సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి భాద్రపద బహుళ త్రయోదశి – 30 సెప్టెంబర్‌ 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


భారత్‌కు సరిపడని తీరులో బాంగ్లాదేశ్‌లో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడి కల్లోలం అలా ఉండగానే మరొక పొరుగు దేశం శ్రీలంకలో మరొక పరిణామం జరిగింది. ‘మార్క్సిస్టు’ అనూర కుమార దిస్సనాయకె 9వ దేశాధ్యక్షునిగా సెప్టెంబర్‌ 23న ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంకకూ చైనాకూ మధ్య ఉన్న ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు, అనూర కుమార దిస్సనాయకె (ఏకేడీ) అనే పేరుకు ముందు మీడియా తగిలించిన ‘మార్క్సిస్టు’ విశేషణం కొన్ని అనుమానాలకు తావిచ్చేవే. భారత్‌కు సానుకూల అంశాలు కాకపోవచ్చునన్న నిర్ణయానికి వచ్చేటట్టు చేసేవే.అనూర కుమార ప్రాతినిధ్యం వహిస్తున్న జనతా విముక్తి పెరుముణ (జేవీపీ) చరిత్ర కూడా ఆ అనుమానాలను బలోపేతం చేసేదే. మార్క్సిస్టు దృక్పథం కలిగిన ఈ పార్టీ భారత వ్యతిరేకి అన్నది సుస్పష్టం.1971,1987,1990లలో ప్రభుత్వాలను కూలదోసేందుకు హింసాయుత మార్గంలో జేవీపీ అలజళ్లు లేవదీసింది. 1987లో భారత్‌ – శ్రీలంక మధ్య జరిగిన శాంతి ఒప్పందాన్ని కూడా జేవీపీ వ్యతిరేకించింది. కానీ 1990 నుంచి జేవీపీ ప్రజాస్వామ్యం వైపు మొగ్గిన క్రమంలో పార్టీలో వచ్చిన మార్పులు అనూర కుమారకు అనుకూలించాయి. ఆ నేపథ్యంలో ఎదిగిన నేత అనూర కుమార. ఈయన ఆ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌కు వచ్చినప్పుడు మన పట్ల సానుకూలత ఏర్పడిరదన్న మాట కూడా ఉన్నది. అందుకే అనూరను భారత్‌కు సన్నిహితుడవుతున్న చైనా అనుకూలుడన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

అనూర కుమార తన సమీప ప్రత్యర్థి ఎస్‌జేబీ నేత సజిత్‌ ప్రేమదాస మీద విజయం సాధించారు. అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే తొలి రౌండ్‌లోనే వైదొలిగారు. అయితే ఏ ఒక్కరికీ విజయానికి కావలసిన 50 శాతం ఓట్లు రాలేదు. దీనితో ద్వితీయ ప్రాధమ్య ఓట్ల లెక్కింపు తరువాత అనూర కుమార విజేతగా అవతరించారు. తానేమీ మాంత్రికుడిని కాననీ, ఈ దేశంలో పుట్టిన సాధారణ పౌరుడినేననీ, నేను చేయగలిగినవి కొన్ని ఉంటే, చేయలేనివీ కొన్ని ఉన్నాయని ఆయన ప్రమాణ స్వీకారం తరువాత అన్నారు. అలాగే ప్రపంచ అగ్రదేశాల సహకారం తీసుకుంటానని కూడా చెప్పారు. ఏ నాయకుడైన ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో మంచి మాటలే చెబుతారు. అయితే బాంగ్లాదేశ్‌లో మహమ్మద్‌ యూనస్‌ చెప్పిన మాటలు తరువాత ఏమైనాయో అందరికీ తెలుసు.

ఇప్పుడు అందరూ వేసుకుంటున్న ప్రశ్న ఒక్కటే. గత ఏడాది దారుణ సంక్షోభం కారణంగా తల్లకిందులైన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ మార్క్సిస్టు మూలాలు కలిగిన రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం వల్ల పునరుత్థానం చెందగలదా? నిజానికి దేశంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం, దాని వెన్నంటే వచ్చిన ఆర్థిక సంక్షోభాల నివారణకు ఇంతకు ముందు అధ్యక్షునిగా పనిచేసిన రణిల్‌ విక్రమ్‌ సింఘే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి రుణం తెచ్చారు. ఈ చర్యను అనూర కుమార తప్పు పడుతున్నారు. వారిదైన పరిభాషలో ‘ప్రజా వ్యతిరేకం’ అని వ్యాఖ్యానించారు. ఇంధనం ఇతర అత్యవసరాల ధరలు అంతర్జాతీయద్రవ్య నిధి సంస్థ రుణం తరువాతే దేశంలో తగ్గాయి. అయినా అనూర కుమార ఇలాంటి వ్యాఖ్య చేశారు. కానీ ఆయన పార్టీ జేవీపీని బట్టి, ఆ పార్టీకీ చైనాకు ఉన్న బంధాన్ని బట్టి ఆయన చైనాకు అనుకూలంగా ఉంటాడనే అంతా భావిస్తున్నారు. అదే సమయంలో శ్రీలంక సంబంధాల పరిధిలో భారత్‌తో సంయమనంతోనే వ్యవహరిస్తారన్న నమ్మకం కలిగించే పనిలో ఉన్నారు. అందుకు తగ్గట్టే శ్రీలంకలోని భారత దౌత్య కార్యాలయం కూడా వ్యవహరించింది. సెప్టెంబర్‌ 22వ తేదీన అనూర కుమార ఎన్నికైనట్టు ఫలితం వెలువడిన 90 నిమిషాలలోనే శ్రీలంకలో భారత హైకమిషనర్‌ సంతోష్‌ ఝా ఆయనను కలుసుకుని అభినందించారు. భారత్‌, శ్రీలంక సాంస్కృతిక కవలలేనని, ఆ బంధం మరింత పటిష్టం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విజన్‌ సాగర్‌ పథకం ప్రకారం పొరుగు దేశంగా శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉన్నదని ప్రధాని మోదీ కూడా ఘనంగా శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ ఫిబ్రవరిలో అనూర కుమార భారత్‌లో పర్యటించి, మన విదేశ వ్యవహారాల మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ను కలుసుకున్న తరువాత పరిస్థితులు మారాయనే చెప్పాలని విశ్లేషకులు అంటున్నారు. 2022 సంక్షోభంలో భారత్‌ అందించిన సహాయం మరువ లేనిదని శ్రీలంక వెళ్లిన తరువాత అనూర కుమార వ్యాఖ్యానించారు కూడా. ఐటీలో భారత్‌ సాధించిన నైపుణ్యాన్ని చూసి నేర్చుకోవాల్సినది ఎంతో ఉందని కూడా కితాబు ఇచ్చారు. నిజానికి భారత్‌ పట్ల శ్రీలంకలోని చాలా పార్టీల అభిప్రాయం సానుకూలంగానే ఉందని అనిపిస్తుంది. జేవీపీ, మరొక 28 పార్టీలు కలసి కూటమిగా ఈ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేశాయి. అదే ది నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పీపీ). ఆ పార్టీలు కూడా భారత్‌తో కలసి పని చేయాలన్న ఆకాంక్షనే వ్యక్తం చేయడం విశేషం. ఎన్‌పీపీ వామపక్ష భావజాలాన్ని పక్కన పెట్టినట్టే ఉంది. శ్రీలంకను ఆర్థికంగా పటిష్టం చేయడానికి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు ఈ కూటమి ఎన్నికల ప్రణాళికలోనే హామీ ఇచ్చింది. శ్రీలంకలో భారతీయులు కూడా పెట్టుబడులు పెట్టాలని వారు కోరుకుంటున్నారు. అయితే అనూర కుమార ఆదాని పెట్టుబడులను, హంబన్‌ టోటా నౌకాశ్రయంలో చైనా పెట్టుబడులను సమంగానే దుయ్యబడతారు.

బాంగ్లాదేశ్‌లో వచ్చిన మార్పు, శ్రీలంకలో వచ్చిన మార్పు ఒకటి కాదు. బాంగ్లాదేశ్‌ పరిణామాలలో ఇస్లామిస్టులు, ఐఎస్‌ఐఎస్‌, పాక్‌ అనుకూల శక్తులు కీలకం. కానీ శ్రీలంక పరిణామాలలో ఒక సిద్ధాంతానికి సంబంధించిన జాడ ఉంది. పైగా మౌఢ్యానికి దూరంగా జరుగుతున్న క్రమం కనిపిస్తున్నది. దీనినే భారత్‌ దౌత్యపరంగా తనకు సానుకూలం చేసుకొనే ప్రయత్నం మొదటే చేయడం పెద్దరికాన్ని నిలుపుకోవడమే.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE