద్వాల మహారాణి బంగారు పతకం బహూకరించారు.
బందరులో విఖ్యాత వైద్య కుటుంబంలో గోపాలాచార్యులు 22.10.1872న జన్మించారు. మూడు శతాబ్దాల నుండి వారిది ఆయుర్వేద వైద్య కుటుంబమే. తండ్రి రామకృష్ణమాచార్యులు విఖ్యాత వైద్యులు. వైఖానస పండితుడు. తల్లి రాజ్యలక్ష్మి సదాచార సంపన్న. పదమూడేండ్ల వరకు ఆచార్యులు తండ్రి చెంతనే ఆంధ్ర గీర్వాణ భాషలలో పాండిత్యాన్ని, ఆయుర్వేదంలో ప్రజ్ఞను ఆర్జించారు. తాత్త్వికుల నుండి ఆగమశాస్త్రం అభ్యసించారు. ఆయుర్వేద విజ్ఞానాన్ని కరతలామలకం చేయదలచి, ఒకరోజున ఎవరికీ చెప్పకుండానే ఇల్లు వీడి బయలు దేరారు. ఏడుకొండలవాడి సాన్నిధ్యాన్ని చేరుకుని, మహంతు పాఠశాలలో శాస్త్రాధ్యయనం చేసి పాండిత్యం గడిరచారు. తండ్రి రామకృష్ణమా చార్యులు తిరిగి కుమారుడిని బందరు తీసుకువచ్చారు. కానీ వారి దృష్టి మరింతగా ఆయుర్వేదంలో ప్రావీణ్యత వైపు మళ్లింది. అందుకే మరోసారి ఇల్లు విడిచి కాలినడకనే హైద్రాబాదు చేరారు. తండ్రి మరోసారి గోపాలాచార్యుని బందరు తీసుకువచ్చి, ఎంతగానో హితోపదేశం చేశారు.
కానీ గోపాలాచార్యుని ధ్యేయం యావద్భారతం లోని వివిధ రీతుల విజ్ఞానం సముపార్జించి ఆయుర్వేద ప్రాశస్త్యాన్ని బహుముఖంగా ప్రస్ఫుటం చేయాలనే. మరోసారి గృహాన్ని వీడినారు. బొంబాయి, పూనే, అహమ్మదాబాద్, నాగపూర్, మున్నగు చోట్లను దర్శించారు. కడకు మైసూరు చేరి మహారాజా ఆయుర్వేద పాఠశాలలో చేరారు. ఆ పాఠశాల ప్రధానాచార్యులు అగరం పుట్టస్వామి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయుర్వేద శాస్త్ర రహస్యములన్నింటిని అవగతం చేసుకొని, చికిత్సా కౌశలం సముపార్జించి బందరు తిరిగి చేరారు. వివాహం చేసుకొన్నారు. భార్య రమణమ్మ. ఇరువురూ అన్యోన్యంగా కొంతకాలం గడిపినారు. గోపాలాచార్యులు గారికి ఒక కుమార్తె, కుమారుడు. కానీ ఆచార్యుల గృహజీవితం సాఫీగా సాగలేదు. మొదటిసారి భార్య నిండు చూలాలుగా ఉన్నపుడు ఆచార్యులుగారికి ఒక కుదురుయేర్పడినది. చివరికి నా అన్నవారు ఎవరూ మిగలలేదు.
ఆచార్యులు మరోసారి మైసూరు చేరారు. తన 21వ యేట ఆయుర్వేదాధ్యయనం పూర్తి చేసుకొని పట్టభద్రులైనారు. దేశంలోని వివిధ ప్రాంతాలలోని విభిన్న చికిత్సా ప్రక్రియలను, సంప్రదాయాలను అవగాహన చేసుకొన్నప్పటికి తృప్తి కలిగినట్లు లేదు. విశాల భారత పర్యటనకు పూనుకొనినారు. కలకత్తా, కాశీ, బొంబాయి, కాశ్మీరు, హరిద్వారం, లాహోరు, నాసిక్‌లు దర్శించారు.
23వ ఏట ఆచార్యులు బెంగుళూరులో దివ్యజ్ఞాన సమాజ ఆధ్వర్యంలోని వైద్యశాల వైద్యులుగా చేరడం వల్ల వారి దేశ సంచారం జరిగింది. వారి చికిత్సా నైపుణ్యం, ఇతరుల పట్ల చూపే అనురక్తి, సౌమ్యత, కొద్దికాలంలోనే ఖ్యాతిని తెచ్చాయి. ఎందోరో ఆయన సలహాలకై వేచి ఉండెడివారు.
ఇంతలో మహామ్మారిలా బెంగుళూరులో ప్లేగు వ్యాధి పెచ్చరిల్లింది. వేలాది జనం మృత్యువాత పడినారు. ఏ చికిత్స వ్యాధిని నివారించలేదు. ఈ దుస్థితి గోపాలాచార్యుల హృదయాన్ని కలచివేసింది. శాస్త్రాల్ని అధ్యయనం చేయించింది. చరక, సుశ్రుత, వాగ్భటాలను తరచినారు. ‘నిసర్పి’ వ్యాధే ‘ప్లేగు’ వ్యాధిగా ఆచార్యులు గుర్తించారు.‘హోమాది పానకం’ ‘శతధౌత ఘృతం’ ఈ రెండు ఔషధల్ని చరకము ననుసరించి తయారుచేసి రోగులకు వాడినారు. మహమ్మారి చికిత్సా నైపుణికి మైసూరు రాజ్యం నివాళులెత్తింది. భారతవర్షమే విస్తుపోయింది. బొంబాయి రాష్ట్రంలో ప్లేగువ్యాధి ప్రబలినపుడు కూడా ఆచార్యులుగారి ఔషధాలే శరణ్యమైనాయి.వీరి కీర్తి ప్రతిష్ఠలు మద్రాసు పెద్దలకు తెలిశాయి. ఎస్‌్. సుబ్రహ్మణ్య అయ్యర్, వి.కృష్ణస్వామి అయ్యర్, పి.వి.కృష్ణస్వామి చెట్టి గోలాపాచార్యుని చెన్నపురికి ఆహ్వానించారు. గోపాలాచార్యులు కన్యకాపరమేశ్వరీ దేవస్థానం ఉచిత ఆయుర్వేద చికిత్సశాల ప్రధాన చికిత్సకులుగా నియమితులైనారు. అప్పటికి ఆచార్యులుగారి వయసు 24 సంవత్సరాలు.
వారికంతటితో తనివి తీరలేదు. చౌకధరలకు ఆయుర్వేదౌషములను తయారుచేయదలచినారు. 1898న ఆయుర్వేదాశ్రమం నెలకొల్పారు. ఆయుర్వే దౌషధాల ప్రామాణికత, నిర్మాణ పద్ధతుల నిర్ధారణ చేసే మద్రాసు ఆయుర్వేద లేబరేటరీని నెలకొల్పి అనేకమంది వైద్య విద్వాంసులను పరిశోధనల కోసం నియమించారు.
ఆయుర్వేదంతో సుశిక్షితులైన వైద్యులను తయారు చేయడానికి మద్రాసు కళాశాలను కన్యకాపరమేశ్వరి దేవస్థానం వారు స్థాపించారు. ఇందులో సంస్కృ తంలో ‘ఆయుర్వేద భూషణ’ శాఖÑ ‘భిషగ్వర’ అను తెలుగు శాఖ ఏర్పాటు చేశారు. గోపాలాచార్యులు ప్రధానాచార్యుడు. బొంబాయి, గుజరాత్, యు.పి., పంజాబ్ సింహళం, ఆంధ్ర, తమిళ, కన్నడ, మళయాళ ప్రాంతాలవారు ఈ కళాశాలలో విరివిగా చేరారు. ఆనాడు గోపాలాచార్యుల దగ్గర అధ్యయనం చేసినవారే అఖిల భారతంలో విద్వద్వైద్యులుగా ప్రఖ్యాతి గాంచారు.
తీరా నాలుగేళ్లకే ఈ కళాశాల నిర్వహణను కన్యకాపరమేశ్వరీ దేవస్థానం విడనాడదలించింది. దీనితో ఆచార్యులే ఆ కళాశాల నిర్వహణ బాధ్యత స్వీకరించారు. అందుకు ‘చెన్నపురి ఆయుర్వేద ప్రచారిణి సభ’ను పెద్దల సహకారంతో స్థాపించారు. ఈ కళాశాలను జీవించి ఉన్నంతవరకు నడిపారు. ఈ కళాశాలలో మొదట సంస్కృతంలో తదుపరి తెలుగు, తమిళాలలో విద్యాబోధన జరిగింది. ఈ కళాశాలకు అను బంధంగా ఉచిత వైద్యశాలను స్థాపించారు. రోజూ మూడు నుండి నాలుగువందల వరకు రోగులు వచ్చేవారు. ఒక ఆయుర్వేదౌషధాలయం (Aవబతీఙవసఱష నశీంజూఱ్aశ్రీ) ఈ కళాశాలకు అనుబంధంగా నిర్వహించాలన్న తలంపు కలిగినది. పెద్ద ఆయుర్వేద ఆసుపత్రిని వార్డులతో ఏర్పాటు చేశారు. ఈ కళాశాలకు అనుబంధంగా పుస్తక భాండాగారాన్ని నెలకొల్పారు. ముద్రితా ముద్రిత గ్రంథాలనెన్నిటినో సేకరించారు. అనేక తాళపత్ర గ్రంథాల్ని సమకూర్చి నారు. ఆయుర్వేదాశ్రమ గ్రంథమాల అనే సంస్థను స్థాపించి అనేక గ్రంథాలు ముద్రించారు. వాటి ముద్రణకు ఆయుర్వేద ముద్రాక్షరకాలను స్థాపించారు. గోపాలాచార్యులుకు 1907లో నాసిక్‌లో శ్రీ నయాజీ ఆయుర్వేద విద్యాపీఠం ‘ఆయుర్వేద మార్తాండ’అన్న బిరుదును, కలకత్తా ఆయుర్వేద సమ్మేళనంలో ‘భిషఙ్మణి’ బిరుదు ప్రదానం చేశారు. ఆచార్యులుగారు 11.7.1919న ‘శ్రీ ధన్వంతరి’ పేరుతో ఒక మాసపత్రికను స్థాపించి వారున్నంత వరకు క్రమం తప్పకుండా వెలువరించినారు.
సామాజిక మద్దతు లేకుంటే ఏ పనీ సాధించ లేమని తొలిగా ఆలోచించిన మనీషి ఆచార్యులు. యావదాంధ్రాయుర్వేద వైద్యులను ఒక త్రాటిపై సంఘటితవర్చిన ఘనత కూడా ఆచార్యులుదే. 1917 నవంబరులో బెజవాడలో వారు స్థాపించిన ఆయుర్వేద మహామండలి తరువాత ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మహామండలిగా రూపొందింది.
అఖిల భారత ఆయుర్వేద మహామండలికి అధ్యక్షులుగా ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఆచార్యులు గారే. 1913 ఏప్రిల్‌లో బొంబాయిలో జరిగిన సభకు వారధ్యక్షత వహించారు. నిఖిల భారతాయుర్వేద మహామండలి అనుబంధ సంస్థ నిఖిల భారతా యుర్వేద విద్యాపీఠం (పరీక్షా నిర్వహణ విభాగానికి ఎన్నో ఏళ్లు అధ్యక్షులుగా ఉండి ఆయుర్వేదాచార్య, ఆయుర్వేద విశారద, భిషక్, పరీక్షలను పటిష్టంగా నడిపారు. ఆ పరీక్షలకు కావలసిన పాఠ్య ప్రణాళికను రచించారు. మైసూరు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల పరీక్షల పరీక్షాధికారిగాను ఢల్లీి ఆయుర్వేద, యునానీ, తిరుచ్చి కాలేజీ పరీక్షాధికారి గాను, పరీక్షోప సంఘ సభ్యునిగాను, అలహాబాదులోని అఖిల భారత ఆయుర్వేద బోర్డు అధ్యక్షులుగానూ, లాహోరు డి.వి.ఏ. కాలేజీ పరీక్షాధి కారిగానూ ఆచార్యులుగారు ఎన్నిక య్యారు. అనేక సంవత్సరాలు ఆ పదవులలో ఉన్నారు. మలబార్‌లో జరిగిన ఆయుర్వేద కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. పూనాలో జరిగిన (25.2.1917) అఖిల భారత ఆయుర్వేద అష్టమ మహా సమ్మేళనానికి అనుబంధంగా ఏర్పా టయిన ఆయుర్వేద మహావస్తు ప్రదర్శనకు అధ్యక్షులుగాను పని చేశారు. 1904లో కొల్లంగోడులో జరిగిన ఆయుర్వేద మహామండలికి ఆయనే అధ్యక్షులు. 1918 లాహోరులో జరిగిన 9వ మహాసభకు వారినే ఆహ్వానించారు. శ్రీ గోపాలా చార్యులుగారు వెలువరించిన గ్రంథాలు 22. వానిలో కొన్నిÑ మాధవ నిదానము, ఆర్క్పకాశము, రసప్రదీపక, పథ్యాపథ్యము, ఆయుర్వేద పరిభాష, భేషజకల్పము, దక్షిణభారతము, ఆయుర్వేద ప్రచారము, అధ్యక్ష అభిభాషణములు, హిందూ విశ్వవిద్యాలయము, వైద్యాభివృద్ధి, ఆయుర్వేద ప్రశస్తి (ఆంగ్లము), ఆంధ్రదేశము`వైద్య సహాయము, ఆయుర్వేద చరిత్రము, వస్తికర్మము, అగస్త్యవైద్యము, ఆయుర్వేదాంగ శల్య తంత్రము, ప్రదర్శకాభిభాషణము, విషూచి, ఋషికుల బ్రహ్మచర్యాశ్రమము, చలిజ్వరము, మదుమేహము, రాజయక్ష్మ. వారి అముద్రితాలు మరో 18 ఉన్నాయి. మూడు నాల్గు మినహా అవి యింత వరకూ వెలుగు జూడలేదు. ఇవిగాక అగస్త్య సాంప్రదాయమునకు చెందిన నూట యాభై గ్రంథాలు వారు సేకరించారు. వాటి జాడ తెలియడం లేదు.
డా॥కింగ్, భారతదేశ వైద్యశాఖాధికారి సర్ పౌర్డే లూకిస్, ఫిలడెల్పియా వాస్తవ్యులు డా॥ జార్జి క్లార్కు, కల్నల్ కెఆర్. కీర్తికర్, మున్నగు వైద్య ప్రముఖులు, వైస్‌రాయ్ లార్డు హార్డింజ్, మద్రాసు గవర్నరు లార్డు పెట్లండు లాంటి పాశ్చాత్య పాలకులు ఎంతగానో శ్లాఘించినారు.
గోపాలాచార్యులు ఆయుర్వేద వైద్యోద్యోమంలో తలమునకలుగా ఉన్నా తక్కిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక విషయాల పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉండేవారు. బాలగంగాధర తిలక్‌తో ఆత్మీయత ఉండేది. కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్. శ్రీనివాసయ్యంగార్, సర్ సి.పి. రామస్వామయ్యర్, కాశీనాథుని నాగేశ్వర రావు పంతులు, కొచ్చిన్ మహారాజా, తిరువాన్కూర్ మహారాజా, దర్బాంగా మహారాజా, సర్ పి.టి.త్యాగ రాజశెట్టి, రాజా నాయని వెంకటరంగా రావు డా॥ టి.యస్., యస్.రాజన్ వంటి ప్రముఖులెందరితో ఆచార్యులుగారు కలసిమెలసి పని చేసేవారు. మద్రాసు గోఖలే హాల్లో జరిగే సభలలో ఉపన్యసించేవారు. స్వదేశీ ఉద్యమాన్ని గాఢంగా బలపరుస్తూ దేశీయ మహాసభల్లో ప్రసంగించారు.
వారు ఆజానుబాహువు. నిండైన శరీరం. తెల్లని నామాల మధ్య ఎర్రని కుంకుమ నిలువు బొట్టు. తొమ్మిది మూళ్ల ధోవతి పంచకట్టు, నిలుపుకోటు, దాని నుండి వ్రేలాడే బంగారు పతకాలు, నిండైన తలపాగా, చిరునవ్వు తొణికిసలాడే గుండ్రని ముఖం. ఎంత దూరం నుండి చూచినా `వారే ఆచార్యులు గారని అంతా గుర్తించేవారు. చూడగానే ఒక పూజ్యభావం జనించేది.
అందరి గౌరవాన్ని, పూజ్యభావాన్ని చూరగొన్న ఆ రూపం`రౌద్రి సంవత్సర భాద్రపద బహుళ బుధవారం`(ది 29.9.1920) ఈ లోకం వీడిరది. ఆయుర్వేద జగత్తుకు అశనిపాతం, భారతీయ సంస్కృతికి పెద్ద లోటు మిగిల్చింది.
– డాక్టర్ ప్రకాశచంద్ర శతపథి