ఏది మన గమ్యమో, ఆ గమ్యానికి దారేదో స్పష్టత ఉండాలంటే ఎక్కడ బయలుదేరామన్న విషయం మీద సరైన స్పృహ కలిగి ఉంటేనే సాధ్యమంటారు పెద్దలు. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవంలోను ఈ అంశం మీద చిన్న సమీక్షయినా చేసుకోవాలి. అది జాతిజనుల విధి. మనవైన ఆలోచనలతో, మనదైన ప్రతిభతో దేశాన్ని మనమే ముందుకు నడిపించుకునే మహదవకాశాన్ని అందుకున్న మాట వాస్తవం. బాలారిష్టాల మధ్య, చరిత్ర చేసిన గాయాలతోనే, వాటి సలుపుతోనే కొన్ని అడుగులైనా ముందుకేశాం. కొన్ని లోపాలను సవరించుకున్నాం. ఇంకా సరిచేసుకోవలసినవీ ఉన్నాయి కూడా. కానీ ఇలా ప్రయాణించే స్వేచ్ఛనూ, మన శక్తిసామర్ధ్యాలను నిరూపించుకునే అవకాశాన్నీ, స్వేచ్ఛతో రెక్కలు సాచిన సృజనాత్మకతనూ ఈ తరం అనుభవానికి తెచ్చినది నిశ్చయంగా సమీప గతంలో జరిగిన ఆ గొప్ప పోరాటమే. అదే మన స్వరాజ్య సమరం.

ఇంత పురాతన సంస్కృతి; రాజనీతి, విజ్ఞానం, యుద్ధ నైపుణ్యం, జీవించే కళ, అన్నింటికి మించి తప్పులు దిద్దుకునే సంసిద్ధత, సకారాత్మక దృక్పథం ఉన్న సమూహం వందల ఏళ్లు బానిసత్వంలో మగ్గడమా? ఆ దుస్థితి ఎందుకు దాపురించింది? అడుగులో అడుగు కలిపి, భుజం భుజం కలిపి ఇప్పటికైనా వెలుగులోకి అడుగు వేయలేమా? ఇకనైనా కొత్త చరిత్రకు నాంది పలకలేమా? కొత్త ప్రపంచం సృష్టించుకుంటున్న చరిత్ర నుంచి నేర్చుకోలేమా? ఇలాంటి ప్రశ్నలతో మొదలైన పునరుజ్జీవన దృష్టి ఉద్యమరూపం దాల్చింది. కానీ ఆ ఉద్యమ నిర్మాణం సులభం కాలేదు. జాతి పోరాడినది మతోన్మాదాన్నీ, పాలననీ కలగలిపిన విదేశీ శక్తులతో. ఎలాంటి నైతిక విలువలు లేకపోవడమే కాదు, అణచివేతే ఆయుధంగా, నిలువెల్లా జాత్యహంకారం నిండిన శ్వేతజాతితో. ఉద్యమం నిలబెట్టడానికి ఉరితాళ్లకీ, తూటాలకీ, లాఠీలకీ వేలాది శరీరాలను అప్పగించవలసి వచ్చింది. అదంతా నిస్వార్ధత్యాగం. భావితరాల కోసం జరిగిన రక్తతర్పణం. అందుకే వారిని గుర్తుచేసుకోవడం కనీస ధర్మం. అందుకు మార్గం చరిత్ర రచన, అధ్యయనం.

కానీ భారతదేశ చరిత్ర నిర్మాణం సమగ్రమని ఏ ఒక్కరూ చెప్పలేరు. కొన్ని కుటుంబాలు, కొన్ని ఘట్టాలు, ఆ కొన్ని జైలు జీవితాలే స్వాతంత్య్ర పోరాట సర్వస్వం కాలేవు. మన స్వాతంత్య్ర పోరాటానికి అనేక పార్శ్వాలు ఉన్నాయి. పలు పంథాలలో సాగిన సమరమది. ఏ ఒక్క త్యాగాన్నీ, రక్త తర్పణనీ కించపరిచే ఉద్దేశం లేకపోయినా, అలా భావించక తప్పని ఒక ఛాయ మన చరిత్ర రచన మీద నిజం. ఈ వాస్తవాలను అంగీకరించాల్సిందే.

 ఈ దేశానికి విదేశీ పాలన, బానిసత్వం ఇచ్చిన అనేక రుగ్మతలను నివారించి, ఇంకా మిగిలిన భ్రమల పొరలను తొలగించాలని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి ప్రయత్నిస్తున్నది. అలాంటి ప్రయత్నం ఇప్పుడు చరిత్ర రచనలోని ఆత్మహత్య సదృశ ధోరణులను పరిహరించేందుకు ఆరంభించింది. ‘ఆజాదీ కా అమృతోత్సవ్‌’ (ఇం‌డియాఏ75) ఉద్దేశం అదే. ఈ మార్చి 12న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేధో పునరుజ్జీవన కార్యాక్రమాన్ని ప్రారంభించారు.

ఆజాదీ కా అమృతోత్సవ్‌ ‌లేదా జాతీయ పోరాటయోధుల, హుతాత్మల సంస్మరణ ఉద్దేశం ఏమిటి? వారి చేత అలాంటి పోరాటానికి ఉద్యుక్తులను చేయడం వెనుక విస్తృత ప్రజా ప్రాతిపదిక ఉంది. ఈ దేశ పోరాట పరిధి ఎంతో విస్తృతమైనది. అందులో మీ పూర్వతరం వారు, మన ప్రాంతంవారు ఎందరో ఉన్నారు. అలా మరుగున పడిన త్యాగమూర్తుల జీవితగాధలను వెలికి తీయాలి.

1885 డిసెంబర్‌ ‌చివర భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించింది. అంతకు ముందే అరాచక పాలన మీద ఆగ్రహం ఉంది. కొండకోనలలో గిరిపుత్రులు ఉద్యమించారు. భూమి కేంద్రంగా మైదాన ప్రాంతాలలో రైతాంగ ఉద్యమాలు ఎగసిపడ్డాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ ‌స్వరాజ్య సమరాన్ని మలుపు తిప్పిందంటే అభ్యంతరం ఉండనక్కరలేదు. దాని పరిమితులు మాత్రం గుర్తించాలి. చట్టబద్ధంగానే సాగినా విదేశీ పాలనను సహించబోమని చెప్పిన అతివాద జాతీయవాదులు ఉన్నారు. జాతీయ కాంగ్రెస్‌తో, అహింసాపథంతో సరిపడక తీవ్ర జాతీయవాదం ఆయుధమెత్తింది. ఇంపీరియల్‌ ‌లెజిస్లేటివ్‌ ‌కౌన్సిల్‌ ‌ద్వారా చట్టబద్ధంగా సాగిన పోరాటం మరొక స్రవంతి. వారు ప్రతి చట్టం నిర్మాణంలోను భారతీయ ప్రయోజనాల గురించి నిలదీసేవారు. ఆ చట్టాలే అంతిమంగా రాజ్యాంగానికి పునాదుయ్యాయి. విదేశీ గడ్డ మీద నుంచి మాతృభూమి స్వేచ్ఛ కోసం సాగించిన పోరాటాన్ని గుర్తించ నిరాకరించడం, మరుగుపరచడం వర్తమాన తరాన్ని దగా చేయడమే. అటు ఉద్యమకారులుగా, పత్రికా రచయితలుగా ద్విపాత్రాభినయం చేసిన మేధావులు ఉన్నారు. పంథా ఏదైనా జాతి స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటం, ఏ మూల జరిగినా, ఎవరు చేసినా దానిని నమోదు చేయాలి. అప్పుడే సమగ్ర చరిత్ర అవుతుంది. అందుకే ఆజాదీ కా అమృతోత్సవ్‌ను జన ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. ఎంతో సబబైన ఆలోచన.

మన చరిత్ర రచనకు జరుగుతున్న కొత్త ప్రయత్నం భవ్యంగా, నిజాయితీగా ఉండాలి. త్యాగాల దగ్గరా, రక్త తర్పరణల దగ్గరా పక్షపాతం సరికాదు. వస్త్వాశ్రయ దృష్టే మన చరిత్ర రచనకు శ్రీరామరక్ష. ఆ తరం వారు కొత్త చరిత్రను సృష్టించారు. దానిని మన తరం సక్రమంగా నమోదు చేద్దాం. ఇంకా ఆలస్యం పెద్ద ద్రోహమే అవుతుంది- అటు త్యాగాలు చేసిన తరానికీ, ఇటు ఆ త్యాగంతో స్ఫూర్తి పొందవలసి ఉన్న రేపటి తరానికీ కూడా.

By editor

Twitter
Instagram