క్రాంతి

దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా ఓ తీవ్రవాద సంస్థ హస్తం కనిపిస్తుంది. అదొక మతం వారిది. దీనితో మమ్మల్నే ఎందుకు అనుమానిస్తున్నారంటూ ఆ మతం వారు తెచ్చిపెట్టుకున్న అమాయకత్వంతో ప్రశ్నిస్తారు. అప్పుడు సెక్యులర్‌, ఓటు బ్యాంకు రాజకీయాలు రంగం మీదకు వస్తాయి. ఎప్పుడూ ఆ మతం వారే నిందితులా? హిందుత్వానికి కూడా తీవ్రవాదం మరక అంటిస్తే పోలా? అన్న ఆలోచన వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ పాలిస్తున్న రోజులనాటి ఇలాంటి కుట్ర ఆలోచన నుంచి ఊపిరి పోసుకున్నదే మాలేగావ్‌ పేలుళ్ల కేసు (2008). కానీ హిందుత్వకు తీవ్రవాదాన్ని అంటగట్టే ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. అభియోగాలను ఎదుర్కొన్నవారంతా నిరపరాధులేనని, కుట్ర పన్నారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తేలినా కేసులు మాత్రం కొనగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలంతో ఈ కుట్రలపై మరోసారి చర్చ జరుగుతోంది.

ముంబై ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో డిసెంబర్‌ 28, 2021 తేదీన ఓ ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన వాంగ్మూలం కేసును కీలక మలుపు తిప్పి, యావద్దే శాన్ని ఆకర్షించింది. ‘నాటి ఎంపీ, నేటి యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, ఇంద్రేశ్‌ కుమార్‌, దేవధర్‌, కాకాజీ సహా ఐదుగురు ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యుల పేర్లు చెప్పాలని నన్ను ఒత్తిడి చేశారు. ఏటీఎస్‌ నన్ను ఇంటి నుండి తీసుకెళ్లి పుణే, ముంబైలలోని నిర్బంధ కేంద్రాలలో హింసించింది. వారు నా కుటుంబంతో పాటు ఎంతో మందిని బెదిరింపులు, వత్తిళ్లు, వేధింపులకు గురిచేశారు. నేను ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల చెప్పకపోతే విడుదల చేయబోమని, జీవితాన్ని నాశనం చేస్తామనీ, నీ భార్యను ఏదైనా చేస్తాం అంటూ బెదిరించారు. బెదిరించిన వారిలో పరంబీర్‌తో సింగ్‌ (ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌), మరో అధికారి కూడా ఉన్నారు’ అని ఆ సాక్షి చెప్పారు. అభినవ్‌ భారత్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన అంగీకరించాడు. సంస్థ పని తీరు, ఆర్థిక అంశాలు తనకు తెలియవని చెప్పాడు. అభినవ్‌ భారత్‌ యువత కోసం పని చేసేదని తెలిపాడు. తాజా వాంగ్మూలంతో గతంలో ఈ సాక్షి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అంగీకరించబోమని ఏటీఎస్‌ ప్రకటించింది. మాలేగావ్‌ కేసులో న్యాయస్థానం ముందు ఇప్పటివరకూ సాక్ష్యం ఇచ్చిన వారిలో ఇతడు 40వ వ్యక్తి. మొత్తం 220 మంది సాక్షులను విచారించారు. వారిలో 15 మంది అంతకుముందు తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడారు.

 మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ప్రస్తుత లోక్‌సభ సభ్యురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌, సమీర్‌ కులకర్ణి, సుధాకర్‌ చతుర్వేది, సుధాకర్‌ ద్వివేది, రమేష్‌. ఉపాధ్యాయ్‌, అజయ్‌ రాహికర్‌ తదితరులు నిందితులు. పరమ్‌బీర్‌ సింగ్‌ ఇటీవల మనీలాండరింగ్‌ కేసులో మరోసారి తెరమీదకు వచ్చారు. దోపిడీ, ఇతర కేసులు ఎదుర్కొంటున్న ఆయనను ఈ మధ్యనే మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

మాలేగావ్‌లో ఏం జరిగింది?

సెప్టెంబర్‌ 8, 2006న మహారాష్ట్రలోని మాలేగావ్‌ జామా మసీదులో శుక్రవారం ప్రార్థనలు ముగిశాక వరుస పేలుళ్లు జరిగాయి. 37 మంది మరణించారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్‌ స్క్వాడ్‌ (ఏటిఎస్‌) అధికారులు కేసు దర్యాప్తు చేశారు. ఏడుగురితో నిందితుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ఇద్దరు పాకిస్తానీయులు. సెప్టెంబర్‌ 29, 2008న మళ్లీ వరుస పేలుళ్లు జరిగాయి. ఆరుగురు చనిపోగా, 101 మంది గాయపడ్డారు. రంజాన్‌లో జరిగిన ఆ పేలుళ్లు ఆందోళన కలిగించాయి. అప్పుడే కుట్ర సిద్దాంతం పురుడు పోసుకుంది.

మాలేగావ్‌ పేలుళ్ల కోసం ఓ మోటర్‌సైకిల్‌ను ఉపయోగించారని, ఆ వాహనం సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ పేరు మీద ఉందని ఏటీఎస్‌ అధికారులు తెలిపారు. ‘అభినవ్‌ భారత్‌’ ఈ పేలుళ్లకు కుట్ర పన్నిందని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఆ తర్వాత దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఏకు అప్పజెప్పారు. పేలుడు సామాగ్రిని సమకూర్చింది తనేనని కల్నల్‌ పురోహిత్‌ ఓ రహస్య సమావేశంలో అంగీకరించినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. అయితే రాజకీయ ప్రయోజనంతోనే తనను కేసులో ఇరికించారని కల్నల్‌ కోర్టులో చెప్పారు. జనవరి 20, 2009న ఏటీఎస్‌ అరెస్ట్‌ చేసిన 11 మంది, పరారీలో ఉన్న మరో ముగ్గురిపై మొదటి చార్జిషీటు దాఖలయింది. నిందితులు తమపై ఎంసీఓసీఏ చట్టం కింద కేసు నమోదు చేయడంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు.

మే 13, 2016న ఎన్‌ఐఏ అధికారులు మరో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అందులో రమేష్‌ ఉపాధ్యాయ్‌, సమీర్‌ శరత్‌ కులకర్ణి, అజయ్‌ రాహిర్కార్‌, రాకేష్‌ ధావ్డే, జగదీష్‌ మహాత్రే, కల్నల్‌ ప్రసాద్‌ శ్రీకాంత్‌ పురోహిత్‌, సుధాకర్‌ ద్వివేది అలియాస్‌ స్వామి దయానంద్‌ పాండే, సుధాకర్‌ చతుర్వేది, రామచంద్ర కాల్సంగ్ర, సందీప్‌ దాన్గే నేరం చేశారనడానికి బలమైన ఆధారాలున్నాయని తెలిపారు. 2016లో దాఖలు చేసిన ఛార్జిషీటులో ఎంసీఓసీఏ కింద నమోదు చేసిన అభియోగాలను తొలగించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను మెల్లగా కొనసాగించాలంటూ ఎన్‌ఐఏ తనపై వత్తిడి తెస్తున్నా రంటూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రోహిణి సాలియా 2015లో రాజీనామా చేశారు.

హిందూ ఉగ్రవాదం పేరుతో

ఒక గీతను చిన్నగా చూపాలంటే పక్కనే పెద్ద గీత గీయాలి. ముస్లిం ఓటు బ్యాంకును నిలుపుకోవాలి అంటే హిందుత్వాన్ని బూచిగా చూపాలి. కాంగ్రెస్‌ చేసిన పని ఇదే. దేశంలో ఏ ఉగ్రవాదుల దాడి చూసినా ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ముంబాయి, కోయంబత్తూరు, ఢల్లీి, పుణే, హైదరా బాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, వారణాసి, జైపూర్‌లలో పేలుళ్లు జరిగినా, ఆలయాలు, రైళ్లు-బస్సులు పేల్చివేతకు గురైన ప్రతిసారి వాటి వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. పాకిస్తాన్‌-ఐఎస్‌ఐ. ఎన్నో దాడులకు పాల్పడి వేలాది మంది ప్రాణాలు తీసుకున్నాయి. పార్లమెంటుపై, ముంబైపై దాడికి తెగబడి మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నించాయి. ఉగ్రవాదులు ఒక మతానికి చెందిన వారా, కాదా అనే చర్చ పక్కన పెడితే, ఉగ్రవాదులుగా ఒకే మతం వారే ఎక్కువగా ఎందుకు ఉంటున్నారని సగటు భారతీయుడు ప్రశ్నించిన సమయం అది.

 సెప్టెంబర్‌ 8, 2006న మాలేగావ్‌లో, ఫిబ్రవరి 18, 2007 అర్ధరాత్రి పానిపట్టు వద్ద సంరaౌతా ఎక్స్‌ప్రెస్‌లో, మే 18, 2007న హైదరాబాద్‌ మక్కా మసీదులో, అక్టోబర్‌ 11,2007న అజ్మీర్‌ మొయినుద్దీన్‌ చిస్తీ దర్గాలో బాంబులు పేలాయి. పెద్ద సంఖ్యలో అమాయకులు మరణించగా, ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనలు జరిగిన రాష్ట్రాలన్నింటిలోనూ కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉంది. ఆయా రాష్ట్రాల పోలీసులు జరిపిన దర్యాప్తుల్లో ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ ఈ ఘాతుకాలు పాకిస్తాన్‌ ప్రేరిత ఇస్లామిక్‌ టెర్రరిస్టు ముఠాలు చేసిన పనే అని తేల్చాయి.

ఈ సమయంలోనే కుట్రలకు తెర తీసింది నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌. ఇందులో భాగమే ‘హిందూ ఉగ్రవాదం’, ‘కాషాయ ఉగ్రవాదం’ అనే లేని సమస్య సృష్టి. మాలేగావ్‌, సమ్‌రaౌతా, మక్కామసీదు, అజ్మీరు షరీఫ్‌ పేలుళ్లలో మృతులు దాదాపు ముస్లింలే ఉండటాన్ని సాకుగా చూపించారు. తద్వారా బీజేపీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ సంస్థలను అప్రతిష్టపాలు చేయటం తేలిక అవుతుందని భావించారు. ఈ ఘటనల వెనుక అనుమానిత జాబితాలో ఇస్లామిక్‌ టెర్రరిస్టు ముఠాలు లష్కరే తోయిబా, జైష్‌-ఎ-మొహమ్మద్‌, సిమిలతో బాటు బజరంగ్‌దళ్‌నూ చేర్చింది మహారాష్ట్ర ఏటీఎస్‌. ఆ తర్వాత హిందూ సంస్థల దగ్గర అంతటి విధ్వంసక వనరులు లేవన్న కారణంతో బజరంగదళ్‌ పేరు తీసేసింది.

సంరaౌతా పేలుడు వెనుక అల్‌ కాయిదా ఉందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కమిటి జూన్‌ 6, 2009న అధికారికంగా తీర్మానం చేసిన సంగతి గుర్తు చేసుకోవాలి. కానీ కాంగ్రెస్‌ నాయకత్వానికి ఆ సమయంలో ఈ నిజంతో అవసరం లేదు. నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఎ), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)పై రాజకీయ వత్తిడితో పథకం ప్రకారం కేసులు, అరెస్టులు అమలయ్యాయి. వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు బాకా ఊదాయి. మీడియాను వాడుకున్నాయి.

చిత్రహింసలకు గురైన సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌

మాలేగావ్‌ పేలుళ్ల పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌. సన్యాసం స్వీకరించి హిందూ ధర్మ ప్రచారం కోసం జీవితాన్ని అంకితం చేశారు. ఆమెను తొమ్మిదేళ్లు హింసించారు. మహిళ, సన్యాసిని అని చూడలేదు. క్యాన్సర్‌తో బాధపడుతున్నా వైద్య సహాయం ఇవ్వలేదు. కన్న తండ్రి మరణించినా కడసారి చూపునకు నోచుకోనివ్వలేదు. ఈమె ప్రమేయానికి సాక్ష్యంగా పేలుళ్ల కోసం వాడిన స్కూటర్‌ను చూపించారు. వాస్తవానికి ఆమె సన్యాసం స్వీకరించడానికి ముందే ఆ స్కూటర్‌ అమ్మేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ చివరకు యూటర్న్‌ తీసుకుంది. మహారాష్ట్ర కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ఆక్ట్‌(మోకా) చట్టం ప్రకారం సాధ్విపై విచారణ జరుగుతోంది. చట్టవిరుద్ధ చర్యల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద అభియోగానికి అవకాశం ఉన్నా మోకా కింద విచారణకు అర్హత లేదని భావించింది. మహారాష్ట్ర ఏటీఎస్‌ అధికారి హేమంత్‌ కర్కరే దాఖలు చేసిన చార్జిషీట్‌లో లోపాలున్నాయని అభిప్రాయపడిరది. పురోహిత్‌ పైన దాఖలు చేసిన అభియోగాలు కల్పితంలా ఉన్నాయని, బలప్రయోగంతో చేసినవిగా ఉన్నాయని ఎన్‌ఐఏ తెలిపింది. ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌, శివ్‌ నారాయణ్‌ కాల్‌సంగ్ర, శ్యామ్‌ భావర్‌లాల్‌ సాహు, ప్రవీణ్‌ తక్కల్కి, లోకేష్‌ శర్మ, ధన్‌సింగ్‌ చౌదరీలను విచారించేందుకు వాస్తవ ఆధారాలేవీ లేవని తెలిపారు. 2017 ఏప్రిల్‌లో సాధ్వికి బెయిల్‌ ఇచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆమెపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

కాంగ్రెస్‌ కుట్రలకు బలైన పురోహిత్‌

విధి నిర్వహణలో ఉన్న సైనిక అధికారి లెఫ్టినెంట్‌ కల్నల్‌ శ్రీకాంత్‌ ప్రసాద్‌ పురోహిత్‌ యూపీఏ ప్రభుత్వం కుట్రతో అన్యాయంగా జైలు పాలయ్యారు. ఆయన మీద హిందూ ఉగ్రవాది ముద్రవేశారు. ఈ కేసులో 2008లో అరెస్టయిన పురోహిత్‌ మొత్తం 8 సంవత్సరాల 9 నెలల 22 రోజుల జైలుశిక్ష అనుభవించారు. మొదట మరాఠా లైట్‌ ఇన్‌ఫాంట్రీలో పని చేసిన పురోహిత్‌ అరెస్ట్‌ అయినపుడు మిలటరీ ఇంటలిజెన్స్‌లో పనిచేస్తున్నారు. పురోహిత్‌ విధి నిర్వహణలో భాగంగా ‘అభినవ్‌ అనే హిందూ’ గురించి సుధాకర్‌ చతుర్వేది ద్వారా సమాచారం సేకరించేవారు. కానీ పురోహితే స్వయంగా ‘అభినవ్‌ భారత్‌’ను నడిపిస్తున్నట్టు, సుధాకర్‌ చతుర్వేది అతడికి సహకరించినట్టు కేసు బనాయించారు. మాలేగావ్‌ పేలుళ్లకు సూత్రధారీ, సమ్‌రaౌతా పేలుడుకు ఆర్డీఎక్స్‌ను సప్లయి చేసిందీ ఆ సైన్యాధికారేనంటూ కట్టుకథ అల్లారు.

మాలేగావ్‌ నేరాన్ని అంగీకరించాల్సిందిగా వత్తిడి తెస్తూ తనపై సాగించిన చిత్రహింసల గురించి పురోహిత్‌ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. నేరాన్ని అంగీకరించకపోతే పురోహిత్‌ ఇంటి దగ్గర బాంబులు దొరికినట్లు సాక్షాలు సృష్టిస్తామని ఏటీఎస్‌ అధికారులు బెదిరించారని ఆయన ఆ లేఖలో చెప్పారు. ఇంకా ఆయన తల్లిని, భార్యను జైలుతో పెడతామని, పిల్లలు అనాథలవుతారని భయపెట్టారు. రోజుల తరబడి వ్రేలాడదీసి కొట్టారు. హిందూ తీవ్రవాదం అభియోగాన్ని బలపరచుకోవడానికి కాంగ్రెస్‌ పురోహిత్‌ను ద్రోహిగా చిత్రీకరించినట్లు స్పష్టమైపోయింది. ఈ కుట్రను రిపబ్లిక్‌ టీవీ బయట పెట్టింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ రాసిన అధికారిక రహస్య ఆర్మీ ఫైల్‌ నంబర్‌ A/31687/ూఖRూనIు/వీI-9 లేఖను ఇందుకు ఆధారంగా చూపింది. 2017 ఆగస్టులో కల్నల్‌ పురోహిత్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో కల్నల్‌ శ్రీకాంత్‌కు స్వాగతం పలకడానికి మూడు సైనిక వాహనాలు రావడం చర్చనీయాంశ మైంది. ఒక నెల తర్వాత సుధాకర్‌ చతుర్వేదికి బెయిల్‌ మంజూరైంది.

2017 డిసెంబర్‌లో ‘మహారాష్ట్ర ఆర్గనైజ్డ్‌ క్రైం కంట్రోల్‌ లా’ అధికారులు.. మాలేగావ్‌ వరుస పేలుళ్ల కేసు నుంచి సాధ్వి ప్రజ్ఞా, కల్నల్‌ పురోహిత్‌ పేర్లను మినహాయించారు. ప్రస్తుతం వీరిద్దరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం, ఐపీసీ కింద కేసు ఎదుర్కొంటున్నారు. పురోహిత్‌ తీవ్రవాదానికి పాల్పడుతున్న గ్రూపుల వెన్ను విరిచారని, అందుకే ఆయనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ అండర్‌ సెక్రటరీ ఆర్‌విఎస్‌ మణి వెల్లడిరచారు.

నిర్దోషిగా అసీమానంద

 ‘హిందూ ఉగ్రవాద’ కుట్రకు బలైన వారిలో స్వామి అసీమానంద ఒకరు. హైదరాబాద్‌ మక్కా మసీదు టిఫిన్‌ బాంబు కేసులో ఇరికించారు. అసీమానంద అసలు పేరు నబా కుమార్‌ సర్కారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ స్వస్థలం. జీతన్‌ ఛటర్జీ, ఓంకార్‌నాథ్‌ అనే పేర్లతోనూ ఆయన్ను పిలుస్తారు. తన అనుచరులతో కలిసి శబరిధామ్‌ ఆశ్రమాన్ని నడిపారు. మతం మారిన గిరిజనులను తిరిగి హిందూమతంలోకి రప్పించడానికి కృషిచేశారు. ఆయనతో పాటు భరత్‌, దేవేందర్‌ గుప్తా, రాజేందర్‌, లోకేశ్‌ శర్మలను మక్కామసీదు పేలుళ్ల కేసులో 2010 నవంబర్‌లో అరెస్టు చేశారు. నేరాన్ని అంగీకరించా లంటూ చిత్ర హింసలుకు గురి చేశారు. అ వత్తిడిని భరించలేక అసీమానంద నేరాన్ని అంగీకరించినా, పోలీసులు ఆధారాలను చూపించలేకపోయారు. చివరకు ఎన్‌ఐఏ న్యాయస్థానం ఈ కేసులో అసీమానందకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. భరత్‌, దేవేందర్‌ గుప్తా, రాజేందర్‌, లోకేశ్‌ శర్మను నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరించింది. ఏప్రిల్‌ 16న తీర్పు ఇవ్వటంతో పదకొండేళ్ల కాంగ్రెసు కుటిల నాటకానికి తెరపడిరది.

తెర వెనుక కాంగ్రెస్‌ పెద్దలు

కేంద్ర హోంశాఖ మాజీ అండర్‌ సెక్రటరీ ఆర్‌వీఎస్‌ మణి రాసిన ఃనఱఅసబ ువతీతీశీతీ-aఅ ఱఅంఱసవతీ aషషశీబ్‌ శీట ఎఱఅఱర్‌తీవ శీట నశీఎవ Aటటఱతీంః అనే పుస్తకం కాంగ్రెస్‌ పెద్దల కపట నాటకాలను బయట పెట్టింది. కాషాయ ఉగ్రవాదం అనే నకిలీ సిద్దాంతాన్ని తెర మీదకు తెచ్చిన దిగ్విజయ్‌ సింగ్‌, దివంగత ఐపీఎస్‌ అధికారి హేమంత్‌ కర్కరేల రహస్య బంధాలను అందులో ప్రస్థావించారు. 2006లో నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో బాంబు పేలుడు జరిగిన కొద్ది గంటల తర్వాత నాటి కేంద్ర హోంమంత్రి శివరాజ్‌ పాటిల్‌ తన కార్యాలయంలోకి ఆర్‌వీఎస్‌ మణిని పిలిచినప్పుడు అక్కడ దిగ్విజయ్‌, కర్కరేలు కూర్చొని ఉన్నారు. తాము సృష్టించిన నకిలీ హిందు టెర్రరిస్టు సిద్దాంతాన్ని అంగీకరింపజేందుకు సాధ్వి ప్రజ్ఞాసింగ్‌, కల్నల్‌ పురోహిత్‌లను చిత్ర హింసలకు గురి చేసిన పోలీసు అధికారుల బృందంలో హేమంత్‌ కర్కరే, పరంబీర్‌ సింగ్‌లు ఉన్నారు. నవంబర్‌ 26, 2008న జరిగిన ముంబాయి పేలుళ్లు కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుట్రేనా? అని ప్రశ్నించిన ఈ పుస్తకం దిగ్విజయ్‌సింగ్‌ చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. సుశీల్‌కుమార్‌ షిండే కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు జైపూర్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశ వేదికపై ‘బీజేపీ, ఆరెస్సెస్సు టెర్రరిజాన్ని వ్యాప్తి చెయ్యటానికి ట్రెయినింగ్‌ క్యాంపులు నడుపుతున్నాయి. సమ్‌రaౌతా ఎక్స్‌ప్రెస్‌, మక్కా మసీదు, మాలెగావ్‌ పేలుళ్లు ‘కాషాయ టెర్రరిజమే’ అని వ్యాఖ్యానించారు. షిండేకి ముందు కేంద్ర హోంమంత్రిగా పని చేసిన చిదంబరం 2010 ఆగష్టులో రాష్ట్రాల పోలీసు శాఖాధిపతుల భేటీలో ‘కాషాయ టెర్రరిజం’ గురించి హెచ్చరిక చేశారు.

నాకంటే గొప్ప హిందువు లేడంటూ రాహుల్‌ గాంధీ ఇటీవలి కాలంలో ప్రగల్భాలు పలుకుతున్నారు. హిందువులు వేరు, హిందుత్వ వేరు అని భాష్యాలు చెబుతున్నారు. కానీ గతంలో రాహుల్‌ గాంధీ ‘భగవా ఆతంక్‌వాద్‌’ అంటూ కాషాయ పవిత్రతకు, హిందూమతానికి ఉగ్రవాదాన్ని అంటగట్టిన విషయం దేశ ప్రజలు మరచిపోలేరు. రాహుల్‌ గాంధీ 2010 డిసెంబర్‌లో ఇస్లామిక్‌ టెర్రరిజం కంటే హిందూ టెర్రరిజమే ఎక్కువ ప్రమాదకారి అని అమెరికా రాయ బారితో చెప్పిన సంగతి వికీలీక్స్‌ బయటపెట్టింది.

మైనారిటీలను బుజ్జగించేందుకు ఇస్లామిక్‌ టెర్రరిజానికి పోటీగా తాము సృష్టించిన నకిలీ ‘హిందూ టెర్రరిస్టు’ సిద్దాంతం మన దేశ భద్రతకు తెచ్చేముప్పు గురించి కాంగ్రెస్‌ ఆలోచించలేదు. మన దేశంలో పాకిస్తాన్‌ సాగిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను బయట పెట్టి ఆ దేశాన్ని ప్రపంచం ముందు ‘టెర్రరిస్టు దేశం’గా నిలబెట్టగలిగాం. హిందుత్వాన్ని కూడా తీవ్రవాదంగా చూపడం ద్వారా పాకిస్తాన్‌ అనే కోతి చేతికి స్వయంగా కొబ్బరి చిప్ప అందిస్తున్నాం అనే ఇంగిత జ్ఞానాన్ని ఆ పార్టీ కోల్పోయింది.

వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram