– క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌యుద్ధం చేసేందుకు సైనిక బలగాలు కావాలి. సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించాలి. యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, క్షిపణులను తరలించాలి. కానీ ఇప్పుడు యుద్ధం తీరు మారింది.. అదే సైబర్‌ ‌దాడి.. ఇటీవల భారత్‌పై చైనా ప్రయోగించిన అస్త్రం ఇదే. భారత్‌ ‌పవర్‌‌గ్రిడ్‌ ‌మీద రహస్యంగా దాడి చేసి భారీ నష్టం కలిగించింది. ఇది ఒక శాంపిల్‌ ‌మాత్రమేన పరోక్షంగా హెచ్చరించింది. సరిహద్దుల్లో దురాక్రమణకు ప్రయత్నించి భారత సైనికుల చేతిలో భంగపడ్డ డ్రాగన్‌ ‌డార్క్ ‌గేమ్‌ ‌ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. చైనా విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుంది.

జూన్‌ 20, 2020 ‌గల్వాన్‌

‌భారత భూభాగంలోనికి చైనా సైనికులు చొరబడ్డారు. మన సైన్యం వారిని దీటుగా ఎదుర్కొంది. ఈ ఘర్షణలో కల్నల్‌ ‌సంతోష్‌బాబు సహా 20 మంది భారత జవానులు వీర మరణం పొందారు. చైనా వైపు దాదాపు 40 మంది వరకూ మరణించినట్లు స్పష్టమైనా సంఖ్యను చెప్పకుండా దాచిపెట్టింది. భారత సైనికుల సత్తా తెలిసి చైనా తాత్కాలికంగా తోక ముడిచింది.

అక్టోబర్‌ 12, 2020 ‌ముంబై

గల్వాన్‌ ‌లోయ నుంచి 2400 కి.మీ. దూరంలోని భారత ఆర్థిక రాజధాని ముంబైలో ఒక్కసారిగా భారీ విద్యుత్‌ ‌కోత. 50 లక్షల ఇళ్లు, ఆఫీసులలో విద్యుత్‌ ‌సరఫరా ఆగిపోయింది. రైళ్లు నిలిచిపోయాయి. 12 గంటలపాటు కరెంటు లేక పనులన్నీ ఆగిపోయాయి. ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. అసలేం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ముంబై చరిత్రలోనే అది చీకటిరోజు.

నాలుగు నెలల తేడాలో జరిగిన ఈ రెండు ఘటనలు.. చూస్తే ఒకదానితో మరొకదానికి సంబంధం కనిపించదు. ఎందుకంటే ఒకటి సైనికుల మధ్య పోరాటం, రెండోది విద్యుత్‌కి అంతరాయం. కానీ ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందని బయటపడింది. ఈ కుట్ర వెనుక ఉన్నది చైనా. న్యూయార్క్ ‌టైమ్స్ ‌పత్రిక ప్రచురించిన వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలం సృష్టించింది.

బయటపడిన సైబర్‌ ‌కుట్ర

ముంబైలో విద్యుత్‌ అం‌తరాయానికి, సరిహద్దు ఘర్షణకు సంబంధం ఉందని అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ‘రికార్డెడ్‌ ‌ఫ్యూచర్‌’ అనే సంస్థ బయటపెట్టింది. భారత పవర్‌‌గ్రిడ్‌పై చైనా సైబర్‌ ‌నేరగాళ్లు గురిపెట్టారని, సరిహద్దులో భారత్‌ ‌వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని ముంబయిలో విద్యుత్‌ ‌నిలిపివేయడం ద్వారా చైనా హెచ్చరించిందని సదరు సంస్థ తెలిపింది.

చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న రెడ్‌ ఎకో గ్రూప్‌ ‌భారత్‌లోని ఎన్టీపీసీ సహా ఐదు ప్రైమరీ లోడ్‌ ‌డిస్‌ప్యాచ్‌ ‌సెంటర్లు, విద్యుత్‌ ‌సంస్థల కంప్యూటర్‌ ‌నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుందని ‘రికార్డెడ్‌ ‌ఫ్యూచర్‌’ ‌వెల్లడించింది. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా సంస్థల్లోని ఐపీ అడ్రస్‌లపై హ్యాకర్లు దాడి చేసినట్లు తెలిపింది. విద్యుత్‌రంగానికి చెందిన 12 సంస్థల్లోని 21 ఐపీ అడ్రస్‌లను టార్గెట్‌ ‌చేసింది. వీటి ఇన్‌‌ఫ్రా సిస్టమ్స్‌లోకి ఒక కోడ్‌ను చొప్పించింది. ఆ కోడ్‌ ‌యాక్టివేట్‌ ‌కాగానే, ఆ గ్రిడ్‌ అం‌తా ఆగిపోయింది. చైనా సైబర్‌ ‌దాడులపై గత ఏడాది ప్రారంభంలోనే రికార్డెడ్‌ ‌ఫ్యూచర్‌ ‌హెచ్చరించింది. గల్వాన్‌లో భారత దూకుడుకు కౌంటర్‌గానే ఈ సైబర్‌ ఎటాక్స్ ‌జరిగాయని ఆ సంస్థ అంచనా వేస్తోంది.

సౌత్‌ ‌చైనా మార్నింగ్‌ ‌పోస్ట్ అనే పత్రిక తాజా కథనం ప్రకారం.. అంతర్జాతీయ వేదికపై చైనా దొంగ వాదనను సమర్థించే లాయర్లు కరువయ్యారట. మంచి లాయర్లను చూడాలంటూ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశించారన్నది ఈ కథనం చెబుతోంది. సరిహద్దు గొడవల్లో ఒక అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కి వేస్తోంది డ్రాగన్‌. అం‌దుకే గల్వాన్‌లో మనకు కొంత ఊరట కనిపిస్తోంది. సరిహద్దు వివాదానికి తెరదించేలా ఇటీవల భారత్‌, ‌చైనా కీలక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పాంగాంగ్‌ ‌సరస్సు వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి. ఇలాంటి సమయంలో ఈ విషయం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంత రించుకుంది.

ప్రపంచాన్ని భయపెడతున్న కరోనా మహమ్మారి చైనా సృష్టే అన్నది బహిరంగ రహస్యం. 2020లో యావత్‌ ‌ప్రపంచం కొవిడ్‌ 19 ‌వైరస్‌ ‌ద్వారా దారుణంగా దెబ్బతిన్నది. కానీ దీనికి కారణమైన చైనా మాత్రం ఆర్థికంగా, సైనికంగా బలోపేతం కావడం ద్వారా ప్రపంచంపై పట్టు సాధించేందుకు పావులు కదిపింది. ఇరుగు పొరుగు దేశాలతో గిల్లికజ్జాలు మొదలు పెట్టింది. భారత సరిహద్దుల్లో గల్వాన్‌ ‌ఘర్షణతో మొదలుపెట్టిన ఆటను ముంబై పవర్‌ ‌కట్‌ ‌ద్వారా కొనసాగించిందింది.

చైనా సైబర్‌ ‌దాడులు ఇంతటితో ఆగకపోవచ్చని భారత సైబర్‌ ‌నిపుణులు భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్‌ ‌వ్యవస్థల్లోకి చొరబడవచ్చని, భారత రక్షణ, నౌకా, రైల్వే వ్యవస్థలపై కూడా దాడి చేసే ప్రమాదం ఉందని, దేశంలోని బ్యాంకింగ్‌ ‌వ్యవస్థలు, కార్పొరేట్‌ ఆసుపత్రుల వ్యవస్థలకు కూడా ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

చైనా పరికరాలతో జాగ్రత్త!

వాస్తవానికి గల్వాన్‌ ‌ఘర్షణ జరిగిన తర్వాత కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌.‌కె. సింగ్‌ ‌మాట్లాడుతూ.. చైనాలో తయారయ్యే విద్యుత్‌ ‌పరికరాల్లో మాల్‌వేర్‌ ఉం‌దేమో అన్న అంశంపై తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. ఆయన ఈ విషయం చెప్పిన కొన్ని నెలలకే ముంబయిలో గ్రిడ్‌ ‌విఫలం కావడం గమనార్హం. విద్యుత్తు, టెలికాం రంగంలో కీలక వనరుల కోసం మనదేశం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇందులో ఎక్కువగా చైనా పరికరాలనే వినియోగిస్తున్నారు. భారత్‌లో వినియోగించే రూటర్లు అత్యధికం అక్కడి నుంచే వస్తున్నాయి. ఇప్పుడు ఇవే చైనా హ్యాకర్లకు లక్ష్యంగా మారుతున్నాయి. భారత బ్యాంకింగ్‌ ‌వెబ్‌సైట్లు, డేటా రిపోజిటర్లు తరచూ డ్రాగన్‌ ‌హ్యాకర్ల దాడికి గురవుతూనే ఉన్నాయి. భారత్‌పై చైనా సైబర్‌ ‌దాడి చేయడం ఇదే తొలిసారి కాదు. 2012లో సైబర్‌ ‌దాడి కారణంగా నేషనల్‌ ‌పవర్‌‌గ్రిడ్‌లో సమస్యలు తలెత్తాయి. ఈ ఘటన తర్వాత భారత్‌ ‌కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత విద్యుత్‌ ‌రంగంలో చైనా పరికరాలను పూర్తిగా నిషేధించాలని 2015లో ఇండియన్‌ ఎలక్ట్రానిక్స్ అం‌డ్‌ ఎలక్ట్రికల్‌ ‌మానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్‌ను కోరింది.

తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం..

భారత్‌ ‌మీద చైనా హ్యాకర్ల దాడి వెలుగులోకి వచ్చిన సమయంలో మరో వార్త ఆశ్చర్యానికి గురి చేసింది. ముంబై పవర్‌ ‌గ్రిడ్‌ ‌తరహాలోనే తెలంగాణలోని విద్యుత్‌శాఖ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ ‌చేసేందుకు ప్రయత్నించారు. దీంతో తెలంగాణ విద్యుత్‌శాఖకు కంప్యూటర్‌ ఎమర్జెన్సీ సిస్టమ్‌ ‌హెచ్చరిక వచ్చింది. చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు తెలంగాణ స్టేట్‌ ‌లోడ్‌ ‌డిస్పాచ్‌ ‌సెంటర్‌, ‌తెలంగాణ ట్రాన్స్ ‌కో సర్వర్లను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని లాక్‌ ఇన్‌ ‌సర్వర్లు, కంట్రోల్‌ ‌ఫంక్షన్స్ ‌గమనిస్తూ ఉండాలని సూచించింది. దీంతో విద్యుత్‌ ‌శాఖ అప్రమత్తమైంది. వెబ్‌సైట్‌లో ఉన్న అందరి యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లు మార్చేసింది.

భారత విద్యుత్‌ ‌సరఫరా వ్యవస్థల మీదే కాదు.. నౌకాశ్రయాల మీద కూడా చైనా సైబర్‌ ‌కన్నుపడింది. చైనా ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే ‘రెడ్‌ ఎకో’ హ్యాకర్లు ఈ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని రికార్డెడ్‌ ‌ఫ్యూచర్‌ ‌చెబుతోంది. చైనా హ్యాకర్లు భారత్‌లోని ఒక నౌకాశ్రయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ‌స్టూవర్ట్ ‌సాల్మన్‌ ‌చెప్పారు. రెండు నౌకాశ్రయాలు సహా, పది సంస్థలపై హ్యాకర్లు గురిపెట్టినట్టు ఫిబ్రవరి పదో తేదీన గుర్తించామని చెప్పారు. ఫిబ్రవరి 28 నాటికి కూడా కొన్ని సంస్థల్లోకి సమాచారం వెళ్తుండడాన్ని గమనించామని తెలిపారు.

సీరం, భారత్‌ ‌బయోటెక్‌లపై గురి

ప్రపంచానికి తక్కువ ధరకు నాణ్యమైన కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్న భారత్‌ ‌మీద తాజాగా చైనాకు కన్ను కుట్టింది. వ్యాక్సిన్‌లను తయారుచేస్తున్న రెండు దిగ్గజ కంపెనీల ఐటీ వ్యవస్థలపై చైనా హ్యాకర్లు గురి పెట్టినట్లు సైబర్‌ ఇం‌టలిజెన్స్ ‌సంస్థ సైఫిర్మా తెలిపింది. స్టోన్‌ ‌పాండా అని పిలిచే చైనా హ్యాకింగ్‌ ‌గ్రూప్‌ ఎపిటి 10 భారత్‌ ‌బయోటెక్‌, ‌సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియా (ఎస్‌ఐఐ)‌కు సంబంధించిన ఐటి మౌలిక సదుపాయాలు, సప్లయ్‌ ‌చైన్‌ ‌సాఫ్ట్‌వేర్‌లలోని మూలాలను మాల్‌వేర్‌ని జొప్పించడం ద్వారా తెలుసుకుందని సదరు సంస్థ వెల్లడించింది. ఈ రెండు ఫార్మా సంస్థలకు సంబంధించిన పూర్తి డేటాను స్వాధీనం చేసుకుని.. ఆయా భారతీయ ఔషధ సంస్థల పోటీ ప్రయోజనాన్ని పొందటమే చైనా హ్యాకర్ల ప్రధాన లక్ష్యం అని సైఫిర్మా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ‌కుమార్‌ ‌రితేష్‌ అన్నారు. అనేక దేశాలకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్న ఎస్‌ఐఐని ఎపిటి 10 క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోంది. త్వరలోనే ఈ సంస్థ పెద్ద మొత్తంలో నోవావాక్స్ ‌షాట్‌లను ప్రారంభించనున్న నేపథ్యంలో వారికి ఇదే ప్రధాన లక్ష్యం అని ఆయన తెలిపారు. సీరం ఇనిస్టిట్యూట్‌ ‌విషయంలో, వారు పలు బలహీనమైన వెబ్‌ ‌సర్వర్లను కనుగొన్నారు. అవి కచ్చితంగా హాని కలిగించే వెబ్‌ ‌సర్వర్లని కనిపెట్టినట్లు రితేష్‌ ‌పేర్కొన్నారు. చైనీస్‌ ‌హ్యాకర్లు పెద్ద కుట్రకు ప్రణాళికను రచిస్తున్నారని తెలిపారు.

ప్రపంచంలోనే దిగ్గజ ఫార్మా కంపెనీల్లో ఒకటైన డాక్టర్‌ ‌రెడ్డీస్‌పైనా సైబర్‌ ‌నేరగాళ్ల కన్ను పడింది. కంపెనీకి చెందిన ఐటీ విభాగాలపై సైబర్‌ ‌దాడి జరిగింది. ఈ విషయాన్ని సంస్థ స్టాక్‌ ఎక్ఛేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. తమ సంస్థకు చెందిన ఐటీ విభాగాలపై సైబర్‌ ‌దాడిని గుర్తించినట్లు డాక్టర్‌ ‌రెడ్డీస్‌ ‌పేర్కొంది. ఈ నేపథ్యంలో అవసరమైన నివారణ చర్యల్లో భాగంగా అన్ని డేటా సెంటర్లలను ప్రత్యేకంగా ఉంచి, పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ సైబర్‌ ‌దాడి ఎవరు, ఎక్కడి నుంచి చేశారనే వివరాలను మాత్రం డాక్టర్‌ ‌రెడ్డీస్‌ ‌వెల్లడించ లేదు. కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో డాక్టర్‌ ‌రెడ్డీస్‌ ‌కీలకంగా వ్యవహరిస్తోంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-‌వి వ్యాక్సిన్‌ ‌క్లినికల్‌ ‌ట్రయల్స్‌ను భారత్‌లో నిర్వహించడంతోపాటు వ్యాక్సిన్‌ను ఇక్కడ సరఫరా చేసేందుకు ఆర్‌డీఐఎఫ్‌తో డాక్టర్‌ ‌రెడ్డీస్‌ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌కోసం ఈ మధ్యే భారత నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతి పొందింది. ఈ సమయంలో సంస్థ ఐటీ విభాగాలపై సైబర్‌ ‌దాడి ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.

సైన్యం సర్వదా సిద్ధం: బిపిన్‌రావత్‌

‌ప్రపంచంలో ఏ దేశ సైన్యం ఎదుర్కోని సవాళ్లను భారత సైన్యం ఎదుర్కొంటుందని త్రివిధ దళాధిపతి (చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌) ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ అన్నారు. తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడంతో పాటు చైనా, పాకిస్తాన్‌ల నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ‘భారత సైన్యం ఎదుర్కొంటున్న సవాళ్లు-అత్యవసర చర్యలు’ అనే అంశంపై ఇటీవల సికింద్రాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌మేనేజిమెంట్‌ (‌సీడీఎం) ఏర్పాటు చేసిన వెబినార్‌లో రావత్‌ ‌పాల్గొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఉత్పన్నమయ్యే సైనిక బెదిరింపులు, ముప్పులను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని బిపిన్‌ ‌రావత్‌ ‌స్పష్టం చేశారు.

భారత సైన్యం ప్రస్తుతం తీవ్ర భద్రతా, సవాళ్లతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కొంటోందని రావత్‌ ‌పేర్కొన్నారు. జాతీయ భద్రతా వ్యూహాలు, రక్షణశాఖ వ్యూహాత్మక మార్గదర్శకాలు, రక్షణశాఖలో నిర్మాణాత్మక సంస్కరణలను మరోసారి నిర్వచించు కోవాలని స్పష్టంచేశారు. 20వ శతాబ్దంలో సమాచార విప్లవం, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో యుద్ధ స్వభావం పూర్తిగా మారిపోయిందని త్రివిధ దళాధిపతి అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ఇదివరకెన్నడూ లేని విధంగా కొత్త సాధనాలు, వ్యూహా లను ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఇలాంటి సమయంలో దేశ అవసరాలకు అనుగుణంగా రక్షణ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ ‌గుర్తుచేశారు.

భారత వెబ్‌సైట్స్ ‌మీద సైబర్‌ ‌దాడులు క్రమంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియన్‌ ‌కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ‌టీమ్‌ ఈ ‌వివరాలు వెల్లడించింది. 2018లో మనదేశానికి చెందిన 17,560 వెబ్‌సైట్స్ ‌మీద దాడులు జరిగాయి. 2019లో 24,768.. 2020లో 26,121 వెబ్‌సైట్స్ ‌మీద సైబర్‌ ఎటాక్స్‌ను గుర్తించి నట్లు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. గత ఏడాది జూన్‌ 20 ‌నుంచి 24 వరకు, అంటే 5 రోజుల్లో బ్యాంకింగ్‌, ఐటీ సంస్థలను చైనా టార్గెట్‌ ‌చేసింది. ఈ రెండు రంగాలపై 40,300 ఎటాక్స్ ‌చేయడానికి చైనా హ్యాకర్లు ప్రయత్నించారని మహారాష్ట్ర సైబర్‌ ‌వింగ్‌ ‌స్పెషల్‌ ఐజీ యశస్వి యాదవ్‌ ‌చెప్పారు.  కానీ ఇవన్నీ విఫలం అయ్యాయి. నక్కజిత్తుల చైనాను మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మన సైబర్‌ ‌వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి.

దివంగత మాజీ ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజపేయి ఇచ్చిన నినాదం జై విజ్ఞాన్‌. ‌ప్రధాని నరేంద్రమోదీ కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. జై జవాన్‌ అం‌టూ మనం సైనిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నాం. అలాగే జై విజ్ఞాన్‌ అం‌టూ సైబర్‌ ‌టెక్నాలజీని మరింత పటిష్టం చేసుకోవాలి. సరిహద్దుల్లో చైనా యుద్ధాన్ని తిప్పికొట్టడం భారత్‌కు ఎంత ముఖ్యమో, మనదేశంలోని సైబర్‌ ‌వ్యవస్థలను కూడా చొరబాట్ల నుంచి కాపాడుకోవడం అంతే ముఖ్యం.

By editor

Twitter
Instagram