ఆయుర్వేద వైద్యశాస్త్రం అధర్వణ వేదానికి ఉపాంగం. మహర్షులు దానిని ఎనిమిది విధములగు చికిత్సలుగా విభజించారు. వాటిలో శస్త్ర చికిత్స ప్రధానాంగంగా పరిగణించారు. దేవాసుర యుద్ధంలో అభిఘాత (అవతలివారు కొట్టడం వల్ల తగిలిన దెబ్బలు) వ్రణాలకు చికిత్స చేయడంలో శస్త్ర చికిత్స మొదటి స్థానంలో ఉండేదని భగవత్స్వరూపులైన దివోదాస ధన్వంతరులు చెప్పారు. ఆనాటికి జ్వరం వంటి రోగాలు ఉత్పన్నమయ్యేవి కావు కాబట్టి శస్త్ర చికిత్సను ఆశ్రయించారు. క్రమేణా యుద్ధాలు పెచ్చరిల్లాయి. దీనితో ఆయుర్వేదంలోని శస్త్ర చికిత్స ముఖ్యమైనదిగా పరిగణించడం మొదలయింది. శస్త్ర చికిత్సా విధానం గురించి వేదాలలో చిత్రమైన గాథలు ఉన్నాయి. ఇవన్నీ అధర్వణ వేదానికి అధిపతులైన అశ్వనీ దేవతలు చేసిన శస్త్ర వైద్యం ఆధారంగా ఉన్న గాథలే.
దధీచుడు మధు విద్యా రహస్యం తెలిసిన వాడు. కానీ దానిని అశ్వనీదేవతలకు చెప్పకుండా గుప్తంగా ఉంచాడు. దీనితో అశ్వనీదేవతలు దధీచుడి శిరస్పు ఖండిరచి, భద్రపరిచి తాము తెచ్చిన గుర్రం తలను అతికించారు. అప్పుడు దధీచుడు మధు విద్యను అశ్వనీ దేవతలకు బోధించాడు. దీనితో దధీచుడి తల అతడికి, గుర్రం తల గుర్రానికి తిరిగి అతికించారని అధర్వవేదంలోని కథ. రుగ్వేదం ప్రకారం యజ్ఞపురుషుని తెగిన శిరస్సును అశ్వనీ దేవతలు తిరిగి అతికించారు. ఖేలరాజు భార్యాసమే తుడై యుద్ధానికి వెళ్లాడు. విస్ఫల కాలి పిక్కను శత్రువులు ఛేదించారు. అయినా ఆమె కుంటిది కాకుండా అశ్వనీదేవతలు ఇనుప కాలు అమర్చారు. కాబట్టి వైదిక యుగంలో శస్త్ర చికిత్స చాలా ప్రాముఖ్యంలో ఉందని అర్ధమవుతుంది.
భోజరాజుకు తీవ్రమైన శిరోభారం వచ్చింది. ఏ వైద్యుడూ నయం చేయలేకపోయాడు. దీనితో వైద్యులనూ, వైద్యశాస్త్రాన్ని కూడా ఆయన దేశం నుంచి బహిష్కరించాడు. ఇది తెలిసి, అశ్వనీదేవతలు వచ్చారు. భోజరాజు పుర్రెను విడదీసి అందులో ఉన్న రెండు చేపలను తీసి, మళ్లీ అతికించారని గాథ. సర్వ విద్యలకు కేంద్రం కాశీ పట్టణం. అక్కడ ప్రఖ్యాత శస్త్ర చికిత్సకుడు ధన్వంతరి. ఆయన కాశీ రాజు కుమారుడే. పేరుకు తగ్గట్టే అపర ధన్వంతరి. తన ప్రజలు రోగాలతో బాధపడడం చూసి ఇంద్రుని వద్దకు వెళ్లి శస్త్ర చికిత్స ప్రధానంగా ఆయుర్వేదం నేర్చుకుని వచ్చాడట. మరొక ఆయుర్వేద వైద్య బ్రహ్మ దివోదాసు సుశ్రుతునికి శస్త్ర చికిత్సను బోధించాడు. దివోదాసుని శస్త్ర చికిత్స గురించి కూడా కొన్ని గాథలు ఉన్నాయి. దివోదాసుడు కాశీలోనే ఆయుర్వేద విశ్వవిద్యాలయం స్థాపించాడని చెబుతారు. శల్యతంత్ర ప్రవర్తకునిగా ప్రఖ్యాతి గాంచి, దివోదాసుడు స్థాపించిన విశ్వవిద్యా లయం శస్త్ర చికిత్సా విభాగంలో పనిచేసిన సుశ్రుతాచార్యుడు రామాయణ కాలంనాటి వాడు. విశ్వా మిత్రుని కొడుకు. ఆయన రాసిన ‘సుశ్రుత సంహిత’ మహా భారత రచనా కాలానికంటే పూర్వానిదే. సుశ్రుతుడు ఆగంతక, మానస, శారీరక వ్యాధుల నివారణా నైపుణ్యంతో పాటు, శస్త్ర చికిత్సలోను ప్రావీణ్యం గడిరచాడు. ఇది తన ‘శృంగార నైషధం’లో శ్రీహర్షుడు చెప్పాడు.
సుశ్రుతాచార్యులవారిని ఒక కవి ఇలా కీర్తించాడు:
కమల గర్భుని సత్యసంకల్ప వశత
బ్రాణికోటుల దేహనిర్మాణమగును
అతడె ఎరుగడు దాని రహస్య వృద్ధి
చోద్యమెట్లు గ్రహించెనో సుశ్రుతుండు
మనజ వైద్యుల కా మహామహుడె మొదలు
భిక్ష పెట్టిన గురుడు, తద్విద్య నేడు
వివిధ ఖండాంతరమ్ముల వెలుగుచుండె
చండభానుని కర సహ్రసమ్ము బోలె
సుశ్రుతాచార్యుని శస్త్ర చికిత్సా నైపుణ్యం, విశేషాలు విస్మయం కలిగించే విధంగా ఉంటాయి. ఒక రోగి పొట్ట చీల్చి చిన్న ప్రేవులలోని రాళ్లు తొలగించాడు. ఒక గర్భిణి కడుపు కోసి బిడ్డను తీశాడు. పుర్రెకు రంధ్రం చేసి మెదడులోని శల్యాన్ని తీసివేశాడు. పొట్టను చీల్చి చేసే శస్త్ర చికిత్స నిమిషాలలో పూర్తి చేసేవాడట. అందం కోసం నాసికకు శస్త్ర చికిత్స, మూఢ గర్భ చికిత్స, ఉదర పాటనాది శస్త్ర చికిత్సలు ఆయన చేశాడని చారిత్రక ఆధారాలే చెబుతున్నాయి.
సుశ్రుతుని సృష్టి
శస్త్ర చికిత్స కోసం సుశ్రుతుడు 101 యంత్రాలు, 20 శస్త్రాలు సృష్టించాడు. శస్త్రాలు వాడి కలిగినవి. యంత్రాలు వాడి లేనివి. సాధారణంగా అవన్నీ ఇనుముతో చేయించినవి. జంతువుల ముఖాలు, పక్షుల ముక్కుల వలె వీటిని నిర్మించేవారు. పటకార్లు పెద్దపులి, సింహం ముఖాల వలె రూపొందించారు. సుశ్రుతుడు కనుగొన్న సింహ ముఖ యంత్రం ఈనాటి పాశ్చాత్య శస్త్ర చికిత్సలో లైయన్స్ ఫోర్సెప్స్ పేరుతో ఉపయోగంలో ఉంది. సుశ్రుతుని యంత్ర శస్త్రాలకు, ఈనాటి శస్త్ర యంత్రాలకు పోలిక ఒక్కటే. యోని, గుదమార్గాలు శోధించే యోని వ్రణేక్షణ యంత్రాన్ని నేటి పాశ్చాత్య శస్త్ర చికిత్సకులు అలింగ్ హ్యాండ్స్ స్పోనియం అని పిలుస్తున్నారు. శస్త్ర చికిత్సను బట్టి, అందులోని భేదాలను బట్టి కొత్త కొత్త శాస్త్రాలను కనిపెట్టినట్టు ‘స్వబుద్ధ్యా బాచాపి విభజేత్’ అనే ప్రమాణ వ్యాక్యాన్ని బట్టి తెలుస్తున్నది.
శస్త్రవైద్యుల లక్షణాలు
వీరికి ఉండవలసిన ప్రధాన లక్షణం హస్త లాఘవమేనంటాడు సుశ్రుతుడు. శస్త్ర చికిత్స చేయించుకున్న రోగుల దగ్గర ఉపచారాలు చేయడానికి ఆయన స్త్రీలను నిషేధించాడు. మగ నర్సులే ఉండాలని ఆదేశించాడు. శస్త్ర చికిత్సకు పూర్వం బాధ తెలియకుండా ఉండేందుకు ఆహారం ఇచ్చి, మత్తు పదార్థాలు తాగించే విధానం ఆచరించారు. 1872లో డాక్టర్ సర్ జేమ్స్ క్లోరోఫారమ్ కనిపెట్ట డానికి పూర్వం అలోపతీ వైద్యులు కూడా ఈ విధానాన్నే అవలంభించారు. శస్త్ర చికిత్సాంగంలో సుశ్రుతుడు మరొక ప్రయోగాన్ని పేర్కొన్నాడు. ‘అపచి’ అనే రోగం ఉంది. కంఠం, ఉర:ప్రదేశాల మధ్య కురుపులు లేచి చీమూ, రక్తమూ కారుతూ ఉంటుంది. దానికి కాలి పిక్క వెనుక భాగం చీల్చి అక్కడ ఉన్న మేదో గ్రంధిని తీసివేసి కుట్టాలి.
పిల్లలకు వచ్చే కురంటము అనే వరిబీజంలో చెవి కుట్టాలని, కొన్ని కంటి జబ్బులకు బొటనవేలి కింద చురక వేయాలని ఆయన చెప్పాడు. దూరత మములైన అవయవాలకు కల నాడీ బంధాన్ని గుర్తించి చికిత్స చేసే విధానమిది. కీలెరిగి వాత పెట్టడం అనే సామెత దీని నుంచే వచ్చింది. శరీర నిర్మాణంలో అతి సున్నితాలైన మర్మ స్థానాల గురించి చెబుతూ సుశ్రుతుడు ప్రాణాపాయం కలిగించే 107 మర్మ సంధులు ఉన్నాయని విపులీకరించడు. శీలమండ, కణతలు, నొసలు మొదలైన వాటినే మర్మసంధు లంటారు. ఈ మర్మస్థానాల మర్మం తెలుసుకుని ఆయుధ ప్రయోగం చేయడం ప్రాచీనుల యుద్ధ కౌశలంలో ఒక ముఖ్య విశేషంగా పరిగణించేవారు.
రామరావణ యుద్ధంలో లక్ష్మణుని విశల్యఘ్న మర్మస్థానం` అంటే నొసటి భాగంలో బాణం వేసి కొట్టాడు ఇంద్రజిత్తు. లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఆ బాణం తొలగిస్తే లక్ష్మణుడు మరణించడం తథ్యం. ఆ సంగతి రాములవారికి తెలుసు. అందుకే సంజీవకరణి తెప్పించి పుండు మాన్పుతూ, బాణం తీసివేశాడని రామాయణం చెబుతోంది.
కోత భాగాన్ని మూసే సవర్ణీకరణ
సుశ్రుతుని శస్త్రవైద్యంలో సవర్ణీకరణం మరొక మహత్తర అంశం. శస్త్ర చికిత్స చేసిన చోట అతుకు స్పష్టంగానే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వెంట్రుకలు కూడా మొలవవు. కానీ సవర్ణీకరణం వల్ల ఆ కోత చర్మంలో కలసిపోవడం, అక్కడ వెంట్రుకలు రావడం రెండూ జరుగుతాయి. శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి క్రిమిదోషం రాకుండా సుశ్రుతుడు కొన్ని విధానాలు చెప్పాడు. నేటి శస్త్ర చికిత్సకులు బాహ్య క్రిమిదోష విషయంలో శ్రద్ధ వహిస్తున్నారు గాని, అంతర్గతమైన క్రిమి దోషానికి కారణాలను పరిగణన లోనికి తీసుకోవడం లేదు. శస్త్ర చికిత్సకు ముందే రోగిని పంచకర్మల ద్వారా దోషాలను శాంత పరచి శస్త్ర చికిత్స చేస్తే క్రిమి మిళితమైన చీము మొదలైనవి బయలుదేరవు. బాహ్య క్రిమి దోష నివారణకు కొన్ని ధూపాలను వివరించారు. గుగ్గిలం, వస, ఆవాలు, సైంధవ లవణం, నేతిలో ముంచిన వేపాకులు కలిపి చూర్ణించి శస్త్ర చికిత్స పొందిన రోగి గదిలో పొగ వేస్తే క్రిమికీటకాలు దరిచేరవు.
సుశ్రుతుని తరువాత…
సుశ్రుతాచార్యులని తరువాత ఆయనతో సమాన కీర్తి కలిగినవాడు వాగ్భటాచార్యుడు. అష్టాంగ హృదయాన్ని ఒక మహా కావ్యంగా రచించాడు. ఆయన శస్త్ర చికిత్సకుడు. రసవాది. బౌద్ధ ధర్మావలంబీకుడు. సుశ్రుతుని కాలం కంటే ఈయన కాలంలోనే, క్రమంగా వచ్చిన అనుభవం, జ్ఞానాల కారణంగా శస్త్ర చికిత్స మరింత ప్రచారంలోకి వచ్చింది. తరువాత పేర్కొనదగినవాడు జీవకుడు. ఈయన ప్రతిభ గురించి బౌద్ధ వాఙ్మయంలో చాలా గాథలు ఉన్నాయి. బింబిసారుని ఆస్థాన వైద్యుడైన జీవకుడు పిల్లల వైద్యం, శస్త్ర చికిత్సలలో ఖ్యాతిగాంచాడు. మగధ సామ్రాజ్యంలో అపర ధన్వంతరిగా పేరు తెచ్చుకున్నాడు. బింబిసారునికి వచ్చిన భగంధర వ్యాధిని శస్త్ర చికిత్సతో నయం చేశాడు. కాశీ పట్టణంలో ఒక వర్తక ప్రముఖుని కొడుకునకు వ్యాయామం చేస్తుండగా పేగు మెలిక పడిరది. రక్తహీనుడై చావు బతుకుల మధ్య ఉండగా జీవకుని ఖ్యాతి విని రాజగృహ నుంచి ఆయనను కాశీ తీసుకు వెళ్లారు. జీవకుడు పొట్ట చీల్చి మెలిక పడిన పేగును సరిచేసి, కుట్లు వేశాడు. ఆ బాలుడు మళ్లీ ఆరోగ్యవంతుడయ్యాడు. ఇది బాగా ప్రసిద్ధి చెందిన గాథ.
బుద్ధునికి జీవకుని వైద్యం
ప్రద్యోతుడనే రాజు తనకు వచ్చిన శిరోభారాన్ని జీవుకుని శస్త్ర చికిత్స ద్వారా నయం చేయించు కున్నాడు. అందుకు ఎంతో విలువైన బహుమానాలు ఇచ్చాడు. అందులో నేటి బెలూచిస్తాన్‌లో తయారైన రెండు శాలువలు కూడా ఉన్నాయి. వాటిని దైవాంశ సంభూతులే ధరించేవారు. అందుకే వాటిని తీసుకు వెళ్లి బుద్ధుడికి ఇచ్చాడు జీవకుడు. దీనితో జీవకుడిని బౌద్ధ ధర్మావలంబీకు నిగా చేశాడు బుద్ధుడు. బుద్ధుడి జీవిత చరమాంకంలో మేహ వ్రణం వచ్చింది. దానిని జీవకుడే శస్త్ర చికిత్స చేసి మాన్పించాడు. పైగా బుద్ధుడు భగవానుడు కాబట్టి మందు లోపలికి పంపి అపవిత్రం చేయరాదన్న భావనతో, తామరపువ్వులో మందు పెట్టి వాసన చూడమన్నా డట. ఆ వాసనతోనే బుద్ధుడు తిరిగి ఆరోగ్యవంతు డయ్యాడని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి.
జీవకుడి దగ్గర మూడు విశేష ఔషధాలు ఉండేవని కూడా చెబుతారు. అవే రాజౌషధి, సమ్మోహిని, సంజీవకరణి. రాజౌషధి తల మీద పెడితే మొత్తం శరీర తత్వం బోధపడేదట. శస్త్ర చికిత్స పొందిన వారికి కోత మచ్చ కనిపించకుండా సంజీవకరణి ఉపయోగపడేది. సమ్మోహిని అంటే శస్త్ర చికిత్స వేళ బాధ తెలియకుండా మత్తు కలిగిం చేది. జీవకుని కాలం ఆయుర్వేదానికి, అందులోని శస్త్ర చికిత్సకు స్వర్ణయుగమని చరిత్రకారులు చెబుతారు.
నిషేధించిన అశోకుడు
కానీ అశోకుడు వచ్చిన తరువాత పరిస్థితి మారింది. శస్త్ర వైద్యాన్ని కూడా హింసాత్మక చర్యగా భావించాడు. అందుకే నిషేధించాడు. మనుషులకు, జంతువులకు కూడా శస్త్ర చికిత్స నిషిద్ధమే. దీనితో భారతీయ శస్త్ర చికిత్స, దాని విజయాలు పుస్తకాలకే పరిమితమయ్యాయని అంటారు. మనిషి శరీరాంత ర్భాగం గురించి చెప్పడానికి శవాలు దొరకకుండా అయిపోయింది. శవస్పర్శ దోషభూయిష్టమైంది. శస్త్రవైద్యుడు పంక్తిబాహ్యుడయ్యాడు. అప్పుడే అగ్ని, క్షార, జలూక చికిత్సలు అమలులోకి వచ్చాయి. ఆపై హూణులు, సిథియన్లు, గజనీ దండయాత్రలు భారతీయ వాఙ్మయాన్ని కాలగర్భంలో కలిపాయి.
శాసనాలు చెబుతున్న వాస్తవాలు
మనదైన వైద్యశాస్త్రానికి సంబంధించిన కొన్ని శాసనాలు దొరికాయి. వాటిని ప్రస్తావించుకోవడం అవసరం. అవి మన పూర్వ వైద్యశాస్త్ర ఘనతను చెబుతాయి. వీటిలో ఒకటి 1326 ప్రాంతంలో కొండవీటి రెడ్డి ప్రభువు పెద కోమటి వేమారెడ్డికి సంబంధించినది. పరవేత వంశీకులు భట్ట భాస్కరునికి పౌత్రునికి పొన్నపల్లి గ్రామం దానమిస్తూ వేయించిన శిలాశాసనమది. అందులో ఆయుర్వేదా నికి సంబంధించిన కొంత సమాచారం ఉంది. అందులోని ఒక గాథ ఇది. భూలోక ధన్వంతరిగా ఖ్యాతి గాంచిన వారు పరహితాచార్యుడు. ఆయన ఒకనాడు నడుస్తున్న బాటలో కప్ప ఎముక దవడలో గుచ్చుకుని బాధపడుతూ గిలగిల తన్నుకుంటున్న తాచుపామును చూశాడు. దయతో ఆ పామును పట్టుకుని దవడలో గుచ్చుకున్న ఎముకను లాగి, గాయం మాన్పి వదిలిపెట్టాడు. ఈ సేవ వల్లనే ఆ వంశానికి పరహిత వంశమన్న పేరు వచ్చిందని ఆ శాసనం వెల్లడిరచింది. శ్రీనాథ వైద్య పండితుడు శస్త్ర చికిత్స ప్రధానాంశంగా ‘పరహిత సంహిత’ పేరుతో ఒక వైద్య గ్రంథం రాశాడు. అదే నేటికీ మనకు సాక్షీభూతంగా మిగిలింది.
పాశ్చాత్యుల మాట
బెర్లిన్‌కు చెందిన డాక్టర్ హోరిస్‌బర్గ్ సుశ్రుతుడి గురించి ఇలా చెప్పారు. సుశ్రుతుడు చెప్పిన సింహముఖ యంత్రం మనం ఉపయోగించే లయన్స్ ఫోర్సెప్స్ వలె ఉన్నది. వెల్‌కం చారిత్రక మ్యూజి యంలో పూర్వపు హిందూ వైద్యులు ఉపయోగించిన శస్త్ర యంత్రాలను చూడవచ్చు. వాటిని చూస్తుంటే నేటి నవీన శాస్త్రజ్ఞులు ఈ పరికరాలను ప్రదర్శన నిమిత్తం ఇక్కడ ఉంచారా అనిపిస్తుంది. పాంపే నగర ధ్వంసంలో చాలా
శస్త్రయంత్రాలు అగ్ని భస్మంలో పూడిపోయాయి. అనేక శతాబ్దాల తరువాత తవ్వగా దొరికినవే నేటి నేపుల్స్ మ్యూజియంలో భద్రపరిచారు. ప్రాచీన హిందూ శస్త్ర వైద్యులు కృత్రిమ దంతాలు కట్టడంలో నిపుణులు. నవీన శస్త్ర వైద్యానికి తండ్రి వంటిది గ్రీస్ దేశమని అంటారు. అది సరికాదు. పోషకురాలో, దాదీయో అని చెప్పవచ్చు. అది పుట్టి పెరిగినది హిందూ దేశంలోనే. హిందూ శస్త్ర వైద్యులు ఉపయోగించిన ఉపకరణాలు తలవెంట్రుకలను చీల్చ గలిగినంత వాడి గలిగినవి. భారతదేశంలో పెట్టుడు ముక్కు అతికించే పద్ధతిని గత శతాబ్దిలో గ్రహించి ఐరోపా వైద్యులు ఆ ప్రక్రియను తమ శస్త్ర చికిత్సలో చేర్చుకున్నారు’ అన్నారాయన.
– గూడూరి నమశ్శివాయ
1955 దశకంలో జాగృతి కాలమిస్ట్, ఈ వ్యాసం 30.12.1955 ఆయుర్వేద ప్రత్యేక సంచిక కోసం అందించారు