ఎందుకు రాలేదని అడిగారు…!

ఎందుకు రాలేదని అడిగారు…!

1972వ సంవత్సరంలో దామోదరం సంజీవయ్య అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షులు. ఆ సంవత్సరం మే నెలలో, మొదటివారంలో భారత ప్రభుత్వ యువజన వికాస శాఖ, నేషనల్‌ బుక్‌ ట్రస్టుల సంయుక్తాధ్వర్యంలో అఖిల భారత రచయితల సభలు జరిగాయి.

దేశంలోని గొప్ప రచయితలందరూ ఈ సభల్లో పాల్గొన్నారు. అదృష్టవంతుడి అదృష్టాన్ని ఎవరూ తీసివేయలేరు. దురదృష్టవంతుడి దురదృష్టాన్ని ఎవరూ పరిహరించలేరు అనేట్లుగా తెలుగు అకాడమీలో పనిచేస్తున్న నేను ఎటు చూసినా నిరుత్సాహం, వ్యతిరేకతలతో కొట్టుమిట్టాడుతున్నాను.

భారతదేశంలో అప్పటి వర్ధిష్ణువులైన వివిధ ప్రాంతీయ భాషా రచయితలను నాలుగు విభాగాలుగా వర్గీకరించి ముందుగా ఆయా ప్రధాన నగరాలలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలలో కొన్ని వర్గాలను జతచేసి ప్రాంతీయ సభలు జరిపారు నిర్వాహకులు. ఆ తరువాత వీరంతా ఢిల్లీలో జరిగిన ప్రధాన సభలలో పాల్గొన్నారు. దక్షిణ భాషా ప్రాంతీయ సభలు చెన్నైలో జరిగాయి.

వాకాటి పాండురంగారావు అప్పుడు ఢిల్లీలో భారత ప్రభుత్వ రక్షణశాఖ అనుబంధ ప్రచురణ ఏదో నిర్వహించేవారు. నేను అఖిల భారత రచయితల సభలలో పాల్గొనటానికి వాకాటి చలవ చాలానే ఉండవచ్చు. అది విషయాంతరం.

‘వీరేశలింగం పంతులు – సమగ్ర పరిశీలన’ అనే నా పిహెచ్‌.డి. థీసిస్‌ అప్పుడే పుస్తక రూపాన ప్రచురితమైంది. నన్ను ఎంతగానో అభిమానించే వాకాటి పాండురంగారావు మీ థీసిస్‌ ఢిల్లీలో ఆవిష్కరిద్దామని నన్ను, చాలా ఉత్సాహపరిచారు. దీనివల్ల ఢిల్లీ వార్తా పత్రికలలో దైనందిన సభా, సమావేశ శీర్షిక ప్రస్తావనలలో వీరేశలింగం పంతులను దర్శనీయం చేయవచ్చు గదా అని ఆయన అభీష్టం.

తెలుగు భాషా సాహిత్య ప్రతినిధులుగా అఖిల భారత రచయితల మహాసభలో పాల్గొన్న వారిలో నేనూ, పాండురంగారావు, ఆర్‌.ఎస్‌.సుదర్శనం, కుందుర్తి ఆంజనేయులు, చల్లా రాధాకృష్ణాశర్మ, అరిగపూడి రమేష్‌ చౌదరి, డి.ఆంజనేయులు ఉన్నాం.

ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్ష నివాస భవనం ఇదివరలో చూడని వారికి ఇంద్రభవనమా! ఏమిటి? అని అబ్బుర పడే అవకాశం ఉంది. భవనం ముందు ఖాళీ ప్రాంగణంలో విశాలమైన పచ్చిక పట్లున్నాయి.

దామోదరం సంజీవయ్య నివాస నిలయంలోనే ‘వీరేశలింగం – సమగ్ర పరిశీలన’ ఆవిష్కరణ సభ జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ పాండురంగారావే చూసుకున్నారు. సభా సదులలో అతిరథులూ, మహా రథులెందరో ఉన్నారు. పుట్టపర్తి నారాయణా చార్యులు, ఇలపావులూరి పాండురంగా రావు, బి. కుక్కుటేశ్వరరావు, బలివాడ కాంతారావు, గరిమెళ్ల సీతారాం వంటి వారున్నారు.

దామోదరం సంజీవయ్య అధ్యక్షులు. నార్ల వేంకటేశ్వరరావు, తిరుమల రామచంద్రం, డి.ఆంజనేయులు మొదలైనవారు నా థీసిస్‌ గూర్చీ, వీరేశలింగం గూర్చి పుస్తకావిష్కరణ ప్రసంగాలు చేశారు.

నార్ల వేంకటేశ్వరరావు-వీరేశలింగాన్ని రాజారామ మోహనరాయ్‌ కన్నా కూడా ప్రగతి శీలవాదిగా, కులరహిత సమాజ సంస్కరణ విధాతగా స్తుతించారు. నాకు అభ్యంతరం ఏముందికానీ, ఎవరి రంగాలు వారివి. ఎవరు కాలానుగుణంగా సంస్కరణలు వారు చేపట్టారు. ఎవరి గొప్పతనం వారిది. అని నార్ల వారు విశ్లేషిస్తే బాగుండేది. అయితే, రాజరామ మోహనరాయ్‌ సంఘ సంస్కరణలో వీరేశలింగం కన్న వెనకబడ్డాడు అనటం ఎబ్బెట్టుగా తోచింది. ఆ మాటే కొంచెం ఆవేశంగా చెప్పానేమో! ఆ మాటకు వస్తే రాజరామ మోహన రాయ్‌ జాతీయాభిమానం, స్వాతంత్ర సముపార్జన ప్రియత – వీరేశలింగంలో ప్రశ్నార్థకం కాబట్టి ఈయన ఆయన కంటే తీసిపోతాడా! అని తర్కించి ఉండవచ్చు.

నార్ల వేంకటేశ్వరరావు వంటి సుప్రసిద్ధ పత్రికా సంపాదకుణ్ణి, రాజ్యసభ సభ్యుడు కూడానేమో అప్పటికే – నేను విమర్శిస్తానా? అని సదస్యులు విస్ఫారిత నేత్రులై ఉండవచ్చు.

దామోదరం సంజీవయ్య ఆసక్తిగా నా ప్రసంగం విన్నారు. మర్రోజు ఆర్‌.ఎస్‌. సుదర్శనం, కుందుర్తి, తిరుమల రామచంద్ర, ఇంకా కొందరు స్నేహితులు దామోదరం సంజీవయ్యని మర్యాదగా సంభావించి వారి దగ్గర సెలవు తీసుకోవటానికి వెళ్లాం. అప్పుడు సంజీవయ్య ‘రావు గారు.. మీ గురించి చాలా కృషి చేశారని పెద్దలు చెప్పారు కదా! నా దగ్గరకు మిమ్మల్ని ఎవరూ ఎందుకని తీసుకొనిరాలేదు? మీరెందుకు రాలేదు?’ అని ఆప్యాయంగా అడిగారు. పని చేస్తే చాలదు పేరు తెచ్చుకోవటానికి అన్నారు. నేను కాస్త ఉబ్బిపోయి ‘అయ్యా మీరు హైదరాబాదు వచ్చి నప్పుడు నేను మీ ఆచార్యోపదేశం పొందుతాను’ అన్నాను. ఆయన నవ్వి ప్రీతి కనపరచారు నా పట్ల.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *