– ఎం.‌వి.ఆర్‌. ‌శాస్త్రి

ఇంటలిజెన్స్ ఆపరేషన్స్‌లో ఆరితేరిన ఎనమండుగురు గూఢచారులు 1943 డిసెంబరు 8న జలాంతర్గామిలో సింగపూర్‌ ‌నుంచి బయలు దేరారు. 22వ తేది అర్ధరాత్రి అధికారుల కళ్ళు కప్పి గుజరాత్‌లోని కథియవార్‌ ‌తీరానికి అతి రహస్యంగా చేరారు. వారి దగ్గర రివాల్వర్లు, ఇతర మారణాయుధాలు, పెద్ద మొత్తంలో ఇండియన్‌ ‌కరెన్సీ, అధునాతన వైర్లెస్‌ ఎక్విప్‌మెంట్లు ఉన్నాయి. నాలుగు జతలుగా విడిపోయి ముంబయి, యు.పి., వాయువ్య సరిహద్దు రాష్ట్రం, బెంగాల్‌లకు ఎవరి దారిన వారు వెళ్ళారు.

బెంగాల్‌ ‌డ్యూటీ పడిన భగవాన్లు అనే గూఢచారి టి.కె.రావు అనే మారుపేరుతో ఆ నెలాఖరున కోలకతా వెళ్లి ఉడ్‌ ‌బర్న్ ‌పార్క్ ‌నివాసంలో శిశిర్‌ ‌కుమార్‌ ‌బోస్‌ను ఏకాంతంలో కలిసి ఒక ఉత్తరం అందించాడు. అందులోని దస్తూరీ చూడగానే అది బాబాయి సుభాస్‌ ‌రాసిందని శిశిర్‌ ‌పోల్చుకున్నాడు. 1941 జనవరిలో ఇంటిచుట్టూ కాపలా ఉన్న పోలీసు దళాల కంట పడకుండా సుభాస్‌ ‌చంద్రబోస్‌ను కారులో తీసుకుని వెళ్లి వందల మైళ్ళ దూరాన రహస్యంగా రైలెక్కించిన వాడు అతడే. భగవాన్లు వెళ్లేసరికి ఇల్లంతా విషాద ఛాయలు కమ్మి ఉన్నాయి. ఆ కిందటి రోజే సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌తల్లి ప్రభావతి మరణించింది.

3 చాన్సరీ లేన్‌, ‌సింగపూర్‌ ‌చిరునామా గల ఇండియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌లీగ్‌ ‌లెటర్‌ ‌హెడ్‌ ‌మీద ‘శ్రీ కాళీ పూజ, అక్టోబరు 29, 1943’ తేదీన బెంగాలీ భాషలో ఉత్తరం రాసి ఉంది. కాబట్టి అందులోని విషయాలు నిజమేనని నమ్మవచ్చు. నా నుంచి మీకు అందే వర్తమానమేదయినా ఇంగ్లీషులో రాసి ఉంటే అది పోలీసులు చదవడానికి ఉద్దేశించిందనీ, బెంగాలీలో రాస్తే అది నిజంగా మీకోసమనీ సుభాస్‌ ‌ముందే తనవాళ్ళకు చెప్పి ఉంచాడు. ఉత్తరంలో బాబాయి ఆదేశం ప్రకారం శిశిర్‌ ‌కొత్తగా వచ్చిన గూఢచారులను ‘బెంగాల్‌ ‌వాలంటీర్స్’ అనే రహస్య విప్లవసంస్థ ముఖ్యుల దగ్గరికి పంపాడు.

తరవాత కొద్ది రోజుల్లో కోలకతాలోని విప్లవకారులకూ బర్మాలో సుభాస్‌ ‌చంద్రబోస్‌కూ నడుమ రేడియో కాంటాక్ట్ ‌కుదిరింది. అక్కడి నుంచి మొదటి వైర్లెస్‌ ‌మెసేజ్‌ ‌ద్వారానే ప్రభావతి మరణం బోస్‌కి తెలిసింది. ‘ఏమిటి చాలా అలసటగా కనిపిస్తున్నారు’ అని ఆ సాయంత్రం నేతాజీని కలిసిన దేవనాథ్‌ ‌దాస్‌ అడిగాడు. ‘అలసట కాదు. మా అమ్మ ఇక లేదన్న కబురు ఇప్పుడే అందింది’ అని భారంగా చెప్పాడు సుభాస్‌.

‌దేశం లోపల రహస్య కార్యకలాపాలు ఇప్పుడు కొత్తగా మొదలు కాలేదు. బెర్లిన్‌లో ఉన్న కాలంనుంచీ నేతాజీకి గూఢచారులుగా పనిచేసిన సహచరులు ఇండియాలో చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్‌ అ‌గ్ర నాయకుడిగా పనిచేసినప్పుడూ, ఇంటిపోరు పడలేక కాంగ్రెస్‌ ‌నుంచి తప్పుకుని ఫార్వార్డ్ ‌బ్లాక్‌ ‌పార్టీ నడిపినప్పుడూ సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌దేశమంతటా వేల సంఖ్యలో నమ్మకమైన అనుచరులను, లక్షల సంఖ్యలో వీరాభిమానులను సంపాదించుకున్నాడు. ప్రియతమ నేతాజీ నిప్పుల్లోకి దూకమంటే దూకటానికి వారంతా సిద్ధంగా ఉన్నారు. దీనికి తోడు పలు ప్రాంతాల్లో రహస్య విప్లవ సంస్థలతోనూ ఆయనకి సుహృద్భావ సంబంధాలు ఉండేవి. అందరిమీదా పోలీసు నిఘా మహా తీవ్రంగా ఉండటం వల్ల, సరైన కమ్యూనికేషన్‌ ‌సదుపాయం లేకపోవటం వల్ల సమాచారం ఇచ్చి పుచ్చుకోవటం పెద్ద సమస్య అయింది. ఇండియాతో వైర్లెస్‌ ‌లింకు కోసం నేతాజీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. బెర్లిన్లో ఉన్నప్పుడే ఎన్‌.‌జి.స్వామిని ప్రత్యేకంగా ఈ పని మీద పెట్టాడు.

వైర్లెస్‌ ‌వ్యవస్థకు కావలసిన ఎక్విప్‌మెంటును, ఆ రంగంలో నిష్ణాతులైన నలుగురు మెరికల్లాంటి కుర్రాళ్ళను తీసుకుని నేతాజీ వెనకే స్వామి యూరప్‌ ‌నుంచి ఓడలో సింగపూర్‌ ‌చేరాడు. అక్కడ ఇంకో నలుగురిని ఎంపికచేసి ఎస్‌.ఎన్‌.‌చోప్రా నాయకత్వంలో మొత్తం ఎనిమిది మందిని రహస్యంగా ఇండియా పంపించారు. ఏ ప్రాంతంలో ఎవరిని కలవాలి, ఎలా పనిచేయాలి, పోలీసు నిఘాను ఎలా తప్పించుకోవాలి, ఎవరితో ఎలా మసలాలి అన్నవి బయలుదేరే ముందే నేతాజీ వారికి వివరంగా బ్రీఫ్‌ ‌చేశాడు. కోలకతా లాగే కొద్దిరోజులకల్లా ముంబయి, పంజాబ్‌, ‌దిల్లీలతోనూ ఆయనకు వైర్లెస్‌ ‌లింకు ఏర్పడింది. దిల్లీ నుంచి ఎస్‌.ఎన్‌.‌చోప్రా ఆ వ్యవస్థను పర్యవేక్షించేవాడు.

 జపాన్‌ ‌సాయంతో ఐఎన్‌ఏ ‌సాయుధ యుద్ధం సాగిస్తున్న సమయంలోనే దానికి బాసటగా దేశం లోపల ప్రజావిప్లవం రావాలని ఆదినుంచీ నేతాజీ ఆలోచన. ఆ రెండూ ఏకకాలంలో జరిగితే తప్ప విదేశీయుల పీడను దేశానికి విరగడ చేయలేమని ఆయన మొదటినుంచీ చెబుతూ వచ్చాడు.

 ‘పదకొండు సార్లు జైలుకెళ్ళిన వాడిని నేను. కావాలనుకుంటే జైల్లోనే సురక్షితంగా ఉండిపోవచ్చు. ఎంత ప్రమాదం అయినాసరే నేను విదేశాలకు వెళితే తప్ప స్వాతంత్య్రం సాధించలేమని నాకు అనిపించింది. బ్రిటిషువారిని తరిమెయ్యటానికి దేశం లోపల మనం చేసే ప్రయత్నాలు సరిపోవు. దేశంలో పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సాధించగలిగి నట్టయితే ఇన్ని రిస్కులకూ, ముప్పులకూ తెగించవలసిన అవసరమే నాకు ఉండేది కాదు. బయటినుంచి మిలిటరీ సహాయం అదనంగా అందకుండా దేశ విమోచన ఎవరి తరమూ కాదు’ – అని 1943 జూలై 9న సింగపూర్లో చరిత్రాత్మక సభలో నేతాజీ విడమర్చి చెప్పాడు.

 మాతృదేశ విముక్తికి సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌వేసింది అద్భుతమైన మాస్టర్‌ ‌ప్లాను. ఆయన చేతిలో సుశిక్షితమైన మూడు మిలిటరీ డివిజన్లు ఉన్నాయి. వాటిలో 30 వేల మంది సాయుధ సైనికులున్నారు. వారుగాక మిలిటరీ ట్రెయినింగులో ఉన్న వాలంటీర్లు ఇంకో 20 వేల మంది ఉన్నారు. మొత్తం మూడు డివిజన్లనూ తీసుకుని తాను స్వయంగా ముందుండి యుద్ధానికి వెళ్ళాలని నేతాజీ ఆలోచన. తమకంటూ ప్రత్యేకంగా ఒక సెక్టార్‌ను కేటాయించమని జపాన్‌ ‌సైన్యాధికారులను ఆయన పలుమార్లు కోరాడు. ఆ విషయంలో ఆయన ప్రిఫరెన్సు అయితే ఆరకన్‌ ‌సెక్టారు. అక్కడ జపాన్‌ ‌సైన్యం శత్రుసేనలను నిలవరిస్తూంటే ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌సైనికులు 30 వేల మంది నేతాజీ నాయకత్వంలో తూర్పు బెంగాల్‌లోని చిట్టగాంగ్‌ ‌జిల్లాలోకి చొరబడతారు. వేల సంఖ్యలో ఐఎన్‌ఎ ‌సాయుధ సేనలు పొలిమేర దాటి దేశంలోకి చొచ్చుకువెళుతూండగా తూర్పు బెంగాల్‌లో, దేశం ఇతర ప్రాంతాలలో విప్లవకారులు రైల్వే లైన్లను, విమానాశ్రయాలను ధ్వంసం చేయటం, టెలిఫోన్‌, ‌టెలిగ్రాఫ్‌ ‌లైన్లను విచ్ఛిన్నం చేయటం వంటి శాబటేజ్‌ ‌చర్యలకు పూనుకుంటారు. ఆ కల్లోల స్థితిలో ప్రజాగ్రహం నిలువునా దహించక ముందే తెల్లజాతివారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సర్కారు ప్రయత్నించక మానదు. అందులో భాగంగా ఆ సమయాన ముట్టడిలో ఉండే మణిపూర్‌ ‌రాజధాని ఇంఫాల్‌ ‌నుంచీ యూరోపియన్‌ ‌సైనిక ఉద్యోగులను బ్రిటిషు సర్కారు అక్కడినుంచి ఖాళీ చేయించక తప్పదు. దాంతో 1942 ఫిబ్రవరిలో సింగపూర్లో నడచిన బాగోతమే ఇంఫాల్‌లో పునరావృత మవుతుంది. తెల్లవారు వదిలేసిపోయిన భారతీయ సైనికులు ఐఎన్‌ఎ ‌శ్రేణుల్లో హాయిగా కలసిపోతారు.

 ఇదీ నేతాజీ ప్రణాళిక. ఇందులో వంక పెట్టవలసింది ఏమీ లేదు. రిస్కు కూడా లేదు. ఆరకన్‌ ‌మీదుగా ఐఎన్‌ఎ ఇం‌డియాలోకి చొరబడితే తిండి దొరక్క అలమటించవలసిన గతి పట్టదు. ఆహారపు అవసరాలు దేశం లోపల తీర్చుకోవచ్చు. కాని జపాన్‌ ‌వాళ్ళు ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. యుద్ధ విమానాల నుంచే కాక తీరప్రాంతంలో నావికా దళాల నుంచీ దాడులు జరుగుతాయి కనక రిస్కు మరీ ఎక్కువ అని వారి అభ్యంతరం. ఇందులో పస లేదని అనంతర పరిణామాలు నిరూపించాయి. జపాన్‌ 56‌వ డివిజన్‌ ఆరకన్లో బ్రిటిష్‌ ‌సేనలను చుట్టుముట్టి కొన్ని నెలల పాటు నిలవరించగలిగింది. షా నవాజ్‌ఖాన్‌ ‌రెజిమెంటుకు చెందిన ఒక దళం అదే సెక్టారులో భారత భూభాగంలోకి చొచ్చుకువెళ్లి, 1944 మే నుంచి సెప్టెంబరులో వెనక్కి పిలవబడే దాకా మొదాక్‌ ‌మీద జెండా పాతి నిలబడగలిగింది. సముద్రం నుంచి దానిపై ఏ రకమైన దాడీ జరగలేదు. ఏదో చిన్న బెటాలియన్‌ ‌కాకుండా నేతాజీ ప్లాను ప్రకారం మూడు డివిజన్లు పాల్గొని ఉంటే మొదాక్‌ ‌నుంచి వెనక్కి మళ్ళవలసిన అగత్యమే ఉండేది కాదు. భారత్‌లోకి స్వాతంత్య్ర సేనల విజయయాత్ర నిరాఘాటంగా సాగి ఉండేది.

 ఏ సేన అయినా తీరప్రాంతంలో స్థిరంగా ఉన్నప్పుడే దాని మీద నౌకాయుద్ధం జరిగేందుకు అవకాశం ఉంటుంది. దేశం లోపలి ప్రాంతాలకు మెరపులా కదిలిపోయే ఐఎన్‌ఎ ‌బలగాలకు నావికా దళం దాడి బెడద పెద్దగా ఉండదు. ఆ సంగతి నేతాజీకి తెలుసు. అయినా మాట వినని వారితో వాదించి ప్రయోజనం లేదు. బర్మా రంగంలోని 2,35,000 జపాన్‌ ‌సైనికుల సహాయం లేకుండా బ్రిటిషు మహా సామ్రాజ్యాన్ని ఎదుర్కోవటం నిండా అరలక్ష సైన్యం లేని ఐఎన్‌ఎకు సాధ్యపడదు. అందువల్ల మిత్రరాజ్యాలను మభ్యపెట్టి ఆరకన్‌ ‌మీద దృష్టి కేంద్రీకరించేట్టు చేసి, అదాటున ఇంఫాల్‌ ‌మీద పడి, అసలు యుద్ధం అక్కడ చేయాలన్న జనరల్‌ ‌ముతాగుచి వ్యూహానికి బోస్‌ ‌సరే అనక తప్పలేదు.

అప్పుడైనా నేతాజీ హితవును జనరల్‌ ‌ముతాగుచి మన్నించి ఉంటే చరిత్ర గతి ఇంకో విధంగా ఉండేది. అన్ని దారులూ మూసి దిగ్బంధం చేయకుండా బ్రిటిష్‌ ‌సైన్యాన్ని ఇంఫాల్‌ ‌నుంచి తరిమివేయమని నేతాజీ సైనిక ముట్టడి మొదలు పెట్టటానికి ముందే సలహా ఇచ్చాడు. ‘ఆ చెరువులో పెద్ద చేప ఉంది. దాన్ని వలవేసి పడతాన’ని బీరాలు పలికి ముతాగుచి నెలల తరబడి దిగ్బంధమే చేశాడు. నేతాజీ చెప్పిన ఉపాయాన్ని అతడు అనుసరించి ఉంటే శత్రువును పూర్తిగా మట్టుపెట్టలేకపోయినా కనీసం ఇంఫాల్‌లో ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వానికి కాస్త పట్టు చిక్కేది. కాలు పెట్టేందుకు చోటు దొరికితే చాలు అక్కడి నుంచి గెరిల్లా దళాలను భారత్‌ ‌లోపలికి పంపించి స్థానిక స్వాతంత్య్ర యోధుల సాయంతో క్రమంగా దేశ మంతటా విప్లవం తేవటం నేతాజీకి సాధ్యమయ్యేది. సింగపూర్లో లాగా ఇంఫాల్‌లో బ్రిటిష్‌ ‌సైన్యాన్ని జపాన్‌ ‌సరండర్‌ ‌చేయించుకొనగలిగితే లొంగిపోయిన సైన్యంలోని భారతీయ సైనికులు సంతోషంగా ఐఎన్‌ఎలో చేరిపోయే వారు. ఉన్న మూడు డివిజన్లకు ఉపరి బ్రిటిష్‌ ఆర్మీలోని మన సిపాయిలు కూడా తోడై ఉంటే ఐఎన్‌ఎ ఆ ‌రంగంలో జపాన్‌ ‌సైన్యం కంటే పెద్ద సైనిక శక్తి కాగలిగేది. ఆ కాలాన తూర్పు భారత్‌లో మొహరించి ఉన్న బ్రిటిష్‌, ‌యూరోపియన్‌ ‌సైనికుల కంటే మన సైనికుల సంఖ్య ఎక్కువ అయ్యేది. దేశం లోపలినుంచీ వెలుపలినుంచీ ఒకే సమయంలో దాడి పర్యవసానంగా సర్కారు కూలి, దేశ విమోచనకు దారి చక్కబడేది.

 ఆ సంగతి తెల్ల దొరతనానికి బాగా తెలుసు. అప్పటికే దేశంలో దాదాపుగా అంతర్యుద్ధ పరిస్థితి నెలకొని ఉంది. క్విట్‌ ఇం‌డియా ఉద్యమకాలంలో 208 పోలిస్‌ ‌స్టేషన్లు, 332 రైల్వే స్టేషన్లు, 945 పోస్టాఫీసులు ప్రజల ఆగ్రహాగ్నికి భస్మమయ్యాయి. 90 వేలమందిని జిల్లాలో కుక్కి ఉద్యమాన్ని ఇనుప పాదాలతో అణచివేసినా పరిస్థితి నివురు కప్పిన నిప్పులా ఉన్నది. భౌతికంగా తమ దగ్గర లేకపోయినా, ఎప్పుడూ తమ గురించే ఆలోచిస్తూ, క్విట్‌ ఇం‌డియా ఉద్యమ సమయంలో బెర్లిన్‌ ‌నుంచి, తరవాత సింగపూర్‌, ‌రంగూన్‌ల నుంచి రేడియోలో మాట్లాడుతూ తమకు కొండంత అండగా ఉన్న ప్రియతమ నేతాజీ మీద భారత ప్రజలు ఆశ పెట్టుకుని బతుకుతున్నారు. అందుకే ఐఎన్‌ఎకు, నేతాజీకి సంబంధించిన వాస్తవ సమాచారం దేశవాసులకు తెలియకుండా వార్తాపత్రికల మీద సర్కారు కర్కశమైన సెన్సార్షిప్‌ ‌విధించింది. ఆలిండియా రేడియో వార్తల్లో, లండన్‌ ‌నుంచి బిబిసి ప్రసారాల్లో సుభాస్‌ ‌చంద్రబోస్‌ను దేశ ద్రోహిగా, జపాన్‌ ‌తొత్తుగా చిత్రిస్తున్నది. ఈశాన్య భారతంలో జపాన్‌ ‌పాగా వేస్తే చైనాతో రహదారి సంబంధం మిత్రరాజ్యాలకు పూర్తిగా తెగిపోతుందన్న భయంతో అమెరికన్‌ ‌పత్రికలూ బోస్‌ ‌మీద దారుణంగా విరుచుకుపడ్డాయి. ‘India’s would be Fuhrer’ (‘ఇండియాకు కాబోయే నియంత’) అనే శీర్షికతో 1944మార్చ్ 11‌న రాసిన వార్తాకథనంలో న్యూయార్క్ ‌పత్రిక The Saturday Evening postఇలా విషం కక్కింది:

 ‘జపాన్‌ ‌సౌజన్యంతో సింగపూర్‌లో ‘స్వతంత్ర భారత ప్రభుత్వం’ పెట్టిన సుభాస్‌ ‌చంద్రబోస్‌ ఆసియాలో అక్షకూటమి మొత్తంలోకీ కీలకమైన మహాపాపి. అతడు హిట్లర్‌ ఏజెంటు. జపాన్‌ ‌పనిముట్టు. అక్షకూటమి నిలబెట్టిన కీలుబొమ్మ లన్నిటిలో అతిప్రధానమైన వాడు. అతడు నియంత. మహా మాయావి. కయ్యానికి కాలుదువ్వే రకం…’

ఇలా తిట్టిపొయ్యటంతో ఆగకుండా బోస్‌ ‌శక్తిని సరిగా అంచనా వేసిన అమెరికన్‌ ‌పత్రికలూ ఉన్నాయి. మచ్చుకు రెండు కథనాలు:

‘తాను అస్సాం, బెంగాల్‌ల మీదికి దండెత్త నున్నట్టు బోస్‌ 1943 ‌నవంబర్‌లో ప్రకటించాడు. అదే జరిగితే అస్సాం నుంచి కొత్త రహదారి మీద చుంగ్‌ ‌కింగ్‌ ‌పెట్టుకున్న ఆశలు ఆవిరయినట్టే. బోస్‌ ‌తన ప్రకటిత లక్ష్యాన్ని త్వరలో సాధించటానికి ఆయత్తమయ్యాడు. సాధిస్తే అది అతడికి రాజకీ యంగా, సైనికపరంగా చాలా గొప్ప విజయమవు తుంది.’ అని ప్రసిద్ధ అమెరికన్‌ ‌పత్రిక ‘The Nation’ 1944 ఏప్రిల్‌ 22‌న విశ్లేషించింది.

దీనికంటే ఆసక్తికరమైనది ప్రపంచ ప్రఖ్యాత ‘Time’ మాగజైన్‌ Renegade’s Revenge (భ్రష్టుడి ప్రతీకారం) అనే శీర్షికతో 1944 ఏప్రిల్‌ 17‌న రాసిన పెద్ద వ్యాసంలో చేసిన ఈ వ్యాఖ్య:

‘Far more important than the size of Bose’s army is one explosive fact: an armed anti-British Indian stands today on Indian soil and calls upon his fellows to rebel against the Raj.’

(బోస్‌ ‌సైన్యం పరిమాణం ఎంతన్నదానికంటే అతిముఖ్యమైన అదిరిపోయే వాస్తవమిది: బ్రిటిష్‌ ‌వ్యతిరేకి అయిన ఒక భారతీయుడు ఇవాళ ఆయుధాలు పట్టుకుని భారత గడ్డ మీద నిలబడి ఉన్నాడు. బ్రిటిష్‌ ‌రాజ్‌ ‌మీద తిరగబడమని అతడు తోటి జనాన్ని ఉద్బోధిస్తున్నాడు!)

ప్రపంచవ్యాప్తంగా నేతాజీ సాయుధ పోరాటం రేకెత్తించిన సంచలనం ఎంతటిదో నాటి అమెరికన్‌ ‌మీడియా వ్యాఖ్యలు సూచిస్తాయి.

ఇంఫాల్‌లో గెలిచినా, ఓడినా ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ‌పరాజయం అనివార్యం. పసిఫిక్‌లో వరస పరాభవాలతో ఆ సంగతి సుస్పష్టమయింది. ఇంఫాల్‌లో జయిస్తే జపాన్‌కు ఒరిగేది పెద్దగా ఉండదు కాని ఇంఫాల్‌ను పట్టుకోవటం దేశ విమోచన వ్యూహానికి అత్యంత కీలకం. కీలకమైన మణిపూర్‌ ‌రాష్ట్రాన్ని చేజిక్కించుకోగలిగితే మిలిటరీ స్థావరాల మీదా, రైల్వేలూ, కమ్యూనికేషన్‌ ‌లైన్ల మీదా సాబటేజ్‌ ‌దాడులు చేయించి దేశంలోపల బ్రిటిష్‌ ‌వ్యతిరేక ప్రజాతిరుగుబాటు తేవటం నేతాజీకి సుకర మవుతుంది.

 ఇది వట్టి ఊహాగానం కాదు. అలా జరిగి ఉండేందుకు అవకాశం చాలా ఉన్నదని బ్రిటిష్‌ ‌మిలిటరీ చరిత్రకారులే ఒప్పుకున్నారు. ‘If Imphal had fallen to the Japanese, one of the consequences could have been a revolt in Bengal and Bihar against British rule in India which might well have been on a far larger scale than the riots of 1942’ (ఇంఫాల్‌ ‌జపాన్‌ ‌వశమై ఉంటే, బెంగాల్‌, ‌బిహార్‌లలో బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చేది. అది 1942 అల్లర్ల కంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉండేది.) అని The War Against Japan గ్రంథంలో (vol.3, p.446) మేజర్‌ ‌జనరల్‌ ఉడ్‌ ‌బర్న్ ‌కిర్బీ చెప్పిన మాట ఇందుకు ఉదాహరణ.

తెల్లవాళ్ల కళ్ళకు ఎలా కనపడ్డా, అల్లర్లు, అల్లకల్లోలం తెచ్చిపెట్టటం సుభాస్‌ ‌చంద్రబోస్‌ ఉద్దేశం ఎంతమాత్రం కాదు. సాయుధ సైనిక పోరాటానికి మద్దతుగా దేశం లోపల ఆయన తలపెట్టిన విధ్వంసక చర్యలు మన కాలపు నక్సలైట్లు, మిలిటెంట్లు చేసే టెర్రరిస్టు హింస లాంటిది కాదు. మిలిటరీ స్థావరాల మీద దాడులు, టెలిఫోన్‌, ‌టెలిగ్రాఫ్‌ ‌లైన్ల ధ్వంసాలు, రైలుమార్గాల అటకాయింపులు, విమానాశ్రయాల మీద దాడులు చేయమన్నది బ్రిటిష్‌ ‌సామ్రాజ్య సైనిక శక్తిని దెబ్బతీయటానికి. సర్కారీ వ్యవస్థను స్తంభింప జేయటానికి. వాటివల్ల ప్రజా జీవితానికి అసౌకర్యమే తప్ప అపాయం ఉండదు.

నిజానికి ప్రజల భద్రత, సమాజంలో శాంతి, సాఫీగా పరిపాలన పట్ల తెల్ల రాకాసులకంటే ఎక్కువ శ్రద్ధే ఈ దేశాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నేతాజీకి ఉన్నది. సైనిక సంఘర్షణల మూలంగా జనజీవనం కుంటుపడరాదని అందరికంటే ఎక్కువగా ఆయన ఆరాటపడ్డాడు. అందుకే యుద్ధంలో ఇంకా గెలవకుండానే గెలిచిన తరవాత జరగవలసిన పరిపాలన గురించి ఆలోచించి, ముందస్తుగా పక్కా ఏర్పాట్లు చేశాడు. విముక్తి చేసిన భారత ప్రాంతాల పరిపాలనను ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వానికి అప్పజెబుతామని మార్చి 22న జపాన్‌ ‌ప్రధాని పార్లమెంటులో ప్రకటించిన వెనువెంటనే నేతాజీ హుటాహుటిన కదిలాడు. తన కాబినెట్‌లో ఆర్ధిక మంత్రిగా ఉన్న మేజర్‌ ‌జనరల్‌ ఎ.‌సి. చటర్జీని అర్జెంటుగా రప్పించి విముక్త ప్రాంతాల చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించి సరిహద్దుకు తరలించాడు. పౌర పాలనలో అనుభవం ఉన్న సైన్యాధికారులను అవసరపడిన వెంటనే రంగంలోకి దిగటానికి సిద్ధంగా అడవుల్లో తాత్కాలిక గుడారాల్లో ఉంచాడు. బ్రిటిషు సర్కారు వైదొలగిన ప్రాంతాల్లో నీరు, విద్యుత్‌ ‌సరఫరాలు, రోడ్ల మరమ్మతులు వగైరా పౌరసౌకర్యాల నిర్వహణకు పునర్నిర్మాణ విభాగాలను ముందే నెలకొల్పాడు. ఆక్రమిత ప్రాంతాల్లో అమలు పరచవలసిన శాసనాలను, పాలనా వ్యవస్థను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాడు. స్థానిక ప్రజలకు చేదోడుగా ఉండటానికి ‘ఆజాద్‌ ‌హింద్‌ ‌దళ్‌’ ‌పేరిట స్వచ్ఛంద కార్యకర్తలను సమీకరించి ఉంచాడు. ప్రతిదీ కూలంకషంగా ముందే ఆలోచించి ప్రణాళికాబద్ధంగా అడుగువేయటంలో ఎవరైనా సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌తరవాతే!

 జైత్రయాత్ర జయప్రదంగా మొదలైంది. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించటానికి వేలాది వీరసైనికులు, సంకేతం అందగానే దేశంలో విప్లవం అంటించటానికి ప్రచ్ఛన్న కార్యకర్తలు కాచుకుని ఉన్నారు. ఇంఫాల్‌ ‌వశమయిందన్న శుభవార్త కోసమే అందరూ వెయ్యికళ్ళతో ఎదురు చూస్తున్నారు. అంతలోనే కథ అడ్డం తిరిగింది. ఊహకందని రీతిలో నమ్మకద్రోహం జరిగింది.

మిగతా వచ్చేవారం..

About Author

By editor

Twitter
Instagram