ముందుగా, రాష్ట్రీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆయుర్వేద అధిష్టాన అధిపతి శ్రీ ధన్వంతరి భగవానుని ఆశీర్వచనాలు. ఆయుర్వేద ప్రయోజనాలన్ని అందరికి అందుబాటులోకి వచ్చి, ప్రపంచమంతా శీఘ్రంగా ఆరోగ్యభాగ్యంతో పరిఢవిల్లుగాక.
ఆయుర్వేదం మానవాళికి లభించిన అద్భుత మైన, ఏ కాలానికైనా అత్యాధునికమని అనిపించే, అనన్య సామాన్యమైన గొప్ప శాస్త్రం. ఆయువు అంటే ఇక్కడ జీవితమని అర్థం. అంతేకానీ జీవితకాలం (span of life) అని కాదు. ‘ఆయుర్వేదయతి విందయతి ఇతి ఆయుర్వేదః’ అంటే జీవితం గురించి తెలియచెప్పేదీ, జీవితాన్ని ఇచ్చేదీ ఆయుర్వేదమని అర్థం.
ఇంతకీ జీవితమంటే ఏమిటి? శరీరం, మనసు, ఇంద్రియాలు, ఆత్మ వీటి కలయికనే జీవితం అంటారు. అంటే వీటిల్లో ఏ ఒకటి లేకపోయినా అది జీవితం అనిపించుకోదు. ఇలాంటి ఈ జీవితాలతో కూడిన మానవులు ఈ ప్రపంచంలో ప్రధానంగా నాలుగు రకాలని, ఆ నాలుగు రకాల జీవితాలను వివరించేది, వాటి ఉద్ధరణకు తెలుసుకొనవలసిన విషయాల్ని తెలిపేది ఆయుర్వేదం. అంటే మంచి చెడు, తరతమ భేదాలు లేకుండా అన్ని రకాల ప్రాణుల మేలు కోసం ఉద్దేశించిన జ్ఞానం ఆయుర్వేదం. కానీ, దురదృష్టం ఏమిటంటే` ఈరోజు సమాజంలో ఆయుర్వేదం అంటే విపరీత ధోరణులు కనపడుతున్నాయి, వినపడుతున్నాయి. ఆయుర్వేదమనగానే ప్రపంచ దేశాల వారికే కాకుండా, భారతదేశ వాసులకు సహితం మనసులో స్ఫురించేది` చెట్లతో తయారు చేసిన మందులు, కషాయాలు, చూర్ణాలు తైలాలు, నూనెతో మర్దనలు, పంచకర్మలు చేయటం, పథ్యాలు, నెమ్మదిగా ఫలితమిచ్చే సహజ (natural) సాంప్రదాయక (Traditional) చికిత్సా పధ్ధతి అని. ఇంకా` నానమ్మలు, అమ్మమ్మలు చేసే చిట్కా వైద్యం; ఎవరైనా చేసుకోగలిగే వంటింటి వైద్యం అని కూడా. సభ ఏదైనసరే వేదిక ఎక్కి ఎవరంటే వారు ఇవన్నీ నొక్కి చెప్పే చనువు ఇచ్చిన చారిత్రాత్మక చికిత్సా పద్ధతి. ఇంకొద్దిగా ముందుకు వెళితే, గత 20 – 30 సంవత్సరాలుగా చదువుకున్న వారి మనసులో స్ఫురించేదేమిటంటే: ఇదొక భారతీయుల పురాతన చికిత్స పద్ధతి. శాస్త్రీయమైనది (scientific) కాకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ లేని, అన్ని వ్యాధులకు కాకపోయినా కొన్ని వ్యాధులకు మంచి మందులున్నటు వంటి, ఏమర్జెన్సీ ట్రీట్మెంట్ లేనటువంటి, ఒక సహజ చికిత్స పద్ధతి అని. ఆధునికుల మరీ లేటెస్ట్ భావన చెప్పాలంటే ‘‘ఇది ప్రధానమైన (important & primary) వైద్యశాస్త్రం కాదుÑ ప్రపంచం లోని వివిధ దేశాలలో ప్రచలితమై ఉన్న ఆయా దేశ చికిత్స పద్ధతుల వలె ఆయుర్వేదం భారతదేశంలో ప్రచలితమై ఉన్న ఒక ప్రత్యామ్నాయ (alternative) చికిత్స పద్ధతి మాత్రమే. ఇందులో రోగిని రోగాన్ని పరీక్ష చేసే సైంటిఫిక్ పరీక్ష పద్ధతులు కానీ, బ్లడ్ టెస్ట్, ఎక్స్ రేలు మొదలగునవి కానీ ఏమీ ఉండవు. ఇందులోని వైద్యులు రోగి నాడి చూసి, వ్యాధిని ఊహించి, ఔషధాలు ఇచ్చి, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆయుర్వెేద మందుల్లో మెటల్స్ (బంగారము మొదలగు ధాతువులు) వాడుతుంటారు. ఇవి కిడ్నీలను, లివర్‌ని పాడు చేస్తుంటాయి కాబట్టి, మరో మార్గములేనప్పుడు, చివరి ప్రయత్నంగా ఆశ్రయించ దగిన చికిత్స పద్ధతి ఇది అని.
నిజమేమిటంటే, ఆయుర్వేదం చెప్పిన విషయానికి, వీరి భావనలకీ నక్కకి నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసమున్నది. ఆయుర్వేద జ్ఞాన సంపదతో పోలిస్తే నేటి అత్యాధునిక వైద్య శాస్త్రాలన్నీ కూడా సముద్రం ముందు నీటి బిందువు లాంటివి మాత్రమే. వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ఆయుర్వేదం తను చెప్పదలుచు కున్న విషయాన్ని విచక్షణ, విజ్ఞత, విశ్లేషణాత్మకమైన విశేష ప్రౌఢ బుద్ధి కలవారికి మాత్రమే అర్థమయ్యే విధంగా సంక్షిప్తంగా, సూక్ష్మంగా, సూత్రప్రాయంగా మాత్రమే వివరించి చెప్పడం. ఇది నేటి శాస్త్రాల వలె చదవడం వచ్చిన సగటు మనిషికి అర్థమయ్యేట్టు అనేక పెద్ద పెద్ద గ్రంథాల రూపంలో విషయాన్ని వివరించి చెప్పలేదు. అలాంటి గ్రంథాలను ఆయుర్వేదం అనార్య (unauthentic) గ్రంథాలుగా పేర్కొంది. ఎందుకంటే విషయ వివరణ అనేది ఆయా కాలాన్ని సందర్భాన్ని చదివే వ్యక్తిని బట్టి మారిపోతూ ఉంటుంది. శాస్త్ర గ్రంథాలు ఎప్పుడు అలా ఉండకూడదు. అవి చెప్పే విషయాలు అనంతకాలం వరకు ఉపయోగపడేవిగా ఉండాలి. విజ్ఞులు వాటిని సందర్భానుసారంగా విశ్లేషించుకుని ఉపయోగించు కోవాలి అనేది ఆయుర్వేదం ఉద్దేశం. శాస్త్రం, శాస్త్రీయమైన విషయాలు ఎన్నటికీ మారవు, వాటి విశ్లేషణలు మాత్రమే మారుతుంటాయి (విస్తారయతి లేశోక్తం సంక్షిపత్యతివిస్తరం, సంస్కర్తా కురుతే తంత్రం పురాణం చ పునర్నవం). అందుకే ఆయుర్వేదం అనాది, అనంతం, పుణ్యతమం అని పేర్గాంచింది. ఆయుర్వేద శాస్త్రం నేటి అలోపతి వైద్యశాస్త్రం వలె నేటి మానవుల మేధస్సు, విశేషణలకు తగినట్టిగా రాసిన, ఎల్లప్పుడు మారిపోతు ఉండే శాస్త్రం (Evolving science) కాదు. ఆయుర్వేదం ఒక సహజ సిద్ధమైన శాస్త్రం (Emerged science). మహా ధీమంతులు, విజ్ఞలు, విశ్లేషణ సమర్థతా సంపన్నులు, తపస్సంపన్నులు, త్రికాలజ్ఞులు, సహజ సత్పురుషులు, సర్వ శ్రేయోభిలాషులు, సర్వ ప్రాణులకు ఆప్తులు అయినటువంటి మహా రుషులు ప్రయత్న పూర్వకంగా విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఒకేసారి, ఒకేచోట తెలియచెప్పే ప్రయత్నం చేసినటువంటి, సంస్కృత భాషలో, వ్యాకరణ బద్ధమైన శైలిలో గ్రంథస్థం చేసిన శాస్త్రం. అందుకే ఇది ఎటర్నల్ సైన్స్. అందుకనే సంస్కృత వ్యాకరణంపై పెద్దగా అవగాహన లేని ఈనాటి తరం వారికి ఆయుర్వేద గ్రంథాలు కొరుకుడు పడని కొయ్యగా మిగిలిపోయాయి. సంస్కృత భాషను నేర్చుకొని చదివే ప్రయత్నం చేసినా కూడా విషయం సంక్లిష్టగా (complex) వ్యక్త పరచడం వల్ల శాస్త్రం సులువుగా అర్థం కాదు. ఆయుర్వేద గ్రంథాల్లో సుమారు 5% శాస్త్రం మాత్రమే నేడు వినియోగంలో కనపడుతున్నది. అది కూడా కేవలం వ్యాధుల చికిత్స రూపంలో కనపడుతోంది. శాస్త్రం ఔన్నత్యాన్ని తెలిపే విషయాలు ఏవి నేటి సమాజంలోని వారికి తెలియనే తెలియవు. అందుకే నేటి సమాజానికి ఆయుర్వేదం పట్ల పూర్తి విరుద్ధమైన అవగాహన మాత్రమే ఉన్నది. మరి ఆయుర్వేదం నిజస్వరూపం ఏమిటో సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఆయుర్వేదం వైద్యశాస్త్రం కాదు. వైద్యశాస్త్రం ఆయుర్వేదంలో ఒక చిన్న విభాగం మాత్రమే. జీవము జీవ సముదాయము వాటి జనన జీవన మరణాలు; ఈ సందర్భాలలో వాటికి ఉపయోగపడే వివిధ వస్తు సముదాయాలు, వాటి జననం గుణగణాలు లక్షణాలు, ప్రభావాలు, పరిణామాలు, వీటికి, ప్రాణులకు మధ్య ఉన్న సంబంధాలు, వాటి మంచి చెడు ప్రభావాలు, నేల, నీరు, నిప్పు, గాలి ఆకాశాల (పంచ మహాభుతాల) ఉత్పత్తి, వాటి గుణగణాలు, వీటి వల్ల వాతావరణం, రుతువులు ఏర్పడే పద్ధతి, వీటికి, జీవ నిర్జీవ వస్తు సముదాయా లకు మధ్యగల సంబంధం, వీటిపై వాటి ప్రభావం, నేల నీరు నిప్పు గాలి లోగల ప్రధానమైన రకాలు వాటి గుణదోషాలు, జీవరాశుల మొక్కలలోని ప్రధానమైన జాతులు, వాటి శరీర భాగాలు, వాటి గుణగణాలు, ఉపయోగాలు, మనిషి పుట్టే విధానం, శరీర నిర్మాణ పద్ధతి, దానిలోని వివిధ అంశాలు, శరీర ప్రధాన అంగాలు ఉపాంగాలు అవయవాలు వాటి ఉత్పత్తి, గుణగణాలు, కార్యాలు, వాటి కార్యాలను నడిపిస్తూ వాటి మధ్య సమన్వయాన్ని కుదిరించి ప్రాణి ప్రాణాన్ని కాపాడే అంశాలు, వాటి విశిష్టత, శరీరం వివిధ దశలు, లింగ వివేచన, వాటి విశిష్టతలు, వ్యక్తి వ్యక్తిత్వ నిర్మాణం విశిష్టత మొదలగునవన్నీ కూడా వివరించి చెబుతుంది.
ఆయుర్వేదం చెప్పిన ఒక విశిష్టమైన విషయమేమి టంటే సజీవ నిర్జీవ సముదాయాల మధ్య ఉన్న ఒక విశేషమైన అనుబంధం.వాటి మధ్య గల సమన్వయ పద్ధతి. అంటే మన చుట్టూ ఉన్న నిర్జీవ పదార్థాలు స్పందన రహితంగా తటస్థంగా ఉన్నట్లు అనిపిస్తున్న ప్పటికీ అవి మన కార్యకలాపాలకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటాయి. తదనుగుణంగా వాటి గుణగణాల్లో మార్పులు చేర్పులు కలుగుతుంటాయి. అందుకే మానవులు ధర్మపరులై సత్ప్రవర్తనతో తమ చుట్టూ ఉన్న సజీవ నిర్జీవ సముదాయముతో పద్ధతిగా వ్యవహరించాలని ఆయుర్వేదం సూచిస్తోంది. అంటే ఆయుర్వేదం మానవులకే కాదు సమస్త భూమండలా నికి హితము చేసేటువంటి మహత్తర శాస్త్రం. అంటే ఇది నా జీవితం నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను. మీరెవరు అనేందుకు అనేటువంటి ధోరణి సరియైనది కాదని, అలాంటి అసభ్యకర జీవన విధానం వల్ల చుట్టూ ఉన్న వస్తు సమూహాలు తమ సుగుణాలను కోల్పోతాయని ఆయుర్వేదం హెచ్చరిస్తొంది.
నేటి వరకు ఏ ఇతర జీవశాస్త్రాలకు, శాస్త్రజ్ఞులకు తెలియని, ప్రాణిలో ఉండే శరీరం, శరీర యంత్రాంగం, శరీర తంత్రం అనే మూడు ప్రధాన అంశాలు, వాటిలోని వివిధ భాగాలు, ఈ మూడిరటి స్థూల, సూక్ష్మ నిర్మాణం, వాటి వివిధ అంశాలు. పనితీరు, వాటి మధ్య సంబంధాలు, ఈ మూడిరటికి హితమైన, అహితమైన విషయాలు. ఈ మూడిరటికి గల ముప్పులు, వాటిని తొలగించుకొని వాటిని సంరక్షించుకొనవలసిన పద్ధతులు ఆయుర్వేదం వివరించి చెప్పింది. ఆరోగ్యం అంటే ఏమిటి? ఆరోగ్య సంరక్షణ, అభివృద్ధి, క్షయములలో ఈ మూడిరటి పాత్ర కోసం చాలా వివరించి చెప్పింది ఆయుర్వేదం. అదేవిధంగా ఆహారమంటేె ఏమిటి, ఆహారా పదార్థాలలో ప్రధానమైన రకాలు, వాటి సేకరణ సమయం, ఆహారం వండ వలసిన పద్ధతి, ఆహారం పై వివిధ పాత్రల, సమయం ప్రభావం, భోజనం చేయవలసిన విధానం, ఆహార ప్రమాణం, తమకు సరిపడని పదార్థాలను తిరిగి సరిపడేలా చేసుకొనే పధ్ధతి, తమకు హితవు కాని పదార్ధాలు అలవాటైపోతే వాటిని విడిపించకొనే పధ్ధతులు, శరీర కార్యాలు వ్యాధులు వాటి చికిత్సలపై ఆహారం ప్రభావం మొదలైన అనేకమైన విషయాలను తెలిపింది. శరీరం, శరీర యంత్రాంగం పనితీరు, వ్యాధుల రకాలు, వ్యాధులు ఉత్పత్తి చెందే పద్ధతి, రోగిని రోగాన్ని పరీక్ష చేసి రోగాలను నిర్ధారించే అనేకానేక పధ్ధతులు, వివిధ రకాల వ్యాధులు వాటి సాధ్యాసాధ్యతా లక్షణాలు, వాటి అనేక చికిత్స పద్ధతులు, చికిత్స చేయకుంటే సంభవించే విపరిణామాలు, ప్రాణాలను కాపాడే ఉత్తమ వైద్యుని, ఔషధం, పరిచారకుల, రోగి లక్షణాలు మొదలగు ఎన్నెన్నో విషయాలను చాలా చక్కని రీతిలో వివరించి చెప్పింది.
అంతేకాదు, శాస్త్ర విషయం విస్తృత తత్వాన్ని గమనించి వైద్యశాస్త్ర అంశాలను అలనాడే ఎనిమిది విభాగాలుగా (Specialization) విభజించి వివరించింది. సుమారు ఆరు వేల సంవత్సరాల పూర్వమే అక్షరబద్ధమె,ౖ నేటికీ లభిస్తున్న ఆయుర్వేద గ్రంథాలు సృష్టికి, జీవితానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలను ఇంత తార్కికంగా, క్రమపద్ధతిలో వివరించి చెప్పడం అనేది ఒక అద్భుతమైన, అనితర సాధ్యమైన విషయంగా కనిపిస్తుంది. ఆధునిక శాస్త్రీయ దృక్పథం గల నేటి మానవులకు ఊహకందని ఎన్నో విషయాలు శాస్త్రోక్తంగా విశ్లేషణాత్మకంగా ఆనాడే వివరించి చెప్పింది ఆయుర్వేదం. ఇక్కడ చెప్పిన విషయాలు చాలా కొద్దిగా ఉదాహరణార్థం మాత్రమే చెప్పినవి. నిజానికి శాస్త్రంలో ఉన్న విషయాలు అనే కానేకం అనంతంగా ఉన్నాయి. కాబట్టి మన ఆయుర్వేద శాస్త్రం అనేది అనన్యమైన, అజరామరమైన అత్యాధునిక శాస్త్రమని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నేటితరం తెలుసుకొనవలసిన ఇంతటి గొప్ప శాస్త్రాన్ని అలా అధ్యయనం చేయకుండా వదిలి వేయటం మన దౌర్భాగ్యం. కాబట్టి ఇంతటి గొప్ప ఆయుర్వేద శాస్త్రాన్ని అధ్యాయనం చేసి శాస్త్ర విషయాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తమవంతుగా నేటి యువత ముఖ్యంగా శ్రద్ధ, బుద్ధి కుశలత గలిగి వైద్యులుగా తయారు కావాలనుకున్నవారు ముందుకు రావాలి.
సర్వేజనః సుఖినోభవంతు.
– ప్రొఫెసర్ డాక్టర్ నార్లకంటి శ్రీధర్
డాక్టర్ బి.ఆర్.కె.ఆర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ఆచార్యులు