– వేముగంటి శుక్తిమతి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

ఆదివారంనాడు ఆలస్యంగా నిద్రలేవడం, లేచాక ఆమూలాగ్రం పేపర్‌ చదవడంలో ఉన్న ఆనందం నాకు దేనిలో ఉండదు.

‘‘మీరు పేపరు పట్టారంటే ఓమానాన వదలరు. ఆదివారం సినిమాకెళ్లటం, షాపింగ్‌ చేయడం, హోటల్‌ భోజనం అన్నీ మరో ఆదివారానికి వాయిదా’’ లోపలి నుండి సుమతి గొంతు.

ఇంతలో ఫోను మోగింది. వంటింట్లో ఉన్న సుమతి గబగబా బయటికి వచ్చి చేతితో సుదుటిని వాయించుకుంటూ చిరాకుగా మొహం పెడితే పట్టించుకోకుండా ‘‘రఘు ఫోన్‌’’ సంతోషంతో అంటూ వాడితో ఫోన్లో మాట్లాడి మరోమారు నా జీవితాన్ని నెమరు వేసుకున్నాను.

‘నాన్న కిష్టమైన చదువు, అమ్మకిష్టమైన పెళ్లి, భార్యకిష్టమైన డబ్బు, నగలు ఇలా నా జీవితం జరిగిపోతుంది’.

‘మంచి ఇల్లు, ఇల్లాలు, డబ్బు, అంచలంచలుగా ఉద్యోగంలో ప్రమోషన్లు, హోదా అన్నీ ఉన్నా మనసులో ఏదో అశాంతి నా ఆత్మను కట్టిపడేసి ఎదుటివారి మెప్పుకోసం చేస్తున్న ఒక్కొక్క పని నన్ను పాముల కాటేస్తూ, నా స్వభావానికి నా ప్రవర్తన భిన్నంగా ఉన్నట్టు నా లోపల ఇంకెవరో ఉండి నన్ను నియంత్రిస్తున్నట్లు భావన,’

‘నా చుట్టూ నేను పనిచేసే కార్పొరేట్‌ ప్రపంచం లోని అలజడి. కంప్యూటర్‌ తో పాటు నేను కూడా యంత్రమై సాగించే డబ్బు వేట, హడావిడి’.

‘నాకు ఫోన్లో రఘ చెప్పిన మాటలు మరోసారి మనసులో మారుమోగాయి.’

‘ఈ రోజు క్యాన్సర్‌ ఆస్పత్రిలో అన్నదాన శిబిరం ఏర్పాటు అవుతుందని, అక్కడికి నన్ను రమ్మని, ఆ అర్ధాకలితో ఉన్న రోగులకు, వారి బంధువులకు వాళ్ల  స్వచ్ఛంద సంస్థ ద్వారా సంతృప్తిగా భోజనం పెట్టే కార్యక్రమంలో పాల్గొనడమనే అవకాశం భగ వంతుడు కేవలం మానవుడికే ఇచ్చాడని, దీనివలన ఆత్మ సంతృప్తితోపాటు అర్థవంతమైన జీవితం గడిపామని భావన వస్తుందని, ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దని, తనకు తోచినంత విరాళం ఇవ్వమని…’’

నా మనసులో ఆనందం ఊటబావిలో నీరూరినట్లు ఊరుతుంది.

సాటిమనిషి సహాయార్థ అవయవ దానం, గోదానం, భూ దానం, సువర్ణ దానం, వస్త్ర దానం, విద్యా దానం మొదలైనవన్నీ పరోపకారాలే.

అయినా అన్నింటికంటే ముందుండేది అన్న దానం.

అక్కడి వాళ్లందరూ మొక్కుబడిగా కాకుండా సేవాతత్పరతతో బాధ్యతగా పని చేస్తున్నారు.

వాళ్లంతా ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నా వేరే మాటలేవీ మాట్లాడుకోకుండా ప్రతిఒక్కరూ వంట చేసే పనిలో నిమగ్నమైనారు. అందరూ గ్రీన్‌ డ్రెస్‌ వేసుకున్నారు. నాకూ ఒకటి ఇచ్చారు.

ఆకుపచ్చ రంగు శక్తిని, బతుకును గాక పచ్చని జీవితానికో గుర్తు.

వంట పూర్తయింది. మేమందరం ఒక్కొక్క పదార్థాన్ని టేబుళ్ల మీదికి చేర్చాం.

విశాలంగా, శుభ్రంగా ఉన్న ఆ స్థలానికి వచ్చిన ఒక్కొక్కరు ప్లేట్లలో మేము వడ్డిస్తున్న రకరకాల పదార్థాలను చూస్తూ కృతజ్ఞతా భావంతో మా అందరివైపు ఓసారి చూసి తినడం మొదలుపెట్టారు.

ఇంట్లో విశాలమైన దైనింగ్‌ టేబుల్‌  మీద అందమైన పింగాణి పాత్రల్లో ఉన్న వంటకాలను వడ్డించుకుని ఆకలి ఉన్నా లేకున్నా సున్నితంగా, నాజూగ్గా తినీ తిననట్లు తినడానికి ఇక్కడ వీళ్లు ఆత్రంగా అవురావురని తినటానికి ఎంతో వ్యత్యాసం అనిపించింది.

వీళ్లు తినే అన్నంలో పరబ్రహ్మ స్వరూపం కనిపిం చింది.

డబ్బే ముఖ్యం అనుకునే వాళ్లు మనుషుల్ని ప్రేమించలేరు.

మానవసంబంధాలు ఆర్థిక అవసరాలను నిర్దేశించే ప్రమాద స్థితిలో ఈ సత్కార్యం రాయిని వెన్న ముద్దలా మార్చే మహా ప్రయత్నంలా అనిపించింది నాకు..

ఆకలి అందరికీ ఒకటే. ఆకలి తీర్చే విషయంలో దరిద్రుడినీ, ధనికుడిని  ఒకటి చేసేది ఈ అన్నమే.

వేగం అభివృద్ధి మాటున ఉక్కిరిబిక్కిరి అవుతున్న మానవ సంబంధాలన్నీ ఇక్కడ సజీవంగా మారినట్లు అనిపించింది.

ఇంటికి చేరేసరికి చాలా చీకటైంది. ఇంట్లో అంతా తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది. ఎవరినీ పలకరించకుండా మేడమీదికి వెళ్లాను.

ఇన్నాళ్లూ నేనొక డబ్బు సంపాదించే యంత్రంగా ఉన్నాను.

నాలో తెలియని ఆర్ద్రత, సేవాదృక్పథం ఉందని ఈనాడే తెలుసుకున్నాను.

ఆఫీస్‌కెళ్లేసరికి నేను చేసిన రెండు మూడు ప్రాజెక్టులు విజయవంతమై కంపెనీ ఆదాయం పెరిగిందని అభినందనల వర్షం. కానీ ఆ పొగడ్తలన్నీ ఇంతకుముందులా చెవులకు విందుగా, మనసుకు ఆనందంగా లేవు.

‘‘ఇంత గొప్ప సక్సెస్నిచ్చిన నీకు కారు గిఫ్ట్స్‌ ఇస్తున్నాను’’ ఎం.డి మాటలు.

ఇంకా ఎవరెవరో వచ్చి ఏవేవో మాటలతో పొగిడేస్తున్నారు.

‘‘ఇంటికి వెళ్లగానే  ‘కప్పు కాఫీ ఇస్తావా సుమతీ?’ కుర్చీలో కూర్చుంటూ అడిగాను.

‘‘ఓప్‌ా. దానికేం తక్కువ! కప్పు కాఫీ కాకుంటే రెండు కప్పులిస్తాను’’ ఆమె కోపాన్ని ప్రదర్శించింది.

సుమతి అనవసరంగా కోపం తెచ్చుకునే మనిషి కాదు. అందుకే ఆమె మొహంలో కాసేపట్లో ప్రశాంతత నెలకొంది.

‘‘సుమతీ! నువ్వు అనుకున్నట్టు నీకు ఆదివారపు ఆనందాలేవి ఇవ్వలేక పోయాను. లక్షల ఖరీదు చేసే కారు గిఫ్ట్స్‌ ఇంటికి తెస్తున్నప్పుడు కూడా నాకు ఏ అనుభూతి కలగలేదు.’’

‘‘ఏంటండీ! మీరు, ఈ రోజు వింతగా మాట్లాడు తున్నారు?’’

‘‘అదే ఆదివారం గురించి. ఆదివారం అంటే విశ్రాంతి తీసుకునే రోజు, నాకు తెలుసు. కానీ అనుకోకుండా ఈ ఆదివారం నేను పాల్గొన్న అన్నదాన కార్యక్రమంలో కడుపు నిండిన వాళ్లు మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభావంతో ‘‘థాంక్యూ’’ అన్న ఆ చిన్న మాటలో వెలకట్టలేని భావన నాకు కలిగింది.

‘‘సుమతీ… రఘు నా స్నేహితుడని మాత్రమే నీకు తెలుసు. కానీ స్నేహం కంటే ఎక్కువ వాడంటే నాకు గౌరవం. ఆదర్శం. మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకటే. అయినా అందుకు విరుద్ధంగా మా ఇద్దరి పరిస్థితులూ మా జీవిత గమ్యాన్ని కూడా విభిన్నం చేశాయి.

ఆర్థికంగా చితికిపోయిన వాడి కుటుంబం కోసం వాడి జీవితం త్యాగం చేశాడు.

బాధ్యతలు మోయటానికి బ్రహ్మచారిగానే మిగిలి పోయా డు.

‘‘అయినా ఎన్నెన్నో స్వచ్ఛంద సంస్థలతో సంబంధం పెంచుకొని తనవంతుగా విరాళాలు సేకరిస్తాడు. కొందరు సహృదయంతో సహాయపడితే మరికొందరు బలీయంగా అవమానాలు చేస్తారు.’’

‘‘ఎందుకంటే డబ్బున్న ప్రతి వాడికి ఉదారత్వ ముండదు. ఉదారత్వమున్న ప్రతివాడికి డబ్బు ఉండక పోవచ్చు.’’

‘‘సరే, నా రెండు ప్రాజెక్టులు సక్సెస్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కాసేపలా తిరుగుదాం. పిల్లల్ని రెడీ చెయ్‌’’ అంటూ లేచాను.

అనుకున్న సమయానికి అందరం హోటల్‌కు  చేరాం.

‘‘సుమతీ ఏమి ఆర్డర్‌ చేద్దాం?’’ హోటల్‌ బాయ్‌ ఇచ్చిన మెనూ చూస్తూ అన్నాను.

‘‘మీ ఇష్టం’’ నిరాసక్తిగా అంది సుమతి,

ఎన్నోసార్లు వెళ్లిన ఆ హోటల్‌ ఆ రోజు కొత్తగా, పరాయిగా అనిపించింది. చుట్టంతా డబ్బు పెట్టుబడి పెట్టి లాభాల కోసం చూసే ప్రదేశంగా, వాళ్లు మాట్లాడుకునేదంతా వ్యాపారధోరణిలా అనిపించింది. అక్కడున్న పదార్థాలన్నీ డబ్బువాసన వస్తున్న వింత భావన.

‘‘ఏమండీ!’’ సుమతి పిలుపుకు ముందున్న పదార్థాన్ని స్పూన్‌తో కెలుకుతూ ఏదో ఆలోచిస్తున్న నేను ఈ లోకంలోకి వచ్చాను.

‘ఇది కాకుండా ఇతరుల కడుపు నింపే స్థానం ఎక్కడుందో అక్కడికి మీతోపాటు నేనూ వచ్చి ఆ పుణ్యకార్యాన్ని పంచుకుంటానండీ. ఇప్పుడు మీకు ఇష్టమైన ప్రపంచంలోకి మీరు ప్రయాణం చేయాలనుకుంటున్నారు. మీరే నా ప్రపంచమై నేను కూడా మీతో ప్రయాణిస్తాను’’ అంటూ అక్కడి నుండి లేచిన సుమతిని పిల్లలతోపాటు నేనూ అనుసరిం చాను.

సృజనాత్మకమైన ఏ కళైనా, పనైనా మనిషిని ఎంత ఎత్తుకు తీసుకుపోతుందో, ఎంతటి అలౌకికా నందాన్ని ఇస్తుందో ఆలోచిస్తున్న నాకు ఎంతో సేపటి వరకు నిద్రపట్టదు.

వడ్రంగి చేతిలో సుందరమైన కలప కళాకృతులు, కుమ్మరి చేతిలో రకరకాల మట్టిపాత్రలు, శిల్పకారి చేతిలో చిత్రవిచిత్ర శిల్పకళా ఖండాలను శ్రమ జీవులైనవారు సమాజం కోసం సంపదనుత్పత్తి చేసినట్టు నిస్వార్థం అనేది కూడా మనిషి సామాజిక స్పృహకు ఒక ఉత్పత్తి.

ప్రశాంతంగా నిద్రపోతున్న సుమతిని చూస్తున్న నాకు మంచి రోజులు వచ్చినట్లు అనిపించింది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE