‘నేను ఇంగ్లండ్‌ ‌వచ్చేనాటికి కొన్ని పదాలు వినిపిస్తూ ఉండేవి- రాజకీయ ఆశ్రయం కోసం వచ్చిన వాడు వంటివి. ఉగ్రవాద పీడిత దేశాల నుంచి పారిపోతున్న, పీడనకు గురవుతున్న అనేక మంది విషయంలో ఈ మాట ఇప్పుడు వర్తించదు. 1960 దశకం కంటే ఇవాళ్టి ప్రపంచం మరింత హింసాత్మకంగా మారిపోయింది. అందుకే ఇప్పుడు సురక్షితంగా ఉన్న దేశాల మీద మరింత ఒత్తిడి పడుతోంది. ఆ దేశాలు అనివార్యంగా మరింతమందిని తీసుకోవలసివస్తున్నది.’ 2021 నోబెల్‌ ‌సాహిత్యం పురస్కారానికి ఎంపికైన అబ్దుల్‌ ‌రజాక్‌ ‌గుర్నా చెబుతున్న మాటలివి.

జనం వలసపోవడం ఆధునిక ప్రపంచానికి శాపమే. వలసవాదుల దురాగతాలు, ప్రపంచ యుద్ధాలు, వామపక్ష ప్రభుత్వాల హింస, ముస్లిం మతోన్మాదం, కరువు కాటకాలు ఏమైనా సుదూర ప్రాంతాలకు వలస వెళ్లడం ఆధునిక కాలంలో ఒక అవాంఛనీయ అప్రతిహత పరిణామం. అందుకే అబ్దుల్‌ ‌రజాక్‌కు నోబెల్‌ ‌ప్రకటించిన వెంటనే చాలామంది అఫ్ఘానిస్తాన్‌ ‌పరిణామాలను, తాలిబన్‌ ‌చొరబాటుతో జరిగిన వలసలను గుర్తుకు తెచ్చుకున్నారు. భారతదేశంలో అయితే ఏ కొద్దిమంది అయినా కశ్మీరీ పండితుల వలస గురించి తలుచుకునే ఉంటారు. ఇలా వలసపోయిన ప్రతి కాందిశీకుని హృదయం పలవరించేది- తనదైన నేలను విడిచివెళ్లడం గురించే.

వలసలు అనే పరిణామంతో సంభవించే దుష్పరిణామాలను ఎక్కడా రాజీపడకుండా కరుణరసాత్మకంగా చిత్రించారు రజాక్‌. ‌భిన్న సంస్కృతులకు సంబంధించిన కాందిశీకులకూ, భిన్న ఖండాలలో భౌగోళిక వైరుధ్యాలతో తప్పని ఒక సంఘర్షణని రజాక్‌ అక్షరబద్ధం చేశారని స్వీడిష్‌ అకాడమి వ్యాఖ్యానించింది. ప్రపంచంలో అనేక ఐరోపా దేశాలు ఎన్నో దేశాలను వలసలుగా మార్చాయి. అలాంటి వలసలో ప్రజల జీవనమే ఇతివృత్తంగా రజాక్‌ ‌రచనలు సాగించారు. వలసదేశంగా మారిన తరువాత ఒక సమాజం తనదైన సంస్కృతినీ, భాషనూ, కళనూ కోల్పోతుంది. తనదైన ఉనికినే నష్టపోతుంది. 1994లో వెలువడి, రజాక్‌కు అంతర్జాతీయ రచనా రంగంలో సుస్థిర స్థానం సాధించిన పెట్టిన ‘ప్యారడైజ్‌’ ‌నవల ఇతివృత్తం ఇదే. నిజానికి ఇది రచయిత కథేనని పిస్తుంది. 20వ శతాబ్దం ఆరంభంలో టాంజానియాలో పెరిగిన ఒక బాలుని కథ ఇందులో ఉంది.

రజాక్‌ ‌సొంత దేశం జంజిబార్‌లో 1964లో తిరుగుబాటు జరిగింది. సుల్తాన్‌ ‌జంషిద్‌బిన్‌ అబ్దుల్లాను  తిరుగుబాటుదారులు పదవి నుంచి తొలగించారు. ఈ తిరుగుబాటు మొత్తం సుల్తాన్‌ ‌నడుపుతున్న అరబ్‌ ‌పాలక వ్యవస్థ మీద వామపక్ష ఆఫ్రికన్‌ ఉద్యమకారులు చేసినదే. నిజానికి బ్రిటిష్‌ ‌వలస దేశం జంజిబార్‌ 1963‌లోనే స్వేచ్ఛను పొందింది. తరువాత అధికారాన్ని చెలాయిస్తున్న మైనారిటీ అరబ్బులకూ, మెజారిటీ ఆఫ్రికన్‌లకూ మధ్య ఘర్షణ జరిగింది. ఆపై జంజిబార్‌ ‌యునైటెడ్‌ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌టాంజానియా అయింది. అరబ్బులు, ఇతర మైనారిటీలు దాదాపు 20,000 మంది ఊచకోతకు గురయ్యారు. ఆ సమయంలోనే అంటే 1968 ప్రాంతంలోనే రజాక్‌ ఇం‌గ్లండ్‌ ‌వలసపోయారు. అనేక అడ్డంకులతో మళ్లీ 1984లో గాని టాంజానియాలో తన కుటుంబాన్ని కలుసుకోలేకపోయారు. కొద్దిసేపట్లో చూస్తాడనగా తండ్రి కన్నుమూశారు. నిజానికి ఒక శరణార్థిగానే రజాక్‌ ఆ ‌దేశం వెళ్లారు.

 అబ్దుల్‌ ‌రజాక్‌ ‌గుర్నా డిసెంబర్‌ 20, 1948‌న జంజిబార్‌లోనే  పుట్టారు. 18 వయసులో ఇంగ్లండ్‌ ‌వచ్చిన తరువాత మిగిలిన చదువంతా సాగింది. కెంట్‌ ‌విశ్వవిద్యాలయంలో వలసయుగానంతర సాహిత్యం గురించి బోధించారు. పరిశోధన కూడా పశ్చిమ ఆఫ్రికా సాహిత్యమే కేంద్ర బిందువుగా చేశారు. స్వాహేలి ఆయన మాతృభాష. చదువు కారణంగా రచనా వ్యాసంగమంతా ఇంగ్లిష్‌లోనే సాగింది. ఆయన సృజనాత్మక రచలన్నీ తూర్పు ఆఫ్రికా దేశాల ప్రజల జీవితాలకు సంబంధించినవే. రజాక్‌ ‌పది నవలలు, లెక్కకు మించిన కథలు, వ్యాసాలు రాశారు. మెమరీ ఆఫ్‌ ‌డిపార్చర్‌ (1987), ‌పిలిగ్రిమ్స్ ‌వే (1988), ప్యారడైజ్‌ (1994), ‌బై ది సీ (2001), డిజర్షన్‌ (2005), ‌గ్రావెల్‌ ‌హార్ట్ (2017), ‌తాజాగా, ఆఫ్టర్‌ ‌లైవ్స్ (2020) ఆయన రాసిన నవలలు. ఈ నవలలో ఎక్కువ శరణార్థుల అనుభవాలను పలకరించేవే. వలసపోవడం అనే అస్తిత్వ సంబంధ క్షోభ, ఉనికి, తనకంటూ చిరునామా అనే అంశాలే ఆ రచనలను  నడిపిస్తాయి.ఆఫ్టర్‌ ‌లైవ్స్ ‌నవల జర్మనీ వలసగా జంజిబార్‌ ఎం‌త కోల్పోయిందో, సమాజాలను ఎలా చెల్లా చెదురు చేసిందో వర్ణించారు(ఎ డెవిల్‌ ఆన్‌ ‌ది క్రాస్‌ ‌నవలలో గూగీ వా థియాంగ్‌, ‌థింగ్స్ ‌ఫాల్‌ అపార్ట్ ‌నవలలో చిన్హువా అచుబే  సరిగ్గా ఈ అంశాలనే అద్భుతంగా ఆవిష్కరించిన సంగతి ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు). ఆఫ్రికన్‌ అరబ్‌ ‌నేపథ్యం కలిగిన వారే రజాక్‌ ‌రచనలలో  కథానాయకులుగా కనిపిస్తారు. శరణార్థులుగా వెళ్లిన వారు కోల్పోయే సాంస్కృతిక ఉనికి గురించే రజాక్‌ ఆరాటమంతా. అడ్మమైరింగ్‌ ‌సైలెన్స్ అన్న నవలలో ప్రధాన పాత్ర నిజానికి చాలామంది శరణార్థుల అంతరంగానికి ప్రతీక. అతడు రెండు సంస్కృతుల మధ్య చిక్కుకుంటాడు. కానీ ఆ రెండు సంస్కృతులు కూడా అతడికి చోటు ఇవ్వవు. ఆ సంస్కృతికి చెందినవాడని, ఈ సంస్కృతి, ఈ సంస్కృతి అతడిదని ఆ సంస్కృతివారు దూరం పెడతారు. అందుకే రజాక్‌ ‌సృష్టించిన పాత్రలన్నీ సంస్కృతులకీ, ఖండాలకీ నడుమ ఉన్న అగాధాన్ని తడుముతూ ఉంటాయని, అన్వేషిస్తూ ఉంటాయని నోబెల్‌ ‌కమిటీ చైర్మన్‌ ఆం‌డర్స్ ఓల్సెన్‌ అన్నారు.

 పేదరికంతో, దయనీయ స్థితిలో, ఇంటి మీద బెంగతోనే ఇంగ్లండ్‌లో ప్రవేశించారు రజాక్‌. ‌కానీ అలాంటి సంక్లిష్ట జీవితంలోనే ఆయనలోని రచయిత కూడా రూపుదిద్దుకున్నాడు. జంజిబార్‌ ‌జీవితం ఇచ్చిన జ్ఞాపకాలకు డైరీలో అక్షర రూపం ఇవ్వడం ఆరంభించారాయన. మొదట ఏవో చెదురుమదురు జ్ఞాపకాలుగా అవన్నీ నమోదైనాయి. తరువాత పెద్ద పెద్ద పేరాలుగా విస్తరించాయి. ఆఖరికి బాధనూ, కన్నీళ్లనూ అద్దుకుని కథలుగా, నవలలుగా రూపాంతరం చెందాయి. ఈ ప్రపంచంలో నీవు కోల్పోయిన ప్రదేశం గురించిన చింతనే రచనానుభవానికి నన్ను గురి తీసుకువెళ్లిందంటారు రజాక్‌.

‌గత జ్ఞాపకాలను అల్లుకుంటూ వెళ్లే ఆ నవలలు నెలవులు తప్పిన జీవితాలలోని అభద్రతా భావం గురించి అంతర్లీనంగా చెబుతూ ఉంటాయి. తన గతం గురించి మరచిపోవడానికీ, అలాగే ఆ జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోవడానికీ ఒక శరణార్థి పడిన సంఘర్షణను బై ది సీ నవలలో ఆయన చిత్రించారు.ఆఫ్టర్‌ ‌లైవ్స్‌లో హమ్జా అనే ఆఫ్రికన్‌ అరబ్‌ ‌యువకుని కథను చిత్రించారు. తూర్పు ఆఫ్రికాలో 1919 వరకు సాగిన జర్మనీ పాలనలో మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి అధికారులు ఎంపిక చేసిన వాడే హమ్జా. రచయితగా తనకు ప్రేరణ ఏమిటో ఆయన ఇంతకు ముందే పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. సామాజిక, రాజకీయ పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నప్పటికీ జంజిబార్‌లోని బహుళ సంస్కృతులు, భాషా వైవిధ్యమే తనకు ప్రేరణ అని వెల్లడించారు. స్వాహేలి, అరబిక్‌, ‌హిందీ, జర్మన్‌ ‌భాషలు అక్కడ వినిపించేవి. అవి ఆయన రచనలలో కూడా అక్కడక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటాయి. దేశ ప్రభుత్వమే రక్తపాతానికి ఒడిగడుతున్న భయానక పరిస్థితులలో ఆయన దేశం విడిచి వచ్చారు. ఆ జ్ఞాపకాలు, క్షోభ చిరకాలం వెంటాడాయి. తీరా రచనలు ఆరంభించే సమయానికి తాను దూరంగా వదిలి వచ్చిన సమాజం గురించి రాయవలసి వచ్చింది. అలాగే తన సొంత నేల ఎలా ఉంటుందో జ్ఞాపకం చేసుకుంటూ రాయవలసి వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా శరణార్థుల సమస్య తీవ్రమవుతున్న సమయంలో రజాక్‌ ‌రచనలకు నోబెల్‌ ‌రావడం వలసపోవడం అనేది మళ్లీ ఒక్కసారి చర్చలోకి వచ్చింది. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని దేశాలలో సాగుతున్న అరాచకాలు ప్రపంచానికి గుర్తుకు వచ్చాయి. ఇందులో పెద్దగా ప్రయాస లేకుండానే మదిలో మెదిలినది అఫ్ఘాన్‌ ‌నుంచి జరిగిన వలసలు. కశ్మీర్‌ ‌పండిత్‌ల వలస, హింసాకాండను ప్రపంచం దృష్టికి రావడం అవసరం. ఆ విధంగా రజాక్‌ ‌రచనలు మన దేశానికీ వర్తిస్తాయి. దేశ విభజన నాటి వలసలు, కశ్మీరీ పండితుల వలసలు మరచిపోతే చరిత్రకే కాదు, మానవతకూ ద్రోహమే.

– కల్హణ

By editor

Twitter
Instagram