దేశంలోని కొన్ని రాష్ట్రాలతో పాటు, తెలంగాణను కూడా ఫ్లోరైడ్‌ ‌విముక్త రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వార్తను సహజంగానే మీడియా వెంటనే పెద్ద ఎత్తున ప్రాముఖ్యం ఇచ్చి ప్రసారం చేసింది. ఫ్లోరైడ్‌ ‌కారణంగా సంక్రమించే ఫ్లోరోసిస్‌ ‌వ్యాధి తీవ్రత తెలిసిన వారు, అది మనుషులను, జంతువులను కూడా కుంగతీస్తున్న తీరు ఎంత క్రూరంగా ఉంటుందో గమనించిన వారు, దీని నిర్మూలన కోసం చిరకాలంగా స్వప్నిస్తున్న సామాజిక కార్యకర్తలు, నిజానికి ఆ వ్యాధి బారిన పడిన నిర్భాగ్యులు సైతం చాలా సంతోషిస్తారని చెప్పడం సత్యదూరం కాబోదు. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయన్నది ఇక్కడ గుర్తించక తప్పదు.

తెలంగాణ వరకు ఇది దాదాపు తొమ్మిది దశాబ్దాల నాటి తీవ్ర ఆరోగ్య సమస్య. మరొక కోణం నుంచి తీవ్ర సామాజిక సమస్య కూడా. ఈ సమస్య మొదలు కావడం, తీవ్ర రూపం దాల్చడం ఇవన్నీ తరువాత చర్చించుకోవచ్చు. కానీ ఫ్లోరైడ్‌ ‌విముక్త ప్రాంతంగా తెలంగాణను ప్రకటించడంలో వాస్తవం ఎంత? ఈ ప్రకటన పూర్తిగా ఆమోదయోగ్యమేనా? ఈ ప్రకటనకు అవసరమైన ఆధారం ఏదో కేంద్రం దగ్గర ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే కారణాలు రాష్ట్రం దగ్గర ఉండవచ్చు. మిషన్‌ ‌భగీరథ పథకంతో ఈ సమస్య నుంచి తెలంగాణ గట్టెక్కిందని చెబితే కొట్టి పారేయవలసిన అంశం కూడా కాబోదు. నిజంగానే ఆ పథకం ఫ్లోరైడ్‌ ‌పీడిత ప్రాంతాలకు, ఫ్లోరోసిస్‌ ‌బాధితులకు అంతటి మేలు చేకూర్చింద నవచ్చు కూడా. ఇక్కడే ఒక ప్రశ్న. ఫ్లోరైడ్‌ ‌రహిత ప్రాంతం లేదా విముక్త ప్రాంతంగా ఒక ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని ఏ దశలో నిర్ధారించగలం? ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ప్రకటన ప్రకారమైతే తెలంగాణ ఫ్లోరైడ్‌ ‌విముక్త ప్రాంతం అనడం వైద్య ప్రమాణాల పరిధిలో పూర్తి వాస్తవం కాలేదని నిస్సంశయంగా చెప్పుకోవచ్చు. మిషన్‌ ‌భగీరథ ఇటీవల వచ్చిన పథకం. అంతకు ముందు ఈ వ్యాధి బారిన పడిన వారి మాటేమిటి? ఏడెనిమిదేళ్ల బాలలకు ఇప్పటికే పళ్లు పసుపు రంగులోకి మారిపోయాయి. ఇది ఫ్లోరోసిస్‌ ‌వ్యాధి తొలి లక్షణం. ఫ్లోరోసిస్‌ ‌నిర్మూలన కోసం కొన్ని దశాబ్దాలుగా పాటు పడుతున్న మా వైద్య బృందాలకు, సామాజిక కార్యకర్తలకు ఇది అనుభవమే కూడా. పళ్ల మీద పసుపు రంగు కనిపిస్తే అలాంటి వారంతా జీవితాంతం ఫ్లోరోసిస్‌తో పోరాడడానికి సిద్ధపడ వలసిందే. పోరాడ వలసిందే. నిజానికి ఇప్పుడు, ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే సమీప భవిష్యత్తులో పుట్టిన చిన్నారులు గాని ఈ వ్యాధి నుంచి విముక్త మవుతారని చెప్పడం అర్థవంతంగా ఉంటుంది. ఇప్పటికే ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ఇంతవరకు మందు లేదు.

తీసుకున్న నీరు, ఆహారాల కారణంగా శరీరంలో ఫ్లోరైడ్‌ ‌ప్రవేశిస్తుంది. శరీరంలో అది చూపే ప్రభావమే ఫ్లోరోసిస్‌ ‌వ్యాధి. దీనికి పౌష్టికాహార లోపం కూడా తన వంతు పాత్ర నిర్వహిస్తుంది. ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న ప్రాంతంలో ఇదంతా సర్వసాధారణం. అందుకే దీనిని మామూలు బెడదగా ఏ దేశం, ఏ రాష్ట్రం కూడా పరిగణించడం లేదు. ఈ జాగరూకత ఒక్క సంవత్సరంలోనో, రెండేళ్లలోనో వచ్చింది మాత్రం కాదు. పెద్ద ఉద్యమమే దీని వెనుక ఉంది. ఫ్లోరైడ్‌ అధిక మోతాదులో శరీరంలోకి వెళ్లడం వల్లనే ఫ్లోరోసిస్‌ ‌వ్యాధి వస్తుందన్న విషయాన్ని 1937లో ప్రపంచం గుర్తించింది. ఇది జరిగిన ఎనిమిదేళ్లకు అంటే, 1945లోనే తెలంగాణలో ఈ సమస్య గురించి దేవర్‌ ‌నివేదిక ఇచ్చారు. సిద్దికీ అనే మరొక వైద్యుడు 1955లో మరిన్ని వివరాలతో నివేదిక రూపొందించారు. ఇది ఎముకలను లక్ష్యంగా చేసుకుని వ్యాపిస్తుంది. మొదట పళ్లు ద్వారా బయటపడే ఈ వ్యాధి తరువాత ఎముకలలో వ్యాపిస్తుంది. దీనిని స్కెలిటల్‌ ‌ఫ్లోరోసిస్‌ అం‌టారు. ఎముకల మీద చూపే ప్రభావం ఫలితంగా శరీరాంగాలు, ముఖ్యంగా కాళ్లూ చేతులూ దారుణమైన వికృత రూపును తెచ్చుకుంటాయి. ఇది తెలంగాణ ప్రాంతంలోనే కాదు, దేశంలోని ఇంకొన్ని ఇతర ప్రాంతాలలో కూడా ఉందన్న వాస్తవం 1970లో బయటపడింది. 1974లో జరిగిన ఒక గోష్టి ప్రకారం అప్పటికి దేశంలో పాతిక నుంచి ముప్పయ్‌ ‌కోట్ల మంది ఈ వ్యాధి కోరలలో చిక్కుకుని ఉన్నారు. వీరిలో దాదాపు ఐదు లక్షల మందికి అవయవాలు వంకర్లు తిరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఆ వ్యాధి వారిలో పతాక స్థాయిని చూస్తున్నది. దీని విస్తరణ కూడా వేగంగానే జరిగింది.1999 నాటికి దేశంలోని 275 జిల్లాలలో ఆరు కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఫ్లోరైడ్‌ అధిక మోతాదులో ఉన్న ప్రాంతంలో ఉన్నారు. ఇది సాక్షాత్తు యునిసెఫ్‌ ఇచ్చిన నివేదిక. అరవై లక్షల మందికి అవయవాలు వంకర్లు తిరిగే స్థాయిలో లక్షణాలు ముదిరిపోయాయి. 2009లో భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరాలు ఇంకా భయపెట్టేవే. 1999లో 201 జిల్లాలకు పరిమితమైన ఈ బెడద, 2009 నాటికి 275 జిల్లాలకు విస్తరించినట్టు తేలింది. అందుకు తగ్గట్టే రోగులు కూడా చాలా పెరిగారు. అప్పటి నుంచి కేంద్రం ఈ సమస్య మీద దృష్టి పెట్టింది. ఫ్లోరోసిస్‌ ‌నుంచి రక్షణకు తొలిమెట్టు రక్షిత మంచినీరు అందించడమే.

మొదట తెలంగాణ ఏర్పాటుకు ముందు యునిసెఫ్‌ అం‌చనాల ప్రకారం సరఫరా అవుతున్న తాగునీటిలో ఫ్లోరైడ్‌ ఏ ‌మేరకు ఉందో చూడాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది కాబట్టి నేటి పది జిల్లాల వివరాలు చూద్దాం. ఈ కింద పట్టిక ఆ విషయం వివరిస్తుంది. ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాలుగా చెప్పే చోట ఎక్కువ నమూనాలను పరీక్షించారు.

కేంద్ర జలశక్తి (జలవనరుల) శాఖ వివరాల ప్రకారం (2020) ఫ్లోరోసిస్‌ ‌పళ్ల రంగును మారుస్తుంది. ఎముకలు వంకర్లు పోయేట్టు చేస్తుంది. ఫ్లోరోసిస్‌కు కారణమైన ఫ్లోరైడ్‌ ‌నీటిలో 1.0 పీపీఎం (లీటర్‌ ‌నీటిలో ఒక మిల్లీ గ్రామ్‌ ‌వంతు) వరకు ఉంటుంది. ఇది అవసరమే కూడా. ఆ మోతాదు మించితే అంతా విధ్వంసమే. జీవనదులు గోదావరి, కృష్ణలలో పీపీఎం 0.5 గా ఉంది. మనలాంటి ఉష్ణ దేశాల ప్రజలకు ఈ మోతాదు అవసరమే. తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ ‌భగీరథ కార్యక్రమం నిర్వహించి రాష్ట్రంలో ఉన్న ఫ్లోరోసిస్‌ ‌సమస్యకు పరిష్కారం చూపింది. తాగునీటి కొరతను తీర్చి, ఆరోగ్యవంతమైన తాగునీరు అందించడానికి ఉద్దేశించిన పథకమది.

మిషన్‌ ‌భగీరథ చాలా ఖర్చుతో కూడుకున్న పథకం. దీని మీద ఇంతవరకు రూ. 46,000 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. నిజానికి 10,167 గ్రామాలలోని ప్రజలకు సంవత్సరమంతా మంచినీరు సరఫరా చేయడం చిన్న విషయం కూడా కాదు. ఉదాహరణకు ఈ వ్యాసకర్త గ్రామం జంగంపల్లె పరిస్థితి. భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పైపులు, గుంటలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ గ్రామం నేడు కూడా బోర్వెల్‌ ‌నీళ్ల మీద ఆధారపడక తప్పడం లేదు. కానీ ఈ బోర్వెల్‌ ‌నీళ్లలో ఫ్లోరైడ్‌ ‌స్థాయి 0.92 నుంచి 1.39 పీపీఎం వరకు ఉంది. అక్కడ మా ఇంటి అవసరాల వరకు బోర్వెల్‌ ‌తప్పదు. నేను వెళ్లినా ఏమాత్రం రక్షణ లేని ఆ నీటినే ఉపయోగించుకోవాలి. ఆ నీళ్లే తాగక తప్పలేదు కూడా. భగీరథ పథకంలో భాగంగా వేసినదే మా గ్రామంలోనే మరొక లైన్‌ ‌కూడా ఉంది. కానీ ఇది కొద్దికాలమే పనిచేసింది. ఇదే పరిస్థితి కొన్ని ఇతర గ్రామాలలోను ఉంది. మిషన్‌ ‌భగీరథ పథకం నాటి ఇందిర గరీబీ హఠావో మాదిరిగా తయారు కాకూడదు. ఈ నినాదంతో పాటు ఇందిర రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ వంటి ఇతర చర్యలు కూడా చేపట్టారు. అయినా విఫలమయ్యారు. నిజానికి గడచిన దశాబ్దాలలో దేశంలో పేద, ధనిక అంతరాలు మరింత పెరిగాయి. ఆ పథకాలు విజయవంతమై ఉంటే రైతుల ఆత్మహత్యలు, కార్మికుల వలస వంటి సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావు. పథక రచన చేయడమే కాదు, దానిని అమలు చేసి, ఫలితాలు ప్రజలకు అందేవరకు శ్రద్ధ వహించడం ప్రభుత్వ బాధ్యత.

ఈ మాత్రం వివరాలు గమనించిన తరువాత తెలంగాణను ఫ్లోరైడ్‌ ‌రహిత రాష్ట్రంగా ప్రకటించడం అసంబద్ధమని చెప్పడానికి సందేహించనక్కరలేదు. 2018 నుంచి మిషన్‌ ‌భగీరథ ఫలితాలు అందిన తరువాత పుట్టిన వారి విషయంలో మాత్రమే ఫ్లోరైడ్‌ ఉం‌డదని చెప్పగలం. భగీరథ ద్వారా అందిన నీటిని తీసుకున్న వారిలో మాత్రమే ఫ్లోరోసిస్‌ ‌లక్షణాలు కనిపించవు. ఈ సదుపాయం ఇటీవలి పరిణామమే. పాలపళ్లు కాకుండా, శాశ్వత దంతాలు పసుపు రంగులోకి మారనప్పుడే ఆ లక్షణాలు లేవని స్పష్టంగా చెప్పగలం. అది నిర్ధారణ అయ్యేది సమీప భవిష్యత్తులో తప్పితే వెంటనే కాదు. పళ్ల మీద పసుపు రంగు కనిపించలేదని చెప్పగలిగితేనే భవిష్యత్‌లో స్కెలిటల్‌ ‌ఫ్లోరోసిస్‌ ‌రాదని చెప్పే అవకాశం వస్తుంది. కాబట్టి ఫ్లోరైడ్‌ ‌నిర్మూలన ధ్యేయం అమలు, ఫలితం అంత సులభం కాదు. ఇలా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే ఫ్లోరైడ్‌ ‌నిర్మూలన కోసం గతంలో పని చేసిన ప్రభుత్వ సంస్థల తీరు సంతృప్తికరంగా లేదు కాబట్టే. ప్రభుత్వ అధీనంలోని ఔషధ తయారీ సంస్థల పరిస్థితి కూడా అంతే. ఇవన్నీ విఫలమై మూతపడ్డాయి.

నిజానికి తెలంగాణలో 967 ఆవాసాలే ఫ్లోరోసిస్‌ ‌పీడిత ప్రాంతాలని ప్రకటించడం కూడా సరికాదు. ఒక్క పాత నల్లగొండ జిల్లాలోనే 59 మండలాలలో, 844 పంచాయతీలు ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నాయి. ఇక్కడ జనాభా 35 లక్షలు. ఈ జిల్లాలో పశ్చిమ భాగం తప్ప మిగిలిన ప్రాంతం మొత్తం ఫ్లోరోసిస్‌ ‌బారిన పడింది. నల్లగొండ జిల్లాలో ఉన్నంత తీవ్రం కానప్పుటికీ మిగిలిన తెలంగాణ జిల్లాలో కూడా ఫ్లోరైడ్‌ ‌తక్కువేమీకాదు. వాటిలో కొన్నిచోట్ల అసాధారణ స్థాయిలో ఫ్లోరైడ్‌ ‌కనిపిస్తున్నది కూడా. అలాగే ఫ్లోరోసిస్‌ ‌కేసులు కూడా. కాబట్టి ఈ జిల్లాలను కూడా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది. నల్లగొండను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటే సరికాదని ఎందుకు చెబుతున్నానంటే, నూర్యోసర్జన్‌గా నేను ఈ జిల్లాకు సంబంధించిన ఫ్లోరోసిస్‌ ‌బాధితులకే శస్త్ర చికిత్సలు చేయలేదు. ఇదే రుగ్మతతో, అదే తీవ్రతతో వరంగల్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల నుంచి కూడా బాధితులు శస్త్రచికిత్స కోసం నా దగ్గరకు వచ్చారు. మిగిలిన జిల్లాలలో కూడా ఫ్లోరోసిస్‌ ‌తక్కువ స్థాయిలో లేదని అనుకోరాదని చెప్పడానికే ఈ వివరాలు చెప్పడం.

ఫ్లోరోసిస్‌ ‌బాధితుల ఇక్కట్లు తీర్చడానికి చాలా ఉద్యమాలు జరిగాయి. కోర్టులు బాధితుల తరఫున నిలబడి వారికి ట్యాంకర్లలో సురక్షిత తాగునీరు అందించాలని ఆదేశాలు కూడా ఇచ్చాయి. అక్కడ పాలు అమ్ముకుని మంచినీళ్లు కొనుక్కోవలసిన దుస్థితి. ఇలాంటి నేపథ్యంలో వచ్చినదే మిషన్‌ ‌భగీరథ. ఫ్లోరోసిస్‌ ‌నిర్మూలనకు మిషన్‌ ‌భగీరథ ఆదర్శనీయమైన పథకమేనని చెప్పవచ్చు. ఫ్లోరైడ్‌ ‌బెడద ఉన్న ప్రాంతాలకు అదొక ఆశాకిరణమే. ఇలాంటి ఒక పథకం గురించి ఆలోచించి, అమలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. అలాగే కేంద్రం కూడా, ‘ఫ్లోరోసిస్‌ ‌నుంచి విముక్తమైన తెలంగాణ’ అని కాకుండా ‘తెలంగాణ ఫ్లోరోసిస్‌ ‌నుంచి విముక్తం కాబోతున్నది’ అని చెప్పాలని ఆశిస్తున్నాను. ఇది వాస్తవికంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఫ్లోరోసిస్‌ ‌విముక్త ప్రాంతమని ప్రకటిస్తే ఇప్పటికీ అక్కడ వైద్యం అవసరం ఉన్న పెద్దల పరిస్థితి, అంటే దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడుతున్న వారి సంగతి ఏమిటి? వారికి ఔషధాలతో పాటు ఫిజియో థెరపీ కూడా అవసరమన్నది గుర్తించాలి. నిజానికి నీటితో ఫ్లోరైడ్‌ ‌సమస్య ఒక్కటే కాదు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కొన్ని ఇతర రుగ్మతలను కూడా రక్షిత మంచినీటి సదుపాయం లేక కొని తెచ్చుకుంటు న్నారు. కొన్ని రకాల బాక్టీరియా ఉన్న నీరు తాగడం వల్ల కొన్ని ప్రాంతాలలో చిన్నారులు విరేచనాలతో చనిపోతున్నారు. కాబట్టి మిషన్‌ ‌భగీరథ పథకం ఈ అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.

– డా।। దేమె రాజారెడ్డి : న్యూరో సర్జన్‌, అపోలో

About Author

By editor

Twitter
Instagram