నేడు ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సమాజం మరువలేని పాత్రను పోషించింది. ఈ విపత్తుపై సమాజంలో సంభవిస్తున్న విభిన్న పరిణామాలను అర్థం చేసుకునేందుకు ఇండియా ఫౌండేషన్‌ ‌భిన్న రంగాలు, ప్రభుత్వంలోని వివిధ స్థాయిలలోని వ్యక్తులతో వరుసగా చర్చలు జరుపుతున్నది. ఈ విపత్కర స్థితిలో సహకారం, సమన్వయం, సమస్యల పరిష్కారానికి ఒక గొప్ప ఉదాహరణగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘం కనిపిస్తున్నది. ఐక్యత, చైతన్యం, శక్తిలకు ప్రతీకగా నిలిచి భారతీయ సమాజానికి నాయకత్వం వహించింది. చర్చలో భాగంగా లాక్‌డౌన్‌ ‌సమయంలో స్వయంసేవకులు చేపట్టిన సహాయ కార్యక్రమాలు, స్వదేశీ, ఆత్మనిర్భర భారత్‌ ‌మొదలైన అనేక అంశాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌కార్యవాహ సురేశ్‌ (‌భయ్యా) జీ జోషి ఆర్గనైజర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాలు పంచుకొన్నారు. అందులోని ప్రధాన అంశాలు జాగృతి పాఠకుల కోసం.

కరోనా మీద పోరులో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ముఖ్య పాత్ర పోషించింది. భారతీయ సమాజం కూడా అపూర్వ మైన పద్ధతిలో స్పందించింది. ఈ పరిస్థితులపై మీ స్పందన ఏమిటి?

ప్రస్తుత తరం ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. సమాజానికి ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు స్వయంసేవకులు సహజంగానే స్పందిస్తారు. సహాయకార్యక్రమాలు నిర్వహిస్తారు. అవసరమైన చోట తమదైన పద్ధతిలో పరిష్కారం కనుక్కొంటారు. కరోనా సమయంలోనూ అలాగే చేశారు.

 కరోనా ప్రారంభంలో పరిస్థితిలను గమనించిన భారత ప్రభుత్వం దేశమంతటా లాక్‌డౌన్‌ ‌ప్రకటించి నప్పుడు అనేక సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా దినసరి వేతనాల కార్మికులకు జీవన్మరణ సమస్యగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్వయంసేవకులు కృషి ప్రారంభించారు. మొదట ఆ సోదరులకు కనీసం ఆహారం అందుబాటులో ఉండాలి. రెండవది రోజువారీ ఆదాయాలు స్థంభించాయి. దీనితో తలెత్తిన ఆర్థిక సంక్షోభం దృష్ట్యా కనీసం నిత్యావసర సరుకులు అందిస్తే కొన్ని రోజులు పాటు ఉపశమనం లభిస్తుందని భావించారు. ఇది కాకుండా రేషన్‌ ఒక నెల వరకు అందుబాటులో ఉండాలి. ఈ ఆలోచన రాగానే స్వయంసేవకులు దేశంలోని అన్ని జిల్లాల్లో ఆహార ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు అందచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 2 లక్షల మందికి పైగా స్వయంసేవకులు ఈ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. కోటికి పైగా కుటుంబాలకు అనేక రకాలైన సామగ్రిని అందచేసారు.

ప్రారంభ దినాలలో ఇలాంటి అవసరాలు ఉండేవి. తరువాత పరిస్థితులు మారి వలస కూలీలు సొంత గ్రామాలకు బయలుదేరారు. ఆ సమయంలో ప్రభుత్వాలు ఏర్పాట్ల గురించి ఆలోచిస్తూనే ఉన్నాయి. సరైన వ్యవస్థ చేయలేకపోయింది. కాబట్టి ప్రజలు కాలినడకన బయలుదేరారు. ఇది బాధకరం. వృద్ధాప్యంలో ఉన్న పురుషులు, మహిళలు వ్యక్తిగత వస్తువులు తీసుకొని పిల్లలతో, స్వస్థలాలకు చేరుకోవా లనే తాపత్రయంతో నడవడం ప్రారంభించినప్పుడు విషాదకర పరిస్థితి ఏర్పడింది. అందుకే వారు వెళ్లే మార్గాల్లో కొన్ని ఏర్పాట్లు చేయాలని స్వయంసేవకులు భావించారు. వలస కూలీలకు ప్రతీ చోట భోజన ఏర్పాట్లు చేశారు. మార్గంలో వారి కనీస అవసరాల తీర్చేందుకు కృషి చేశారు. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర నుండి బయలుదేరిన కార్మికులకు దారి మధ్యలోనే చెప్పులు తెగిపోయాయి. స్వయంసేవకులు పెద్ద మొత్తంలో చెప్పులు పంపిణీ చేశారు. చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. వైద్యుల అవసరం ఏర్పడింది. వైద్యులను సంప్రదించి వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి మందులు అందచేశారు. ఈ విధంగా 30-40 రోజులు పాటు సేవ జరిగింది. ఆ తరువాతే ప్రభుత్వం రైళ్ల ఏర్పాట్లు చేసింది. కొందరు కార్మికులు వాహనాల మీద వెళ్లడం ప్రారంభించారు. వీరికి కూడా అవసరమైన సహకారం అందిస్తే బాగుంటుందని మేము భావించాం. ప్రభుత్వం వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ ‌ప్రారంభించి నప్పుడు నమోదు పక్రియ పెద్ద సమస్యగా మారింది. అనేక చోట్ల స్వయంసేవకులు ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వలస కూలీల పేర్ల నమోదులో ప్రభుత్వానికి సహకరించారు. ఈ పని దేశంలోని వివిధ ప్రదేశా లలో పెద్ద ఎత్తున జరిగింది. రోజులు గడిచేకొద్దీ సమస్యలు వేర్వేరు రూపాల్లో ఎదురయ్యాయి. ఆ విధంగా ప్రతీచోట అనేకరకాల పనులు స్వయం సేవకులు ద్వారా ప్రారంభమయ్యాయి.

ఇది సంతోషకరమైన అంశంగా నేను భావించను. కాని అది స్వయంసేవకుల ధైర్యం అని మాత్రం కచ్చితంగా చెప్పగలను. కరోనా ప్రబలిన చోట్ల అన్ని రకాల ప్రమాదాలను ఎదుర్కొంటూ స్వయంసేవకులు వెళ్లి ఆరోగ్య కార్యకర్తలతో కలిసి పనులు చేశారు. ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. వారు కూడా ఈ వ్యాధి బారిన పడొచ్చు. అయినా సంకోచించకుండా స్వయంసేవకులు ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా పనిచేసేందుకు వచ్చారు. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వారందరూ పిపిఇ కిట్లు ధరించి కొంత శిక్షణ తీసుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, పుణే వంటి వ్యాధి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జరిగిన సేవకు పెద్ద సంఖ్యలో సంఘ కార్యకర్తలు పూర్తిగా సహకరించారు. నేను మరో ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఢిల్లీలో వివిధ రకాల ‘హెల్ప్‌లైన్‌లు’ ప్రారంభించారు. ముఖ్యంగా ఈశాన్య భారత్‌ ‌నుండి వచ్చి ఢిల్లీలో పెద్ద సంఖ్యలో నివసించే ప్రజల కోసం ఒక హెల్ప్‌లైన్‌ ‌ప్రారంభించారు. ఢిల్లీలో ఉన్న ఈశాన్య భారత విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనం కలిగించింది. ఎవరికి ఏ అవసరమున్నా సంప్రదిస్తే వారి అవసరాలను తీర్చగలమని చెబుతూ మరో హెల్ప్‌లైన్‌ ‌ప్రారంభించారు. చాలా పెద్దసంఖ్యలో విన్నపాలు వచ్చేవి. అలాంటి వారికి ఆహారం, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచారు.

 అనేక ఫోన్లు వచ్చేవి. చాల తక్కువ సమయంలో వారంతా కోరుకున్న సామాగ్రి చేరేది. ఇతర ప్రాంతాల వారికి ఈ హెల్ప్‌లైన్‌ ‌సేవల ఏర్పాటు తెలిసేది కాదు. ఇతర ప్రాంతాలలో చిక్కుకున్న వారికి కొన్ని అవసరాలు ఉండేవి. వాటి కోసం ఫోన్‌ ‌చేసేవారు. ఢిల్లీలో ఉన్న హెల్ప్‌లైన్‌ ఆధారంగా సంబంధిత ప్రాంతాల వారికి ఈ సమాచారం అందిస్తే అక్కడ వెంటనే ఏర్పాట్లు జరిగేవి. బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం మూలంగా ఈ హెల్ప్‌లైన్‌ ఎం‌దరికో ఉపయోగపడింది. మరొక హెల్ప్‌లైన్‌ను సేవాభారతి పేరుతో ప్రారంభించాం.ఈ సేవలతో చాలామందికి మేలు జరిగింది. ఇది బాధాకరమైన కాలం. స్వయంసేవకులు దయార్ద్ర హృదయంతో పనులు నిర్వర్తించారు.

ఈ అంటువ్యాధికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దాని ఎదుట శత్రువులు లేరు. అది ప్రత్యక్షంగా కనిపించదు. మనం ఏమి ఊహించలేం. కళ్ల ముందు జరుగుతున్న సంఘటనల ఆధారంగా అన్ని రకాల విధానాల్లో, మార్పులను ఎప్పటికప్పుడు చేశాం. గురుద్వారా, జైన సమాజం, లయన్స్ ‌క్లబ్‌, ‌రోటరీ క్లబ్‌ ‌వంటి వివిధ రకాలైన ధార్మిక, సామాజిక సంస్థలు ఈ విషయంలో సహకరించాయి. నేను పెద్ద సంస్థల పేర్లు మాత్రమే ప్రస్తావించాను. అనేక చిన్న సంస్థలు కూడా మాతో పాల్గొని పనులతో పాటు వనరులను సేకరించడంలో కీలకంగా పనిచేశాయి. మనషులు తమ శక్తి కొద్ది ఏ పనులు చేస్తారో వాటిని అప్పగించే పాత్రను స్వయంసేవకులు పోషించారు.

స్వయంసేవకులు స్వచ్ఛందంగా చేస్తున్న ఈ పనిలో మీరు ఎటువంటి శిక్షణ ఇస్తారు. ఎందుకంటే వ్యక్తి చనిపోతే కుటుంబ సభ్యులే రాని చోటకు ప్రభుత్వ సిబ్బందితో కలిసి సివిల్‌ ఆస్పత్రిల్లో అన్ని రకాల పనులు వారు చేస్తున్నారు. ఇందుకు వారికి ఎలాంటి శిక్షణ అందిస్తారు?

విపత్తు నిర్వహణలో మేమేమీ నిపుణులం కాదు. అలాగే కార్యకర్తలకు అలాంటి శిక్షణ ఏదీ ఇవ్వలేదు. కానీ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన, సంఘం ఇచ్చే సంస్కారాల వల్ల స్వయంసేవకుల్లో సహజంగానే కలుగుతుంది. అటువంటి విపత్తులు వచ్చినప్పుడల్లా, ఆ విపత్తులు మనకే ఎదురయ్యాయని భావించి మన శక్తినంతా ప్రయోగించే గుణం స్వయం సేవకులది. ఆపదలను ఎదిరించాలనే ఆలోచనలు సంస్థలో ఎప్పుడూ చర్చకు వస్తుంటాయి. ఫలితంగా స్వయంసేవకులు పరిస్థితులను అర్థం చేసుకుని, తదనుగుణంగా సన్నద్ధమవుతారు. కొన్నిసార్లు కనీస వనరులను కూడా ఇవ్వలేని స్థితి. వాటిని సేకరించే పని కూడా స్వయంసేవకే చేస్తాడు. అందుకోసం సమాజంలోని ప్రజలను సమీకరిస్తాడు. ఇలాంటి కార్యక్రమాలను రూపొందించి, నియంత్రించే కేంద్రీయ వ్యవస్థ ఏదీ సంఘంలో లేదు. స్వయం సేవకులే సహజంగా అవసరాలను బట్టి స్పందించి పనిచేస్తారు. మనం సంక్షోభ కాలంలో మౌన ప్రేక్షకులుగా ఉండలేం అనేది సంఘ స్వయంసేవకుల అభిప్రాయం. ఈ సమస్త సమాజం తమదే అనే భావన కారణంగా, సహజంగానే ఎవరి సూచన, ఆదేశాలు లేకుండా స్వయంసేవకులు స్వచ్ఛందంగా పనులు పూర్తి చేస్తారు. ఆపత్కాలంలో ఇలాంటివన్నీ శిక్షణ లేకుండానే స్వయంసేవకులు శిక్షణ పొందిన వ్యక్తుల మాదిరిగానే చేస్తారని నేను అనుభవ పూర్వకంగా చెప్పగలను.

సంఘ్‌ ఆలోచనతో ప్రేరణ పొందిన అనేక అనుబంధ సంస్థలు, పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఆర్థికరంగంలో చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. అవి కూడా కొంత చొరవ తీసుకొంటున్నాయి. ప్రస్తుత ఈ ఆర్థిక సంక్షోభాన్ని సంఘం ఎలా చూస్తుంది?

ప్రస్తుతం వివిధ రకాల సంక్షోభాలు ఉన్నాయి. వలస కార్మికుల బదిలీ ఒక ప్రత్యేక పరిస్థితిలో జరిగింది. వారిని ఒకచోట నుండి మరోచోటకు బదిలీ చేయవలసిన అవసరం లేదు. అందుకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ఈ రోజు శాశ్వత పరిష్కారాల గురించి వెంటనే ఆలోచించ లేరు. కానీ ఒక కచ్చితమైన పరిష్కారం చూపాలి. ఉపాధి కోసం కార్మికులు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్లడం ఏ దేశానికీ శ్రేయస్కరం కాదు. కానీ ఇదే సిద్ధాంతంగా మారింది. నేడు ఆచరణాత్మక స్థాయిలో ప్రజలకు ఉపాధి అవసరం. పరిశ్రమలు నడుపుతున్న వారికి కూడా కూలీలు అవసరం ఉంటుంది. అందువల్ల నేడు కార్మికులు తరలివెళ్లడం అనే ఈ పక్రియను నేను తాత్కాలికమని భావిస్తాను. సాధారణ పరిస్థితిలు నెలకొన్న తర్వాత పెద్ద సంఖ్యలో ఆయా ప్రదేశాలకు వారు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో సొంత గ్రామాల వైపు వెళ్లిన కొద్ది శాతం ప్రజలు కచ్చితంగా అక్కడే ఉంటారు. ఇది సహజం కూడా. అంటే, తమ సొంత గ్రామాలకు తిరిగి వచ్చిన కార్మికులకు మరోసారి ఎలా పునరావాసం కల్పించాలి? ఇక్కడ ఉపాధి ఎలా లభిస్తుంది? తదితర ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాలి. ఇందులో కొన్ని రాష్ట్రాలు చొరవ తీసుకున్నాయని నా అభిప్రాయం. నైపుణ్యాభివృద్ధి ప్రశ్న వస్తే, దానికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. వారు ఎంత ప్రతిభను చూపుతారు అనే అంశం ఆధారంగానే తమ స్వస్థలాల్లో ఇటువంటి నైపుణ్యా లను అందించగలరు. ఇక బయటకు వెళ్లవలసిన అవసరం ఉండదు. అందువల్ల, సమస్యను పరిష్కరించే దిశలో మంచి ప్రయోగాలు చేయాల్సిన అవసరం కూడా ఈ సంక్షోభ సమయంలో కనిపిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయమని భావిస్తున్నాను.

ఈ సంక్షోభం ఒక అవకాశాన్ని ఇచ్చింది. దీన్ని సరైన ఫలితాలిచ్చే దిశగా మార్చడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తాయి. నైపుణ్య అభివృద్ధిలో మంచి ప్రణాళికలు రూపొందించాలి. దీనికోసం, కొన్ని పరిమితులను వదిలివేయవలసి ఉంటుంది. ఇటువంటి కష్టకాలంలో ఏదైనా ఒక ప్రామాణికమైన ముసాయిదా (ఫార్మెట్‌) ‌తయారవ్వడం కష్టం. వేర్వేరు స్థలాలలో సర్వే చేస్తున్నప్పుడు దీని అవసరం ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా పనిచేశాయి. కానీ పెద్ద సంఖ్యలో కార్మికులు వెనక్కి వెళ్తారు. పరిశ్రమను నడిపించాలను కుంటే వెంటనే అక్కడ కార్మికులు లభిస్తారని అనుకోవలసిన పనిలేదు. ప్రస్తుతం తిరిగి వచ్చే పక్రియ కూడా నెమ్మదిగా ప్రారంభమైందని నాకు అన్పిస్తున్నది. ప్రజలు వెళ్లాలని కోరుకుంటారు. పరిశ్రమను నడుపుతున్నవారు కూడా కార్మికులు లభించాలని ఆశిస్తారు. ఇది మంచి పరిణామం. ఈ ఏర్పాట్లు ఎంత ఎక్కువ వికేంద్రీకరిస్తే అంత మంచిది. నాకు మరో విషయం జ్ఞాపకం వచ్చింది. కార్మికులను ఎక్కువ తరలించే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కువ మంది కార్మికులకు ఆశ్రయం ఇచ్చే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఎక్కువ పరిశ్రమలు ఉన్నచోట బయట కార్మికులు ఉన్నారు. పరిశ్రమలు కేంద్రీకృతమైతే ఇది సహజంగా ఉంటుంది. కానీ, నేను చెప్పినట్లు, కొన్ని దీర్ఘకాలిక విషయాలు ఉన్నాయి. పరిశ్రమల వికేంద్రీకరణకు కొంత సమయం పడుతుంది. అలాంటప్పుడు కార్మికులు వెనక్కి వెళ్తారు. పరిశ్రమలు ప్రారంభమవుతాయి. పరిశ్రమలు ప్రారంభిస్తే ఉపాధి ప్రారంభమవుతుంది.

 రెండవ అతిపెద్ద నష్టం సొంతంగా చిన్న చిన్న పనులు చేసుకొని జీవనం సాగించేవారికి జరిగింది. ముఖ్యంగా రిక్షా లాగేవారు, కూరగాయల బండి, చిన్న టీ కొట్టు నడుపుతున్న వారికీ, రోజువారీ కూలి చేసుకునే వారి జీవితం ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి వారందరి జీవితాలు ఎలా పునరుద్ద రించాలి? ఈ లాక్‌డౌన్‌ ‌వల్ల తలెత్తిన సమస్య ఇది. దీన్ని పరిష్కరించే వరకు వారి దైనందిన జీవితం గాడిన పడదు. అందువల్ల ‘అన్‌లాక్‌’ ‌పద్ధతిని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చొరవను మేం స్వాగతిస్తున్నాం. నేడు లాక్‌డౌన్‌ ‌లేదు, అన్‌లాక్‌ ‌చేశారు. ఇప్పటి వరకు తాళం వేశారు. అది తెరవాలి. అందుకు ఒక క్రమ పద్దతి ఉంటుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ విధానంతో ప్రతిదీ చాలా తక్కువ సమయంలోనే ప్రారంభమవుతుందని నేను భావిస్తున్నాను. సంక్షోభం తీవ్రత తగ్గితే, ఈ విషయా లన్నీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. అందువల్ల భారతదేశ సామాజిక నిర్మాణంలో స్వయం ఉపాధి వికేంద్రీకరణ ఎంత ఎక్కువైతే అంత లాభదాయకంగా ఉంటుంది. వెంటనే గతంలో ఉన్న ‘సాధారణ స్థితి’ తక్కువ సమయంలోనే తిరిగి ప్రారంభం కావాలి. ఈ పక్రియ త్వరలో మొదలవుతుందని నేను భావిస్తున్నాను.

ఆర్థిక అంశంలో మరో విషయం చర్చకు వచ్చింది. ప్రధాని కూడా ఆ చర్చను స్వాగతించారు. స్వచ్ఛంద సంస్థలు కూడా కొంతలో కొంత ప్రయత్నం చేస్తున్నాయి. ఆ విషయం ఏమిటంటే ఆత్మనిర్భర భారత్‌ (‌స్వదేశీ, స్వావలంబన)కు సంబంధించిన అంశం. ఆత్మనిర్భర్‌ అం‌టే ఏమిటి ? ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచీకరణ యుగంగా పరిగణిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితిలో భారతదేశం స్వయం సమృద్ధిని ఎలా సాధిస్తుందని ఆర్థికరంగ నిపుణులు అడుగుతు న్నారు. ఏదైనా ఒక దేశాన్ని బహిష్కరించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమా ?

కొంచెం ఆలోచించినట్లయితే వివిధ జిల్లాల్లో వివిధ రకాల ఉత్పత్తులు లభిస్తాయని తెలుస్తుంది. ప్రధాని ఒక మంచి శబ్దాన్ని ఉపయోగించారు.‘లోకల్‌ – ఓకల్‌’. అం‌టే స్థానీయత కోసం స్పందించు. ఒకవేళ దీనికి గనుక ప్రోత్సాహం లభిస్తే చాలా బాగుంటుంది. చిన్న చిన్న పనులున్నాయి. ఉదాహరణకు ఎక్కడైనా బేకరీ ఉత్పత్తులు ఎంత అవసరమో అవి అక్కడే లభిస్తాయి.బయటినుండి రావల్సిన అవసరం లేదు. ఈ విధంగా లోతైన అధ్యయనం చేస్తూ ఏయే జిల్లాలకు అవసరమైన వస్తువులను ఆ జిల్లాల్లోనే ఉత్పత్తి చేసే ఏర్పాటు చేయాలి. కొన్ని వస్తువులు చిన్న పరిశ్రమల్లో లభించవు. నేను ఒప్పుకుంటాను. పెద్ద పరిశ్రమల్లోనే లభిస్తాయి. అయితే చిన్న పరిశ్రమలను ప్రొత్సహించి జిల్లాను కేంద్రంగా చేసుకోవాలి. అదే విధంగా కొంచెం పెద్ద పరిశ్రమ అయితే రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకోవాలి. ఆ విధంగా ఆలోచించినట్లయితే ఇంకొంచెం ముందుకు వెళ్లి ప్రపంచ స్థాయిలో ఆలోచించాలి. ఈనాడు పరస్పరావలంబన జీవితం ప్రారంభమైంది. అయినప్పటికి మన దేశ అవసరాలు మన దేశంలోనే భర్తీ చేసుకోవాలి. ఇది అవసరం. దానికంటే కింది స్థాయిలో మన జిల్లా అవసరాలు జిల్లాలోనే పూర్తి చేసుకోవాలి. స్వావలంబన భారత్‌ (ఆత్మనిర్భర భారత్‌ ) ‌దిశగా పోవాలనుకుంటే జిల్లా కేంద్రాన్ని ఒక యూనిట్‌ ‌కేంద్రంగా భావించి దానిని ఎక్కువగా అభివృద్ది చేయాలి. కొన్ని పెద్ద పరిశ్రమలకు రాష్ట్రం కూడా కేంద్రంగా ఉండలేకపోవచ్చు. దాని కోసం దేశం మొత్తంగా ఆలోచన జరుగుతుంది. అందుచేత చాలా పెద్ద పరిశ్రమలను ప్రపంచ స్థాయిలోనే వికేంద్రీకరించవచ్చు. ఈ దిశలో మనం పనిని ప్రారంభించవలసి ఉంటుంది.

మరో విషయం ఏమిటంటే ఈ సంఘటన కారణంగా స్వదేశీ భావన పెరిగింది. సాధ్యమైనంతగా స్వావంలంబన సాధించినట్లయితే మన అవసరాలు ఇక్కడే పూర్తి అవుతాయి. మన అవసరాలు కొంచెం హెచ్చు తగ్గులుగా ఉన్నప్పటికి దానిని స్వీకరిస్తాం. ఈ విధమైన మానసిక సంసిద్ధత జరుగుతుంది. దీన్ని ఇంకా ఎక్కువగా ప్రొత్సహించాలి. చాలాసార్లు నాణ్యత దగ్గరుకు వచ్చి ఆగిపోతాం. నాణ్యతలో కొంచెం లోపం ఉన్నప్పటికి కోట్లమంది గల సమాజం మనవాటినే స్వీకరించి నట్లయితే స్వావలంబన ( ఆత్మనిర్భర్‌ ‌భారత్‌) ‌దిశలో చాలా మంచి విషయాలు రావచ్చును. అప్పుడు సహజంగానే మనదేశ మహాపురుషుల కలలు సాకారమవుతాయి. అందుకు కావల్సిందేమిటంటే దేశం తన కాళ్లమీద తాను నిలబడాలి. ఇతరులను ప్రశంసించడం వల్ల మనం ఎప్పుడు అభివృద్ధి చెందలేదు. ఇతరులను అనుకరించడం వల్ల కూడా అభివృద్ది కాలేదు. మన దగ్గర ప్రతిభ వుంది. పురుషార్థం ఉంది. కావల్సిన సహకారం వ్యవస్థీ కృతంగా చేసుకున్నట్లయితే స్వావలంబన ( ఆత్మనిర్భర భారత్‌) ‌నినాదంగా కాకుండా ప్రత్యక్ష్యంగా సాకారమౌ తుంటే చూడగలమని భావిస్తాను. దాని కోసం మరిన్ని ఎక్కువ ప్రణాళికలు రావాలి అంతే, నేను అదే ఆశిస్తాను.

మీరు సానుకూల అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. కానీ సాధారణంగా సమాజంలో ముఖ్యంగా సోషల్‌ ‌మీడియాలో చర్చ కొనసాగుతున్నప్పుడు దాని ప్రతికూల అంశం బయటకు వస్తుంది. ప్రస్తుతం ‘చైనా’ ఉత్పత్తులను బహిష్కరించడం గురించి, సరిహద్దులోని వాతావరణం గురించే చర్చ జరుగుతున్నది. మీరు దీన్ని ఎలా చూస్తారు?

ఇది సహజం. ఒక దేశం గురించి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు, అది భారతదేశంలో కూడా కొనసాగుతుంది. నేడు ఈ చర్చకు చైనా కేంద్రబిందువుగా మారింది. కాబట్టి సామాన్య పౌరుడు సహజంగా ఆ దేశ ఉత్పత్తులను స్వీకరించం. దానికి సహకరించం అని చెప్తున్నాడు. మనసులోని ఈ సహజభావాలు తెలియని శత్రువుకు వ్యతిరేకంగా వ్యక్తమవుతున్నాయని నేను భావిస్తున్నాను. ఇది ఒక దేశానికి మాత్రమే పరిమితం కాదని నా అభిప్రాయం. ఈ దిశగా వ్యక్తి భవిష్యత్తులో స్వయం సమృద్ధి సాధించే దిశగా పయనిస్తాడు. మొదట్లో ఒక దేశం వస్తువులను బహిష్కరించడం ప్రతికూలంగా అనిపించవచ్చు. కానీ మనిషి మనుగడ సమాజంపై ఆధారపడి ఉంది. అది నెరవేరని సమయంలో బహిష్కరణ ఎలా పని చేస్తుంది? అందువల్ల, దీనికి పూర్తి వ్యవస్థ అవసరం. నేడు చైనా వస్తువులను స్వీకరించం అనే భావన సహజంగా మొదలైంది. ఎవరూ ఈ ఉద్యమాన్ని సృష్టించలేదు. నేడు ఒక సాధారణ వ్యక్తి కూడా ఇది చైనాకు చెందినదైతే మాకు అక్కర్లేదని చెపుతున్నాడు. ఈ విషయంలో ఏమి చేయాలో చైనాయే ఆలోచించాలి. కానీ ఇది మనకు నిజంగానే ఒక సదవకాశం. ఒక్క భారతదేశానికి మాత్రమే కాదు. ప్రతీ దేశం తన అవసరాలను తానే స్వయంగా తీర్చుకోవాలనేది ప్రపంచానికి కూడా మంచి సందేశం. ఎవరూ ఇతరులను దోపిడి చేయరాదు, ఇతరులపై ఆధారపడ రాదు అని తెలిపేందుకు చక్కటి నిదర్శనం.

దీనికి సంబంధించిన మరో సమస్యపై చర్చ సాగుతున్నది. సరిహద్దులోని సంక్షోభాన్ని సైన్యం, ప్రభుత్వం పరిష్కరించాయి. అయినా ఈ సమస్య మళ్లీ మళ్లీ తలెత్తుతోంది. ఈసారి మీరు ఎలాంటి మార్పులు గమనిస్తున్నారు? జాతీయ భద్రత, సరిహద్దు భద్రత, సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాల నిర్మాణం గురించి మీరు చెప్పేదేమిటి?

వాస్తవానికి ఈ విషయం మన ఆలోచనా పరిధిలోది కాదు. ఎందుకంటే భద్రతాదళాలు, ప్రభుత్వవిధానాల ఆధారంగా ఈ అంశం నడుస్తోంది. కానీ, ఏ దేశమైనా తన సరిహద్దుల మీద దండయాత్రను ఎలా అంగీకరిస్తుంది? అలాగే ఏ దేశమూ సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతలను కోరుకోదు. కానీ దీనిని రెండు వైపులకు చెందినదిగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అందువల్ల, నేటి పరిస్థితిలో ఈ సంక్షోభ పరిష్కారానికి మన సైన్యం, రక్షణమంత్రి, ప్రధానమంత్రి కలసి భారతదేశం ఎలా సురక్షితంగా ఉండాలో ఆలోచించాలని నా అభిప్రాయం. సాధారణ ప్రజలమైన మనందరికి సైన్యంపై పూర్తి నమ్మకం ఉంది. మనదేశానికి సైన్య సామర్ధ్యం పుష్కలంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన విధానాలను, ప్రణాళికలను రూపొందించుకోవాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, యావత్తు సమాజం ప్రభుత్వం వెంటే నిలుస్తుందని నేను విశ్వాసంతో చెప్పగలను.

నేడు డిజిటల్‌ ‌విద్య గురించి చర్చ సాగుతోంది. కానీ సమాజంలోని అన్నివర్గాలకు అలాంటి విద్యను అందుకోవడం సులభం కాదు. ఈ పరిస్థితిలో రాబోయే కాలంలో విద్యలో మార్పులు ఉంటాయి. సమాజ కేంద్రంగా విద్య అని సంఘం అంటున్నది. కాబట్టి విద్యారంగ సవాళ్లను సంఘ అనుబంధ సంస్థలు ఎలా స్వీకరిస్తాయి? ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాయి?

ప్రస్తుత సంక్షోభం కొంత భిన్నంగా ఉంది. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. భారత్‌లో ప్రభుత్వంతో పాటు, సమాజ సహకారంతో నడుస్తున్న ప్రైవేట్‌ ‌విద్యాసంస్థలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్థిక సంక్షోభంలో వాటిని ఎలా నిర్వహిస్తారు? ఇది వారికి ఎదురవుతున్న ప్రశ్న. ఎందుకంటే వాటిని సొంత వనరులతో నిర్వహిస్తున్నారు. ఇందులో అధిక శాతం సహకారం సమాజం నుండే లభిస్తుంది. విద్యార్థులు చెల్లించే ఫీ•జుల వల్ల ఈ సమయంలో కొంత ప్రభావం ఉంటుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ సంస్థలలో ఎలాంటి విద్య లభిస్తుందో ఊహించ వచ్చు. విభిన్న వ్యక్తులను సంప్రదించి దీని గురించి ఆలోచించాలి.ఈ సంక్షోభం కనీసం సంవత్సరం పాటు ఉంటుంది. వివిధ రకాలైన ఆధునిక మాధ్యమాల సహాయంతో విద్యను అందించాలి. దీనికి కూడా కొంత పరిమితి ఉంది. ఎనిమిది శాతం ప్రజలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నారనుకుంటే వారికీ రిమోట్‌ ‌కంట్రోల్‌తో విద్యను అందించడం సాధ్యం కాదు. మరి వారి సంగతి ఏమిటి? ఒక పెద్ద వర్గం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వారికి ఇలాంటి వనరులు ఉండవు. ఆ పిల్లల చదువు ఎలా? అంటే, ఆధునిక సాధనాలను ఉపయోగించి విద్యను అందించే అంశం చర్చకు వస్తోంది. దానికి ఒక పరిమితి ఉంది. దీనికి ఒక మార్గం అన్వేషించాలి. అందుకు స్వచ్ఛంద సంస్థలు కొంత బాధ్యత తీసుకోవచ్చు. పిల్లలకు శిక్షణ ఇవ్వడం, బోధన, ఇంట్లోనే కోచింగ్‌ ‌తరగతులు నిర్వహించడం మొదలైనవి. ఇలాంటి ప్రణాళికల ఆధారంగా ఈ ఒక్క సంవత్సరం పూర్తి చేద్దాం. మరుసటి సంవత్సరం ఇంకొన్ని విషయాలు అందుబాటులోకి రావచ్చు. బోధించడం సులభం కావొచ్చు. సమాజంలోని ప్రతీ ఒక్కరు కలిసి ఇటువంటి ఏర్పాట్లన్నింటినీ ఈ ఏడాదికి పూర్తి చేయాలనీ కోరుకుంటున్నాం. ‘అందరికి అందుబాటులో విద్య (Affordable education) ‘నాణ్యమైన విద్య (quality education) అనేవి మన శాశ్వత సిద్ధాంతాలు. దీనికి ఈ కాలంలో ఎంతవరకు మద్దతు లభిస్తుందో వాస్తవంగా ఆలోచించాలి. అందుకోసం ఈ విద్యా సంవత్సరంలో ఏ విద్యార్థి నష్టపోరాదు. ఆ దిశగా ఆలోచించాలి. లేకపోతే ఒక విద్యా సంవత్సరం వ్యర్ధం అవుతుంది. భారతదేశ సామాజిక జీవితంలో ఒక సంవత్సరం తేడా ఏర్పడుతుంది. ఇది ఏ దేశానికీ శ్రేయస్కరం కాదు. సమాజంలోని అన్ని రకాల శక్తులు ఈ ప్రణాళిక కోసం ఉపయోగపడుతాయని నేను భావిస్తున్నాను. సరైన ప్రణాళికల ఆధారంగా నడుస్తూ ఈ కాల క్రమంలో జరిగిన నష్టం నుండి దేశాన్నీ , సమాజాన్నీ బయటకు తీసుకోని రాగలం.

భారతీయ సంప్రదాయంలో తీర్థయాత్రలు, ఉత్సవాల కోసం ప్రజలు ఒకచోటకు చేరుతారు. కరోనా సంక్షోభంలో వీటిపై నిషేధం ఉంది. జగన్నాథ్‌ ‌రథయాత్ర కోర్టు ఆదేశాల మేరకు పూర్తయింది. ఈ సంప్రదాయాలు సమాజాన్ని ఒక్కటిగా నిలిపి ఉంచుతాయి కూడా. ఏదేమైనా కరోనాకు ఒక పరిష్కారం కనుక్కునే వరకు అనేక ప్రశ్నలు మనస్సులో తలెత్తుతాయి. సమాజం ఈ విషయా లను ఎలా చూస్తే బాగుంటుంది?

ఈ విషయంలో నేను మళ్లీ మన సమాజానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ వేల సంవత్సరాలగా మనతో పెనవేసుకొని ఉన్న ఆచారాలు. ప్రజల మనోభావాలకు సంబంధించినవి. అయినా ఈ సంక్షోభ కాలంలో ఇలాంటి అంశాలపై మనం కొద్దిగా రాజీపడాలి. ఇది ప్రభుత్వ నియంత్రణకు మించినదని సమాజం కూడా అంగీకరించింది. సమాజ సంసిద్ధత, ఆలోచనా స్థాయి పెరిగింది. ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ప్రతీ సంవత్సరం మాదిరిగా ఉండదని ప్రజలు సమాధానపడ్డారు. అప్పుడే సూర్యగ్రహణం సంభవించింది. గ్రహణ సమయంలో ఏటా లక్షలాది ప్రజలు కురుక్షేత్రను సందర్శిస్తారు. ఈసారి ఎవరూ వెళ్లలేదు. ఇళ్లలోనే ఉండి మనసులోని దేవుడిని కళ్ల ముందు సాక్షాత్కరించుకొని పూజించారు. భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అవసరమైనప్పుడు సంప్రదాయాలను కొంచెం సరళంగా మార్చుకొని పాటించే పద్ధతిని అందరం అంగీకరిస్తాం. అందులో భాగంగానే పండరిపురం సమస్యకు పరిష్కారం లభించింది. జగన్నాథ రథయాత్ర సాఫీగా సాగింది. దేవా లయాలు మూసివేశారు. ఇలాంటి తరుణంలో ప్రజలు తమ ఇంటిలోనే పూజలు ప్రారంభించారు. ఎవరో సరదాగా చెప్పారు – మొదట కొన్ని దేవాలయాలు మాత్రమే తెరిచి ఉండేవి. కానీ నేడు ప్రతీ ఇల్లు ఒక దేవాలయమైంది. ప్రతీ గృహంలో పూజలు నిర్వహించడం గొప్ప విషయమే. దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిక. వాటిని ప్రజలు తప్పనిసరిగా సందర్శించాలి. కానీ ఈ సమయంలో అది సాధ్యం కాదు. కనుక వెళ్లరు. ఇంత సరళ స్వభావం భారత్‌ ‌ప్రత్యేకత అని ప్రపంచం ఎదుట మరోసారి రుజువైంది. దేవాలయాలు భక్తి, శక్తికి, ప్రేరణ కేంద్రాలని కచ్చితంగా చెప్పవచ్చు. మన ఉత్సవాలు జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. అవి శీఘ్రంగా తిరిగి యథావిధిగా జరగాలని మనందరి కోరిక. అయితే ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని నియమాలను ముందుగా పాటించాల్సి వస్తే, అందుకు సిద్ధమైన సమాజాన్ని కూడా మనం ప్రస్తుతం చూశాం. ఇది అద్భుతమైన అంశం.

ఈ పరిస్థితిలో కూడా కొన్ని శక్తులకు సమాజంలో భేదాలు సృష్టించే అంశాలు కనిపిస్తాయి. అమెరికాలో వర్ణవివక్ష వల్ల సమస్య తలెత్తి, ప్రతిఘటన వచ్చింది. ఈ ప్రతిఘటన భారత్‌లోనూ ఎందుకు రావడం లేదంటూ చర్చించే ప్రయత్నం చేశారు. వలస కార్మికుల విషయంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి. కులం, మతం ఆధారంగా వైషమ్యాలు సృష్టించాలని చూశారు. భవిష్యత్తులో ఇది సంక్షోభానికి దారి తీయవచ్చు. ఇలాంటి అంశాలు ఉన్నాయి. సమాజం వీటిని ఎలా చూడాలి? వీటి నివారణకు సంఘ్‌ ‌పూనుకుంటుందా ?

ఇలాంటి పరిస్థితులే ఆసరాగా సామాజిక వ్యవస్థను, దేశాన్ని బలహీనపరిచేందుకు కొన్ని ఆసాంఘిక•, దేశవ్యతిరేక శక్తులు కుట్ర పన్నుతాయని ఇన్ని సంవత్సరాల అనుభవం మనకు చెపుతూనే ఉంది. ఈ క్రమంలో అలాంటి సంఘటనలు జరగడం అసంభవమేమి కాదు. కానీ ఇప్పుడు సంఘ్‌ అతి పెద్ద సంస్థగా ఎదిగింది. దీని ఆధారంగా ఆ శక్తులకు సమాధానం చెప్పేందుకు సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నాలు చేయవచ్చు. తప్పకుండా ఆ పని చేస్తాం. మన సామాజిక కులవ్యవస్థ సోదరభావంతో మెలగే రీతిలో ఉంది. సాధుసంతుల పరంపర ఉంది. చాలా సంవత్సరాలుగా సంఘ తపస్సు ఉంది. వీటన్నింటినీ పూర్తిగా ఉపయోగించు కుని ఈ కుట్రలను నిలువరించేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాం. భారత ప్రజల మనస్సు ఉత్తేజితమైనందున ఇలాంటి కుట్రపూరిత అంశాలు అంత తేలికగా విజయవంతం కావని నాకు అనిపిస్తోంది. ఇక్కడ బలహీన వర్గాలు బాధపడు తున్నాయి. వారిని అర్థం చేసుకోవాలి. వారిని ఆ కష్టాల నుండి గట్టెక్కించాలి. ఎవరైనా ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకొని, దేశాన్ని బలహీన పరచాలనుకుంటే సంఘ్‌ ‌వంటి సంస్థలు సమాజాన్ని మేల్కొల్పే పనిని సమర్థవంతంగా చేస్తాయని భావిస్తున్నాను. ఈ సంక్షోభం నుండి సమాజాన్ని రక్షించవచ్చు. అయితే అందరూ కలిసి కట్టుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భాల్లో స్వయంసేవకుల శక్తి ఆధారంగా సంఘం కచ్చితంగా చొరవ తీసుకోని పని చేస్తుంది.

భారతదేశ సమస్యలు భారతీయమైన పద్ధతిలో పరిష్కరించాలని సంఘ్‌ అభిప్రాయం. సమాజంలో విభేదాలు, కొన్ని ఉద్రిక్తతలు ఉండవచ్చు. వాటిని తొలగించేందుకు భారత్‌కు తనకంటూ విధానం ఉంది. నేటి సందర్భంలో ఇది అతి ముఖ్యమైన విషయం కాదా?

తప్పకుండా ఇది ముఖ్యమైందే. ప్రతి దేశ సామాజిక నిర్మాణం, ప్రజల మానసికత భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఇతర దేశాలను ఆదర్శంగా తీసుకొని మన సమస్యలకు పరిష్కారాలు కనుగొనలేం. మనం సమస్యలను అర్థం చేసుకుంటాం. వాటి మూలాలను కూడా అర్థం చేసుకొని వాటిని పరిష్కరించగలం. అందువల్ల భారతదేశ సమస్యలను ఇతరుల కళ్లద్దాలలోంచి చూసి, ఇతరుల సాధనాల వల్ల పరిష్కరించడం సాధ్యం కాదు. ఇక్కడి మౌలిక సమస్యలను అర్థం చేసుకుని సరైన పరిష్కారం కనుగొనవలసి ఉంది. సంఘం కూడా ఈ దిశలో ప్రయత్నాలు చేసింది. సమస్యలు ఇక్కడివే అయితే, పరిష్కారం కూడా ఇక్కడే లభిస్తుంది. భారతీయ ప్రజల మానసిక పరిధిని దాటి ఎవరైనా వికృత చేష్టలు చేయాలనుకుంటే అవి సఫలం కావు. ఈ విధంగా ఆలోచించే సానుకూల శక్తులు మరింత ప్రభావవంతమైన కార్యక్రమాలు నిర్వహించాలి. అవి చేసేందుకు మేము నిశ్చయించుకొన్నాం.

About Author

By editor

Twitter
Instagram