తెలంగాణలో ఎన్నికల ‘ఫీవర్‌’

తెలంగాణలో ఎన్నికల ‘ఫీవర్‌’

సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నా తెలంగాణలో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎలక్షన్‌ ఫీవర్‌తో సతమతమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ముందస్తు ఎన్నికలకు తగిన ప్రణాళికలు రచించుకుంటున్నాయి.

బంగారు తెలంగాణలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన ఎన్నో వినూత్న సంక్షేమ పథకాలు తమ విజయానికి పూల బాట వేస్తాయన్న ఆశా భావంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరపడి పోతుండగా, ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని విజయ తీరాలకు చేర్చగలదన్న ఊహాగానాల్లో కాంగ్రెస్‌ నాయకులున్నారు. వరుసగా ఆరోసారి గుజరాత్‌లో విజయం సాధించడంతో మంచి జోష్‌ మీదున్న బీజేపీ నాయకులు వచ్చే ఎన్నికల్లో మోదీ చరిష్మా, అమిత్‌షా రాజకీయ చాణక్యంతో ప్రత్యేక తెలంగాణకు సహకరించిన పార్టీగా తెలంగాణలో సత్తా చాటలన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో కనుమరుగైన తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఏదైనా అవకాశం రాకపోతుందా అని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ప్రజాసంఘాల సహకారంతో ప్రజాఫ్రంట్‌ను ఏర్పాటుచేసి ఎన్నికల సమయంలో ఏదో ఒక ప్రధాన రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని లాభపడాలని వామపక్షాలు చూస్తున్నాయి. మ¬ద్యమం ద్వారా కేసీఆర్‌ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌్‌ ఒకవైపు జనరంజకమైన పథకాలతో మరోవైపు జీఈఎస్‌ సదస్సు, మెట్రో రైలు ప్రారంభోత్సవం, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణల ఖ్యాతితో వచ్చే ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకగానే భావిస్తోంది. అధికార పక్షమైన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అమలు చేసిన ప్రజాసంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి శ్రీరామ రక్షగా భావిస్తుండగా, ఆ పార్టీ నాయకుల మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండటం లేదన్న విమర్శలను టీఆర్‌ఎస్‌ ఎదుర్కోవలసి వస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొన్ని వాగ్ధానాల అమలులో ఘోరంగా విఫలమయ్యారన్న వాదనలు లేకపోలేదు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని నాడు హామీనిచ్చిన కేసీఆర్‌ పార్టీ అధికారంలోకి రాగానే తానే సీఎం పీఠమెక్కి, ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్న అపవాదు లేకపోలేదు.

గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని, గిరిజనులకు రిజర్వేషన్లను పెంచుతా మని చేసిన వాగ్దానాలను నిలబెట్టు కోవడంలో అధికార పక్షం విఫలమయిందన్న విపక్షాల విమర్శలను ఎదుర్కోక తప్పడం లేదు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కఠిన నియమ నిబంధనలు పెట్టడం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలం కావడం మొదలైనవి టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేలా ఉన్నాయి.

ప్రభుత్వ పథకాలకు విశేషంగా ప్రజల్లో ప్రచారాన్ని కల్పించి వైఫల్యాలు వెలుగులోకి రాకుండా దాటవేయాలన్న ధోరణితో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టే అయినా, ఆ ఖ్యాతిని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమై, ప్రధాన విపక్షానికే పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ 2019 ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకొంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌ పగ్గాలను స్వీకరించడం, అంతర్లీనంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరడం, పార్టీ నేతృత్వంలో జరిగిన ప్రజా పోరాటా లకు విశేష ఆదరణ లభిస్తోండటం తదితరాలతో ఈసారి తెలంగాణను ‘హస్త’గతం చేసుకోవడం ఖాయమన్న ఊహల్లో కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ నూతన రథసారధి రాహుల్‌ గాంధీతో ఓ బ్రహ్మాండమైన భారీ బహిరంగసభను నిర్వహించి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించాలన్న దిశగా కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము అధికారంలోకి రావడం ఖాయమని, 2019 తమదేనని కాంగ్రెస్‌ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీల తరపున గెలుపొందిన 20 మందికి పైగా శాసన సభ్యులు, మండలి సభ్యులు కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ అయస్కాంతానికి ప్రభావితమై గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో కేసీఆర్‌ ఐదేళ్ళలో సాధారణంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మళ్ళీ తన జైత్రయాత్రను కొనసాగిస్తారా? తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ప్రధాన విపక్షంగా ప్రజా సమస్యలపై ఉద్యమించిన పార్టీగా కాంగ్రెస్‌ను జనం ఆదరిస్తారా ? అనే ప్రశ్నలు నేడు తెలంగాణలో వినపడుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో సీఎం సీటును ఆశించే వారి సంఖ్య డజనుకు పైగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం సంగతెలా ఉన్నా సీఎం పదవి కోసం ఆ పార్టీలో ఇప్పటి నుంచే అంతర్గత పోరు తప్పడం లేదు.

ఇక టీడీపీ విషయానికి వస్తే అంతో ఇంతో ప్రజల్లో ఓటు బ్యాంకును, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న క్యాడర్‌ను పాశుపతాస్త్రాలుగా సంధించి వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలన్న దిశగా అంతర్గత కసరత్తుల్లో నిమగ్నమైంది. అధికారపక్ష ఆకర్ష్‌ కార్యాచరణతో కకావికలమై కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలినా వచ్చే ఎన్నికల కదనరంగాన పార్టీ సేనలను నడిపి కుదిరితే కింగ్‌ మేకర్‌గా అవతరించాలన్న దిశగా టీడీపీ రాజకీయ యంత్రాంగం వ్యూహాలు పన్నుతోంది.

– వాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *