‘నా అన్న చనిపోలేదు… గుండెల్లోనే ఉన్నాడు’ అన్నారు తనికెళ్ల భరణి. ఏకోదరులు కాకున్నా, ఇద్దరిదీ అంతటి అనుబంధమే. ప్రముఖ సినీ గీత రచయిత, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి; రచయిత, నట దర్శకుడు తనికెళ్ల భరణిది దాదాపు నాలుగు దశాబ్దాల అనుబంధం. సుమారుగా ఇద్దరూ ఒకేసారి చిత్రసీమలోకి అడుగుపెట్టారు. సీతారామశాస్త్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన భరణి, ఆయన భౌతికకాయాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఇద్దరూ శివతత్త్వాన్ని ఔపోసన పట్టినవారే! సీతారామశాస్త్రితో భరణికి ఉన్న అనుబంధాన్ని తెలుసుకుందామని ‘జాగృతి’ ప్రతినిధి ఆయనకు ఫోన్‌ ‌చేసినప్పుడు సినిమా షూటింగ్‌ ‌నిమిత్తం కాశీ వెళ్లానని చెప్పారు. అక్కడి నుండే తన మనోభావాలను వ్యక్తం చేశారు. కార్తీక మాసాన శివైక్యం చెందిన ఆప్తమిత్రునితో ఉన్న అనుబంధాన్నీ, ‘గంగావతరణం’తో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ‘సిరివెన్నెల’తో ఉన్న సంబంధాన్నీ ఆ గంగాతీరం నుండి, కాశీ పుణ్యక్షేత్రం నుండి భరణి తెలియచేయడం విధి వైచిత్రి కాకమరేమిటీ!?

సీతారామశాస్త్రి మరణాన్ని మీరు తట్టుకోలేక పోయారు. భౌతిక కాయానికి అంజలి ఘటిస్తూ దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. ఇప్పటికైనా కొంచెం కోలుకున్నారని అనుకోవచ్చా?

ఎన్ని అక్షరాలదారుల్లో ఇద్దరం కలిసి నడిచామో! నా చెయ్యి వదిలేసి హఠాత్తుగా వెళ్లిపోతే తట్టుకోలేక పోయాను. అతనంతే… ‘సిరివెన్నెల’ కదా! అలా అలా దూరమైపోతూ ఉంటాడు. మళ్లీ మన దగ్గరకు వచ్చేస్తాడు. నిజం చెప్పాలంటే, ఏం చెప్పలేక పోతున్నాను. ఆయనేమో కన్నీరు పెట్టొదంటాడు… ఇంకేం చెప్పను!

మీ ఇద్దరి సినీరంగ ప్రవేశం ఒకేసారి జరిగింది కదా! ఆ రోజుల్ని తలుచుకుంటే ఏమనిపిస్తుంది?

గొప్పగా అనిపిస్తుంది. 1984 ప్రాంతంలో నేనూ, సీతారామశాస్త్రి కాస్త అటూ ఇటూగా చిత్రసీమలోకి అడుగుపెట్టాం. ఏవీయం స్టూడియో ఎదురుగా సాలిగ్రామం ప్రాంతంలో తెలుగు నటులు ఎక్కువగా నివాసం ఉండేవారు. అప్పట్లో ఆయన ‘సాక్షి’ రంగారావుగారి ఇంటిలో అద్దెకు ఉండేవారు. నేను రాళ్లపల్లి గారి ఇంటికి వెళుతుండేవాడిని. తరచూ ఎక్కడో చోట, ఎవరో ఒకరి ఇంటిదగ్గర కలుసుకునే వాళ్లం. అయితే మా అనుబంధాన్ని బలోపేతం చేసింది మాత్రం ‘లేడీస్‌ ‌టైలర్‌’ ‌చిత్రం. వంశీ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్‌ ఆ ‌సినిమా నిర్మించారు. నాకది రచయితగా నాలుగో సినిమా. సీతారామశాస్త్రికి అప్పటికే కొంత పేరొచ్చింది. స్రవంతి మూవీస్‌ ఆఫీస్‌లోనే స్టోరీ సిట్టింగ్స్ ‌జరుగు తుండేవి. నేనేమో పగలు వెళ్లి పనిచేసే వాడిని. సీతారామశాస్త్రిని అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచేవాడిని. అతనేమో నన్ను ‘ఒరేయ్‌’ అని చనువుతో సంబోధిస్తుండేవాడు. అలా పిలిపించుకోవడంలో ఓ అందం, ఓ ఆత్మీయత, ఓ సొగసు ఉండేది. సీతారామ శాస్త్రి చేతిలో ఎప్పుడూ ఓ సూట్‌ ‌కేస్‌ ఉం‌డేది. దాని మీద దరువు వేస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు. మొదటి నుండీ అతనికి అదో అలవాటు.

మీ ఇద్దరి మీద ఒకరి ప్రభావం మరొకరిపై ఉండేదా?

చిత్రం ఏమంటే… సినిమాల్లోకి వచ్చేవరకూ ‘భరణి’ అనే కలం పేరుతో రచనలు చేసిన సీతారామశాస్త్రి, సినిమా రంగంలో నాతో పరిచయం ఏర్పడిన తర్వాత ఒకే పేరుతో ఇద్దరు ఉంటే బాగోదని చెప్పి తన కలం పేరుకు స్వస్తి పలికాడు. అదే సమయంలో అతని తొలి చిత్రం ‘సిరివెన్నెల’ ఇంటి పేరుగా మారిపోయింది. ఇక నా ప్రభావం అని చెప్పను కానీ అతని కెరీర్‌ ‌ప్రారంభంలో నా వంతుగా ఇచ్చిన కొన్ని సలహాలు సీతారామశాస్త్రికి బాగా ఉపయోగపడ్డాయి. ఉదాహరణకు ‘లేడీస్‌ ‌టైలర్‌’ ‌సినిమానే తీసుకుంటే, దానికి ఇసై జ్ఞాని ఇళయరాజా సంగీత దర్శకుడు. అప్పటికే ట్యూన్‌కు పాట రాయడమనే పక్రియ మొదలైపోయింది. ఇళయరాజాకు ఆ సమయానికి శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం పెద్దగా లేదు. దాంతో ఆయన ‘తత్‌కారం’గా ట్యూన్‌ ఇచ్చేవాడు. వాటిని వింటూ పాట రాయాల్సి ఉండేది. అది సీతారామశాస్త్రికి ఇబ్బందిగా అనిపించేది. ‘ఇదేవిట్రా ఆయన ఇలా ఇచ్చాడు?’ అనేవాడు. తననా తననాల స్థానంలో ఏబీసీడీ అనుకుంటూ పాట రాసేయ్‌ అని చెప్పాను. అలా ‘లేడీస్‌ ‌టైలర్‌’‌లో రాసిన పాటలు ఆ సినిమా విజయానికి గొప్పగా దోహదపడ్డాయి. ఇక నా మీద సీతారామశాస్త్రి ప్రభావం కూడా కొంత ఉంది. తన తొలి తెలుగు సినిమా ‘సిరివెన్నెల’లో ‘ఆదిభిక్షువు నేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది’ అంటూ నిందాస్తుతిలో ఓ పాట రాశాడు. అది నాకు ఎంతో ఇష్టం. నేను కూడా ఆ తర్వాత ‘ఆటగదరా శివ, శబాష్‌ ‌రా శంకరా’ గీతాలను నిందాస్తుతిలోనే రాశాను.

సీతారామశాస్త్రిని రాత్రిళ్లు ఉదయించే సూర్యుడు అని ఆ మధ్య త్రివిక్రమ్‌ అన్నారు. మొదటి నుండీ ఆయన అంతేనా?

అవును. సీతారామశాస్త్రికి కెరీర్‌ ‌ప్రారంభం నుండి రాత్రిళ్లు పాట రాయడమే అవాటు. ‘లేడీస్‌ ‌టైలర్‌’ ‌సమయంలోనూ నేను పగలంతా ఆ ఆఫీస్‌లో మాటలు రాస్తూ ఉంటే, అతను రాత్రిళ్లు తన పాటల పక్రియను మొదలెట్టేవాడు. అప్పటికి నాకూ వివాహం కాలేదు కాబట్టి, నేనూ అతనితో పాటే అదే ఆఫీస్‌లో గడిపేసేవాడిని. నిద్రలేని అద్భుతమైన ఎన్నో రాత్రులు అతనితో గడిపాను. సీతారామశాస్త్రిలో ఉన్న గొప్ప సుగుణం ఏమిటంటే… దర్శక నిర్మాతలు తొందర పెడుతున్నారు కదా! అని ఏదో ఒకటి రాసి ఇచ్చేవాడు కాదు. రాసింది ముందు తనకు నచ్చాలి, అందుకోసం ప్రతి పదానికీ నగిషీలు చెక్కుతూ ఉండేవాడు. ఒకే పాటను పది పదిహేను సార్లు తిరగరాసేవాడు. అందువల్ల పాట రాయడానికి ఎక్కువ సమయం పట్టేది. అయినా సంతృప్తికరంగా వచ్చేవరకూ ఆ పాటను ఇచ్చేవాడు కాదు. అలా ప్రతి పదాన్ని తనకు తాను అనుభూతి చెంది, చెక్కుతాడు కాబట్టే అతని పాటలకు శాశ్వతత్త్వం లభించింది.

సీతారామశాస్త్రి పాటల్లో మీకు బాగా నచ్చినవి…

అతను రాసిన పాటలన్నీ ఇష్టమే. అయితే ‘సిరివెన్నెల’కు రాసిన పాటలు మరింత ఎక్కువ ఇష్టం. ఇందాక చెప్పినట్టు ‘ఆదిభిక్షువు వాడి నేది కోరేది’ పాట మరీ మరీ ఇష్టం. అలానే సీతారామశాస్త్రి సినిమా కోసం కాకుండా మామూలుగా కూడా బోలెడన్ని పాటలు రాసుకునే వాడు. అలా రాసిన పాటే ‘జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది’. ఆ పాటను అప్పట్లోనే మాకు వినిపించాడు. అదే పాటను బేస్‌ ‌చేసుకుని కృష్ణవంశీ ‘చక్రం’ సినిమా కథ రాసుకుని, ఆ పాటను అందులో వాడుకున్నాడు. ఆ పాటలో గొప్ప ఫిలాసఫీ ఉంది.

ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తించే పాట అది. ఉదాహరణకు సీతారామశాస్త్రినే తీసుకోండి. అతను ఓ బిడ్డగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఆ తర్వాత సీతారామశాస్త్రి అయ్యాడు, కవి అయ్యాడు, సినీ గీత రచయిత అయ్యాడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయ్యాడు. బోలెడంత కీర్తిని సంపాదించాడు. కానీ మొన్న వెళ్లిపోయినప్పుడు వీటన్నింటినీ, చివరకు మొలతాడును కూడా వదిలేసి వెళ్లిపోయాడు. ఈ పాటలోని భావమూ ఇదే. ఏక వాక్య మహాకావ్యం అంటుంటారు. ఈ పాట అలాంటిదే!

సీతారామశాస్త్రిగారు, మీరు శివభక్తులు కదా! శివతత్త్వాన్ని బాగా ఆకళింపు చేసుకున్నారు. తరచూ మీ మధ్య ఆ విషయాలకు సంబంధించిన చర్చ జరుగుతుండేదా?

మేమిద్దరమే కాదు. మాతో జొన్నవిత్తుల రామలింగేశ్వరావు, సామవేదం షణ్ముఖ శర్మ కూడా కలుస్తుండేవారు. ఎవరికి వారం మా స్థాయిలో శివతత్త్వాన్ని అర్థం చేసుకుని, తిరిగి అందించే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్లం. జొన్నవిత్తుల, సామవేదం షణ్ముఖశర్మ అయితే ఏకంగా శతకాలు రాశారు. సీతారామశాస్త్రి శివుడి తత్త్వాన్ని తెలియ చేస్తూ ‘శివదర్పణం’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ పుస్తకావిష్కణ సమయంలో నేను గ్రంథ పరిచయం చేశాను. సీతారామశాస్త్రికి ఆంగ్ల భాష మీద కూడా చాలా గొప్ప పట్టు ఉంది. ఆ విషయం చాలామందికి తెలియదు.

సీతారామశాస్త్రి గారి మరణ వార్త చాలామందిని షాక్‌ ‌కు గురిచేసింది. మీకైనా ఆయన అనారోగ్యం గురించి ముందుగా తెలుసా?

నిజం చెప్పాలంటే తెలియదు. బాలుగారు కొంతకాలం హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌లో ఉన్నారు కాబట్టి ఆయన మరణవార్తను కొంతలో కొంత ఓర్చుకోగలిగాం. కానీ సీతారామశాస్త్రి మరణం ఏ మాత్రం ఊహకు అందనిది. ఆయనకు కొంత అనారోగ్యం ఉందని తెలిసింది. అయితే గతంలో హార్ట్ ఆపరేషన్‌ ‌జరిగింది కాబట్టి దానికి సంబంధిం చిన చిన్న సమస్య ఏదైనా ఉండి ఉంటుందని అనుకున్నాను. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు హాస్పిటల్‌లో కలిసినప్పుడు మనవరాలితో సరదాగా ఆడుకుంటూ కనిపించారు. వాళ్ల పెద్దబ్బాయి యోగిని సీతారామశాస్త్రి ఆరోగ్యం గురించి అడిగినప్పుడు కంగారు పడాల్సింది ఏమీ లేదనే చెప్పాడు. కుటుంబ సభ్యులు కూడా ఈ హఠాన్మరణాన్ని జీర్ణించుకో లేకుండా ఉన్నారు. ఏదేమైనా ఏకాదశి నాడు మరణం, ద్వాదశి నాడు దహనం… గొప్పవని పెద్దలు చెబుతారు. మా అన్నయ్య విషయంలో అదే జరిగింది. నా వరకూ నాకు అన్న చనిపోలేదు. గుండెల్లోనే ఉన్నాడు.

ఆయనలోని కవిని మీరు ఏ రీతిన చూస్తారు?

‘దాతృత్వం ప్రియ వక్తృత్వం ధీరత్వ ముచితజ్ఞతా! అభ్యాసేన నలభ్యన్తే చత్వారః సహజాగుణాః’ అంటాడు చాణక్యుడు. అంటే దానగుణం, మంచిగా మాట్లాడటం, దేనికీ చలించక ధైర్యంగా ఉండటం, ఇది మంచి-ఇది చెడు అనే జ్ఞానం కలిగి ఉండటం… ఈ నాలుగు గుణాలు సహజ సిద్ధమైనవి. నేర్చుకుంటే వచ్చేవి కావు. అలానే కవిత్వం కూడా మా అన్న సీతారామశాస్త్రికి సహజంగా అబ్బింది. అందుకే ఆయన భౌతికంగా దూరమై పోయినా, ఆయన రాసిన కవిత్వం శాశ్వతంగా నిలిచిపోతుంది.

About Author

By editor

Twitter
Instagram