విలాసవంతమైన దుకాణ సముదాయాలలో, ఎలక్ట్రానిక్‌ ‌వస్తువులు, నగలు, దుస్తులు అమ్మే భారీ దుకాణాలలోను డిజిటల్‌ ‌చెల్లింపులకు అవకాశం కల్పిస్తూ క్యూఆర్‌ ‌కోడ్‌ ‌బోర్డు కనిపించడం పెద్ద విశేషం కాదు. కానీ కేవలం మూడు అడుగుల స్థలంలో గోనెగుడ్డ పరుచుకుని ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు అమ్ముకునే చోట ఆ క్యూఆర్‌  (•‌బఱమీ• =వజూశీఅవ) కోడ్‌ ‌బోర్డు కనిపించడం ముమ్మాటికీ విప్లవమే. అంతేకాదు, గంగిరెద్దు ముఖం మీద, ఒక ముష్టివాడి ఛాతి మీద కూడా ఆ చిన్న బోర్డు ఇటీవల కాలంలో కనిపిస్తున్నది. కొన్ని పరిధులు ఉన్నా భారత్‌ ఈనాడు డిజిటల్‌ ‌చెల్లింపులలో అగ్రరాజ్యం అమెరికాను దాటిపోయిందన్న వార్త ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నది. పారిశ్రామిక విప్లవం వేళ వలసదేశంగా ఉండిపోయి, భారత్‌ ‌పారిశ్రామికీకరణలో వందేళ్లు వెనకపడింది. ఆ లోటును అధిగమించడానికి దేశ యావత్తు ప్రోత్సహించిన ఐటీ, డిజిటల్‌ ‌వ్యవస్థలు ఇప్పుడు దేశ ప్రజలకు ఊరట కల్పిస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని లోపాలు లేకపోలేదు. కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్లక తప్పదు. ఆధునికతకు మన వ్యవస్థ ఎంత అనుకూలమో రుజువు చేసుకోక తప్పదు. ఈ దేశంలో డిజిటల్‌ ‌చెల్లింపులు చెల్లవు అంటూ శాపనార్ధాలు పెట్టిన మాజీ ఆర్థికమంత్రుల చౌకబారు విమర్శలను మోదీ పాలన చెత్తబుట్టలోకి నెట్టింది. ఒక గొప్ప సాంకేతిక విప్లవం ఫలితాలు సామాన్యుడికి కూడా చేర్చిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కింది.

ఒకప్పుడు సాంకేతికంగా వెనుకబడిన దేశంగా మనల్ని మనమే తక్కువ చేసుకునేవాళ్లం. అందుకే కాబోలు పెద్దనోట్ల రద్దు అనంతరం దేశంలో డిజిటల్‌ ‌చెల్లింపులను పెంచాలని ప్రభుత్వం భావించినప్పుడు అనేకమంది నాయకులు ఆ ప్రతిపాదనను హేళన చేశారు. అసలు బీజేపీ అంటేనే, ఆ ప్రభుత్వ విధానాలంటేనే విమర్శనార్హం అన్న ధోరణి మన ప్రతిపక్షానిది. అందుకే ఇతర పార్టీల నుంచి ఆర్థిక మంత్రులయినవారు స్వైరవిహారం చేశారు.

అభ్యంతరాల పేరుతో అడ్డంకులు

డిజిటల్‌ ‌చెల్లింపులకు సంబంధించి ముఖ్యంగా ఆరంభంలో నాయకులు లేవనెత్తిన అభ్యంతరాలు ఏమంటే-1. మనదేశంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ ‌సౌకర్యం లేదు. ఒకవేళ ఉన్నా అది అందుబాటులో ఉండదు. 2. దేశంలో చాలామందికి అసలు బ్యాంకు ఖాతాలే లేవు. 3. ఎక్కువమంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తారు. అక్కడ ఇంటర్నెట్‌ ‌సౌకర్యం ఉండదు. 4. చాలామంది వద్ద స్మార్ట్ ‌ఫోన్లు లేవు. 5. డిజిటల్‌ ‌చెల్లింపులు చేయటానికి తగిన సాంకేతిక సదుపాయాలు లేవు. 6. మన ప్రజల్లో ఎక్కువమందికి మొబైల్‌ ‌ఫోన్‌ ‌వాడటమే రాదు. 7. ప్రజలకు ఇటువంటి సాంకేతికత పట్ల అవగాహన, ఆసక్తి లేవు. 8. డిజిటల్‌ ‌చెల్లింపులు చేయటానికి తగిన భద్రత లేదు. 9. మనది నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ చాలామంది చిరువ్యాపారులు ఉన్నారు. వారు వ్యాపారాన్ని నగదు లావాదేవీలతోనే చేస్తారు కాని, డిజిటల్‌ ‌చెల్లింపులకు ఇష్టపడరు. 10. డిజిటల్‌ ‌చెల్లింపుల పట్ల ప్రజలు, ముఖ్యంగా వినియోగదారులలో అనేక అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించటం సాధ్యమయ్యే విషయం కాదు. 11. డిజిటల్‌ ‌చెల్లింపుల వల్ల లావాదేవీల ఛార్జీలు పెరిగి ప్రజలపై అధికభారం పడుతుంది. 12. డిజిటల్‌ ‌చెల్లింపుల వల్ల వ్యాపారులపై అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం- ముఖ్యంగా పన్ను వసూలు చేసే శాఖల నుంచి వేధింపులు పెరుగుతాయి.

కంగు తినిపించిన ఫలితాలు

 ఇలా అభ్యంతరాల మీద అభ్యంతరాలు వ్యక్త పరచటంతోపాటు ఈ ప్రయత్నం విఫలమవు తుందనీ, చూస్తూ ఉండండనీ పెద్దఎత్తున ప్రచారం చేస్తూ చాలామంది విపక్ష పెద్దలు శాపనార్ధాలు కూడా పెట్టారు. అయితే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉండి, డిజిటల్‌ ‌చెల్లింపులు పెరుగుతాయన్న ధీమా వ్యక్తంచేయటంతో పాటు, వాటిని ప్రోత్సహించటానికి కార్యప్రణాళిక రూపొందించి ముందడుగు వేసింది.

కానీ ఎంతలో ఎంత మార్పు! కేవలం ఐదు సంవత్సరాల్లోనే ఆనాడు పుంఖానుపుంఖాలుగా అభ్యంతరాలు లేవనెత్తిన వారిని ఆశ్చర్యపరిచే విధంగా మనదేశంలో డిజిటల్‌ ‌చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. ఇటీవలి కాలంలో కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైనప్పటికి, డిజిటల్‌ ‌చెల్లింపులు మరింతగా పెరిగాయి. భారతీయ రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం గత సంవత్సరంతో పోల్చినప్పుడు 2020-21లో 30.2 శాతం ఈ చెల్లింపులు పెరిగాయి. డిజిటల్‌ ‌చెల్లింపుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచటంతోపాటు వాటికి అవసరమైన సాధనాలు సమకూర్చటం, వాడకాన్ని పెంచటానికి అనువైన వాతావరణం నిర్మాణం చేయటం; బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ప్రభుత్వ అధికారులు నిరంతరం సంభాషణలు జరిపి సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు కనుగొనటం వంటి అనేక చర్యలు చేపట్టారు.

ప్రణాళికాబద్ధమైన ప్రయాణం

మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు చాలావరకు వెంటనే విజయవంతమవుతాయి. ఇందుకు మొదటి కారణం- పటిష్టమైన వ్యూహ రచన. ప్రణాళికతో ముందుకు వెళ్లడం కూడా. ఈ క్రమంలోనే డిజిటల్‌ ‌చెల్లింపుల విషయంలోను జరిగింది. ముందుగా దేశ ప్రజల్లో అర్హులైన వారందరికీ బ్యాంకు ఖాతాలు ఉండేట్టు విశేషమైన కృషిచేశారు. అన్ని బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేశారు. దానితోపాటు ప్రతి ఖాతాదారుని మొబైల్‌ ‌నంబర్‌ను సేకరించి ఖాతాతో అనుసంధానం చేశారు. కోట్లాది ఖాతాలను ఆధార్‌తో, మొబైల్‌ ‌నంబర్‌తో జోడించటం సులభమైన పని కాదు. అందుకోసం విశేషమైన కృషి ఉద్యమస్ఫూర్తితో జరిగింది. 2016 కంటే ముందు మనదేశంలో డిజిటల్‌ ‌చెల్లింపులకు మొబైల్‌ అప్లికేషన్స్ (‌మొబైల్‌ ఆప్‌)‌లు ఎక్కువగా ఉండేవి కాదు. అప్పట్లో ఎక్కువగా కార్డుల ద్వారానే చెల్లింపులు జరిగేవి. అవి కూడా మాస్టర్‌, ‌వీసా వంటి కార్డులే ఉండేవి. వాటి వినియోగదారుల సంఖ్య పరిమితంగా ఉండేది. ఆ తరువాత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన రూపే కార్డులు అందుబాటులోకి వచ్చాయి. రకరకాల సౌకర్యాలు కార్డులలో ప్రవేశపెట్టారు. అప్పట్లో కేవలం క్రెడిట్‌ ‌కార్డులు, డెబిట్‌ ‌కార్డులు, ప్రీపెయిడ్‌ ‌కార్డులు, కిసాన్‌ ‌కార్డులు వంటివి వాడుకలో ఉండేవి. దానికోసం ఖాతాదారుడు ప్రత్యేకించి దరఖాస్తు చేసి కార్డు పొందవలసి వచ్చేది.

బాలారిష్టాలూ నిజమే!

ఇప్పటికీ కార్డు పొందటానికి దరఖాస్తు అవసర మైనప్పటికి, ఇప్పుడు కార్డులు జారీచేసే విధానంలో మార్పులు తేవటంవల్ల సరళంగా, సులభంగా పొందుతున్నారు. అయితే వీటిని వాడటానికి కార్డును విధిగా మెషిన్‌ ‌వద్దకు తీసుకుపోవటం, అక్కడ చెల్లింపులకి పిన్‌ ‌నెంబర్‌ ‌పొందుపరచడం కొంత మంది అసౌకర్యంగా భావిస్తున్నారు. ఈ కార్డుల వాడకంలో చెల్లింపుదారుడు అదనంగా ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేనప్పటికి, చెల్లింపు పొందిన వ్యాపార సంస్థ మాత్రం 0.5 శాతం నుండి 2.25 శాతం వరకు రుసుము చెల్లించవలసి వచ్చింది. చాలామంది వ్యాపారస్తులు 2.25 శాతం రుసుము చెల్లించటానికి ఇష్టంలేక, కొంతమేరకు గిట్టుబాటు కాక కార్డుల ద్వారా చెల్లింపులకు విముఖత చూపుతున్నారు. కొన్ని సందర్భాలలో ఈ రుసుము 2.25 శాతం కంటే అధికంగా కూడా వసూలు చేయడంతో కార్డుల వాడకం పరిమితంగా ఉంటున్నది. ఈ అంశాన్ని అనేక పర్యాయాలు అధికారుల దృష్టికి, ముఖ్యంగా ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే బ్యాంకుల యాజమాన్యాలు ఈ రుసుము తగ్గించటంలో తగిన చొరవ చూపకపోవటం వల్ల కార్డుల వాడకంలో వృద్ధి పరిమితంగా ఉంటున్నది. ఒకరకంగా ఇతర డిజిటల్‌ ‌చెల్లింపుల కంటే కార్డుల ద్వారా చెల్లింపులు సులభం, భద్రం అయినప్పటికీ ఛార్జీలు అధికంగా ఉండటం వల్ల కార్డులపై లావాదేవీలు పరిమిత స్థాయిలోనే ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించటానికి కృషిచేస్తూనే ప్రత్యామ్నాయ డిజిటల్‌ ‌చెల్లింపులపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దృష్టి సారించింది.

ప్రభుత్వ పరంగా విజయం

ప్రభుత్వపరంగా చేసే చెల్లింపులలో నగదు వినియోగం గణనీయంగా తగ్గించారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ చెల్లింపులన్నీ నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జరుగుతున్నాయి. దీనికోసం అన్ని ప్రభుత్వ శాఖలు విశేషమైన కృషి చేయవలసి వచ్చింది. 2016 కంటే ముందు ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌ ‌సేవలు ఉపయోగించుకునే వారి సంఖ్య తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు గణనీయంగా పెరిగింది. సంవత్సరంలో ఒక్కసారి కూడా బ్యాంకు శాఖను సందర్శించకుండా తమ ఖాతా ద్వారా లావాదేవీలు జరుపుతున్న వినియోగదారులు ప్రతి శాఖలో సగానికిపైగా ఉన్నారు. దీనికి ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌ ‌సేవలను ఖాతాదారులకి అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వ జరిపిన కృషి కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు వినియోగదారులు IMPS, RTGS, NEFT, ECS వంటివి విరివిగా వాడుతున్నారు.

డిజిటల్‌ ‌చెల్లింపులను ప్రోత్సహించటంలో భాగంగా USSD (Unstructured supplementary service data) సేవలను వినియోగదారులకి అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంలో స్మార్ట్‌ఫోన్‌ ‌లేనివారు, మొబైల్‌లో డేటా లేనివారు, మొబైల్‌కి ఇంటర్నెట్‌ ‌సౌకర్యం లేనివారు కూడా డిజిటల్‌ ‌లావాదేవీలు సాధారణ చరవాణి ద్వారా చేసుకునే సౌకర్యం కల్పించారు. ఏ ఫోన్‌ ‌ద్వారా అయినా 99 డయల్‌ ‌చేసి బ్యాంకింగ్‌ ‌సేవలు పొందటానికి అవకాశం కల్పించారు. ఇప్పటికే ఈ సౌకర్యాన్ని దేశంలోని 51 ప్రధాన బ్యాంకులు ఆంగ్లంతో సహా 12 భారతీయ భాషలలో అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఈ సౌకర్యం వినియోగించుకున్నందుకు ప్రతి ట్రాన్సాక్షన్‌కు 50 పైసలు రుసుము చెల్లించవలసి ఉంటుంది. దీనిద్వారా రోజుకు 5వేల రూపాయల వరకు చెల్లింపులు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే దీని వాడకం ఆశించిన స్థాయిలో పెరగలేదు. మనదేశంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం, డేటా వాడకం పెరగటంవల్ల ఈ USSD వాడకం ఊహించిన స్థాయిలో జరగటం లేదు.

మరింత చేరువగా..

కార్డులు, మొబైల్‌ ‌ఫోన్లు, సాధారణ ఫోన్లు కూడా వాడకుండా లావాదేవీలు జరిపే వారికోసం ఆధార్‌ ఎనేబిల్డ్ ‌పేమెంట్‌ ‌సిస్టమ్‌ (‌AEB) (ఆధార్‌ ‌ద్వారా చెల్లించే విధానం) అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం బ్యాంకులు.. గ్రామీణ ప్రాంతాల్లో బిజినెస్‌ ‌కరస్పాండెంట్లు, బ్యాంకు మిత్రులను నియమించి వినియోగదారులకు ఇంటివద్దనే బ్యాకింగ్‌ ‌సేవలు అందించే ప్రయత్నం జరుగుతున్నది. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే నగదును పొందటానికి లబ్ధిదారులు బ్యాంకుకు వెళ్లకుండానే నగదు పొందేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది.

డిజిటల్‌ ‌చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం UPI (Unified Payment Interface)ని అందుబాటులోకి తెచ్చింది. దానివల్ల మొబైల్‌ ‌ద్వారా లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. దానికి తోడు మొబైల్‌ ‌యాప్‌లు చాలా పెరిగాయి. పేటీఎమ్‌, ‌ఫ్రీచార్జ్, ‌గూగుల్‌పే, ఫోన్‌పే, మొబిక్‌ ‌వికి, ఆక్సిజన్‌, ఎమ్‌రుపీ, జియోమనీ, ఎయిర్‌టెల్‌ ‌మనీ, ఎస్‌బిఐ బడ్డీ, ఇట్స్‌క్యాష్‌, ‌సిట్రస్‌ ‌పే, వొడాఫోన్‌ ఎమ్‌పెసా, ఎక్సిస్‌ ‌బ్యాంక్‌లైం, ఐసిఐసిఐ పాకెట్స్, ‌స్పీడ్‌ ‌పే వంటి వందలాది మొబైల్‌ అప్లికేషన్‌లు ఇప్పుడు వినియోగ దారులకి అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, దాదాపు అన్ని బ్యాంకులు మొబైల్‌ ‌బ్యాంకింగ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ప్రభుత్వం డిజిటల్‌ ‌లావాదేవీలను ప్రోత్సహించటానికి చేసిన కృషి వేగంగా ఫలితాలు ఇచ్చింది. ప్రభుత్వ కృషి ఎంత వేగంగా ఫలించిందో పట్టిక వివరాలు చూస్తే తెలుస్తుంది.

సంవత్సరం             డిజిటల్‌ ‌లావాదేవీల              డిజిటల్‌ ‌లావాదేవీల

                               సంఖ్య (లక్షల్లో)          విలువ (కోట్లల్లో)

2017-18                1,45,902              13,69,86,732

2018-19                2,34,339              16,38,52,285

2019-20                3,43,455              16,23,05,934

2020-21                4,37,118              14,14,85,173

ప్రస్తుతం దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో సైతం, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలలో, ద్వీపాలలో కూడా డిజిటల్‌ ‌చెల్లింపులు విరివిగా జరుగుతున్నాయి. వీధి వ్యాపారుల నుంచి, పెద్ద వ్యాపార సంస్థల వరకు, ఆఖరికి గంగిరెద్దుల వాళ్లు, యాచకులు సైతం డిజిటల్‌ ‌లావాదేవీలు జరుపుతున్నారు. భారతదేశంలో 16 కోట్లకు మించిన లావాదేవీలు ఈ విధానంలో జరుగుతుండటం ప్రపంచంలో అనేక దేశాలను ఆశ్చర్యానికి గురి చేసింది. మన దేశంలో 2020లో జరిగిన డిజిటల్‌ ‌చెల్లింపులు ప్రపంచంలో మరే దేశంలో జరగలేదు. రియల్‌టైం ఆన్‌లైన్‌ ‌చెల్లింపులు కూడా ప్రపంచంలో అగ్రరాజ్యాల కంటే మనదేశంలోనే అధిక స్థాయిలో జరుగుతున్నాయి.

మనదే ముందంజ

గత సంవత్సరం మనదేశంలో 25.5 బిలియన్ల రియల్‌ ‌టైం చెల్లింపులు డిజిటల్‌ ‌పద్ధతిలో జరగగా చైనాలో 15.7 బిలియన్లు, కొరియాలో 6 బిలియన్లు, అమెరికాలో 1.2 బిలియన్ల చెల్లింపులు జరిగాయి. మన జనాభా ఎక్కువ కాబట్టి దేశంలో జరుగుతున్న చెల్లింపుల సంఖ్యను అమెరికాలో జరిగే చెల్లింపుల సంఖ్యతో సరిపోల్చటం సరికాదని కొందరు వాదిస్తున్నారు. కొంతమేరకు వారి వాదన సరైనదే. కాని వాటి సంఖ్యను పోల్చడం వల్ల మన ఆత్మస్థైర్యం పెరిగి మరింత వేగంగా లక్ష్యంవైపు అడుగులు వేయటానికి ఉపయోగపడుతుంది.

ఇప్పటికిప్పుడే నగదు చెలామణి తగ్గుతుందని పాలకులు కాని, అధికారులు కాని భావించటం లేదు. కాని క్రమంగా నగదు వ్యవస్థపై ఒత్తిడి తగ్గటంతో పాటు ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతున్నది. గమనించవలసిన విషయం ఏమంటే చిరువ్యాపారులు చిల్లర, చిన్న మొత్తంలో జరిపే లావాదేవీలలో డిజిటల్‌ ‌విధానం వేగంగా వృద్ధి చెందుతున్నది. దానికి కారణం వారిలో అత్యధికులు పన్ను పరిధిలో లేకపోవటం, వారిపై పన్ను భారం పడుతుందనే భయం లేకపోవటం. పన్ను విధానంలో వస్తున్న మార్పుల వల్ల ఇప్పటికే పన్నులకు సంబంధించిన చట్టాల ప్రకారం తమ కార్యకలాపాలు జరపటానికి ఇష్టపడుతున్నారు.

అయితే డిజిటల్‌ ‌చెల్లింపుల విధానంలోనూ కొన్ని సమస్యలు కలవరపెట్టేలా ఉన్నాయి. బ్యాంకుల సర్వర్ల సామర్థ్యం సరైన స్థాయిలో లేకపోవడం వల్ల లావా దేవీలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే Failed Transactions (విఫలమైన లావాదేవీలు) కూడా ఒక పెద్ద సమస్య. ఈ సమస్య పరిష్కారానికి భారతీయ రిజర్వు బ్యాంకు ‘ఉత్కర్మ’ పేరుతో చర్యలు చేపట్టినప్పటికి దాని ఫలితాలు ఆశించినంత వేగం అందుకోలేదు. Q.R కోడ్‌ల విషయంలో రిజర్వు బ్యాంకు నూతన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికి అవి పూర్తిస్థాయిలో అమలు జరగటానికి వచ్చే సంవత్సరం ప్రథమార్థం దాటవచ్చు. ఇక కార్డుల వాడకం పెంచటానికి కాంటాక్ట్ ‌లెస్‌ ‌చెల్లింపు విధానాన్ని అమలు జరపటానికి ఉన్న పరిమితులు సడలించి నప్పటికి వీటి రుసుము తగ్గించ నంతవరకు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. గత సంవత్సరం డిసెంబర్‌ ‌నుంచి RTGS (Real Time Gross Settlement) విధానం నిరంతరం అందు బాటులో ఉండేట్టు చేసినప్పటికి, పన్ను పరిధిలోకి వస్తామనే భయం ఉండటం, పన్ను పరిధిని తప్పించుకుని వ్యాపారం చేసే అలవాటు కొనసాగుతుండటం వల్ల RTGS లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరగలేదు. ప్రపంచంలో నిరంతర RTGS సేవలు అందించే దేశాలు చాలా తక్కువ. చైనా, బ్రిటన్‌ ‌వంటి అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఇటువంటి సౌకర్యం లేదు.

డిజిటల్‌ ‌చెల్లింపుల విధానంలో రక్షణపరమైన లోపాలు కూడా కొంతమేరకు అవాంతరంగా మారాయి. డేటా విషయంలో మనదేశంలో ఉన్న స్వేచ్ఛ సమస్యను మరింత జటిలం చేసింది. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికి, సవాళ్లు అధికంగా ఎదురవు తున్నప్పటికి ప్రజలలో, ముఖ్యంగా సమాజంలోని అల్పాదాయ వర్గాలలో సైతం డిజిటల్‌ ‌చెల్లింపుల వాడకం పెరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాలలో, మహిళలో సైతం డిజిటల్‌ ‌చెల్లింపుల విధానం వేగంగా పెరుగుతున్నది. వినియోగం పెరుగు తుండటం వల్ల ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతు న్నాయి. నూతన ఆవిష్కరణలు పెరుగుతున్నాయి. వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయి. మొత్తం మీద ఈ విధానాన్ని అవహేళన చేసిన వారికి ఆశ్చర్యం కలిగే విధంగా మనదేశంలో డిజిటల్‌ ‌చెల్లింపులు పెరుగుతున్నాయి. దీనివల్ల అతి త్వరలో దేశ ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు ఎటువంటి విజయాలు సాధించవచ్చో చెప్పటానికి డిజిటల్‌ ‌చెల్లింపుల వృద్ధి ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు.

– సాయి, ఆర్థికరంగ నిపుణులు

By editor

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram