– గుండవరపు వెంకటరమణ, యోగాచార్య, హైదరాబాద్‌

జూన్‌ 21‌వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆధునిక ప్రపంచానికి యోగాభ్యాసాన్ని అనుగ్రహిచిన భారత్‌ ‌మరొకసారి తన జగద్గురు స్థానాన్ని నిరూపించుకున్నది. మానవాళి శ్రేయస్సుకు తన సనాతన ఆరోగ్య విధానాన్ని అందించడం, విశ్వం అందుకోవడం భారతీయులు గర్వించదగిన విషయం. ఐక్యరాజ్యసమితి వేదికగా 27 సెప్టెంబర్‌ 2014‌న భారత ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పిలుపునిచ్చారు. 11 డిసెంబర్‌ 2014‌న దానికి 193 సభ్య దేశాలలో 177 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రపంచ మానవాళి పరిపూర్ణ ఆరోగ్యానికి యోగాభ్యాసం ఉపయోగపడుతుందని మరొక తీర్మానం కూడా ఆమోదించారు. ఈ కరోనా విజృంభణ వేళ ఆ తీర్మానం విలువ ఏమిటో ఈ విశ్వం అనుభవానికి వస్తున్నది.

ఇవాళ కరోనా విశ్వానికి పెనుసవాలు. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ ‌కనుగొనలేదు. అంతవరకు ఏం చేయాలి? జనం లక్షల సంఖ్యలో రాలిపోవలసిం దేనా? కాదు, అది అంటువ్యాధి కాబట్టి నివారణకు జీవనశైలి కీలకం. ఈ జీవనశైలిని క్రమబద్ధీకరించే పక్రియ యోగశాస్త్రంలో సులభ పద్ధతులతో వివరిం చారు. నేటివరకు ప్రపంచదేశాలు యోగాదివస్‌తో శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తే, ఇకపై మిగిలిన యోగాంగాలు యమ, నియమ, ప్రత్యాహార వంటి వాటిపై దృష్టి ఉంచవలసిన సమయం కూడా వచ్చింది. ఇప్పటికే పలు యోగాకేంద్రాలు ప్రపంచ వ్యాప్తంగా ధ్యాన కేంద్రాలను నెలకొల్పి ధారణ, ధ్యానాలలో శిక్షణ ఇస్తున్నాయి.
యోగాభ్యాసంలో నడవడి, ప్రవర్తనల గురించి చెప్పేవే యమ, నియమ, ప్రత్యాహారాలు. వీటితో జీవనశైలిని మార్చుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే యమ, నియమాలను యోగాకు పునాదిగా మహర్షి పతంజలి చెప్పాడు. ప్రత్యాహారం అంటే బహిర్‌,అం‌తరంగాలను ఏకం చేసే వారధిగా ఆయన అభివర్ణించారు. విశ్వవ్యాప్త కరోనా మహమ్మారి పరిస్థితులలో ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహార పద్ధతులతో రోగనిరోధ శక్తిని ఎలా పెంచుకోవచ్చో ఇక్కడ చర్చించే ప్రయత్నం జరిగింది. దీనిని గమనించి యోగా శిక్షకుల ద్వారా శిక్షణను పొంది జాగృతి పాఠకులు ఆయురారోగ్యాలు పొందాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. ఆసన, ప్రాణాయామ, ధ్యానాదులతో గంట, రెండుగంటల అభ్యాసానికే పరిమితం కాకుండా యోగ అంటే జీవన గమనంలో భాగంగా భావించాలి. అన్ని అంగాలను అభ్యసించినట్లయితే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.

రోగ నిరోధక శక్తి అంటే

మన శరీరంలో అంతర్గతంగా అద్భుత రోగ నిరోధక శక్తి దాగి ఉన్నది. రక్తంలోని తెల్ల రక్తకణాలకు (WBC) శరీరంలోకి దూసుకు వచ్చిన బాక్టీరియా, వైరస్‌లు, అన్య పదార్థాలు (Foreign Bodies), సర్జరీ ద్వారా ట్రాన్స్‌ప్లాంట్‌ ‌చేసిన ఇతరుల కణాలు లేదా శరీరానికి హాని కల్గించే ఏ పదార్థాన్న యినా పసిగట్టే శక్తి దానికి ఉన్నది.
ఇది ఎలా సాధ్యమో ఒక ఉదాహరణ – మన దేశానికి సరిహద్దు ప్రాంతంలో సైనిక బృందాలు నిరంతరం కాపలా కాస్తూ ఉంటాయి. సరిహద్దు గీతదాటి వచ్చే బయటి శత్రువులను రాడార్‌తో పసిగడతాయి. శత్రువుల రాకపోకలు, స్థితిగతులపై ఎప్పటికప్పుడు చీఫ్‌ ‌విజిలెన్స్ ఆఫీసర్‌కు సమాచారం అందుతుంది. అతను వెంటనే మిగతా అధికారులతో చర్చించి, శత్రుసైన్యాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏ రకమయిన ఆయుధాలతో ముట్టడించబోతున్నారనే విషయాలను వారితో చర్చిస్తారు. వెంటనే ఏ ఆఫీసర్‌ ఏమి చేయాలో, ఏ ఆయుధం ఉయోగించాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో సవివరంగా ఆదేశిస్తారు. తగిన బలాన్ని ఉపయోగించి యుద్ధరంగం సిద్ధంచేసి, బరిలోకి దిగుతారు. ఇందులో అటు నుంచి కొంత, ఇటు నుంచి కొంత సైన్యం మట్టికరుస్తుంది.
ఇదే విధంగా సరిహద్దు రక్షణ వ్యవస్థలాగా రక్తంలోని తెల్ల రక్తకణాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి. బయట నుంచి బాక్టీరియా, వైరస్‌ ‌లాంటివి శరీరంలోకి రాగానే గుర్తిస్తాయి. వెంటనే శరీరంలోని రక్షణ స్థావరాలను మేలుకొలుపుతాయి. ఈ స్థావరాలు శరీరంలో ముఖ్యంగా గొంతుకు ఇరువైపులా (టాన్సిల్స్) ‌చంకల్లో, గజ్జల్లో, ఛాతిలో లింఫ్‌ ‌గ్రంథులుంటాయి. ఈ గ్రంథులకు సమాచారం పంపుతాయి. ఎక్కడినుంచి ఎలాంటి రక్షక యంత్రాంగం లింఫోసైట్‌లు, ఇసైనోపిల్స్ ‌మోనోసైట్స్ ‌లేదా యాంటీబాడీలు, కాంప్లిమెంటుల లేదా లోకల్‌ ‌హార్మోన్సు వంటి రసాయనాలను ఉత్పత్తి చేసి పంపాలో, వచ్చిన బాక్టీరియా, వైరస్‌ ‌రకాలను బట్టి తయారుచేసుకొని రక్తంలోకి విడుదల చేసుకుం టుంది. వెంటనే రక్షక కణాలు యుద్ధరంగానికి అంటే వాపు, నొప్పి (Inflamation) ఉన్న చోటుకి చేరతాయి. అప్పుడు మన రక్షక కణాలలోని కెమికల్స్ ‌విడుదల అయ్యి వెంటనే బాక్టీరియా వైరస్‌లపై పొరను కరిగించి చంపుతాయి. ఈ ఘర్షణలో మనలోని కొన్ని తెల్ల రక్తకణాలు చనిపోతాయి. అలా చనిపోయినవే చీము రూపంలో గాయం నుండి బయటకు పోతాయి. రోగనిరోధక వ్యవస్థలో ఎన్నో రకాల బయోకెమికల్‌ ‌రియాక్షన్‌లు జరుగుతాయి. ఈ రియాక్షన్స్ ‌జరగడానికి ఎంతో విజ్ఞత (Intelligence) కావాలి. మన రక్తానికి అంత ఇంటలిజెన్స్ ఉం‌ది.
మన జీవన శైలికి సంబంధించిన అనేక అంశాలు ఈ రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంటాయి, పెంచుతుంటాయి. యుక్త ఆహారం, విహారం, చేష్ట (కర్మచేసే విధానం) నిద్ర, మెలకువ వంటివి జీవన శైలికి సంబంధించినవి.
ఈ T లింఫోసైట్స్‌ని డెవలప్‌ ‌చేసే థైమస్‌ ‌గ్రంథి, బి సెల్స్‌ని ఉత్పత్తిచేసే బోన్‌మారో, స్ల్పీన్‌, ‌లింఫ్‌నోట్స్, ‌టాన్సిల్స్, ‌చిన్న పేగులలోని పియర్స్ ‌ప్యాచస్‌ అన్నింటి శక్తి సామర్థ్యములు కూడా వయసు, జాతి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడిని అనుసరించి ఉంటాయి.
ముఖ్యంగా ఆలోచనా విధానం, భావన రోగ నిరోధక చర్యలపై ప్రభావం చూపుతాయని ఆధునిక వైద్య పరిశోధనలో వెల్లడయింది. దీనిని బట్టి మన నాడీమండల వ్యవస్థ రోగ నిరోధక వ్యవస్థపై నిరంతరం ప్రభావాన్ని కలిగిస్తుందని అర్థమవుతుంది. ఉదాహరణకు – చాలామంది పిల్లల్లో పరీక్షల ముందు తీవ్ర ఒత్తిడికి గురవడంవల్ల సోర్‌‌త్రోట్‌ ‌సమస్యలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద వయసువారిలో దగ్గర బంధువు, ప్రియ మిత్రులు హఠాత్‌ ‌మరణానికి గురైనప్పుడు తీవ్ర బాధవల్ల ఇమ్యూనిటీ సిస్టమ్‌ ‌బాగా దెబ్బతిని కేన్సర్‌ ‌బారిన పడుతున్నారని అధ్యయనాలలో వెల్లడయింది.

వ్యక్తులు అతిగా సంతోషానికిగానీ, బాధకి గానీ లోనయినప్పుడు కిల్లర్‌సెల్స్ T ‌లింఫోసైట్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయని పరిశోధనల్లో తేలింది. తగిన పరిణామంలో జరిగితే ఇది మంచిదే. కానీ జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల పదే పదే ఇటువటి ప్రతి చర్యల వలన ఇమ్యూనిటి శక్తి Immun Strength) తగ్గిపోవటం జరుగుతున్నది అని సైకోన్యూరో ఇమ్యూనాలజీ పరిశోధనలు తెలియచేస్తున్నాయి(Moyers B (1993), Healing and The Mind, B.s.Flowers and D.grubin (eds), London, Thomsons). కనుక జీవనశైలిలో మార్పుతోనే శరీరంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసుకోవాలి. ఇది నిరంతర సాధన. కరోనా వంటి వైరస్‌లపై యుద్ధాన్ని ఇటువంటి సాధనతోనే గెలవాలి.
పాశ్చాత్య దేశాలలో జీవనశైలి పెడదారులు పట్టిన కారణంగా రోగ నిరోధక శక్తి క్షీణంచి మరణాల పాలవుతున్నారు. వారితో పోల్చిచూస్తే భారత్‌లో మరణాల రేటు తక్కువ. దీనికి కారణం మన శ్రేష్టమయిన హిందూ ధార్మిక జీవన పద్ధతి. నేటితరం వాటిని పాటించనప్పటికీ ముందు తరాల ఆచరణవల్ల జన్యుపరంగా వచ్చిన రోగ నిరోధక శక్తి, ఈ దేశ ప్రకృతి, సంస్కృతి మనల్ని కాపాడుతూ వస్తున్నాయి.

‘‘వృత్తం యత్నేన సంరక్షే ద్విత్తమేతి చ యాతిచ
అక్షణో విత్తతః క్షీణో వృత్తతస్తు హతో హతః’’ (విదురనీతి, 4వ అధ్యాయం,30) నడవడిని యత్నంతో రక్షించుకోవాలి. ధనం వస్తుంది, పోతుంది, ధనం పోయినవాడు క్షీణుడు కాడు, నడవడికలో భ్రష్టుడైనవాడు సర్వవిధాలా చచ్చినవాడే.
శీలం అంటే స్వభావం. వృత్తం అంటే నడవడి. ప్రవర్తన సరిగా ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి సహజంగానే చైతన్యవంతమై ఉంటుందని భారతీయ శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి ప్రాచీన శాస్త్రాలలో ప్రత్యేకించి యోగ, ఆయుర్వేద శాస్త్రాలు ఆరోగ్యం గురించి చెబుతున్నాయి. ‘శరీరస్య మలం వైద్యశాస్త్రేణ’ అంటే శరీరానికి ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోవటానికి ఆయుర్వేద వైద్యశాస్త్రమని, ‘‘చిత్తస్య మలం యోగేన’’ చిత్తానికి అంటే మనసు, బుద్ధి, అహంకారాలకు పట్టిన మాలిన్యాన్ని తొలగించుకోవటానికి యోగశాస్త్రం యుక్తమైనవని పతంజలి మహర్షి మార్గదర్శనం చేశారు.
విశ్వమంతటిలో శరీరం, శ్వాస, మనసు, మూడింటినీ క్రమబద్ధీకరించగలిగిన ఏకైక శాస్త్రం యోగ. కనుకనే నేటికీ ఇది ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనలో విశేష స్థానాన్ని అలంకరించి వేల సంఖ్యలో పరిశోధనా పత్రాలు వెలువడడానికి కారణమవుతున్నది. వైద్యుని దృష్టి రోగిపట్ల, రోగం పట్ల ఎలా ఉండాలన్న దానిపై వారికి స్పష్టమయిన అవగాహన కలిగిస్తున్నది. ఇంతటి చిరపురాతన యోగశాస్త్రం అత్యంత ఆధునిక వైద్యశాస్త్రానికి మార్గనిర్దేశం చేస్తున్నదంటే దాని లోతుపాతులు ఎంతటివో ఊహించవచ్చు.
ఇమ్యునాలజీని, సైకోన్యూరో ఇమ్యూనాలజీని యోగశాస్త్రం సామాన్యునికి కూడా అర్థమయ్యే విధంగా, వాటి శక్తిని ఎలా పెంచుకోవాలో ఒక్క సూత్రంతో వివరించింది. శీలం, నడవడి, వ్యాయా మాలు కీలకమయిన పాత్రను పోషించటం వల్లనే శరీరంలో రోగ నిరోధక శక్తి భద్రంగా ఉంటుందని ఆధునిక వైద్యశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇదే అంశాన్ని యోగశాస్త్రం ‘‘యోగాంగాల అనుష్ఠానం వలన శుద్ధిలేమి తగ్గి వివేకఖ్యాతి కలిగేవరకు జ్ఞానం వృద్ధి పొందుతుంది’’ అనే సూత్రంతో తెలుపుతుంది. (యోగసూత్రాలు, 2వ పాదం, 28వ సూత్రం) అంటే యోగసాధన చేస్తూ ఉంటే శరీరం, శ్వాస మనసులోని శుద్ధిలేమి తొలగిపోతూ ఉంటుంది. తద్వారా సరియైన జ్ఞానం కలుగుతుంది.

రోగ నిరోధక వ్యవస్థ రెండు రకాలు
1. పుట్టుకతో వచ్చే రోగ నిరోధక వ్యవస్థ
2. Acquired immunity అంటే ప్రయత్నంతో సాధించుకునేది. మనిషి పెరిగి పెద్ద అయ్యే క్రమంలో మంచి అలవాట్లవల్ల పెంపొందించుకునేది.
రోగ నిరోధక శక్తి బిడ్డకు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే రూపొంద••తుంది. అక్కడి నుంచే దీని వ్యవస్థ ప్రారంభమవుతుంది. తల్లి నుంచి ఇమ్యూన్‌గ్లోబిన్‌ల రూపంలో ఈ రోగ నిరోధక శక్తి గర్భస్థ శిశువుకు అందుతుంది.
ఇది తల్లికి అంతకముందు వచ్చినటువంటి వ్యాధులను అనుసరించి ఉంటుంది. తల్లి పాలల్లో కూడా ఈ ఇమ్యూన్‌గ్లోబిన్‌లు ఉండి శిశువును బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ల బారి నుంచి కాపాడుతాయి. ఇదే రోగ నిరోధక శక్తి కొన్ని నెలలపాటు శిశువును కాపాడుతుంది. తరువాత క్రమంగా దాని శక్తి సన్నగిల్లుతుంది. దానితో శిశువు పేగుల్లోని బాక్టీరియా, శిశువుకు ఇచ్చిన టీకాలు వంటి వాటివల్ల Natural Immunity ఏర్పడుతుంది. అప్పటి నుంచి శిశువును ఈ రోగ నిరోధక వ్యవస్థే కాపాడుతుంది. కౌమారదశ వచ్చేసరికి దీని క్షీణత మొదలవుతుంది. వయసు పెరిగే కొద్దీ క్రమంగా నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. 50,60 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇంకా ఎక్కువగా రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. రోగ నిరోధక శక్తిలో థైమస్‌ ‌గ్రంథి పాత్ర చాలా ముఖ్యం. ఇది ఛాతి మధ్య భాగంలో ఉంటుంది. • కణాలు పరిపక్వమయ్యేది, ఎదుగుదల సాధించేది ఈ థైమస్‌‌గ్రంథిలోనే. బాల్యంలో ఈ గ్రంథి చాలా క్రియాశీలంగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వీటి క్రియాశీలత క్షీణిస్తూ ఉంటుంది. కౌమారదశ ప్రారంభం నుంచి ఏటా 3శాతం వంతున దీని సామర్థ్యం క్షీణిస్తూ వస్తుంది. మధ్య వయసు వచ్చేసరికి ఇది కేవలం ఒక గడ్డిపోచ అంతలా తయారవుతుంది.
దాదాపు ఇది వృద్ధాప్యంలో కనుమరుగైపోతుంది. ఆ కారణంగా కొత్త హానికారక క్రిములను ఎదుర్కోవటం కష్టమవుతుంది. పిల్లల్లో ఇది ఎక్కువ క్రియాశీలకంగా ఉన్న కారణంచేత శిశువులకు బాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. కనుకనే కరోనా వంటి వ్యాధులలో వారి మరణాలు బాగా తక్కువ. అదే వయసు మీరిన వారిలో ఈ థైమస్‌ ‌క్రియాశీలకంగా లేని మూలాన వారు తొందరగా మృత్యువాత పడటం సహజంగా జరుగుతోంది.

రాజ యోగం
స్వామి వివేకానంద లండన్‌ ‌పర్యటనలో ఉన్నప్పుడు ఒక ఆంగ్లేయుడు ‘‘స్వామీజీ భారతీయులకు మనోవిజ్ఞాన శాస్త్రం తెలుసునా?’’ అని అడిగాడు. దానికి స్వామీజీ చిరునవ్వుతో తెలుసుననే చెప్పారు, ఇంకా, పాశ్చాత్యుల మనోవిశ్లేషణ కేవలం Sick and abnormal Personalitiesకి మాత్రమే పరిమితమైనదని, కానీ భారతీయ మనో విశ్లేషణ ఆరోగ్యవంతునికి, అసాధారణమయిన వారికి కూడా మార్గనిర్దేశం చేస్తుందని వివరించి చెప్పారు. ఆ సందర్భంలోనే వివేకానంద పతంజలి యోగశాస్త్రం గురించి కొన్ని రోజులపాటు ఉపన్యసించారు. దానినే నేడు ‘రాజయోగ’ పేరుతో పుస్తకరూపంలో చూస్తున్నాం. ఈ యోగశాస్త్రం రెండు విధాలుగా లభ్యమవు తున్నది. హఠయోగమని, రాజయోగమని నేడు విశ్వమంతటా ఆదరణ పొందుతున్నది.

About Author

By editor

Twitter
Instagram